సముద్రమంత మనసు

గోతెలుగు వెబ్ పత్రిక • 21 Dec 2025 • 👁 5 views
సముద్రమంత మనసు (కథ )
రచన : జీడిగుంట నరసింహ మూర్తి
(21/12/2025 విశాలాంధ్ర దినపత్రిక ఆదివారం అనుబంధంలో ప్రచురణ )
గౌరి తల్లి తండ్రులు చిన్నప్పుడే పోయారు. రైల్వే స్టేషన్ దగ్గర గుడిసెల్లో పెరిగింది. ఆలనా పాలనా లేదు. ఆ పూటకు ఎవరు రెండు ముద్దలు పెడితే అది కతికి ఒక అర్ధం , పర్ధం లేని జీవితాన్ని గడిపేస్తోంది. నిరు పేద కుటుంబాలలో తల్లి తండ్రులు ఇద్దరూ ఉంటేనే పిల్లల పరిస్థితి దయనీయంగా ఉండే రోజుల్లో గౌరి రోజురోజుకు తనలో వచ్చే మార్పులను కూడా గ్రహించే స్థితిలో లేదు. పక్క గుడిసెల్లో పిల్లలు ఆటలాడుకుంటూ కుంటూ ఉంటే తను కూడా దూరంగా నిల్చుని చూసేది. కానీ గౌరిని ఎవరూ కలుపుకునే వారు కారు. అక్కడున్నది అందరూ కడు బీదలే. అయినా కూడా అక్కడ పిల్లల్లో గౌరీ అంటే ఒక వివక్ష. బహుశా ఆమెకు తల్లి తండ్రులు అంటూ ఎవరూ లేకపోవడం కారణం కావచ్చు. గాలికి, ధూళికి పెరుగుతున్న గౌరిని ఎవరూ కలుపు కోవడం ఇష్టం లేదు.
గౌరికి వయసు వస్తోంది. వయసుతో పాటు వచ్చే మార్పులు ఆమెకు తెలియక పోయినా అది చూసే వాళ్లకు తెలుస్తోంది. జనాల దగ్గర కోట్ల రూపాయలు మూలుగుతున్నా పెద్ద పెద్ద నగరాలలో కూడా పూట గడవక దిక్కులేని , దిక్కు తోచని కుటుంబాలు రోడ్ల పక్కన ఎండా, వానా, చలి అంటూ లేకుండా దుర్భర జీవితాలు గడుపుతున్నా రాజకీయ నాయకుల దృష్టి వాళ్ళ మీద ప్రసరించడం లేదు. ఓట్ల రాజకీయంలో ఎంతమటుకు సముద్రంలో వర్షం కురిసినట్టు ఉన్న వాళ్ళకే పధకాలు, పదవులు ఇచ్చుకుంటూ తరతరాలకు దోచిపెడుతున్నారు .
ఆ గుడిసెలకు కొద్దిగా దూరంలో రామనాధం గారు ఒక అపార్ట్మెంట్లో ఉంటున్నాడు. ఆయన మధ్యతరహా ఉద్యోగం చేసి రిటైర్ అయ్యాడు. పెన్షన్ , బ్యాంకులో నిల్వలు లేకపోయినా మానవత్వం పాళ్ళు చాలా ఎక్కువ. ఆయన ఇంటి అవసరాల నిమిత్తం రోజూ బయటకు వెళ్తున్న తరుణంలో ఆ గుడిసెలను చూస్తూ అక్కడ కొద్దిసేపు ఆగి వాళ్ళ పరిస్థితులను గమనిస్తూ ఉండే వాడు. ఇంట్లో నిరుపయోగంగా లేని స్టీల్ సామాను, బట్టలు గుడిసెల్లో నివసిస్తున్న వారికి ఇస్తూ వాళ్లకు హృదయానికి దగ్గరయ్యాడు. తను అటువైపు వెళ్తున్నప్పుడల్లా పెద్దవాళ్ళు, పిల్లలు ఆయనవైపే చూస్తూండే వారు ఏదో ఒకటి తెచ్చి ఇస్తాడన్న ఆశతో.
ఆ గుడిసెలోనే డ రామనాధం గారికి పూర్తిగా జడలు కట్టి తైల సంస్కారం లేని ఒక సాధువు కనపడ్డాడు. అక్కడ చెప్పిన వాళ్ళ ప్రకారం ఆయన భారత దేశంలోని అన్ని ప్రముఖ క్షేత్రాలు తిరిగి వచ్చినట్టు తెలుసుకున్నాడు. ఆయన సాధుత్వాన్ని చూసిన రైల్వే అధికారులు కూడా ఆయన్ని ఎటువంటి టికెట్ లేకుండా అనుమతించినట్టు అతను చెప్పుకునే వాడు.
రామనాధం అక్కడ గుడిసెల్లో ఉన్న జనాలతో మమైకమై పోవడంతో ఒక రోజు ఆ సాధువు ఆయనతో “అయ్యా ! మా గుడిసెల్లో ఉన్న వారికి మీరు ఏదో ఒకటి ఇచ్చి ఆదుకోవడం కొన్నాళ్ళుగా చూస్తున్నాను. మీలా అందరి మనసు స్పందించాలని లేదు. మీలో గొప్ప మనిషి దాగున్నాడు. తరచుగా మిమ్మల్ని చూస్తూ వస్తున్న నాకు ఒక చిన్న కోరికను మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. మా గుడిసెల్లో తల్లి తండ్రులెవరో తెలియని గౌరీ అనే ఒక అనాధ అమ్మాయి మా మధ్య పెరుగుతోంది. నేను సన్యాసిని. కుటుంబం లేదు.. నాకు ఆ పిల్లను చూసినప్పుడల్లా చాలా జాలి కలుగుతూ ఉంటుంది. వాళ్ళూ, వీళ్ళూ ఇచ్చిన డబ్బులుతో ఆ అమ్మాయికి ఏదో ఒకటి అవసరానికి కొని పెట్టి ఆదుకుంటూ ఉంటూ వస్తున్నాను. కానీ నేను ఏ రోజు ఎక్కడుంటానో తెలియని పరిస్థితిలో ఆ పిల్ల బాగోగులు చూసుకోవడం చాలా కష్టంగా ఉంది. మీరు దయచేసి మీకు తెలిసిన ఇంట్లో పనిమనిషిగా మా గౌరిని ఉంచితే తన పొట్ట తను పోషించుకుంటుంది. ఈ ముసలి శరీరం ఎప్పుడు ఈ దేహాన్ని విడుస్తుందో తెలియదు. ఈ ఒక్క మేలు కాస్తా చేసి పుణ్యం కట్టుకోండి” అని రామనాధం చేతులు పట్టుకుని కళ్ళ నీళ్ళు పెట్టుకుని అడిగాడు.
రామనాధం మనసు చలించిపోయింది. ఆయన కొడుకు మంచి ఉద్యోగం చేసుకుంటున్నాడు. తన అవసరాలకు సరిపడా చూసుకుంటూ ఉంటాడు. తను చేసే చిన్నా, చితకా సాయాలకు కొడుకు చాలా సంతోషంతో “పోనీ నాన్నా ! నా పని ఒత్తిడిలో నేనెవరికీ సహాయపదలేకపోతున్నాను. నువ్వేనా ఇబ్బందుల్లో ఉన్న వారిని ఆదుకుంటూ ఉండు. మన కుటుంబానికి అదే రక్ష “ అంటూ ధైర్యం చెప్పేసరికి రామనాధం గారు తను బ్రతికి ఉన్నంతవరకు ఎంతో కొంత నిరుపేదలకు సేవ చెయ్యాలన్న తలంపు నరనరాల్లోనూ జీర్ణించుకు పోయింది. అందులో భాగం గానే కొడుకు పనిచేస్తున్న సిమెంట్ ఫ్యాక్టరీలో సున్నపు రాళ్ళు మోసే కూలీగా గౌరికి కాంట్రాక్టర్ దగ్గర ఉద్యోగం ఇప్పించగలిగాడు. ఇప్పుడు ఆయనకు ఎంతో సంతోషంగా అనిపించింది.
రోజులు గడుస్తున్నాయి. గౌరిని ఆదుకోమని వేడుకున్న సాధువు కొన్నాళ్ళుగా కనిపించడం లేదు. అక్కడ ఉన్న వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఆయన ఎప్పుడో ఆయన కార్యదీక్షణలో ఎన్నో ప్రాంతాలు తిరుగుతూ తిరుగుతూ తనువు చాలించి ఉంటాడని మేమంతా అనుకుంటున్నాం అని చెప్పేసరికి ఇప్పుడు రామనాధం మనసులో ఒక్కసారిగా గౌరి మీద సానుభూతి పెరిగింది. . గౌరిని అప్పుడప్పుడైనా చూసుకునే పెద్ద దిక్కు లేకపోవడంతో ఎంతోమంది కళ్ళు ఆమె వైపే చూడటం మొదలు పెట్టాయి. ఆ చూపులకు అర్ధాలు గ్రహించే స్థితిలో లేదు గౌరి. ఎంతమటుకు తన పని చేసుకోవడం వచ్చి గుడిసెలో పడుకోవడం తిరిగి తరిగి ఉదయాన్నే లేచి పనిలోకి వెళ్ళడం ఇదీ ఆమె దినచర్య. ఇదంతా గమనిస్తున్న ఒక నీచుడి కళ్ళు ఆమె పైన పడటం , అతన్ని తప్పించుకోలేని దుర్భలత్వంతో లొంగిపోయిన ఫలితంగా గౌరి ఒక ఆడపిల్లను కనాల్సి వచ్చింది. దానితో రోజువారి తన పనులకు వెళ్ళలేని స్థితిలో సరైన కూలీ దొరికేది కాదు. ఒక రోజు వెళ్లి , ఇంకో రోజు ఎగనామా పెట్టే గౌరిని మిల్లు కాంట్రాక్టర్ రోజూ సూటీ పోటీ మాటలతో దూషించడం, ఇంకోపక్క నెలల బిడ్డను చూసుకోలేక , కూలీ పనులు చెయ్యలేక అప్పటివరకు ఏదో రకంగా జీవితాన్ని వెళ్ళబోస్తున్న ఆమెకు ఆ ఆసరా కూడా పోయి రోడ్డున పడిపోయింది. మరోపక్క గౌరిని మోసం చేసిన అపరిచితుడు మళ్ళీ తారసపడలేదు. ఈ భూమికి తనే భారంగా అనుకుంటూ తనలో తనే రాత్రిళ్ళు మౌనంగా విలపించే గౌరికి ఇప్పుడు ఆమెకు మరో ప్రాణి తోడవడంతో రోజు రోజుకు ఆమె జీవితం మరింత దుర్భరం కాసాగింది. పులిమీద పుట్రలా ఆమెకు తను ఇన్నాళ్ళుగా ఉంటున్న గుడిసెలో కూడా స్థానాన్ని కోల్పోయింది. గౌరి ఎవరితోనో ముక్కూ, మొహం తెలియని వాడికి శరీరాన్ని అప్పగించి పిల్లను కనింది అన్న అభిప్రాయం అక్కడ వాళ్ళందరిలో కలిగి ఆమెను బలవంతాన గుడిసెల్లోంచి వెళ్ళగొట్టారు.
దిక్కుతోచని స్థితిలో గౌరి తన కూతురితో సహా రోడ్డున పడింది. చంటి పిల్లకు గుక్కెడు పాలు పోద్దామనుకున్నా, ఆకలితో జీవన మరణ సమస్యగా ఉన్న తనని తను పోషించుకుందాం అంటే అన్ని దారులూ మూసుకుపోయి ఆమెకు చావు తప్ప వేరే శరణ్యం కనిపించడం లేదు. అప్పటికీ ఎవరేనా దయచూపించి పని ఇస్తారేమో అని చాలా రోజులు ఆశగా మిల్లు గేటు వద్దకు వెళ్లి చూసేది.
గౌరి పనిలోంచి వెళ్ళిపోయిన విషయం రామనాధం గారికి తెలిసి ఆ రోజు ఆమెను వెతుక్కుంటూ వచ్చాడు. ఒకనాడు సిమెంట్ మిల్లు కాంట్రాక్టర్ కు దగ్గరుండి “ఈమె మా మనిషి. ఈమెకు ఏ ఆధారం లేదు . మానవత్వంతో చూడమని చెప్పినా ఇంతటి ఘాతుకానికి ఒడికడతాడని ఆయన ఊహించలేదు . కేవలం ఆమెకు ఏదో ఆశ్రయాన్ని కలిపించి చేతులు దులుపుకునే స్వభావం కాదు ఆయనది. ఆయన్ని చూడగానే ఆమెకు పుట్టెడు దుఃఖం ముంచుకొచ్చింది . రామనాధం ఆమె వైపు తీక్షణంగా చూసాడు. ఆమెలో దారుణమైన పేదరికం మూర్తీభవించినట్లుగా కనిపిస్తోంది. తన్నుకువస్తున్న ఏడ్పును బలవంతాన నిగ్రహించుకుని కాంట్రాక్టర్ పనిలోంచి తొలగించడానికి కారణమైన ముఖ్య కారణాన్ని, తను ఏ విధంగా మోసపోయిందో అంతా ఆయనకు దాచకుండా చెపుతూ నేను ఒక పేదదాన్ని, నిర్బాగ్యురాలిని.. మీరు చేసిన సాయాన్ని నిలబెట్టుకోలేనందుకు చచ్చిపోవాలని నిర్ణయించుకున్నాను “ అంటూ అపరాధిలా తలవంచుకుంది.
“ వద్దు తల్లీ. అటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఇది నీ ఒక్క దాని సమస్య కాదమ్మా. సమాజంలో అట్టడుగు వర్గాల్లో ఎవరి కథను విన్నా ఏదో ఒక భయంకరమైన అనుభవం వాళ్ళ జీవితాల్లో కనిపిస్తుంది. పేద వారంటే ప్రతి వారికీ లోకువ. ఇందులో నువ్వు చేసిన తప్పు లేదు. విధి నీకు చిన్నప్పుడే తల్లి తండ్రులను దూరం చెయ్యడం, ఏ ఆలనా , పాలనా లేకుండా జీవించడం, ఏ పాపం ఎరుగని నిన్ను కూడా ఈ లోకంలో మోసం చేసే వాళ్ళున్నారని నాకు అర్ధమయ్యింది. నేను నిన్ను నా కుటుంబ సభ్యురాలిగా భావించి నీ గురించే ఆలోచిస్తున్నాను. ఎవరి కుటుంబాలను వారు పోషించుకోవడం గొప్ప కాదు . మనకు ఉన్నదాంట్లో బాధాతప్త హృదయాలను ఆదుకోవాలి . ఆ అవకాశం నాకు దొరికింది. ఎప్పుడు తిన్నావో ఏమిటో పద . హోటల్లో భోజనం చేద్దువుగాని. అదే చేత్తో నీ పిల్లకు కడుపునిండా పాలు పట్టించు. ఈ రోజే మా ఇంట్లో వాళ్ళతో చర్చించి నీకు తగిన న్యాయం చేస్తాను. నీకు , నీ పిల్లకు ఎటువంటి సమస్య రాకుండా చూడగలననే నమ్మకం నాకు ఉంది ..” అంటూ గౌరిని పక్కనే ఉన్న భోజనశాలకు తీసుకెళ్ళాడు రామనాధం. గౌరి చేష్టలుడికి పోయి అతన్ని అనుసరించింది.
గౌరికి మళ్ళీ బ్రతుకు మీద ఆశ చిగురించింది. తల్లి తండ్రులెవరో తెలియని ఆమెకు రామనాధం గారిలో అన్నీ తానై కనిపించాడు. **