శూద్ర పుత్ర కర్ణ:
ఆ చిన్న పల్లెటూరులో గత వారం రోజులుగా ఒకటే హడావిడి. నలభై సంవత్సరాల క్రితం వరకు ప్రక్క ఊరుల వార్తలలో కూడ చోటు లేని ఆ పల్లెకు ఇప్పుడు రాష్ట్ర మీడియా, జాతీయ మీడియాలు క్యూ కడుతున్నాయి.
జాతీయ మీడియా దృష్టి సారించిన ఆ ఊరి పేరు 'దండాసిపాలెం.' ఉత్తరాదికి ప్రాధాన్యతనిచ్చే జాతీయ మీడియా ఆంధ్ర రాష్ట్రంలోని ఒక మారుమూల పల్లెపై ఇంతగా ఆసక్తి చూపటానికి ప్రధాన కారణం : ఆ ఊరికి చెందిన ఓ 35 ఏళ్ల వ్యక్తి షెడ్యూల్డ్ కులాల కమిషన్ (NCSC) చైర్మన్ కావడం. ఆయన ఈ రోజు తన స్వగ్రామములో పర్యటించడం.
"నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ కాస్ట్స్" చైర్మన్ పదవి కేంద్ర మంత్రి హోదా కలిగినది. అందువలన "కర్ణ దండాసి" వస్తుండటంతో పోలీసులు గట్టి భద్రత ఏర్పాటు చేశారు. సభలో ఆయన ప్రసంగించిన తరువాత హరిజనులకు కేటాయించిన అయిదు వందల డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ NCSC చైర్మన్ కర్ణ దండాసి ప్రారంభోత్సవము చేస్తారు.
నలభై సంవత్సరాల క్రితం వరకు ఈ ఊరు పేరు 'గౌరమ్మ పాలెం'. మన్యం జిల్లాలోని వున్న ఆ ఊరు పేరుని దండాసి ఆత్మహత్య అనంతరం జరిగిన పరిణామాల వల్ల ప్రభుత్వం 'దండాసిపాలెం' గా మార్చింది.
నలభై సంవత్సరాల క్రితం, ఆ ఊరి మునసబు 'ధనుంజయ' చేతిలో ఆయన కూతురు 'విద్య' పరువు హత్యకు గురికావడం, అనంతరం దండాసి ఆత్మహత్య చేసుకోవడం, బారిక వీధిలో ప్రారంభమైన చిన్న విప్లవం ఊరు దాటి జిల్లా, రాష్ట్రం, దేశం వరకు వ్యాపించడం జరిగింది. అప్పట్లో ధనుంజయను పోలీసులు అరెస్ట్ చేయగ కోర్టు అతనికి పద్నాలుగు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది. శిక్ష పూర్తయ్యాక ఆయన విడుదలయ్యారు.
ఏడవ తరగతి వరకు మాత్రమే చదువుకున్న దండాసి రాసిన డైరీ అప్పట్లో సంచలనం సృష్టించింది. అతని జీవితం కథలుగా, సీరియల్స్, నవలలుగా, సినిమాలుగా దేశం మొత్తం విడుదలయి సంచలనం సృష్టించాయి. నిజ జీవిత ఆధారంగా తీసిన ఆ సినిమాల ప్రభావంతో, హరిజనులు తమ పేర్ల చివర 'దండాసి' అన్న పదం పెట్టుకోవడం ఒక హుందాకు చిహ్నంగా మారిపోయింది.
***
***దండాసి నలభై ఏళ్ల క్రితం డైరీ నుండి:
"విద్య..." నాకు కూడా తెలియకుండా, నా జీవితంలోకి ప్రవేశించిన ఓ చిరుజల్లు. ఆమె నా జీవితంలోకి వచ్చిన క్షణం నుంచి, ప్రపంచం మొత్తం అద్భుతంగా కనిపించసాగింది.
మునసబు 'రాజారత్నం గారు మరణించి నెల కావస్తోంది. అందుకే మా ఊరికి కొత్త మునసబు అవసరమయ్యాడు. కొత్త మునసబు పెద్ద వీధిలో కొత్త డాబాలో దిగుతున్నారు. డాబా ముందు సామానుతో పాటు ఆయన భార్య, అందమైన కుమార్తె, ఇంకా బండినాయుడు వీరన్న కూడా ఉన్నారు. వారు సామానులు దించటానికి ఇబ్బంది పడుతున్నారు.
విద్యను నేను మొదటిసారి చూడటం. బంగారు రంగులో మెరుస్తూ, తెల్లరంగు వోని, చింతపిక్క రంగు జాకెట్ వేసుకుని, చూపు తిప్పుకోలేనంత అందంగా కనిపించింది. వయస్సు సుమారు పదిహేను పదహారు ఉండవచ్చు. అటు ఇటుగా నా వేయసే.
అటుగా వెళ్తున్న నాకు సహాయం చేయాలని అనిపించింది. కాని అది పెద్ద వీధి మాకు బాగా దూరమైన వీధి. కేవలం కొలతలోనే కాదు, సమాజంలో కూడ. మాది ఊరు చివర ఉండే బారిక వీధి . నా పేరు 'దండాసి'. మీకు ఈ పేరు కొత్తగా అనిపించొచ్చు. కానీ మా జాతిలో పేర్లు ఇలాగే ఉంటాయి.
"ఏయ్! కొద్దిగా సాయం చేయవా?", ఆమె పలికిన ఆ స్వరం వీణ నాదంలా అనిపించింది. వెళ్తనా? వద్దా? అనే సందిగ్ధతలో నిలిచిపోయాను. "ఓయ్ నిన్నే అబ్బాయి! కొద్దిగా సాయం చెయ్యి" - ఆమె తల్లి కూడా పిలిచారు. కాదనలేకపోయాను. ట్రంక్ పెట్టి చూపించారు. పెద్దింటి వారి డబ్బు దాచుకునే పెట్టి అది... కొంచెం భయంగా అనిపించినా తప్పలేదు. నేను, వీరన్న కలిసి ట్రంక్ పెట్టెను లోపలికి తీసుకెళ్లాము. తర్వాత మిగిలిన సామానూ సర్దాము.
ఎర్రగా, బుర్రగా ఉంగరాల జుట్టుతో ఉన్న నేను - మా వంశంలో తప్ప పుట్టానని అందరూ అంటారు. కొత్త మునసబు గారు నన్ను చూసి, "రాజుల పిల్లాడివా అబ్బాయీ నువ్వు?" అని అడిగారు. "చూస్తే తెలియటం లేదా పెద్దింటి బిడ్డ అని" విద్య తల్లి వత్తాసు పలికింది..
"నా పేరు విద్య. ఈ ఊరుకు కొత్తగా వచ్చాము" తేనె ఆకాశం నుండి చిన్న చిన్న గా చుక్కల్లా పడేట్లు మాట్లాడింది విద్య. "నీ పేరు? నీ గోత్రం? నీ కులం?" అడిగారు. విద్య అమ్మగారు. నేను మౌనంగా ఉండిపోయాను. "నీకే అబ్బాయి! నీ పేరు?" అని మరోసారి అడిగారు ఆమె.
"దండాసి" చెప్పాను. వెయ్యి ఉరుములు, పది వేల పిడుగులు ఒక్కసారిగా మీద పడినట్లైంది. విద్య, ఆమె అమ్మ, నాన్న దూరం జరిగారు. నన్ను "దూరం... దూరంగా వెళ్లు" అంటూ అరవటం మొదలుపెట్టారు.
నా అందం నా పేరుకు సరిపోలేదు. పదహారు సంవత్సరాలు నిండిన నేను, కండలు తిరిగిన శరీరంతో, తెల్లని ఛాయ, ఉంగరాల జుట్టుతో, ఆరు అడుగులు ఎత్తుతో వుంటాను. అన్ని బాగానే ఉన్నాయి ఒక్క "కులం" తప్ప.
"నిన్నే, దూరంగా జరుగు. లోపలికి ఎందుకు వచ్చావు?" ప్రశ్నించారు మునసబు గారు "నేను దూరంగానే ఉన్నాను. మీ అమ్మాయి స్వయంగా పిలిచారు. అదీ కాక వీరన్న సాయం చేయమన్నాడని వచ్చాను." ఈ మాటలు అనాలనుకున్నా అనలేకపోయాను. గొంతు దాటి ఆ మాటలు నోటి వరకు రాలేదు.
'పెద్దింటి వాళ్లకి జవాబు చెప్పకూడదు', 'తప్పు ఎవరు చేసినా మేమే చేసాము అని ఒప్పుకోవాలి', 'పెద్ద జాతి వారి ముందు తల ఎత్తకూడదు', 'నోరు విప్పకూడదు' ఇవన్నీ మా దళిత రాజ్యాంగంలో వ్రాసిన నియమాలు.
"నేనే పిలిచాను" చాలా మెల్లగా చెప్పింది విద్య. "పిలిచిందని వచ్చేయటమేనా? రానంటూ చెప్పాలి కదా!" అని విద్య వాళ్ళ అమ్మ గర్జిస్తున్నారు.
తప్పు ఎవరిదైనా క్షమించమని అడగాల్సింది మేమే. అది మా జాతి అనవాయితీ. "క్షమించండి" అని చెప్పి నేను అక్కడి నుంచి వచ్చేసాను. నేను వచ్చిన తర్వత అక్కడ ఏమి జరుగుతాదో కూడా ఊహించగలను. పాపాలు అన్ని ఒక్కసారిగా అంటుకున్నట్లు తలకు స్నానం చేస్తారు. పసుపు నీళ్ళను ఇల్లంతా జల్లుతారు.
అన్ని చేసినా కూడా 'ఊరులో అడుగు పెట్టాము, ఈ దరిద్రం ఎదురైంది.' అని నన్ను,నా జాతిని తక్కువగా చేసి మాట్లాడుకుంటారు. ఇది మా ఊరు చివర ఉన్న మా అందరికి అలవాటే.
కానీ నాకు ఒకటి అర్థం కాలేదు. 'దేవుడు, నన్ను మా జాతిలో పుట్టించాలని అనుకున్నప్పుడు అందం ఇవ్వకుండా ఉండవలసింది. లేకపోతే, నా లాంటి అందమైన వారిని పెద్దజాతిలో పుట్టే అవకాశం ఇవ్వాలి సింది.
మా ఊరులో ఉత్తర వైపు పెద్దింటి వారి వీధులు, దక్షిణ వైపు మా బారిక వీది. పెద్ద వీధి ముందు మంచినీటి బావి ఉంది అది పెద్ద జాతి వారికి త్రాగు నీరు కోసం మాకు మాత్రం మంచి నీరు కోసం చెరువు ఆధారం. అదే చెరువు తెల్లవారితే పెద్దింటి వారు కాలకృత్యాల కోసం, సాయంత్రం పశువుల్ని కడగటానికి వాడతారు.
పెద్ద వీధిలో మంచినీటి బావి నిత్యం వాడి నట్లు మేము అన్ని వేళల చెరువుకు వెళ్లి మంచి నీళ్ళు తేకూడదు. మేము నీళ్ళు తెచ్చుకునే సమయం ఉదయం నాలుగు నుండి అయిదు గంటల మధ్య, అత్యవసరం అయితే మధ్యాహ్నం రెండు నుంచి నాలుగు గంటల మధ్య మాత్రమే.
మరో విషయం మేము చెరువుకు వెళ్లేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. చెరువు దారి ఖాళీగా ఉందో లేదో చూసి వెళ్లాలి. పొరపాటున పెద్దింటి వాళ్లు ఆ సమయానికి వచ్చారంటే, మేము ఆగి వాళ్లు వెళ్లాకే వెళ్లాలి.ఇవి మా ఊరి కట్టుబాట్లు. చెరువు సంగతులు.
మా కాలకృత్యాలు, బట్టలు ఉతకడం, పందులు కడగడం, గిన్నెలు తోమడం, స్నానాలు ఇవన్నీ మా వీధి మురికి కాలువలోనే. అదే మాకు గంగమ్మ తల్లి.
*
పట్టణంలో నడుస్తుండగా.. దూరంగా విద్య కనిపించింది. ఒక్కతే ఉంది. పలకరించాలా? వద్దా? అనే ఆలోచనలో ఉన్నప్పుడు "జరిగిన అవమానం చాలదా?" అనుకుంటుండగా తానే నన్ను చూసి నవ్వింది.. అమ్మకు ఆరోగ్యం బాలేదు మందుల కోసం వచ్చాను చెప్పింది. కొద్దిసేపు ఇద్దరం కలసి నడిచాము, "దండు! ఆ రోజు జరిగిన దానికి క్షమాపణలు " అంది.
ఎప్పుడూ మేమే అందరికి క్షమాపణలు అడగాలి. కాని మొదటిసారి ఒక పెద్దజాతి అమ్మాయి క్షమాపణలు అడిగింది. విచిత్రంగా అనిపించింది. "అనవసరంగా ఆ రోజు నా కారణంగా తిట్లు కాసావు. నేనే పిలిచాను, పిలవకుండా వుండాల్సింది. నీకు నా మీద కోపం వచ్చి ఉంటుంది " అంది.
"ఇలాంటివి మాకు మామూలే," అన్నాను. "అది సరే. నన్ను ఏమని పిలిచావు?" అని అడిగాను.
"అంటే ...అంటే... నీ పేరు ... నీ పేరు సరిగా గుర్తు లేదు." నీళ్ళు నములుతూ అంది. నా పేరు నిజంగా గుర్తు లేదో... లేక ఆ పేరు నచ్చక ఇలా పేరు మార్చిందో, ఆ మాత్రం తెలుసుకోలేన ? ఈ పెద్ద జాతి వారు పేరు పెట్టి పిలవడం మాకు గొప్ప ,'ఒరేయ్... అరేయ్... అనకుండ' మనసులో అనుకున్నాను..
"అమ్మకు ఆయాసానికి మందులు తీసుకెళ్లాలి. నాకు ఈ ఊరు కొత్త. నాకు సాయంగా ఉండు," అంది విద్య, "ఒక్క ట్రంక్ పెట్టెకు రెండు బకెట్లు నీళ్ళు స్నానం చేశావు. నాతో ఊరంతా తిరిగితే మీ నాన్నగారు చెరువును మీ ఇంట్లో పెట్టించేస్తారేమో!" అన్నాను. గట్టిగా నవ్వింది. పనులన్నీ పూర్తయ్యాక మళ్లీ మా ఊరు చేరుకున్నాం.
చాలాకాలమైంది. సాయంత్రం స్కూలు వైపుగా నడుస్తున్నాను. దూరంగా విద్య కనిపించింది. తన స్నేహితులతో కలిసి వస్తోంది. నన్ను చూసింది... ఒక్కసారే కాదు మూడు, నాలుగు సార్లు వెనక్కి తిరిగి చూసింది. ఆ క్షణాలే నాకు అద్భుతం లా అనిపించాయి.
రోజులు గడుస్తున్నాయి. జ్ఞాపకాలు మాత్రం నన్ను వదలడం లేదు. ఉదయం ఎనిమిది అయింది. విద్య కోసం పెద్ద వీధి వైపు నడిచాను. వాళ ఇంటి దగ్గరకి రాగానే గుండె వేగం పెరిగిపోయింది. ఆశ్చర్యంగా ఆ గుమ్మం దగ్గరే నాకోసం ఎదురు చూస్తున్నట్లు విద్య నిలబడి ఉంది. నన్ను చూసి ఆనందంగా నవ్వింది.
ఆమె లోపలికి వెళ్లి, మళ్లీ బయటకు వచ్చింది. మళ్లీ లోపలకి వెళ్లింది. ఇలా రెండు మూడు సార్లు చేసింది. నవ్వుతూ, నా వైపు చూస్తూ...
నెల రోజులు దాటాయి. మనసు చంపుకోలేకపోతున్నాను. ఎదురుచూసిన రోజు వచ్చేసింది. వాళ్లింటి నుండి బండికర్రలు కొట్టేందుకు పిలుపు వచ్చింది. ఆ పని చేస్తే అయిదు రూపాయల పాటు, ఒక పూట భోజనం, కూర, చారు, బియ్యం ఇస్తారు. ఈ అవకాశం తోనైనా మరోసారి విద్యను చూడగలుగుతాను.
విద్య కొబ్బరి పెంకు లో టీ వేసి నాకు ఇచ్చింది. మా చిన్న జాతుల వారికి వారు ఇచ్చే టీ, నీళ్లు... అందులోనే ఇస్తారు. అన్నం తినాల్సి వస్తే, టేకు చెట్టు ఆకు తెచ్చుకోవాలి. విద్య నా దగ్గరకి వచ్చి "నువ్వంటే నాకు ఇష్టం!" అని మెల్లగా చెప్పి ఇంట్లోకి పరుగెత్తి వెళ్లిపోయింది. ఆరోజు నాకు అన్ని పండగలు ఒక్కసారి వచ్చినట్టు అనిపించింది.
రోజులు గడుస్తున్నాయి. కానీ ఈ మధ్యగా ఆమెను చూసే భాగ్యం దక్కడం లేదు. రాత్రిళ్లు నిద్ర పట్టడం లేదు. పగలు ఆకలి వేయడం లేదు. ఎవరితోను మాట్లాడడం లేదు. విద్య... విద్య... విద్య... నా మనసంతా ఆమెతోనే నిండిపోయింది.
ఒక రోజు నాయుడు ఇంటి నుండి కబురు వచ్చింది. విద్య ఇంటి పక్క ఇల్లు నాయుడు ఇల్లు. ఆ ఇంటికి ఆనుకుని ఉన్న మురికి కాలువ నిలిచిపోయింది. శుభ్రం చేయాల్సిన పని మా జాతిదే. నాకు వెళ్లాలనిపించలేదు. మా వీధిలో ఉన్న నా అన్న వరస, నా మిత్రుడు భీమ్ ను వెళ్లమన్నాను. వాడు వెళ్లేప్పుడు విద్య గురించి చెప్పాను.
వాడు కోపంగా "నీకు మతి పోయిందా దండాసీ!? అంత పెద్దజాతి అమ్మాయి కావాలనుకుంటున్నావా? ఊర్లో ఈ విషయం బయటపడితే గుండు గీసి, పిండి చుక్కలు వేసి ఊరేగిస్తారు. గుర్తులేదా? మన గిరి చావు, వాడి తప్పు లేకపోయినా వాడికి, మన జాతికి జరిగిన అవమానం. ఇంకా సిగ్గు రాలేదా నీకు?" అన్నాడు బిగ్గరగా అరుస్తూ.
'గిరి' మా వీధిలో అందగాడు. వాడి వెంట వంద ఎకరాల భూస్వామి 'రాజా రామయ్య' కూతురు 'జాబిలి' తిరిగేది. వాడు తన కులం, పరిస్థితి స్పష్టంగా చెప్పినా, ఆమె వదల్లేదు. చివరికి ఈ విషయం పెద్దలకు తెలిసిపోయి, ఊరి మధ్యలో గుండు గీయించి, పిండి చుక్కలు వేసి, వాడిని ఊరేగించారు. తర్వాత వాడు ఆత్మహత్య చేసుకున్నాడు.
"ఏమిటి అలోచిస్తున్నావు దండాసి? అందమైన పిల్ల కావాలి అనుకుంటే, నా చిట్టిని చేసుకో అంతే కాని గిరి లాగ ప్రాణాలు మీదకు తెచ్చుకోవద్దు" అన్నాడు భీమ్. అది మామూలు మాట కాదు త్యాగముతో కూడిన హెచ్చరిక. పెద్దింటి వారి పట్ల మాకు ఉన్న భయం.... చిట్టి భీమ్ కి కాబోయే భార్య.
పక్షం రోజులు గడిచాయి. మా ఇంటి చింత చెట్టు నీడన నులక మంచం మీద పడుకున్నాను. దూరంగ రోడ్డు మీద విద్య నా వైపు చూసి రమ్మన్నట్లుగా సైగ చేసింది. "దండు! నిన్ను వదలి ఉండలేక పోతున్నాను. అందుకే దైర్యం చేసి ఇటు వచ్చాను. నువ్వంటే నాకు ఇష్టం దండు! నువ్వు నన్ను పెళ్ళి చేసుకో. ఇద్దరము దూరంగా వెళ్ళిపొదాము" అంది విద్య.
"నాకు అలానే ఉంది విద్య! మనిద్దరం ఒకరి కోసం ఒకరు పుట్టాము. కానీ నువ్వు పెద్దింటి అమ్మాయివి, నేను ఊరు చివర బారికను" అన్నాను. "నువ్వేమి చెప్పకు. నీ జాతి, కులం నాకు అనవసరం. నేను నీకు కావాలి, నాకు నువ్వు కావాలి అంతే. ఒకవేళ చావు వచ్చినా ఇద్దరము కలిసే చనిపొదాము దండు!" అంది.
ఇది జరిగి వారము దాటింది. బ్రాహ్మణ వీది నుండి నాకు కబురు వచ్చింది మేము ఎప్పుడు ఆ వీధి వెళ్ళం, వెళ్ళకూడదు వెళ్తే వాళ్లు మమ్మల్ని చూసి శుచి, శుభ్రం అని నానా హంగామా చేసి స్నానాలు చేస్తారు, శుచి పూజ చేస్తారు.
మేము తప్పనిసరి అయి వెళ్ళాము అంటే అర్ధం వాళ్ల వీధి లో ఎవరో ఒకరు చనిపోయారు అని. అపుడు మేము శవపేటిక ఏర్పాట్లు, కుండ తెచ్చి ఇవ్వటం శవాన్ని దహనం చేసే పనులు వంటి కార్యక్రమాలుకు ఉపయోగ పడతాము.
సమాజంలో మాకు శూద్రులు అంటారు. మేము చావులకు కాటి కాపరిగా. ఊర్లో దండోరా లు వేయటానికి, మురికి కాలువలు శుబ్రం చేయటానికి, కర్రలు కొట్టడానికి, చెప్పులు కుట్టడానికి, చెత్తలు తీయటానికి, మల మూత్రాలు శుభ్రం చేయటానికి ఉపయోగ పడతాము. ఇంకా జాతరలో పులి వేషాలు, అగ్గి లో దూకటం, గారిడీలు చేయటం వంటివి కూడ మా పనులే.
నాకు ఎప్పుడు ఒక ప్రశ్న మదిలో ఉంటుంది. కాటి కాపరిగా మేమే లేక పోతే శవం ఎవరు తగల పెడతారు? చెప్పులు మేము కుట్టకపోతే వాళ్ళే కుట్టుకునే వారు కదా? కాలువ శుభ్రం చేయుటకు మేము వెళ్లకపోతే వాళ్ళే చేసుకుందురు కదా? ఇంకా మేము మల మూత్రాలు శుభ్రం చేయకపోతే వాళ్ళ ఆడవారు వాటిని శుభ్రం చేసి ఉండేవారు కదా? ఇవన్ని ఆలోచిస్తే జాతి భేదం ఎంత నీచమైనది అనిపిస్తుంది.
భీమ్ పెల్లి దగ్గర అవుతోంది. మా వీధిలో పండగ వాతావరణం వచ్చేసింది. అందరం రోజు సరదాగా ఇప్ప సారా తాగుతున్నము, పంది మాంసం రోజు తింటున్నాము, ఇంకా వీది వేషాలు, రంగులు పులుము కోవటం చేస్తున్నాము. రాబోయే ఆదివారం భీమ్ చిట్టిల పెళ్లి. మా వీధి అందరం ఎదురు చూస్తున్న పెళ్లి. అన్ని ముందు నుంచి ప్లాన్ చేసుకున్నాము. కాని అందరం అనుకున్నట్లు జరిగితే మేము బారిక వీధి వాళ్ళం ఎందుకు అవుతాము !?
ఎండాకాలం ఆ రోజు మధ్యాహ్నం మూడున్నర అయ్యింది. చిట్టి చెరువుకు మంచి నీళ్లు తేవడానికి వెళ్లింది. అదే సమయంలో ఊరి మునసబు కూడా చెరువుకి వచ్చాడు. చెరువు వద్ద నిర్మానుష్యం కావడంతో అక్కడ ఎవరూ లేరు. కేవలం మునసబు, చిట్టి మాత్రమే.
"ఏయ్ మాల పిల్ల ఆగు!" అని పిలిచాడు మునసబు. చిట్టి ఆగింది. ఆగకపోతే పంచాయితీ పెడతారు. కావాలని చిట్టి ఎదురు వచ్చింది అని తీర్మానం చెప్తారు ఆపై నానా హంగామా చేసి కొరడా దెబ్బలు కొడతారు. అందుకే చిట్టి పరుగు పెట్టకుండా ఆగింది.
"ఏయ్ మాల పిల్ల!ఈ వాణి నా కూతురు విద్యది కదా!? దాన్ని ఎప్పుడు దొంగిలించావు?" అంటూ వాణిని లాగి పారేసాడు. సిగ్గుతో చేతులు కప్పుకుంది చిట్టి. "ఇది కూడా నా ఆవిడ జాకెట్ కదా?" అంటూ జాకెట్ను చింపేసాడు. కొద్ది సేపటికి చిట్టిని చింతచెట్టు వెనుకకి లాక్కెళ్లాడు.
చిట్టి వాళ్ళ అమ్మకి అంతా చెప్పింది. మరునాటి ఉదయం మా వీధి మురికికాలవలో చిట్టి శవం కనిపించింది. భీమ్ గుండె పగలిపోయినట్టు వెక్కి వెక్కి ఏడ్చాడు. మా వీధి వీధి అంతా దుఃఖంలో మునిగిపోయాము.
మరుసటి రోజు భీమ్ నా దగ్గరికి తాగి వచ్చాడు. "దండాసీ! నువ్వు ఆ పెద్దింటి విద్యని చేసుకోవాలి. నా బ్రతుకు నాశనము చేసిన వాళ్ల పిల్లలకు మన జాతి కోసం తెలియాలి.." ఆవేశంగా అంటూ ఏడ్చాడు.
వారం తర్వాత మునసబు ఇంటి నుంచి కబురు వచ్చింది. మా బారిక వీధి నుండి నలుగురం వెళ్లాం. "అయిందేదో అయిపోయింది. మీ వీధిలో భోజనాలకు, పంది మాంసానికి, ఇప్ప సారాకు ఈ ఐదు వేల రూపాయలు ఉంచండి" అన్నారు పెద్దలు.
బయటకి వస్తున్న భీమ్ ను పిలిచి "ఒరే బారిక! రేపు మంగళవారం దండోరా వేయాలి. ఇక నుండి చెరువు వైపు బారిక వీధివాళ్లు ఎవ్వరూ రాకూడదు. మంచి నీళ్లకు వీధి ముందు మురికికాలవనే వాడాలి." అన్నాడు మునసబు.
"సరే" అన్నాడు భీమ్. మంగళవారం ఉదయం, ఊరంతా తిరుగుతూ భీమ్ దండోరా వేశాడు "ఇందుమూలంగా, ఏవన్ ప్రజానీకానికి తెలియచేయునది ఏమనగా ఊరులో ఉన్న పెద్ద చెరువు కేవలం నాలుగు వీధుల వారికి మాత్రమే. ఇకనుండి బారిక వీధివారు ఈ బావిని వాడరాదు. ఒకవేళ పొరపాటున వాడితే, ఊరి మధ్యలో గుండు గీసి, పిండి చుక్కలు వేసి, గాడిద మీద ఊరేగిస్తారు. ఇది ఊరి పెద్దల ఆజ్ఞ అని తెలియ చేయడమైనది అహో" ప్రతి ఐదు అడుగులకు ఒకసారి, అరుస్తూ, ఊరంతా దండోరా వేసి ఇంటికి చేరుకున్నాడు భీమ్.
నాకు ఒక్క విషయం అర్థం కాలేదు. "మేము అంటరానివాళ్లము అయినపుడు మా చిట్టి మాత్రం అంటరానిది కాలేదా? దాని మానం అంటరానిది కాదా? అప్పుడు మా జాతి గుర్తుకు రాలేదా?" ఇది ఎన్నటికీ అర్ధంకాని ప్రశ్న.
***
కాలం గడుస్తుంది. దండాసికి మునసబు ఇంటి నుంచి కబురు వచ్చింది. మునసబు ఇంట్లో పూజ కోసం తోటలో కొబ్బరి కాయలు దించాలి అని కబురు చెప్పారు. ఉదయము తాడు, కత్తితో దండాసి తోటవైపు నడిచాడు. పది ఎకరాల దట్టమైన తోట, ఊరుకి అర కిలోమీటరు దూరంలో, పెద్దగా సంచారం లేని ప్రదేశం.
చెట్టు ఎక్కబోతున్న దండాసికి, "దండు! దండు!" అన్న పిలుపుతో. తల తిప్పి చూశాడు. విద్య.. అతని విద్య..పరిగెత్తుకుంటూ వస్తోంది. ఆమె బాగా దగ్గరకు వచ్చింది. బాగా దగ్గర అంటే ఇద్దరూ ముద్దుపెట్టుకునేంత దగ్గరగా... ఒకరినొకరు కౌగిలించుకునేంత దగ్గరగా... ఇంకా చెప్పాలంటే.. తనను ఏమైనా చేసేంత దగ్గరగా వచ్చింది.
విద్య దండాసిని గట్టిగా కౌగిలించుకుంది. ఆ సమయంలో దూరం నుండి మునసబు వస్తున్నాడన్న విషయం వారిద్దరికీ తెలియలేదు. అతను పరిగెత్తుకుంటూ వస్తూ ఛీ నీ బతుకు! నీకు ఆ బారికోడు కావాలిసి వచ్చాడా? నిండా పదిహేను ఏళ్లు కూడా లేవు, అప్పుడే మొగుడు కావలసి వచ్చాడా? సిగ్గు, లజ్జ లేదే? కులానికి, మాకు చెడ్డుపెట్టావు కదే!" దూరం నుండి పరిగెత్తు కుంటు వచ్చి కింద ఉన్న కొబ్బరి కాయలు కొట్టే కత్తి తీసి విద్య ను వెనుక నుండి గట్టిగా పొడిచాడు మునసబు.
ఆమె కళ్ళు మూతలు పడుతున్నాయి. చివరి శ్వాసలో తండ్రి వైపు చూసి "నాన్న! మరి చిట్టి కూడ బారిక పిల్ల కదా? దాని మానం కూడా బారిక వీధి మానం కదా? అప్పుడేమైంది నాన్న?..." అరుస్తూ కుప్పకూలింది.
ఆమె శరీరాన్ని ఒడిలోకి తీసుకున్నాడు దండాసి. ఆమె ముఖం వైపు చూస్తూ "పరువు హత్య మీ నాన్న చేశాడు. నా ప్రాణహత్య నీ కోసం నేను చేసుకుంటున్నాను." అని ఆ కత్తినే తీసుకుని తన పొట్టలో పొడుచుకున్నాడు.
భీమ్ పరిగెత్తుకుంటూ వచ్చాడు. వాడితో పాటు నలుగురు యువకులు ఉన్నారు. వారంతా దండాసిని ఒడిలోకి తీసుకున్నారు. "దండాసీ!" అంటూ ఏడుస్తూ అరుస్తున్నారు. "ఒరే! మన చిట్టిని పాడుచేసిన మునసబు... ఇప్పుడు మన దండాసినీ, వాడు ప్రేమించిన విద్యనూ నరికేశాడు. వాడిని వదలకూడదు. చంపేయాలి పదండి.. పదండి" అంటూ భీమ్ అరవసాగాడు.
దండాసి వారిని ఆపాడు తానే ఆత్మ హత్య చేసుకున్నాడని చెప్పాడు. భీం తో "హత్య చేస్తే హంతకుడు అవుతావు" అని వారించి భీమ్ ఏమి చేయాలనేది వివరించి చెప్పాడు.
అతడి మాటలతో భీమ్ వెనక్కి తగ్గాడు. భీమ్ ఊరిని వదిలి విశాఖపట్నం చేరాడు. అక్కడ జాలారి వీధిలో భర్త చనిపోయిన రంగవ్వ ఇంట్లో ఆశ్రయం తీసుకున్నాడు. ఆమెను పెళ్లి చేసుకున్నాడు. భీమ్ మరియు రంగవ్వ పుత్రుడే 'కర్ణ దండాసి'.
***
సభ ముగిసింది. NCSC చైర్మన్ కర్ణ దండాసి ఇళ్ల పట్టాలు పంపిణీ చేయడానికి వేదిక దిగుతున్న క్షణం... ఒక ఎనభై ఐదు సంవత్సరాల వృద్ధుడు ఆయన కాళ్ళ వద్ద పడి క్షమాపణలు కోరుతూ ప్రాధేయ పడుతున్నాడు. కర్ణ దండాసి రెండు చేతులతో ఆయనను లేవనెత్తాడు.
ఆయన గురించి ఊరు పెద్దలు వివరించారు "ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ధనుంజయ గారు ప్రాయశ్చిత్తంతో కుమిలి పోతున్నారని, జైలు నుండి విడుదలయ్యాక హరిజనవాడను దత్తత తీసుకుని స్కూల్లు, రోడ్లు నిర్మించారని తన మొత్తం పొలాన్ని హరిజన సంక్షేమం కోసం కేటాయించారని వివరించారు.
బాబాయ్ వరుస అయిన దండాసి ఇంటికి వెళ్ళాడు కర్ణ దండాసి. 'తను ఇంతవాడిని కావటానికి కారణము బాబాయ్ అని, చనిపోయేముందు నాన్న భీమ్ కు చెప్పిన హితబోధ వలనే నేను ఇంతవాడిని అయ్యేందుకు దోహద పడింది అని, తండ్రి ప్రతి రోజు ఇక్కడ జరిగిన బాబాయ్ కధ గుర్తు చేస్తూ తనను చదివించారని' చెప్పాడు. అక్కడ నుండి తన తాతయ్య (భీమ్ తండ్రి), నానమ్మలు వుండే ఇంటి దగ్గరకు వెళ్ళి పెద్దల ఆశీర్వాదం తీసుకున్నాడు.
ఆ రోజు రాత్రి ఆ వూరులోనే బస చేసాడు. ఊరుకు పెద్ద మనుషులు వస్తె ఊరు పెద్దలు వారి ఇంటికి పిలిచి ధావత్ ఇస్తారు, కానీ ఆ రోజు ఊరు పెద్దలు తో పాటు ఆ ఊరి మాజీ మునసబు ధనుంజయ కర్ణ దండాసి ఇంటికి వచ్చి ఆయన ప్రక్కనే కూర్చోని విందు ఆరగించాడు. ఆ రాత్రి ఊరు ఊరంతా పండగ చేసుకున్నారు.
***