ఆకలి - నన్ద త్రినాథరావు
మధ్యాహ్నం ఒంటి గంటయ్యింది. ఎండాకాలం సూర్యుడు నడినెత్తిమీదకొచ్చాడు.
రాజయ్య వచ్చే బస్సు, పోయే బస్సు వైపు ఆశగా చూస్తున్నాడు. దిగేవాళ్ళలో ఒకళ్ళు కూడా రాజుపాలెం పోయేటోళ్లు లేరు. అందరూ అక్కడకి దగ్గర ప్రాంతాల వాళ్లే! నడచుకుని పోతారు. వాళ్ళతో తనకు లాభం లేదు. ఎవరైనా ‘రాజుపాలెం వస్తావా?’ అని అడుగుతారేమోనని ఆశగా ఎదురు చూస్తున్నాడు రాజయ్య. కానీ ఒకళ్ళూ అనటం లేదు. రెండురోజుల నుండి ఇదే తంతు.
తాను రిక్షా తొక్కడం తప్పితే మరో పని చేయలేడు. బాగా అలవాటైన పని అదే తనకు. ఇంకో పని చేయడానికి తనకు బలం కూడా లేదు. ఇది వారసత్వంగా వస్తున్న వృత్తి. తన తాత తన తండ్రికి, తన తండ్రి తనకు, ఈ వృత్తిని నేర్పుతూ వచ్చాడు. తాను వయసుకొచ్చేటప్పటికి తన తండ్రి ఈ రిక్షాని తనకప్పగించాడు. ఇది చాలా పాతకాలం రిక్షా! ఎప్పుడూ ఏదో ఒక రిపేరు వస్తూనే ఉంటుంది. తాను పొద్దల్లా కష్టపడ్డ డబ్బులు కూడా ఒకోసారి దాని రిపేరుకే ఖర్చయిపోతాయి.
రెండ్రోజుల నుండి తనకి ఎలాంటి బేరం లేదు. రాజుపాలెం బేరం తగిలితేనే తనకు నాలుగు డబ్బులు కిడతాయి. తన పెళ్ళాం పిల్లలు కాస్త కడుపునిండా కూడు తింటారు. తానుండేది కూడా అక్కడే. చెవి ఇరకలో పెట్టిన చుట్ట ముక్క తీసి వెలిగించాడు రాజయ్య. గుండెల నిండా దమ్ము లాగి వదిలాడు. హాయిగా ఉన్నట్టు అనిపించింది. అప్పుడప్పుడు ఒకో బస్సు వస్తూనే ఉంది.
మరో గంట గడిచింది. ఇక ఈ రోజు కూడా తాను పెళ్ళాం పిల్లల్ని పస్తు పెట్టాలిసిందే. గుడిసెకి పోదాం అనుకుంటున్న సమయంలో ఒక బస్సు వచ్చి ఆగింది.
ఇద్దరు భార్యా భర్తలు దిగారు. వాళ్లిద్దరూ దిగగానే ఈరయ్యా, పోలిగాడు వాళ్ళని చుట్టు ముట్టారు. “ఎందాకా ఎల్తారు బాబూ?” అంటూ.
“రాజుపాలెం” అన్నారు వాళ్ళు.
“రాజయ్యా! రాజుపాలెం బేరం వచ్చింది. సూస్కో “ అన్నారు ఈరయ్యా, పోలిగాడు.
“ఎల్లండి బాబూ, ఆ ఊరి బేరం ఆడే కడతాడు. మాం రాం” అన్నారు వాళ్ళు.
రాజయ్య సగం కాలిన చుట్ట ముక్కని వెంటనే ఆర్పేసి, తలకు తువ్వాలు చుట్టుకుని వాళ్ళ దగ్గరికి పరిగెత్తాడు.
“రండి బాబూ, నా రిక్షా పోతాది రాజుపాలెం” అన్నాడు చేతులు కట్టుకుని. రిక్షాని వాళ్ళ ముందుoచాడు.
ఆ దంపతులు రాజయ్య కేసి చూసారు. ఎముకల గూడుకు చర్మం చుట్టినట్టు సన్నగా ఉన్నాడు రాజయ్య. కళ్ళు లోతుకు పోయాయి. మొహం పీక్కుపోయినట్టుంది. తిండి తిని చాలా రోజులైనట్టుగా పొట్ట వెన్నుకు అంటుకుపోయింది.
“రాజుపాలెం వరకు మమ్మల్ని తీసుకుపోగలవా?” అని అడిగాడు భర్త అతనికేసి అనుమానంగా చూస్తూ.
“ఈడ నాను తప్పా అక్కడికి మిమ్మల్ని చేర్చే వోళ్ళు ఎవరూ లేరు బాబయ్యా. వచ్చి కూర్సోoడి” అన్నాడు రాజయ్య.
“ఎంతియ్యమంటావు ముందే చెప్పు?” అంది ఆమె. బేరాలాడ్డంలో ఆడాళ్ళు దిట్ట!
“దయగల పెబువులు. నా కట్టం సూసి మీకు తోచినంత ఇవ్వండి బాబూ” అన్నాడు రాజయ్య.
అతడు అమాయకుడని వాళ్ళకి అర్ధం అయ్యింది. అతని కష్టాన్ని తక్కువలోనే తేల్చేద్దాం అనుకున్నారు వాళ్ళు. ఇద్దరూ రిక్షా ఎక్కారు. వాళ్ళిద్దరికీ ఎండ తగలకుండా రిక్షా టాపు లేపి చుట్టూ సర్ది తాను తొక్క సాగాడు రాజయ్య.
అది భారంగా కదిలింది. నడి నెత్తిన సూర్యుడు మండిపోతున్నాడు. అంత ఎండలో రిక్షా తొక్కుతున్న రాజయ్య ఒంటినిండా చెమట్లు పట్టసాగాయి. అతను వేసుకున్న చిరుగుల చొక్కా చెమట్లతో తడిసి ముద్దయ్యింది. తనకి మంచి బేరం తగిలిందని సంతోషంగా రిక్షా తొక్కడంలో నిమగ్నమయ్యాడు రాజయ్య.
అంత ఎండలోనూ వీస్తున్న వేడిగాలి ఒంటికి తగిలి హాయిగానే ఉంది రాజయ్యకి. అతనికి కష్టం తెలియకుండా ఉండడానికి మెల్లగా ఆమె భర్త రాజయ్యని మాటల్లోకి దింపాడు.
“నువ్వు తప్పా రాజుపాలెం ఎవరూ రిక్షా తొక్కరా?” అన్నాడు భర్త.
“నేదు బాబూ, అది సానా దూరం. మీరు సూసిన ఈరయ్యా, పోలిగాడు కుర్ర కుంకలు. డబ్బులు ఎక్కువ తీసుకొని దగ్గర దగ్గర సోట్లకే రిచ్చా కడతారు బాబూ. రాజుపాలెం బేరం అంటే నాదే. సూసారుగా బాబూ... ఈ రోడ్డంతా ఎలా ఉందో? అంతా గతుకుల మయం. పైగా ఇరుకు రోడ్డు” అన్నాడు రాజయ్య.
“ఇక్కడ ఆటోలు ఎందుకు లేవు?” అన్నాడు భర్త.
“ఈడ ఆటోలు తిప్పేటంత బేరాలు దొరకవు బాబూ. ఒకసారి ఒకరిద్దరు ఆటోలు తిప్పి ఆల్లకి కిట్టు బాటు కాక ఎల్లిపోనారు. ఈ మట్టి రోడ్లకి ఇక్కడ రిచ్చాలే తిరుగుతాయి బాబూ” అన్నాడు రాజయ్య.
భర్త రాజయ్య గురించి, అతని పెళ్ళాం పిల్లల గురించి అన్ని విషయాలు అడిగి తెలుసు కున్నాడు. అతని పేదరికం గురించి తెలుసుకొని “అయ్యో పాపం!” అని పైకే అంటూ చాలా బాధ పడసాగాడు.
భార్య మాత్రం ముఖం చిట్లించుకుని కూర్చుంది. ఆమెకు రాజయ్యని చూస్తూనే చాలా చిరాకుగా ఉంది. కానీ తప్పదన్నట్టు కూర్చుంది. ‘ఒక రిక్షా లాగే వాడితో మాటలేమిటి?’ అన్నట్టు మొహం ధుమ ధుమ లాడించేది.
రాజయ్య అనుకున్నాడు. ‘ఆ అయ్య మంచోరే. నా కట్టం, సుకం అన్నీ అడుగుతున్నారు. ఈ బాబిచ్చే డబ్బులతో తను తన కుటమానం నాల్గు రోజులవరకు గంజినీళ్ళు తాగొచ్చు’
ఆ ఊహ రాగానే మరింత వేగంగా రిక్షా తొక్కసాగేడు రాజయ్య. చెమట్లు పడుతూనే ఉన్నాయి రాజయ్యకు. రెండ్రోజుల నుండి గంజి నీళ్లు లేకపోయినా హుషారుగానే రిక్షా తొక్కున్నాడు అతడు. సందులు గొందులు దాటుతూ, ఒకో చోట తాను కిందకి దిగి భారంగా రిక్షా లాగుతూ, ఎలాగైతేనేం వాళ్ళని గమ్యం చేర్చాడు రాజయ్య.
వాళ్ళు దిగాల్సిన చోట దిగారు. ఒక పక్కగా రిక్షా ఆపాడు రాజయ్య. దాహంతో ఉన్నవాళ్ళకి ఆ పక్కనే ఉన్న బోరింగ్ నుండి చల్లని మంచి నీళ్లు కొట్టి వారి దాహార్తిని కూడా తీర్చాడు. తానూ కడుపు నిండా నీళ్లు తాగాడు. రెండ్రోజుల నుండి నీళ్ళే తాగుతున్నాడు రాజయ్య.
భర్త పర్సు తీసి రాజయ్యకి కిరాయి ఇచ్చాడు. తన బాధలు విని ఎంతో ఇస్తాడనుకున్న రాజయ్య మొహం ఆ డబ్బులు చూసి వాడిపోయింది. అమాయకుడు, మొహమాటస్తుడు, లౌక్యం తెలియని రాజయ్య ఆ డబ్బులే మహదానందంగా అందుకున్నాడు. పల్లెత్తు మాట అనలేదు. మరి కొంత డబ్బులు అడగమని మనసు అంటున్నా దాని మాట వినలేదు.
వాళ్ళు నాలుగడుగులు ముందుకేశారు. రాజయ్య మనసు ఇంకా పీకుతూనే ఉంది. ‘నువ్వు వాళ్ళని ఊరికినే తీసుకు రాలేదు. నీ రెక్కల కష్టంతో వచ్చారు. నీ కష్టానికి వాళ్ళిచ్చింది చాలా తక్కువ’ అని మనసు సణుగుతూనే ఉంది. అయినా రాజయ్య మొహమాటానికి పోయాడు. రిక్షాని వెనక్కి తిప్పాడు.
ఇంతలో ఆమె తన బేగు లోంచి ఒక బన్ను రొట్టె పైకి తీసింది. భర్తతో అంది.
“మనం తిందామనుకొని కొన్నాం కదా. కానీ తినలేదు. కనీసం అతనికైనా ఇచ్చేస్తానండి” అంది భర్తతో.
సరే అన్నాడు భర్త అయిష్టంగా. అది రాజయ్యకివ్వడం అతని కిష్టం లేదు. అతని దృష్టిలో ‘తాను రాజయ్యకిచ్చింది ఎక్కువ డబ్బులే. పైగా ఇది కూడానా?’ అన్న భావం అతనికుంది. మెతుకు పోతే బతుకు పోతుందనే మనస్తత్వం అతనిది! భార్య మాట కాదనలేక “ఊఁ” అన్నాడు.
ఆమె వడి వడిగా రాజయ్య దగ్గరికి వచ్చింది. రాజయ్య ఆశగా చూస్తున్నాడు. ఆమె ఇంకా ఏమైనా డబ్బులు ఇస్తుందేమో అని. ‘ఆమె మొదటి నుంచీ తనని చూసి ముఖం చిట్లించుకుంటూనే ఉంది. ఆమె ఏమిస్తుందిలే?!’ అనుకున్నాడు. అయినా ఆగాడు.
ఆమె రాజయ్య దగ్గరికొచ్చింది. “ఇందయ్యా, ఈ రొట్టె తీసుకో. మేము తిందాం అనుకొని కొన్నాం. కానీ తినలేదు. నీ పిల్లలకు పట్టుకెళ్ళు” అన్ని చెప్పి ఇచ్చిందామె. అతడు కాస్త నిరాశగానే దాన్ని తీసుకున్నాడు.
ఆ దంపతులు కొంతదూరం వెళ్లేంతవరకూ అలా చూస్తూనే ఉన్నాడు. తనకు బాగా ఆకలిగా ఉంది. తాను తన గుడిసె వరకు వెళ్లాలంటే ఏమైనా కాస్త తినాలనుకొని ఆ పేకెట్ విప్పాడు. ఆశ్చర్యపోయాడు రాజయ్య! ఆ బన్నుతో పాటూ తళ తళ లాడుతూ కనిపించింది ఒక వంద నోటు!! అతని కళ్ళు సంతోషంతో మెరిసాయి.
తన కష్టాలు అన్నీ అడిగి తెలుసుకున్న అతడు ఇచ్చింది కేవలం పది రూపాయలే! కానీ తనను చూసి చీదరించుకున్నా ఆమె తనకి అంత డబ్బు ఇచ్చింది. వాళ్ళకేసి చూసాడు రాజయ్య. ఒక్కసారి తలతిప్పి చిన్నగా నవ్వుతున్న ఆమె ఒక దేవతలా, అన్నం పెట్టే అమ్మలా కనిపించింది రాజయ్యకు.
***0***