పెన్ను పో(పా)ట్లు
**************
"ఏవోయ్…..”
మూర్తి అరుపులాంటి పిలుపుకు అదిరిపడింది అనంతం.
"కరెంటు షాక్ కొట్టినట్టు ఎందుకలా అరిచారు?” అంది కంగారుగా భుజం మీద తట్టుకుంటూ .
చేతిలో సెల్ పట్టుకుని సొమ్మసిల్లినట్టు మొహం పెట్టుకున్న మూర్తి దగ్గరకు వెళ్ళి అతన్ని పరిశీలనగా చూసింది. అంతా బాగానే వున్నట్లనిపించింది..
మూర్తి మళ్ళీ ఓసారి సెల్ చూసి దిగులుగా మొహం పెట్టాడు.
“ఆ సెల్లులో చూసి, కల్లు తాగిన కోతయ్యారు దేనికీ? మీలో సగపాలునిగానా? మీ సమస్యని నేను తీర్చలేనా? చెప్పండి?” అంది.
"నువ్వు నాజీవితంలోనేకాదు, నా జీతంలో కూడా పొంగే పాలువేగానీ ముందుది చూడు. ఏం జరక్కూడదనుకున్నానో అదే జరిగింది.” అన్నాడు మూర్తి ఫోన్ భార్యకి చూపిస్తూ.
“ఏదో ఫలితాల ప్రకటన. మీ పేరు కూడా వున్నట్టుందే” అంది .
“నా కథకి మొదటి బహుమతి వచ్చింది."అన్నాడు మొహం ముడుచుకుని.
"అవునా, నిజమా, హుర్రే, అయితే ఆనందపడాలిగానీ
అలా ఏడుపుమొహం పెడతారే? సరేగానీ బహుమతి మొత్తం ఎంతిస్తారేవిటి?" అడిగింది భర్తవంక మురిపెంగా చూస్తూ.
"పదివేల నూటపదహార్లు ఇస్తారు" అన్నాడు
"అబ్బో! పదివేలే? ఆ మాట గొప్పగా చెప్పాలిగానీ అంత చప్పగా చెబుతారేం. ఒక్క కథకి పదివేలంటే పండగే. ఆ నూట పదహార్లు మీరుంచుకుని పదివేలు నాకివ్వండి.పట్టుచీర కొనుక్కుంటా" అంది పట్టుచీరని పైటేసుకున్నట్టు అభినయిస్తూ.
"చీ ఆపు, అసలూ కథ పంపేటప్పుడే నాకు మొదటి బహుమతి వచ్చినా, చచ్చినా ఇవ్వొద్దని, ఇంకెవరికైనా ఇవ్వమని.హామీ పత్రంలోనే స్పష్టంగా రాసి పంపినా పట్టించుకోకుండా ఇచ్చారంటే ఏమనుకోవాలి" విసుక్కుంటూ పోటీకి పంపిన మెయిల్ చూపించాడు.
"ఏడిసినట్టుంది. సాధారణ ప్రచురణకు తీసుకోవద్దనేవాళ్ళని చూశానుగానీ మొదటి బహుమతి వద్దనిచెప్పే దద్దోజనాన్ని మిమ్మల్నే చూస్తున్నా. డబ్బులు వస్తుంటే చేదా?!" అంది భర్త మాటని కొట్టి పడేస్తూ.
"నీమొహం, నీకేం తెలుసు, మొదటి బహుమతి పెద్ద గుదిబండ. దాన్ని మోసుకుంటూ తిరగాలి. మనబండ మనకాళ్లకే అడ్డుపడుతుంటుంది.
ఆడ్ మ్యాన్ అవుట్ లా మనల్ని గుంపులోంచి వెలేస్తారు.
కథలో లోపాల్ని భూతద్దాలు పెట్టి గుచ్చిగుచ్చి చూస్తారు. కథకి ఆ పేరెందుకు పెట్టారంటూ పెన్ను పెట్టి పొడుస్తారు.
రొమాంటిక్ కథకి తక్కువ, క్రైమ్ కథకి ఎక్కువని ఎద్దేవా చేస్తారు. కొంతమందైతే ఈ కథ నువ్వే రాశావా లేక వ్యాసుడు వచ్చి చెబితే వినాయకుడిలా కాపీ చేశావా? నీ వెనక ఏదైనా శక్తి వుండి నడిపిస్తోందా అని పిచ్చుక ప్రశ్నలన్నీ వేసి పిచ్చెక్కిస్తారు.
చింతకాయ దంచినట్టు దంచి, బట్టలో వేసి పిండినట్టు రసాన్ని తీస్తారు. ఏకీలుకాకీలు ఏకి పాకం పడతారు. చివరికి
'ప్యానల్ లో వీడివాడెవడో ఉండుంటాడని' చప్పరించేస్తారు.
అమ్మో నా తల బద్దలైపోతోంది.ఇప్పుడు నేనేం చెయ్యాలి" అంటూ హైరానా పడిపోయాడు మూర్తి.
"హే ఊరుకోండి. ప్రతిదానికీ టెన్షన్ పడిపోతారు. జడ్జ్ చేసినపనికి మీరేం చేస్తారు. మీరేవన్నా ఇమ్మని అడిగారా ఏంటి. అన్నీ పర్సనల్ గా తీసుకోకూడదు. బహుమతి రాని వాళ్ళ కడుపు మంట తాటాకు మంటతో సమానం. కాసేపు మండి చప్పున చల్లారిపోయింది. మీరు కుమ్ములో పెట్టిన చిలగడ దుంపలా చిట చిట లాడకండి. కాస్త నిబ్బరంగా వుండాలి మరి " అని ధైర్యం చెప్పింది .
"ఏమో ఎందుకో నాకు భయంగా ఉంది.ఇదంతా నా చావుకొచ్చింది. ముందు ఆ తులుపులన్నీ మూసై." అన్నాడు.ఫోన్ చేతిలో పట్టుకుని బిత్తర చూపులు చూస్తూ
"తలుపులన్నీ మూసేవున్నాయికదండి. బహుమతి వచ్చిందని తెలిసిన షాక్ లో
సంధిపుట్టినట్టుంది దేవుడోయ్" లబ్బుమంది అనంతం
"ఇంటివి కావు, వాట్సాప్ తలుపులు.
ఓపెన్ చేయగానే ఎవరో ఒకరు చొరబడతారు
ఆ కథ పెట్టండి చూస్తాం అంటారు.
పోన్లే అని పెడితే అందరికీ ఫార్వార్డ్ చేస్తారు. అక్కడితో ఆగరు. ఇంతింత పెద్ద సమీక్షల ఉండ్రాళ్ళు గ్రూపుల్లోకి విసురుతారు.
ఈ కథకన్నా సాధారణ ప్రచురణవే బాగున్నాయని గేలి చేస్తారు.
నీ స్వానుభవమా అని నిగ్గదీస్తారు.
సిగ్గుతో చావాలి నేను.
అలా ఒకరోజు రెండ్రోజులు కాదు.
మళ్లీ ఆ సంస్థవారు రెండోసారి పోటీ పెట్టి బహుమతి ప్రదానం చేసేదాకా ఈ ముప్పు తప్పదు." మూర్తికి ఆయాసం కూడా మొదలై ముక్కు పుటాలు అదిరిపడ్డాయి
" సిగ్గు దేనికి?! సిగ్గులేకపోతే సరి.
మీకు బహుమతి ఇచ్చిన ఆ సంస్థవాళ్ళని
మీరెరుగుదురా? మరీ ఎక్కువ ఆలోచిస్తున్నారేమో?!"
"ఎరుకా పాడా, కానీ వాళ్ళు నా బంధువో బామ్మర్దో అని ఊహాగానాలు చెలరేగుతాయి. ఏదో పనున్నట్టు ఫోన్లు చేసి కాసేపు పొగిడి, గుట్టుమట్లు తెలుసుకోవాలని చూస్తారు.అవన్నీ నేను తట్టుకోలేను బాబూ" అని ఉక్కిరిబిక్కిరయ్యాడు.
"అసలు మీరు కథని ఏపేరుతో పంపారు?"
"అనంత మూర్తి "
"అవునా మీపక్కన నా పేరుందిగా ఇంకేం..ఇహ చూడండి. మీరు నిశ్చింతగా ఉండండి. తర్వాత కథని నేను నడిపిస్తాను"
అని వాట్సాప్ తలుపులు తెరిచింది.
"వద్దే. తెరవకే, నీకు వాళ్ళ సంగతి తెలీదే" అని దీనంగా దీర్గాలు తీశాడు మూర్తి
"ఉష్! ఆగండి.మీలో నేను సగపాలన్నారుగా.
అదిగో మీ మిత్రబృందం అప్పుడే కథ పెట్టమని,అసలు ఎవరికీ పంపమని,
చదివి డిలీట్ చేస్తాం, ఒట్టు గాడ్ ప్రామిస్ అని మెసేజ్ చేశారు. ఇప్పుడు చూడండి ఏం చేస్తానో" అని చిరునవ్వులు చిందిస్తూ ఏదో టైప్ చేసింది.
"ఏం చేస్తావ్? ఆగు , వాళ్ళని తిడతావా ఏవిటీ అప్రతిష్ట. తెల్లారిలేస్తే వాట్సప్ మొహాలు చూసుకోవాల్సింది మేమే. మా లింకులు తెగ్గొట్టకు" అంటుండగానే అనంతం
అందరికీ మెసేజీలు పాస్ చేసింది.
“ఎంత చెప్పినా ఆగవు కదా….ఏవని మెసేజ్ పెట్టావూ ..?.అంటూ ఆత్రంగా ఫోన్ లోకి తొంగిచూశాడు
"ఈ కథ రాసింది మా యావిడ. నేను కాదు ." అని మెసేజ్ పెట్టింది .
అటునుంచి ఠక్కున మూసుకున్న వాట్సాప్ తలుపులు అనంతం వైపు తెరుచుకున్నాయి.
'ఓహో .. ఆహా… సూపర్ … అది మీ కథా మేడం?
మేడం అంటే మేడమే… అప్పుడే అనుకున్నాను. గాజుల చెయ్యి రాసిన వాసనగొట్టింది. ఇటువంటివి నేనిట్టే పట్టేస్తాను అద్భుతః.'అంటూ మెచ్చుకోళ్ల వర్షం.
మీకథ ఓసారి పెడతారా చూసి డిలీట్ చేస్తాం
అనే ఆత్రపు సందేశాలు.
" ఆ కథ నా 'నోట్లో' డిలీట్ అయిపోయింది. పత్రిక మీదగ్గరుంటే నాకూ షేర్ చేయండి.
చదివి ఎలా వుందో నిర్మొహమాటంగా నాకు చెప్పండి" అని రిప్లై ఇచ్చింది.
"నోట్లోనా ఓహ్! నోట్ ప్యాడ్ లోనా? పోయిందా అయ్యో...అయ్యో….పాపం…
అలాగే పెడతాం మేడం”.
అంటూ అటునుంచి సానుభూతి సందేశాలు వచ్చాయిం
"అయ్యోనా కుయ్యోనా! హు… కుళ్ళబోతులు. కథ నీదనగానే ప్లేట్ తిప్పేసి మెచ్చేసుకుని నిన్నేమీ అన్లేదు. నన్నైతే ఈపాటికి ఏకేద్దురేం?" ఉడికిపోయాడు మూర్తి.
"ఇకనుంచి తిరిగొచ్చిన కథల్ని
నా పేరు మీద తిరుగుటపాలో
పంపండి. అంతే…సూపర్ హిట్టు" బొటనవేలుతో చూపుడువేలు కలిపి కన్ను గీటింది.
"ఈ కథ మూర్తి పేరుతో పంపిస్తే తిరిగొచ్చినదే
ఆ కవరు మార్చి నీ పేరుతో పంపించాను"
అన్నాడు.
"మరింకేం. నా పేరు బలం గొప్పది. అందుకే పదివేలు గెలిచింది .మీ అర్ధాంగిగా మీ విజయంలో సగం నాదే .పారితోషికంతో సహా!"అని కళ్ళెగరేసింది.
"నాకు రెండువైపులా మద్దెల దరువే" గొణుక్కున్నాడు మూర్తి.
"దేవుడున్నాడా? అదేగా . ఈ కథకేగా మీకు మొదటి బహుమతి వచ్చింది?" అంది. కాలుమీద కాలేసుకుని కూర్చుని నోట్ పాడ్ లో కథను
చదువుతూ.
"అదికాదు. వేరొకటి. ఆ పక్కది “ చెప్పాడు.
“ఏదీ…?”
“' వేడి ము.. ము ..ముద్దు ' అనే సరస కథకి బహుమతి వచ్చింది" అన్నాడు చెప్పలేక చెబుతూ.
"మీ మిత్రులతో నేనింతవరకూ మాట్లాడింది ము..ము..ముద్దు అనే సరస కథ గురించా? నేను రాశానని చెప్పి సమస్యని నావైపు తిప్పుకున్నానా? వా…..ఆ….చూడండి ఎన్ని మెసీజీలు పెట్టారో…” అంది ఫోన్ వంక భయంగా చూస్తూ
"ఉతికి ఆరేస్తారే అంటే విన్నావా? మొదటి బహుమతి వచ్చిందంటే , పరువుకే ఎసరు తథ్యమని ఇప్పటికైనా తెలుసుకున్నావా?” అన్నాడు మూర్తి భార్య బిత్తర చూపుల్ని చూసి నవ్వుకుంటూ
"వా.......ఆ వాట్సాప్ తలుపులు....
... ము ...ము.. మూసేయండి. కొన్నాళ్ళు సెలవలకని దూరంగా ఎటైనా వెళ్ళిపోదాం పదండి. బహుమతి వచ్చిన ఆనందం క్షణకాలం కూడా మిగలకుండా చేసారు వీళ్ళు. ఈ దుమారం సర్దుమణిగేదాకా ఎవరికీ అందుబాటులోకి రావద్దు మనం. పదండి పుణ్యక్షేత్రాలకు. కదలండి పెన్నుపోటు లేని చోటుకు. "
అని అమాంతం వెళ్లి వైఫై ఆపేసి ఆయాసం తీర్చుకుంది అనంతం.
*******************************