సంస్కృతి ( కథ రచన : జీడిగుంట నరసింహ మూర్తి
( 22/2/2026 విశాలాంధ్ర దినపత్రిక ఆదివారం అనుబంధంలో ప్రచురితం)
బయట వర్షం కురుస్తూ ఉంటే కడుపులో ఆకలితో అలజడిగా ఉన్నా కిటికీ లోంచి చూస్తూ ఉండిపోయాడు బ్రహ్మం. అతను చాలా కాలంగా పెళ్లి చేసుకోవాలన్న ఆసక్తి లేక పోవడంతో ఒంటరిగా ఒక రూమ్ తీసుకుని ఉంటున్నాడు. పెళ్లైతే కుటుంబం ఏర్పడుతుంది. ఆ కుటుంబాన్ని పోషించడానికి స్వార్ధ జీవితానికి అలవాటు పడాలి. సమాజంలో ఎంతోమంది అన్నార్తులు , అభాగ్యులు ఉన్నారు. . వాళ్ళ కోసం ఒక్క రోజు కూడా మన సమయాన్ని వెచ్చించలేక పోతున్నాం. అందరిలా కాకుండా తను ప్రత్యేకంగా బ్రతకాలి ఇదీ బ్రహ్మం ఆలోచన. పెళ్లి ఒకటేనా జీవిత పరమావధి? అనే సూత్రాన్ని పాటించి పెళ్లి కి దూరంగా ఉన్నాడు. కొద్దో , గొప్పో వంట తెలిసి ఉండటంతో వీలైనప్పుడు చెయ్యి కాల్చుకుంటాడు. బద్దకంగా అనిపిస్తే బయట స్టార్ హోటళ్లకు మాత్రం వెళ్ళడు . ఏ రోజు సంపాదన మీద ఆ రోజు బ్రతికే చిన్న చిన్న హోటళ్లు ఎక్కడ ఉన్నా అక్కడికే వెళ్తూ ఉంటాడు. . అటువంటి వారిని ఆదరించడంలో అతనికి ఒక సంతృప్తి.
చూస్తూంటే వర్షం తగ్గించేటట్టు కనపడటం లేదు. టీవీలో న్యూస్ చూద్దామని ఆన్ చేశాడు. న్యూస్ బ్రేక్ ఉండటంతో వేరే ఛానల్ తిప్పాడు. కొన్ని నిమిషాల సేపు రెప్ప వాల్చకుండా అలాగే చూస్తున్నాడు. ఎవరో ఒక వ్యక్తి తైల సంస్కారం లేకుండా జడలు కట్టిన జుట్టుతో, బాగా మాసి పోయిన గడ్డంతో చిరిగి ఛిద్రమై పోయి ఉన్న బట్టలతో రోడ్డు కడ్డంగా నడుస్తూ వస్తున్నాడు. అతన్ని అందరూ అసహ్యంగా చూస్తూ దూరం దూరంగా తప్పుకుంటున్నారు. అటువంటి వాళ్ళు ఎక్కువగా పార్కుల్లో, షాపుల మెట్ల మీద కనిపిస్తూ ఉండటం తను చాలా సార్లు చూశాడు. . ఇంతలో ఎవరో నలుగురు అగంతకులు ఆ వ్యక్తిని చుట్టుముట్టారు. బ్రహ్మం అక్కడ జరుగుతున్న సంఘటనను ఆసక్తిగా చూస్తున్నాడు. వాళ్ళు అతని రెక్కలు విరిచి పట్టుకుని ఎక్కడికో లాక్కు పోతున్నారు. అతన్ని ఒక పార్క్ లోకి తీసుకెళ్ళి ఒక చోట కుదేసి బలవంతాన క్షుర కర్మ చేసి, శరీరాన్నంతా నీళ్ళు పోసి తడిపి , కొత్త బట్టలు తొడిగి తినడానికి రొట్టెలు, కొన్ని అరటి పళ్ళు తెచ్చి తినిపించి ఈ రోజు నుండి ఇక ఈ అవతారంలో కనపడటానికి వీల్లేదు అని అనునయంగా చెప్పారు. .
అక్కడ జరుగుతున్నది ప్రతీదీ పరిశీలిస్తున్నాడు బ్రహ్మం. అదేమీ షార్ట్ ఫిల్మ్ కాదు. నిజ సంఘటనే.
కాస్త ఆహారం కడుపులోకి పడగానే ఆ వ్యక్తికి ఓపిక వచ్చినట్టుంది. గొంతు లేచింది.
“ అయ్యా . నాకు మాత్రం ఇలా పిచ్చివాడిలా ఉండాలని ఉంటుందా ? కొద్దో గొప్పో చదువుకున్నాను. ఈ పిడికెడు కడుపు నింపుకోవడానికి నాకు ఈ భూమ్మీద ఎక్కడా అవకాశం దొరకలేదు. అయిన వాళ్ళు పట్టించుకోవడం మానేశారు. చీదరించుకున్నారు. ఎన్ని చోట్ల తిరిగానో, ఎక్కడ పడుకుంటున్నానో, ఏమి తింటున్నానో స్పృహ తెలియడం లేదు. . చాలా కాలంగా స్నాన సంస్కారం లేదు.మతి కూడా సరిగ్గా ఉండటం లేదు. . ఈ రోజు మీరు చేస్తున్న పనులు వీడియోలో కనపడటానికి మా లాంటి వారిని సంస్కరించడానికి ముందుకొస్తున్నారు. చాలా సంతోషం. కానీ బురద లోంచి బయటకు తీసిన జీవిని తాత్కాలికంగా శుభ్రపరిచి వదిలేస్తే అది మళ్ళీ బురదలోకి వెళ్ళిపోతుంది. . ఇక ముందు నా పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. మీరు ఇంత చేస్తున్నారు . ఇంకొక్క అడుగు ముందుకేసి మా లాంటి వాళ్ళకు ఏదో ఒక భుక్తి కలిపించి జనజీవన స్రవంతిలోకి తీసుకురండి. అప్పుడే మీకు నిజమైన గుర్తింపు వస్తుంది. . ఇక జీవితంలో మా లాంటి వాళ్ళను ఈ పరిస్తితిలో చూడరు ..” అని అతను ఆవేశం, ఉద్వేగం ధ్వనించిన గొంతుతో అంటూంటే అతని ముక్కు పుటాలు అదురుతున్నాయి. .
అతని మాటలు ఆ అగంతకులకు ఛెళ్లుమని కొరడాతో కొట్టినట్టు అనిపించాయి .
ఆ వెనువెంటనే వాళ్ళ మెదడులలో ఏదో ఆలోచన మెదిలింది అనుకుంటా.
“ ఇతనెవరో పిచ్చి వాడు అనుకుని భౌతికంగా సంస్కరించాలి అనుకున్నాం కానీ ఈ వ్యక్తి మానసికంగా మనలనే సంస్కరించాడు “ అని పైకి అనుకుంటూ ఉండటం కూడా ఆ వీడియోలో రికార్డు అయ్యింది.
కొద్ది సేపటిలో ఒక వాహనం అక్కడికొచ్చింది. ఎవరి జీవితం ఎలా మలుపు తిరుగుతుందో కానీ ఒక వ్యాన్ ఆ అభాగ్యుడిని ఎక్కించుకుని ఎక్కడికో తీసుకెళ్లింది. బహుశా అతన్ని ఏదైనా అనాధ ఆశ్రమంలో చేర్చడానికి తీసుకెళ్ళి ఉంటారని టీవీ చూస్తున్న బ్రహ్మం గ్రహించాడు. అది చూశాక అతనికి ఎంతో తృప్తిగా అనిపించి హాయిగా గుండెల నిండా ఊపిరి పీల్చుకున్నాడు.
మరోపక్క బ్రహ్మం మనసులో ముళ్ళు కెలుకుతున్నట్టుగా అనిపించింది. .
మనల్ని మనం ఉద్దరించుకోవడం అనేది గొప్ప కాదు. కానీ ఇదేనా జీవితం ? బ్రతుకును ఎటువంటి లక్ష్యం లేకుండా ఈడ్చేయ వచ్చు. అవతల వ్యక్తులు బాధల్లో ఉంటే మనం మాత్రం హాయిగా, విలాసంగా జీవించాలనుకోవడం ఎంత అన్యాయం, అధర్మం ? మనకున్న , మనం అనుభవిస్తున్న దానిలో కొంతైనా అవతలి వారితో పంచుకుంటే అందులో ఉండే ఆనందం, ఆత్మ సంతృప్తి స్వార్ధ ప్రయోజనాలతో అడ్డమైన గడ్డి తింటూ ఆయాచితంగా వచ్చే ఆస్తులను కూడబెట్టుకోవడంలో ఉంటుందా ? అవన్నీ మనల్ని వదిలి పెట్టి పోయేవే కదా .మనిషి చనిపోయిన తర్వాత కూడా శాశ్వతంగా నిలిచి పోయేది వారు చేసిన సేవ , సత్కార్యాలు అని ఎంతోమంది ద్వారా మనం వినడం లేదా ? అవేవో ఎవరో చెయ్యాలని ఆశించడం కన్నా అదేదో మన దగ్గర నుండే మొదలైతే బాగుంటుంది కదా .
బ్రహ్మం ఆలోచనలన్నీ ఆ అభాగ్యుడి చుట్టూనే పరిభ్రమించ సాగాయి. అతనికి సహాయం చేసిన అగంతుకులకు మనసులోనే ధన్యవాదాలు చెప్పుకున్నాడు. . తను పెళ్లి చేసుకోకుండా అవివాహితుడిగా ఉండిపోవడంతో చేయాలనుకున్న పనులకు అడ్డు తగిలే వాళ్ళే లేరు. తన సంపాదన అనుభవించడానికి అంటూ ఎవరూ లేరు. కాబట్టి వీలైనంతవరకు పుణ్యకార్యాలు చేయడం తన జీవితంలో ఒక భాగంగా మొదలు పెట్టాలి . ఇది అతని ఆశయం. .
కిటికీలోంచి బయటకు చూశాడు బ్రహ్మం. అతని మనసు లాగా బయట వాతావరణం ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది . వాన పూర్తిగా వెలిసి పోయింది. తలుపు తాళం వేసి బయటకు బయలు దేరాడు. అతను ఆఫీసుకు వెళ్ళే దారిలో ఒక దేవాలయం ఉంది. అప్పుడప్పుడు మనసు బాగోలేనప్పుడు గుడి బయట ఉన్న అరుగుమీద ఒక పదిహేను నిమిషాలు ప్రశాంతంగా ఎటువంటి ఆలోచనలకు తావునీయకుండా గడిపి వస్తూ ఉంటాడు. . అదే సమయంలో గుడి బయట ఎంతోమంది యాచకులను చూసే వాడు. వాళ్లలలో చాలామందికి కుటుంబాలు ఉన్నట్టుగా తోచదు . . గుడి మూసేసినా ఒక మూల గుడ్డ వేసుకుని పడుకుంటారు. వాళ్ళలో ఆడవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ చేతుల్లో అన్యం పుణ్యం ఎరగని బయట ప్రపంచం అంటే ఏమిటో తెలియని పసి పిల్లలు. ఎప్పుడైనా గుడికి వెళ్ళినప్పుడు గుళ్ళో ఇచ్చిన ప్రసాదాన్ని తను తినకుండా వాళ్ళ చేతిలో పెట్టేవాడు బ్రహ్మం. అది వాళ్ళ ఆకలి తీర్చేదీ కాదు అని తనకు తెలుసు. . కొంతమంది అనుకుంటూ ఉంటారు . ఇలా యాచకులుగా ఉండే వాళ్ళు లక్షలు లక్షలు సంపాదించుకుంటారని , వాళ్ళకు సమాజాలు ఉంటాయని, వాళ్ళ మీద జాలి పడనవసరం లేదంటూ. ఎవరో నూటికీ కోటికి పది మంది ఉంటే, వాళ్ళ మీద అక్కసుతో మన మానవత్వాన్ని మర్చిపోవడం మంచిది కాదు. అసలే చలికాలం అవ్వడంతో వాళ్ళల్లో కొంతమంది ఎటువంటి ఆచ్ఛాదన లేకుండా చలికి వణికి పోతూ కనిపిస్తున్నారు. . వాళ్ళల్లో రెండు చేతులూ లేని ఒక వికలాంగుడిని చూసినప్పుడల్లా మనసు వికలమై పోతూ ఉంటుంది. అతను ఎలా తింటాడో, తన పనులు ఎలా చేసుకుంటున్నాడో అనేదే అంతుపట్టని ప్రశ్న .
బ్రహ్మం అక్కడనుండి కదిలి కొంత దూరంలో ఉన్న హోటల్ వైపు దారి తీశాడు. ఇరవై ఇడ్లీ పొట్లాలు, మంచి నీళ్ళ సీసాలు పట్టుకుని గుడి దగ్గరకు వచ్చాడు. అక్కడున్న వాళ్ళందరికీ పంచి పెట్టాడు. ఆకుల్లో భక్తులు పారేసిన మిగిలి పోయిన పదార్ధాలు తిని బ్రతకడం అలవాటు చేసుకున్న ఆ యాచకులు బ్రహ్మం పంచి పెట్టిన ఇడ్లీల మీద పడి ఆవురావురు మనీ తినడం ప్రారంభించారు. ఆ సమయంలో వాళ్ళ కళ్ళల్లో కనిపిస్తున్న ఆనందానికి లెక్క కట్టలేని పరిస్తితి.
ఆ వెనువెంటనే గుళ్లోకి వెళ్ళి అన్నదానం కింద ఐదు వేలు కట్టి వచ్చాడు. అన్నదానం కేవలం బాగా ఇంట్లో జరిగిపోతున్న వారికి కాదని, బయట కూర్చున్న అభాగ్యులకు చెయ్యాలని , తన మిత్రులకు కూడా చెప్పి మరి కొంత నిధులు ఏర్పాటు చేయిస్తానని అక్కడ కమిటీ వారికి ప్రత్యేకంగా చెప్పి వచ్చాడు బ్రహ్మం. ఇది అతను తలబెట్టిన సత్కార్యాలకు మొదటి అడుగు. . చాలా చిన్న సాయం. ఇంతటితో ఈ ప్రయత్నాలు ఆగకూడదు. చేయవలసినది చాలా ఉంది. ఇది అతని మనసులోని ఆలోచన .
అందరి చేత నమస్కారం పెట్టించుకునే గుడి పూజారి గారు రెండు చేతులెత్తి బ్రహ్మానికి నమస్కరించాడు.
“ ఏముంది పూజారి గారు! రాజ్యాలు ఆక్రమించుకున్న రాజులు పోయారు. రాజ్యాలు పోయాయి. ఆకస్మిక ప్రమాదలలో, రోగాలతోనూ ఎంతోమంది అన్నీ వదిలేసి వెళ్ళి పోతున్నారు. ఏదీ శాశ్వతం కాదు. నా ఉద్దేశ్యంలో అసలు మనం అవతలి వారికి ఏదో దానం చేస్తున్నాం అని భావించడమే తప్పు. నాది అనే భావన ప్రతి వారిలోనూ జీర్ణించుకు పోయింది. కానీ “బ్రతుకు – బ్రతికించు” అనేది కూడా లక్ష్యంగా జీవించగలగడం గొప్ప విషయం. . మన కున్న దాంట్లో ఇంకొకరితో పంచుకోవడంలో ఉన్న ఆత్మ తృప్తి జీవితంలో ఏ పని చేసినా కలగదు అని ప్రతి వారూ తెలుసుకున్న నాడు మన సంస్కృతి పది కాలాల పాటు పచ్చగా ఉంటుంది ..ఈ రోజు తను తలబెట్టిన చిరు కార్యం భవిష్యత్తులో తను చేయాలనుకునే మంచి పనులకు ఒక నాందీ ప్రస్తావనగా భావిస్తూ, గుండెల నిండా సద్భావన నింపుకుని అక్కడ నుండి కదిలాడు బ్రహ్మం. ***
సమాప్తం