*****
*తర్పణార్పణం*
===========
(హాస్య కథ)
“హాయ్ ! హాలో ! నమస్తే... 'పిండం' టీవీ సమర్పించు 'అర్పణం' కార్యక్రమానికి స్వాగతం. నా పేరు తర్పణం.
సారీ... సారీ.... పిండం టీవీ సమర్పించు తర్పణం కార్యక్రమానికి స్వాగతం... నా పేరు అర్పణ.
మా, ఈ కార్యక్రమం గురించి మీకు తెలుసుకదా ! అయినా మా పిచ్చిముండా ప్రేక్షకుల కోసం... సారీ... మా ప్రియమైన ప్రేక్షకుల కోసం మరోసారి ఈ ప్రోగ్రాం గురించి క్లుప్తంగా వివరిస్తా.
మామూలుగా అయితే అన్ని టీవీల వాళ్ళు ప్రస్తుతం జీవించి ఉన్నవాళ్ళకి పుట్టినరోజు, పెళ్ళిరోజు శుభాకాంక్షలు చెప్పడం రివాజు. అయితే, మా 'పిండం' టీవీ మాత్రం ఈ విషయంలో ఒక అడుగు ముందుకు వేసి, సారీ... సారీ... ఒక అడుగు పైకి వేసి, చనిపోయి, పై లోకాల్లో ఉన్న మీ బంధుమిత్రులకి మీ సందేశాలు, మీరు చెప్పబోయే విశేషాలు, విషయాలు వాళ్లకి చేరవేస్తుంది....
ఇంకెందుకు ఆలస్యం, వెంటనే ఫోన్ తీసు కుని 2 సార్లు LOOSE కి కొట్టండి. అదేనండి తిరగేస్తే 35007 కదా, దానిని 2 సార్లు కొట్టి మాతో మాట్లాడండి.
.....ట్రింగ్... ట్రింగ్... ట్రింగ్... ట్రింగ్.
"అదిగో అపుడే ఫోన్ రింగవుతోంది. ఎవరో చూద్దాం! హాలో పిండం టీవీ వాళ్ల తర్పణం కార్యక్రమానికి స్వాగతం. చెప్పండి, మీరు ఎవరికి సందేశం ఇవ్వాలి అనుకుంటున్నారు?"
"సందేశమా! స్మశానమా...... ఒసే! అప్పీ! నేనే, నీ మేనత్త ఛాయాదేవిని. ఏమే, మీ నాన్న నా దగ్గర తీసుకున్న రెండువేల రూపాయలు, సంక్రాంతి రోజునే నీకిచ్చి పంపుతానన్నాడు. ఇంతవరకు పంపలేదు. ఫోన్ చేస్తే ఎత్తరు, ఇంటికొస్తే తలుపు తాళం వేసుంటుంది. ఎక్కడకి పోయారే మీరంతా! నా అదృష్టం బాగుండి ఈ రోజు నువ్వు ఈ టీవీ వాళ్ల ఫోనులో దొరికావు కానీ, చెప్పు మీ నాన్నకి..........!"
"హలో..అత్తయ్యా ! కూల్ డౌన్. ఇందులో స్వంత విషయాలు మాట్లడుకోకూడదు. మళ్ళీ నీకు అన్నీ వివరంగా ఫోన్ చేసి చెప్తా కానీ, ఈ కార్యక్రమం ద్వారా నువ్వు ఎవరికయినా సందేశం ఇవ్వాలనుకుంటున్నావా?"
"బాగానే జ్ఞాపకం చేసావే అప్పీ! ఈ రోజునే మీ మావయ్య దుకాణం కట్టేసిన రోజు. అప్పుడే ఆయన పోయి పది సంవత్సరాలు అయిపోయాయంటే నమ్మబుద్ధి కావడం లేదు. జీవించినంత కాలం పాపం నా చేత చావుదెబ్బలు తింటూనే ఉండేవాడు. ఆయన పోయిన తర్వాత నా చేతులకి పని తగ్గిపోయిందే అప్పీ!
ఈ రోజు ఆయన పోయిన దినం సందర్భంగా, మురళీకృష్ణ చిత్రం నుంచి ఘంటసాల గారు పాడిన 'ఎక్కడ ఉన్నా, ఏమయినా, నీ సుఖమే నే కోరుకున్నా' అనే పాట వేయవే అప్పీ"
"తప్పకుండా వేస్తాం,... మరి తర్వాతి కాలరు లైన్లో ఉన్నారు. హలో... పిండం టీవీ వాళ్ళ తర్పణం కార్యక్రమానికి స్వాగతం చెప్పండి... మీ సందేశం ఎవరికి?"
"అమ్మాయ్! నా పేరు సందేహాల రావు, మీ ప్రోగ్రాం చూస్తున్నా. బాగానే ఉంటోంది. మీ ఛాయాదేవి అత్తయ్య నిన్ను బాగానే ఝాడించి వదిలేసింది...సరేకానీ, ఈ రోజు మా ఆవిడ సూర్యకాంతం పోయిన రోజు. సరిగా ఈ రోజుతో 10 సంవత్సరాలు పూర్తి అయ్యాయి.
ఇకపోతే, మా ఆవిడకి టీవీ సీరియల్స్ అంటే తెగపిచ్చి. ముఖ్యంగా మీ టీవీలో రెగ్యులర్గా వచ్చే 'జిడ్డుమూకుడు' సీరియల్ క్రమం తప్పకుండా చూసేది. సుమారు 8 సంవత్సరాలు ఆ సీరియల్ని చూసింది. ఈ లోగా, పై నుంచి కబురు రావడంతో టీవీ కట్టేసి పైకి వెళ్లిపోయింది...."
"సార్ ! ఆ జిడ్డుమూకుడు సీరియల్ అంటే
అంత ఇష్టమా మేడం గారికి?"
"భలే దానవమ్మా! అది చనిపోయినరోజున కాకికి "పిండం' పెడదామని ట్రై చేస్తే....
అబ్బేబ్బే... 'పిండం' అంటే మీ పిండం టీవీ కాదమ్మ... ఒరిజినల్ పిండమే... ఒక్క కాకి కూడా రాలేదు. మా కుటుంబ సభ్యులు అందరమూ ట్రై చేసాం. అయినా ఫలితం శూన్యం.
ఈ లోగా మా పక్కింటి పార్వతమ్మ వచ్చి, "అన్నయ్యగారూ! సూరమ్మ వదినకి ఆ జిడ్డుమూకుడు సీరియల్ అంటే ప్రాణం కదా! ఇప్పుడు ఆ సీరియల్ వచ్చే టైము కూడా అయ్యింది. ఒకసారి ప్రయత్నించి చూడండి" అని చెప్పగానే మా పెద్దవాడు డాబా మీద టీవి పెట్టి, దాని ముందు ఒక జిడ్డు మూకుడుపెట్టి, అందులో పిండం పెట్టి, ... టీవీలో, ఆ జిడ్డుమూకుడు సీరియల్ పెట్టగానే, ఎక్కడ నుంచో ఒక కాకి వచ్చి, రయ్యిమని ఆ పిండాన్ని తన్నుకుపోయింది. అంత ఇష్టం ఆ సీరియల్ అంటే మా ఆవిడికి"
"గ్రేట్... గ్రేట్... సూపర్... సూపర్! బావుంది... బావుంది! వంద రోజులు గ్యారంటీ. సారీ... సారీ అలవాటులో ఏదో పొరపాటు. ఇంతకీ సూరమ్మగారికి ఏ సందేశం ఇద్దామనుకుంటున్నారు?"
"సందేశమూ లేదు సుఖ విరేచనము లేదు. అది పోయి 10సంవత్సరాలు అయినప్పటికీ కూడా, ప్రతి రోజు రాత్రి కలలోకి వచ్చి "ఆ సీరియల్ ఎంత వరకు వచ్చింది? హీరోయిన్ ఏమయ్యింది? ఇలాంటి ప్రశ్నలతో నన్ను చంపేస్తోందనుకో !"
"పాపం, ఆ సీరియల్ అంటే ఆవిడకి ఎంత అభిమానమో?"
"అభిమానమా! ఆవకాయా! అంతకీ ఎన్నో సార్లు చెప్పి చూసా! కాంతం, నువ్వు పోయిన తర్వాత ఈ పది సంవత్సరాలలో కథ ఏమీ జరగలేదనీ, హీరోయిన్ వేషం వేసిన అమ్మాయిలు నలుగురు మారారనీ, వారిలో ఒకమ్మాయి పెళ్లి చేసుకోని ఫారిన్ వెళ్ళిపోతే, రెండో అమ్మాయికి ఆ డైలాగులు చెప్పి చెప్పి పిచ్చెక్కి మెంటల్ హాస్పిటల్కి, మూడో అమ్మాయికి మూడ్ వచ్చేసి పాత్రలో లీనమయ్యి, ఎదురుగా ఉన్న పనిమనిషి వేషధారిణిని అట్లు పెనంతో కొడితే, ఆ పనిపిల్ల గుటుక్కమంటే, తర్వాత ఈమె జైలుకి వెళితే... చేసేది లేక ఆ సీరియల్ ప్రొడ్యూసర్ వాళ్ల ఆవిడతో సీరియల్ లాగిస్తున్నాడని చెప్పి చూసా.... అయినా కానీ తృప్తి లేకుండా నన్ను కూడా తన దగ్గరికి వచ్చేయమని, ఆ పది సంవత్సరాల ఎపిసోడ్లని వరుసగా చెప్పమని, కలలోకి వచ్చి రోజూ చంపేస్తోందనుకో !!"
"అర్ధమయ్యింది సందేహాల్రావుగారూ! ఇప్పుడు మేము మీ తరుపునుంచి, మీ శ్రీమతి గారికి జిడ్డుమూకుడు సీరియల్ 10 సంవత్సరాల ఎపిసోడ్లు వినిపించాలి. అంతేనా?"
"గట్టి పిండానివే! అందుకే 'పిండం' టీవీ' వాళ్ళు నిన్ను సెలక్ట్ చేసుకున్నారు."
"థాంక్యూ.. థాంక్యూ! ఏదో మీ అభిమానం. సరే, మీరు కోరిన విధంగా ఆ సీరియల్ని ఆవిడకి చేరవేస్తాం..."
"హలో.... హలో... అమ్మాయ్ ! అపుడే కాల్ కట్ చేయకమ్మా! ఓ చిన్న సందేహం ఉంది. అడగొచ్చా?"
"అడుక్కోండి! మీ పేరే అది కదా?"
"ఏం లేదమ్మా! మేము అందించే సందేశాలు, పైలోకాల్లో ఉన్న మా వాళ్లకి ఎలా చేరవేస్తారు? పైలోకాల్లో కూడా మీ నెట్వర్క్
పని చేస్తుందా?"
"అంత సీన్ లేదు రావుగారూ! మా నెట్ వర్క్ పై లోకాల్లో విస్తరించడానికి కొంచెం టైమ్ పడుతుంది. ప్రస్తుతానికైతే మీ సందేశాలని మనుషుల ద్వారానే పంపిస్తున్నాం!"
"ఆశ్చర్యంగా ఉందే... మనుషుల ద్వారా పై లోకాలకు ఎలా పంపిస్తారు?"
"వెరీసింపుల్, మాకు సిటీలో ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల వాళ్లతో టైఅప్ ఉంటుంది. వాళ్ల నుంచి, ఆపరేషన్ ఫెయిలయ్యి, టపా కట్టేసేవాళ్ల లిస్టు తీసుకుని, వాళ్ళ చెవి దగ్గర, మీ లాంటి వాళ్లు పంపించదలచుకున్న సందేశం వినిపిస్తాం. వాళ్లు పైలోకాలకి చేరుకోగానే, మీ వాళ్లని కలుసుకొని ఈ సందేశం అందచేస్తారు!"
"అద్భుతం! పరమాద్భుతం... ఈ తరహా కార్యక్రమాలతో మీ పిండం టీవీ ఇంకా వృద్ధి
లోకి రావాలని కోరుకుంటున్నా...ఏమీ అను కోనంటే మరో చిన్న సందేహం ఉంది..."
"త్వరగా అడుక్కోండి చాలా మంది 'బక రాలు' సారీ, సారీ!... చాలా మంది 'కాలర్లు' లైన్లో ఉన్నారు"
"ఏమీలేదు, మరి, మా ఆవిడ నరకంలో ఉండి, మీరు సందేశం పంపే వ్యక్తి స్వర్గానికి వెళ్తే, అప్పుడు ఏంటి పరిస్థితి?"
"చూడండి రావుగారూ! ఇంత వరకూ ఎవరికీ రాని సందేహం మీకు వచ్చింది. అందుచేత ఆ సందేశాన్ని మీ ద్వారానే మీ ఆవిడకి చేరవేస్తాం. మీ కోరిక, ఆవిడ కోరిక కూడా తీరుతుంది. మీరు రెడీనా ?"
""..................................'"
"హలో" రావుగారూ! లైన్లో ఉన్నారా? లేక.... పోయారా?????
ఓకే... రావుగారి ఫోన్ కట్టయినట్టుంది... వేరే కాలర్ లైన్లో ఉన్నారు...
"హలో! నమస్తే! పిండం టీవీకి స్వాగతం...! ఎవరు మాట్లాడుతున్నారు ?"
"మేడమ్! నాపేరు కీర్తి శేషారావ్ !"
"నమస్తే! కీర్తిశేషులు గారూ... సారీ...! కీర్తి శేషారావుగారూ! ఎక్కడ్నుంచి మాట్లాడుతున్నారు?"
“స్వర్గపురి నుంచి మాట్లాడుతున్నాను!".
"అదేంటి సార్ మీ ఊరి పేరు వెరైటీగా ఉంది. నేను ఎప్పుడూ ఆ పేరు వినలేదే...!"
"మా ఊరు చూడడానికి నీకు ఇంకా టైమ్ రాలేదు మేడమ్"
"సరే సార్! మీరు ఎవరికి సందేశం ఇవ్వాలి. అనుకుంటున్నారు?''
“భూలోకంలోనున్న నా శత్రువు పిండం
పాపారావుకు !!"
"కీర్తిగారూ! పిండం పాపారావ్ అంటే???.. మా పిండం టీవీ ఎమ్.డి. గారేనా?"
"వాడే!! ఎవడయితే పిచ్చి పిచ్చి కార్యక్రమా లతో ప్రేక్షకులకు పిచ్చి ఎక్కించి పిచ్చాసుపత్రి డాక్టర్లకి చేతినిండా పిచ్చ పిచ్చగా పని కలిపిస్తున్నాడో, క్షుద్రపూజలు, చేతబడులు మీద కార్యక్రమాలు రూపొందించి యువతని నిర్వీర్యం చేస్తున్నాడో... వాడే, మీ ఎమ్.డి పిండం పాపారావుకే నా సందేశం."
"ఇంతకీ పిండం పాపారావుగారికి మీరు
ఇచ్చే సందేశం"
"ఇలాంటి దిక్కుమాలిన కార్యక్రమాలతో జనాన్ని పిచ్చివాళ్లని చేయవద్దని!"
"కీర్తిగారూ! చాలా తప్పుగా మాట్లాడు తున్నారు. మా ఎమ్.డి పాపారావు గారు జీవించి ఉన్నారు. మీకు ఏదయినా సందేహాలుంటే మా స్టూడియోకి వచ్చి వారిని సంప్రదించ వచ్చు. అంతేకానీ....."
"సారీ! నేను కిందకి రాలేను... అందుచేతనే పైనుంచి మీ ఈ కార్యక్రమం ద్వారా ఆ పాపారావుకి నా సందేశం వినిపించమంటున్నాను."
"పై నుంచా! అంటే మీరు ఎక్కడి నుంచి
మాట్లాడుతున్నారు?"
"చెప్పాగా! పై నుంచి అంటే స్వర్గం నుంచి!"
"నిజంగానా! లేదా జోక్ చేస్తున్నారా? "
"మీకు ఆ సందేహం ఎందుకు వచ్చింది!"
"ఏమి లేదు, స్వర్గం నుంచి భూలోకానికి సందేశం పంపుతున్నారు... అంటే కొంచెం అనుమానం వచ్చి.......”
"సింపుల్! మీరు భూలోకం నుంచి పైలోకా నికి సందేశాలు పంపగాలేనిది. మేము పై లోకాన్నించి భూలోకానికి సందేశం పంపితే తప్పుగా అనిపిస్తోందా... పిచ్చి పిచ్చి కార్య క్రమాలతో, పిచ్చి పిచ్చి ప్రోగ్రాములు చేయకుండా, వెంటనే ఫోన్ పెట్టెయ్!!!!!"
".........................."
హలో! అర్పణం లైన్లో ఉన్నావా? లేక తర్పణం వదిలేయమంటావా?"
".........................."
***** **శుభం**
(జనవరి 2014 హాస్యానందం మాసపత్రికలో ప్రచురితం)