ఈనాడు అనుబంధం 05-10-25 న ప్రచురించిన కథ.
ఇవే ‘నా’… జ్ఞాపకాలు?
ఉదయ సూర్యుడు ఎర్రగా, ఏడుపు దిగమింగుకున్న నా మొహంలా ఉన్నాడు.
పొద్దున్నే అవడంతో ఎక్కువ ట్రాఫిక్ లేదు. శ్రీనగర్ కాలనీలో ఉన్న మా ఫ్లాట్ నుంచి కొంపల్లి పెద్ద దూరం కాదు, నాకే డ్రైవ్ చెయ్య బుద్ధి అవక క్యాబ్ పిలిచాను.
దాదాపు ఆరేళ్ల తర్వాత, బాబాయి ఇంటికి వెళ్తుంటే ఏదో భయం, బాధ, రకరకాల అనుభూతులు చుట్టూముట్టాయి నన్ను.
బాబాయి అంటే నాన్న తమ్ముడు. నాన్న కంటే, దాదాపు ఏడెనిమిదేళ్లు చిన్నవాడు.
నా చిన్నతనంలో అందరం కలిసే ఉండేవాళ్ళం.
నేను పుట్టినప్పుడు, బాబాయి అప్పుడే ఇంజినీరింగ్ లో చేరాడు. నాన్నకి దగ్గర్లో పల్లెటూర్లో, బ్యాంకులో ఉద్యోగం చేసేవారు. నానమ్మ, తాతయ్య వాళ్ళతోనే అమ్మ, నేను ఉండేవాళ్ళం. అసలు నేను పుట్టగానే ముందు బాబాయే నన్ను ఎత్తుకున్నాట్ట. అసలు ఆ ఆనందమే వేరని ఎన్ని సార్లు చెప్పాడో లెక్కలేదు.
నాకు దాదాపు అయిదు ఏళ్ళు వచ్చేవరకు, నాన్న ఆ పల్లెటూరిలోనే ఉండేవారు. వారానికి ఒకసారి వచ్చేవారు. ఆ టైంలో నాన్నకంటే, బాబాయి అంటేనే నాకు ఇష్టం ఉండేది.
కాలేజీ నుంచి రాగానే, నన్ను ఎత్తుకుని ఆడించేవాడు, స్కూటర్ మీద కూర్చోపెట్టుకుని తిప్పేవాడు.
అమ్మ, “కృష్ణా! వాడిని ముద్దు చేసి పాడుచేస్తున్నావయ్యా! మొండిగా తయారువుతున్నాడు” అని కోప్పడితే “ముద్దు చేస్తే పాడవుతారా వదినా? నువ్వు నన్ను ముద్దుగా చూడవా?” అనేవాడని చెప్పేది అమ్మ.
ఇంజనీరింగ్ అయ్యాక, బాబాయి ఉద్యోగం వచ్చి, హైదరాబాద్ వెళ్ళిపోయాడు. నాన్నకి ట్రాన్స్ఫర్ అయ్యి మేము వైజాగ్ వెళ్ళాం. అప్పుడు బాబాయి కోసం బెంగ పెట్టుకున్నాను నేను. ఒకసారి జ్వరం కూడా వచ్చింది. బాబాయికి ఫోన్చేస్తే అప్పటికప్పుడు విమానంలో వచ్చాడు నాకోసం.
బాబాయి పెళ్లికి నేనే తోడిపెళ్లికొడుకు. బాబాయికి, పిన్నితో పెళ్లి అయితే, నాకు ఎందుకు అవలేదు అని ఏడ్చాను. పిన్నితో నాకు కూడా పెళ్లి చెయ్యమని, నేను వాళ్ళతోనే ఉంటాను అని ఏడిస్తే… నా మెడలో ఒక బంగారు గొలుసు వేసి, మనిద్దరికీ పెళ్లి అయింది, నువ్వు మాతోనే ఉండు అన్న పిన్నిని మర్చిపోలేను.
ఉద్యోగరీత్యా వేరే, వేరే, ఊళ్లలో ఉన్నా ప్రతీ పండగకి అందరం ఒకదగ్గర కలిసేవాళ్ళం.
తాతయ్య రిటైర్ అయ్యాక, నానమ్మతో స్వంత ఊరిలో ఉండేవారు.
సెలవలు వస్తే నాకు పండగే. అటు బాబాయి దగ్గరకో, నానమ్మ దగ్గరకో వెళ్ళేవాడిని.
సమస్య ఎవరిదో తెలీదు, బాబాయ్ కి పిల్లలు పుట్టలేదు. అందుకో, మరెందుకో, బాబాయి,పిన్నీ నన్ను ఎంతో ప్రేమగా చూసేవారు, నాకూ… వాళ్ళదగ్గర ఎంతో బావుండేది.
“ఏదైనా ట్రీట్మెంట్ తీసుకోండి, లేదా ఎవరినైనా పెంచుకోండి” అని నాన్న అంటే
“నాకు వేరే పిల్లలెందుకు అన్నయ్యా! చిన్నా నా కొడుకు కాదా?” అనేవాడు నాన్నతో. పిన్ని కూడా నేనంటే ప్రాణం పెట్టేది.
నాకు ఇంజనీరింగ్ ఎంట్రన్స్ లో మంచి ర్యాంక్ వచ్చి, యూనివర్సిటీ కాలేజీలో కంప్యూటర్ సైన్స్ లో సీట్ వచ్చిన రోజు, బాబాయి సంతోషానికి పట్టపగ్గాలు లేవు. అందరికీ, “మా అబ్బాయికి కంప్యూటర్స్ యూనివర్సిటీలో వచ్చింది” అని చెప్పి సంతోషపడ్డాడు.
తెలియని వాళ్లు, మీకు పిల్లలు లేరుగా అంటే “చిన్నా, అవటానికి మా అన్నయ్య కొడుకే కానీ, వాడు నా వారసుడు” అన్నాడు.
అమెరికా వెళ్లాలనే కోరికని, నాలో పెంచి పోషించింది కూడా బాబాయే.
తనకు అప్పట్లో కుదరలేదని, ఎలాగైనా నన్ను అమెరికా పంపాలని పట్టుపట్టాడు. అమ్మ,నాన్న, పెద్ద ఇష్టపడకపోయినా, నేను బాధపడతానని ఒప్పుకున్నారు. అదిగో, ఆ అమెరికా ప్రయాణమే, నన్ను, బాబాయిని దూరం చేసింది.
ఎమ్మెస్ అయిపోయిన వెంటనే, ఉద్యోగం వచ్చింది. ఇండియాకి వచ్చి అందర్నీ కలిసే టైం లేక, వెంటనే చేరిపోయాను.
మరుసటి సంవత్సరం, అమ్మనాన్నని పిలిపించాను. వాళ్ళు రెండు నెలలు ఉండి వెళ్లారు. వాళ్లతోపాటే బాబాయిని,పిన్నిని కూడా రమ్మంటే తాతయ్య,నాన్నమ్మ పెద్దవాళ్లు అయ్యారని ఇద్దరు కొడుకులూ దగ్గర లేకుండా, రెండు నెలలు ఉండడం మంచిది కాదని వాళ్లు రాలేదు.
ఆ తర్వాత నేను వద్దామంటే, కరోనా అడ్డం వచ్చింది. దాదాపు మూడేళ్లు దాని భయంతోనే గడిపాం. వీడియో కాల్స్ ఉండబట్టి, అందరినీ చూస్తూ మాట్లాడడం జరిగింది.
కరోనా తగ్గింది అనేలోగా, ఉద్యోగాలు పోవడం ఎక్కువ అయ్యాయి. నాకేం కాదులే అన్న ధీమాతో ఉన్న నాకు, ఉద్యోగం పోయిందన్న ఈమెయిల్ చదివి పిడుగు పడ్డట్టే అయింది. ఉద్యోగం ఉందన్న ధీమాతో, అమ్మనాన్న కోసం కోటి రూపాయలు పెట్టి ఫ్లాట్ కొన్నాను.
అమెరికాలో నాకోసం కార్ కొనుక్కున్నాను.
అసలే జాబ్ మార్కెట్ సరిగ్గా లేదు. ఇప్పుడు జాబ్ పోతే మళ్లీ దొరకడం కష్టం. వీసా టైం అయ్యేలోగా, కొత్త ఉద్యోగం దొరకకపోతే అమెరికాలో ఉండలేను. ఇవన్నీ అమ్మవాళ్లకి చెప్తే వాళ్ళు తట్టుకోలేరు.
వాళ్ళకి తెలీకుండా, ఉన్న డబ్బులు జాగర్తగా వాడుతూ, ఆరునెలలు గడిచేలోగా కొత్త ఉద్యోగం వచ్చింది. అమ్మయ్యా! అనుకున్నా.
అప్పుడే, బాబాయికి సడన్ గా హార్ట్ ఎటాక్ వచ్చిందని చెప్పారు. స్టెంట్ వేశారని, ప్రస్తుతం పర్వాలేదని చెప్పారని అన్నారు. బాబాయి ఆసుపత్రి నుంచి ఇంటికి వచ్చాక, దాదాపు రోజూ ఫోన్ లో మాట్లాడేవాడు.
“ఒక్కసారి నిన్ను చూడాలనిఉందిరా చిన్నా!” అంటే నేను ఏం చేశాను? వీసా సమస్య ఉందని, ఎక్కువరోజులు సెలవ పెడితే ఉద్యోగం పోతుందని చెప్పలేక, ఇదిగో వస్తున్నా… అదిగో వస్తున్నా అని చెప్పాను. తీరా నేను బయలుదేరేసరికి, బాబాయి ఈ లోకం వదిలి వెళ్లాడు.
ప్రాణంలేని బాబాయిని చూడలేనని, చివరి చూపుకి కూడా రాలేదు. ఇది జరిగి, దగ్గర, దగ్గర ఆరునెలలు దాటింది.
పిన్నితో ఎన్నిసార్లు ఫోన్లో మాట్లాడుదామన్నా, తను ఫోన్ ఎత్తేది కాదు.
అమ్మని అడిగితే “ఏమోరా! మరీ పిచ్చిదానిలా అయింది. ఇక్కడికి రమ్మంటే రాదు. తాతయ్య వాళ్ళు వెళ్లి ఉంటే, ఒక మాట, పలుకు లేకుండా తలుపులు వేసుకుని లోపలే ఉంటోంది. వీళ్లకు విసుగు వచ్చింది. తనకి భర్త పోయాడు… కానీ వీళ్లకి కొడుకు పోయాడుగా” అంది.
మామూలుగా, అమ్మ అలా విసుక్కోదు, స్వతహాగా పిన్ని అంటే అమ్మకి చాలా ఇష్టం.
సరిగ్గా అదే టైంలో,మా కంపెనీ నాకు ఇండియాలో ఉన్న బ్రాంచ్ లో పనిచేసే అవకాశం ఇచ్చింది. డాలర్లలో కంటే తక్కువైనా, మంచి జీతమే వస్తుంది. వెంటనే ఒప్పుకుని వచ్చేసాను. వచ్చి వారం అయింది.
పిన్ని గురించి మాట్లాడితే అందరూ “అదో పిచ్చిది!” అని మాట్లాడారు. ఒక్కతే ఉంటోందన్నారు. ఇవాళ సెలవు, ఏమైనా ఇవాళ వెళ్ళాలని బయలుదేరాను.
బాబాయి ఫ్లాట్ వద్దు అనుకుని, కొంపల్లి వేపు ఇల్లు కట్టుకున్నాడు. ముందు నుంచి, చెట్లు, మొక్కలు అంటే ఇష్టమున్న ఇద్దరూ, ఇంటి చుట్టూ అన్ని చెట్లు వేశారు. ఖాళీ ఉన్నప్పుడల్లా చెట్లమధ్య గడిపారు పిన్నీ,బాబాయి.
ఆలోచిస్తుండగానే, క్యాబ్ బాబాయి ఇంటిముందు ఆగింది. గేట్ తీసిన నాకు, ఒక్క నిమిషం వేరే ఇంటికి వచ్చానా అర్థం కాలేదు. తుప్పు పట్టిన గేట్, వాకిలి అంతా చెత్త, లోపల చెట్లు అన్నీ ఎండిపోయి,వాడిపోయి ఉన్నాయి. బయట స్కూటర్,కారు కూడా దుమ్ముపడి ఉన్నాయి. అసలు వాటిని ముట్టుకొన్నట్టు లేదు.
లోపలికి వెళ్లి బెల్ కొట్టాను. ఎవరూ పలకలేదు , తలుపులు దబదబా బాదాను “పిన్నీ! “ అంటూ.
అప్పుడు శబ్దం అయింది, నెమ్మదిగా తలుపు తీసిన వ్యక్తి ఎవరో నాకు తెలియలేదు.
రేగిపోయి,నెరిసిన జుట్టు, నలిగి, వెలిసిన నూలు చీర, మొహమంతా ఉబ్బిపోయి, చూస్తే భయం వేస్తున్న ఆవిడ “ఎవరూ?” అంది.
“ఇక్కడ మా పిన్ని ఉండాలండి, ఇప్పుడు ఎక్కడ ఉన్నారు?” అన్న నన్ను చూసి
“చిన్నా!” అంది.
నేను తూలి పడపోయాను. చటుక్కున పట్టుకుని “లోపలికి రా!” అని లోపలికి నడిపించింది.
కుర్చీలో కూర్చున్న నేను, పిన్ని వంక చూస్తే నాకు అంతా మసకగా ఉంది. కళ్లు నులుముకుంటే కళ్లనీరు తగిలింది.
నేను ఏమీ మాట్లాడలేదు, పిన్ని ఖంగారుగా మంచినీళ్లు తెచ్చి ఇచ్చింది.
తాగుదామనుకున్నా కానీ, ఒక్క గుక్క తాగేసరికి పొర పోయింది.
దగ్గుతుంటే తలమీద చేయి వేసి తడుతూ “అమ్మ తల్చుకుంటోంది” అంది.
నేను ఆ చెయ్యి పట్టుకుని “లేదు! బాబాయి తల్చుకుంటున్నారు” అన్నాను.
పిన్ని ఏమీ మాట్లాడలేదు. ఆమె కంట చుక్క నీరు రాలేదు.
ఇద్దరమూ అలా మూగగా ఉన్నాం. గేట్ కిర్రు శబ్దం అయింది. మల్లమ్మ లోపలికి వచ్చింది. చాలా ఏళ్ల నుంచి వాళ్ళింట్లో చూస్తుండడంతో మల్లమ్మకి మేమంతా తెలుసు.
“చిన్న బాబూ! బాగున్నావా? ఎప్పడు వచ్చావు?” నవ్వుతూ పలకరించింది.
నేను సమాధానం చెప్పకుండా “ఇల్లు ఇలావుంటే బాబాయి ఊరుకుంటారా మల్లమ్మా? ఇంత చెత్తగా పెట్టావేంటి? నువ్వు చీపురు తీసుకుని ఊడిస్తే నేను కవర్లోకి ఎత్తుతాను? అంటూ వంటింట్లోకి వెళ్లి చెత్త ఎత్తే కవర్ తెచ్చాను.
ఆరేళ్లయినా వాళ్ల ఇంట్లో ఏ వస్తువు ఎక్కడ ఉంటుందో నాకు బాగా తెలుసు.
పిన్ని ఏదో అనబోతుంటే, “నేను రాత్రి కూడా ఏమీ తినలేదు, ఆకలిగా ఉంది, తొందరగా వంట చేస్తే భోంచేద్దాం” అంటూ, బయట పని చెయ్యడానికి వీలుగా ఉన్న బట్టలు మార్చుకుని బయటికి నడిచాను.
నేనూ, మల్లమ్మ, దాదాపు గంట సేపు కష్టపడితే, సుమారు పది బస్తాలకి సరిపడా ఎండుఆకులు, కొమ్మలు వచ్చాయి.
“రేపు చెత్తతీసేటి ఆయనకి పైసలు ఇస్తే, తీసుకుపోతాడులే చిన్నబాబూ! లోపలికి పదండి. ఎండ బాగా వస్తోంది” అంది ఎర్రపడ్డ నా మొహం చూసి. పని చేస్తున్నంత సేపు మల్లమ్మ కబుర్లు చెప్తూనే ఉంది. అన్నీ పిన్ని, బాబాయి గురించే.
లోపలికి వెళ్లేసరికి పిన్ని స్నానం చేసి, వంట చేస్తోంది. నేను కాళ్ళు, చేతులు కడుక్కుని వంట ఇంటి ఇవతల ఉన్న డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని, మొక్కల సంగతి మాట్లాడడం మొదలుపెట్టాను. ఏవి ఎండిపోయాయి,ఏవి కొత్తవి తేవాలి? ఏ చెట్లు కొమ్మలు సరిగ్గా కొట్టించాలి, అంటూ మాట్లాడుతున్న నన్ను విచిత్రంగా చూసింది పిన్ని.
ఏమీ మాట్లాడకుండా వండినవన్నీ బల్ల మీద పెట్టింది.
ఆలుగడ్డ వేపుడు, మామిడికాయ పప్పు, చారు అన్నం.
“అబ్బా! మామిడికాయ పప్పు, ఇందులోకి ఊరు మిరపకాయలు వేయించలేదేం? నువ్వు కూడా పెట్టుకో” అన్న నన్ను చూసి “నేను ఇవన్నీ తినడం మానేశాను, ఒక్క మజ్జిగ అన్నం మాత్రమే అదీ, ఒక పూటే” అంది పిన్ని.
నేను ఏమీ మాట్లాడకుండా తినడం మొదలుపెట్టాను.
భోజనం అయ్యాక నేను నెమ్మదిగా, “పిన్నీ! బాబాయి పోయి, దాదాపు ఆరునెలలు దాటింది. ఆ స్కూటర్, కార్ అలానే ఉంచావు. అలమరలో బాబాయి బట్టలన్నీ అలానే ఉన్నాయి, ఆ రాక్ లో చెప్పులు కూడా… ” అన్నాను.
“నేను ఇంకా నమ్మలేకపోతున్నాను చిన్నా! మీ బాబాయి కారూ, స్కూటరూ, ఉంచుతాను. అవన్నీ నాకు జ్ఞాపకాలు. బట్టలు,చెప్పులు కూడా ఎవరైనా వేసుకుంటారని ఊహిస్తేనే బాధగా ఉంది”
“ఓకే! నువ్వు ఇలానే విరాగిలా ఇంట్లోనే ఉంటావా? ఎక్కడైనా ఆశ్రమానికి వెళ్తావా?” అడిగిన నన్ను వింతగా చూసింది.
“నేను ఆశ్రమానికి వెళ్ళడం ఏమిటి?”
“మరి… నువ్వు జీవితం మీద, నీ శరీరం మీద, ఏమాత్రం శ్రద్ధ లేకుండా, సన్యాసిలాగా ఉన్నావు. బాబాయి సడన్ గా పోయారు. ఆ షాక్ ఎవరికైనా ఉంటుంది. అందులో నువ్వు,బాబాయి ఒకరికి, ఒకరుగా బతికారు. అది తట్టుకోవడం కష్టమే.
కానీ నువ్వు చనిపోయేదాకా బతకాలిగా? ఆత్మహత్య చేసుకోవుగా? ఒంటరిగా ఉన్నావు, మనవాళ్లు ఎవరైనా వచ్చినా అసలు పట్టించుకోవు. వంట చెయ్యవు. ఇల్లు శుభ్రం చేయనియ్యవు, చెట్లలో అంతా చెత్త, ఏ పాములో రావచ్చు. స్కూటర్, కార్ జ్ఞాపకాలతో వాటిని మ్యూజియం లాగా ఏర్పాటు చేస్తావా! అవి తుప్పు పట్టి విరిగిపోతే అలానే ఉంచుతావా!
బాబాయి బట్టలు, ఆయన వాడి వదిలేసిన షేవింగ్ బ్రష్, దువ్వెన, చెప్పులు, సామాను ఇవేనా నీకు ఆయనతో జ్ఞాపకాలు. అంతకు మించిన మంచి జ్ఞాపకాలు లేవా?
ఇన్నేళ్లు ఆయనతో కాపురం చేశావు, ఆయనకి ఏమిష్టమో తెలీదా నీకు? నువ్వు ఎలా ఉంటే ఆయనకి సంతోషమో తెలీదా? ఆయన పోతే ఇలా అన్నీ వదిలేసి, సర్వసంగపరిత్యాగిలా ఉంటే, ఆయన స్వర్గం నుంచి నిన్ను సంతోషంగా చూస్తాడా? లేక బాధతో ఆత్మ ఇక్కడే తిరుగుతుందా?” నాది కోపమా! ఉక్రోషమా! దుఃఖమా! నాకే తెలీదు, పిన్నికీ అర్థం కాలేదు.
నా వంక అయోమయంగా చూస్తూ “నా భర్త పోతే బాధపడడం తప్పా… ఆయన జ్ఞాపకాలు నాకు ఉండాలనుకోవడం నేరమా?”
“ఆయన జ్ఞాపకాలు ఉండాలి, అవి నీలో బతికుండాలి. కానీ ఆ జ్ఞాపకాలే, నీకు దుఃఖాన్ని, అనారోగ్యాన్ని, చావును ఇస్తే! అదేనా ఆయనకి ఇష్టం, మాకు నిన్ను చూస్తే, బాబాయిని కూడా చూసినట్లు ఉండాలి. ఆయన జీవితంలో ఏమి సాధించాలి అనుకున్నాడో, అవి నువ్వు సాధించాలి. ఆయన, నేనూ, మీ పిన్నీ, అర్ధనారీశ్వరులం అనేవాడు. ఆయనకి బీద విద్యార్థులని చేరదీసి లెక్కలు, ఇంగ్లీష్ చెప్పడం ఇష్టం.
నువ్వు అవి చెప్పలేకపోతే, మనిషిని పెట్టి చెప్పిద్దాం. బాబాయికి చెట్లు పచ్చగా ఉండడం ఇష్టం, నువ్వు చేయలేకపోతే మాలిని పెడదాం. నువ్వు సంగీతం పాడితే ఇష్టం…
ఒకవేళ నువ్వు పోయి, ఆయన ఉండి, ఇలానే ఇల్లు ఉంచి, నీలానే విరాగిలా ఉంటే… ఇలానే ఉంటే… అవే ‘నా’ జ్ఞాపకాలు అంటే…” ఆగాను రంగులు మారుతున్న పిన్ని ముఖంలోకి చూస్తూ.
ఏమీ మాట్లాడకుండా, రూంలోకి వెళ్లి తలుపు వేసుకుంది పిన్ని.
నేనూ, ఇంకో రూమ్ లోకి వెళ్లి నిద్ర పోయాను. ఒళ్లు తెలీకుండా నిద్ర పట్టింది.
నిద్ర లేచి చూస్తే, ఒకనిమిషం నేను ఎక్కడ ఉన్నానో అర్థం కాలేదు.
మంచి ఉల్లిపాయ పకోడీ వాసన వచ్చింది. పిన్ని స్పెషాలిటీ అది.
“పిన్నీ! పకోడీ చేశావా?” వంటింట్లోకి, దాదాపు పరిగెడుతూ వచ్చిన నన్ను చూసి నవ్వింది.
“వాసనకి లేచావా? మొహం కడుక్కుని రా! ఇద్దరం పకోడీ,టీ తీసుకుందాం!”
ఆశ్చర్యంగా “నీకు కోపం రాలేదా?” అన్న నన్ను చూసి,
“కోపమెందుకు? బుద్ధుడికి జ్ఞానోదయం అయినట్లు, నీ బోధలు విన్నాక, నాకూ జ్ఞానోదయం అయింది. నేనూ ఆలోచించాను, నిజమే! నాకు మీ బాబాయి జ్ఞాపకాలు ఉంచుకోవాలంటే, ఇలా చెయ్యక్కర్లేదు. తిన్నాక అన్నీ సర్దుదాం, బట్టలు,మిగిలిన వస్తువులు కూడా బీదవాళ్లకి ఇచ్చేస్తాను.
నీతో వచ్చి కొన్ని రోజులు మీ ఇంట్లో ఉంటాను. వస్తూ అత్తయ్య, మామయ్యని కొన్ని రోజులు ఇక్కడకి తీసుకువస్తాను.
బాబాయి సంవత్సరీకాలలోగా ఇల్లంతా బాగు చేయిస్తాను. మళ్లీ చెట్లన్నీ పూలు,కాయలతో కళ,కళలాడేలా చేస్తాను. నాకు కారు నేర్పించు. స్కూటర్ ఎవరికైనా ఇచ్చేస్తాను”
ఆపకుండా చెప్తున్న పిన్ని వంక చూసి “పిన్నీ! నిన్ను బాధపెట్టానా?”
“కొంచెం కఠినంగా చెప్పావు… అప్పటికి కానీ నాకర్థం కాలేదుగా? నీలాగా, నాతో మాట్లాడే స్వతంత్రం నేను ఎవరికీ ఇవ్వలేదు అని అర్థమయింది. నువ్వన్నట్టు, నాకు భర్త పోయాడు నిజమే… తాతయ్య,నానమ్మకి కొడుకు, మీనాన్నకి… తమ్ముడు, మీ అమ్మకి… కొడుకులాంటి మరిది పోయాడు. నేనే, ఆ షాక్ నుంచి తేరుకోలేక, అందరినీ దూరం పెట్టి, మూర్ఖంగా ప్రవర్తించాను” అంటున్న పిన్నిని దగ్గరికి వెళ్లి హత్తుకున్నాను.
అప్పుడు ఏడ్చింది పిన్ని. తెరలు,తెరలుగా, మొదలయ్యి ఉప్పెనగా ఏడ్చింది.
కడుపులోని బాధ, అగ్నిపర్వతం బద్దలయ్యి, దుఃఖమంతా లావాలాగా, బయటికి తన్నినట్లుగా ఏడ్చింది.
“మొగుడు పోతే కళ్ళనీళ్ళు పెట్టుకోలేదు ఆ రాక్షసి!” అన్న నానమ్మ మాట గుర్తొచ్చింది.
చుట్టూ చెయ్యి వేసి “పిన్నీ! నేను మీ కొడుకుని! ఆ ఒక్క సంగతి గుర్తుంచుకో చాలు” అన్న నన్ను చూసి, నెమ్మదిగా తేరుకుని, మొహం కడుక్కుని వచ్చింది.
“ఇంక నేను… మీ బాబాయి ఎక్కడున్నా, సంతోషంగా ఉండేట్లు బతుకుతాను.
నా సంగీతం క్లాసులు మొదలుపెడతాను, బీద పిల్లలకు చదువు చెప్తాను, ఇంకా ఏమైనా చేయచ్చా ఆలోచిస్తాను! మీ బాబాయి జ్ఞాపకాలు, మనసుకు హాయిగా ఉండేవి మాత్రం గుర్తు చేసుకుంటాను” చెప్తున్న పిన్ని వంక ప్రేమగా చూసి
“ఇవన్ని కూడా బాబాయి జ్ఞాపకాలే పిన్నీ!” సంతోషంగా అన్నాను.
నవ్వుతున్న పిన్నిని చూసి, బాబాయి సంతోషించాడన్నట్టు, ఎండిపోయిన నేల తడిసేలా చిరుజల్లు కురిసింది.
రచన: శ్రీపతి లలిత
ఈనాడు ఆదివారం అనుబంధంలో 5-10-25.