Year - 2098 AD
అందరికీ ఎంతో చెప్పి చూశాను, కానీ ఎప్పుడూ నా మాట వినిపించుకోవట్లేదు. ఎందుకో మరి, ఇలాంటి డూమ్స్ డే సేయర్స్‌ను ఎవరు పెద్దగా పట్టించుకోరు. ఆ డూమ్స్ డే వచ్చినప్పుడు మాత్రమే వాళ్ల ప్రొఫెసీ నిజమని తెలుసుకుంటారు. ఆ రోజు ఇంకెంతో దూరంలో లేదు.
నేను ఒక స్పేస్ సైంటిస్ట్‌ని. ఇంకా ప్రిసైజ్‌గా చెప్పాలంటే స్పేస్ బయాలజీలో పిహెచ్‌డీ చేసిన ఒక అడ్వాన్స్‌డ్ సైంటిస్ట్‌ని. యూరప్, కెనడా, జపాన్ లాంటి అనేక స్పేస్ రీసెర్చ్ ఏజెన్సీల్లో పనిచేశాను. అనేక స్పేస్ స్టేషన్లలో కూడా.
కానీ నేను ఎక్కడికి వెళ్లినా ఒకే విషయం కనిపించింది.
మోనోటనీ.
అందరూ ఒకే దిశలో నడుస్తున్నారు.
ఎవరూ కొత్త ప్రశ్నలు అడగడం లేదు.అడిగినా వాటిని పక్కనపెట్టేస్తున్నారు.
వైవిధ్యం కొరవడింది.
అందుకే నేను చివరికి ఒక నిర్ణయం తీసుకున్నాను.
నా సొంత లాబొరేటరీని ఏర్పాటు చేసుకుని స్వతంత్రంగా పరిశోధనలు చేయడం ప్రారంభించాను.
కానీ స్వతంత్ర పరిశోధకులకు ప్రపంచంలో పెద్దగా విలువ ఉండదు. పెద్ద జర్నల్స్ కూడా అలాంటి వాళ్ల పేపర్స్‌ని పెద్దగా పట్టించుకోవు.
నేను రాసిన అనేక పేపర్స్ చాలా వరకు మానవాళికి రాగల భవిష్యత్తులో ఎదురయ్యే ఉపద్రవాల గురించి.
ఉల్కాపాతాలు,ఎక్స్‌ట్రాటెర్రెస్ట్రియల్ సూక్ష్మజీవులు, భూమి బాహ్య వాతావరణంలో జరిగే మార్పులు.
ఇలాంటి విపత్తుల గురించి అనేక మత గ్రంథాల్లో కూడా ప్రస్తావనలు ఉన్నాయి. హిందూయిజం కావచ్చు, క్రిస్టియానిటీ కావచ్చు, ఇతర మతాలు కావచ్చు — అందులో ప్రపంచ వినాశం గురించి,విలయాలు ప్రళయాల గురించిన కథలు చాలా ఉన్నాయి.
నేను ఒక నాస్తికుడిని అని చెప్పలేను కానీ వృత్తి రీత్యా చదువుకున్న శాస్త్రాల రీత్యా...ప్రశ్నిస్తుంటాను అలాంటి ఒక ఉనికి గురించి.
అలాంటి కథలను నమ్మను.
కానీ శాస్త్రం నాకు ఒక విషయం నేర్పింది.
ఒక ఆలోచన మతంలో నుంచైనా ఇతర భాల్లోంచి వచ్చినా — అది ప్రాక్టికల్‌గా ఉపయోగపడితే దాన్ని తీసుకోవడంలో తప్పు లేదు.
ఆ ఆలోచనల్లో ఒకటి — ఆర్క్.
ప్రపంచం నశించే ముందు జీవాన్ని భద్రపరిచే ఓడ.
నేను దాని గురించి శాస్త్రీయంగా ఆలోచించడం ప్రారంభించాను.
ఇలాంటి ఆలోచనలు మొదట నా మనసులోనే ఉండిపోయాయి.
అప్పటివరకు.
ఆ రోజు వరకు.
నేను ఆమెను కలిసే వరకు.
ఆమెను నేను మొదటిసారి స్విట్జర్లాండ్‌లో జరిగిన ఒక అంతర్జాతీయ స్పేస్ బయోసిస్టమ్స్ కాన్ఫరెన్స్‌లో కలిశాను.
ఆమె ప్రెజెంటేషన్ లంచ్ టైమ్‌కు ముందు పెట్టారు. అంటే పెద్దగా ఎవరూ పట్టించుకోని సెషన్.
కానీ ఆమె స్టేజ్ మీద నిలబడి మాట్లాడటం ప్రారంభించిన వెంటనే హాల్‌లో వాతావరణం మారిపోయింది.
ఆమె మొదటి స్లైడ్లో భూమి చిత్రం కనిపించింది.
రెండో స్లైడ్లో పూర్తిగా నిర్జీవంగా ఉన్న ఒక గ్రహం.
మూడో స్లైడ్‌లో అదే గ్రహం మీద మళ్లీ క్రమంగా పుట్టుకొస్తున్న జీవం.
ఆమె చెప్పింది.
“భూమి ఎప్పటికీ అలాగే ఉంటుంది అని మనిషి అనుకుంటాడు. కానీ భూమి మీద జీవం గతంలో అనేక సార్లు నశించింది. మళ్లీ పుట్టింది.మళ్లీ నశించేందుకు అవకాశం కూడా ఉంది.జీవం అంటే దాన్లో మనిషి కూడా ఉంటాడు అని నా ఉద్దేశం.”
కొంతమంది చిరునవ్వు నవ్వారు.
ఆమె చివరి మాట మాత్రం హాల్‌లో నిశ్శబ్దం సృష్టించింది.
“మనిషి భూమిని కాపాడటానికి ప్రయత్నించాలి. కాకపోతే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మనుషులు వ్యవహరించే తీరులో అది సాధ్యం కాకపోవచ్చు. అందుకే మనం ప్లాన్ బి గా భూమి లేకపోతే పరిస్థితేంటి అని ప్రశ్నించుకుని, భూమి లేకపోయినా జీవం నిలబడే మార్గాన్ని కూడా సిద్ధం చేసుకోవాలి.”
ప్రెజెంటేషన్ ముగిసినప్పుడు చప్పట్లు వినిపించాయి. కాకపోతే ఆకలికి కొట్టిన చప్పట్లలాగా పల్చగా ఉన్నాయి.
అందులో కొన్ని మర్యాదపూర్వకమైనవి కావొచ్చు. ప్రశంసాపూర్వకమైనవి గా వినిపించలేదు.
*****
ఆ సాయంత్రం నేను ఆమెను కాన్ఫరెన్స్ హాల్ బయట కలిశాను.
లేక్ జెనీవా వైపు చూస్తూ ఆమె ఒంటరిగా కూర్చుని ఉంది.
నేను దగ్గరికి వెళ్లి అన్నాను.
“మీరు వాళ్లని అసౌకర్యానికి గురి చేశారు.”
ఆమె నవ్వింది.
“అది మంచి విషయమేగా,” అంది.
“ఎందుకంటే వాళ్లు వినాలనుకోని విషయాలే ఎక్కువగా నిజం అవుతాయి.”
మేమిద్దరం పరిచయం చేసుకున్నాం.
కొద్దిసేపటికే మా సంభాషణ చాలా లోతుగా మారిపోయింది.
నేను అడిగాను.
“మీ రీసెర్చ్ ఎందుకు కొనసాగలేదు?”
ఆమె కొద్దిసేపు మౌనంగా ఉండి చెప్పింది.
“ఫండింగ్.”
“ప్రభుత్వాలకు ఇలాంటి పరిశోధనలు అకాడమిక్ గా మాత్రమే కనిపిస్తాయి, ఎలక్షన్స్ కి ఉపయోగపడవని ఏమో మరి అరకొర సాంక్షన్స్ మాత్రమే అవుతాయి. కార్పొరేట్ సంస్థలకు లాభాలు కావాలి. కానీ నేను చేస్తున్న పని వెనువెంటనే లాభాలు ఇవ్వదు గా.అయినా చాలా పెట్టుబడి కావాలి అంత కంటే ముఖ్యం ఓపిక .”
ఆమె నా వైపు చూసి అడిగింది.
“మీరు?”
నేను నవ్వాను.
“నేను కూడా అదే కారణంతో ఒంటరిగా పని చేస్తున్నాను.”
కొంతసేపు మేమిద్దరం మౌనంగా ఉన్నాం.
ఆ తర్వాత ఆమె ఒక్కసారిగా అడిగింది.
“భూమి మీద జీవం పూర్తిగా నశిస్తే… దాన్ని మళ్లీ ప్రారంభించడానికి మనిషి దగ్గర ఏమైనా ప్రణాళిక ఉందా?”
నేను అన్నాను.
“ఉండాలి.”
ఆమె నవ్వింది.
“అదే సమస్య.”
“ఉండాలి… కానీ లేదు.”
*****
ఆ రాత్రే మొదటిసారి ఆర్క్ ఆలోచన స్పష్టంగా రూపం తీసుకుంది.
భూమి జీవవైవిధ్యాన్ని భద్రపరిచే ఒక వాహనం.
జీవానికి ఒక బ్యాంక్.
జీవానికి ఒక విత్తనం.
మేమిద్దరం ఆ ఆలోచన గురించి గంటల తరబడి మాట్లాడాం.
ఆమె చివరకు చెప్పింది.
“మీరు ఒక స్పేస్ షిప్ నిర్మిస్తే… నేను దానిలో జీవాన్ని నిర్మించగలను.”
నేను నవ్వుతూ అన్నాను.
“అయితే మనిద్దరం కలిసి ఒక ప్రపంచాన్ని మళ్లీ సృష్టించవచ్చు.”
ఆమె కళ్లలో ఒక విచిత్రమైన మెరుపు కనిపించింది.
“అవును,” అంది.
“మనం జీవాన్ని కాపాడవచ్చు. మనుషుల్ని కూడా.” అన్నాను నవ్వుతూ.
****
ఆ తర్వాత సంవత్సరాలు గడిచాయి.
మేమిద్దరం రహస్యంగా పని చేశాం.
నేను ఆ స్పేస్ షటిల్ నిర్మించాను. చిన్నది,పక్క గ్రహానికి వెళ్లడానికి సరిపోయేది.
ఆమె జీవ వ్యవస్థ నమూనాలను రూపొందించింది.
క్రయో ప్రిజర్వేషన్ టెక్నాలజీ ద్వారా అనేక జీవరాశుల డిఎన్ఏలను భద్రపరిచాం.
పక్షులు.
జంతువులు.
చెట్లు.
ఫంగస్.
సూక్ష్మజీవులు.
భూమి జీవవైవిధ్యానికి ఒక జెనెటిక్ ఆర్కైవ్.
ఒక రోజు ఆ వాహనం పూర్తయ్యింది.
మేమిద్దరం దాని ముందు నిలబడి ఉన్నాం.
ఆమె నన్ను చూసి అడిగింది.
“మనిషి రెండో అవకాశానికి అర్హుడా?”
నేను కొద్దిసేపు ఆలోచించి అన్నాను.
“మనిషి అర్హుడో కాదో నాకు తెలియదు.”
“కానీ జీవం మాత్రం అర్హమే.”
ఆమె మౌనంగా తల ఊపింది.
****
కొన్ని గంటల తర్వాత.
మేమిద్దరం ఆ వాహనంలోకి ప్రవేశించాం.
కంట్రోల్ ప్యానెల్ మీద ఒక పేరు వెలిగింది.
THE ARK
నేను లాంచ్ బటన్ నొక్కాను.
మొదట కొద్దిగా వణికింది.
తర్వాత భారీ శబ్దం.
స్పేస్ షిప్ నెమ్మదిగా నేల నుంచి పైకి లేచింది.
విండో బయట భూమి దూరమవుతోంది.
మేఘాలు.
సముద్రాలు.
ఖండాలు.
అన్నీ చిన్నవుతూ కనిపిస్తున్నాయి.
ఆమె నెమ్మదిగా అడిగింది.
“మనము పిరికివాళ్లమా?”
నేను క్రయో వాల్ట్ వైపు చూపించాను.
అందులో వేలాది జీవరాశుల డిఎన్ఏ ఉంది.
“పిరికివాళ్లు పారిపోతారు, అందరినీ విడిచిపెట్టి కానీ మనం మనతో పాటు సమస్త జీవరాశులను తీసుకెళ్తున్నాం. మన మాట వినిపించుకోని వాళ్ళు మూర్ఖులు. అంతే ” అన్నానుస్థిరంగా.
“మనతో పాటు మొత్తం భూమి వస్తోంది.” అంది మెల్లగా.
కొన్ని నిమిషాల్లోనే మేము భూమి వాతావరణాన్ని దాటి రోదసీలోకి ప్రవేశించాం.
భూమి ఇప్పుడు ఒక నీలి గోళంలా కనిపిస్తోంది.
ముందు అనంతమైన నక్షత్రాలు.
కొత్త ప్రపంచాల దిశగా మా ప్రయాణం ప్రారంభమైంది.
కంట్రోల్ ప్యానెల్ మీద మాత్రం అదే పేరు వెలుగుతోంది.
THE ARK
నీటిమీద తేలే ఓడ కాదు.
నక్షత్రాల మధ్య ప్రయాణించే జీవ నౌక.
మానవ చరిత్రలో అత్యంత పురాతనమైన ఒక ఆలోచన…
ఇప్పుడు అంతరిక్షంలోకి.
*****