“మూగ మనసు “ (కథ )
రచన : జీడిగుంట నరసింహ మూర్తి
(7/9/2025 ఆదివారం ఆంద్ర ప్రభ దినపత్రిక.కాం లో నా కథ )
ఆల్టో 800 మారుతి కార్ పోర్టికో లోంచి బయలు దేరడానికి సిద్దంగా ఉంది. సర్వెంట్ మెయిడ్ గ్రిల్ గేట్ లోంచి చేయి ఊపింది.
రాములమ్మ ఆ ఇంట్లో ఎంతో నమ్మకంగా అన్ని పనులు చూసుకుంటుంది. ఆమె భర్త చిన్నప్పుడే పోవడంతో పొట్ట పోసుకోవడానికి హైదరాబాద్ వచ్చినప్పుడు తెలిసిన వాళ్ళ ద్వారా చాలా కాలం క్రితం ఆ ఇంట్లో ప్రవేశించింది.
“ఇల్లు జాగ్రత్తగా చూసుకో “ అంటూ శశి, పద్మినిదేవి కారులో కూర్చున్నారు.
పద్మిని ముందు సీట్లో తన ఒళ్ళో చిన్మయిని కూర్చో పెట్టుకుంది. కారు అంతా మంచి మేలు రకపు పెర్ఫ్యూమ్ సువాసనలు ఆక్రమించుకున్నాయి. ఒక పక్క కారులో ఏసీ ఆన్ చేయడం వల్ల కారంతా చల్లదనం ఆవరించింది. చిన్మయి చలికి వణుకుతూ ఉండటం గమనించి చిన్మయి చుట్టూ టవల్ తీసి కప్పి దగ్గరకు హత్తుకుంది పద్మిని . వాళ్ళిద్దరి వైపు ప్రేమగా చూస్తూ డ్రైవ్ చేయసాగాడు శశి.
చిన్మయికి మూడేళ్లు ఉంటాయి. ఆ వయసులోనే ఏదైనా చెపితే అర్ధం చేసుకునే జ్ఞానం వచ్చింది. . . చిన్మయిని అప్పుడప్పుడు బయట తిప్పకపోతే ఆ రోజు తను చేసే అల్లరి అంతా ఇంతా కాదు. అందుకే శశి చిన్ననాటి మిత్రుడు ఇంట్లో పెళ్లి ఉండటంతో ప్రయాణం పెట్టుకున్నారు.
కొంత దూరం వెళ్ళాక చిన్మయికి ఆకలి వేస్తోందని గ్రహించిన ఆ దంపతులు ఒక రిజార్ట్ దగ్గర కారును నిలిపారు. చిన్మయి కోసం ప్రత్యేకంగా తయారు చేసిన కేకును తినిపించి, పాలు పట్టించింది పద్మిని. చిన్మయి కళ్ళల్లో నీళ్ళు చిప్పల్లాయి . ప్రేమగా పద్మినీ వైపు చూడ సాగింది.
చిన్మయి గురించి బాగా తెలిసిన శశి మిత్రుడు వాళ్ళు గుమ్మంలో అడుగుబెట్టగానే చిన్మయిని ఆప్యాయతతో చేతిలోకి తీసుకుని తల నిమిరి ఒళ్ళో కూర్చోపెట్టుకున్నాడు. అక్కడున్న రెండు రోజులు చిన్మయి అందరితో బాగా కలిసి పోయింది. . .
విందు, వినోదాలు ముగించుకుని తిరిగి హైదరాబాద్ బయలు దేరారు శశి కుటుంబం .
* * ** చిన్మయిని పద్మినీ వాళ్ళ ఇంట్లో సొంత బిడ్డలాగా చూసుకుంటూ ఉంటారు. పద్మినీ దంపతులకు పెళ్ళయ్యి ఆరు సంవత్సరాలైనా ఇంకా పిల్లలు కలగని వాళ్ళకు చిన్మయితో సరదాలు తీరిపోతున్నాయి.
కొంతకాలం క్రితం పద్మిని చిన్ననాటి మిత్రురాలి పెళ్లి ఢిల్లీలో జరుగుతూ ఉంటే శశి, పద్మిని ఆ పెళ్ళికి వెళ్లారు. ఆ సమయంలోనే ఒకటిన్నర సంవత్సరం వయసు ఉన్న చిన్మయిని చూడటం జరిగింది. చిన్మయి ఎక్కడ పుట్టిందో తెలియదు. ఎవరో దగ్గర మిత్రులు ద్వారా ఆ ఇంట్లో చేరింది. పిల్లలు లేని శశి దంపతులు ముచ్చటపడి చిన్మయిని పెంచుకోవాలని ఉంది అనడం , అక్కడున్న అందరి మనసులు క్షణికంగా చెదిరినా అందుకు పద్మిని మిత్రురాలు చివరకు అంగీకరించడంతో ఆ నాటి నుండి చిన్మయి పద్మినీ వాళ్ళింట్లో ప్రముఖ స్థానాన్ని ఆక్రమించడమే కాకుండా ఒక ముఖ్య సభ్యురాలి జాబితాలో చేరిపోయింది .
ఎక్కడో ఢిల్లీ నుండి చిన్మయిని తెచ్చుకుని ఇంట్లో మనిషి కన్నా ఎక్కువగా చూసుకోవడం, వాళ్ళు పడుకున్న పక్కలోనే స్థానం ఇవ్వడం , ఒళ్ళో కూర్చోపెట్టుకుని లాలిస్తూ అన్నం కలిపి పెడుతూ ఉండటం , ఏ ఊరు వెళ్ళినా , ఏ ఫంక్షన్ కు వెళ్ళినా వాళ్ళతో పాటు చిన్మయిని తీసుకు వెళ్తూ ఉండటం లాంటి సంఘటనలు శశి బంధువర్గంలో కొంతమందికి నచ్చడం లేదు. . ఆ మాట చెప్పడానికి మొహమాటం వేసి వాళ్ళు ఆ ఇంటికి కావాలనే దూరంగా ఉంటూ ఉండేవారు.
“మా కోసం వచ్చే వాళ్ళు మా చిన్మయిని కూడా ప్రేమించగలిగితేనే రండి “ అని తెగేసి చెప్పేసేవాళ్ళు శశి దంపతులు.
సెలవులిచ్చినప్పుడల్లా పద్మినీ చెల్లెలు రాగిణీ అక్కగారింటికి వచ్చి కనీసం పదిహేను రోజులైనా ఉంటుంది. ఆ పిల్ల ఉన్నన్ని రోజులు ఆమె డ్యూటి రోజూ చిన్మయిని తనతో పాటు బయట షికారుకు తీసుకెళ్లడం , తన అవసరాలు చూడటం పనిగా పెట్టుకుంటుంది. . చిన్మయి వీధిలో చూసే వాళ్ళకు ఒక పెద్ద ఆకర్షణగా మారింది. కొంతమంది రాగిణీ చేతిలోంచి చిన్మయిని బలవంతంగా లాక్కుని లోపలకు తీసుకెళ్ళి ఏవేవో పదార్ధాలు తినిపించే వాళ్ళు.
చిన్మయికి ఇప్పుడు ఐదేళ్లు నిండాయి. ఎవరి దిష్టి తగిలిందో కానీ పద్మినీకి తెలియకుండా బయటకు వెళ్ళిన చిన్మయిని అటువైపుగా వస్తున్న కారు డాష్ ఇవ్వడంతో తీవ్రమైన గాయాల పాలయ్యింది. చిన్మయిని ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న పద్మినీ దంపతులు ఈ హఠాత్పరిణామానికి చాలా సేపు మ్రాన్పడి పోయారు. ఒక పక్క రక్తం ఓడుతున్నచిన్మయిని వైద్యుడికి చూపించాలని కాళ్లాడక అటూ ఇటూ పరిగెడుతున్న పద్మినీకి మరో పక్క బోరుమని కురుస్తున్న అనుకోని వర్షాన్ని చూస్తూంటే ఆమెలో గట్టు తెగిన నదిలా దు:ఖం ముంచుకొచ్చింది. అప్పటికే జరగకూడని ఘోరం జరిగిపోయింది. సకాలంలో వైద్యం అందకపోవడంతో శశి దంపతుల ఆశలను అడియాసలు చేసి చిన్మయి శాశ్వతంగా ఈ లోకాన్ని విడిచి వెళ్ళి పోయింది. ఆమెలో ఎప్పుడూ లేని అవ్యక్తమైన బెదురూ, నీరసం ముంచుకొచ్చాయి. ఆ క్షణంలో వాళ్ళకు చిన్మయిని పోగొట్టుకున్న తర్వాత ఇక దేని కోసం బ్రతకాలో అర్ధం కాని పరిస్తితి . ఆ కుటుంబంలోని అందరి మనసులు వికలం అయిపోయాయి.
రోజులు గడుస్తున్నాయి. ముఖ్యంగా పద్మిని కోలుకోవడానికి చాలా సమయం పట్టింది. ఇంతలోనే ఒక ఊహించని శుభవార్త. చాలా కాలం తర్వాత పద్మిని తల్లి కాబోతోందని తెలిసి ఆ కుటుంబం అంతకు ముందు అనుభవించిన మానసిక వ్యధనుండి మెల్ల మెల్లగా దూరం కాసాగారు.
ఇక్కడ చిన్మయి గురించి ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్పాలి. పిల్లలు లేని ఆ దంపతులకు పిల్లల స్థానంలో దేవుడిచ్చిన వరం లాగా భావించి అల్లారు ముద్దుగా చూసుకుంటున్న ప్రియమైన మేలు జాతి కుక్క పిల్లే ఈ చిన్మయి. దురదృష్టవశాత్తూ చిన్మయి ఒక మూగ జీవిగా భగవంతుడి సృష్టిలో ఉండిపోయింది కానీ దానికి అన్ని ఆలోచనలు, ఊహలూ ఉన్నాయి.
“తనకు అంత విలువనిస్తూ , ఒక జంతువులాగా కాకుండా అన్ని విషయాలలోనూ అత్యంత ప్రాధాన్యత నిస్తూ , తనకు అనారోగ్యం చేస్తే ఎంతో తల్లడిల్లి పోయి సకాలంలో వైద్య సేవలు అందిస్తూ , కడుపులో పెట్టుకుని చూసుకుంటూ ఉండటమే కాకుండా ఎవరైతే తన ఉనికిని అసహ్యించుకుంటూ , తనని చూడటానికి మొహం తిప్పుకునే యజమాని బంధువర్గాలను కూడా తన కోసం తృణప్రాయంగా త్యజించి కన్న తల్లి తండ్రుల కన్నా ఎంతో ఎక్కువగా చూసుకునే వాళ్ళు ఉండటం నిజంగా ఎంత అదృష్టం ? వీళ్ళ ఋణం ఎలా తీర్చుకోవాలి తను ? “ అని చిన్మయి ఖచ్చితంగా ఎన్నో సార్లు అనుకుంటూ ఉండి ఉంటుంది. దాని చూపులో ఆ భావం ఎప్పుడూ పద్మినీ దంపతులకు కొట్టొచ్చినట్టు కనిపించేది.
“తనని ఎంతో ప్రేమగా, కన్న తల్లి తండ్రులు కన్నా ఎక్కువగా చూసుకుంటున్న తన యజమాని ఋణం ఎలా తీర్చుకోవాలి?” అని నిత్యం తపించి పోయి తనువు చాలించిన చిన్మయి ఆఖరి కోరిక పద్మినీ దంపతులకు తన స్థానంలో ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఆ ఇంట్లో ఒక పసి పాప రూపంలో తీరుతూ ఉండటంతో ఇప్పుడు వేరే లోకంలో ఎంతగానో మురిసిపోతూ ఉంటుంది * ***
సమాప్తం