జుట్టు

విశాఖ సంస్కృతి • 01 Dec 2025 • 👁 4 views
జుట్టు:

" బూచోడులా వున్నావు గడ్డం గీయించుకో!” అని అరిచింది అమ్మ. అమ్మ బూచాడిని చూసిందా? అసలు బుచోడుకు గడ్డం వుంటుందా? తెలియక బుర్ర గోక్కుంటూ, 'ప్రతి గడ్డం వెనుక అమ్మాయి ఉన్నట్లే, ప్రతి క్లీన్ షేవ్ వెనుక అమ్మ ఉంటుంది' అనుకుంటూ సెలూన్ షాప్ కు వెళ్ళి గడ్డం అయిన తర్వాత ఇంటికి చేరాడు నారాయణ రావు.
"అదేంటి వదినా! నేను ఆవిడతో చెప్పొద్దు అని నీతో చెప్పిన విషయాన్ని నువ్వు ఆవిడతో చెప్పావని ఆవిడ నాతో చెప్పింది” అంది సూర్యుడు అత్త. "అది కాదు వదిన! నేను ఆవిడతో చెప్పినట్లు నీతో చెప్పొద్దని ఆవిడతో చెప్పానే “జవాబుగా అంది అమ్మ సూరమ్మ. "సరే పోనీలే వదిన! ఎవర్ని అని ఏమి లాభం ఆవిడ నాతో చెప్పిందని నేను నీతో చెప్పినట్లు నువ్వు మళ్ళీ ఆవిడతో చెప్పకు" అంది తిరిగి సూర్యడు అత్త.
వారి మాటలు అర్ధం కాక మరోసారి బుర్ర గోక్కుంటూ ఇంటి లోనకు వెళ్తున్న నారాయణ రావుకు “ఇదుగో అల్లుడా ! పైన జుట్టు ఊడుతుంది, క్రింద పొట్ట పెరుగుతుంది. వేగరం నా కూతురు భువన మనోహరిని పెళ్ళి చేసుకో. కండక్టర్ ఉద్యోగంకు కలెక్టర్ సంబంధం వస్తాదా ఏమిటి? నా కూతురికి పొడవాటి జుట్టు కూడా ఉంది" సూరమ్మ వదిన చెవ్వు లో చెప్పిన జుట్టు కోసం ఉచిత సలహాను జోడిస్తూ చెప్పింది సూర్యుడు అత్త.
'తన చుట్టూ ఆడవారు, తన చేతిలో సంచి నిండా డబ్బులు, పెద్ద వాహనం ఉండే ఉద్యోగం ' కావాలని, పొడవాటి జుట్టు వున్న అమ్మాయి భార్యగా రావాలని దేవుడుకు మొక్కేవాడు. దేవుడుకు ఎలా అర్ధమయిందో తథాస్తు! అనడంతో కండక్టర్ ఉద్యోగం వచ్చింది. నిజానికి కండక్టర్ ఉద్యోగం తనకు కూడా ఇష్టం లేదు.
బస్సులో చిత్ర విచిత్రమైన ప్యాసింజర్స్ వస్తుంటారు. మొన్నటికి మొన్న బస్సులో సీటు కోసం ఇద్దరు ఆడవారు కొట్లాడుకుంటున్నారు.“ గొడవ జరుగుతున్నపుడు వూరికే అలా నిల్చోకండి..... కూర్చోండి ...వెనక వున్న వారికి కనిపించదు" వెనుక వున్న భువన మనోహరి పొడవాటి జుట్టు ముందుకు వేసుకుని జుట్టును చేతితో రింగులు తిప్పుతూ తీయటి గొంతుతో అంది.
"ఎవరు వయసుకి పెద్ద వారో వారు కూర్చోండి, ఇంకొకరు నిల్చోండి "సమస్యకు పరిష్కారం కనిపెట్టా అన్నట్లు భువన మనోహరి వైపు గర్వంగా చూసాడు, బస్సు దిగిన వరకు సీటు ఖాళీగా ఉంది తప్ప ఇద్దరూ కూర్చోలేదు. ఎందుకో అర్థమయి చావలేదు నారాయణ రావుకు.
పెద్ద జడతో తన వైపు చూస్తున్న భువన మనోహరికి 'ప్రేమిస్తున్నాను' అని బస్సులోనే చెప్పేశాడు.
' అదేంటో అమ్మాయిలు గుడ్ మార్నింగ్ చెప్తే గుడ్ మార్నింగ్ చెప్తారు కాని, ఐ లవ్ యు చెప్తే మాత్రం ఐ లవ్ యు చెప్పరు' తిట్టుకున్నాడు నారాయణ రావు.
భువన మనోహరిని పెళ్ళి చేసుకున్నాక, ప్రక్క ఊరులో వేలు విడిచిన మేనత్త అలివేలు ఇంటికి బయల్దేరారు ఇద్దరు. స్కూటర్ మీద వెళ్తుంటే బండిలో పెట్రోలు అయిపోయింది. తన బండి మైలేజ్ రాదు. ' పెట్రోల్ డీజల్ ధరలు తగ్గించకపోతే తగ్గించక పోయారు, కనీసం కిలో మీటరు రాళ్ళు దగ్గర పెట్టిన సరిపోయేది మైలేజ్ వస్తుందని తృప్తి అయినా ఉండేది ' గొణుగుకున్నాడు నారాయణ రావు. భార్య మరుచటి రోజు వస్తానంటే అక్కడే వదిలి వచ్చాడు.
మరుచటి రోజు ఫోన్ చేసి "నేను వస్తున్నాను. మీరు తొందరగా ఇంటికి వెళితే బట్టలు వుతకండి, లేకపోతే నేను ఉతుకుతాను” అంది. ఆమె అన్నది అర్థమయి అర్ధం కానట్టు ఉండి మరోసారి బుర్ర గోక్కున్నాడు నారాయణ రావు.
పెళ్ళి అయి సంవత్సరము అయింది. ఆ రోజు రాత్రి ఏకాంతంలో "భువన మనోహరి! నువ్వే అందం అనుకుంటే పిరుదులు దాటి వున్న నీ పొడవాటి నల్లని, నిగనిగలాడే నీ జుట్టు ఇంకా అందంగా ఉంది. ఇంత అందమైన మెరుస్తున్న జుట్టు రహస్యం ఏమిటి?" అడిగాడు ప్రేమగా.
“ఏముంది! ప్రతి రోజూ ఉదయం షాంపూతో తలస్నానం చేస్తాను. సాయంత్రం స్వచ్చమైన కొబ్బరి నూనెతో మర్దన చేస్తాను. మీరు వెళ్ళిన తరువాత జుట్టు (విగ్గు) తీసి గోడకు ఉండే కొక్కికి తగిలిస్తాను" చెప్తూ నాలుక కరుచుకుంది భువన మనోహరి.
" నారాయణ ! జుట్టు పట్టుకుని కొట్టటం మన ఇంటవంట లేదు. ఎక్కడ అయిన కొట్టుకో కాని జుట్టు పట్టుకొని కొట్టవద్దు " అని అమ్మ సూరమ్మ ఎందుకు తరచు అనేదో ఇప్పుడు అర్ధమయింది.
ఇదుగో అల్లుడు! భువనమనోహరికి చిన్నపుడు జుట్టు ఇస్తాము అని మొక్కాము. ఆ మొక్కు ఇప్పటికీ తీరలేదు. అందుచేత ఎక్కడ చేయి వేసిన ఫర్లేదు జుట్టు మీద మాత్రం చేయి వేయకు" అని సూర్యుడు అత్త ఎందుకు అన్నది అర్థమయింది.
భార్యను పుట్టింటికి ఏ నెపంతో పంపించాలని ఆలోచిస్తున్న నారాయణ రావుకు సరి అయిన కారణము దొరికింది.
******