అవిశ్రాంత రచయిత (కథ )
రచన : జీడిగుంట నరసింహ మూర్తి
(ఫిబ్రవరి 10,2026 ఉషా అంతర్జాల వార పత్రికలో ప్రచురితం )
“ ఏమిటమ్మా ఎక్కడ చూసినా నాన్న కథలు అల్మారాలు, సూటు కేసులు నిండిపోయాయి. ఈ సముద్రంలో నా ఆఫీసు పేపర్లు ఎక్కడున్నాయో కనపడటం లేదు. ఎవరేనా కొత్త పత్రిక పెడితే చాలు ఏదో ఒకటి రాసెయ్యడానికి తయారైపోతాడు. అసలు వాటిని ఎవరేనా చదువుతున్నారో లేదో ? ఆవేశం వచ్చినప్పుడల్లా వాళ్ళ మీద, వీళ్ళ మీద అక్కసు కక్కేస్తూ ఉంటాడు. ఇలా ఎంతమంది ఉసురు పోసుకుంటున్నాడో అనిపిస్తోంది. పక్క గదిలోంచి నాన్న వింటున్నాడో లేదో నాకు తెలియదు కానీ రెండు రోజులు టైం ఇస్తున్నాను. తన పుస్తకాలు, ప్రింట్ ఔట్లు ఎక్కడ పెట్టుకుంటాడో నాకు తెలియదు. ఇల్లు అంతా సంతలా తయారైపోయింది...” అంటూ ఆ రోజు తండ్రినుద్దేశించి గట్టిగా విరుచుకు పడ్డాడు శ్రీకాంత్ .
“అదేమిటిరా అలా అంటావ్? మీ నాన్న బాత్ రూమ్లో ఉన్నారు కాబట్టి సరిపోయింది. వింటే ఎంత బాధ పడతారు ? అసలు మన వంశంలో కథలు వ్రాసే వాళ్ళే తక్కువ. ఎలా అలవాటయ్యిందో కానీ నలభై ఏళ్ల నుండి బుర్ర చెడగొట్టుకుంటూ మనలెవ్వరినీ ఇబ్బంది పెట్టకుండా తన వ్యాపకం తను చూసుకుంటున్నారు. నిజం చెప్పొద్దూ చీటికీ మాటికీ ఎప్పటివో పాత విషయాలు ఎత్తి నా పనులు చేసుకోనీయకుండా ఉండే ఆయన కథలు వ్రాసుకోవడంలో పడిపోతే నాకు బోలెడంత మనశ్శాంతి. అయినా ఆ కథలు, కాయితాలు ఇప్పటివి కాదురా. అవన్నీ పాత కథలు. ఇప్పుడు అన్నీ ఆన్లైన్లోనే టైపు చేసుకుంటున్నారు. పోనీలే చెపుతానులే. తన కాయితాలన్నీ ఎక్కడైనా అటక మీద పెట్టుకోమని ...” అంటూ కొడుక్కి సర్ది చెప్పింది రాజ్యలక్ష్మి.
“ఇదిగో మిమ్మల్నే ! వాడు విసుక్కుంటున్నాడు . మీ కథల పేపర్లన్నీ వేరే ఎక్కడైనా పెట్టుకోమంటున్నాడు. వాడి ఫైళ్ళు మీ దాంట్లో కలిసిపోయి ఇవాళ గంటసేపు వెతుక్కుని ఆఫీసు టైం అయిపోయిందంటూ తిట్టుకుంటూ వెళ్ళాడు. మీకు బాగా కావాల్సినవేవో కింద అల్మారాలో పెట్టుకుని ఎప్పుడో తాతల్నాటి పేపర్లన్నీ అటకమీద పారెయ్యండి. ఈసారి మళ్ళీ వాడిచేత చెప్పించుకోకండి...” అంటూ భార్య నిష్టూరంగా అనేసరికి కృష్ణారావు మనసు వికలం అయిపోయింది.
“నేను బ్రతికున్నంతవరకేనా వాటిని ఉండనియ్యండే బాబూ ! తర్వాత మీరెలాగూ వాటిని రోడ్డుమీద పడేస్తారని నాకు తెలుసు....” అంటూ విసురుగా తలతిప్పేస్తూ అసహాయంగా అక్కడనుండి వెళ్ళిపోయాడు కృష్ణారావు.
** ** ** **
“ అమ్మాయి లక్ష్మీ ! నా ప్రింటైన కథలు కొన్ని నీకు మూటకట్టి ఇస్తాను మీ పై కప్ బోర్డులో దాచి ఉంచుతావా ? ఎప్పుడైనా అవసరం వచ్చినప్పుడు మీ ఇంటికి వచ్చి తీసుకుంటాను. ఇక్కడ మీ అన్నయ్య నా కథల పేపర్లు చూస్తే మండిపడుతున్నాడు. ఆ పిచ్చి కథలు వదిలేసి ఏ భారతమో, రామాయణమో, ప్రవచానాకారుల ప్రసంగాలు వింటూ కాలక్షేపం చెయ్యమంటాడు తప్ప ఒక్క కథ కూడా ఇంతవరకు చదివిన పాపాన పోలేదు.ఇక మీ అమ్మ సరే. జీవితం అంతా వంటగదిలోనే సరిపోతుంది. నా పరిస్థితి రోజు రోజుకు అయోమయంగా తయారయ్యింది. అసలు నేను పోయాక ఈ కథలన్నీ ఏమైపోతాయి అంటావ్ ? మీ అన్నయ్య వాటినన్నిటినీ నిర్దాక్షిణ్యంగా చెత్తకుప్పలో విసిరేస్తాడేమో అని బెంగగా ఉంది. ...” అంటూ కూతురితో తన వ్యధను వెళ్ళగక్కాడు కృష్ణారావు . అలా చెపుతూ ఉంటే ఆయన పెదవులు ఉద్వేగంతో కంపించసాగాయి.
ఆయన ఎప్పుడైనా కష్టసుఖాలు కూతురితోనే చెప్పుకుంటాడు.
“పోనీలే నాన్నా ఏది శాశ్వతం ఈ రోజుల్లో ? ఇది నీ ఒక్కడి సమస్యే కాదు. నీలాగా లక్షల మంది కథలు వ్రాసే వాళ్ళకు అంతు పట్టని వ్యధ . అయినా నువ్వు వ్రాస్తున్న కథలు ఇప్పటికే ఎంతోమంది రాసేసారు. కొత్తగా ఇప్పుడు చదివే ఓపికలు ఎవరికీ లేవు. ఇంటింటికి ఒక రచయతో ,రచయిత్రో పుట్టుకొస్తున్న ఈ రోజుల్లో చదివే వాళ్ళు తగ్గిపోయారనడం నిర్వివాదాంశం. అయినా నువ్వు వ్రాస్తున్న కథలు మీ అల్లుడుగారు చూసారంటే నా మీద, నీ మీద అంతెత్తున మండిపడతారు. అప్పుడెప్పుడో ఆయన గురించి, వాళ్ళ తల్లితండ్రుల గురించి విమర్శిస్తూ నువ్వు ఏదో కథ రాసేసావని, ఈ క్షణం వరకు నన్ను దెప్పిపొడుస్తూనే ఉన్నారు. అప్పటినుంచి నీతో కూడా సరిగ్గా మాట్లాడటం తగ్గించేసారు. ఆయనకు ఇష్టం లేని ఏ పనిచేసినా తీవ్రంగా విభేదిస్తారు. ఇంట్లో ఎవరూ చదవడం లేదన్న నెపంతో అగ్నిమీద ఆజ్యం పోసినట్టు ,ఇప్పుడు ఏదో రూపంలో నీ కథలు మా ఇంట్లో దాచావంటే ఆయన సంబంధాలు తెంచుకోవడానికి కూడా సిద్దమవటమే కాకుండా నా బ్రతుకును కూడా నరక ప్రాయం చేస్తారు. ఇక నీ ఇష్టం ....” అంటూ కూతురు లక్ష్మి తన ఆవేదనను నిష్కర్షగా బయటబెట్టింది.
కృష్ణారావులో అంతర్మధనం మొదలయ్యింది. కొద్దిసేపు పడక కుర్చీలో నడుం వాల్చి ఆలోచించడం మొదలుపెట్టాడు.
“ కూతురు లక్ష్మి చెప్పినట్టు అవును ఇప్పుడు వ్రాసే వాళ్ళు ఎక్కువైపోయారు. అంతమాత్రం చేత చదివేవాళ్ళు మృగ్యం అయిపోయారు అనుకోవడం సరైనది కాదేమో. సాహిత్యం అనేది మనిషి అంతరంగ స్వరం. కథలు గాలిలో పుట్టవు. మన చుట్టూ పరిభ్రమిస్తున్న ఎన్నో జీవితాల గుండె లోతుల నుండి పుడతాయి. ఎన్నో పుస్తకాలను చదివి మధిస్తే కానీ వాటిలోని విషయ పరిజ్ఞానం అంత తేలిగ్గా అంతుపట్టదు. కథలు వ్రాయాలంటే ఇతరుల భావాలు, ఉద్దేశ్యాలు ,జ్ఞాన సంపదను ఆకళింపు చేసుకుంటే కానీ కొత్తగా ఏదీ అక్షర రూపంలో పెట్టలేము. కొత్తగా కథలు వ్రాసే వారు ఎక్కువగా చదవాలి. అందుకు వాళ్ళను చదివించగలిగే రచనలు ప్రతి రచయితా చెయ్యాలి. ఇన్ని వేలమంది, లక్షల మంది కథలు వ్రాయడానికి కారణం ఏదో రకంగా రోజులు వెళ్ళదీయడానికి కేవలం ఎవరికీ అడ్డం రాకుండా ఉండటం కోసమో మనకు మనం ఏర్పాటు చేసుకున్న ఒక ప్రక్రియే కాదు .కథల ద్వారా తమ భావజాలాన్ని సరైన రీతిలో ప్రకటించకపోతే సమాజంలోని రుగ్మతలను అదుపులో పెట్టడం అసాధ్యం. ఇతర సామాజిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని కథలను వ్రాసే రచయితల కథలను చదవక నిర్లక్ష్యం చేస్తే సమాజం తప్పు దారి పట్టే అవకాశం ఉంటుంది.తను కథలు వ్రాసే విషయంలో ఎవరెన్ని అడ్డంకాలు, అవరోధాలు సృష్టించినా తను నమ్ముకున్న సిద్దాంతాలను అనుసరించి ముందుకు సాగిపోవాలి. ఎవరో కొంతమంది కథలు చదవకపోయినంత మాత్రాన లోకం గొడ్డుపోయింది అనుకోకూడదు ..”
కృష్ణారావు లోని రెక్కలు విప్పిన సుదీర్ఘ ఆలోచనలు ఆయన మనసును రాగరంజితం గావించాయి. ఇప్పుడు ఆయన ముఖంలోని ప్రశాంతత కొత్త జవసత్వాలకు ఊపిరి పోసింది. పెదవుల మీద విజయదరహాసం కదలాడింది. అలా మనసును సమాధాన పరుచుకున్నాక ఆయనలో కొంత గుండె భారం తగ్గింది.
ఇంతలో కృష్ణారావు పాత మిత్రుడు రాజేశ్వరరావు నుండి ఫోన్ మోగడంతో కాసేపు తనలో చెలరేగుతున్న భావాలకు తాత్కాలికంగా స్వస్తి చెప్పి ఫోన్ ఎత్తాడు.
“గుర్తు పట్టావా లేదా ? చాలా కాలం అయిపోయింది మన మధ్య మాటలు లేక. అయినా కూడా నువ్వు వ్రాస్తున్న కథలు చదువుతూనే ఉన్నాను. నీ ప్రతి కథలో, ఒక మెసేజ్ లేకుండా ఉండదు. నీ కథల ద్వారా ఎన్నో మంచి సూచనలు, సలహాలు చాల మందికి చేరుతున్నాయి అని నేను అనుకుంటున్నాను. మొన్నీ మధ్య నువ్వు వ్రాస్తున్న కథల గురించి చదివే వాళ్ళు తక్కువైపోయారు ఇక అస్త్ర సన్యాసం చెయ్యాలనుకుంటున్నాను అంటూ ఏదో ఒక పత్రికలో వ్రాసిన వాక్యాలు నన్ను తీవ్రంగా కలవర పరిచిచాయి.”
“ దయచేసి అటువంటి పని చెయ్యకు మిత్రమా ! మాలాంటి వాళ్ళం వ్రాయాలనుకున్నా రాయగలమా ? ఆ కళ అందరికీ అబ్బేది కాదు. మనం ప్రశాంత వంతమైన జీవితం గడుపుతూ ఎవరికీ అడ్డురాకుండా ఎల్లప్పుడూ బిజీగా ఉండేటట్టుగా చేసుకోవాలంటే కథలు వ్రాయడమో, ఇతర కళలు అభ్యసించడం చాలా అవసరం. అసలు నువ్వు ఈమాత్రం ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నావు అంటే నువ్వు నమ్ముకున్న ఈ వ్యాపకమే...” అంటూ రాజేశ్వరరావు చక్కటి మనసుకు ఉత్తేజం కలిగించే సలహాలను ఇవ్వడంతో అతనిలోని ఆలోచనలకు మరింత ఊతం ఇచ్చినట్టయ్యి ,అంతకుముందే ఎవరో కొత్తగా పెట్టిన పత్రికలో రచనలు పంపించమన్న ప్రకటన చూస్తూ మరో నూతన కధకు స్వీకారం చుట్టడానికి సమాయత్తం అయ్యాడు అవిశ్రాంత రచయిత కృష్ణారావు *****
సమాప్తం