*కథ : అమ్మాయి నచ్చింది*
*రచన : సూర్య గండ్రకోట*
(*17.08.2014 ఈనాడు ఆదివారం అనుబంధం సంచికలో ప్రచురింపబడిన కథ*)
_____________________________
“రండి రండి” అంటూ సాదరంగా ఆహ్వానించాడు ఏకాంబరం. కార్లోంచి దిగి, ముందుగా తన మేనత్త నడుస్తుండగా ఆమె వెనకే లోపలికి నడిచాడు చంద్రం తన తండ్రితో కలిసి.
విశాలమైన హాలు, మధ్యలో ఆకర్షణీయమైన సోఫాసెట్టుతో చాలా అందంగా అలంకరించి ఉంది. కిటికీలకు ఉన్న కర్టెన్లు ఆ అందాన్ని ద్విగుణీకృతం చేస్తున్నాయి. గోడలకు వేసిన రంగులు ఎంతో ఆహ్లాదకరంగా ఉండి, ఆ హాలును చూసిన వారెవరైనా ‘ఆహా’ అనుకునేంత అద్భుతంగా ఉంది.
అందరూ సోఫాల్లో కూర్చున్నాక ఏకాంబరరావు సైగ చేయడంతో ఆయన పెద్దకూతురు సూర్యకళ ప్లేట్లలో పకోడీ సర్వ్ చేసింది.
“ఇవన్నీ ఏమీ వద్దండీ. గతికితే అతకదనే సామెత మీకు తెలియంది కాదు. మీ అమ్మాయిని చూపించండి చాలు” అంది చంద్రం మేనత్త.
“ఫర్వాలేదమ్మా, టిఫిన్ చేస్తే తప్పేమీ కాదు, తీసుకోండి. అమ్మాయి రెడీ అవుతోంది” అన్నాడాయన. అయినా ఎవరూ ఆ టిఫిన్ ప్లేట్లవైపు కన్నెత్తి చూడలేదు. చంద్రం తండ్రయితే ఇదంతా తనకేం పట్టనట్లు ఓ పక్కకు తిరిగి కూర్చున్నాడు. వాళ్ళు టిఫిన్ చేయనందుకు నొచ్చుకున్న ఏకాంబరరావు తన పెద్దకూతురు తెచ్చిన కాఫీ అందిస్తూ “కనీసం కాఫీ అయినా తీసుకోండి” అన్నాడు.
మౌనంగా అందరూ కాఫీ అందుకున్నారు. చంద్రం మేనత్త ఉపోద్ఘాతంలా మొదలుపెట్టింది ”మా మేనల్లుడు కడిగిన ముత్యమేననుకోండీ. బుద్ధిమంతుడూ, యోగ్యుడూ. చక్కగా ఉద్యోగం చేసుకుంటున్నాడు. వాడి తల్లి పోవటం మూలాన పెళ్ళి కొంచెం ఆలస్యం అయింది. మా వదినే ఉంటే ఈ తంతు ఎప్పుడో జరిగిపోయి ఉండేది. ఇక, మా అన్నయ్యకైతే ఏదీ పట్టదనుకోండి. వీడి పెళ్ళి అయితే మా బాధ్యత తీరిపోతుంది.” అంది. చంద్రం మౌనంగా కూర్చున్నాడు. అతని తండ్రి మాత్రం చెల్లెలికేసి ఓసారి కోపంగా చూసి తల తిప్పుకున్నాడు.
చంద్రం తల్లి చనిపోయాక మేనత్త అతనికి అండగా నిలిచింది. ‘ఒక ఆడదిక్కు లేకపోతే సంసారం సాగదని’ తన భర్తా బిడ్డలతో పోరాడి, చంద్రం బాధ్యత నెత్తిన వేసుకుంది. ఆమెకే కూతుళ్ళుంటే ఈ బాధ ఉండేదికాదు. కానీ, ఇద్దరూ కొడుకులే అవటంతో చంద్రానికి బయటి సంబంధం చూడాల్సి వచ్చింది.
కాఫీ తాగటం అయిపోయిన కొద్దిసేపటికి ఏకాంబరరావు భార్య తన రెండోకూతురి అలంకరణ పూర్తిచేసి హాల్లోకి తీసుకొచ్చింది. తోడుగా ఆమె పెద్దకూతురు సూర్యకళ కూడా వచ్చి ఓ పక్కగా నిలబడింది.
సోఫాలో తన ఎదురుగా కూర్చున్న అమ్మాయితో “నీ పేరేంటమ్మా?” అనడిగింది చంద్రం మేనత్త.
“చంద్రకళండీ” అందా అమ్మాయి. ఆ అమ్మాయి గొంతులో సప్తస్వరాలు వినిపించాయి చంద్రానికి. ఎంతో ఒద్దికగా ఉన్న ఆ అమ్మాయిని చూసి చంద్రం మేనత్త ముచ్చటపడింది. తన మేనల్లుడికి తగిన జోడీ ఈ అమ్మాయేనని తీర్మానించేసుకుంది మనసులో.
చంద్రం ఆ అమ్మాయిని కొన్ని ప్రశ్నలు వేశాడు. అన్నింటికీ చంద్రకళ చక్కగా సమాధానాలిచ్చింది. ఆమెను కూడా ఏమైనా అడగమని చంద్రం మేనత్త చెప్పినా ఆమె ఏమీ అడగకుండా నవ్వి వూరుకుంది.
మొత్తానికి చంద్రానికి కూడా చంద్రకళ తెగ నచ్చేసింది.
“మిగతా విషయాలన్నీ వచ్చే ఆదివారం మాట్లాడుకుందాం. మీరు మా ఇంటికొస్తే మా ఇల్లూ చూసినట్లుంటుంది. మాట్లాడినట్లూ ఉంటుంది” అంది చంద్రం మేనత్త.
“తప్పకుండా వస్తామండీ” అన్నాడు ఏకాంబరరావు. వాళ్ళకి అమ్మాయి నచ్చిందని వాళ్ళ ముఖాలే చెప్తున్నాయి. ఆయన చాలా తృప్తి చెందాడు.
“మరి మేమిక వస్తామండీ” అంటూ చంద్రం లేవటంతో అందరూ లేచారు. వాళ్ళకు ఏకాంబరరావు కుటుంబం వీడ్కోలు పలికింది.
చంద్రం తండ్రి ఏదో ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేసేవాడు. తనకు వచ్చే చాలీచాలని జీతంతోటే ఎలాగో సంసారాన్ని లాక్కొచ్చాడు. కష్టపడి చదివిన చంద్రానికి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చాక వాళ్ళ ఆర్థిక పరిస్థితి చక్కబడింది. ఈలోగా అనుకోకుండా చంద్రం తల్లికి గుండెజబ్బు చేసింది. ఆమెను బతికించుకోవటం కోసం ఆ తండ్రీకొడుకులు చేయని ప్రయత్నమంటూ లేదు. కానీ లాభంలేకపోయింది. గుండెపోటుతో ఆమె మరణించింది. చంద్రం తండ్రి తన భార్య మరణాన్ని తట్టుకోలేకపోయాడు. చంద్రం మేనత్త రాకతో ఆ కుటుంబం కొంతవరకూ తేరుకుంది.
ఇంటికొచ్చిన చంద్రం ఆలోచించటం మొదలుపెట్టాడు. తను క్రితం నెల చూసిన సంబంధం కూడా బాగానే ఉంది. అమ్మాయి అందగత్తే. కాకపోతే పెళ్లిచూపుల్లో ఆమె తల్లిదండ్రులు కాకుండా ఆమే ఎక్కువగా మాట్లాడింది. తన గురించీ, తన కుటుంబం గురించీ చెప్పింది. ఆర్ధికంగా అంతగాలేని ఆ కుటుంబం నుంచి ఆ పిల్లను తెచ్చుకోవటానికి చంద్రం మేనత్త ససేమిరా అంది.
“పెద్దగా పెట్టుపోతలు పెట్టేవాళ్ళు కారు. పోనీలే, సంబంధం మంచిది అనుకుందామంటే ఆ అమ్మాయి మాటలు చూస్తే నాకెందుకో నచ్చలేదురా చంద్రం. ఏదో ఆదర్శాలు వల్లెవేసింది. సిద్ధాంతాలు మాట్లాడింది. మనకి సౌమ్యంగా, సంసార పక్షంగా ఉండి, సర్దుకునిపోయే అమ్మాయి కావాలి కానీ ఈ ఆదర్శాలూ, ఆవకాయబద్దలంటూ తిరిగేవాళ్ళు వద్దురా అబ్బాయ్” అంటూ తన నిర్ణయాన్ని ఖండితంగా చెప్పేసిందావిడ.
ఆమె మాటను కాదనటానికి చంద్రానికి పెద్దగా అభ్యంతరమేమీ లేకపోయింది. కానీ, వచ్చేటప్పుడు మాత్రం “ఏ విషయమూ తర్వాత చెప్తామండీ” అని చెప్పి బయటపడ్డారు. ఆ తర్వాతనే ఈ చంద్రకళ సంబంధం వచ్చింది. ఇది ఆవిడ కెంతగానో నచ్చింది. పైగా కాస్తో కూస్తో ఉన్నవాళ్ళు కూడాను. అల్లుడికి ఏమీ తక్కువ చేయరు. కాబట్టి ‘చంద్రకళే తన మేనల్లుడికి తగిన జోడీ’ అని తీర్మానించేసింది.
తల్లి చనిపోయాక ఆ స్థానంలో నిలబడి తమకు తోడునీడగా నిలబడిన ఆవిడ ఏ నిర్ణయం తీసుకున్నా అది తన మంచికేనని భావించిన చంద్రం ఆవిడతో “నీకేది మంచిగా అనిపిస్తే అదే చేద్దాం అత్తా. కానీ నాన్న...” అంటూ ఆగిపోయాడు.
“మీ నాన్న సంగతి వదిలెయ్. నీకయితే ఈ అమ్మాయి నచ్చింది కదా. అది చాలు. ఈ ఇంటికి ఒక ఆడదిక్కంటూ వస్తే నాకు నిశ్చింత” అందావిడ.
“అవును. తననీ, తన తండ్రినీ బాగా చూసుకునే అమ్మాయే కావాలి తనకు. ఆ మొదటి అమ్మాయితో పోలిస్తే ఈ అమ్మాయి చాలా మెరుగనిపించింది. ఆర్ధిక పరిస్థితి వదిలేసినా తన కుటుంబానికి అండగా నిలబడి తమతో కల్సిపోయే అమ్మాయి తనకు భార్యగా వస్తే చాలు” అనుకున్నాడతను. అందుకే తన మేనత్తతో చంద్రకళ సంబంధానికి ‘ఓకే’ చెప్పాడు.
***
“ఏం గురూ! వెళ్ళిన పని ఏమైంది... కాయా, పండా?” అడిగాడు రామం.
చంద్రం తన స్నేహితుడి ప్రశ్నకు జవాబివ్వలేదు. నవ్వి వూరుకున్నాడు. విషయం అర్ధమైపోయింది రామానికి.
“అంటే పండేనన్నమాట. చెప్పు చెప్పు, అమ్మాయి ఎట్లా ఉంది?”
“బాగానే ఉందిరా. మా అత్తకి కూడా బాగా నచ్చింది.”
“మరింకేం తొందర్లోనే పెళ్ళి భోజనం ఉందన్నమాట. అమ్మాయి ఏం చదివింది? ఉద్యోగం చేస్తోందా?”
“డిగ్రీ చదివింది. ఉద్యోగమేమీ చేయటంలేదు. అయినా మనకి ఆ అవసరం కూడా లేదు కదా. ఇంటిపట్టునే ఉండే అమ్మాయే కావాలని మొదట్నుంచి అనుకుంటూనే ఉన్నాంగదా. అట్లాంటి అమ్మాయే దొరికింది.”
“హమ్మయ్య! ఇన్నాళ్ళకు ఒక ఇంటివాడివైపోతున్నావన్నమాట. ఈ సంతోష సమయంలో నాకు ఒక మంచి పార్టీ ఇవ్వాల్రా” ఉత్సాహంగా అన్నాడు రామం.
“ఇస్తాన్రా బాబూ, నీకంటే నాకెక్కువ ఎవరు? మాంఛి ‘టీ’ పార్టీ ఇస్తాను.”
“టీ పార్టీనా?” ఉసూరుమన్నాడు రామం. “ఛ ఛ! పరువు తీశావు కదరా. చక్కగా ఏదైనా బార్ కి తీసుకెళ్తావని నేననుకుంటుంటే ఒఠ్ఠి టీతో సరిపుచ్చుదామనుకుంటున్నావా?”
“బాబూ, నువ్వేదైనా తాగగలవు. కానీ, దానికి నేను తూగగలనా లేదా అన్నది చూసుకోవాలి కదా.”
“అంతేలే నీనుంచి అంతకన్నా ఎక్కువ ఆశించటం వేస్ట్.” నీరసంగా అన్నాడతను.
“అదే బెస్ట్” అని చంద్రం అదే ఫక్కీలో అనేసరికి ఫక్కుమని నవ్వాడతను.
ఇంతలో ఫోన్ మోగింది. చంద్రం జేబులోంచి మొబైల్ తీసి చూశాడు. ఏదో తెలియని నంబరు. ‘ఎవరై ఉంటారా...’ అనుకుంటూ ఆన్ చేసి “హల్లో” అన్నాడు.
అవతల్నుంచి నిశ్శబ్దం.
“హల్లో... ఎవరూ?”
“నే... నేనండీ” ఒక ఆడగొంతు భయం నిండిన గొంతుతో వినిపించింది తడబడుతూ.
“నేనంటే?”
“అదే నిన్న మీరొచ్చారు...”
“నేనొచ్చానా... ఎక్కడికి? మీరెవరు? మీ పేరు చెప్పండి.”
అట్నుంచి గాజుల శబ్దం వినిపించింది. అవతలి వ్యక్తి తటపటాయిస్తున్నట్లు తెలుస్తూనే ఉంది. కొంతసేపటి తర్వాత వినిపించింది, “నేనండీ, చంద్రకళని” అని.
“చంద్రకళా? చంద్ర...” అనబోతుండగా అప్పుడు వెలిగింది అతడి బుర్రలోని ట్యూబ్ లైట్.
వెంటనే గుర్తు పట్టాడు. మనసులో కోటి వీణలు మోగాయి. రామంకేసి చూస్తూ, ‘సైలెన్స్’ అన్నట్లు సైగ చేశాడు. రామానికి విషయం అర్ధమైంది. ‘ఓకే, ప్రొసీడ్’ అన్నట్లుగా బొటనవేలు పైకెత్తి చూపిస్తూ అక్కణ్ణుంచి వెళ్ళిపోయాడు.
“చెప్పండి” అన్నాడు చంద్రం. అతని మనసు ఆనందడోలికల్లో తేలిపోసాగింది. ఆమె వెంటనే ఏమీ మాట్లాడలేదు. తనకేదో చెప్పాలనుకుంటోందనీ, అందుకు ఆమె ఎంతో సంకోచిస్తుందనీ అర్ధమైందతనికి. అందుకనే తనే కల్పించుకుని “చెప్పండి, ఫర్వాలేదు” అన్నాడు.
“నేను... నేను మీకు నచ్చానా?” బెరుకుగా అడిగిందామె.
అతడు ఆశ్చర్యపోయాడు. ‘కొంపదీసి నచ్చలేదని వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పమని అడగటానికే ఫోన్ చేసిందా? అంటే ఆమె ఆల్రెడీ ఎవరినైనా...’ ఇక ఆలోచించలేకపోయాడు. అంతలోనే తేరుకుని “విషయం చెప్పండి” అన్నాడు.
“నేను మీకు నచ్చానని మావాళ్ళు అంటుంటే నాకు చాలా ఆనందం కలిగింది” అందామె.
‘హమ్మయ్య, తను భయపడినట్టుగా ఏమీ లేదన్నమాట’ అనుకున్నాడు.
తర్వాత ఆమే కొనసాగించింది. “నిన్న మీతో మాట్లాడదామంటే కాస్త భయం వేసింది. అందుకే ఇలా ఫోన్లో...” అతను నవ్వుతూ వింటున్నాడు. “మీరు నాకు చాలా బాగా నచ్చారు” అందామె.
నిన్న మాట్లాడమంటే ఒక్క మాట కూడా మాట్లాడని ఈమె ఈరోజు ఫోన్ చేసి ఇలా మాట్లాడటం అతనికి మహదానందాన్ని కలిగించింది. కొంచెం గర్వం కూడా కలిగింది. అట్నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చాక ఇక రైలు ఆగుతుందా? అందుకే అతను “అంటే ఐ లవ్యూ అని చెప్పటానికి ఫోన్ చేశారన్నమాట” అన్నాడు కొంటెగా.
అవతల ఆమె సిగ్గుపడింది. ఓ నిమిషం ఆగి మళ్ళీ అంది “నిన్న అందరిలో ఈ విషయం చెప్పటానికి...” అంటూ ఆగిపోయింది.
“చాలా సంతోషం. ఐ యామ్ వెరీ హ్యాపీ” అన్నాడతను రెట్టించిన ఉత్సాహంతో.
“కానీ...”
“మళ్ళీ ఈ కానీలూ, అర్ధణాలూ ఏమిటి? చెప్పండి మీకేమైనా కోరికలున్నాయా?”
“కోరికలంటూ పెద్దగా ఏమీ లేవు. అయితే...” ఆమె సంకోచపడింది.
“అయితే?” అతని భ్రుకుటి ముడిపడింది. ఆమె మాట్లాడలేదు. అతనే కల్పించుకుని “చెప్పండి ఫర్వాలేదు. మీకేమైనా కండిషన్స్ ఉన్నాయా?” అనడిగాడు. అలాంటిదేమైనా ఉంటే ముందే మాట్లాడుకోవటం మంచిదనిపించిందతనికి.
“అవును. అందుకే ధైర్యం చేసి ఫోన్ చేశాను” అందామె.
“మంచిపని చేశారు. చెప్పండి, ఏమిటి విషయం?”
“పెళ్ళయ్యాక మీ నాన్నగారు మనతోనే ఉంటారు కదా!”
“అవును. అయితే...”
“ఏం లేదు. నిన్న మీ నాన్నగారిని చూశాను. ఆయన చూపు తేడాగా ఉంది. అదే మీతో మాట్లాడదామని...”
“కొంచెం వివరంగా చెప్పండి.”
“అదీ... మీరేమనుకోకపోతే మీ నాన్నగారిని...”
“ఆఁ, మా నాన్నగారిని...”
“ఏదైనా వృద్ధాశ్రమంలో...” పక్కలో బాంబుపడ్డట్టుగా ఉలిక్కిపడ్డాడతను.
“ఏమన్నారూ... వృద్ధాశ్రమంలోనా...?” గట్టిగా అరిచాడు.
“మీరేమీ అనుకోకపోతేనే సుమండీ. ఆయన అక్కడున్నా ప్రతి వారం మనం వెళ్ళి ఆయన బాగోగులు చూద్దాం. ఏ లోటూ రానివ్వకుండా...” ఆమె ఏదో మాట్లాడుతూనే ఉంది.
చంద్రానికి ఆమె మాటలేవీ వినబడట్లేదు. ఆమె గొంతులో వినబడుతున్న అపస్వరాలను భరించలేక ఫోన్ కట్ చేశాడు.
**”
ఆఫీస్ అయిపోగానే బయటికొచ్చిన చంద్రం తన మోటర్ సైకిల్ పంచరవటం గమనించాడు. అప్పటికే మిగతా కొలీగ్స్ వెళ్ళిపోవటం, ఏదో పెండింగ్ వర్క్ ఉండి తను ఆలస్యంగా బయటికి రావటం మూలాన ఇంటికి వెళ్ళటానికిక సిటీ బస్సుకన్నా మార్గాంతరం లేకపోయింది. వాచ్ మన్ కి బండి అప్పగించి, బస్టాప్ కి రాగానే వచ్చిన బస్సెక్కి కూర్చున్నాడు.
కిటికీ పక్కనే కూర్చున్న అతనికి రెండు స్టాపుల అవతల ఆమె కన్పించింది. ఆమే... మొదటి పెళ్ళి చూపుల్లో తను చూసిన అమ్మాయి. అదే... ఆదర్శాలు వల్లించిన అమ్మాయి. ఆమె కూడా అదే బస్సు ఎక్కటంతో ఆమె తనను గమనించకుండా తల బయటికి పెట్టాడు. ఆమె నేరుగా వచ్చి అతని ముందు సీట్లో కూర్చుంది. బస్సు కదిలింది.
కొంచెంసేపటి తర్వాత “ఏయ్ అబ్బాయ్ లే” అన్న అరుపు వినిపించటంతో చంద్రం తలతిప్పి అటుకేసి చూశాడు. తన సీటుకు అవతలి వరసలో రెండు అడుగుల దూరంలో ఉన్న సీట్లో ఉన్న ఒక ముప్ఫైఐదేళ్ళ స్త్రీ తన పక్కన కూర్చున్న వ్యక్తికేసి చూస్తూ “మీదపడకు, లే” అంటోంది. బస్సులో అందరూ అటుకేసి చూశారు. ఆవిడ పక్కన ఒక మతిస్థిమితంలేని వ్యక్తి కూర్చుని నిద్రపోతూ, మాటిమాటికీ ఆమె మీదకు తూలడంతో ఆమె అతన్ని కసురుకోసాగింది. అతనితోబాటు వచ్చిన వ్యక్తి, బస్సు చివరి సీట్లో కిటికీ పక్కన కూర్చుని రోడ్డుమీద పోతున్న కాలేజీ అమ్మాయిలను చూడటంలో మునిగిపోయి వున్నాడు పాపం!
పక్కన ఆవిడ అరుపులకు ఆ వ్యక్తి లేచి సర్దుకుని కూర్చున్నాడు. అంతలోనే నిద్రలోకి జారుకుని ఆమె మీదకు వాలిపోసాగాడు. ఆమె ఒక్కసారిగా ‘గయ్’మంది. “ఇట్లాంటి పిచ్చోళ్ళని ఎందుకు బస్సెక్కనిస్తారు?” అంటూ కండక్టర్ మీదకి ఒంటికాలి మీద లేచింది.
ఆ వ్యక్తి మళ్ళీ లేచినా, బస్సు కుదుపులకి తిరిగి అదే తంతు. ఇక లాభం లేదనుకుని ఆమె లేచి నిలబడింది. నిద్రలో జోగుతున్న అతను పక్క సీటు ఖాళీ అవటంతో పక్కకి పడిపోయాడు. మళ్ళీ లేచిన అతను తిరిగి రెండోసారి కూడా పక్కకి పడ్డాడు. అది చూసి బస్సులో అందరూ నవ్వారు. కొందరు అదేదో వింత చూస్తున్నట్లు చూడసాగారు.
అప్పుడు లేచింది ఆమె... చంద్రం సీటుకు ముందు సీట్లో కూర్చున్న ఆమె... పెళ్ళిచూపుల్లో ఆదర్శాలు వల్లించిన ఆమె… లేచివెళ్ళి ఆ మతిస్థిమితంలేని వ్యక్తి పక్కన కూర్చుంది.
అది చూసిన ఆ పెద్దావిడ ఆమెను వారించింది. “ఆ పిచ్చోడు మాటిమాటికీ మీద పడుతున్నాడమ్మాయ్. అక్కడ కూర్చోకు... లే” అంది, అదేదో ఆమెను ఉద్ధరిస్తున్నట్లుగా.
అప్పుడు ఆమె చిరునవ్వు నవ్వింది. చంద్రానికి ఆమె నవ్వు స్పష్టంగా కనిపించింది. ఆ నవ్వులో ఒక గ్రేస్ ఉంది.
“చెబితే వినిపించుకోవేమిటమ్మాయ్” హెచ్చరించిందావిడ తిరిగి.
ఆ అమ్మాయి తలెత్తి ఆవిడ ముఖంలోకి స్థిరంగా చూస్తూ “ఫర్వాలేదండీ, నాకు ఇబ్బందేమీ లేదు. ఇతన్ని చూస్తేనే తెలుస్తోంది... ఆకతాయి కాదూ మతిస్థిమితం లేనివాడని. ఇతడు కావాలని మనమీద పడటం లేదు కదా. ఇతడేమీ తప్పు చేయటంలేదు. తప్పు చేసింది ఆ దేవుడు. దానికి ఇతడేం చేయగలడు? సాటిమనిషి పట్ల నా బాధ్యత నేను నిర్వహిస్తున్నాను. ఇదే స్థానంలో మన అన్నయ్యో, తమ్ముడో ఉంటే మనం ఏం చేస్తామో, అదే నేనూ చేస్తున్నాను. మీరేమీ ఫీలవకండి” అంటూ ముందుకు వాలిపోతున్న అతని తలను చేతితో ఆపి, తన భుజంపైన ఆనుకునేలా చేసింది.
ఆమె మాటలకు అందరూ అవాక్కయ్యారు. ఆ పెద్దావిడ ముఖం చిట్లించుకుని తన స్టాప్ రాకముందే వడివడిగా దిగి, వెళ్ళిపోయింది. అప్పటిదాకా చోద్యం చూస్తున్నవాళ్ళంతా ఆమెవైపు అభినందన పూర్వకంగా చూడసాగారు. చంద్రం కళ్ళు ఆశ్చర్యంతో విప్పారాయి. అంతలో తన స్టాప్ రావటంతో బస్ దిగాడు. బస్ ముందుకు కదిలింది... ప్రగతిపథంలోకి దూసుకెళ్తున్నట్లుగా.
***
“ఏమిటీ, ఆ అమ్మాయిని చేసుకుంటావా?” ఆశ్చర్యంగా అడిగిందావిడ.
“అవునత్తా. నాకు ఆ అమ్మాయే నచ్చింది. ఆమెనే చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. మొన్న మనం చూసిన సంబంధం వాళ్ళకు రావద్దని చెప్పేశాను” అన్నాడు చంద్రం.
ఆవిడ అతనికేసి విచిత్రంగా చూసింది. కానీ అతని ముఖంలో కనిపిస్తున్న దృఢనిర్ణయానికి ఆమె ఎదురు చెప్పలేక పోయింది. “నీ ఇష్టం నాన్నా! నీకా అమ్మాయే నచ్చిందంటే ఆలాగే కానియ్. నువ్వూ, మీ నాన్నా సంతోషంగా ఉండటమే ముఖ్యం” అందావిడ.
“థాంక్స్ అత్తా!” అన్నాడతను. అతనికిపుడు చాలా సంతృప్తిగా ఉంది. తన తల్లి చనిపోయాక తీవ్ర ఆవేదనతో కుమిలి కుమిలి ‘మతిస్థిమితం కోల్పోయిన’ తన తండ్రిని, ఆమెకన్నా ఈ ప్రపంచంలో మరెవ్వరూ ఎక్కువ ప్రేమగా చూడలేరన్న తృప్తి అతని ముఖంలో కదలాడింది.
*****