ఆర్థోపెడిక్ ఇంప్లాంట్

ఉషా పక్ష పత్రిక • 01 Dec 2025 • 👁 7 views
అమ్మ చనిపోయి అప్పుడే మూడో రోజు.

చిన్న కర్మ చేయడం కోసం పూజారి గారు, ఉదయం తొమ్మిది గంటలకల్లా తన ఇంటినుంచి అటునుంచి అటే స్మశానం దగ్గరకు వచ్చేస్తానన్నాడు. పూజారి గారు చెప్పిన వస్తువులు తీసుకెళ్ళడం కోసం, ఉదయం ఆరు గంటల నుంచే మా ఇంట్లో హడావుడి మొదలైంది.

ఇంటిల్లిపాదీ స్నానాలు చేయడం కూడా చకచకా పూర్తయింది.

కాంపౌండ్ వాల్ బయట మూడు రాళ్ళతో పొయ్యి ఏర్పాటు చేసి, దానిమీద పెసరపప్పు, బియ్యంతో అన్నం వండే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ఇంతలో బయటినుంచి మా తమ్ముడి అరుపులు గట్టిగా వినిపించడంతో, ఇంట్లోంచి బయటకు వచ్చి చూసాను.

సరిగ్గా తెల్లారకుండానే, అప్పుడే ఇంటి ముందుకు చేరుకున్న గంగిరెద్దుల వాళ్ళు కనిపించారు. వాళ్ళను వెళ్ళిపొమ్మని గట్టిగా అరుస్తున్నాడు మా తమ్ముడు.

'స్మశానంలో చితి దగ్గర చికాకు చేస్తే మర్యాదగా ఉండదు' అని గంగిరెద్దుల వాళ్ళమీద కోపం ప్రదర్శిస్తున్న తమ్ముడు, నన్ను చూసి,

'ఇంతకు ముందు నాన్న చనిపోయినప్పుడు వీళ్ళు చేసిన యాగీని మనమెలా మర్చిపోతాం అన్నయ్యా' అని అన్నాడు.

నిజంగానే, నాన్నగారు చనిపోయినపుడు, చిన్నకర్మ రోజున మమ్మల్ని అస్థికలను సేకరించనీయకుండా, చితిమీద తమ కండువా పరిచి, వాళ్ళు మా కార్యక్రమాన్ని అడ్డుకున్నారు.
పలానా సోమయ్య గారు చనిపోయినప్పుడు ఆయనగారి పిల్లలు యాభై వేలు ఇచ్చారని, భద్రం షావుకారు చనిపోయినప్పుడు డెభై వేలు ఇచ్చారని, మీరు మీ నాన్నగారి కోసం ఎంతిస్తారని, మొత్తం ఆరుగురు వరకూ వచ్చిన ఆ గంగిరెద్దుల వాళ్ళు, చితి దగ్గర నుంచి కదలకుండా నానా హడావుడీ చేసారు.

అక్కడి వారికి అదంతా అలవాటులా ఉంది. సైలెంట్ గా చోద్యం చూస్తున్నారు.

ఎక్కడో హైదరాబాద్లో ఉద్యోగాలు చేసుకునే మాకు, వాళ్ళు చేస్తున్న డిమాండ్ విడ్డూరంగా తోచింది. మా నాన్నగారి చితిమీద వాళ్ళ అథారిటీ ఏమిటో అర్థం కాలేదు.

స్మశానాల దగ్గర గుడిసెలు వేసుకుని నివసించే ఆ గంగిరెద్దుల వాళ్ళు, ఊరిలో ఎవరింట్లో చావు సంభవించినా, ఆ ఇంటి ముందు అలాగే వాలిపోతుంటారని మాకు తరువాత తెలిసింది.

అక్కడి స్థానికులు, మా బంధువులలో కొందరు ఆ గంగిరెద్దుల వాళ్ళతో బేరాలాడి మొత్తానికి రెండు వేల రూపాయలకు ఒప్పించారు. యాభై వేలూ, డెబ్భై వేలూ అని డిమాండ్ చేసిన వాళ్ళు, మేము ఇచ్చిన ఆ రెండు వేలకే సంతృప్తిగా వెళ్ళి పోవడం మాకు వింతగా తోచింది.

వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఊపిరి పీల్చుకుని, పూజారి గారి సూచనల మేరకు, నాన్నగారి అస్థికలను సేకరించి మట్టి పిడతలలో భద్రపరిచాము.

అప్పటి సంఘటన గుర్తుకు వచ్చి, దానిని రిపీట్ చేస్తారేమోననే భయంతో, ముందుగానే మా తమ్ముడు వాళ్ళను బెదిరిస్తున్నాడు.

'ఇంటి గుమ్మం ముందుకు వచ్చి నిలుచుంటే, కడుపునిండా అన్నం పెట్టే సీతమ్మ తల్లి మీ అమ్మగారు. అమ్మ విషయంలో మేమేమీ డిమాండ్ చేయము. మిమ్మల్ని ఇబ్బంది పెట్టము. ఏదో మా ఆచారరీత్యా, మా తృప్తి కోసం అక్కడ దాకా వస్తాం. అంతే' అని వాళ్ళు చెప్పాక మా మనసులు శాంతించాయి.

అమ్మ గురించి వాళ్ళు చెప్పిన మాటలు విన్న తర్వాత అమ్మ మంచితనం నాకు గుర్తుకొచ్చింది.

మమ్మల్ని తొమ్మిది నెలలు కడుపులో మోసి, పాతికేళ్ళ పాటు పెంచి, పెళ్ళిళ్ళు చేసి, ఎవరి సంసారాలు వాళ్ళవి అయ్యాక కూడా, మాకోసం అహరహం తాపత్రయపడింది అమ్మ.

నిజానికి అమ్మ జీవితం పూలపానుపు లాంటిదేమీ కాదు. ఆమె జీవితం చిన్నప్పటి నుంచీ కష్టాల కడలిలాంటిదే. ఆమెకు చిన్నప్పుడే వాళ్ళ నాన్న చనిపోయాడు. కటిక పేదరికంలో ఉన్న తమ కుటుంబానికి అండగా ఉండడం కోసం, తప్పనిసరి పరిస్థితుల్లో అమ్మమ్మతో కలిసి పొలాల్లో కూలీపనికి వెళ్ళింది.

చదువుకు నోచుకోని ఆమె చేతనయిన పనులు చేస్తూ, ఊరిలో గౌరవంగా బ్రతుకుతూ పెళ్ళీడు దాకా వచ్చింది. అప్పుడు ఆమెకు, తన మేనత్త కొడుకుతోనే పెళ్ళయింది.

అమ్మకు పెళ్ళయి పిల్లలు పుట్టేంత వరకూ జీవితం సజావుగానే సాగింది. కానీ, తదనంతరం పరిస్థితులు మారిపోయాయి. మేము చిన్న పిల్లలుగా ఉండగానే, మా నాన్న, ఊళ్లోనే ఒక వితంతువుతో సంబంధం పెట్టుకుని అమ్మను నిర్లక్ష్యం చేయడం ప్రారంభించాడు.

మా పరిస్థితి దారుణంగా తయారైంది. రోజువారీ వెచ్చాలకోసం మా నాన్న ఉంటున్న ఇంటికి వెళ్ళి, బయట పడిగాపులు పడి, ఎప్పటికో నాన్న బయటకు వచ్చి విసిరేసిన అయిదు రూపాయలనో, పది రూపాయలనో ఆత్రంగా అందుకుని, కిరాణా షాపుకు వెళ్ళి ఆ రోజుకు సరిపోను బియ్యం, పప్పులు కొనుక్కునే వాళ్ళం.

ఏ ఆడదీ భరించలేని, భయంకరమైన యాతనను అనుభవించింది అమ్మ. కానీ ఎటువంటి తొందరపాటు నిర్ణయం తీసుకోకుండా, మాకోసం బ్రతికింది. పిల్లల కోడిలా తన రెక్కల కింద మమ్మల్ని దాచి కాపాడింది.

అటువంటి అమ్మ చనిపోయిందంటే దుఃఖం తన్నుకుని వస్తోంది. తన బాధను పంటిబిగువన బిగించి, పైకి నవ్వుతూ మమ్మల్ని పోషించిన అమ్మ, చనిపోవడానికి మించిన విషాదం, మా జీవితాల్లో మరొకటి ఉండదు.

మా మనవరాలు పుట్టినప్పుడు తను మా ఇంటికి రాకపోయినా బాగుండేది. కానీ ఆమె ఆగలేక ఆత్రంగా మా ఇంటికి వచ్చేసింది.

మా అమ్మకు పసి పిల్లలకు స్నానం చేయించడం అంటే భలే సరదా. చీర తడవకుండా ఉండడం కోసం మోకాలి పైదాకా చీరను జరుపుకుని, రెండు కాళ్ళమీదా పిల్లలిని బోర్లా పడుకోబెట్టుకుని స్నానం చేయిస్తుంది.

బహుశా మేము పసిపిల్లలుగా ఉన్నప్పుడు, మాకూ అలాగే స్నానం చేయించి ఉంటుంది. మా పిల్లలకు అలాగే స్నానం చేయించడం మాత్రం నేను కళ్ళారా చూసాను. ఇప్పుడు మా పిల్లల పిల్లలకు కూడా అలాగే స్నానం చేయించాలని ఉబలాటపడుతోంది.

డెబ్భై అయిదేళ్ళ వయసులో ఆమెకు కాళ్ళూ చేతులూ వణికిపోతున్నాయి. ఆ పసిదాన్ని కరెక్ట్ గా పట్టుకోవడం కూడా ఆమెకు చేతకావడం లేదు. తనలోని జవసత్వాలు ఉడిగిపోయి నీరసించిపోయినా, చంటిపిల్లలమీది మమకారం ఆమెను ఒకచోట కుదురుగా ఉండనీయడం లేదు.

అమ్మ మా ఇంటికి వచ్చి వారం రోజులు అయిందో లేదో, ఒకరోజు అర్ధరాత్రి, బాత్రూం లోకి వెళ్ళి బయటకు వస్తూ, బయట ఉన్న తడి పట్టామీద కాలువేసి, అది జారిపోవడంతో పడిపోయింది.

అమ్మ కాలు బెణికి ఉంటుందని భావించిన నేను, అప్పటికప్పుడు బయటకు వెళ్ళి, మెడికల్ షాపు వాళ్ళకు విషయం చెప్పి, వాళ్ళిచ్చిన టాబ్లెట్లు తీసుకొచ్చి అమ్మకు ఇచ్చాను.

'ఇంత అర్ధరాత్రి పూట బయటకు ఎందుకు వెళ్ళావు. కాలు బెణికి ఉంటుంది. అంతే. తెల్లారేసరికి తగ్గిపోతుంది. తగ్గకపోతే అప్పుడు వెళ్ళి మందులు తీసుకొస్తే సరిపోయేది' అంది అమ్మ.

ఆ అర్ధరాత్రి, మందులకోసం నేను బయటకు వెళ్ళడం ఆమెకు నచ్చలేదు. కొడుకు కష్టపడడం అమ్మకు ఇష్టం ఉండదు.

తెల్లారింతర్వాత కూడా అమ్మకు నొప్పి తగ్గలేదు, సరికదా మోకాలి దగ్గర బాగా వాచిపోయింది.

ఆలస్యం చేయకుండా, అమ్మను వెంటనే ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ ప్రసాదు గారి దగ్గరకు తీసుకెళ్ళాను.

ఆయన పరీక్షించి, ఎక్సరే తీసి, అమ్మ మోకాలి పై భాగంలో ఎముక విరిగిందని, ఆపరేషన్ చేసి రాడ్ వేయాలని చెప్పారు.

భయంవేసి అమ్మ వైపు చూసాను. జీవితంలో ఎన్నో ఆటుపోట్లను చవిచూసిన ఆమె, మరో కష్టాన్ని ఎదుర్కోవడానికి సిద్ధపడుతున్నట్లుగా కనిపించింది.
కాలికి ఆపరేషన్ జరుగుతున్నప్పుడు మాత్రం, హాస్పిటల్ దద్ధరిల్లేలా,

'నా కాలునొప్పి నన్ను చంపేస్తుందిరా. నరకం కనిపిస్తోంది. వీళ్ళు నా కాలు విరిచేస్తున్నారు' అని ఆపరేషన్ థియేటర్ లోంచి గట్టిగా హృదయ విదారకంగా ఏడుస్తూ అరిచింది.

అమ్మ ఎంత బాధను అనుభవించింది అన్నది అప్పుడు నాకు తెలియలేదు. ఆమె అరుపులకు మాత్రం నా గుండె తరుక్కుపోయింది. ఆమె అరుపులు ఇంకా నా చెవుల్లో ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి.

అమ్మ మోకాలి పై భాగంలో ఆపరేషన్ చేసి రాడ్ వేసారు. అంటే ఒక ఆర్థోపెడిక్ ఇంప్లాంట్ ను ఫిక్స్ చేసారు. ఆ విధంగా అమ్మ మోకాలి దగ్గర విరిగిన ఎముకను నిలబెట్టారు.

ఆపరేషన్ అయిన పక్షం రోజుల తర్వాత అమ్మ మెల్లగా వాకర్ సహాయంతో నడవగలిగింది. మూడు నెలల తర్వాత మామూలుగా అందరిలా నడవగలిగింది.
ఆ తర్వాత ఏడెనిమిది ఏళ్ళు గడిచాక, మళ్ళీ అమ్మకు మోకాలి పై భాగంలో నొప్పి ప్రారంభం అయింది. సరిగ్గా గతంలో ఆపరేషన్ చేసిన దగ్గరే ఆమెకు విపరీతమైన బాధ కలుగుతోంది. మాటిమాటికీ మోకాలి పైన ఆపరేషన్ జరిగిన చోటును పట్టుకుని విపరీతంగా ఏడ్చేది.

డాక్టరు గారికి చూపిస్తే, ఆయన స్కానింగ్ చేసి,

'మీ అమ్మగారి కాలుకువేసిన స్టీల్ రాడ్ పక్కకు జరిగింది. మళ్ళీ ఆపరేషన్ చేసి దాన్ని సెట్ చేయాలి. కానీ ఈ వయసులో ఆపరేషన్ అంటే ఆమె తట్టుకోలేదు' అని చెప్పారు.

ఇంక చేసేదేమీ లేక, నీరసంగా ఆమెను ఇంటికి తీసుకొచ్చి, ఆమె గదిలో పడుకోబెట్టాము.

ఒకటి రెండు రోజులు ఓర్చుకుంది. ఆ తర్వాత ఓర్చుకోలేక ఏడవడం మొదలెట్టింది. ఆ ఏడుపు ఒక గంటో రెండు గంటలో కాదు, పొద్దస్తమానం ఏడుస్తూనే ఉండేది.

ఆ ఏడుపు భరించలేక ఆమె మీద మాలో ఉన్న ప్రేమా, గౌరవం తగ్గిపోయి, ఆవేశం, కోపం పెరిగిపోయేవి.

'ఎంత బాధైనా అలా ఓర్చుకోవాలి. కానీ అలా పెడబొబ్బలు పెడితే నొప్పి తగ్గుతుందా' అని కోపంగా విసుక్కొనేవాడిని.

'ఓర్చుకోవాలా?! ఎలా ఓర్చుకోవాలిరా?! బాబోయ్! నేను చచ్చిపోతాను. నా కొడుకు కూడా నన్ను విసుక్కుంటున్నాడు. నేను తట్టుకోలేక పోతున్నాను. చచ్చి పోతాను. దేవుడా, నాకు చావును ఎప్పుడిస్తావయ్యా' అని ఏడుపుస్థాయి పెంచేసేది.

మా అమ్మ ఏడుపు మాకే కాకుండా, మా పక్కింటి వాళ్ళకు కూడా న్యూసెన్స్ గా మారింది. కానీ వాళ్ళు మా మొహాలు చూసి మౌనంగా భరించేవాళ్ళు.

అలా ఏడ్చీ ఏడ్చీ, ఇంకా ఏడ్చే ఓపికలేక నీరసించి పోయింది. ఆమె గొంతు బొంగురుపోయింది. ఆ బొంగురు గొంతుతోనే దీనంగా ఏడ్చేది.

ఆమె ఎందుకు అంతగా ఏడుస్తుందో, ఆమెకు అంత నొప్పి ఎందుకు కలుగుతుందో అప్పుడు మాకు అర్ధమయ్యేది కాదు.

అంత బాధను ఒక నెల రోజుల పాటు భరించీ, భరించీ, మొన్న సాయంత్రం ఆరున్నరకు ప్రాణాలు విడిచేసింది.

కాంపౌండ్ వాల్ అవతల, కట్టెల పొయ్యిమీద పెట్టిన మట్టికుండలో అన్నం ఉడకడంతో, ఆ అన్నాన్ని ఒక తెల్లటి గుడ్డలో చుట్టుకుని స్మశానానికి బయలుదేరాం.
అక్కడ మా కోసం పూజారి గారు ఎదురుచూస్తూ కనిపించారు.

మా వెనకాలే వచ్చి, ఆశగా నావైపు చూస్తున్న గంగిరెద్దుల వాళ్ళను, అనుమానంగా చూసాను.

'డబ్బులేమీ డిమాండ్ చేయమని చెప్పారు కదా' అని వాళ్ళతో అన్నాను.

'అందర్నీ అడిగినట్లు మిమ్మల్ని మేము డిమాండ్ చేయడంలేదు బాబూ. కానీ మా ఆచారం కోసం తప్పట్లేదు. ఎంతోకొంత మీకు తోచింది ఇవ్వండి.' అన్నాడు వాళ్ళ నాయకుడు.

జేబులో ఉన్న పర్సులోంచి అయిదు వందల రూపాయల నోటు ఒకటి తీసి అతని చేతిలో పెట్టాను.

అతను పరమానందపడిపోతూ,

'దయగల సీతమ్మతల్లి, బంగారం లాంటి కొడుకులను కనింది' అని తనవాళ్ళను తీసుకుని వెళ్ళిపోయాడు.

వాళ్ళు వెళ్ళిపోగానే, పూజారి గారు సూచించినట్లుగా, మా తమ్ముడు ఒక బిందె నిండా నీళ్ళు తీసుకొచ్చి, అమ్మ చితిమీద పోసాడు. దాని వల్ల ఇంకా ఏమైనా నిప్పులు మిగిలి వుంటే చల్లారిపోతాయని పూజారి గారి ఉద్దేశం.

నీళ్ళు పోయడం వల్ల ఆ బూడిదంతా మెత్తబడి, ఇంకా పూర్తిగా బూడిదవ్వని అస్థికలు కొంచెం కొంచెంగా బయటపడ్డాయి.

ఆ అస్థికలను చూస్తున్న నా కళ్ళకు షాక్ తగిలినట్లయింది. నాకు షాకిచ్చిన ఆ వస్తువు పేరు, 'ఆర్థోపెడిక్ ఇంప్లాంట్'.

అమ్మ శరీరం అంతా కాలి బూడిద అయిపోయినా, అది ఏమాత్రం కాలకుండా ధిక్కారపు చూపులు చూస్తోంది.

టైటానియం మెటల్ తో చేయబడి, మనం స్టీల్ రాడ్ అని పిలుచుకునే ఆ వస్తువు, సరిగ్గా అమ్మ కాలు ఉండే చోట బూడిదవ్వకుండా అలాగే చెక్కు చెదరకుండా ఉంది.

దానికి ఉన్న స్క్రూ మేకులను చూసి నా వెన్ను జలదరించింది.

ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ ప్రసాద్ గారు, నేర్పరి అయిన వడ్రంగిలా, అమ్మ కాలికి స్క్రూలు బిగించాడని అర్ధమైన తర్వాత, ఆ విషయాన్ని జీర్ణించుకోలేక మనసంతా దిగులుగా అయిపోయింది.

ఆపరేషన్ చేస్తున్నప్పుడు, అలా స్క్రూలు బిగిస్తున్నప్పుడు అమ్మ ఎందుకు అలా గట్టిగా ఏడ్చేసిందో, అది కొంచెం పక్కకు జరగడం వల్ల, అమ్మ తన చివరి రోజుల్లో ఎంత నరకయాతన అనుభవించిందో ఇప్పుడు అర్ధమైంది.

అమ్మ మనసులో మామీద గూడు కట్టుకున్న చెక్కు చెదరని ప్రేమను గుర్తుచేస్తూ, మా చెంపలను ఛెళ్ళుమనిపిస్తూ, ఆ 'ఆర్థోపెడిక్ ఇంప్లాంట్' మాకు గుణపాఠం చెబుతున్నట్లుగా కనిపించింది.

అమ్మ కష్టాన్ని గుర్తించని నా అవివేకానికి ప్రాయశ్చిత్తం లేదనిపించింది.

అమ్మ విపరీతంగా ఏడుస్తున్నప్పుడు, నేను ఎందుకు అంతలా విసుక్కున్నానా అని ఆలోచిస్తుంటే, ఇప్పుడు దుఃఖం ముంచుకొస్తోంది.

(అయిపోయింది)

ఉషా - సింగీతం దీపావళి కథల పోటీలో తృతీయ బహుమతి పొందిన కథ.

ఉషా పక్ష పత్రిక డిసెంబర్ - 2025 సంచికలో ప్రచురితం.