బ్రతుకు – బ్రతికించు “ (కథ )
( 20/1/2026 ఉషా-పుప్పాల కథల పోటీలో ఎన్నికై ఉషా వారపత్రికలో ప్రచురితమైన నా కథ )
రచన : జీడిగుంట నరసింహ మూర్తి
“కొత్తగా చేరిన వాళ్ళను నమ్మలేం అని అనుకుంటాం కానీ పాపం మా పనిమనిషి ఒక్క రోజు కూడా నాగా పెట్టకుండా అన్ని పనులు చక్కగా చేసుకుని వెళ్లిపోతోంది. ఇంతకు ముందు చేసిన అమ్మాయితో రోజూ టెన్షన్ పడాల్సి వచ్చేది. కరెక్ట్ గా ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చినప్పుడే మాని కూర్చునేది ..” అంది రాజ్యలక్ష్మి పక్కింటావిడ వచ్చినప్పుడు పిచ్చా పాటిగా మాట్లాడుతూ.
“అవును వదిన గారు . అసలు నన్ను అడిగితే వాళ్ళ మీద ఆధారపడే కన్నా మన పని మనం చేసుకుంటే బాగుంటుంది. కరోనా మనుష్యులను కాల్చుకు తింటున్న టైంలో మహా మహా వాళ్ళే పని మనుష్యుల ద్వారా కరోనా వ్యాపిస్తుందని వాళ్ళను ఇంట్లోకి అడుగు బెట్టనీయకుండా చచ్చినట్టు పాచిపని, ఇంటి పని చేసుకోలేదా ? ఈ రోజులలలో పని మనిషి మానేస్తే అదేదో ఒక అంతర్జాతీయ సమస్యగా చూస్తున్నారు. మా చుట్టాలొకమ్మాయికి పెళ్ళయ్యి పదేళ్ళు అయ్యింది. ఇప్పటి వరకు పని మనిషి లేకుండానే బండెడు చాకిరీ చేసుకుంటోంది. . . అయితే ఆ అమ్మాయి అలా పనిమనుష్యుల కోసం ఎదురు చూడటం కన్నా ఎంత కష్టమైనా సరే తన పని తను చేసుకుంటేనే బాగుంటుంది అన్న పరిస్తితికి అలవాటు పడిపోయింది. ..సరే లక్ష్మి గారు .... ఆయన వచ్చే వేళ అయ్యింది .. మళ్ళీ రేపు ఇదే సమయానికి మరో ముచ్చటతో కలుసుకుందాం “ అంటూ లేచి వెళ్ళిపోయింది పక్కింటావిడ మాధవి .
మాధవి "మన పని మనం చేసుకుంటేనే బాగుంటుంది" అని గంటసేపు లెక్చర్ ఇచ్చింది కానీ వాళ్ళింట్లో పని మనిషి రాని రోజూ చేసే హడావిడి, అల్లరి అంతా ఇంతా కాదు. ప్రతి వ్యక్తీ తనొక్కరే ఈ ప్రపంచంలో కష్ట పడి పోతున్నారని అనుకుంటారో ఏమో . మొగుడికి పెద్ద ఉద్యోగం అయినా, ఎప్పుడూ పని వాళ్ళ మీద కనికరం చూపేది కాదు. వాళ్ళు రాని రోజు ఒక్క పూట కూడా ఒళ్ళు వంచి రెండు గిన్నెలు కూడా తోముకోవడానికి సాహసించేది కాదు. పిల్లలిద్దరూ అమెరికాలో స్తిరపడినా కూడా ఇంట్లో పని మాత్రం తగ్గలేదు. నిజానికి కావాలనే మాధవి పని మనుషులను ఆ పనీ ,ఈ పనీ అంటూ సృష్టించి చెప్పి ఇచ్చే జీతం తక్కువైనా అంతకు కొన్ని రెట్లు వేధించుకుని తినేది. ఏ ఒంట్లోనో బాగోనప్పుడు ఒక్క రోజు రాకపోతే పొయ్యిలో పిల్లి లేచేది కాదు. పాపం ఆవిడ భర్త గారు ఆ రోజుకు చచ్చినట్టు హోటల్ నుండి భోజనం తేవాల్సిందే. . ఇటువంటి వాళ్ళే కాలక్షేపం కోసం అవతల వాళ్ళకు ఎన్నో ఉచిత సలహాలు ఇచ్చేస్తూ ఉంటారు.
ఒక్క రోజు కూడా నాగా పెట్టకుండానే చక్కగా పని చేసుకుంటోంది మా పనిమనిషి అని రాజ్యలక్ష్మి ఏ ముహూర్తాన అందో కానీ అదే రోజు పనిమనిషి ఫోన్ చేసి తనకు జ్వరంగా ఉందని నాలుగు రోజులు పనిలోకి రాలేనని చెప్పడంతో రాజ్యలక్ష్మి నిలువునా నీరసించి పోయింది. అసలే ఆమె ఆరోగ్యం అంతంత మాత్రమే . ఆమెకు కాళ్ళూ, చేతులు ఆడటం లేదు. అసలు ఈ రోజుల్లో ఏ విషయమూ కూడా బాగుంది అని అనుకోవడానికి వీల్లేదు. అలా అనుకుంటే మరుక్షణమే దానికి ప్రతికూల ఫలితం కనిపిస్తుంది. . పక్కింటి మాధవికి తమ పనిమనిషి గురించి చెప్పకుండా వుండాల్సింది ఏమో అని మనసులో బాధపడింది.
ఎప్పుడూ లేని ఏదో అవ్యక్తమైన బెదురూ, నీరసం ఆమెలో ముంచుకొచ్చాయి.
రాజ్యలక్ష్మి మొగుడు విశ్వేశ్వర రావు కలిపించుకుని అన్నాడు.
“ఈ సమస్య ఈ నాటిది కాదు. మొదట్లో ఎవరైనా ఇళ్ళు ఉండగట్టుకోవడానికి ఒక వారం రోజులు మనం చెప్పని పనులు కూడా చేసేసి మన మెప్పు పొందాలని ప్రయత్నం చేస్తారు. ఆ తర్వాత మొదలవుతుంది అసలు కథ. మా ఉద్యోగస్తులు కూడా అంతేగా. ముఖ్యంగా ప్రైవేట్ సంస్థలలో ఉద్యోగ అవకాశం దొరికినప్పుడు మొదట్లో చెప్పిన పనల్లా ఒక్క రోజు కూడా సెలవు పెట్టకుండా చేసుకుపోతారు. ఒక్కసారి ఆ ఉద్యోగంలో కన్ఫర్మ్ అయ్యాక అప్పటినుండి వాళ్ళ తీరే మారిపోతుంది. నిజం చెప్పుకోవాలంటే మా ఉద్యోగస్తులకు లాగా ఈ పని మనుష్యులకు ఏమైనా ప్రత్యేక హక్కులు, రాయితీలు ఉన్నాయా ? సెలవు కావాలంటే మనం వంద ప్రశ్నలు వేసి చంపుతాం. అందరికిలాగా పీఎఫ్ లు , గ్రాట్యుటీలు లాంటివి ఉండవు. మనకు ఏదైనా పనికి రాదనుకునే పదార్ధాలే వాళ్ళకు పారేస్తాం . వాళ్ళు ఒక్క గంట ఆలస్యంగా వస్తేనే మన పని మనం చేసుకోలేని స్తితిలో ఉన్నప్పుడు వాళ్ళను కూడా జాగ్రత్తగా చూసుకోవాలి తప్పదు. లేకపోతే మన మన మనుగడ కష్టం .” అన్నాడు విశ్వేశ్వర రావు గట్టిగా ఊపిరి తీసుకుని వదిలేస్తూ . అతని మాటల్లో నిజాయితీ కనిపిస్తోంది. కానీ ఈ పని విషయంలో తను తన భార్యకు ఏ విధంగానూ సహాయం చేయలేని నిస్సహాయ పరిస్తితి అతనిది. . ఆమె కళ్ళల్లో నీళ్ళు చూసి మాత్రం చలించి పోయాడు.
రాజ్యలక్ష్మి అక్కడ నుండి భారంగా లేచింది. పని మనిషి రాదని తెలిసాక కూడా తనింకా సావధానంగా కూర్చోవడానికి లేదు. ఆమె మొహంలో విసుగు రేఖ స్పష్టంగా కనిపించింది. పక్కనే ఉన్న కుర్చీని పట్టుకుని బలవంతాన లేస్తూ భర్త నుద్దేశించి
“దయచేసి మీ ఫ్యాక్టరీ విషయాలు ఇక్కడ మాట్లాడకండి. ఆ కార్మికులు వేరు . వీళ్ళు వేరు. వీళ్ళను మనలో ఎలా కలుపుకుంటాం ? వీళ్ళు ఈ రోజు ఉంటారు . రేపు ఇంకో ఇంట్లో పని చేసుకోవడానికి పోతారు . .. ఈ విషయాలలో మీరు కలిపించుకోకండి. వాళ్ళను మనం ఏమీ తక్కువ చేయడం లేదు. ఏదైనా శుభ కార్యాలు జరిగితే బట్టలు పెడతాం. పండగలకు పబ్బాలకు మామూళ్లు ఇస్తాం. ఇంట్లో ఏదైనా వండుకుంటే వాళ్ళనూ చూసుకుంటాం. . ఎన్ని చేసినా ఇలా పని ఎగగొట్టడం వాళ్ళ నైజం . అయినా ఇప్పుడు బండెడు చాకిరీ చచ్చినట్టు చేసుకోవాల్సింది నేనేగా ? ఇంట్లో నాకెవరేనా అత్తగారున్నారా ఆడపడుచులు ఉన్నారా పనిని పంచుకోవడానికి ? ఆడవాళ్ళ సమస్యలు ఆడవాళ్ళకే అర్ధమవుతాయి. ఏదో సానుభూతి చూపిస్తారని మీతో చెప్పుకున్నాను నా బుద్ది తక్కువయ్యి ..” అంటూ సీరియస్గా మొహం పెట్టి లోపలికి వెళ్ళిపోయింది రాజ్యలక్ష్మి.
** ** **
“సరదాగా అందరమూ కలవాలని ఒక గెట్ టుగెదర్ గురించి ఆలోచిస్తున్నాను. నువ్వు వీలు చూసుకుని వదినను తీసుకుని వచ్చేస్తే మాకు సంతోషంగా ఉంటుంది ..” అంటూ ఫోన్ చేశాడు విశ్వేశ్వర రావు తమ్ముడు రమేష్ అనుకోకుండా.
“ చూడాలిరా మా ఫ్యాక్టరీలో సెలవు దొరకాలిగా ? మా బాస్కు నేను లేకపోతే ఒక్క రోజు గడవదు .. అలా అని అంత నా అవసరం ఉన్నప్పుడు ఒక ప్రమోషనో, కనీసం ఒక ఇంక్రిమెంటో ఇస్తాడా అంటే ఆ పని చచ్చినా చేయడు . అప్పుడు మాత్రం ఆయన లిస్టులో తనకిష్టమైన వాళ్ళ పేర్లు ఉంటాయి. ఈ శ్రమ దోపిడీ తప్పడం లేదనుకో. నాకూ సరదాగా మీ అందరినీ కలవాలని ఉంది కానీ అన్ని రోజులంటే మా బాస్ ఒప్పుకుంటాడో లేదో నని ఆలోచిస్తున్నాను. ఏది ఏమైనా రేపు నీకు ఏ విషయమో చెపుతాను ..” అంటూ ఫోన్ పెట్టేశాడు విశ్వేశ్వర రావు.
ఇంటికి రాగానే తమ్ముడు ఫోన్ చేసిన విషయం భార్యకు చెప్పాడు. ఆమెకు ఎగిరి గంతేయాలని అనిపించింది.
“ప్లీజ్ వెళ్దాం అండీ. మన అదృష్టం బాగుండి కరెక్ట్ గా పని మనిషి మానేసి నప్పుడే ఈ అవకాశం వచ్చింది. .. అసలే ఒంట్లో బాగుండటం లేదు . ఈ చాకిరీ ఎలా చేసుకోవాలా అని భయపడి చస్తున్నాను. .మంచి శుభవార్త చెప్పారు. . రేపు వెంటనే ఆదివారం కలిసొచ్చేటట్టుగా సెలవు పెట్టేయండి నా మాట విని .. మీకు పుణ్యం ఉంటుంది ..” అంది మొహం నిండా ఆనందాన్ని పులుముకుని .
“ ఆ .. ఆ.. అంత ఆశ పడకు. వాళ్ళంతా హైదరాబాద్ లోనే ఉన్నారు కాబట్టి ఎన్ని గెట్ టుగెదర్లైనా చేసుకోగలరు. మన పరిస్తితి వేరు. మా బాసును ఒక్క రోజు సెలవు అడిగాం అంటే ఇక ఆయనకు లొంగిపోయినట్టే . ఇన్నాళ్ళూ నా విలువ కాపాడుకుంటూ వస్తున్నాను. ఇప్పుడు ఏదో ఒక పెద్ద సమస్యను చూపించి బయట పడాలి. . .. ఒక్క రోజు ఆగు . ..” అంటూ భార్యను ఆశ నిరాశల మధ్య ఉంచాడు విశ్వేశ్వర రావు.
మర్నాడు పన్నెండు గంటలకు విశ్వేశ్వర రావు భార్యకు ఫోన్ చేశాడు.
“మొత్తానికి ఎలాగో మా బాసును ఒప్పించే సరికి తల ప్రాణం తోకకి వచ్చింది. మొత్తం పనంతా చూసి వెళ్ళమని అంటున్నాడు. . ముందు నేను సెలవు ఆడగగానే మా ఆఫీసులో స్టాఫ్ అంతా చాలా ఆనందించారు. నేను ఎప్పుడూ సీటు పుచ్చుకుని వేలాడుతూ ఉంటే వాళ్ళకు మా బాస్ దగ్గర వాళ్ళ పని తనాన్ని నిరూపించుకోవడానికి అవకాశం రావడం లేదని ఒకటే నా మీద దుగ్ధ. ఒకరకంగా వాళ్ళే మా బాసుకు రికమండ్ చేశారేమో అని అనుమానం కూడా ఉంది. . .. నేను వచ్చేటప్పటికి నీ బట్టలూ, నావి ఒక సూట్కేసులో సర్ది ఉంచు. వీలైతే రాత్రికే బస్ ఎక్కుదాం . ఉదయం ఆరుగంటల కల్లా హైదరాబాద్ లో ఉంటాం. . నువ్వు తొందర పడి ఎవరికీ చెప్పకు. ఆ మాత్రం సస్పెన్స్ లో ఉంచాలి. ఇటువంటివి ఒక్కోసారి బెడిసి కొట్టినా కొడతాయి . ఇంతకు ముందు ఒకసారి చివరి నిమిషంలో ఆఫీసులో ఏవో అర్జెంట్ పనులు వచ్చాయని సెలవు క్యాన్సిల్ చేసిన అనుభవం గుర్తుందిగా .. సరే సరే. ఈ సారి అటువంటిది జరగకూడదని దేవుడికి దణ్ణం పెట్టుకో . సాయంత్రం కొద్దిగా త్వరగానే వచ్చేస్తాలే ..” అంటూ మొత్తానికి భార్యకు ఒక తీపి కబురు అందించాడు విశ్వేశ్వర రావు.
** ** **
సరిగ్గా ఉదయం ఆరుగంటలకు ఎంజీ బస్ స్టాండ్ లో బస్ ఆగింది. తను ఈ ప్రయాణం సస్పెన్స్ లో ఉంచుదామనుకున్నా తను టిఫిన్ కట్టించుకుని వద్దామని కిందకు దిగినప్పుడు తోడు కోడలికి తనూ , మొగుడూ ఆల్రెడీ బస్ లో ఉన్నామనీ కడుపు ఉబ్బరం ఆపుకోలేక చెప్పేసింది రాజ్యలక్ష్మి.
లగేజ్ దించుకుని ముందు గదిలో పెట్టుకున్నాక చనువుగా వంటగదిలోకి వెళ్ళింది రాజ్యలక్ష్మి. లోపల తోడు కోడలు కనిపించలేదు కానీ ఎవరో ఒకావిడ కాఫీ కలిపి ఫ్లాస్క్ లో పోస్తోంది. మరోపక్క స్టౌ మీద నూనె మరుగుతోంది . పక్కనే వత్తిన పూరీలు ఉన్నాయి. కింద మగవాళ్ళు ఎవరూ కనిపించడం లేదు. బహుశా పైన గదిలో కూర్చున్నట్టున్నారు. అప్పటివరకు ఉగ్గబెట్టుకుని ప్రయాణం చేసిన విశ్వేశ్వర రావు వస్తూ వస్తూనే ఎవరినీ పలకరించటానికి కూడా అవకాశం లేకుండానే టాయిలెట్ లో దూరాడు.
అప్పుడే బాత్ రూంలోంచి స్నానం చేసి వస్తున్న తోడుకోడలు రజని రాజ్యలక్ష్మిని చూసి నవ్వుతూ “ సారీ అక్కయ్యా ! మీరు రావడం ఇంకా టైమ్ పడుతుందని ఈ లోపల స్నానం చేసేయాలని లోపల దూరాను. ఏమీ అనుకోవద్దు. ముందు మీరు, బావగారు మొహాలు అవీ కడుక్కుని రెడీ కండి. కాఫీలు , టిఫిన్ లు అయ్యాక రిలాక్స్ అవుతూ మాట్లాడుకుందాం ..” అంది తోడుకోడల్ని ప్రేమగా దగ్గరకు తీసుకుంటూ.
“అలాగే .. అలాగే. మీ వంటావిడ ఘుమ ఘుమ లాడే పూరీ కూర చేస్తున్నప్పుడే అనుకున్నాను.నువ్వు చక్కగా అన్నీ ప్లాన్ చేసేస్తున్నావు అని .. నాకు కూడా ఆకలిగా ఉంది. రాత్రి బసులో మీ బావగారు ఏదో టిఫిన్ తెచ్చారు కానీ అస్సలు తినబుద్ది కాలేక బయట పారేశాను . ..” అంటూ బ్రష్ మీద పేస్ట్ వేసుకుంటూ వాష్ బేసిన్ దగ్గరకు వెళ్ళింది రాజ్యలక్ష్మి .
ఒక అరగంట తర్వాత అందరూ కలిసి పైన రూమ్లోకి చేరుకున్నారు.
“పోన్లే అన్నయ్యా . మొత్తానికి నిరాశ పరచకుండా వచ్చేశారు. రావలసిన వాళ్లంటూ ఇంకా ఎవరూ లేరు. సింపుల్ గా మన కుటుంబంలోని సభ్యులే. ప్రతి కుటుంబంలోనూ పిల్లలకు పరీక్షలు , ఏవో వేరే సమస్యలు ఉండటం వల్ల వాళ్ళనెవర్నీ డిస్ట్రబ్ చేయడం ఇష్టం లేదు . ఇది కేవలం మన పెద్ద వాళ్ళ కలియిక మాత్రమే ..” అన్నాడు చిన్నగా నవ్వుతూ రమేష్.
ఈ లోపల ఒక్కొక్కళ్ళే ఆడవాళ్ళు అలంకరణలు పూర్తి చేసుకుని గదిలోకి వస్తూ ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు .
ఈలోపల కింద వంట వండుతున్న అమ్మాయి పైకి టిఫిన్లు పట్టుకుని వచ్చింది.
“పూరీ కూర వాసన అదిరిపోతోంది. . ఏం మషాలా వేశావమ్మా ?” అడిగాడు విశ్వేశ్వర రావు తినకముందే ఆ రుచులను ఆస్వాదిస్తూ. .
“ప్రత్యేకంగా ఏమీ లేదు అయ్యగారూ కూర చివర్లో కాస్త దాల్చిన చెక్క పొడి కలిపాను. రెండు లవంగాలు నలిపాను అంతే “ అంది ఆ అమ్మాయి నవ్వుతూ.
మాటల మధ్యలో చెప్పింది రజని “ ఆ అమ్మాయి మా పని పనిషి. పేరు సోమేశ్వరమ్మ. ఇంట్లోని మనిషి లాగానే చనువుగా తిరిగేస్తుంది. మేము అన్ని విధాలా ఆమెకు స్వేచ్ఛనిచ్చేశాం. పొద్దున్న కాఫీ, టిఫిన్ల పని ఆ అమ్మాయే చూసుకుంటుంది. మాతో పాటు టిఫిన్ తింటుంది. కాఫీలు తాగుతుంది. ఒక రకంగా ఆ అమ్మాయిని మా పెద్ద అమ్మాయిగా చూసుకుంటాం. తను సెలవు అడగకుండానే మేమే నెలలో రెండు రోజులు అంటే రెండు ఆదివారాలు వదిలేస్తాం. ఆ అమ్మాయి మొగుడు ఈ పక్క వీధిలో ఇస్త్రీ కొట్టు పెట్టుకున్నాడు. దానికి మీ మరిది గారే పెట్టుబడి పెట్టారు అనుకో. . ఇంట్లో బట్టలు అన్నీ ఈ అమ్మాయే వారం వారం ఇస్త్రీ చేయించుకుని తీసుకొస్తుంది. పెట్టుబడి పెట్టాం కదా అని ఒక్క బట్ట కూడా ఫ్రీ గా చేయించుకోం . వీళ్ళ అబ్బాయి టెన్త్ వరకు చదువుకుని ఖాళీగా ఉంటే ఈయన వాళ్ళ ఆఫీసులో అటెండర్ పోస్ట్ ఇప్పించారు. నమ్మకంగా పని చేసుకుంటుంది అనుకో. మొత్తం బాధ్యత అంతా ఆ అమ్మాయి మీద వదిలేసినా ఏ సమస్య లేదు . .. మనం తగలేసే డబ్బులుతో పోల్చుకుంటే వీళ్ళకు మనం ఖర్చు చేసే డబ్బు ఒక మూలకు కూడా రాదు ” అని చెప్పుకు పోతూంటే ఆనందంగా వెలిగాయి రజని కళ్ళు .
“ అవును . నేనూ అదే చెప్పబోతున్నాను. మనం పని వాళ్ళని చాలా తక్కువగా తీసేస్తాం కానీ వాళ్ళు లేకుండా ఒక్క నిమిషం కూడా మన పని చేసుకోలేం. అసలే మన వాళ్ళ ఆరోగ్యాలు అంతంత మాత్రమే. నిజానికి వీళ్ళను కూడా మన కుటుంబంలో భాగస్వాములను చేయాలి. ఏ అదనపు ప్రయోజనం ఆశించకుండా మన దగ్గర పని చేసే వీళ్ళ కుటుంబాలను ఆదుకుంటే భగవంతుడు మనల్ని మరో రకంగా ఆదుకుంటాడు .. “ అని భార్యకు సపోర్ట్ గా మాట్లాడాడు రమేష్.
హైదరాబాద్ లో మూడు రోజులు చాలా బాగా గడిచాయి. సాయంత్రం తిరిగి బయలు దేరబోతూండగా రాజ్యలక్ష్మి వాళ్ళ పనిమనిషి రమణమ్మ ఫోన్ చేసింది.
“ అమ్మా ఏమీ అనుకోకమ్మా . మా ఆయన తాగి రోడ్డు మీద ఆక్సిడెంట్ చేసుకున్నాడు. అలా అని చెపితే బాగుండదని నాకు జ్వరం అని చెప్పుకుంటున్నాను. మొత్తానికి ఎట్లాగో ఈ రోజు ఆసుపత్రి నుండి ఇంటికి తెచ్చుకున్నాను... రేపు పనిలోకి వస్తానని ఫోన్ చేస్తున్నాను అమ్మగారు . పాపం మీకు చాలా ఇబ్బంది అయ్యి ఉంటుంది. ..” అంది బాధ పడుతూ.
“ పర్వాలేదులే రమణమ్మా ! ఇవాళే మీ ఆయన్ని ఇంటికి తీసుకొచ్చాను అంటున్నావు . ఇంట్లో నీ అవసరం ఎంతైనా ఉంటుంది. మేము ఎలాగో అలా అడ్జస్ట్ అవుతాం కానీ ఇంకో రెండు రోజులు ఇంట్లోనే ఉండి చూసుకో. ....” అంది రాజ్యలక్ష్మి ..
మొదట్లో తను ఆవేశపడింది నిజమే . చాలా మంది లాగానే తనకు కూడా పని మనుష్యుల మీద ఎంతో కొంత చులకన భావం ఉంది. పని మనుష్యులను జాగ్రత్తగా చూసుకోవాలి అని భర్త పదే పదే అంటున్నా ఇప్పుడు హైదరాబాద్ లో తన మరిది గారి ఇంట్లో వాళ్ళు పని మనిషికి ఇస్తున్న ట్రీట్మెంట్ చూశాక గానీ ఆమెలో పూర్తి మార్పు రాలేదు. . తనూ అప్డేట్ కావాలి. ఒక రకంగా తన తోడుకోడలు రజని తనలో జ్ఞానోదయం కలిగించింది. అవును వాళ్ళను ప్రేమగా చూసుకుంటే అంతకు అంత ఎత్తు వాళ్ళు కూడా మన మీద అంతే శ్రద్ద చూపిస్తారు అని బోధపడింది. అలా అనుకోగానే ఆమెలో ఎక్కడలేని బలం వచ్చేసింది.
మర్నాడు పని మనిషి రమణమ్మ రాగానే “ ఎలా ఉన్నాడు మీ ఆయన ? దెబ్బలూ అవి తగ్గి నెమ్మదించాడా ?” అని అడిగింది ఆప్యాయతగా రాజ్యలక్ష్మి.
“అవునమ్మ. మా లాంటి వాళ్ళ ఇళ్ళల్లో ఇలాంటి చెప్పుకోలేని సమస్యలు ఎన్నో ఉంటాయి. మీలాంటి వాళ్ళే మమ్మల్ని కడుపులో పెట్టుకోవాలి. .. “ అంది కళ్ల నీళ్ళ పర్యంతమవుతూ .
“ లేదులే రమణమ్మా ! నీకు ఏ సమస్య వచ్చినా నాతో పంచుకో. మాతో పాటు నువ్వు కూడాను. నీకూ కుటుంబం ఉంది.ఎన్నో సమస్యలు ఉంటాయి. నీ భర్త గురించి ఈయన్ని వాళ్ళ కంపినీలో ఏదైనా అవకాశం ఉంటే చూడమని చెపుతాను. నువ్వు దిగులు పడకు. .. అయితే ఒకటి గుర్తు పెట్టుకో. మెల్లి మెల్లిగా మీ ఆయన్ని తాగుడు మానిపించడానికి నిరంతరం ప్రయత్నం చెయ్యి. అలా చూస్తూ ఊరుకుని వాళ్ళను ప్రోత్సహిస్తూ పోతే ఇక జీవితంలో వాళ్ళు బాగుపడరు . పై పెచ్చు నువ్వు ఇన్ని ఇళ్ళల్లో పాచి పని చేసుకుంటూ సంపాదిస్తూ ఉంటే నీ మీదే పూర్తిగా ఆధార పడిపోతాడు. నీకూ పిల్లలు ఉన్నారు వాళ్ళను కూడా చదివించాలి. నీ ఒక్క సంపాదన మీద కుటుంబం మొత్తం ఆధార పడటం చాలా అన్యాయం. . .. అన్నట్టు ప్రస్తుతం నీకు కొంత డబ్బు అవసరం ఉంటుంది . ఆ టేబుల్ మీద డబ్బూ, పళ్ళు పెట్టాను వెళ్ళే టప్పుడు తీసుకెళ్లు ..” అంది రాజ్యలక్ష్మి . ఆమె కళ్ళల్లో నిజాయితీ ఉట్టి పడుతోంది.
అవును మరి . స్త్రీ సందర్భాన్ని బట్టి రకరకాల పాత్రలను పోషిస్తుందనడంలో సందేహం ఎక్కడుంది ? ******
సమాప్తం