సహ•జీవనం
“ఛా! బంకలా పట్టుకుని దరిద్రం వదలను అంటుంది.” అన్నాడు శంకర్ కోపంగా.
“ఎందుకు వదలాలి, నేను దరిద్రం కాదు,
‘సొమ్ము పోయి శని పట్టినట్లు’ మా అమ్మానాన్న బోలెడు కట్నం ఇచ్చి నిన్ను నాకు అంటకట్టారు.” అంది కోపంగా
“ఏం కూసావ్? నేను శనిలా కనిపిస్తున్నానా?” అని చెయ్యెత్తాడు…
“కొడతావా కొట్టు ఇన్నాళ్లు సహించాను, ఇంక సహించలేను, అన్ని చేసి పెడుతుంటే దరిద్రంలా కనిపిస్తున్నానా?” అంది కోపంగా…
“అబ్బా మళ్ళీ మొదలైంది వీళ్ళ గొడవ.” అంతకు అంతకు తారస్థాయికి చేరుతున్న వాళ్ళ అరుపులు కేకలకు చిరాకు పడుతూ బ్యాగ్ లో పుస్తకాలని సర్దుకుంటుంది.” త్రిషిక
“ఛ! ఈ కొంపలో మనశ్శాంతి లేకుండా పోయింది?” అని బట్టలు వేసుకొని బయటికి వెళ్లిపోయాడు శంకర్.
………………………..
కళ్ళు తుడుచుకుంటూ సోఫాలో కూర్చుని ఉన్న గిరిజతో.
“అమ్మ నేను వెళ్తున్నాను” అని చెప్పింది బ్యాగ్ భుజాన తగిలించుకొని త్రిషిక.
“ఆగవే టిఫిన్ చేసి వెళ్ళు” అంది గిరిజ.
“వద్దమ్మా! నా కడుపు నిండిపోయింది. నేను వెళ్తాను.” అంది కోపంగా త్రిషిక.
“నేనేమన్నానే, నా మీద ఎందుకు కోప్పడుతున్నావ్, నీక్కూడా నేనంటే అలుసే, మీ నాన్న నన్ను అర్థం చేసుకోవట్లేదoటే, నువ్వు కూడా.”
“ఆపమ్మా! మళ్ళీ మొదలు పెట్టకు, నాకు అసలే చిరాగ్గా ఉంది.”
“సరే ముందు టిఫిన్ చేసి వెళ్ళు.” అంది గిరిజ.
“నేను బయట క్యాంటీన్లో తినేస్తాను, చేసిన ఉప్మా నువ్వే తిను.” అంది.
“పెద్ద, చిన్నా తేడా లేకుండా మాట్లాడుతున్నావు, అమ్మ అని రెస్పెక్ట్ లేదు.”
“అమ్మ ప్లీజ్ నేను కాలేజ్ కి వెళ్ళాలి, ఇప్పటివరకు నాన్నతో గొడవ పెట్టుకున్నావు, ఇప్పుడు నాతో మొదలపెట్టావు.” అంది త్రిషిక చిరాగ్గా.
“నేను గొడవ పెట్టుకున్నానా? మీ నాన్న మాట్లాడే మాటలు నీకు వినిపించడం లేదా ఎంత దారుణంగా మాట్లాడుతున్నారు. నేను దరిద్రం అంట, వదలటం లేదంట. నేనంటే చిరాకంట, నా బాధ నీకు అర్థం కాదు.”
“మీ గొడవలతో నేను ఎంత బాధ పడుతున్నానో నీకు అర్థమవుతుందా! ఒక్కరోజన్నా ప్రశాంతంగా అమ్మానాన్న అని కలిసి కూర్చుని సరదాగా కబుర్లు చెప్పకున్నామా? ఏదో ఒక దానికోసం గొడవ, నాకు బుర్ర పిచ్చెక్కిపోతుంది, ఇంటికి రావాలంటేనే చిరాగ్గా ఉంది.” అని వెళ్ళిపోయింది.
………………………..
విశ్వాస్ ఇంజనీరింగ్ కాలేజ్:
కాలేజ్ క్యాంపస్ గ్రౌండ్లో మెత్తని పచ్చగడ్డి మీద కూర్చుని ఉన్నారు, త్రిషిక ఉజ్వల్.
“త్రిషిక, క్యాంపస్ సెలక్షన్లో జాబ్ కన్ఫర్మ్ అయింది. టూ మంత్స్ లో ఆఫర్ లెటర్ వస్తుంది.
ఈ రోజుతో ఎగ్జామ్స్ కూడా అయిపోయాయి. మన పెళ్లె తరువాయి” అన్నాడు ఉజ్వల్ ఉత్సాహంగా.
“పెళ్ళా?” అంది ఆశ్చర్యంగా,
“అంతరిక్షానికి వెళ్దాం, అని అనట్లేదు బేబీ, పెళ్లి చేసుకుందాం? అని అడిగాను అంతే.”
“పెళ్లి కంటే, అంతరిక్షంలోకి వెళ్లటమే బెస్ట్. అక్కడ అద్భుతాలను చూసి రావచ్చు.” అంది.
“అర్థంకాలేదు” అన్నాడు అయోమయంగా,
“నాకు పెళ్లంటే ఇష్టంలేదు?” అంది ముభావంగా,
“పెళ్లి ఇష్టంలేదా? నన్ను పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదా?”
“ఉజ్వల్! అలా అనకు నువ్వు నాకు కావాలి?”
“మరి” అన్నాడు ఆశ్చర్యంగా.
“గొప్పగా వేలాదిమందికి తెలిసేలా ఆడంబరంగా పెళ్లి చేసుకుని.. ఒకరిని ఒకరు తిట్టుకుంటూ, కొట్టుకుంటూ, ఏడుస్తూ, గొడవపడుతూ, ఆ హారిబుల్ లైఫ్ లీడ్ చేయడం నావల్ల కాదు.”
“మరేం చేద్దాం” అన్నాడు.
“పెళ్లి చేసుకోకుండానే ఇద్దరం కలిసి సంతోషంగా ఉందాం.” అంది.
“యు మీన్ లివింగ్ టుగెదర్.” అన్నాడు.
“పేరు ఏదైనా కానీ, పెళ్లి పేరుతో పలుపుతాడు కట్టించుకుని జీవితాంతం నరకం అనుభవించటం నావల్ల కాదు” అంది.
“ఉజ్వల్ ఏంటి ఆలోచిస్తున్నావు? నీకు ఇష్టం లేకపోతే వద్దులే.” అంది త్రిషిక.
“ అదేమీ లేదు.” అన్నాడు ఉజ్వల్ ఏదో ఆలోచిస్తూ.
“బాబు అంత ఊహల్లో తేలకు, నువ్వు పెళ్లి అన్నావని, జస్ట్ నాకు పెళ్లి మీద ఉన్న అభిప్రాయం చెప్పాను.” అని పైకి లేచింది.
సరే, ఈ టు మంత్స్ ప్లాన్ ఏంటి?” అడిగాడు ఉజ్వల్ ఆమె వెనుక నడుస్తూ...
“లేటుగా లేచి, ఓటిటిలో వెబ్సిరీస్, కొరియన్ సిరీస్ చూస్తూ ఎంజాయ్ చేయడమే.”
“సరే, నేను ఈ రోజు మావూరు బయలుదేరుతాను,” అన్నాడు.
“ఈ టూ మంత్స్ నిన్ను చూడకుండా ఉండటం చాలా కష్టం. ఐ మిస్ యు రా!” అంది త్రిషిక తను ఎక్కవలసిన బస్సు రావడం చూసి,
“ఐ టూ మిస్ యు రా! రోజు కాల్ చేస్తాను, బాయ్“ అన్నాడు ఉజ్వల్.
“ఓకే బాయ్, లవ్ యు రా” అంది బస్సు ఎక్కుతూ త్రిషిక.
“త్రిషిక ఐ లవ్ యూ” అన్నాడు చేయి ఊపుతూ…
……………………
“త్రిషిక, మావయ్య ఫోన్ చేశాడు. మంచి సంబంధం చూశాడంట. ఫారిన్ జాబ్, లక్షల్లో జీతం. ఫోటో పంపించాడు… ఒకసారి చూడు” అని ఫోన్ చూపించింది గిరిజ.
“అమ్మా! ఎన్నిసార్లు చెప్పాను, నాకు పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదని” అంది త్రిషిక.
“అలా కాదే, జీవితంలో ఎప్పటికైనా పెళ్లి చేసుకోక తప్పదు మంచి సంబంధం వచ్చినప్పుడు చేసుకోవాలి.” అంది గిరిజ.
“రోజంతా చిరాకులు, పరాకుల పెళ్లి నాకొద్దు, నా లైఫ్ నేను ఒంటరిగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాను, నువ్వు నన్ను డిస్టర్బ్ చేయకు.” అంది చిరాగ్గా,
“అలా అంటే ఎలా త్రిషిక, పెళ్లి అనే బంధంలో ఒక సెక్యూర్ ఫీలింగ్ ఉంటుంది. ఎన్ని గొడవలుపడినా, మా మధ్య ప్రేమ, అనుబంధం ఏర్పడి ఉంటుంది. దాన్ని వదిలిపోలేము.” అంది గిరిజ.
“తోటకూర ఏం కాదు, ఇరవైనాలుగు గంటలు గొడవపడుతూ బంధం, అనుబంధం గురించి చెప్తున్నావు, మీ ఇద్దరూ విడాకులు తీసుకుంటే హ్యాపీగా ఉండేవాళ్ళు. నేను ప్రశాంతంగా ఉండేదాన్ని.”
“నోరుముయ్యి! పోనీలే పెద్దదానివి అయ్యావని మాట్లాడకుండా ఊరుకుంటుంటే, బాగా ఎక్కువ మాట్లాడుతున్నావు, తల్లిదండ్రులు లేని పిల్లగా పెరుగుతావని ఆలోచించి, నీకోసమే కలిసి బ్రతుకుతున్నాము.” అంది గిరిజ కోపంగా.
“నువ్వెన్నైనా చెప్పు, నేను పెళ్లి చేసుకుని మీలాగా బ్రతకడం నా వల్ల కాదు, నేను ఇలాగే ఉంటాను.” అని కోపంగా వెళ్ళిపోయింది.
……………………
రెండునెలల తర్వాత, ఐటీ కంపెనీలో ఉద్యోగం కోసం చెన్నై ప్రయాణమైంది త్రిషిక.
ఉజ్వల్ అతని ఫ్రెండ్స్ ధరణి, వేణు కూడా చెన్నైలో జాబ్ కోసం వచ్చి త్రిషికను కలుసుకున్నారు.
నలుగురు కలిసి అపార్ట్మెంట్ రెంటుకు తీసుకున్నారు.
కొత్త ఆఫీస్, కొత్త ఫ్రెండ్స్ కొత్త ప్లేస్ తో సరదాగా గడిచింది కొన్నాళ్ళు,
ఆరు నెలల తర్వాత, వేణు, ధరణిలకు హైదరాబాద్ బ్రాంచ్కు ట్రాన్స్ఫర్ అయి వెళ్లిపోయారు.
“ఉజ్వల్, నేను కూడా చిన్నరూమ్ చూసుకొని షిఫ్ట్ అయిపోతాను.” అని చెప్పింది త్రిషిక.
“త్రిషిక త్రీ ఇయర్స్గా లవ్ చేసుకుంటున్నాము. చదువు అయిపోయింది, జాబ్స్ వచ్చి సెటిలైపోయాము ఇప్పటికైనా మనం పెళ్లి చేసుకుందాం.” అన్నాడు.
“ఉజ్వల్, ప్లీజ్ నాకు పెళ్లంటే ఇష్టం లేదని తెలుసు కదా.”
“తెలుసు కానీ, పెళ్లి చేసుకోకుండా లవ్ చేసుకుంటూ ఎన్ని రోజులు ఉంటాము. దేనికైనా ఒక ఎండ్ ఉంటుంది కదా,” అన్నాడు.
త్రిషిక తన నిర్ణయంపై గట్టి నమ్మకం, పట్టుదలతో ఉండటంతో ఇద్దరూ కాసేపు చర్చించుకుని,
పెళ్లి చేసుకోకుండా ‘సహజీవనం’ చేయటానికి నిర్ణయించుకున్నారు.
‘సహజీవనం అంటే కలిసి బ్రతకటం… ఒకరి మీద ఒకరు పెత్తనం చేయటం, ఒకరినొకరు ఇబ్బంది పెట్టుకోవటం ఉండదు. ఎవరికి నచ్చినట్లు వారు ఫ్రీగా, ప్రశాంతంగా బ్రతకొచ్చు. నచ్చని రోజు వెళ్ళిపోవచ్చు’ అని తనకు తానే ధైర్యం చెప్పుకుని ఆనందపడింది త్రిషిక.
ఇద్దరూ కలిసి ఆఫీస్కి వెళ్లడం రావడం, కలసి పనులు పంచుకోవడం, వీకెండ్ సరదాలు, రెస్టారెంట్లు, సినిమాలు, ఎవరూ ప్రశ్నించని స్వేచ్ఛ. ఉజ్వల్ చూపించే ప్రేమకు త్రిషిక ఆనందానికి అవధులు లేవు.
“ఇదే కదా జీవితం…
ఇదే నిజమైన ప్రేమ.” అనుకుంది త్రిషిక.
…………………………
“త్రిషిక! ఈ జాబ్ నాకు సెట్ కాదు మానేశాను, వేరే జాబ్ చూసుకుంటున్నాను.” అని చెప్పాడు ఉజ్వల్.
ఆఫీస్లో మేనేజర్ కి ఉజ్వల్కి జరిగిన గొడవ తెలిసి మౌనంగా ఊరుకుంది త్రిషిక.
ఆరు నెలలైనా తనకి నచ్చిన ఉద్యోగం దొరకలేదు ఉజ్వల్ కి,
ఇంటి ఖర్చులు అన్ని తన జీతం నుంచి ఖర్చు పెట్టింది, ‘ఒకరు కష్టాలను ఉన్నప్పుడు మరొకరు సహాయం చేసుకోవాలి కదా’ అనుకుంది.
రోజు ఇంటర్వ్యూలకు అటెండ్ అవ్వటం, జాబ్ రాకపోవడంతో చిరాకు పెరిగిపోయింది ఉజ్వల్ కి.
“ఉజ్వల్ ఈ రోజు ఆఫీసులో పని ఎక్కువగా ఉంది ప్లీజ్ వంట నువ్వు చెయ్యవా?” అని అడిగింది,
“సారీ, మన అగ్రిమెంట్ ప్రకారం ఈ వారం డ్యూటి నీదే, నో చేంజెస్” అన్నాడు టీవీ చూస్తూ,”
“నేను జాబ్ చేసి వస్తున్నాను ఆమాత్రం హెల్ప్ చేయడానికి ఏమైంది?” అంది కోపంగా,
“అంటే నీకు జాబ్ లేదు, నువ్వు వేస్ట్ ఫెలోవి వంట అయినా చెయ్ అంటున్నావా?” అన్నాడు కోపంగా.
“నేను అలా అనలేదు, నాకు కొంచెం నీరసంగా ఉంది అందుకే చెప్పాను.” అంది.
“నేను చూస్తూనే ఉన్నాను నేను ఖాళీగా ఉన్నాను అని నీకు అలుసయిపోయాను.” అన్నాడు
“ఉజ్వల్ పిచ్చిపిచ్చిగా మాట్లాడకు.” అని గబగబా వాష్ బేసిన్ దగ్గరికి పరిగెత్తి వాంతి చేసుకుంది.
“త్రిషిక ఏమైంది?” అన్నాడు కంగారుగా.
“ఉజ్వల్ డౌట్ వచ్చి ఈరోజే చూసుకున్నాను, ఐ యాం ప్రెగ్నెంట్” అంది
“వాట్, జాగ్రత్తలు తీసుకుంటూనే ఉన్నాం కదా.” అని అక్కడే సోఫాలో కూర్చున్నాడు తల పట్టుకుని,
కొంతసేపు మౌనం తరువాత,
“త్రిషిక రేపు అబార్షన్ చేయించుకో” అన్నాడు.
“ఉజ్వల్, ప్రెగ్నెన్సీ ఉంచుకుంటాను, నాకు పిల్లంటే చాలా ఇష్టం” అంది.
“నో, నాకిష్టం లేదు, సహజీవనంలో పిల్లలకు గౌరవం ఉండదు,” అన్నాడు
తప్పని పరిస్థితుల్లో అబార్షన్ చేయించుకోవాల్సి వచ్చింది త్రిషికకు.
పసిగుడ్డును తీస్తుంటే బాధతో విలవిలలాడిపోయింది,
అబార్షన్తో ఒళ్లంతా పచ్చి పుండులా మారి జ్వరం వచ్చింది. ఉజ్వల్కి ఎన్నిసార్లు ఫోన్ చేసినా కట్ చేశాడు.
“నేను ఇంటర్వ్యూ లో ఉన్నాను నాకేం తెలుసు, నీకు బాలేదని” అన్నాడు నిర్లక్ష్యంగా ఇంటికి వచ్చిన తర్వాత,
తండ్రి గుర్తొచ్చాడు, గిరిజ కిందపడి కాలు బెణికి శంకర్ కు ఫోన్చేస్తే ఎత్తకపోగా “నాకేం తెలుసు నువ్వు పడతావని” అన్నాడు నిర్లక్ష్యంగా.
ఆశ్చర్యపోయింది, తను ఏమి కోరుకుంది ఏమి జరుగుతుంది.
……………………….
“అమ్మ ఏంటి ఇంత హఠాత్తుగా వచ్చారు.” అని అడిగింది త్రిషిక, చెప్పాపెట్టకుండా చెన్నై వచ్చిన తల్లిదండ్రులను చూసి,
“ఏమీ లేదే మా పిన్ని మనవరాలు రమ్య, అదే మీ ఇద్దరు చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళు ఆ రమ్య ఇక్కడే ఉంటుంది,
ఏదో లివ్ ఇన్ టుగెదర్ అంట, పెళ్లి చేసుకోకుండా ఎవరితోనో కలిసి ఉండి కడుపు చేసుకుంది. ఇప్పుడు వాడు మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని తెలిసి ఆత్మహత్య చేసుకుంది.” అంది గిరిజ.
“బుద్ధి లేకపోతే సరి పెళ్లిలో ఉన్న బాధ్యత ఈ సహజీవనంలో ఉంటుందా? ఇప్పటి పిల్లలు మరి అయోమయంగా ఉంటున్నారు.” అన్నాడు కోపంగా శంకర్.
“త్రిషికకు ఏం చేయాలో అర్థం కాలేదు, ‘తను కూడా ఆ రిలేషన్లోనే ఉంది అని తెలిస్తే అమ్మ నాన్న ఏమంటారో.” అని భయపడింది.
“ఏంటీ రోజు ఆఫీసు లేదా?” అని అడిగాడు శంకర్.
“మీరు చెన్నై వచ్చామని ఫోన్ చేసిన తర్వాత నేను ఆఫీసుకి లీవ్ పెట్టాను.”
“స్నానం చేసి ఫ్రెష్ అవ్వాలి?” అన్నాడు.
నాన్న ఒక నిమిషం అని చెప్పి గబగబా బెడ్ రూమ్ లోకి వెళ్లి తలుపు వేసుకొని ఉజ్వల్ బట్టలు అతని సామాన్లన్నీ ఒక పెట్లో పెట్టి మంచం కిందకు తోసేసింది.
“నాన్న ఇప్పుడు రండి గీజర్ ఆన్ చేశాను.” అని చెప్పింది.
…………………………..
“ఉజ్వల్ అమ్మానాన్న వెళ్లిపోయారు ఇంటికి రావచ్చు” అని ఫోన్ చేసింది.
“ఏమైంది ఎందుకు వచ్చారు హఠాత్తుగా” అని అడిగాడు.
“రమ్య గురించి చెప్పింది, పాపం అంతగా నమ్మిన రమ్యను ఎలా మోసం చేస్తాడు.” అంది కోపంగా.
“దాన్లో తప్పేముంది, ఇదేమైనా చట్టబద్ధమైన రిలేషన్ కాదు కదా. ఇందులో పూర్తి స్వేచ్ఛ ఉంటుంది ఎవరిష్టం వచ్చినట్లు వారు నడుచుకోవచ్చు.” అన్నాడు ఉజ్వల్.
“ఉజ్వల్ ఏం మాట్లాడుతున్నావ్” అంది కోపంగా.
“నిజం మాట్లాడుతున్నాను, ఈ రిలేషన్స్ అంతా అవకాశవాదమే” అన్నాడు.
“ఉజ్వల్ నువ్వు చాలా చీప్ గా మాట్లాడుతున్నావ్” అంది.
“ఎస్, పేరుకే రిలేషన్, నిబద్ధత లేని ఫేక్ బంధం, ఇద్దరం కలిసి మన బంధం గురించి అందరికీ చెప్పుకోగలమా? భార్యాభర్తల్లాగా, ఇద్దరం కలిసి ఏదైనా ఫంక్షన్కి వెళ్ళగలమా? ఎవరైనా నిన్ను ముత్తయిదువుగా గుర్తించి తాంబూలం ఇస్తారా? జీవితాంతం ఇలా దాగుడుమూతలు ఆడాల్సిందేనా?”
“ఇందులో తప్పేముంది? ఒకరికొకరు ఇష్టపడే ఉంటున్నాము, మనకి పెళ్లి కాలేదు అంతే?”
“అంత ధైర్యం ఉన్న దానివి మీ పేరెంట్స్కి ఎందుకు చెప్పలేకపోయావు. టూ ఇయర్స్ నుంచి మనం లివిన్లో ఉన్నాం. ఇంకా పెద్దలకి చెప్పడానికి సంకోచిస్తున్నాం అంటే, మన సమాజం ఇంకా సహజీవనాన్ని యాక్సెప్ట్ చేసే అంత ఎదగలేదు.”
“అది కాదు ఉజ్వల్”
“ఏనీవే, ఐ యామ్ బోర్డ్ విత్ దిస్ రిలేషన్‌షిప్. లెట్స్ బ్రేక్ అప్.”అని చెప్పి రూమ్లోకి వెళ్లి తన బట్టలన్నీ బ్యాగ్లో సర్దుకుంటున్నాడు.
“ఉజ్వల్ ఆగు! నేను మళ్ళీ ప్రెగ్నెంట్, ఈ టైంలో నన్ను వదిలి వెళ్ళిపోవడం, ఇట్స్ నాట్ ఫెయిర్.” అంది త్రిషిక.
“అది నీ ప్రాబ్లం.” అన్నాడు.
“అది నా ఒక్కదాని ప్రాబ్లం ఎలా అవుతుంది, ఇద్దరం కలిసే,” అని ఆగిపోయింది.
“అవును ఇద్దరూ కలిసే” అన్నాడు ‘ఇద్దరు’ అన్న పదాన్ని వత్తి పలుకుతూ,
“ఉజ్వల్ ప్లీజ్,” అంది ఏడుస్తూ,
“సహజీవనం అనేది సంసారం కాదు. కేవలం ఉద్యోగం లాంటిదే, నచ్చని ఉద్యోగం చేస్తూ నేనుండలేను, ‘సో ఐ యాం గెట్టింగ్ అవుట్ ఆఫ్ ద రిలేషన్” అని బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోయాడు.
“ఉజ్వల్” అని ఏడుస్తూనే ఉంది.
“తను చేసిన తప్పేంటి? ప్రేమ తప్ప గొడవలు ఉండకూడదు అనుకోవటం తన తప్పా?”
___________________
కాలింగ్ బెల్ ఆగకుండా మోగటం వినిపించి, అతి కష్టం మీద లేచి వెళ్లి తలుపుతీసింది త్రిషిక.
ఎదురుగా ఉన్న తల్లిదండ్రులను చూసి ఆశ్చర్యపోయింది.
తిండి తిప్పలు లేకుండా నిరసించిపోయిన కూతుర్ని చూసి కడుపు తరుక్కుపోయింది ఇద్దరికీ.
“ఇదేంటి ఇలా అయిపోయావు” అంది కూతుర్ని పట్టుకుని,
“అమ్మ” అని బావురమని ఏడ్చింది.
“త్రిషిక ఎంటమ్మా, ఎందుకు ఇలా చేశావు?” అన్నాడు బాధగా శంకర్.
“ఆడంబరంగా పెళ్లి చేసుకుని.. రోజూ ఇంట్లో తిట్టుకుంటూ ఉండడం కంటే, ఒకరితో ఇంకొకరు ఆంక్షలు లేని జీవితం హాయిగా గడపాలి, అలాంటి బంధం కావాలి అనుకోవడం తప్పా నాన్న.” అంది ఏడుస్తూ
“చూడమ్మ! పెళ్లికి కానీ అలాగే సహజీవనానికి కానీ దానంతట దానికే ఏ గొప్పతనం లేదా అవలక్షణం ఉండదు, మనం ఆపాదిస్తే తప్ప!
నువ్వు మన వివాహ వ్యవస్థలో లోపాలు ఉన్నాయి అనుకున్నావు. అలానే, సహజీవనం లో కూడా లోపాలు ఉంటాయి,
ఏ వ్యవస్థ అయినా, అది మనం ఉండదలచిన వ్యక్తిని బట్టి, మనని బట్టి ఉంటాయి. అది పెళ్ళైనా, సహజీవనం అయినా.” అన్నాడు శంకర్.
“సారీ డాడీ” అంది తలవంచుకొని,
“నేనే నీకు సారీ చెప్పాలి, పిల్లల ఎదురుగా గొడవపడితే వాళ్ల మనసు ఎంత బాధపడుతుందో అర్థం చేసుకోలేకపోవటం మా తప్పే.” అన్నాడు శంకర్ బాధగా.
“త్రిషిక, పెళ్లి తప్పు కాదు, ఒకరినొకరు అర్థం చేసుకోలేని, బాధ్యతలను పంచుకోలేని మనుషులదే తప్పు” అంది కన్నీళ్ళతో గిరిజ,
“సారీ అమ్మా! నిన్ను కూడా మాటలతో చాలా బాధపెట్టాను, ఉజ్వల్ చేసిన మోసంతో నా తప్పేమిటో అర్థమైంది” అంది కన్నీళ్ళతో, తన కడుపు మీద చేయిపెట్టి తడుముకుంది”
“పిచ్చిదానా! మా వలన నువ్వు తప్పు దారిలో వెళ్లి పెద్ద రిస్క్ చేశావు. కానీ బాధ్యత తెలిసిన ఉజ్వల్ వంటి మంచి మనిషిని ఎంపిక చేసుకోవడమే నీ అదృష్టం.” అంది గిరిజ.
“అదృష్టమా” అంది ఆశ్చర్యంగా
“ఉజ్వల్ మన ఇంటికి వచ్చి మాతో మాట్లాడి మమ్మల్ని ఒప్పించాడు. అతని మాటలకు మీ నాన్నలో కూడా చాలా మార్పు వచ్చింది.” అని చెప్పింది ఆనందంగా గిరిజ.
“అవునా” అంది ఆశ్చర్యం ఆనందం కలగలిపి.
“ఎస్ డియర్, ఇప్పటికైనా నువ్వు పెళ్లికి రెడీయేనా?” అంటూ లోపలకు వచ్చాడు ఉజ్వల్.
“ఉజ్వల్, అని పరుగున వెళ్లి అతనిని హత్తుకుంది.
“ఏయ్ జాగ్రత్త మన బిడ్డ” అన్నాడు ఆమె పొట్ట మీద చేయి వేసి,
“కలిసి ఉండటం కాదు… కలిసి బ్రతకటమే అసలైన పరీక్ష.”
………శుభం……….
ఇది నా స్వీయ రచన
అంజనీ దేవి శనగల విశాఖపట్నం