ఎల్.బి.డబ్ల్యు. (హాస్యకథ)
-సూర్య గండ్రకోట
(ఆంధ్రభూమి వారపత్రిక 13.09.1984 సంచికలో ప్రచురితము)
దేశంలో ఎటు చూసినా ఎక్కడ విన్నా సుబ్బాచారి పేరు మారు మ్రోగిపోసాగింది.
రంజీట్రోఫీల్లో ఎన్నో సెంచరీలు, డబుల్ సెంచరీలు, ట్రిపుల్ సెంచరీలు సాధించటమేకాక ఒకటి రెండు వికెట్లు కూడా పడగొట్టటంతో దేశంలోని క్రికెట్ కంట్రోల్ బోర్డ్ మెంబర్లంతా పులకించిపోయారు.
ఫామ్‌లో లేని మేటి టెస్ట్ బాట్స్‌మన్ అంతా, ‘ఇక సుబ్బాచారిని మన టీంలోకి చేరుస్తారు. తప్పదు. అయితే ఈ సారి గొడ్డలి మనలో ఎవరిమీద పడుతుందో’ అన్న విచారంలో మునిగిపోయారు.
ఇక యువతరాన్ని ఎవరూ పట్టలేకుండా వున్నారు. సుబ్బాచారి ఎక్కడ ఆడుతున్నాడన్నా తండోపతండాలుగా వచ్చి పడసాగారు. వాళ్లనంతగా అతడు ఆకర్షించడానికి కారణం అతడు కొట్టే సిక్సర్స్. అందుకే అతడికి వాళ్లు ‘సిక్సర్స్ సుబ్బాచారి’ అని పేరు పెట్టేశారు. వంట్లోవున్న బలాన్నంతా వుపయోగించి కొడతాడేమోగానీ బంతి స్టేడియం దాటిపోవటం చాలాసార్లు జరిగింది.
బ్యాట్ పట్టుకుని అతడు రంగంలోకి దిగాడంటే అభిమన్యుడు, బాలచంద్రుడు బలాదూర్ అనిపించే విధంగా వీరావేశంతో ఎదుటి టీం బౌలర్లను, ఫీల్డర్లను ముప్పతిప్పలు పెట్టేవాడు. అసలు సుబ్బాచారి బ్యాటింగ్ కొస్తున్నాడంటేనే ఎదురు టీమ్ వాళ్లు కుండలక్కుండలు నీళ్లు తెప్పించుకుని తాగేవారు. అయినా వాళ్ల గొంతులు ఎండిపోతూనే వుండేవి.
బౌలర్ బౌల్ చెయ్యటానికి పరిగెత్తుకుంటూ వస్తుంటే ఇతగాడొక్కసారి వికెట్ కీపర్ వైపు చూసి “ఈ బాల్ బౌండరీ లైన్ కే బాహర్ చార్ రన్ కే లియే” అనేసి వచ్చిన బాల్‌ని లాగికొట్టేవాడు. వికెట్ కీపర్ నోరు తెరిచి చూస్తుండగానే బంతి బౌండరీ లైన్ దాటి పోయేది.
మరికొన్ని సార్లు ఎదుటి టీం కెప్టెన్ ఫీల్డింగ్‌లో మార్పులు చేస్తుంటే “ ఎందుకు బాస్ ఈ ఛేంజింగ్? బంతి అసలు ఫీల్డ్ లో పడితేగదా” అనేవాడు. బలమంతా వుపయోగించి చేసిన హుక్ షాట్‌కు ఆ బంతి, ఆ కెప్టెన్ గుడ్లు వెళ్లబెట్టి చూస్తుండగా స్టేడియం బయటెక్కడో పడేది.
ఈ ఒక్కడు ఔటైతే చాలు ఇక మిగిలిన వాళ్లని పిట్టల్ని పడేసినట్లు పడెయ్యొచ్చునని ఊహించే ఎదుటి కెప్టెన్ ఆశల్ని అడియాసలు చేస్తూ, సెంచరీల మీద సెంచరీలు బాది, నాటౌట్ గా నిల్చిపోయేవాడు సుబ్బాచారి.
జోనల్స్‌లోనూ ట్రోఫీ మ్యాచ్‌ల్లోనూ సుబ్బాచారి పెర్ఫార్మెన్స్ చూసిన క్రికెట్ కంట్రోల్ బోర్డ్ సెలెక్టర్స్ అతడ్ని టెస్ట్ టీమ్ లోకి తీసుకోక తప్పదని నిర్ణయించుకున్నారు.
బ్యాటింగ్ లో అసమాన ప్రతిభని కనబరుస్తూ బౌలింగ్‌లో కూడా అప్పుడప్పుడూ రాణించటంతో ఇక సుబ్బాచారికి ఎదురు లేకుండా పోయింది.
ఆ విధంగా సుబ్బాచారి జీవితం ఒక మలుపు తిరిగింది.
***
సుబ్బలక్ష్మి ఆనందానికి అవధుల్లేవు. ఎక్కడ మ్యాచ్ జరిగినా సుబ్బాచారి బ్యాటింగ్ కి వచ్చిన దగ్గర్నుంచి ఆమె భరత నాట్యం, కూచిపూడి, కథాకళి, కథక్, ఒడిస్సీ వగైరా వగైరా నాట్యాలన్నీ గ్యాలరీలో చేసి చూపించేది. చుట్టుపక్కల వాళ్ల తిట్లే దీవెనలుగా భావించి, సుబ్బాచారి వీరత్వాన్ని గొంతెత్తి మరీ పొగిడేది.
అతని ఆటంటే ఆమెకు ప్రాణం. అతడు ఆడుతున్న మ్యాచ్ ఎక్కడ జరుగుతున్నా అక్కడామె ప్రత్యక్ష్యమయ్యేది. ఇక ఆ రోజు ఆమె దైనందిన కార్యక్రమాలన్నీ వాయిదా పడేవి.
మొదట్లో పోనీలే అని తీసిపారేసినా రానురాను సుబ్బలక్ష్మి తీరు గమనించిన ఆమె తల్లిదండ్రులు మందలించటం మొదలుపెట్టారు.
”కంట్రీబ్రూట్స్! ఒక భారతీయుడి ప్రతిభనూ, అందునా తెలుగువాడి ప్రతిభనూ పొగిడే విశాల హృదయం వీళ్లకెక్కడేడిసింది. అస్తమానం మహిళా సమావేశ ఉపన్యాసాల్లో ఆమె, నోట్లు లెఖ్ఖబెట్టుకుంటూ ఆయన జీవితాన్ని లాగాల్సిందేగానీ కళా హృదయం ఉంటేగదా..” అంటూ విసుక్కునేది.
ఈ క్రికెట్ పిచ్చి తమ కూతుర్ని పిచ్చిదాన్ని చేస్తుందేమేనని లక్షాధికారులైన ఆమె తల్లిదండ్రుల భయం. వారి ఏకైక పుత్రికా రత్నమైన సుబ్బలక్ష్మికి మాత్రం క్రికెట్ అంటే ప్రియం. అందునా సుబ్బాచారి బ్యాటింగంటే ప్రియాతి ప్రియం.
సుబ్బాచారి టీమ్ బ్యాటింగ్ కొస్తేనే ఆమె స్టేడియంలో వుండేది. లేకుంటే టాస్ గెల్చిన ఎదుటి టీమ్ వాళ్లను తిట్టుకుంటూ అడ్డం వచ్చిన వాళ్లను తన్నుకుంటూ స్టేడియంలోంచి వెళ్లిపోయేది. మళ్లీ సుబ్బాచారి టీమ్ బ్యాటింగ్ కొస్తే గానీ లోపలికి వచ్చేదికాదు.
ఒకసారి ఒక గమ్మత్తు జరిగింది. సుబ్బాచారి బ్యాట్ పట్టుకుని రంగంలోకి ప్రవేశించాడు. సుబ్బలక్ష్మి ఆనందానికి అవధుల్లేవు. దూరంగా కూల్ డ్రింక్ అమ్ముకునే కుర్రాణ్ణి కేకేసింది. వాడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఆమె తన ఫ్రెండ్సందరికీ కూల్ డ్రింక్స్ ఇప్పించ్చింది. తానూ ఒకటి అందుకుని తాగబోతోంది.
ఆ క్షణంలోనే ఎవరో పిలిస్తే అటుగా పోబోయాడు. అట్లా పోతూ పోతూ ఆట చూస్తున్న సుబ్బలక్ష్మికి అడ్దం వచ్చాడు. ఈ లోగా అనుకోని విధంగా అక్కడ ఫీల్డ్‌లో ఆటగాళ్లందరూ ఎల్.బి.డబ్ల్యు. అప్పీల్ చేశారు. అంపైర్ చెయ్యెత్తాడు.. సుబ్బాచారి ఔటైనట్లు. ఇదంతా క్షణాల్లో జరిగిపోయింది.
కూల్ డ్రింక్ కుర్రాడు అడ్డు తొలగానే అంపైర్ చెయ్యెత్తి కనిపించటంతో పిచ్చి కోపం వచ్చిన ఆమె భద్రకాళిలా లేచి, అటుగా పోతున్న ఆ కుర్రాణ్ణి జుట్టు పట్టుకుని వెనక్కి లాగి, ఈడ్చి చెంపమీద కొట్టింది.
అసలే సుబ్బాచారి తొంభై తొమ్మిది పరుగులు చేసి ఔట్ అయ్యాడని స్టేడియమంతా కోలాహలంగా ఉంది. ఈ లోగా ఈ సంఘటన జరిగింది. దాంతో అందరూ ఏమైందేమైందంటూ గోల చేస్తూ లేచారు.
జరిగిందేమిటో క్షణకాలం అర్ధం కాలేదా కుర్రాడికి. ఆ పైన వెంటనే తేరుకుని తన వాళ్లందర్నీ కేకేసి, జరిగిన దానికి తన తిట్లు కూడా కలిపి వివరించి, ఇంకా కోపం తగ్గక ఆమెని రకరకాల భాషల్లో నానా తిట్లూ తిట్టసాగాడు. కుర్రాడి మనుషులందరూ అతడికి వత్తాసునిచ్చి ఆమె మీదికొచ్చారు. జనమంతా చుట్టూ పోగయ్యారు.
ఇంతలో ఇక్కడైనా సరిగ్గా డ్యూటీ చేద్దామనుకున్నారో ఏమో పోలీసులు పరిగెత్తుకుంటూ వచ్చి జనాన్ని చెదరగొట్టి పారేశారు. సేల్స్ బాయ్స్‌ని నెట్టి పారేశారు. ఎలాగైతేనేం సుబ్బలక్ష్మిని ఆ కుర్రాళ్ల బారినుంచి రక్షించి పారేశారు. ఆపైన ఓ ఇన్స్‌పెక్టర్ ముందుకొచ్చి ఓ హీరో ఫోజ్ పారేసి, దానికి తోడు ఓ చిరునవ్వు పారేసి, “వాట్ మేడమ్ వాట్ హేపెన్డ్?” అంటూ తనకు ఇంగ్లీష్ వచ్చునంటూ తెలియజేసి, “కూర్చోండి.. ఏం ఫర్వాలేదు” అని ఇంగ్లీష్‌లో అనటానికి రాకపోవటంతో తెలుగులోనే ధైర్యం చెప్పాడు.
అప్పటికే ఆమెకు తల తీసేసినంత అవమానమైంది. ఆవేశంతో పిచ్చి కోపంలో వాణ్ణి కొట్టిందే కానీ ఎందుక్కొట్టాల్సి వచ్చిందో అర్ధం కాలేదామెకు.
సేల్స్ బాయ్స్ అందరూ “పోలీసుల దౌర్జన్యం నశించాలి” అంటూ అరవటం మొదలుపెట్టారు.
ఫీల్డ్‌లోని ఆటగాళ్ల్తటతో సహా అందరి దృష్టీ ఇటు మరలింది. గొడవ తగ్గలేదు ఎంతకీ.
ఇదంతా చూసి స్టేడియం అధికారులు జనాన్ని శాంతింపజేయటానికి కొందరు ఆటగాళ్లతో కలిసి అటుగా వచ్చారు. వాళ్లలో సుబ్బాచారి కూడా వున్నాడు. అసలు సుబ్బాచారి చెపితేనే అందరూ శాంతిస్తారని ఆశతో అతన్ని తీసుకొచ్చారు.
అతడు వచ్చీరావటంతోనే చెలికత్తెల మధ్య రాజకుమారిలా వున్న సుబ్బలక్ష్మిని చూశాడు. శత్రు సైన్యాన్ని చిత్తు చిత్తు చేసి అలసిపోయి రాజ్యానికి బయల్దేరిన రాజకుమారుడిలా వచ్చిన సుబ్బాచారిని ఆమే చూసింది.
ఇద్దరి చూపులు కలుసుకున్నాయి. క్షణాలూ నిమిషాలూ గడిచాయి. సుబ్బాచారి ఏదో చెబుతాడని అంతా ఎదురుచూడసాగారు. కానీ అతడు మాత్రం ఒక్క సుబ్బలక్ష్మికి మాత్రమే ఏదో చెప్తున్నాడు- శబ్ద రహితమైన భాషలో. ఆ భాషకు అంగాలు కళ్లు మాత్రమే.
ఇంతలో ఎవడో రాలుగాయి స్టేడియం అదిరిపోయేట్టుగా “సుబ్బాచారీ ఈజౌట్” అని కేకేశాడు.
దాంతో సుబ్బాచారి, సుబ్బలక్ష్మి ఇద్దరూ ఒక్కసారిగా ఉలిక్కిపడి ఊహాలోకంలోంచి స్టేడియంలోకొచ్చి పడ్డారు.
ఆ తర్వాత అతడు సర్దుకుని, అందరికీ సర్దిచెప్పి కూర్చోబెట్టాడు. అతనికా రాత్రి నిద్ర పట్టలేదెంతకీ. బలవంతాన కళ్లు మూసుకుంటే కలత నిద్ర పట్టింది. ఆ నిద్రలో కల.. ఆ కలలో... కలలో కూడా క్రికెట్టే…
తను బ్యాట్ పట్టుకుని రంగంలోకి దిగాడు.. ఓపెనింగ్ బ్యాట్స్‌మన్‌గా. జనమంతా చప్పట్లు చరుస్తున్నారు. ఎదుటి టీం వాళ్లు నీళ్లు తెప్పించుకుంటున్నారు.. త్రాగటానికి. అంపైర్ ఏవో సూచనలిచ్చాడు. తను సర్దుకుని నించున్నాడు.
ఆ తర్వాత బౌలింగ్ స్టార్టయింది. పరిగెత్తుకొస్తున్న బౌలర్ని చూసి ఉలిక్కిపడ్డాడతను. ‘అరే! ఆ బౌలర్ మగాడు కాదు’.
తెల్ల ప్యాంట్ షర్ట్‌లో పొద్దున చూసిన ఊహాసుందరి తను.
ఆమె పరిగెత్తుకొస్తుంటే అతనామె అందాల్నే చూడసాగాడు. ఇంతలో బంతి విసురుగా వచ్చింది. దాన్ని హుక్ చేయాలనే ధ్యాసే లేదతనికి. ఆయాసంతో ఎగిరెగిరి పడుతున్న ఆమె అందాల్నే చూస్తున్నాడతను.
స్టేడియమంతా గోల. ఫీల్డర్సందరూ ఆమె చుట్టూ మూగి ఆమెను అభినందిస్తున్నారు. తను వెనక్కి చూశాడు. స్టంప్స్ లేవు... విసురుగా వచ్చి తగిలిన బంతి వల్ల అవి ఎగిరిపోయాయి. ఎగిరిన స్టంప్స్‌లో ఒకటి వికెట్ కీపర్‌కి తగిలిందేమో, అతడు స్టంప్ తగిలిన చోట రుద్దుకుంటున్నాడు.
తను కూడా వెళ్లి ఆమెను పైకెత్తుకుందామనుకున్నాడు.. కానీ తనా పని చేస్తాడా? చెయ్యొచ్చా? అంపైర్ ఔట్ డిక్లేర్ చెయ్యఖ్ఖర్లేదు.. క్లీన్ బౌల్డయ్యాక. ఎన్నడూ కాని విధంగా తను ఆ రోజు డకౌటయ్యాడు.
జనమంతా తనని తిడుతున్నట్లనిపించి ఉలిక్కిపడి లేచాడు. తీరా చూస్తే అది స్టేడియం కాదు.. బెడ్ రూమ్. ’అయితే అంతా కల... ఆ కలలో తను డకౌట్... అతనికి నవ్వొచ్చింది. ’అవును... ఆమె చేతిలో తను అవుట్... డకౌట్... హౌ స్వీట్’ అనుకున్నాడు. ఇక మరి ఆ రాత్రి నిద్రపోలేదతను.
***
ఆ మ్యాచ్ లో సుబ్బాచారి సెకండ్ ఇన్నింగ్‌లో డబుల్ సెంచరీ సాధించటంవల్ల మ్యాచ్ గెల్చారు. పెవిలియన్ లోకి వెళ్తూ సుబ్బలక్ష్మికోసం గ్యాలరీ వైపు చూశాడు. ఆమె ఫ్రెండ్స్ అందరూ వున్నారు కానీ ఆమె లేదు. ’అయ్యయ్యో! తనింత ఘనకార్యం సాధించిన రోజే ఆమె లేకపోయిందే’ అనుకున్నాడు.
తను డ్రెస్సింగ్ రూంలోకి వెళ్తుండగా అనుకోని విధంగా ఆమె ఎదురుపడ్డది. ఇద్దరూ ఒకరినొకరు చూస్తూ అలాగే నిలబడిపోయారు. చివరికి ఆమె తేరుకుని “కంగ్రాట్స్” అంది.
అప్పటికి తేరుకున్న అతడు “థాంక్స్ ఎలాట్. రండి లోపల కూర్చుందాం” అంటూ లోపలికి దారి తీశాడు.
పరిచయాలయాయి. ఆమె తనకి అతడి ఆటంటే ఎంత ఇష్టమో వివరించంది. “మీరెక్కడ ఆడుతున్నా రెక్కలు గట్టుకొని అక్కడ వాలేస్తాననుకోండి. డాడీ, మమ్మీలెంత మొత్తుకున్నా వినేది లేదు. మీ ఆటంటే నాకు అంత ప్రాణం” అందామె ఆరాధనగా అతనివైపు చూస్తూ.
”నా ఆటంటేనేనా ప్రాణం? నేనంటే కాదా?” ఠక్కున అడిగాడతడు.
మొదట ఉలిక్కిపడింది. ఆ తర్వాత సిగ్గు పడింది. ఆ పైన ఇహ తప్పదుగనక ప్రేమలోనూ పడింది. అతడే ధైర్యం చేసి “ఐ లవ్ యూ” అన్నాడు. ఆమె సిగ్గుపడిపోయి “ఐ టూ” అంది.
’లవ్ ఎట్ ఫష్ట్ సైట్... తొలిచూపులో ప్రణయం’ అనుకున్నాడతడు. ఇద్దరూ అమాంతంగా ఇష్టమొచ్చినన్ని కలలు కనేశారు. ఆ కలల్లో హిమాలయాలనుండి హిందూ మహా సముద్రం వరకూ ఉన్న పచ్చిక మైదానాల్లో, ఉద్యాన వనాల్లో, సెలయేళ్ల పరవళ్లలో మైమరచి డ్యూయెట్లు పాడేసుకున్నారు.
***
ఇంగ్లండ్ వెళ్తున్న భారత జట్టులో ఓపెనింగ్ బ్యాట్స్‌మన్‌గా సుబ్బాచారిని సెలెక్ట్ చేశారు. ఆ వార్త తెలియగానే ముందుగా సుబ్బలక్ష్మి ముందు వాలాడు.
”సుబ్బూ.. ఇదంతా నీ అనుగ్రహం” అన్నాడు.
”నాదేముంది. ఇదంతా నీ సామర్ధ్యం” అందామె.
”నో..నో.. సుబ్బూ! నువ్విలా నా జీవితంలోకి అడుగు పెట్టావు. నాకిలా ఈ ఛాన్స్ వచ్చేసింది. ఇది నీ మహిమే”.
”ఓకే .. నువ్వలా అనుకుంటే నాకభ్యంతరమేమీ లేదు. కానీ నేను మాత్రం నీ శక్తిసామర్ధ్యాలే నీకా అవకాశాన్నిచ్చాయంటా”
”ఓకే.. అదంతా వదిలెయ్. నాతోబాటు ఇంగ్లండ్ వస్తావా లేదా?”
"రాకుండా ఉంటానా? అసలు ఉండగలనా? కాక పోతే మా మమ్మీ డాడీలతో పెద్ద యుద్ధం చెయ్యాల్సివస్తుంది. చివరికి వాళ్లే కాళ్ల బేరానికొస్తారనుకో” ధీమా ధ్వనించిందామె గొంతులో.
”ఒకవేళ పంపించరని అనిపిస్తే నాకు తెలియజెయ్యి. నేను వాళ్లకు నచ్చజెప్తాను”
”అబ్బో .. అప్పుడే అల్లుడి హోదా వెలగబెట్టేయ్యాలనే..” అందామె అతన్ని ఉడికిస్తూ.
” తప్పుతుందా.. ఈ దేవి కరుణించాక” అన్నాడతను ఆమె ముక్కు పట్టి ఆడిస్తూ.
***
మొదటి మ్యాచ్ వెల్లింగ్‌టన్‌లో ...
ఇంగ్లండ్ కాలమానం ప్రకారం పది గంటలకు ఆట మొదలు. స్టేడియం కిక్కిరిసిపోయి వుంది. గ్యాలరీలో ఒకవైపున భారతీయులు కూర్చుని వున్నారు. వాళ్లలో సుబ్బలక్ష్మి తన స్నేహితురాళ్లతో సహా కూర్చుని వుంది. అంపైర్లు ఇద్దరు గ్రౌండ్‌లోకి వెళ్లి పిచ్‌ని పరీక్షించారు. అంతా ఓకే చేసుకున్నారు. ఆ పైన రెండు టీమ్‌ల కెప్టెన్స్ మెల్లిగా గ్రౌండ్‌లోకి నడిచారు. ఇంగ్లండ్ కెప్టెన్ బాబ్ విల్లీస్, భారత కెప్టెన్ కపిల్ దేవ్ ‘టాస్’ కోసం వెళ్తుండగా సుబ్బాచారి ఉత్కంఠతతో చూస్తుండిపోయాడు.
కపిల్ టాస్ గెల్చి బ్యాటింగ్ కోరాడు. ఇన్నింగ్ ఓపెనింగ్ కోసం గవాస్కర్ వెనగ్గా నడుస్తున్న సుబ్బాచారి ఒక్కసారి ప్రక్కకు తిరిగి చూశాడు. అక్కడికి దగ్గర్లోనే ఫ్రంట్ రోలో సుబ్బలక్ష్మి కూర్చునివుంది. ఆమె ముఖంలో ఉత్సాహంకన్నా ఉత్కంఠత ఎక్కువగా కన్పించిందతనికి. అతడు ఆమె వైపు చూసి చిన్నగా నవ్వాడు. ఆమె చెయ్యి ఊపింది. తనూ చెయ్యి ఊపుతూ ముందుకు నడిచాడు.
ఇంకేం.. గవాస్కర్ తో పాటు అతడు రంగంలోకి దిగాడు. అతడు కొత్త ఆటగాడనే విషయం స్టేడియంలో వున్న ప్రతి ఒక్కరికీ తెల్సు. అందుకే అందరూ అతడెలా ఆడతాడా అని ఎదురు చూడసాగారు.
మొదటి బాల్ ఫేస్ చేసిన గవాస్కర్ సింగిల్ రన్ తీశాడు. దాంతో స్ట్రైకింగ్ సుబ్బాచారికి వచ్చింది.
”మెల్లిగా ఆడు.. ఫరవాలేదు..తొందర పడవద్దు” గవాస్కర్ ధైర్యం చెప్పాడతనికి.
మొదటి ఓవర్‌లో రెండో బాల్ అది. విసురుగా వచ్చింది. అంతకంటే విసురుగా అతడి బ్యాట్ దాన్ని ఎదుర్కొంది. ఫీల్డర్సందరూ బాల్ కోసం చూశారు. కానీ బాల్ కన్పించలేదు. అది పక్షిలా ఎగురుతూ పోయి కామెంటేటర్ బాక్స్‌మీద పడింది.... ఏ బ్యూటీఫుల్ సిక్సర్... స్టేడియంలో గగ్గోలు పుట్టింది.
విల్లీస్ బౌలింగ్‌లో… అదీ మొదటి ఓవర్ లోనే సిక్సర్… ’ఓ గాడ్! ఇతనెవరో ఉతికేటట్లున్నాడే’ అనుకున్నారంతా.
బాల్‌ని అందుకుని కోపంగా తొడకు రబ్ చేశాడు విల్లీస్. వేగంగా తన బౌలింగ్ మార్క్ దగ్గర్నుంచి బయల్దేరాడు.
వస్తున్న బాల్ ని జాగ్రత్తగా గమనించాడు సుబ్బాచారి. అది దగ్గరికి రాక ముందే ఒక అడుగు ముందుకేసి స్వీప్ చేశాడు. బాల్ బౌండరీ లైన్ దాటి పోయింది. ఎర్రని బాబ్ విల్లీస్ ముఖం మరింత ఎర్రబడింది. ఒకే ఓవర్ లో మూడు బాల్స్‌కే పదకొండు పరుగులు…
బాల్ వెనక్కి వచ్చింది. దాన్ని అందుకుని తన బౌలింగ్ మార్క్‌కేసి నడిచాడు విల్లీస్.
స్టేడియంలో జనమంతా తెగ అరుస్తున్నారు పిచ్చెక్కినట్లు. సుబ్బాచారి ఒక్కసారి సుబ్బలక్ష్మి ఉండే వైపు చూశాడు. మొదటి వరసలో నుంచుని అతనివైపే చూస్తోందామె. అతనటు చూడగానే ఒక ముద్దు గాల్లోకి వదిలింది. అతడి ఉత్సాహం రెట్టింపయింది. ఆ ఉత్సాహంలో వచ్చిన బాల్‌ని నీట్‌గా కట్ చేశాడు. అది అంతకంటే నీట్‌గా గాల్లోకి లేచింది.
అక్కడున్న ఫీల్డర్ ఏమాత్రం పొరపాటు చెయ్యలేదు.
స్టేడియంలో సముద్రపు హోరులాంటి ఘోష.
అప్పటికే బాబ్ విల్లీస్‌ను ఫీల్డర్లందరూ తమ చేతులమీదకి ఎత్తుకున్నారు.
అంతకుముందువరకు మెచ్చుకున్నవాళ్లంతా అప్పుడు సుబ్బాచారిని తిట్టటం మొదలుపెట్టారు. ”ఏం అంత దుడుకుగా, దురుసుగా ఆడకపోతే? ఇదేమన్నా ఇండియానా ఇష్టమొచ్చినట్లు బాదటానికి? కొట్టేముందు కొద్దిగా వెనకా ముందూ చూడక్కర్లా?”
అతడికి తల కొట్టేసినంత పనైంది. గ్లవ్స్ విప్పుకుంటూ మౌనంగా పెవిలియన్‌కేసి నడిచాడు. అతనికి సుబ్బలక్ష్మి వున్న వైపు చూడబుద్ధి కాలేదు. డైరెక్ట్‌గా లోపలికి వెళ్లి రెస్ట్ తీసుకోసాగాడు.
కొద్దిసేపటికి ఆమె లోపలికి వచ్చింది. ఆ అలికిడికి అతడు కళ్లు తెరిచాడు. ఆమె కళ్లనిండా నీళ్లతో నిలబడి వుంది. అతను లేచి వచ్చి “ఛ.. ఏమిటి ఇంత బేలతనమా? ఆటలో ఇలాంటివి సహజం” అన్నాడు. ఆమె భోరున ఏడ్చేసింది.
***
నాలుగో రోజు తమ సెకండ్ ఇన్నింగ్ మెదలయ్యేసమయానికి అతడు రెడీ అయ్యాడు. అప్పటికే ఇంగ్లండ్ టీం ఇండియా పైన రెండొందల పరుగులు లీడింగ్‌లో వున్నారు.
”ఈసారన్నా జాగ్రత్తగా ఆడకపోతే ఇన్నింగ్స్ డిఫీట్ ఖాయం” అన్నారెవరో అతడు గ్రౌండ్‌లోకి వెళ్తుండగా. అతడు వెనక్కి తిరిగి చూడదల్చుకోలేదు.
మొదటి ఓవర్ మెయిడెన్ ఓవర్. గవాస్కర్ ఎంతో ఓపిగ్గా డిఫెన్స్ ఆడాడు. రెండో ఓవర్ స్ట్రైకింగ్ సుబ్బాచారికి వచ్చింది.
అతడు పొజిషన్ తీసుకుంటూ సుబ్బలక్ష్మికేసి చూశాడు. ఆమె చెయ్యి ఊపింది గాల్లో. అతడు బ్యాట్ పైకెత్తి విష్ చేశాడు.
విసురుగా వచ్చిన బాల్‌ని స్వీప్ చేశాడతను. అయితే అతని అంచనా ప్రకారం బాల్ బ్యాట్‌కి తగల్లేదు. అది వెనకనున్న స్టంప్స్ లో మధ్యదానిని లేపేసింది.
తెల్ల జనం చిందులేయసాగారు.. నల్ల జనం తెల్లబోయారు. ముఖాలు మరీ నల్లబడ్డాయి.
***
ఆ సీరీస్‌లోని మూడు టెస్టుల్లో ఏ ఇన్నింగ్‌లోనూ అతడు పదికన్నా ఎక్కువ పరుగులు చెయ్యకపోగా ఒక టెస్ట్‌లో రెండు ఇన్నింగుల్లోనూ డకౌట్ అయ్యాడు.
ఆట మొదలయ్యాక అతడు సుబ్బలక్ష్మిని చూడటం, ఆమె ఉత్సాహంగా చెయ్యి ఊపడమో, ముద్దు గాల్లోకి వదలటమో చెయ్యటం, ఇతడేమో ఆ ఉత్సాహంలో బంతిని గుడ్డిగా కొట్టటం, అది ఏ ఫీల్డర్ చేతిలోకో వెళ్లటం... కాకుంటే క్లీన్ బౌల్డ్… దాంతో నాల్గో టెస్ట్‌లో అతణ్ణి టీమ్‌లోంచి తొలగించేశారు సెలెక్టర్స్.
సీరీస్ పూర్తయ్యాక ఇండియా వచ్చిన అతన్ని అనేకమంది జర్నలిస్టులు చుట్టుముట్టారు. అందరిదీ ఒకే ప్రశ్న.. “ఇండియాలో జోనల్ మ్యాచ్‌లలో ఎన్నిట్లోనో సెంచరీలు సాధించిన మీరు, ప్రతి బాల్‌ని ఎంతో ఈజీగా ఎదుర్కొనే మీరు, ఇంగ్లండ్ లో ఎందుకు విఫలమయ్యారో చెప్తారా?” అని.
అందరికీ అతడు సమాధానం చెప్పాడు, “నేను ఇంగ్లండ్‌లో ఫెయిలవ్వటానికి కారణం ఎల్.బి.డబ్ల్యు” అని.
అంతా ఆశ్చర్యపోయారు. అంతలోనే తేరుకున్న ఒక జర్నలిస్ట్ “అదేమిటి? మీరు ప్రతి ఇన్నింగ్ లోనూ ఎవరికైనా క్యాచ్ ఇచ్చో, క్లీన్ బౌల్డో, లేక రనౌటో అయ్యారు. ఎప్పుడూ ఎల్.బి.డబ్ల్యు అవలేదు గదా?” అనడిగాడు.
అవునన్నట్లు తలూపాడతను.
”మరి.. మీ వైఫల్యానికి కారణం ‘లెగ్ బిఫోర్ వికెట్’ అని చెప్తారేం?” మరో అతను అడిగాడు.
”ఎల్.బి.డబ్ల్యు. అంటే ‘లెగ్ బిఫోర్ వికెట్’ కాదు” అన్నాడతను.
”మరి...?” ఆతృతగా అడిగారందరూ.
అతడు బలహీనంగా నవ్వి, లేచి వెళ్లిపోయాడు లోపలికి. వెళ్తూ అనుకున్నాడు ‘నా వైఫల్యానికి కారణం ఎల్.బి.డబ్ల్యునే. అంటే ‘లవ్ బిఫోర్ వెడ్డింగ్’.. అంతే’ అని.
ఏ సమాధానమూ చెప్పకుండా వెళ్లిపోతున్న సుబ్బాచారిని ఆశ్చర్యంతో చూస్తుండిపోయారు విలేఖరులంతా.
*** *** ***