కథ : అత్తారింటికి దారేది
రచన : సూర్య గండ్రకోట
(08.08.2014 లో స్వాతి వీక్లీలో ప్రచురితమైన బహుమతి కథ)
***
ఠంచనుగా ఒక్క నిమిషమైనా అటూ ఇటూ కాకుండా ఎప్పటిలాగే బయలుదేరింది రైలు, రెండు గంటలు ఆలస్యంగా.
వంద మీటర్ల పరుగు పందెంలో వెనుక నుంచి ఫస్ట్ వచ్చే ఆటగాడిలాగా ఆపసోపాలు పడుతూ సూటుకేసుతో పరిగెత్తుకొచ్చి అతికష్టం మీద రైలందుకున్నాడు సుబ్బాచారి.
సునామీ ఎదురైనా సూదిమొనంత దూరంకూడా కదలని అతగాడి భారీ శరీరం, ఆయాసంతో ఎగసిపడసాగింది. ఆయాసం తీరేవరకు అక్కడే నిలబడి ‘ఆఫీసులో లేట్ అయినా రైలు అందుకున్న ఆనందం’లో తన సీటుకేసి కదిలాడు. తీరా అక్కడికెళ్లేసరికి అక్కడ ఓ యువజంట కూర్చుని ఉండటం చూసి, సీరియస్‌గా “మీరు లేస్తే నేను ఆ సీట్లో కూర్చుంటా” అన్నాడు.
“నేను లేవనుగా” తాపీగా అన్నాడా యువకుడు.
ఒక్కసారిగా చిర్రెత్తుకొచ్చింది సుబ్బాచారికి. “అది నా సీటు” అన్నాడు కోపంగా.
“కాదు. నాది.” చిద్విలాసంగా నవ్వుతున్నాడతను.
“నీ నెంబర్ సరిగా చూస్కో. లే లే” దాదాపుగా కసిరాడు.
“సారీ. మీరే ఓసారి మీ నెంబర్ చెక్ చేసుకోండి” నవ్వుతూనే ఉన్నాడతను.
“నాకు అవసరం లేదు. నువ్వే చెక్ చేసుకో” ఆ కంఠంలోని పీలతనానికి అందరి దృష్టి వీళ్ళ వైపు మళ్ళింది.
“మీ టిక్కెట్ ఓసారి ఇటు ఇవ్వండి” అడిగాడు అతను నెమ్మదిగా.
“నేను ఇవ్వను” ఆవేశంగా అరిచాడు.
మధ్యలో ఓ పెద్దమనిషి కల్పించుకుని ఆ యువకుడి టికెట్ చూసి, “ఇది ఇతని సీటే. ఏది మీ టికెట్ ఇవ్వండి” అని అడిగి తీసుకొని చూసి, “మీ సీట్ నెంబర్ ఇరవై ఐదు కాదు. ముప్ఫై ఐదు. అదిగో అటెళ్ళండి” అన్నాడు, టికెట్‌ని తిరిగి ఇచ్చేస్తూ.
ఒక్కసారిగా అవాక్కయ్యాడు సుబ్బాచారి. నిజమే తన నెంబర్ ముప్ఫై ఐదు. మరి ఇదేమిటి ఇందాక ఇరవై ఐదులా కనిపించింది. తొందరలో తనే సరిగ్గా చూసుకోలేదు. అందరూ ముసిముసి నవ్వులు నవ్వుకోవటం చూసి, ఏడవలేక ఓ నవ్వు నవ్వి “అవును నాది ముప్ఫై అయిదే” అంటూ తన సీటుకేసి భారంగా, భారీగా కదిలాడు.
ఒక్కసారిగా అతనికి సుబ్బలక్ష్మి మీద పీకల్దాకా కోపం వచ్చింది. అలా కోపం వచ్చినప్పుడల్లా అతను దవడ కండరం బిగుసుకుంటుంది. అది బిగుసుకున్నప్పుడు దాన్ని సరిచేయటానికి, లాగి ఒక గుద్ధు గుద్దితే మళ్ళీ మామూలుగా అయిపోయి, ఆ నొప్పికి కోపం కూడా ఆటోమేటిగ్గా దానంతట అదే తగ్గిపోతుంది.
కానీ ఇక్కడ అందరి ముందూ తన దవడ మీద తనే గుద్దుకుంటే, జరిగినదానికి బుద్ధొచ్చి దవడలు వాయించుకుంటున్నాడని అందరూ అనుకుంటారని ఆగిపోయాడు. దాంతో సుబ్బాచారికి భార్య మీద వచ్చిన కోపం అలాగే కంటిన్యూ అయింది.
‘ఎర్రగా, బుర్రగా ఉంది గదా’ని పల్లెటూరి పిల్ల అయితేనేం అని చేసుకున్నాడు. తీరా కొత్త అల్లుడి హోదాలో వాళ్ళ ఊరికి వెళ్లడానికి ఒక రైలు, ఒక బస్సు, ఒక జట్కా ఇలా రకరకాల వాహనాల్లో ఒళ్ళు హూనం చేసుకొని వెళ్ళినప్పుడు, “ఇంతకన్నా ఏ అండమాన్‌కో, ఏ ఆఫ్రికా అడవులకో వెళ్లి రావడం చాలా సుఖం” అని తేల్చేశాడు.
భార్య ఎప్పుడైనా “ఏమండీ! ఓసారి మా ఊరికి వెళ్దామండీ” అంటే “నీకంటే నాకు ఎక్కువెవరే బంగారం! నీకు చీరలు కావాలా? నగలేమైనా కావాలా? ఏ కోరికైనా తీరుస్తాను, అదియును ఒక్క మీ ఊరికి వెళ్లడం తప్ప” అంటూ యమధర్మరాజు సతీసావిత్రికి వరమిచ్చే లెవెల్లో ఫోజు పెట్టేవాడు.
అది మొదలు ఆమె అతను ఎప్పుడూ సూటిగా చీరలు, నగలు అడగలేదు. “ఏమండీ! మా ఊరెళ్దామండీ” అనడం ఆలస్యం, ఆమె కోరిక తీరిపోయేది. ఎప్పుడు వాళ్ళ ఊరికి రమ్మన్నా తప్పించుకుంటున్నాడని అతగాడి బామ్మర్దికీ, మరదలికీ మంట.
“బావా! మా ఊరికి రావాలంటే ప్రయాణం కష్టమని రావట్లేదా? లేకపోతే చీకటి పడితే ఊరి బయట ఉన్న వంతెన దగ్గర దయ్యాలు ఉన్నాయని విని భయపడి రావట్లేదా? మిమ్మల్ని చూస్తే అవే భయపడి పారిపోతాయిలే” ఇది తన బామ్మర్ది హేళన.
“బావా! నీకు భయమైతే చెప్పు. నేను తోడు వస్తా. ప్రతి మగాడి విజయం వెనక ఒక ఆడది ఉన్నట్లే, ప్రతి పిరికి బావ వెనక ఒక మరదలు ఉంటుంది” ఇది మరదలు హాస్యం.
ఎవరేమన్నా పట్టించుకోని సుబ్బాచారికి, ఇప్పుడు తప్పనిసరిగా అత్తారింటికి వెళ్లక తప్పింది కాదు.
కాన్పుకు కూతుర్ని పుట్టింటికి తీసుకెళ్లిన మామగారు, ‘కొడుకు పుట్టాడనీ, బారసాలకు రావాలనీ సుబ్బాచారికి అల్టిమేటం జారీ చేశాడు.
కొడుకు పుట్టాడనే వార్త ఫోన్లో వినగానే ఆనందంలో ‘హుర్రే’ అని గట్టిగా అరిచాడు. ఆ టైంలో అతను ఆఫీసులో ఉన్నాడు.
వాళ్ల ఆఫీసరు హెడ్డాఫీస్ వాళ్లతో అప్పుడే తలంటించుకుని ఉన్నాడు. ఆయన ఇతగాడి అరుపు వినగానే అగ్గి మీద గుగ్గిలమైపోయాడు.
“సార్! నేను అరిచింది అందుక్కాదు సార్!” అంటూ విషయం చెప్పబోయాడు సుబ్బాచారి.
“అయినా సరే, నువ్వీ సమయంలో అట్టా ఆనందంగా అరవటం నేను ఒప్పుకోను గాక ఒప్పుకోను… ప్పుకోను… కోను… ను” అంటూ దిక్కులన్నీ ప్రతిధ్వనించేలా రంకలేశాడు.
ఆయన పెట్టిన చివాట్లన్నీ సుష్టుగా తిని, కాళ్ళ వేళ్ళా బతిమాలి, బామాలి, చివరికి ఓ వారం రోజుల సెలవు సంపాయించాడు.
అంతా బాగానే ఉంది కానీ అప్పుడెప్పుడో పెళ్లెప్పుడు చూడటమే తప్పించి, అతనికా ఊరు పెద్దగా గుర్తులేదు. ఎలా వెళ్లాలో చూచాయగా తెలుసు. బామ్మర్దిని సాయం అడగడానికి అహం అడ్డొచ్చింది. అందుకే ఆ మారుమూల పల్లెటూరికి, ఊరి పేరు తప్ప ఎక్కువగా తెలియని సుబ్బాచారి ‘ఒంటరిగా’ బయలుదేరాడు.
***
ఏదో స్టేషన్లో రైలు ఆగింది.
ఒక నీళ్ల బాటిల్ కొందామనుకుని, ‘ఒకవేళ నేను దిగగానే రైలు కదిలితే…’ అన్న అనుమానం వచ్చి అలాగే కూర్చుండిపోయాడు. దిగేవాళ్ళు దిగుతున్నారు. ఎక్కేవాళ్ళు ఎక్కుతున్నారు. కిటికీలోంచి చూస్తే, తను గొడవపడిన యువజంట, కూల్‌డ్రింక్ తాగుతూ, తన వైపే చూస్తూ, ఏదో అనుకుంటూ నవ్వుకుంటున్నట్లు అనిపించింది.
‘ఏదో పొరపాటు జరిగింది. అంతమాత్రానికే ఇంకా నవ్వుకోవాలా!’ అంటూ దవడ పళ్ళు పటపటలాడించాడు. వాళ్ళు కింద ఉండగా వెళ్లి నీళ్లు బాటిల్ తెచ్చుకోవడం నామర్దాగా అనిపించింది. కొంచెంసేపటి తర్వాత వాళ్ళు కనిపించపోయేసరికి, గభాలున లేచి, దిగి, నీళ్ల బాటిల్ కొనుక్కుని వెనక్కి తిరిగేసరికి రైలు బయలుదేరింది.
గాబరాగా పరిగెత్తి, పడబోయి తమాయించుకుని, రైలు దగ్గరికి చేరేలోపు ఎవరో తలుపు దగ్గర నిలబడి చెయ్యి అందించడంతో, ఎలాగైతేనే లోపలికి చేరాడు.
రైలు నిండుగర్భిణీలా నెమ్మదిగా సాగుతోంది. ‘తన స్టేషన్ వచ్చేసరికి చీకటి పడితే ఎలా…’ అన్న భయం అతడిలో మొదలైంది. ‘పోనీ ఫోన్ చేసి బామ్మర్దిని రమ్మంటే… అమ్మో వద్దొద్దు. వాడిక తాటాకులు కట్టేస్తాడు. ఆఫీసులోని విషయాలు ఉన్నవీ లేనిదే కల్పించి చెప్పి, తనంత ధైర్యవంతుడు ఈ భూమ్మీద లేడనేంత కలరింగిచ్చాడు తన భార్య ముందు. ఇప్పుడు భయపడేట్టు తెలిస్తే ఇంకేమైనా ఉందా! పరువు పోదూ!’
ఆలోచనల్లో ఉండగానే తన దిగాల్సిన స్టేషన్ వచ్చేసింది. అప్పటికి సాయంత్రం ఏడు గంటలు అయింది. స్టేషన్ బయట బస్సులు ఉంటాయని భార్య చెప్పిన విషయం గుర్తొచ్చి బయటికి నడిచాడు సుబ్బాచారి.
ఎంక్వయిరీ చేయగా తనెక్కాల్సిన బస్సు ఇంకో అరగంటలో వస్తుందని తేలింది. ఈలోగా రైల్లోని యువజంట ఏదో టాక్సీ మాట్లాడుకుని తన ముందునుంచే వెళ్లడం చూసి, తల తిప్పుకున్నాడు.
అప్పుడుగూడా వాళ్ళు తనని చూసి నవ్వుకుంటున్నట్లు అనిపించింది. వాళ్ళని అడిగి ఆ టాక్సీలో ఎక్కితే బాగుండేది అనిపించింది.
ఓ పక్క చీకట్లు కమ్ముకుంటున్నాయి. కాలు గాలిన పిల్లిలా అటూ ఇటూ తిరగసాగాడు. చెప్పిన టైంకి ఓ అరగంట లేటుగా బస్సు వచ్చింది. అది వచ్చీ రావటం ఆలస్యం… అప్పటిదాకా దానికోసమే కాసుక్కూర్చున్న జనం దాని పైకి లంఘించారు.
అతి కష్టంమీద అతడు కూడా బస్సెక్కాడు. బయట కన్ను పొడుచుకున్నా ఏమీ కనపడట్లేదు. తను దిగాల్సిన స్టేజీ పేరు చెప్పి, అది రాగానే తనకు చెప్పమని పక్కనున్న ఆసామికి చెప్పి, మళ్ళీ ఆ విషయాన్ని పది నిమిషాలకొకసారి చెప్పడంతో, అతడు విసుక్కుని “చెబుతానయ్య సామీ! నన్ను సతాయించకు” అంటూ మరో ఐదు నిమిషాల్లో, గుర్రు పెట్టి నిద్ర పోసాగాడు. అది చూసి ఇతగాడి గుండెల్లో రాయి పడింది. లేచి కండక్టర్ దగ్గరికెళ్లి విషయం చెప్పాడు.
“ఔను. చెప్తానులే సార్! మీరు కూర్చోండి” అంటూ అతడు భరోసా ఇచ్చాడు. ‘టికెట్లు ఇచ్చే గొడవలో పడి ఈ కండక్టర్ కూడా ఈ విషయం మర్చిపోతే...’ ఇంక లాభం లేదనుకొని, ఇంకో ఇద్దరికీ ఇదే విషయాన్ని చెప్పాడు. ఎక్కేవాళ్ళతో, దిగేవాళ్ళతో కిక్కిరిసిన ఆ బస్సు మట్టి రోడ్డు గుండా మెల్లిగా పోసాగింది.
ప్రతి స్టేజీలోను పది నిమిషాలు ఆగుతూ సాగుతోంది. అది ఆగినప్పుడల్లా ‘ఇంకెంత దూరం?’ అంటూ పక్కవాళ్ళని అతడు వేధించసాగాడు. అతగాడి బాధపడలేక ఒకళ్ళిద్దరు అతని పక్కనుంచి లేచి వెళ్లి, వేరే సీట్లో సర్దుకుని కూర్చున్నారు.
అలా గంట ప్రయాణాన్ని మూడు గంటలసేపు చేసి, చివరికి అతడు దిగాల్సిన స్టేజీ రావడంతో, గభాల్న లేచి సూటుకేస్ అందుకుని, పద్మవ్యూహంలో అభిమన్యుడిలా అందరినీ తొక్కుకుంటూ, తోసుకుంటూ, చివరికెలాగైతేనేం బస్సులోంచి బయటకు దూకాడు.
తనతోపాటు ఇంకెవరైనా దిగుతారేమో తనకు తోడు దొరుకుతుందని ఆశించిన అతని ఆశని భగ్నం చేస్తూ బస్సు ముందుకు సాగిపోయింది.
టైం పదకొండు దాటింది. చుట్టూ కనుచూపుమేరలో అతనికేమీ నరసంచారం కనపడలేదు. ఆకాశంలో నక్షత్రాలు మిణుకుమిణుకుమంటూ చుట్టూ ఉన్న చీకటిని పారద్రోలటానికి విఫలయత్నం చేస్తున్నాయి. కొంతదూరం నడిచాక, దూరంగా ఒక గుడిసె కనపడింది. అతనికి ప్రాణం లేచొచ్చినట్లయింది. పరుగులాంటి నడకతో అక్కడికి చేరుకున్నాడు.
“లోపల ఎవరైనా ఉన్నారా?” అరిచాడు.
“ఎవరూ?” అంటూ ఓ పండు ముసలి వ్యక్తి ఓ గుడ్డి దీపం పట్టుకొని బయటకు వచ్చాడు.
“రామాపురానికి ఎటెళ్ళాలి?”
“ఇదిగో… గా తొవ్వగుంటా ఎల్తే ఓ గంట పట్టుద్ది. గీ పొలం గట్టు మీదగా ఎల్తే అద్దగంటలో ఊల్లోకెల్లిపోవూ” తనలో తనే అనుకున్నట్లుగా చెప్పాడు. “అయినా ఇంత రేత్తిరి దిగినావేంది సామీ? ఏడకెల్లి వొత్తున్నావ్?”
“హైదరాబాద్” చెప్పాడు సుబ్బాచారి.
“అబ్బో… అవునా! నా మనవడుండుంటే తోడుగా పంపేటోన్ని. ఆడు లేడు. ఒక్కనివే ఎల్లలేకపోతే గీ రేతిరికి ఈడనే ఉండొచ్చు…” సలహా ఇచ్చాడు.
“ఒద్దులే. ఈ పొలం గుండా వెళ్తే ఊర్లోకి వెళ్లొచ్చా?”
“అవ్… గానీ… దారి గాని తప్పి సింత తోపులోకి ఎల్లేవు సామీ! జాగర్త” హెచ్చరించాడు.
అతగాడి గుండెల్లో రాయపడింది. పొరపాటున దారితప్పి చింత తోపులోకి పోతే… ఇంకేమైనా ఉందా? చింత తోపులో దయ్యాలుంటాయని చిన్నప్పుడెవరో చెప్పారు తనకి.
అలవాటు లేని దారి. అడుగులో అడుగు వేస్తూ నడుస్తూనే జారి పడబోయి, ఎట్లాగో తమాయించుకున్నాడు. సూటుకేసు చేతిలోంచి జారిపోయింది. పొలంలోకి దిగి ఎట్లాగైతేనేం దాన్ని అందుకున్నాడు.
ముందుకు నడుస్తూ ఉంటే ఓవైపు చెంత తోపు కనిపించింది. గాలికి చింతచెట్లు దయ్యాల్లా తలలూపుతున్నాయి. చల్లగాలి వీస్తున్నా బనీను తడిసిపోయింది. ఎట్లాగైతేనే పొలం దాటి ఓ కాలిబాటకు వచ్చాడు.
కొద్దిదూరంలో ఓ చిన్న వంతెన కనిపించింది. ఆ వంతెనని చూడగానే తన బామ్మర్ది ఆ వంతెన దగ్గర దయ్యముందని చెప్పినట్లు గుర్తొచ్చి, అడుగు ముందుకుపడలేదు సుబ్బాచారికి.
అయినా గుండె చిక్కబట్టి హనుమాన్ చాలీసా, దండకం అందుకొని ఒక్కొక్క అడుగే ముందుకేయసాగాడు. వంతెన దాటుతున్నప్పుడు ఎవరైనా వంతెన కిందనుంచి అమాంతం పైకొచ్చి మీద పడ్తారేమోనని సుబ్బాచారి గాభరాపడిపోయాడు.
చివరికెలాగైతేనేం వంతెన దాటి ఊర్లోకి అడుగు పెట్టాడు. దానికి ఇరువైపులా గుడిసెలు.
నాలుగడుగులు వేశాడో లేదో… ఉన్నట్టుండి భౌ భౌ… మంటూ ఓ పది, పన్నెండు కుక్కలు ఒక్క ఉదుటన అతనివైపుకు దూసుకొచ్చాయి.
అంతే… అతని పైప్రాణాలు పైనే పోయినట్లయింది.
చుట్టూ చేరిన కుక్కలు చెవులు చిల్లులు పడేట్లుగా మొరగసాగాయి. అడుగు ముందుకు పడలేదు. కాళ్లు ముందుకు కదలమని మొరాయించసాగాయి.
అడుగు ముందుకేస్తే చీల్చి చెండాడేస్తాయేమో అన్నంత తీవ్రంగా అరుస్తున్నాయి ఆ కుక్కలు.
‘అయిపోయింది. బొడ్డు చుట్టూ పధ్నాలుగు ఇంజక్షన్లైనా వేయించుకోనిచ్చేట్లు లేవీకుక్కలు…’ అనుకున్నాడు. అతగాడి ఆలోచనలూ, అతగాడి కాళ్లూ కూడా ముందుకు సాగలేకపోతున్నాయి. గొంతు తడారిపోయింది. నాలుక పిడచగట్టుకుపోయింది తల తిరగటం మొదలైంది. పరిసరాలను గ్రహించే శక్తి అతగాడి మనసు కోల్పోయి కిందకి వాలిపోయాడు.
అదే సమయంలో ఎవరో అదిలించినట్లు కుక్కలన్నీ ‘కుయ్…’ మంటూ తలో దారిన పారిపోయాయి.
కళ్ళు తిరిగి కిందకు పడిపోతున్న అతడు, తన శక్తినంతా కూడగట్టుకుని తల పైకెత్తి చూశాడు.
అంతే…
ఇంతలేసి కళ్ళు… విరబోసుకున్న జుట్టు… తనపైన దాడి చేయడానికన్నట్లు లేచిన పంజాలాంటి చెయ్యి… ‘కెవ్వు’మంటూ విరుచుకు పడిపోయాడు.
***
మెలకువ వచ్చి చూసేసరికి పక్కన భార్య సుబ్బలక్ష్మి… చుట్టూ అత్తగారి కుటుంబం…
“ఏం బావా! వస్తున్నట్లు ఒక మాట చెబితే, రైల్వే స్టేషన్ దగ్గరకు వచ్చేవాడిని గదా” బావమరిది నిష్టూరం.
“కుక్కల్ని వెళ్లగొట్టి, పడిపోతున్న నిన్ను పట్టుకుందామనుకుంటే, నన్ను దయ్యాన్ని చూసినట్లు చూసి అట్లా అరిచావేంటి బావా?” మరదలు మందలింపు.
“చాల్లే… నిద్రలోంచి లేచి ఆ విరగబోసుకున్న జుట్టుతో, తెల్లని పరికిణీ ఓణీతో, అంత రాత్రివేళ… ఎవరైనా దయ్యమనే అనుకుంటారే! ఆయన ధైర్యవంతుడు గాబట్టి…” చెల్లెలిపై సుబ్బలక్ష్మి కసరింపు.
జరిగిందేమిటో సగం అర్థమయ్యీ, సగం అర్థంకాకా వెర్రిమొహమేసుకుని ఓ వెర్రి నవ్వు నవ్వుతూ, అందరివైపూ చూస్తూ ఉండిపోయాడు సుబ్బాచారి.
*****