ఎవరు దోషి ?

విశాలాంధ్ర ఆదివారం అనుబంధం • 05 Apr 2026 • 👁 6 views
ఎవరు దోషి ? “ (కథ )
రచన : జీడిగుంట నరసింహ మూర్తి
(5/4/2026 విశాలాంధ్ర ఆదివారం అనుబంధంలో ప్రచురణ )
“మాస్టారూ బాగున్నారా ? చాలా కాలం అయిపోయింది మిమ్మల్ని చూసి “ అన్నాడు గోపాల్ వీరభద్రం మాస్టారి ఇంటికి వచ్చి ఆశ్చర్యంగా చూస్తూ.
వీరభద్రం మాస్టారు కాసేపు అతని ముఖాన్ని నిశితంగా చూశాడు.
“ఎవరు బాబూ? క్షమించు… నేను గుర్తు పట్టలేకపోతున్నాను.”
“అది సహజమే మాస్టారు. ఇరవై ఏళ్ల క్రితం మీరు నాకు డిగ్రీలో ఎకనామిక్స్ క్లాస్ చెప్పేవారు. ఈమధ్య మన కాలేజీలో పనిచేసిన హిస్టరీ మాస్టారిని కలిసినప్పుడు మీ వివరాలు తెలిసాయి. మీరు ఈ ఊళ్లోనే ఉన్నారని తెలుసుకుని వచ్చాను…”అన్నాడు గోపాల్ విస్మయంగా చూస్తూ.
వీరభద్రం మాస్టారు గోపాల్ మొహం వంక చూస్తూ గుర్తు తెచ్చుకోవడానికి శతవిధాలా ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన మదిలో జ్ఞాపకాల పుటలు వేగంగా తిరిగాయి. వందలాది విద్యార్థులు… కొందరు ఉన్నత స్థానాల్లోకి ఎదిగి వచ్చి కృతజ్ఞతలు చెప్పిన వారు గుర్తున్నారు. కానీ వేలమంది విద్యార్థుల్లో ప్రతి ముఖం ఎలా గుర్తుపెట్టుకోవాలి ?
గోపాల్ లాంటి వాళ్ళకు వేల సంఖ్యలో తను క్లాసులు తీసుకుని ఉంటాడు. వాళ్ళల్లో అందరినీ జ్ఞప్తికి తెచ్చుకోవడం కష్టమే.
“పరవాలేదు మాస్టారు… మీరు శ్రమ పడకండి. ఫేర్‌వెల్ రోజు తీసిన గ్రూప్ ఫోటో ఇప్పటికీ నా దగ్గరే ఉంది. దాంట్లో చూస్తూ మిమ్మల్ని గుర్తు చేసుకుంటూ ఉంటాను. మీలాంటి మనసున్న గురువులు అరుదు. ఫీజులు కట్టలేని వాళ్లకు సహాయం చేసిన సందర్భాలు మాకు తెలుసు…
మీది సముద్రమంత గొప్ప మనసు. అన్నట్టు మీ కోసం పంచ , షర్ట్ తెచ్చాను. ఈ సారి నేను నా భార్యతో పాటు వస్తాను. పిన్ని గారికి కూడా తన చేత చీర, జాకెట్టు పెట్టిస్తాను. అవును వారు ఇంట్లోనే ఉన్నారా అండీ ఒకసారి పలకరిస్తాను . మిమ్మల్ని ఎన్నో ప్రశ్నలు అడగాలని ఉంది. పిల్లలు ఏం చేస్తున్నారు మాస్టారు ? ఇల్లు సొంతమేనా ? “ అని అడిగాడు గోపాల్ మాస్టారిని ఊపిరి పీల్చుకోనీయకుండా.
అతని ప్రశ్నల వర్షంలో మాష్టారు తడిసి ముద్దయ్యాడు .
“మాకు పిల్లలు లేరు బాబూ. ఒక ఆడపిల్లను పెంచుకున్నాం. ఆమె పెళ్లై వెళ్లిపోయింది. ఇప్పుడు ఇద్దరం… ఏదో ఒంటరిగా ఒకరికి ఒకరం తోడుంటూ కాలక్షేపం చేసేస్తున్నాం...”
అని అంటూంటే ఆయన పెదవులపై మీద విలక్షణమైన నవ్వు కనిపించింది. అది తృప్తి, ఒంటరితనం, కలగలిపిన నవ్వు.
“ అన్నట్టు మీ పిన్నిగారి గురించి అడిగావు కదా. తను ప్రస్తుతం ఇంట్లో లేదు బాబూ ! ఊరు వెళ్ళింది.” అన్నాడు వీరభద్రం మాస్టారు .
“ అవునా మాస్టారు! ఈ సారి వచ్చినప్పుడు కలుస్తాలెండి. నేను చాలా కాలంగా విశాఖపట్నంలోనే వుంటున్నాను. అవును మీరు టిఫిన్ అదీ చేశారా ? పిన్ని గారు కూడా ఇంట్లో లేరంటున్నారు . ముందు ఈ కొత్త బట్టలు కట్టుకోండి. మనం అలా బయటకు వెళ్ళి ఏదైనా మంచి హోటల్లో టిఫిన్ చేద్దాం. అదయ్యాక మిమ్మల్ని ఇంటిదగ్గర దిగబెట్టి నేను వెళ్లిపోతాను .ఒకవేళ రాత్రివరకు నేను ఈ ఊళ్లోనే వేరే పని ఉండి ఉండిపోతే కనక మంచి భోజన హోటల్ చూసి డిన్నర్ కూడా చేసేద్దాం. దానితో మీతో నేను సంపూర్ణంగా గడిపానని తృప్తిగా కూడా మిగులుతుంది “ అన్నాడు గోపాల్ అభ్యర్ధనగా.
వీరభద్రం మాష్టారి కళ్ళు మెరిసాయి. విద్యార్ధులకు , అధ్యాపకులకు మధ్య అనుబంధం అలాగే ఉంటుంది మరి అనుకున్నాడు మనసులో.
రెండు రోజులుగా భార్య దోసెల పిండి ప్రిజ్జులో పెట్టేసి వెళ్ళడం వల్ల ఎలాగో టిఫిన్కు చూసుకోవాల్సిన అవసరం రాలేదు. . ఇంకా ఈ రోజు ఏమి తినాలా అని ఆలోచిస్తున్న సమయంలో గోపాల్ రావడంతో మాష్టారి సమస్య తీరినట్టయ్యింది. ఇంకా ఏమీ ఆలోచించకుండా అతని వెంట బయలు దేరాడు .
హైదరాబాద్లో అదొక పేరున్న హోటల్. బాగా రద్దీగా ఉంది.
ఇద్దరూ కలిసి వెళ్ళి ముందు సీట్లలో కూర్చున్నారు.
“మాస్టారూ . మీకు ఏమి కావాలో మొహమాటం లేకుండా చెప్పండి ఆర్డర్ చేస్తాను. నేను మీకు కొడుకు లాంటి వాడిని. . ..” అంటూ మాస్టారికి ఇష్టమైన టిఫిన్ కు ఆర్డర్ చేశాడు గోపాల్ .
వీరభద్రం మాష్టారికి చాలా రోజుల తర్వాత పెద్ద హోటల్లో టిఫిన్ తినే అవకాశం వచ్చింది. అన్ని పదార్ధాలు ఆస్వాదిస్తూ తింటున్నాడు. . .
“మాస్టారు మీరేమీ అనుకొకపోతే ఒక సిగరెట్టు కాల్చుకుంటాను. వెధవ అలవాటు మానుకోలేక పోతున్నాను. బిల్ నేను “పే” చేసేస్తున్నాను. .బయట ఎండ బాగా ఉంది. .మీరు ఇక్కడే ఉండండి. ఐదు నిమిషాల్లో వస్తాను ..” అంటూ కౌంటర్ దగ్గరికి వెళ్ళి బిల్ కట్టేశాడు గోపాల్ .
మాస్టారి టేబుల్ దగ్గర కష్టమర్లు నిలబడి ఉన్నారు. ఆ హోటల్లో డిమాండ్ బాగా ఉండటం వల్ల అవతల వారు ఇంకా తినకుండానే ఎగబడిపోతూ ఉంటారు. ఐదు నిమిషాల తర్వాత సర్వర్ బిల్ తీసుకొచ్చి మాస్టారి దగ్గర పెట్టాడు. మాస్టారు ఆశ్చర్యంగా చూస్తూ" అదేమిటి మా స్టూడెంట్ కట్టేశాడు కదా . మళ్ళీ బిల్లు తెచ్చావ్ ?” అన్నాడు కోపంగా. .
“ ఎవరూ మీ పక్కన కూర్చున్నాయనా ? ఆయన తన బిల్లు సెపరేట్గా తీసుకుని కట్టేసి వెళ్ళిపోయాడు. త్వరగా డబ్బులు"పే" చేసి వెళ్ళండి. అవతల జనాలు వెయిట్ చేస్తున్నారు “ అన్నాడు సర్వర్ మండి పడుతూ.
సర్వర్ చెప్పింది విని వీరభద్రం మాస్టారు కొయ్యబారి పోయాడు. వెన్నులో సన్నటి జలదరింపు మొదలయ్యి మొహం చెమటతో ముద్దయ్యింది. జరుగుతున్నది కలో నిజమో తెలియని పరిస్థితి. గోపాల్ అలా ఎందుకు చేశాడో ఎంత తలబద్దలు కొట్టుకున్నాఆయనకు అర్ధం కాలేదు.
ఏమీ ఆలోచించుకోనీయకుండా అతను తనని కంగారు పెట్టటంతో జేబులో డబ్బులు కూడా పెట్టుకోలేదు. ఏం చేయాలో తెలియక సీటులోనే చేష్టలుడిగి కూలబడి పోయాడు . ఇంకా ఏదో ఆశతో గోపాల్ కోసం ఎదురు చూద్దాం అనుకుంటున్నాడు . పరిస్థితి అదుపు తప్పేటట్టుగా ఉంది.
ప్రొప్రయిటర్, ఇంకొంతమంది సర్వర్లు వీరభద్రం మాస్టారిని బలవంతాన రెక్కలు పుచ్చుకుని సీటులోంచి లేపాలని ప్రయత్నం చేస్తున్నారు.
“ బాబూ ! నేను విశ్రాంత ఉపాధ్యాయుడిని. . మా స్టూడెంట్ హోటల్కి రమ్మంటే వచ్చాను. ఏమయ్యిందో తెలియదు. ఇప్పుడే వస్తాను ఇక్కడే కూర్చోండి అని చెప్పిన అతను ఎక్కడికెళ్లాడో తెలియదు. ప్రస్తుతం నా దగ్గర డబ్బులు కూడా లేవు . మీ వాళ్ళను ఎవరినైనా నాతో పాటు మా ఇంటికి పంపిస్తే డబ్బులిచ్చి పంపుతాను “ అన్నాడు వీరభద్రం గారు హీన స్వరంతో .
“అదేమీ కుదరదు. వేలికున్న ఉంగరం ఇక్కడ పెట్టి వెళ్ళండి. డబ్బులిచ్చాక వదుల్చుకుందురు గాని. “ అంటూ బలవంతాన మాస్టారి చేతికున్న ఉంగరం లాక్కున్నాడు ఆ హోటల్ ప్రొప్రయిటర్ .
మాస్టారికి ఆత్మహత్యా సదృశ్యంగా అనిపించింది.
గోపాల్ అంత మోసం చేస్తాడా ? ఊహించడానికి కూడా కష్టంగా ఉంది. ఆయన ముక్కు పుటాలు అదురుతున్నాయి. పెదవులు ఉద్వేగంతో కంపిస్తున్నాయి . ఒక పక్క ఎర్రని ఎండ కాల్చేస్తోంది. లోపల తీవ్రమైన అవమాన భారం గుండెను తొలిచేస్తోంది. తన జీవితంలో ఇటువంటి సంఘటన ఎప్పుడూ వినలేదు. ముఖం వాడిపోయి బాగా అలసట చెందినట్టుగా ఉంది. ముందుకు నడవలేక పోయి ఒక షాపు అరుగుమీద కూలబడ్డాడు.
టాబ్లెట్ తీసుకుందాం అని జేబులో చెయ్యి పెట్టిన వీరభద్రం మాస్టారికి మడతపెట్టి ఉంచిన కాయితం బయటకు వచ్చింది. దానిమీద తెలుగులో వ్రాసిన అక్షరాలు ఉన్నాయి.ఈ కాయితం తన జేబులోకి ఎలా వచ్చిందో తెలియక మాష్టారు కొద్దిసేపు ఆలోచనలో పడ్డాడు..
“మాస్టారు. ఇక్కడ నేను వ్రాస్తున్నది చదివితే మీరు కలలో కూడా నన్ను క్షమించరని తెలుసు . . కాలేజీలో నేను డిగ్రీ చివరి సంవత్సరం పరీక్షలు వ్రాస్తున్న సమయంలో మీరు నా కాపీ పట్టుకుని , దగ్గరుండి మూడు సంవత్సరాలు డిబార్ చేశాక నా భవిష్యత్తు పూర్తిగా సర్వ నాశనం అయిపోయింది.
సరైన ఉద్యోగం లేదు.పెళ్లి చేసుకోలేదు. దేశ దిమ్మరిలాగా తిరిగాను. నాకు కలిగిన దుస్థితికి లోలోపల మీ మీద కక్ష,కసి పెరిగిపోసాగింది. మీ కోసం వెతికాను. చాలా కాలం తర్వాత నా ఆశ ఫలించింది. మిమ్మల్ని పట్టుకోగలిగాను.
అయితే మీ ఇంటికి రాగానే మొదట నాకు మీ మీద పగ తీర్చుకోవాలని అనిపించలేదు. అయితే మీరు నేనెవరో గుర్తు పట్టక పోయేసరికి పాత జ్ఞాపకాలు తరుముకు రావడంతో నా ప్లాన్ అమలు చేయక తప్పలేదు.
నాకు వేరే ఆలోచన లేదు . నాకు భవిష్యత్తు లేకుండా చేసిన మీకు అవమానం జరిగితే కానీ నా మనసు శాంతించే టట్టు అనిపించలేదు. దాని ఫలితమే ఈ రోజు మిమ్మల్ని హోటల్కి తీసుకొచ్చి బిల్లు “పే “ చేయకుండా అవమానించడం. బహుశా ఏ స్టూడెంట్ కూడా ఇటువంటి ఘాతుకానికి తలపెట్టి ఉండడు. ..మీరు కలలో కూడా నన్ను క్షమించరని తెలుసు. నాలాంటి విద్యార్ధులు ఎవరికీ ఉండకూడదు.నా ఆవేదన ఈ కాయితంలో వ్రాసి మీరు పరాకుగా ఉన్నప్పుడు మీ జేబులో పెట్టేసాను. భవిష్యత్తులో నా మొహం మీకు ఎప్పుడూ చూపించను. ఇక సెలవ్ .”
“నేనేమీ అనుకోవడానికి లేదులే గోపాల్! నిజంగా ఆ నాడు అహంకారంతో, నీ భవిష్యత్తు అంధకారం అయిపోతుందన్న ఆలోచన కూడా లేకుండా నీకు ఘోరమైన శిక్ష వేసి నీ జీవితాన్ని బలిగొన్నాను . నీ మనసులో రగులుతున్న పగ చితి కన్నా ప్రమాదం. అది పూర్తిగా నిన్ను కాల్చేయకుండా ఈ రోజు సంఘటనతో నిన్ను క్షేమంగా బయట పడేసింది .నాకు జరిగిన అవమానానికి నేనేమీ బాధ పడటం లేదు.నీకు జరిగిన నష్టంతో పోల్చుకుంటే ఇది తృణప్రాయం. నాకు పెన్షన్ వస్తుంది. తృప్తిగా జీవించగలను. కానీ నీ పరిస్థితి గురించే నేను ఆలోచిస్తున్నాను. ఈ క్షణం నుండి నువ్వు ఎక్కడ ఉన్నా అన్నీ మర్చిపోయి జీవితంలో స్థిర పడటానికి తీవ్రంగా ప్రయత్నం చెయ్యి.ఇదే నా కోరిక .. “ అని గోపాల్ ఎప్పుడైనా కనిపిస్తే చెప్పాలని వీరభద్రం మాస్టారు రోజూ తపించి పోతూనే ఉన్నాడు.****** సమాప్తం