కథ: “దాగని రహస్యం"
రచన:- అంజనీగాయత్రి
ఆ రోజు రాత్రి విశాఖ సముద్రపు గాలులు అలవోకగా నగరాన్ని ఉవ్వెత్తున తాకుతున్న రాత్రి.
సముద్ర తీరానికి దగ్గరగా, ఉన్న ఒక పాత బంగ్లా. ఆ బంగ్లా మాలికాదేవిది. నిశ్శబ్ద వీధిలో కదిలే నీడల మధ్య నిలిచి ఉంది ఆ బంగ్లా.
గడియారం సమయం రాత్రి 11:45ని సూచిస్తోంది.
అంతలోనే కంట్రోల్ రూంకి ఒక ఫోన్ కాల్ వచ్చింది.
“మధురవాడలో, మాలికాదేవి గారి బంగ్లాలో… ఎవరినో చంపేశారు. రక్తం కనిపిస్తోంది గాని మనిషిలేరు... త్వరగా రండి!” అని ఆత్రంగా ఒక గొంతు పోలీసులతో ఫోన్లో పలికింది.
ఆ తర్వాత ఫోన్ కాల్ ఆటోమేటిక్ గా కట్ అయింది.
కాని ఫోన్ కాల్ లైన్ మీద ఆ ఒక్క క్షణపు వణుకే కేసుకు బీజం వేసింది.
ఇన్స్పెక్టర్ అరవింద్‌కి ఈ కేసు అప్పగించారు.
హత్యా కేసులను పరిశీలించడంలో అతని విధానం ప్రత్యేకం అనే చెప్పాలి. అతడి సమర్ధతను డిపార్ట్మెంట్ మొత్తం గుర్తించింది.
ఎక్కువగా పరిశీలించడం,
చిన్న చిన్న సంకేతాలు పట్టుకోవడం,
నేరస్తుడి మానసిక భయాన్ని అర్థం చేసుకోవడం. ఇలాంటి లక్షణాలన్నీ అతనిలో పుష్కలంగా ఉన్నాయి. అందుకే డిపార్ట్మెంట్ అతనికి ఈ డ్యూటీ అప్పజెప్పింది.
ఈ కేసు నిమిత్తమై అరవింద్ మాలికాదేవి బంగ్లా గేటు చేరేసరికి ... అది సగం తెరిచి ఉంది.
లోపలికి వెళ్ళగానే హాలు అంతా గందరగోళంగా ఉంది.
విరిగిపోయిన గ్లాస్ కప్పులు, రక్తపు మరకలు, పగిలిన టేబుల్ అంచు ... అన్ని చిందరవందరగా ఉన్నాయి.
కానీ మృతదేహం మాత్రం లేదు అక్కడ.
"లోపల ఎవరైనా ఉన్నారా?" అని అరవింద్ గట్టిగా పిలిచాడు.
అతడి పిలుపుతో బయటికి వచ్చింది మాలికా, ఆమె ఆ ఇంటి యజమానురాలు.
ఆమె ముఖం భయంతో వణుకుతోంది.
“ఏమైంది ఇక్కడ? రక్తం ఎవరిది?” అని అడిగాడు అరవింద్.
“నాకు తెలియదు సార్. ఒక్కసారిగా కేకలు… ఆ తర్వాత రక్తం. ఎవరినో చంపేశారు. నేను చూసేలోపే… ఎవరో మృతదేహం తీసుకెళ్లారు.” అని ఏమీ తెలియని అమాయకరాలిలా చెప్పింది మాలిక.
ఇంకా ఇద్దరు లోపలే ఉన్నారు.
వారు... డ్రైవర్(పేరు,అనిల్),
సునీత, (నా మేనకోడలు) అని అరవింద్ తో చెప్పింది మాలిక.
ఆమె మాటలు వింటూనే తక్కిన ఇద్దరూ కూడా వెలుపలికి వచ్చారు. ఆ తర్వాత ఇన్స్పెక్టర్ అరవింద్ ఇంటరాగేషన్లో, ముగ్గురూ ఒకరినొకరు అనుమానిస్తూ మాటలు మార్చేసారు.
సునీత హఠాత్తుగా, “మావయ్య (రామచంద్రం) గురించి మీకు తెలుసా సార్? ఆయన ఐదేళ్ల క్రితం మిస్సింగ్ అయ్యాడు. కానీ… ఈరోజు బంగ్లాలో ఆయన నీడను నేను చూసాను.” అని చెప్పింది.
ఆమె మాటలు విని అరవింద్ ఆశ్చర్యపోయాడు.
ఎందుకంటే, మాలికా భర్త అయిన రామచంద్రం మృతుడే అని అధికారికంగా ఎప్పుడో గుర్తింపు వచ్చింది.
అయితే ఈ రక్తం అతనిదే అంటే? ఆలోచనలో పడ్డాడు అరవింద్.
బంగ్లా లోపల వెదికితే, మాలికా గదిలో ఒక డైరీ దొరికింది.
అందులో, “రామచంద్రం తిరిగి వస్తే… నా నిజం బయటపడుతుంది. కాబట్టి నన్ను నేను రక్షించుకోవడానికి ఏదైనా చేస్తాను.” అని రాసి ఉంది.
దానిని చదవడంతోనే అరవింద్ మనసులో సందేహాలు మొదలయ్యాయి.
ఫోరెన్సిక్ రిపోర్ట్ ప్రకారం ఆ రక్తం నిజంగా రామచంద్రందే. కాని అక్కడ అతడి మృతదేహం కనపడలేదు.
డ్రైవర్ అనిల్ వాంగ్మూలం ఇవ్వడానికి సిద్ధమయ్యాడు.
“సార్, నిజం చెప్పాలి అంటే ఐదేళ్ల క్రితం రామచంద్రం గారిని మాలిక గారు చంపారని నేను అనుకున్నా. కానీ ఈ మధ్యనే, ఎవరినో ఆయన రాత్రిళ్లు కలవడానికి వస్తున్నారని చూశా.” అని అనిల్ చెప్పాడు.
“ఎవరు?” అని అడిగాడు అరవింద్.
అనిల్ తడబడుతూ, “అది...ఎవరంటే...ఎవరంటే అని నసుగుతూ... అది ఎవరంటే సునీతే.” అని అసలు నిజం చెప్పేశాడు.
సునీత కూర్చున్నదల్లా ఒక్కసారిగా లేచి, “అది అబద్ధం! నేను రామచంద్రం మావయ్యను రహస్యంగా కలిసేదాన్ని. కానీ ఆయన చనిపోలేదు. నిజానికి మాలిక అత్తయ్య ఆయనను పక్కకు తొలగించడానికి ప్లాన్ చేసారు.” అని నిజం చెప్పేసింది.
*****
గతంలోకి వెళితే ... ఐదేళ్ల క్రితం రాత్రి వేళలో రామచంద్రం తన భార్య మాలికాతో వాదన పడ్డాడు.
“నువ్వు ఈ బంగ్లా కోసం నన్ను మోసం చేస్తున్నావు. నేను పోలీసుల దగ్గరికి వెళ్తా.” అని అన్నాడు రామచంద్రం.
“నీకు ఆ అవకాశం ఇవ్వను.” అని అతడితో ఆవేశంగా అంది మాలిక.
అంతే, అలా అనడమే కాకుండా, కోపంతో ఆమె ఒక రాడ్ తీసుకుని ... ఒక గట్టి దెబ్బ అతడిపై వేసింది. అలా దెబ్బ పడగానే రామచంద్రం రక్తం కారుతుండగా నేలకు కూలిపోయాడు.
అలా ఆయన “చనిపోయాడని” అనుకొని, అనిల్ సహాయం తీసుకుని, ఊరికి దూరంగా తీసుకెళ్లి ఎవరూ సంచరించని ప్రదేశంలో పడేసింది మాలిక.
కానీ ఆ సంఘటన తర్వాత రామచంద్రం ప్రాణాలతో బయటపడ్డాడు.
అప్పటి నుంచి ఆమెకు కనిపించకుండా దాగి ఉంటూ, సునీత సహాయం పొందుతూ జీవిస్తున్నాడు.
*****
ఒకరోజు రాత్రి 12:00 గంటల సమయంలో ఇన్స్పెక్టర్
అరవింద్ ఆ బంగ్లాలో దాక్కున్నాడు. కొంత సమయానికి ఆ బంగ్లా యొక్క వెనుక తలుపు నెమ్మదిగా తెరుచుకుంది.
తెరుచుకోగానే ఒక వ్యక్తి లోనికి వచ్చాడు. అలా లోపలకి వచ్చిన వ్యక్తి, రామచంద్రమే!
గాయాలతో, బలహీనంగా ఉన్నా, కన్నుల్లో ఆగ్రహం మాత్రం తగ్గలేదు అతడికి.
“ఇంకా ఎంత కాలం ఇలా దాక్కోవాలి? ఈ స్త్రీ చేసిన నేరం బయటపడాలి అంటే ఏం చేయాలి?” అని ఆవేశంగా సునీతతో అన్నాడు రామచంద్రం.
అప్పుడే అక్కడకు పరుగెత్తుకుంటూ వచ్చి, గట్టిగా అరిచింది మాలిక.
“అవును! నేను హత్యా ప్రయత్నం చేసాను. ఆస్తి కోసం, ఈ బంగ్లా కోసం. నువ్వు నన్ను విడిచిపెట్టకపోతే, నువ్వు చనిపోవాలి అనుకున్నా. కానీ అలా జరగలేదు, నువ్వు బ్రతికిపోయావు. అదే నా ఓటమి!” అని ఆవేశంగా పలికింది మాలిక.
చాటు నుండి వారి మాటలు విన్న ఇన్స్పెక్టర్ అరవింద్ వారి ఎదురుగా వచ్చి, ఇద్దరినీ కంట్రోల్‌లోకి తీసుకున్నాడు.
“ఆస్తి కోసం చేసిన నేరం, చివరికి నిజం కోసం నిలబడ్డవారిచేతే బయటపడింది. నేరం ఎప్పటికీ తలుపు వెనుక దాగదు. ఏదో ఒకరోజు అది తలుపు తెరచుకుని మరీ బయటకు వస్తుంది. నీలాంటి హంతకులను పట్టిస్తుంది.” అని అన్నాడు అరవింద్.
ఆ సంఘటనతో సునీత కన్నీళ్లు పెట్టుకుంది.
“నేను రుజువులతో సాక్ష్యం ఇస్తాను. నేరం ఎప్పటికీ దాగకూడదు.” అని పోలీసులకు రుజువులతో సాక్ష్యం సమర్పించుకున్నాడు రామచంద్రం.
అనిల్, మాలిక అరెస్టు అవడంతో... సునీత, రామచంద్రం ఊపిరి పీల్చుకున్నారు.
కానీ బంగ్లా లోపలి గోడలు మౌనంగా నిలబడ్డాయి.
కానీ ఆ నిశ్శబ్దం వెనుక నుండి
ఒక స్పష్టమైన సందేశం,
"లోభం తాత్కాలికం, నిజం శాశ్వతం." అని రామచంద్రం నోటివెంట వినబడింది.
🌹🌹🌹🌹🌹