బాలమ్మ
బాలమ్మ చక్కని చుక్క. అపరంజి బొమ్మ. అందాల కొమ్మ. ఎవరైనా ఒకసారి ఆమెను చూస్తే మళ్ళీ రెండోసారి చూడకుండా ఉండలేరు. అది వాళ్ళ బలహీనత కాదు. బాలమ్మ అందం అలాంటిది. చూపులు తిప్పుకోలేని అందం ఆమెది.
బాలమ్మ డబ్బున్న వాళ్ళ ఇంట్లో పుడితే ఆమె అందం మరింత రెట్టింపయ్యేది. కానీ రెక్కాడితే కానీ డొక్కాడని అతి నిరుపేదల ఇంట్లో పుట్టింది. ఆ నిరుపేదలు రామయ్య సీతమ్మలు. వారిద్దరూ రోజు కూలీలు. ఎక్కడ కూలి పని ఉన్నా వెళుతుంటారు.
బాలమ్మ వాళ్లకి ఒక్కగానొక్క కూతురు. ఆమెకి ఇప్పుడు ఈడొచ్చింది. ఆమె తల్లిదండ్రులకు బెంగొచ్చింది. బాలమ్మకి తగిన కుర్రాడ్ని చూసి పెళ్లి చేయాలనుకున్నారు. బాలమ్మ కొంత వరకు చదివి తర్వాత మానేసింది. ఆ తర్వాత అమ్మా నాన్నలతో కలిసి కూలి పనులకు వెళ్తుండేది. ఒక పెద్ద భవన నిర్మాణంలో వాళ్ళు రోజూ కూలికి వెళుతుండేవాళ్లు.
ప్రతి రోజు లాగే ఆరోజు కూడా వాళ్ళు కూలి పనికి వెళ్లారు. అయితే ఆ రోజు బాలమ్మని దురదృష్టం వెంటాడింది. బాలమ్మ కాలు జారింది! కాలు జారడమంటే ఎవరినో నమ్మి మోసపోవడం కాదు. నిజంగానే బాలమ్మ కాలు జారింది. నిర్మాణంలో ఉన్న భవనం మొదటి అంతస్తు మెట్లెక్కుతూ, పొరపాటున కాలు జారి పడిపోయింది.
బాలమ్మ పైనుంచి పడిపోవడం పక్కనే పనిచేస్తున్న ఆమె తల్లిదండ్రులు చూసారు. “ఓలమ్మో... కూతురో... ఎంత పనైపోనాదే... తల్లీ” అంటూ పరిగెత్తుకుంటూ వచ్చి బాలమ్మను పట్టుకున్నారు. నెత్తిమీద బరువుతో బాలమ్మ మెట్లెక్కుతుందేమో కాలు స్లిప్పయి తట్ట ఒకవైపు, బాలమ్మ ఒక వైపు పడిపోయారు. బరువైన కంకర రాళ్లు ఆమె కుడి చేతి పై పడిపోయాయి.
“అమ్మోయ్... నాన్నోయ్..." అంటూ గట్టిగా ఓ కేక పెట్టి స్పృహ తప్పి పడిపోయింది బాలమ్మ. వెంటనే బాలమ్మ అమ్మా నాన్నలతో పాటూ చుట్టు పక్కల పని చేస్తున్న కూలీలంతా బాలమ్మ చుట్టూ మూగిపోయారు. వెంటనే బాలమ్మను అక్కడే వున్న ఒక ఆటోలో ఎక్కించి దగ్గర్లో ఉన్న సర్కార్ దవాఖానా కి తీసుకుపోయారు.
బాలమ్మ పరిస్థితిని చూసి డ్యూటీ డాక్టర్లు వెంటనే స్పందించారు. ఆమె చేతికి ఎక్స్ రే తీశారు. టెస్టులు చేశారు. కట్టు కట్టారు. మందులు రాశారు. టానిక్కులు రాశారు. బాలమ్మకి కుడి చేయి విరిగిపోయింది. కట్టు కట్టి పంపించేశారు. బాలమ్మ ఇంటికి వచ్చేసింది.
చేతికిచ్చిన మత్తు విరిగిపోయిన బాలమ్మ ఆరోజు రాత్రంతా నిద్రపోలేదు. రామయ్య సీతమ్మలను నిద్రపోనీయలేదు. నొప్పి భరించలేక, “అమ్మోయ్... నాయనోయ్… ” అని ఒకటే ఏడుపులు పెడబొబ్బలు పెట్టింది. దవాఖానా వాళ్ళు ఇచ్చిన రంగు బిళ్ళలు బాలమ్మ నొప్పిని తగ్గించలేకపోయాయి. మొత్తానికి ఏ అర్ధరాత్రి వేళో, తెల్లవారు జామునో బాలమ్మ నిద్రాదేవి ఒడిలో జారిపోయింది. బాలమ్మ ఇప్పుడు ఇంటి దగ్గరే ఉంటుంది. ఆమెకు తోడుగా తల్లి సీతమ్మ ఉంటుంది. రామయ్య ఒక్కడే పనికి పోతున్నాడు. వస్తున్నాడు. నాలుగు పైసలు తెస్తున్నాడు. వాటితోనే గంజి కాసుకొని తాగుతున్నారు ముగ్గురూ.
పది రోజులు గడిచాయి. బాలమ్మను తీస్కొని దవాఖానాకి పోయారు సీతమ్మ రామయ్యలు. డాక్టర్ కట్టుమార్చాడు. మందులిచ్చాడు. అలా నెల రోజులు గడిచాయి. బాలమ్మ చేయి నొప్పి తగ్గక పోగా ఇంకా ఎక్కువయ్యింది. రాత్రుళ్ళు నరకం చూసేది బాలమ్మ. తను నిద్ర పోయేది కాదు. తన వాళ్ళని నిద్ర పోనిచ్చేది కాదు. మరో నెల గడిచాక ఆసుపత్రికి వెళ్లారు ముగ్గురూ.
కట్టు విప్పిన డాక్టర్ బాలమ్మ చేయి చూసి షాక్ తిన్నాడు. బుజం నుంచి అర చేయి వరకు బాలమ్మ చేయి నల్లగా కమిలిపోయింది. దానికి తోడు సలపరం. భరించలేని నొప్పి. "అమ్మోయ్... బాబోయ్..." అంటూ అరుస్తూనే ఉంది బాలమ్మ. అక్కడ ఆమెకు ఇచ్చిన మందులు ఆమెకు పనిచేయలేదు. పైగా అవి వికటించి బాలమ్మ చేయి మొత్తం పాడయ్యి రంగు మారింది.
పెద్ద డాక్టర్ వచ్చి చూసాడు. వెంటనే స్కాన్ అన్నాడు. టెస్టులు అన్నాడు. చివరికి విషయం తేల్చాడు. వెంటనే బాలమ్మని ఆపరేషన్ థియేటర్ కి తీసుకుపోయారు. మత్తు మందు ఇచ్చారు. ఆపరేషన్ చేశారు. మత్తు వదిలాకా బాలమ్మ కళ్ళు విప్పింది. ముందుగా ఎదురుగా ఉన్న దేవుడి ఫోటో చూసింది. తర్వాత తన అమ్మా నాన్నలని చూసింది. డాక్టర్ నర్స్ లను చూసింది. ఇప్పుడు బాలమ్మకి చేయి నొప్పి చేతితో తీసేసినట్టు తగ్గిపోయింది. అమ్మా నాన్నలని చూసి నవ్వింది.
పెద్ద డాక్టర్, “ఇప్పుడు నొప్పి ఎలాగుంది బాలమ్మా” అన్నాడు నవ్వుతూ. బాలమ్మ సన్నగా నవ్వింది. చాలా రోజుల తర్వాత బాలమ్మ హాయిగా నవ్వడం చూసి ఆమె తల్లిదండ్రులు సంతోషించారు. “బాగుంది బాబూ, నొప్పి తగ్గిపోయింది. ఇన్ని రోజులు నరకం అనుభవించాను. ఇప్పుడు చేయి నొప్పి పూర్తిగా తగ్గిపోయింది” అంది తన చేతి వైపు చూసుకుంటూ. ఆ తర్వాత ఒక్కసారిగా కెవ్వున కేక పెట్టింది బాలమ్మ. ఆమెకు చేతి నొప్పే కాదు… అసలు ఆమెకు చెయ్యే లేదు! మొండి చేతితో ఉంది!! అప్పటివరకు ఆమె పరిస్థితి బాలమ్మ తల్లిదండ్రులకు కూడా తెలియదు. తెలిసి వాళ్ళు కూడా లబోదిబో మన్నారు. “నా కూతురో... నా తల్లో... ఎంత గోరం జరిగిపోనాది దేవుడో..." అని ఆ హాస్పిటల్ దద్దరిల్లి పోయేలా కేకలు పెట్టారు.
పెద్ద డాక్టర్ వాళ్ళని సముదాయించాడు. “చూడండి… మీరు మీ అమ్మాయి చేయి పోయినందుకే ఏడుస్తున్నారు. ఆమె చేతికి ఇన్ఫెక్షన్ సోకి సెప్టిక్ అయ్యింది. అది తీయకపోతే ఆమె ప్రాణాలకే ప్రమాదం జరిగేది. అందుకే ఆమె చేతిని తొలగించాం...” అని చావు కబురు చల్లగా చెప్పాడు. బాలమ్మ అమ్మా నాన్నలు నిర్విణ్ణులయ్యారు. బాలమ్మను అలా చూసి వాళ్ళ గుండెలపై ఎవరో బలమైన సుత్తితో మోదుతున్నట్టు విల విల్లాడిపోయారు.
వాళ్ళకి ఒకేసారి రెండు బెంగలు కళ్ల ముందు కనిపించి భయపెడుతున్నాయి. ఒకటి బాలమ్మ ఒక చెయ్యిలేని అవిటిదయిపోయింది. మరొకటి మరో నెల రోజుల్లో బాలమ్మకి పెళ్లి జరగబోతోంది. ఇంతలో ఈ ఘోరం! ఈ పరిస్థితుల్లో కోటయ్య కాంతంలు తమ కూతుర్ని కోడలుగా చేసుకుంటారా లేదా అన్నదే వాళ్ళ దిగులు!
వారం రోజులు ఆసుపత్రిలో ఉండి డిశ్చార్జ్ అయ్యింది బాలమ్మ ఒంటి చేత్తో. బాలమ్మను అలా చూసి గుండెలు తరుక్కుపోతున్నాయి రామయ్య సీతమ్మలకు. వాళ్ళు భయపడినట్టుగానే బాలమ్మ చేయి పోయిన విషయం తెలిసింది కోటయ్య కాంతంలకు. అంతే! వాళ్ళు ఆఘ మేఘాల మీద కాబోయే కోడలు పిల్లను చూడ్డానికి వచ్చారు. చూసారు. బాలమ్మపై అత్యంత జాలి చూపులు చూసారు. "అయ్యో పాపం… ఎంత ఘోరం జరిగిపోయింది" అని ఎంతో బాధ పడ్డారు. కన్నీళ్లు పెట్టుకున్నారు.
అన్నీ చేసారు కానీ, ఆమెను తమ కొడుక్కిచ్చి పెళ్లి చేయటానికి మాత్రం ససేమిరా కుదరదన్నారు. ఆ మాట వింటూనే బాలమ్మ గుండెలు బద్దలయ్యాయి. రామయ్య సీతమ్మలు మిన్ను విరిగి మీద పడినట్టు విల విల్లాడారు. కన్నీటి పర్యంతమవుతూ ఎన్నో విధాలుగా వాళ్ళకి నచ్చ చెప్పి చూసారు. అయినా కోటయ్య కాంతంల మనసు కరగలేదు. కుదరదన్నారు. చేయి లేని అవిటి పిల్లతో తన కొడుకు జీవితం ఎలా సాగుతుంది అన్నారు. తమ కంఠంలో ప్రాణం ఉండగా ఈ పెళ్లి జరగదన్నారు. అదన్నారు. ఇదన్నారు. ఇంకా ఏవేవో అన్నారు. పెళ్లి రద్దు చేసుకొని వెళ్లిపోయారు.
గుండెలు పగిలేలా ఏడ్చింది బాలమ్మ. ఒకవైపు తన చేయి పోయింది. మరోవైపు తన పెళ్లి కూడా ఆగిపోయింది. తనలాంటి దయనీయమైన దుస్థితి పగ వాళ్ళకి కూడా రాకూడదనుకుంది. ఏడ్చి ఏడ్చి ఆమె కళ్ళు ఉబ్బిపోయాయి. అయిపోయింది. అంతా అయిపోయింది. తన జీవితం సర్వనాశనం అయిపోయింది అని గగ్గోలు పెట్టింది.
అవిటిదయిన తమ కూతురికి పెళ్లెలా చేయాలా, ఆమె జీవితం ఎలా బాగుపర్చాలా అని రామయ్య సీతమ్మలు తల బద్దలు కొట్టుకొని ఆలోచించారు కానీ వాళ్లకు ఏమీ తోచలేదు. చివరికి చేసేది లేక ఊరుకుండిపోయారు. బాలమ్మ అందాన్ని చూసి రెండు మూడు సంబంధాలు వచ్చాయి కానీ ఆమె అవిటిదని తెలిసి వద్దని వెళ్లిపోయాయి. దాంతో రామయ్య సీతమ్మలు మరింత కుంగిపోయారు. చివరికి ఒక నిర్ణయానికొచ్చారు. తాము బతికున్నంతకాలం ఆమెను తమతోనే ఉంచుకోవాలని.
రోజులు గడుస్తున్నాయి. బాలమ్మ జీవితం భారంగా గడుస్తోంది. ఆమె రాజన్న గురించి ఆలోచించడం మొదలు పెట్టింది. ఆమె ఆలోచనల్లో అతడు లీలగా మెదిలాడు. ఆరోజు తన పెళ్లి చూపులు. కోటయ్య, కాంతమ్మలతో కలిసి వచ్చాడు రాజన్న. రాజన్న పేరుకు తగ్గట్టు రాజు లాగానే ఉన్నాడు. అందంగా ఉన్నాడు. ఎత్తుగా ఉన్నాడు. చిలిపి కళ్ళతో కోర మీసంతో తన మనసుని దోచుకున్నాడు. బాలమ్మ అందానికి సరిపోయే అందం రాజన్నది. ఇద్దరి ఈడూ జోడూ బాగా కుదిరింది. ఇద్దరూ ఒకరినొకరు చూసుకున్నారు. నచ్చుకున్నారు. పెద్దవాళ్ళు కట్న కానుకలు మాట్లాడుకున్నారు.
రాజన్న ఆటో నడుపుతాడు. ఇద్దరికీ నిశ్చితార్థం కూడా జరిగిపోయింది. ఇద్దరూ ఒకరి ఫోన్ నంబర్లు ఒకరు తీసుకున్నారు. రోజూ మాట్లాడుకునేవారు. ఎన్నోముచ్చట్లు చెప్పుకునేవారు. ఊసులాడుకునేవారు. బాసలు చేసుకునేవారు. తమ భావి జీవితం గురించి ఎన్నో కలలు కన్నారు. బాలమ్మ తన జీవితం ఈస్ట్ మన్ కలర్లో ఊహించుకొని సంబర పడి పోయేది. ఎప్పుడూ పగటి కలలు కంటూ ఉండేది. నెల రోజుల్లో తమ పెళ్లి ఉందనగా ఎవరూ ఊహించని ఈ ఘోరం జరిగిపోయింది.
అతని గురించే ఆలోచిస్తూ మనసు పాడుచేసుకునేది బాలమ్మ. తన జీవితం తనకి అగమ్య గోచరంగా తోచసాగింది. చేయి లేదు. పెళ్లాగిపోయింది. తన బతుకే బుగ్గిపాలయ్యింది. ఇంకా తను ఎవరి కోసం బతకాలి? తన ఆశలు కలలు అన్నీ ఆవిరి అయిపోయాయి. బతికి వ్యర్థం అనుకుంది. తన అమ్మా నాన్న లేని సమయం చూసి తన జీవితం ముగించుకోవాలనుకుంది. ఇంతలో ఆమెకు ఓ ఫోన్ కాల్ వచ్చింది.
మరికొన్ని రోజులు గడిచాయి. ఇప్పుడు బాలమ్మ ఓ ఇంటిదయిపోయింది. ఆమెకి పెళ్లయిపోయింది. ఆమె తన భర్తతో సంతోషంగా కాలం వెళ్లదీస్తోంది. బాలమ్మ భర్త చాలా మంచోడు. తాను అవిటిది అని తెలిసి కూడా తనను పెళ్లి చేసుకున్నాడు. తనని ఎంతో ప్రేమగా చూస్తాడు. అడుగు కూడా కింద పెట్టనివ్వడు. అన్ని పనులు తానే చేస్తాడు. రోజూ వంట చేస్తాడు. తనకు ప్రేమగా తినిపిస్తాడు. తన కంటి పాపలా చూసుకుంటాడు. వారిద్దరికీ ఇప్పుడు ఏ బాదర బందీ లేదు. సంతోషంగా ఉన్నారు. వారిద్దరూ లేచిపోయి వచ్చేసారు. తామెవరో ఎవరికీ తెలియని ఒక ఊళ్ళో కాపరం పెట్టారు. వారివురి తల్లి దండ్రులకు వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు. వాళ్ళు కొన్ని రోజులు వెతికి ఏడ్చి ఏడ్చి ఊరుకున్నారు.
బాలమ్మకి జీవితం ఎంతో సంతోషంగా కనిపిస్తోంది. అసలు తన అవిటితనాన్ని చూసి తనకు పెళ్లే కాదేమో అనుకుంది. తనకి చావే గతి అనుకుంది. కానీ ఇంతలో ఒక ఫోన్ కాల్ తన జీవితాన్నే మార్చి వేసింది. తనకి నచ్చినవాడు, తనని మెచ్చిన వాడు తన భర్తగా రావడంతో బాలమ్మ సంతోషంతో ఉక్కిరిబిక్కిరవుతోంది.
కానీ ఆమె భర్తకి మాత్రం తన తల్లిదండ్రులు గుర్తొచ్చి మనసు బాధగా మూలుగుతోంది. తను తప్పని సరి పరిస్థితుల్లో అలా చేయవలసి వచ్చింది. తన తల్లిదండ్రులు పాతకాలం మనుషులు. ఒకసారి చూసి నచ్చింది అని చెప్పాక, బాలమ్మకి ఆమె దురదృష్టం కొద్దీ చేయి పోతే, ఆ అమ్మాయిని వద్దనుకునేంత మూర్ఖుడు కాదు తను. ముందు తన తల్లిదండ్రులకు మంచిగానే నచ్చ చెప్పి చూసాడు. కానీ వాళ్ళు ససేమిరా కుదరదన్నారు. ఇక తప్పని సరి పరిస్థితుల్లో బాలమ్మని లేవ దీసుకువచ్చాడు. తనతో పాటూ తెచ్చిన తన అమ్మా నాన్నల ఫోటో కేసి బాధగా చూస్తుండిపోయాడు బాలమ్మ మొగుడు రాజన్న!!
-నన్ద త్రినాధరావు