జంద్యంపోగు. ఎం. వీరేశ్వరరావు
పదేళ్ల తర్వాత మళ్లీ పల్లెలోకి వచ్చాను. వెళ్లడానికి బస్సు లేదు. కాలి నడకన రెండు కిలోమీటర్ల దూరం ఉంది. నేను పుట్టి పెరిగిన ఊరు అమలాపురానికి నాలుగు కిలోమీటర్ల దూరం ఉంది. పల్లెలోకి నడుస్తుంటే నేలంతా ఆప్యాయంగా
పరామర్శిస్తున్నట్టుంది. చీకటి పడుతోంది. సూట్కేసు పుచ్చుకుని నడుస్తున్నా. పంట పొలాలమీదనుండి వచ్చే గాలి చల్లగా చెంపలమీద తగులుతోంది. దారిలో ఎదురయింది ముత్తమ్మతాడి. నా చిన్నప్పుడు ఆ తాడిమీద దెయ్యం ఉండేది అని, సాయంత్రం అటు ఎవ్వరూ వచ్చేవారు కాదు.
ముత్తమ్మ మా ఊరి గ్రామదేవత. ఇంకా ముందుకు వచ్చాను. రాములవారి గుడి ఎదురయింది. గుడి, రథం చూశాక నా బాల్యం అలలా నా మనసులోకి వచ్చింది. సీతారాములవారి కళ్యాణం అంటే ఎంత సంబరం! రథాన్ని ఉత్సాహంగా లాగుతుంటే రేగిన ధూళి సంధ్యా సమయంలో ఎంత అందంగా ఉండేది! ఇంకా ముందుకు వెడుతుంటే నేను ఈతలు
కొట్టిన చెరువు కనిపించింది. అప్పుడు శ్రీమాని వీటిలో ముంచడానికి ప్రయత్నించిన రమేష్ గుర్తు సచ్చాడు. ఇప్పుడు ఎక్కడున్నాడో?
బాల్యం ఎంత మధురం) తూనీగల్లా గెంతుతూ స్కూలుకు వెళ్లేవాళ్లం! ఇప్పటిలాగా మోసే బాల ఏసుల్లా మేము లేము. అప్పుడు ఆడుతూ, పాడుతూ తెలీకుండానే ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అయిపోయింది. పల్లెలో హైస్కూలు లేకపోవడంతో నేను నగరానికి వచ్చాను. అప్పటినుండి పల్లెతో అనుబంధం తగ్గింది
*********
నా రాక చూసి, బాబయ్య చాలా సంతోషించారు. పిన్ని ఆప్యాయంగా కొసరి కొసరి పట్టించింది. నేను పల్లెలోకి వచ్చింది మా నాన్న పేరున ఉన్న రెండెకరాలు అమ్మి హైదరాబాదులో ఇల్లు కడదామని. ఉద్యోగరీత్యా పదిహేనేళ్లు హైదరాబాదులో స్థిరపడ్డాక కొద్దిపాటి ఆస్తిని అమ్మక తప్పలేదు.
"రేపు ఉదయం రిజిస్ట్రార్ ఆఫీసుకు వెడదాం. రెస్ట్ తీసుకో! రేపు మనం పెళ్లికి వెళ్లాలి. నా స్నేహితుడి కూతురుది!" అన్నాడు బాబయ్య.
"బాబూ! నాలుగైదు రోజులు ఉంటావా?" "ఉంటాను. పిన్నీ"
పిన్ని నాకు ఇష్టమైన జంతికలు తీసుకువచ్చింది. పిన్నికి ఇంకా గుర్తు నాకు జంతికలు ఇష్టమని. పిన్ని దగ్గర ప్రత్యేక లక్షణం ఏమిటంటే, ఎవరికి ఏది ఇష్టమో గుర్తు పెట్టుకుని వాళ్లకి అది చేసిపెడుతుంది. పిన్ని అంటాను కానీ ఆమె అమ్మే!
అరుబయట పడుకున్నాను. పైన చంద్రుడు మబ్బు సుందరి తో సరసమాడుతున్నాడు.
శరత్కాలపు మబ్బులతో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంది. క్రమంగా నిద్ర ముంచుకొచ్చింది.
******
మరునాడు బాబయ్యతో పెళ్లికి వెళ్లాను. పెళ్లివారిట్లో సందడిగా ఉంది. పెళ్లికొడుక్కి సంప్రదాయం అంటే చాలా ఇష్టంలా ఉంది. మంత్రాలకి మరీ మరీ అర్థాలు అడిగి చెప్పించుకుంటున్నాడు. పెళ్లి కూతురు కలల బరువు కనురెప్పలమీద పడడంతో సిగ్గుపడింది. పెళ్లివారి భోజనాల దగ్గర కూడా సరదాగా ఉంది.
ఇప్పటి 'టఫె'ల్లా యాంత్రికంగా లేదు.
"ఇక్కడ నేను ముసలివాడిని గంటనుంచి పులుసు అడుగుతుంటే వడ్డించకుండా, ఆ కుర్ర సన్నాసి అమ్మాయిల బాచ్ దగ్గర కొసరి కొసరి ములగకాడలు వడ్డిస్తాడా? వయసు ప్రభావం!"
అన్నాడొక ముసలయాన.
ఇంకొకయాన "పేడు వీడియోలో పడటానికి అలా అన్నం గిన్నెతో ఉంటారు. కానీ వడ్డన తక్కువ!" అంటూ వాపోయాడు.
పెళ్లిలో నన్నొక కుర్రాడు ఆకర్షించాడు. అతని పేరు రామాచారి అని అక్కడి వాళ్లు చెప్పారు. ప్రధాన పురోహితుడి దగ్గర పక్కనే కూర్చున్నాడు. అతను ఎక్కువగా మాట్లాడటం వినలేదు. మనిషి చాలా అందంగా ఉన్నాడు. వయస్సు ఇరవై ముప్పయి మధ్య ఉండవచ్చు.
**********
మరునాడు రాములవారి గుడి దగ్గర బాబయ్య ఎవరితోనో మాట్లాడటం గమనించాను. రామాచారి ఆ నడివయసు ఉన్న స్త్రీకి చూపిస్తున్నాడు. ఎవరామె? ఎప్పుడూ చూసిన గుర్తు లేదు. మా బంధువులు అందరూ నాకు తెలుసు. బాబయ్య దగ్గరికి వెళ్లాక ఆ స్త్రీ కనపడలేదు. కొద్దిదూరంలోనే రిక్షా వెడుతూ కనిపించింది. పిన్ని కాకుండా బాబయ్యకి వేరే స్త్రీతో ... నా ఆలోచనకి నేనే సిగ్గుపడ్డాను. పిల్లలు లేరని రెండో పెళ్లి చేసుకోమంటే బాబయ్య తిరస్కరించాడు. అటువంటి బాబయ్యనా అనుమానించేది?
గుడిలోకి వెళ్లాక రామాచారి ప్రసాదం ఇచ్చాడు. "కేశవాయ స్వాహా! నారాయణాయ స్వాహా!" అని ఊరుకున్నాడు. పేరు అడిగితే చెప్పలేదు. మళ్లీ అడిగితే ఎటో చూస్తున్నాడు.
*********
బాబయ్య భుజంమీద చెయ్యి వేసి, "పద!" అన్నాడు. రామాచారి గురించి నాకు ఆసక్తి పెరుగుతోంది. అదే అడిగాను.
"అదొక పెద్ద కథ!" అన్నాడు. బాబయ్య.
చెప్పమన్నాను. "రాత్రి వివరంగా చెబుతాను" అన్నాడు బాబయ్య.
"ఇంతకుముందు నీతో మాట్లాడిన ఆవిడ ఎవరు?"
"ఆమె రామాచారి తల్లి!" బాబయ్య సమాధానమిచ్చాడు.
రాత్రి భోజనం అయ్యాక బాబయ్య, నేను కూర్చున్నాం. రామాచారి గురించి బాబయ్య చెప్పడం ప్రారంభించాడు.
"రామాచారి మనం అనుకున్నట్టు మామూలు వ్యక్తి కాదు."
"మరి"
"మెంటల్లీ రిటార్టెడ్"
ఆశ్చర్యపోయాను. అంత అందంగా. అమాయకంగా ఉన్న వ్యక్తి మానసిక ఆరోగ్యం లేనివాడా? ఏదో తెలియని శక్తి మనుషులతో ఆడుకుంటోంది!
"మరొక విషయం! రామాచారి బ్రాహ్మణుడు
కాదు. ఈ విషయం ఎక్కడా అనకు!"
ఈసారి మరింత ఆశ్చర్యపోయాను.
పిన్ని పాలు తీసుకుని వచ్చింది. సమయం రాత్రి పది గంటలు అయింది. పల్లె అంతా నిశ్శబ్దంగా ఉంది. చాలా కుటుంబాలు నిద్రలోకి జారుకున్నాయి. నగరం అయితే నిద్రపోదు పన్నెండుదాకా.
దూరంగా కీచురాళ్ల ధ్వని వినిపిస్తోంది.
"రామాచారి ఆసలు పేరు రంగయ్య, అతని తల్లి మాణిక్యం. ఆమె గౌడ కులానికి చెందిన స్త్రీ. వాళ్ల సొంత ఊరు శ్రీకాకుళం."
"శ్రీకాకుళం నుండి ఇక్కడికెలా వచ్చారు?" అన్నాను ఆసక్తిగా.
"శ్రీకాకుళంలో నా స్నేహితుడు సత్యం ఆర్టీసీలో పనిచేసేవాడు. అతని ఇంటిలో పనిమనిషిగా ఉండేది మాణిక్యం! మాణిక్యానికి ఒక్క కొడుకు - రంగయ్య.
"రంగయ్యకి చాలాకాలానికి మాటలురాలేదు. అతి కష్టంమీద వైద్యం చేయిస్తే కొన్ని మాటలు వచ్చాయి. కొన్ని ఏళ్లు గడిచాయి. రంగయ్య శారీరకంగా ఎదిగాడు కానీ మనసు ఎదగలేదు. అతనిలో అతను మాట్లాడుకోవడం, అలా మూడీగా ఉండిపోవటం మొదలైన లక్షణాలు వచ్చాయి. ఖరీదైన వైద్యం చేయించడానికి మాణిక్యం ఒక సామాన్య స్త్రీ! నాకీ విషయాలు సత్యం ద్వారా తెలిశాయి. తనకు ఆకలి అయిందని చెప్పుకోలేడు. ఇలాంటి కొడుకుతో ఎలా బతకాలో తెలిసింది కాదు మాణిక్యానికి, మాణిక్యం మొగుడు తాగుడుకి బానిపై ఇంటి విషయం పట్టించుకోడు
"సత్యం ఒకసారి డాక్టర్కి చూపిస్తే 'స్క్రిజోఫేనియా' ముదిరిపోయిందన్నాడు డాక్టరు. కొన్ని మందులు వాడినా రంగయ్య స్థితిలో మార్పు లేదు. తను పోతే నాడు ఎలా బతుకుతాడని మాణిక్యం బెంగపెట్టుకుంది. చివరకి ఒక నిర్ణయానికి వచ్చింది."
రాత్రి పదకొండయింది.
"ఏమిటా నిర్ణయం?"
"రంగయ్య రంగాచారిగా మారాడు. వాడి ఒంటిమీద జంధ్యం వేసింది. ఆరు నెలల కష్టంమీద రెండు మంత్రాలు 'కేశవాయ స్వాహా! నారాయణాయ స్వాహా!' నేర్పి బ్రాహ్మణుడిగా మార్చి, నాతో ఈ ఊరు పంపింది. వచ్చేటప్పుడు తన దగ్గర ఉన్న కొద్ది బంగారం అమ్మి రంగాచారి ఖర్చులకి డబ్బు ఇవ్వబోయింది. నేను తీసుకోలేదు. సత్యం ప్రతినెలా డబ్బు పంపుతున్నాడు. నా పలుకుబడి వల్ల రామాచారి గుడిలో చిన్న పూజారిగా చేరాడు. జంధ్యమే వాడి జీవనాధారం అయింది. ఇంకా ఇక్కడ మనుషులకి దేవుడిమీద నమ్మకం ఉంది కాబట్టి వాడు బతుకుతున్నాడు."
"మళ్లీ రామాచారిని చూడటానికి రాలేదా మాణిక్యం?"
"వచ్చింది. వాడి అమ్మలా కాదు! ఎందుకంటే కొడుకు ఇప్పుడు బ్రాహ్మణుడు. తను కాదు."
"అందుకే దూరంనుండి చూసి వెళ్లిపోతుంది.”
"వాడు తన కొడుకని చెబితే, అసలు విషయం బయటపడుతుంది. ఒకసారి మా ఊరి ప్రెసిడెంట్ గుడిలో మాణిక్యాన్ని అడిగితే, రామాచారి ఇంటిపక్క అద్దెకున్న మనిషినని, రామాచారి తల్లి పంపించిందని చెప్పింది!" భారంగా చెప్పాడు బాబయ్య.
ఈ కథ విని తేరుకోవాడనికి చాలా సమయం పట్టింది. తల్లి కొడుకుకోసం ఏదైనా చేస్తుంది. చివరికి కొడుకు కోసం తను తల్లిని కాదని చెప్పడానికి వెనుకాడదు అనడానికి మాణిక్యం కథే ఉదాహరణ.
మాణిక్యం రూపం నాకు మసకగా గుర్తుకు
వస్తోంది.
**********
పాలం అమ్మకం అయింది. పనులు పూర్తయ్యాయి. చివరిసారిగా రామాచారిని చూశాను. "కేశవాయ స్వాహా! నారాయణాయ స్వాహా!" అన్నాడు వస్తుంటే- అవేగా అతనికి వచ్చినవి, అతని జీవితానివి!
మనసు వికలం అవుతోంది. బాబయ్య బస్ స్టాప్ దగ్గరకి వచ్చాడు. బాబయ్య చేతికి వెయ్యి రూపాయలు ఇచ్చి రామాచారి గురించి ఖర్చు పెట్టమన్నాను. ఆయన కళ్లలో అదే ఆప్యాయత...
బస్సు బయలుదేరింది.
సమాప్తం.