2026 నెచ్చెలి పత్రికలో ప్రచురణ.
ట్రీట్…!
---------------
రాత్రి పదకొండు గంటలు.
“సత్యా….రా….”భర్త మోహిత్ తీయటి పిలుపు వినపడినా వంటింట్లో ఏదో సర్దుతూ ఉండిపోయింది సత్య…
“సత్యా…నిన్నే….మళ్ళీ రేపు నేను ఊరెళ్ళిపోతానమ్మా. త్వరగా రా….”అన్నాడు.
ఆమె రాగానే దగ్గరకు తీసుకున్నాడు. ఆమె “కొంచెం ఆగండీ” అంటూ విడిపించుకోబోయింది.
“సత్యా…నా ఉద్యోగంలో నెలకి పది రోజులు బయట గడపడం కష్టంగా వుంది. నీకు దూరంగా ఉండలేను. అందుకే …
అది మానేసి మరో ఉద్యోగం చూసుకుందామనుకుంటున్నాను. నావల్ల కావట్లేదు” అని ఆమె ఒడిలో పసివాడిలా ఒదిగిపోయాడు.
“ఇక్కడ ఉద్యోగం దొరకాలి కదండీ” అంది భర్త జుట్టు సవరిస్తూ.
“ నువ్వు లేకుండా నాకెంత కష్టమో తెలుసా.” అంటూ ఆమెను బాహువుల్లోకి తీసుకుని ప్రేమ సామ్రాజ్యంలో మునకలేశాడు.
“ఇదేంటి సత్యా….?!” ఆశ్చర్యంగా అడిగాడు.
“ఏంటోపనండీ, ఈ మధ్య ఇలా అవుతోంది. నెలసరి ఎప్పుడు పడితే అప్పుడే వస్తోంది”
“డాక్టర్ కి చూపించుకోపోయావా?” అన్నాడు.
“నా ఫ్రెండ్ ని అడిగితే పెళ్లయిన కొత్తలో ఇలాగే వుంటుంది. నేను కడుపుతో ఉండి కూడా నెలసరి అవుతున్నానంటే నువ్వు నమ్ముతావా అంది. అందుకే డాక్టర్ దగ్గరికి వెళ్లలేదు”
ఆమె చెప్పిన సమాధానం మోహిత్ కి తృప్తిగా అనిపించలేదు. వెంటనే తల్లికి ఫోన్ చేశాడు.
“అమ్మా! రేపు సత్యని ఒకసారి హాస్పిటల్ కి తీసుకెళ్లాలి. నువ్వు ఇక్కడికి వస్తావా?” “సత్యకి ఏమైంది నాన్నా?” సునంద కంగారుగా అడిగింది. “ఏం లేదమ్మా! కొంచెం నలతగా ఉంది. నువ్వు రేపు వచ్చి డాక్టర్ కు చూపించమ్మా.”
“ అలాగే, ఈరోజు రాత్రికి బయల్దేరి రేప్పొద్దునకి అక్కడుంటాను.”
భర్త వంక నిస్సహాయంగా చూసింది సత్య. “ఏం కాదు సత్యా, పెళ్ళైన కొత్తల్లో ఇలాంటివి మామూలే. ఏం బాధపడకు. రేపు చూసుకుందాం పడుకో” అని భార్యని అనునయించి తనూ పడుకున్నాడు మోహిత్. కొద్దిసేపటికల్లా నిద్రలోకి జారుకున్న భర్త వంక చూస్తూ ‘ఎంత మంచి వారండీ మీరు. భార్య సమస్యని అర్థం చేసుకొని ఏమాత్రం ఇబ్బంది పెట్టని మంచి మనసు మీది’ అని భర్త తల నిమిరి తను కూడా నిద్రకి ఉపక్రమించింది సత్య.
ఆ మర్నాడు గార్డెన్ లో ఇద్దరూ కూర్చున్నారు. సత్య రెండు కప్పులో టీ తీసుకొచ్చి ఒకటి మోహిత్ కి ఇచ్చింది. ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ టీ తాగుతూ చల్లని వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు. ఎటుచూసినా అందమైన పూలు. మత్తెక్కిస్తున్న పరిమళం. కాళ్ళకింద మెత్తగా పరుచుకున్న గడ్డి పెట్టే కితకితలు. ఆహ్లాదపరుస్తున్న ఆ వాతావరణానికి మరింత అందాన్ని ఇస్తున్న సత్య. ఆమె చక్కని చిరునవ్వు. వదులుగా ఎగురుతున్న ఆమె ముంగురులను సవరించాలనిపించి దగ్గరగా వచ్చాడు మోహిత్.
అతని కళ్ళలో నిండిన ఆమె రూపాన్ని చూస్తూ మైమరచి పోతున్న సత్య కళ్ళలో ఒక్కసారిగా బాధా వీచిక కదిలింది. కన్నీరు చిప్పిల్లుతుంటే…
“ఏవయ్యింది సత్యా…?” మోహిత్ కంగారుగా అడుగుతున్నా చెప్పలేక, కుర్చీలోంచి కదల్లేక కుర్చీ హ్యాండ్ రెస్ట్ ని పట్టుకుని బాధగా మూలిగింది.
ఆమె పరిస్థితి మోహిత్ కి అర్థమైంది.
లోపలికి వెళ్ళి టవల్ తీసుకొచ్చి ఆమెను లేపి
ఆమె నడుం చుట్టూ కట్టాడు. మెల్లగా లోపలికి నడిపించాడు. వెనక్కి తిరిగి చూస్తే కుర్చీ సీట్ రక్త సిక్తంగా వుంది.
సత్యని తీసికెళ్ళి బట్టలు మార్పించి మంచంమీద పడుకోబెట్టాడు. రాత్రి ఆమెపట్ల తనేమన్నా దురుసుగా ప్రవర్తించాడా ?అని బాధపడ్డాడు. ఇలా జరగడం సహజమేనా? ఎవరినైనా అడగాలి అనుకుంటూ ఆమె చుట్టూ చేతులు వేసి సారీరా అన్నాడు.
సత్య కళ్ళనీళ్ళ పర్యంతం అవుతూ
“మనకే ఎందుకిలా అవుతోందండీ. నాతో పాటు పెళ్లైన నా స్నేహితురాళ్ళు పిల్ల తల్లులయ్యారు. వాళ్ళలా మన సంసారం లేదెందుకు?
ఏ పదిరోజులకో ఇంటికొచ్చే మిమ్మల్ని ఆనందంగా ఉంచలేకపోతున్నాను.
మనకి ఇదేం శాపం అండీ” అని కన్నీళ్ళతో అడిగింది సత్య.
“నువ్వు దానిగురించి ఆలోచించకు సత్యా. నేను త్వరలో ఈ తిరుగుడు ఉద్యోగం మానేసి దగ్గర్లో చూసుకుంటాను. రేపు అమ్మ వస్తుందిగా. డాక్టర్ దగ్గరకు తీసుకెళుతుంది. ఏం ఆలోచించకుండా హాయిగా పడుకో” అని ఆమెను పడుకోబెట్టి బయటకు వచ్చి లాన్ లో ఆమె కూర్చున్న కుర్చీని వాటర్ పైప్ పెట్టి కడిగేశాడు.
ఆమెను బాధపెట్టకూడదని ఏం ఫర్వాలేదు అన్నాడు కానీ, అతని మనసులో భయం తొంగిచూసింది.తమ ప్రతి కలయిక తర్వాత ఆమె తీవ్ర అస్వస్థతకు గురికావడం పట్ల ఆందోళనగా అనిపించింది. స్నేహితుడికి ఫోన్ చేసి అడిగాడు. పెళ్ళైన కొద్దికాలంపాటు మహిళల్లో ఈవిధమైన రక్తస్రావం సమస్య వుంటుంది. కానీ మీ పెళ్ళై ఏడాదిన్నర అయినా అలా వుండటం దేనికి సంకేతమో డాక్టర్ కి చూపిస్తే తెలుస్తుంది. కొందరిలో గర్భకోశంలో సిస్ట్ వుండటం వల్ల కూడా జరగొచ్చు. ఆందోళన పడొద్దని చెప్పాడు.
సిస్టులకు మంచి మందులే ఉన్నాయి. ఫర్వాలేదని కాస్త ఊపిరిపీల్చుకున్నాడు మోహిత్.
ఆ మర్నాడు మోహిత్ తల్లి, ఆమె పెద్దమ్మ కూతురు, వాళ్ళ పిల్లలు అందరూ బూరలు, బెలూన్లు పట్టుకుని వచ్చారు.
సునంద స్వీట్ ప్యాకెట్ సత్య చేతిలో పెట్టి
“అభినందనలు అమ్మలూ.” అంది సత్య బుగ్గలు పుణుకుతూ. సత్య అయోమయంగా చూసింది. “ఏంటిరా నాన్నా, అలావున్నావే?
వాంతులు అవుతున్నాయా? నీరసంగా వుందా? నువ్వు పుల్లగా తినేందుకు నారింజ తొనలు తెచ్చాను. బుగ్గన పెట్టుకుని చప్పరించు.” బ్యాగ్ లోంచి పొట్లం తీసి సత్యకు ఇచ్చింది సునంద.
అన్నీ తీసుకుని లోపలికి వెళ్ళిపోయింది సత్య.
మోహిత్ ముందు బెలూన్లు ఊపుతూ
కంగ్రాట్స్ అంటూ సంతోషంతో అభినందించారు పిల్లలు, మోహిత్ అక్కా వాళ్ళందరూ.
వాళ్ళ ఆనందాన్ని వెంటనే భగ్నం చేయడం ఎందుకని నవ్వుతూ వాళ్ళని కూర్చోమని చెప్పి బయటనుంచి టిఫిన్స్ తెప్పించి పెట్టాడు.
కాసేపయ్యాక మెల్లగా తల్లితో జరిగిందంతా చెప్పాడు.
“అయ్యో, అదేంటి నాన్నా, సత్య ఆరోగ్యంలో ఇలాంటి మార్పు కనిపిస్తే వెంటనే నాకెందుకు చెప్పలేదు?” అడిగింది.
“అదికాదమ్మా, కొత్తగా పెళ్ళైన వాళ్ళలో ఇదంతా సహజం అనుకున్నాం. తగ్గుతుందిలే అనుకున్నాంగానీ, ఇంతలా నీరసపడుతుందనుకోలేదు.”
“తను ఇంట్లో మిషన్ కొడుతోంది కదా. వేడి చేసి అలా అవుతుందేమో.”అంది సునంద.
“కరెక్ట్ గా చెప్పావమ్మా. ఆ ఆలోచన నాకు రాలేదు చూడు. ఇంట్లో ఒక్కతే ఉండి బోర్ కొడుతుందని చుట్టుపక్కల వాళ్ళ బట్టలు తీసుకుని కుడుతోంది కదా.అతి వేడి చేసి, ఒళ్ళు బాగా కదిలి ఆ సమస్యకు కారణం కావచ్చు. ఇక డాక్టర్ దగ్గరకు అక్కర్లేదేమో. కుట్టడం మానేస్తే అన్నీ అవే సర్దుకుంటాయేమో” చెప్పాడు మోహిత్.
“అలా మనమే అనేసుకుని అశ్రద్ధ చెయ్యకూడదు” అని చెప్పి ఆరోజే సత్యను హాస్పిటల్ కి తీసుకెళ్లింది సునంద. ప్రయాణాన్ని వాయిదా వేసుకుని
మోహిత్ కూడా వాళ్లతో వెళ్ళాడు.
“నమస్తే డాక్టర్” అంది సునంద
“నమస్తే. కూర్చోండి. పేషెంట్ ఎవరు?” అంది డాక్టర్ కోమలి. సత్యను చూపించింది సునంద.
“మీ అమ్మాయా?” అడిగింది డాక్టర్.
“కాదండీ నా కోడలు” చెప్పింది.
వాళ్ళ వంక మురిపెంగా చూస్తూ సత్య సమస్య అడిగి తెలుసుకుని, స్కానింగ్ కు పంపింది.
రక్త పరీక్ష చేయించి రిపోర్టులు రాగానే ఫోన్ చేస్తాను రమ్మని చెప్పింది
ఆ సాయంత్రం డాక్టర్ ఫోన్ చేయగానే సత్యను తీసుకుని హాస్పిటల్ కి వెళ్ళారు.
వాళ్ళని కూర్చోబెట్టి పరిస్థితి వివరించింది డాక్టర్.
“చూడమ్మా, మీ అత్తగారూ, మీ వారూ చాలా మంచివాళ్ళలా అనిపిస్తున్నారు. వాళ్ళ సహకారంతో నువ్వు ఇందులోంచి బయటపడగలవు” అంది.
“నా కోడలికి ఏవయ్యింది డాక్టర్?”కంగారుగా అడిగింది సునంద.
డాక్టర్ కోమలి ఒక క్షణం వాళ్ళ వంక చూసి
“ఏం లేదండి.అంతా బానేవుంది. చిన్న సమస్య. మీరు మరీ అంత కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు . ప్రశాంతంగా ఉండండి ముందు.” అని చెప్పి వాళ్ళని కంఫర్ట్ గా ఉంచి మూడు కాఫీలు తెప్పించి ఇచ్చింది.
వాళ్ళు తాగుతుండగా డాక్టర్ కోమలి గొంతు సవరించుకుని “చాలాకాలం క్రితం నలభై ఏళ్ళ మహిళ డాక్టర్ దగ్గరికి వెళ్ళింది. కలయిక సమయంలో రక్తస్రావం జరగటం వలన నీరసించి పోయింది. ఆమెకు పరీక్షలు చేసినాక ఆమె భర్తను కూడా తీసుకురమ్మన్నారు డాక్టర్.ఆమె తీసుకొచ్చింది.
మీ భార్యకు ఇలా అవుతోంది అని మీకు తెలుసా అని అడిగారు. ఆశ్చర్యం ఏంటంటే అతను నాకు తెలీదని చెప్పాడు. ఆమె ఆరోగ్యం పట్ల ఇంత అశ్రద్ధగా ఎలావున్నావని డాక్టర్ కేకలేశారు. ఆమె నాతో ఎప్పుడూ ఈ కంప్లైట్ ఉందని చెప్పలేదన్నాడు. ఇద్దరు పిల్లలతల్లి, ఇంటిపనులు, పిల్లల పోషణ అన్నీ చూస్తున్న ఆ ఇంటి ఇల్లాలు, అన్ని విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించే ఆమె తన ఆరోగ్యం విషయంలో భర్త దగ్గరే గోప్యత పాటించడం డాక్టర్ ను ఆశ్చర్యపరచింది. ఎక్కువకాలం రక్తస్రావం అవడం వలన ఇన్ఫెక్షన్ పెరిగి సర్వైకల్ కార్సినోమా అని తేలింది. ఆమె భర్త చాలా బాధ పడ్డాడు. ముందుగానే తెలుసుకుంటే వ్యాధి ముదరనిచ్చేవాడ్ని కాదని, తన భార్యని కాపాడమని వేడుకున్నాడు.
ఆమెకు రేడియేషన్ చికిత్స అందించారు.” కోమలి చెప్పడం ఆపింది.
“ఆవిడకు వ్యాధి పూర్తిగా తగ్గిపోయిందా డాక్టర్?” అడిగింది సునంద. ఏం చెబుతుందోనని ఆసక్తిగా చూస్తున్న ముగ్గురు మొహాలనూ పరిశీలిస్తూ.
“మీరేమనుకుంటున్నారు?” అడిగింది కోమలి నవ్వుతూ.
“మీ అస్తవాసి మంచిది కాబట్టి ఖచ్చితంగా తగ్గిపోయే వుంటుంది. ఆమె ఇప్పుడు హాయిగా తన జీవితాన్ని గడుపుతూ ఉండి వుండాలి” అన్నాడు మోహిత్.
“ ఇక్కడ నా హస్తవాసి కన్నా సరైన సమయంలో పేషెంట్ ని హాస్పిటల్ కి తీసుకురావడం ఎంతో ముఖ్యం. టైం అన్నిటికన్నా విలువైనదని ఇలాంటి సమయాల్లోనే రుజువవుతోంది. మీరు ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీ భార్యను సకాలంలో ఇక్కడికి తీసుకొచ్చినట్టుగా. ఇది అన్నిటికన్నా చాలా చాలా ముఖ్యం.” ఆవిడ చెప్తున్నదేవిటో అర్ధమయ్యాక సత్య కంగారు పడింది. మోహిత్, సునంద ముఖముఖాలు చూసుకున్నారు.
“అంటే, మా కోడలికి…?” గొంతు పొడారిపోతుండగా మాట పెగుల్చుకుని అడిగింది.
“అమ్మా, భయం అన్నిటికన్నా పెద్ద శత్రువు. కరోనా వైరస్ సోకిన అనేకమంది వ్యాధి వల్ల కన్నా, మనకు వచ్చిన వ్యాధి ప్రాణాంతకం, మనం బతకమేమో, ఇప్పుడేం చెయ్యాలి అనే భయంతో ఎక్కువమంది చనిపోయారు.
క్యాన్సర్ కూడా అటువంటిదే. ప్రతి ఒక్కరిలోనూ క్యాన్సర్ కణాలు ఉంటాయి. మన వ్యాధి నిరోధక వ్యవస్థ కాస్త మందగించినప్పుడు లక్షణాలు బయటపడతాయి. అంతమాత్రాన అది తగ్గదు అనే భావన తప్పు.
ముందు ప్యానిక్ అవడం మానేయండి. నేనిచ్చిన మందులు క్రమం తప్పకుండా వేసుకోమనండి. మానసికంగా ఆమెను బలంగా ఉంచేందుకు మీ సహకారం ఎంతో ముఖ్యం. ప్రతి వారం చెక్ అప్ కి రండి” చెప్పింది కోమలి.
ఇంటికి వచ్చాక సునంద కోడలికి మంచినీళ్ళిచ్చి మందు బిళ్ళ చించి చేతిలో పెట్టింది.
“అత్తయ్యా, నాకు తగ్గుతుందంటారా….నావల్ల మీ వంశం ఆగిపోకూడదు. మీ అబ్బాయికి మళ్ళీ పెళ్లి చేయండి…” అని కన్నీటి పెట్టుకుంది సత్య.
ఆమె నోటికి చెయ్యడ్డుపెట్టింది సునంద.
“అలా అనొద్దమ్మా. తగ్గిపోతుంది అనే నమ్మకమే మనిషిని బ్రతికించే ఇంధనం. ఇద్దరు వ్యక్తులు రాత్రివేళ రహదారిలో వెళుతున్నారు. వాళ్ళు చూసుకోకుండా పెద్ద గోతిలో పడిపోయారు. ఎంత పిలిచినా ఎవరికీ వినబడలేదు. ఇద్దరూ ఆ పెద్ద గుంటకి చెరోవైపునుంచీ పైకి ఎక్కేందుకు ప్రయత్నిస్తూ, సాధ్యం కాక, చేరొకపక్కనా
ఆ గోతిలోనే పడుకుని నిద్రపోయారు.
తెల్లారి లేచేసరికి అందులో ఒకడు చనిపోయాడు. గ్రామస్తులు వాళ్ళిద్దర్నీ బయటకు తీశారు. బతికి ఉన్న వ్యక్తి తెల్లవార్లూ ఆ గోతిలోనే మరో గొయ్యి తవ్వుతూ ఉన్నానని చెప్పాడు. ఎందుకంటే ఆ గోతిలో పూర్వీకులు పాతిపెట్టిన గుప్త నిధులున్నాయని గతంలో విన్నానని, అవి తవ్వి తీసుకునే అవకాశం దేవుడిచ్చాడని సంతోషిస్తూ నిధి కోసం తవ్వకం మొదలు పెట్టాడు.
రెండవ వ్యక్తికి మాత్రం ఆ గోతిలో విషనాగులు ఉన్నాయని ఎప్పుడో విన్నాడు. పుల్ల కాలికి గుచ్చుకుంటే అది పామే అనుకుని భయంతో ప్రాణాలు విడిచాడు. ఒకే స్థితిలో వున్న ఇద్దరి మానసిక స్థితులు వాళ్ళ బ్రతుకులపై ప్రభావం చూపించాయి.
ఆశతో, ధైర్యంతో జీవించడం నేర్చుకోవాలి. అదే మనకు రక్ష” అంటూ అత్తగారు రోజూ ఇచ్చే మానసిక చికిత్స సత్యకు ఎంతగానో పనిచేసింది. భర్త సహకారం కూడా సత్యకు తోడైంది.
@@@@@@@@@@
కోమలి దగ్గరకు కొడుకు కోమల్ ను ఎత్తుకుని వచ్చింది సత్య.
“మేడం, మీరిచ్చిన ధైర్యంతో వ్యాధిని ఎదుర్కొన్నాను. మా అత్తమామలు, నా భర్త సహకారం నా జీవితాన్ని తిరిగి నిలబెట్టింది. ఇప్పుడు నేను పూర్తి ఆరోగ్యంగా ఉన్నాను”అని సంతోషంగా చెప్పింది.
“నిన్నిలా చూస్తుంటే చాలా ఆనందంగా వుంది సత్యా. నువ్వెప్పుడూ ఇలాగే ఆరోగ్యంగా ఉండాలని కోరుకున్నాను” అంది కోమలి
కమల్ ను ఎత్తుకుని ముద్దు చేస్తూ.
“మేడం, మీరు చాలా గొప్పవారు. నాకు క్యాన్సర్ అని ఒక్కసారిగా చెప్పకుండా ఎవరిదో ఉదాహరణ, లేక కథగానో మెల్లిగా చెప్పుకొచ్చారు.
ఒక్కసారిగా చెప్పుంటే ఏమయ్యేదాన్నో. అన్నట్టు మీరు చెప్పిన నాలాంటి వ్యాధి వచ్చి తగ్గిన ఆ మహిళ ఇప్పుడెలా ఉంది మేడం?” అడిగింది సత్య.
“ అన్ని వ్యాధులలాంటిదే క్యాన్సర్ కూడా. దీనిని మనం కొత్త పేరుతో పిలుద్దాం. ట్రీట్…..
టి…టెస్ట్ రెగ్యులర్లీ
ఆర్ ... రెజ్యూమ్ హోప్
ఇ.... ఎర్లీ రికగ్నిషన్
ఏ…ఆల్వేస్ పాజిటివ్
టి…. టైమ్లీ ట్రీట్మెంట్
వ్యక్తికి మందులతో పాటు వాళ్ళని వాళ్ళు ట్రీట్ చేసుకునే విధానం చాలా ముఖ్యం.
తమని తాము నమ్మాలి. ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా వుండాలి. కుటుంబ సభ్యుల సహకారం ఉండాలి. మీ అత్తగారు, మీ వారిలా ఉండాలి. శరీరాన్ని మనసుకు పరిచయం చేసి, చక్కగా మాట్లాడుకునేలా ప్రశాంత సాధన చేయాలి.” ఎంతో చక్కగా నవ్వుతూ చెబుతున్న కోమలి వంక ఆరాధనగా చూస్తూ…
“మేడం..! ?మీరు పేషెంట్ తో చాలా ఓపికగా మాట్లాడతారు. వాళ్ళ బాధల్ని పెద్దమనసుతోఅర్ధం చేసుకుని చక్కటి ఉపాయాలు చెప్తారు. డాక్టర్ అంటే మీలా ఉండాలని మేమెప్పుడూ అనుకుంటాం” అంది సత్య అభిమానంగా.
“నేనీవృత్తిని ఎంచుకుంది డబ్బు గడించడానికి కాదమ్మా…నా జీవితాన్ని ఈ వృత్తికి అంకితం చేయాలనే అంకాలజీ స్పెషలైజేషన్ చేశాను.
‘ఆమె’ బాగుంటే సమాజం బాగుంటుందనే ఉద్దేశ్యంతో ప్రతినెలా అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. మీరు కూడా వచ్చి మీ అనుభవాన్ని పంచుకోండి. వ్యాధిగ్రస్థులలో మానసిక స్థైర్యాన్ని నింపడంకన్నా పుణ్యకార్యం లేదు.” చెబుతున్న కోమలి కళ్ళలో నీటిపొర.
“నాకు ఉదాహరణగా మీరు చెప్పిన ఆమె ఎవరు?”
“మా అమ్మ.”
------------------- శుభం –--------