దక్షిణ వీధి వారసుడు
నేను మీకు నా కధ చెప్పేముందు అమ్మ నాన్నల, తాతయ్య నానమ్మల ద్వారా నేను విన్న, నేను తెలుసుకున్న మా ఇంటి కధ అందులో వున్న నా కధ చెప్తాను వినండి.
అమ్మ,నాన్న నా ముందే అన్ని విషయాలు మాట్లాడుకుంటారు. నేను కూడ ఆ రోజు సంగతులు ఏమిటా? అని ప్రతి రోజూ వినటానికి ఆసక్తి గా ఉంటాను.
ప్రతి రోజు అమ్మ,నాన్న, తాతయ్య,నానమ్మ మాట్లాడే విషయాలు వింటున్న నాకు వీళ్ళందరి సమస్యకు కారణము నేనే అనిపించింది. నేను వచ్చిన తర్వాత మా ఇంట్లో చాలా మార్పులు జరిగాయి.
ఉదయం నానమ్మ అమ్మ దగ్గరకు వచ్చి “ ఆ జాతి తక్కువ వాడిని అనాధ ఆశ్రమంలో చేర్చండి లేదా ఇంటి నుండి వెళ్ల గొట్టండి . వాడు మన వంశ వారసుడు కాదు అంటే వినరు.ఈ ఇంట్లో ఇప్పటివరకు జరిగిన దరిద్రాలు చాలు, వాడు వచ్చిన తర్వాత మనింట్లో జరిగిన అరిష్టాలు నువ్వు, నీ మొగుడు గుర్తుకు తెచ్చుకోండి “ అంటూ గొనుగుతూ బాల్కనీ లోకి వెళ్ళిపోయింది. ఆ క్షణం అమ్మ కళ్ళలో నీళ్ళు చూసాను.
*
అమ్మ,నాన్న ఇద్దరు ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నారు. మా ఇంట్లో వారితో పాటు తాతయ్య, నానమ్మ వుంటారు. మా అమ్మ నాన్నలకు పెల్లి అయి పది సంవత్సరాలు అయింది. చాల కాలం పిల్లలు కలగలేదు.
నాలుగు సంవత్సరాల క్రితం మా ఇంట్లో దాలమ్మ అనే పనిమనిషి చేరింది. దక్షిణ వీధి నుండి వచ్చేది.మొదట్లో ఆవిడ పనిమనిషిగా రావటం తాతయ్య, నానమ్మకు ఇష్టం లేదు. పనివారు దొరకక ముఖ్యంగా తాతయ్య,నానమ్మలకు అమ్మ నాన్న వెల్లిన తరువాత రోజంతా తోడుగా వుంటుందని తప్పనిసరి అయి ఒప్పుకున్నారు.
దాలమ్మకు నెలల బిడ్డ . వాడి పేరు ఏసుదాసు. ఆవిడ భర్త త్రాగుబోతు. దాలమ్మ మా ఇంట్లో పని చేసేటపుడు ఆవిడ కొడుకును అమ్మ ఆడించేది,ఒక్కోసారి అమ్మ ఒడిలోనే నిద్రపోయేవాడు. పిల్లలు లేని అమ్మ వాడిని అడిపించటంలోనే మాతృత్వ అనుభూతి పొందేది.
దాలమ్మ భర్త ప్రతి రోజూ త్రాగి వచ్చి దాలమ్మను హింసించడం,అనుమానించడం వంటి భాధలు పడలేక ఒకరోజు దాలమ్మ వురి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది .
మా ఇంట్లో ఆమె చివరి రోజూ పని చేస్తు “ మీకు పిల్లలు లేరు నా కొడుకును పెంచుకోండి” అంది . ఆవిడ చనిపోయిన తరువాత దాలమ్మ కొడుకు ఏసుదాసును ఇంటికి తీసుకు వచ్చారు. ఏసుదాసు పేరును రామదాసుగా నాన్న మార్చారు.
నానమ్మ,తాతయ్య ‘దాలమ్మను తప్పని సరై పని మనిషి గా ఒప్పుకున్నట్లే’ ఆవిడ బిడ్డ దాసును పెంచు కోవటం ఇష్టం లేకపోయినప్పటికీ తప్పనిసరై ఒప్పుకున్నారు.
అందరూ ముద్దుగ ‘దాసు’ అని పిలుస్తున్నారు.
దాసు వచ్చిన రోజు నుండి అమ్మనాన్నల ఆనందంకు అవధులు లేవు .వాడు వచ్చిన రెండవరోజు ఆకలితో ఏడుస్తుంటే అమ్మ, రొమ్ము పాలు పెట్టిందట. అప్పటి వరకు పిల్లలు లేక జీవితములో ఏదో కోల్పాయాము అనుకుంటున్న వారు ఇద్దరు దాసును అల్లారు ముద్దుగా చూసేవారు.
దాసు వచ్చిన కొద్ది రోజులకు నాన్న ఉపాద్యాయుడు నుండి ప్రధాన ఉపాద్యాయుడుగా పదోన్నతి పొందారు. అమ్మకూడ దూరంగా ఉన్న స్కూల్ నుండి దగ్గర స్కూలుకు బదిలీ అయింది.ఇవన్నీ వాడివలనే అని మురిసిపోయారు.
కొడుకు, కోడలుకు పిల్లలు లేరని దిగులు పోయి హాయిగా నవ్వుకోవటంతో తాతయ్య నానమ్మలో కూడ కొద్ది రోజులలోనే మార్పు వచ్చింది.
&
ఈ కధ అంతా విని ఇది నా కధ అనుకుంటున్నారు కాబోలు .ఇది నా అన్నయ్య రామదాసు అనబడే ఏసుదాసు కధ.
అమ్మ నాన్నలతో వారము రోజులు క్రితం తాతయ్య అన్న మాటలు గుర్తొచ్చాయి.“ఈ సమస్య చూడటానికి వినటానికి చాలా చిన్నదిగా కనిపిస్తుంది ,కాని భవిష్యత్ లో ఇదే పెద్ద బండరాయి అయి నెత్తి మీద కూర్చుంటుంది.
నేను , మీ అమ్మ చనిపోతే నువ్వు పెద్ద కొడుకుగా వంశ వారసుడుగా తలకొరివి పెడతావు.అందరూ చనిపోయిన వాళ్లే నువ్వు చనిపోతే ఎవరు చితి అంటిస్తారు?... ఎవరు దహనం చేస్తారు?... జాతి తక్కువ వాడు నీ పెద్ద కొడుకుగా దహనం చేస్తాడా? లేదంటే పెంపుడు కొడుకు కాబట్టి వాడిని కాదని నీ చిన్న కొడుకు చితి వెలిగిస్తాడా?, ఇద్దరిలో ఎవరు వంశ వారసుడు?” గట్టిగా అరుస్తూ అడిగారు తాతయ్య.
“ ‘ఆలీ లేదు సూలు లేదు కొడుకుపేరు సోమలింగం’ అన్న సామెత మాదిరిగా ఇప్పుడు మా వయసు ముప్ఫై అయిదు సంవత్సరాలు డబ్బై సంవత్సరాల తర్వాత చావు కోసం ఇప్పుడు ఎందుకు మాట్లాడటం నాన్నగారు! “ అన్నారు నాన్నకూడ కోపంగా .
“నీకు ముప్పై అయిదు సంవత్సరాలు కాబట్టే నీకు ఏమి అర్థమవటం లేదు. నా స్నేహితుడు వైజాగ్ విశ్వనాథ మామయ్య తెలుసు కదా! వాడి దహన సంస్కారాలలో ఇదే సమస్య వచ్చింది. వాడికి పిల్లలు లేక కాపుల అబ్బాయిని పెంచుకున్నారు . వాడిని పెంపకం తీసుకున్న సంవత్సరం తిరగకముందే విశ్వనాధ్ మామయ్యకు అబ్బాయి పుట్టాడు.
విశ్వనాథం మామయ్య చనిపోయినపుడు పెంపుడు కొడుకు పెద్ద వాడు వాడే చితి ముట్టించాలి అనే వాదన వచ్చింది, కాదు రక్తం పంచుకున్న కొడుకు మాత్రమే లెక్కలోకి వస్తాడు పెంపుడు కొడుకు బ్రాహ్మణుడే కాదు కదా! అని కొందరు వాదించారు.
దహన సంస్కారాలుకు వచ్చిన బ్రాహ్మణులు కూడ రెండు గ్రూపులుగా మారి చెరో వాదన వినిపించారు.ఆరోజు పెద్ద యుద్ధమే జరిగింది. ఉదయం జరగాల్సిన కార్యం మధ్యాహ్నం మూడు గంటలకు జరిగింది” అన్నాడు తాతయ్య.
*
మా ఇంట్లో గత మూడు సంవత్సరాలుగా అంతా బాగానే ఉంది కానీ గత ఆరు నెలలుగా విచిత్రమైన మార్పు వచ్చింది.
ముఖ్యంగా నానమ్మ, తాతయ్యలో వారసుడు, జాతి, కులం అనే పదాలు వినిపిస్తున్నాయి. తాతయ్య లో మార్పు మరీ ఎక్కువ “ నా రక్తం పంచుకుని పుట్టావు నువ్వు, నీ రక్తంతో పుట్టిన వాడే నా మనవడు, ఈ ఇంటి వారసుడు వాడే అవుతాడు “ అని వాదించారు.
తాతయ్యా నానమ్మ ఇంటికి వారసుడు వచ్చాడు కదా ,ఇంక ఈ జాతి తక్కువ వెధవ ఎందుకు? అని వాడిని అనాథ శరణాలయంలో పెట్టమని సలహా యిచ్చారు.
దాసు వచ్చిన తర్వాత ఎన్ని అనర్థాలు జరిగాయి అనేది తాతయ్య మరొసారి వల్లె వేసారు.
దానికి సమాధానంగా నాన్న , వాడు వచ్చిన కొద్ది రోజులకు నాన్న ఉపాద్యాయుడు నుండి ప్రధాన ఉపాద్యాయుడుగా పదోన్నతి పొందారని అమ్మకూడ దూరంగా ఉన్న స్కూల్ నుండి దగ్గర స్కూలుకు బదిలీ అయింది అని గుర్తు చేస్తూ వాడికి అనాధ ఆశ్రమంలో చేర్పించే బదులుగా మిమ్మల్ని వృద్ధ ఆశ్రమంలో చేరుస్తాను అని గట్టిగా తిరుగు జవాబు ఇచ్చారు.
బిడ్డలు లేరని పెంచుకున్న దాసు అన్నయ్య మీద సాధింపు ఎక్కువ అయింది. ఎలాగైనా వాడిని వదిలించకుందామని ప్రయత్నాలు మొదలు పెట్టారు తాతయ్య.
అమ్మ నాన్న గారు మాత్రం దాసు అన్నయ్య వచ్చిన తర్వాత అంతా మంచి జరుగుతుందని నమ్ముతున్నారు. అమ్మ నాన్నలకు దాసు అన్నయ్య అంటే ఇష్టం తగ్గలేదు కాని నానమ్మతాతయ్య లకు మాత్రం గత ఆరు నెలలుగా అన్నయ్య అంటే అయిష్టం పెరిగింది.
అమ్మ నాన్న ఇద్దరు స్కూలుకు వెళ్ళిన తరువాత నానమ్మ దాసు అన్నయ్య తో “ ఎందుకురా! మా ఇంట్లో దాపురించావు,మేము ఏ జన్మలో చేసుకున్న పాపం? రా ఇది జాతి తక్కువ వెధవ!” అని తిట్టేదట.ఇలాంటి చీటి పోటీ మాటలు,అమ్మ స్కూల్ నుండి వచ్చిన తర్వాత దాసు అన్నయ్య అమ్మతో చెప్పటం నేను గత ఆరు నెలలుగా వింటున్నాను .
సమస్య ఇప్పుడు నా వలన చిలికి చిలికి గాలి వాన అయింది. పరిస్థితి ఎంతలా అయింది అంటే , తాతయ్య మొన్న దాసుఅన్నయ్యను ఆట కోసం తీసుకువెళతాను అని చెప్పి ఊరు చివర స్మశానంలో వదిలి పెట్టి వచ్చాడు. అక్కడ శవాలు కాలుతుంటే చూసి భయపడి చనిపోతాడని తాతయ్య వుద్దేశ్యం, అయితే స్కూలు నుంచి వచ్చిన నాన్నగారు దాసు అన్నయ్యను వెదికి ఇంటికి తీసుకువచ్చారు.
నాన్నకు ఆ రోజు చాలా కోపం వచ్చింది. “రామదాసు నా కొడుకు ,వాడు ఇష్టం లేకపోతే మీరే ఇల్లు వదిలి వెళ్ళండి” అంటూ వారిద్దరి మీద అరిచారు.ఆ కోపంలో ఆ రోజే నానమ్మ తాతయ్య లను వృధ్ధ ఆశ్రమంలో చేరుస్తాను అని నిర్ణయానికి వచ్ఛారు.
ఆ రోజు రాత్రి అమ్మ ప్రక్కకు వచ్చి నానమ్మ “ చూడు కోడలు పిల్లా! దాసు వచ్చిన నెల తిరగక ముందే విజయనగరంలో వుండే నీ ఆడపడుచు చనిపోయింది గుర్తు వుందా?” అని అడిగింది.
“ అది కాదు అత్తయ్యా! ఆరునెలలుగా ఆవిడకు క్యాన్సర్ కదా,ఆ విషయాన్ని వదిలిపెట్టి ఆ చావుకు వీడే కారణం అనడం భావ్యం కాదు” అంది.
“ కేన్సర్ తగ్గిపోయింది, వీడు మన ఇంట్లో అడుగు పెట్టటం వలనే ఇలా జరిగింది ” అంది నాన్నమ్మ.
“ నాకు ఆ మధ్య తరుచూ ఆయాసం వస్తుండేది అది కూడ రామదాసు వచ్చిన కొత్తలో గుర్తు వుందా? “ అడిగారు నాన్నతో తాతయ్య ప్రక్కనే ఉన్న అమ్మ వినేట్లుగా.
“నాన్న గారు! ఆయాసం అనేది వృద్ధాప్యం వలన వచ్చింది అంతే గానీ దాసు రాక వలన కాదు “ అన్నారు నాన్నగారు.
ఇవన్నీ వింటున్న నాకు బాధ అనిపించింది,గుండె ఎవరో పిండి నట్లు వుంది.నా వలనే కదా అమ్మ నాన్నలు, తాతయ్య,నానమ్మ లను ఆశ్రమంలో చేరుద్దామని నిశ్చయించారు.
నా వలనే కదా అనందంగా వున్న అన్నయ్య జీవితంలో అనుకోని కష్టాలు.
నా జీవితము నలుగురుకీ ఉపయోగపడాలి కాని నలుగురు జీవితాలను ఇబ్బంది పెడుతుంది అనిపించింది.
&
ఆదివారము సెలవు కావటంతో అమ్మ పని అంతా ముగించి బెడ్ రూంలో చేరబడింది .అలిసి వుండటంతో వెంటనే నిద్ర పట్టేసింది అమ్మకు.
పడుకున్న అమ్మ దగ్గరకు అన్నయ్య వచ్ఛాడు .కడుపు మీద తలపెట్టాడు చిన్నగా “ తమ్ముడు! తాతయ్య,నానమ్మ మంచివాళ్ళు.నన్ను బాగ చూసుకునేవారు.నువ్వు కడుపులోకి వచ్చి నప్పటి నుండి వారిలో మార్పు వచ్చింది.నన్ను నానమ్మ అనరాని మాటలు అంటుంది.తాతయ్య చంపటానికి ప్రయత్నించాడు.
బహుశా నేను సంతోషంగా ఉండాలంటే ఎన్నాళ్ళు వీలైతే అన్నాళ్ళు నువ్వు అమ్మ కడుపులోనే వుండిపోరాదూ? అన్నయ్య కంట్లో చిన్నగా కన్నీరు నేను చూశాను.
&
ఆరు నెలలు క్రితం అమ్మకు ఒంట్లో బాలేదని నాన్నగారు అమ్మను డాక్టర్ దగ్గరకి తీసుకువెళ్తే తను నెల తప్పింది అని చెప్పారు. కడుపులో విపరీతంగా నొప్పి రావటంతో స్కానింగ్ చేసి మగబిడ్డ అని అడ్డం తిరిగిందని చెప్పారు,వైద్యము తరువాత అదృష్టవశాత్తూ తల్లికి బిడ్డకు ప్రాణాపాయం లేదు అని చెప్పి పంపారు.
&
ఈ రోజు ఉదయం అమ్మకు నొప్పులు ఎక్కువగా రావడంతో హుటా హుటిన ఆసుపత్రికి తీసుకువచ్చారు.
అమ్మ, నాన్న, తాతయ్య ,నానమ్మ లు నేను క్షేమంగా బయటకి రావాలని దేవుడుకు ప్రార్థిస్తున్నారు.
కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. డాక్టర్ అమ్మను, కడుపులో వున్న నన్ను పరీక్షలు చేసారు .
‘నేను అమ్మ కడుపులో పొరపాటున ఉమ్మి నీరు త్రాగటంతో చనిపోయాను’ అని చెప్పాడు .
నేను పొరపాటున కాదు, కావాలనే ఆ పని చేసాను అన్న విషయము డాక్టర్ కు ఎలా తెలుస్తుంది!?
తర్వాత ఏమి జరుగుతుంది అనేది నేను ఊహించగలను.
నేను చనిపోయానని తెలిసి అమ్మ నాన్న ఏడుస్తుంటారు.
తాతయ్య,నానమ్మ వారసుడు తన జాతి వాడు కాదని బాధపడుతుంటారు.
ప్రక్కనే వున్న అన్నయ్య “తమ్ముడు కావాలి” అని ఏడుస్తుంటే ఎత్తుకుంటూ ఇంటికి చేరుతారు.
కొద్దిరోజులు బాధపడి చివరికి అందరూ మాములు స్థితికి వస్తారు .
వారసుడుగా అన్నయ్య మారతాడు.
***