ఈనాడు ఆదివారం అనుబంధం 15-6-25 న వచ్చిన కథ.
సర్దుబాటు - దిద్దుబాటు.
"అభీ! పిన్ని ఫోన్ చేసింది, వాళ్ళ బంధువుల అమ్మాయి ఏదో పెద్ద కంపెనీలో చేస్తోందిట. అమ్మాయి బానే ఉంటుందిట, ఒకసారి కలవమంటోంది” అంది శోభ. తల్లి మాటలకి విసుగ్గా "అబ్బా! ఇప్పుడే పెళ్లి వద్దని చెప్పాను కదమ్మా, మళ్ళీ మొదలెట్టావేంటి?" అన్న అభిమన్యు మాటలకి "అంటే! ఏకంగా షష్టిపూర్తికి అన్నీ చేసుకుంటావా?"
"ఇరవై ఎనిమిదేళ్ళకే షష్టిపూర్తి చేసుకుంటారా?" కోపంగా అన్నాడు.
"సరే! పాయింట్ కి వద్దాం! ఎవరా అమ్మాయి?" అడిగిన శోభని చూసి తత్తరపడ్డాడు అభిమన్యు.
"అమ్మాయా! ఎవరూ? ఏంటీ?" ఖంగారుగా అంటున్న అభిమన్యుని చూసి,
"చూడు బాబూ! నేను మీ అమ్మని, ఆ సంగతి మర్చిపోయావు. నేను గమనిస్తూనే ఉన్నాను, ఈ మధ్య ఫోన్ రాగానే, రూమ్ లోకి పరిగెత్తుతున్నావు. ఆఫీస్ కి నీటుగా తయారు అయ్యి వెళ్తున్నావు… కనక, ఇప్పుడు అక్కడ ఏదో ఆకర్షణ ఉందని అర్థమైంది".
తల్లి మాటలకి అభిమన్యు మొహమంతా ఎర్రగా అయింది "పెద్ద డిటెక్టివ్ వచ్చిందండీ!"
అంటూ వెళ్తుంటే "తొందరగా తీసుకురా ఆ అమ్మాయిని, లేపోతే మా దారిన మేము వెతుకుతాం" నవ్వుతూ వెనకనుంచి అంది.
శోభా, సురేష్ ల ఏకైక సంతానం అభిమన్యు. ఒక్కడే అని, పిచ్చి గారాబం చెయ్యలేదు.
ఎక్కడ గట్టిగా ఉండాలో, ఎక్కడ ఫ్రీగా వదలాలో తెలిసిన శోభ, కొడుకుని పద్ధతిగా పెంచింది.
పెళ్లి విషయంలో, కొడుకుకి పూర్తి స్వత్రంత్రం ఇచ్చినా, తొందర పడతాడేమో అనే భయం లేకపోలేదు.
శోభ ఊహించినట్లుగానే, ఒక వారం తరవాత, అభి, తల్లి దగ్గర ప్రస్తావన తెచ్చాడు.
“అమ్మా!” అని సణుగుతూ వెనకాలే తిరుగుతుంటే, కాసేపు ఏడిపించి,
“చెప్పరా!” అనడమే ఆలస్యం, “మనోజ్ఞ ఆరునెల్లక్రితం మా కంపనీలో చేరింది, బావుంటుంది, తెలివికలది, వాళ్ల నాన్నగారు నాన్నతో మాట్లాడతానన్నారు…”
“ఇంకేం! ప్రోగ్రెస్ బానే ఉంది, నేను కూడా నాన్నతో చెప్తాలే ” అంది శోభ నవ్వుతూ.
“థాంక్యూ మామ్” అంటూ ఒక ముద్దు పెట్టేసి వెళ్తున్న కొడుకుని చూసి నవ్వుకుంది శోభ.
మనోజ్ఞ నాన్నగారు శ్యాంసుందర్, సురేష్ కి ఫోన్ చేసి, వాళ్ళ ఇంటికి ఆహ్వానించారు.
తరువాతి ఆదివారం ముగ్గురూ మనోజ్ఞ ఇంటికి వెళ్లారు.
శ్యాంసుందర్ ఒక ప్రైవేట్ కంపెనీలో, చిన్న ఉద్యోగం చేసి రిటైర్ అయ్యాడు.
తల్లి ఉష గృహిణి. కూతురు మనోజ్ఞని ఇంజినీరింగ్ కష్టపడి చదివించారు. ప్రైవేట్ కంపెనీ అవడంతో, పెన్షన్ లేదు. రిటైర్ అయ్యాక, వచ్చిన డబ్బు జాగ్రత్త పెట్టుకున్నారు.
అమ్మాయి పెళ్లి అయ్యాక, వీలుని బట్టి చిన్న ఫ్లాట్ కొందామని అనుకున్నారు.
ప్రస్తుతం, అద్దెఇంట్లో ఉన్నారు. ఇల్లు చిన్నగా ఉన్నా, శుభ్రంగా పెట్టుకున్నారు.
శ్యామ్, ఉష నవ్వుతూ వీళ్లని ఆహ్వానించారు. ఇంట్లో చేసిన పకోడీలు, రవ్వలడ్డు పెట్టి, టీ ఇచ్చారు. మనోజ్ఞ, పెళ్లి చూపులు అన్నట్టుగా బిగుసుపోకుండా, ఎప్పటినుంచో పరిచయమున్నట్టు చక్కగా కబుర్లు చెప్పింది.
అభి అన్నట్టు, అందంగా ఉంది, తెలివిగా ఉంది. కాసేపాగి మనోజ్ఞ, శోభ, సురేష్ ని ఉద్దేశించి,
“అంకుల్! ఆంటీ! నేను ముందే ఒక విషయం చెప్పాలి. నేను మా అమ్మా, నాన్నలకి ఒక్కతే కూతుర్ని. వాళ్ల బాధ్యత నాదే. నా జీతంలో నుంచి, నెలనెలా వాళ్ల ఖర్చులకి ఇస్తాను. నేను మూడు బెడ్ రూమ్ ల ఫ్లాట్ బుక్ చేసాను. మీతోపాటు, వాళ్లు కూడా నాతోనే ఉంటారు. ఈ విషయం మీకు అభ్యంతరం లేకపోతే, నేను పెళ్లికి రెడీ!” అంది
శోభకి, మనోజ్ఞ అన్న “మీతోపాటు వాళ్ళుకూడా ఉంటారు” అన్నది నచ్చింది. ‘ఆడపిల్లయినా, మగపిల్లవాడైనా… పిల్లలు, తల్లి, తండ్రి బాధ్యత తీసుకుంటాము అనడం మంచి విషయం. తనని ఇంత కష్టపడి పెంచిన తల్లిదండ్రుల బాధ్యత తీసుకోవడం, ఎంత మంచి పని’ అనుకుంది శోభ.
ఇంటికి వచ్చాక సురేష్ తో అంటే, అతను కూడా అలానే అన్నాడు
“ఆ అమ్మాయిలో, నాకేమీ లోపాలు కనిపించలేదు, వాళ్ల తల్లిదండ్రులని చూసుకుంటాను అంటేనే… మంచి అమ్మాయి అనిపించింది. నాకు ఓకే” అన్నాడు.
అందరి సమ్మతితో పెళ్లి అయిపోయింది.
ఒక నాలుగు నెలలు, మనోజ్ఞ అత్తగారింట్లోనే ఉంది. ఆడపిల్లలు లేకపోవడంతో శోభ, సురేష్ ఎంతో ప్రేమగా చూసుకున్నారు.
సెలవలలో, అందరూ ఉష ఇంటికి వెళ్లేవారు, లేదంటే, వాళ్లయినా ఇటు వచ్చేవారు.
ఉషకి వంట, పని అంతగా రాదు. శోభ దగ్గరికి వస్తే, “వదినా! మీ వంట ఎంత బావుంటుందో, శ్యామ్ కూడా అంటారు, మా చెల్లి వంట ఎంత బాగా చేస్తుందో నువ్వూనేర్చుకోవచ్చుగా అని, ఇప్పుడు ఏం నేర్చుకుంటాను? మీ చెల్లి చేసింది తింటాను అన్నాను” అన్న ఉష మాటలకి పొంగిపోయి “ఏమి కావాలో చెప్పు ఉషా! చేస్తాను” అన్నది.
మనోజ్ఞ కొన్న ఫ్లాట్ రెడీ అయింది. పెద్దవాళ్ళు నలుగురూ, వాళ్ళకి తోచిన సలహాలు చెప్పి, ఇంటిని అందంగా తీర్చిదిద్దారు.
మూడు బెడ్ రూముల ఫ్లాట్, ఒకరూం అభి, మనోజ్ఞ కోసం రెడీ చేస్తే, ఒకటి శోభా వాళ్ళకి, మూడోది ఉషా వాళ్ళకి రెడీ చేసారు.
ఎంత సొంత ఇల్లు ఉన్నా, కొడుకు కొన్న ఫ్లాట్ లో, తమకోసం కూడా ఒక రూమ్ ఏర్పాటు చెయ్యడం, శోభా సురేష్ లకి చాలా ఆనందం కలిగింది.
గృహప్రవేశం రోజున, పిల్లలు పూజ చేస్తుంటే, నలుగురు తల్లితండ్రులూ ఆనందంతో పొంగిపోయారు.
"అత్తయ్యా! ఇల్లు ఇంత చక్కగా, దగ్గర ఉండి అన్నీ రెడీ చేసుకున్నాం. మాకు ఆఫీస్ కూడా బాగా దగ్గర. మనమందరం ఇక్కడే ఉందాం" అన్న మనోజ్ఞ మాటలకి పొంగిపోయింది ఉష… కూతురు, అత్తగారికిస్తున్న విలువ చూసి.
"అత్తయ్యగారు వాళ్ళు, ఎలానూ అద్దె ఇంట్లో ఉంటున్నారుగా! అది ఖాళీ చేసి ఇక్కడికి వచ్చేయమన్నాం" అని అభి అంటే, కొడుకు సంస్కారానికి ఉబ్బితబ్బిబయ్యాడు సురేష్.
"ముందు మీ మామగారు వాళ్ళని షిఫ్ట్ అవ్వమను. మేమూ వస్తాములే!" అన్న తల్లితండ్రుల్ని ఆరాధనగా చూసాడు అభి.
అద్దె ఇల్లు ఖాళీ చేసి, ఉష వాళ్ళు కొత్త ఫ్లాట్ లోకి వచ్చారు.
అందరూ “మీరెప్పుడు వస్తారు?” అంటుంటే శోభా కూడా ఉత్సాహపడింది, కొత్త ఫ్లాట్ కి వెళ్ళడానికి.
ఇల్లు అద్దెకి ఇచ్చి, మొత్తం మారిపోదామని శోభ అంటే, సురేష్ ఒప్పుకోలేదు.
"శ్యాం వాళ్ళది అద్దె ఇల్లు, ఆ డబ్బు అప్పుకి కట్టుకోవచ్చు. మనది సొంత ఇల్లు. ఇంత సామాను అక్కడ పట్టదు, కొంతకాలం ఉండి వస్తే, మనకీ పరిస్థితి అర్థమవుతుంది, అప్పుడు ఆలోచిద్దాం" అన్నాడు ముందుచూపుతో.
వారిస్తున్నా వినకుండా, అందరికీ సంతోషముగా, "మా అబ్బాయి ఇంటికి వెళ్తున్నాం" చెప్పింది శోభ.
ఉత్సాహంగా వెళ్లిన వీళ్ళని, ఎంతో ఆనందంగా ఆహ్వానించారు అందరూ.
"మీరొచ్చారు, ఇంటికి కళ వచ్చింది" అంది సంతోషంగా ఉష.
"అవునమ్మా! పిల్లలు ఆఫీస్ కి వెళితే మాకు బోర్ కొట్టేస్తుంది. మీరుంటే మనకి కాలక్షేపం" అన్నాడు శ్యామ్, సురేష్ తో చెయ్యి కలుపుతూ.
తరవాత రోజులు సరదాగా గడిచాయి. అందరూ కలిసి కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు చెయ్యడం, గుళ్ళకి, సినిమాలకీ వెళ్లడం, వాకింగ్ చెయ్యడం, ఆరునెలలు అలా త్వరగా గడిచిపోయాయి.
శోభ చేసిన వంటలు, లొట్టలు వేసుకుంటూ తిన్నారు అందరూ. రెచ్చిపోయి, రోజూ కొత్త టిఫిన్లు, భోజనంలోకి కొత్త వెరైటీలు, చెయ్యడం మొదలుపెట్టింది శోభ.
సూపర్ బజార్ బిల్లులు ఎక్కువై, అభి టెన్షన్ పడితే, బీపీ, షుగర్ ఎక్కువై శ్యాం, సురేష్ మూలగసాగారు.
మొదట హుషారుగా చేసినా, శోభకు… వంటలో ఏమాత్రం ఉష సాయం లేకపోవడంతో, అలసటగా ఉండేది. ఉష, కూర్చుని కబుర్లు చెప్పడం తప్ప, కనీసం కూరలు తరిగిస్తానని కూడా అనేది కాదు. శోభకేమో వంట చేసి పడేయడం తప్ప, సర్దే అలవాటు లేదు. ఇక్కడ పనిఅమ్మాయి, ఒక్క పూటే రావడంతో, ఇల్లంతా గిజాటుగా ఉండేది.
ఏ ‘టీ’ పెట్టుకోడానికో వంటిట్లోకి మనోజ్ఞ వస్తే, ఆ వంటిల్లు చూసి పిచ్చెక్కిపోయేది. ఎవరిని అనాలో తెలియక, ఆ కోపమంతా అభి మీద చూపేది. మొదట్లో, రూమ్ లో ఎవరికీ వినపడకుండా జరిగిన మాటల యుద్ధాలు, రానురాను, బయటికి అందరికీ వినిపించేవి.
ఇల్లు శుభ్రంగా ఉండటంలేదని మనోజ్ఞ అంటే, ఖర్చులు ఎక్కువ అయ్యాయని అభి, అందరి ముందు అనడం మొదలు పెట్టారు.
ఆ మాటలు విన్నాక, ‘ఉషా వాళ్ళ వల్లే కొడుకుకి ఆర్ధిక ఇబ్బందులు వస్తున్నాయి’ అని శోభ అనుకుంటే, ‘కూతురు ఇల్లు శుభ్రంగా ఉండకపోవడానికి కారణం శోభ’ అని ఉష అనుకుంది.
దానితో, ఇద్దరి మధ్య, చిన్న, చిన్న మనస్పర్థలు రావడం మొదలయ్యాయి.
ఇదివరకు, “మీ వంట అద్భుతం” అన్న ఉష, ఇప్పుడు, ఏమీ మాట్లాడకుండా తింటోంది.
“వంటంతా నేను చేస్తే, తినేసి, కనీసం బావుంది అనకుండా, లేచి చక్కా వెళ్ళిపోతోంది. నేనేమన్నా ఈవిడకి వంటమనిషినా?” సురేష్ దగ్గర, శోభ సణగడం మొదలైంది.
“నువ్వే! నేను వంట చేస్తాను, అని మొదలుపెట్టావు. నిన్నెవరూ బలవంత పెట్టలేదు” శోభని విసుక్కుంటూ సురేష్ గట్టిగా అన్నాడు.
“నెలకి తెచ్చినవన్నీ, పదిరోజుల్లో అవగొడుతోంది ఈవిడ”అని ఉష, శ్యామ్ తో అంటే
“వాళ్ళ అబ్బాయి సొమ్మేగా? నీకేంటి బాధ? చేసినవన్నీ బావున్నాయని తినడమే కాక, వదినా! ఇవి చెయ్యి, వదినా! అవి చెయ్యి అని అడిగావుగా!” అన్నాడు శ్యామ్.
రోజూ, సురేష్ పొద్దున్నే వెళ్లి, మధ్యాహ్నం వస్తుంటే, “ఎక్కడికి వెళ్తున్నారు?” అడిగిన శోభతో,
“మన ఇల్లు శుభ్రం చేయిస్తున్నా! నాలుగురోజులాగి వెళ్లి, అక్కడ కొన్ని రోజులు ఉందాం” అన్న సురేష్ తో “అవునండీ! నాకూ మన ఇల్లు గుర్తు వస్తోంది” అంది.
మర్నాడు కొడుకు,కోడలు, కొద్దిగా తీరిగ్గా ఉన్నప్పుడు, సురేష్ అదేమాట చెప్పాడు.
“ఎందుకు నాన్నా! ఇక్కడ బానే కాలక్షేపం అవుతోందిగా?” అన్న కొడుకుతో “ఇల్లు అలా మూసిపెడితే పాడవుతుంది, కొన్ని రోజులు అక్కడ ఉంటాం” అంటే “మీ ఇష్టం!” అన్నాడు అభి.
“సెలవుల్లో మీరే అటురండి మనోజ్ఞ! మీకు కొంచెం రెస్టుగా ఉంటుంది” కోడలితో అంటే, “అలాగే” అని వెంటనే అంది.
ఉష, శ్యామ్ తో కూడా మొహమాటానికి “పిల్లల్తో మీరు కూడా రండి ఉషా!” అంటే “మాకూ ఇక్కడ తోచడంలేదు శోభా! మా పాత ఇల్లు ఖాళీగానే ఉంది. నిన్ననే, ఈయన వెళ్లి అడ్వాన్స్ ఇచ్చారు” అన్న ఉష వంక ఆశ్చర్యంగా చూసింది శోభ.
తాము సొంత ఇంటికి వెళ్ళిపోతే, హాయిగా తన కొడుకు సొమ్ము తింటూ, సంతోషంగా ఉంటారని, మనసులో తెగ తిట్టుకుంటోంది నాలుగు రోజులనుంచి. అలాంటిది ఇప్పుడు వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారంటే, “అయ్యో! అందరం ఒకేసారి వెళితే, పిల్లలు దిగులు పడతారేమో?” మనసులో మాట బయటికి వచ్చింది.
“వాళ్ళకి అవేమీ లేవు, మనం ఎప్పడు వెళ్తామా? ఎప్పడు గువ్వపిట్టల్లా ఇద్దరూ ఉందామా?అని చూస్తున్నారు “ నవ్వుతూ ఉష అంటే, ‘పోనీలే మరీ గొడవలు పడకుండా, సామరస్యంగా వెళ్ళిపోతున్నాం చాలు’ అని ఆడవాళ్లు ఇద్దరూ మనసులో అనుకున్నారు.
‘సర్దుబాటు కష్టం అనిపించగానే, దిద్దుబాటు చేసి, గొడవలు లేకుండా సామరస్యంగా పరిష్కారం చేసుకున్నాం’ అని మగవాళ్ళిద్దరూ, ఊపిరి పీల్చుకున్నారు.
అసలు విషయం ఏమంటే, ఇంట్లో ఆడవాళ్ల మధ్య, కొద్దిగా సమస్యలు వస్తుంటే, వాకింగ్ కి వెళ్లిన శ్యామ్, ముందు సంశయించినా, మనసులో మాట బయట పెట్టాడు.
“సురేష్ గారూ! మనోజ్ఞ మాకు ఒక్కతే కూతురు, నిజమే కానీ! మాకు ఒంట్లో శక్తి ఉన్నంతవరకు తనమీద ఆధారపడ తల్చుకోలేదు.
మా కంపెనీ వాళ్లు, నన్ను అడ్వైజర్ గా ఉండమంటున్నారు. మేము ఖాళీ చేసిన ఇల్లు అలానే ఉంది. ఓనర్ మొన్ననే ఫోన్ చేసి, రిపేర్లు చేయించాము, ఎవరైనా మంచి వాళ్ళు ఉంటే చెప్పమన్నారు. మేమే ఉంటామంటే, పాత అద్దెనే ఇమ్మన్నారు.
పిల్లలు మంచివాళ్ళు, మీరూ ఎంతో స్నేహంగా ఉన్నారు కానీ… మాకు ఓపిక ఉన్నంతవరకు, మేము విడిగా ఉండాలని నా ఉద్దేశ్యం…” సురేష్ వేపు చూస్తూ ఆగాడు శ్యామ్.
ఒక్కసారి, గుండెల మీద నుంచి బరువు దింపినట్లు అయింది సురేష్ కి.
తాము స్వంత ఇంటికి వెళ్ళిపోతే, శ్యామ్ వాళ్ళు ఏమనుకుంటారో? పిల్లలు ఎలా ఫీల్ అవుతారో? అని సంశయిస్తున్నాడు. అలాంటిది, ఆ ప్రస్తావన శ్యామ్ తెచ్చేసరికి, ‘అమ్మయ్య!’ అనుకున్నాడు.
“మేము కూడా సరిగ్గా అలానే అనుకున్నాం. మాకు స్వంత ఇల్లు ఉంది. ఒంట్లో ఇంకా కాస్త ఓపిక ఉంది. ఇల్లు అద్దెకి ఇవ్వడం ఇష్టం లేదు. పిల్లల బలవంతం మీద, ఏదో కొంతకాలం వచ్చాం. కొత్తగా పెళ్ళయిన పిల్లలు కూడా… వైవాహిక జీవితానికి అలవాటు పడాలి. మనం ఉంటే, అనవసర సలహాలు,జోక్యాలు ఉండి, మనస్పర్ధలు ఎక్కువ అవుతాయి. దానికంటే, దూరంగా ఉండి, అవసరమైనప్పుడు వద్దాం” అన్నాడు సురేష్.
శ్యామ్ కూడా సంతోషంగా నిట్టూర్చాడు. సమస్య, ఇంత తేలికగా పరిష్కారం అయినందుకు.
మళ్లీ పాత ఇంటికి వెళ్తామని, శ్యామ్ నెమ్మదిగా మనోజ్ఞ కి చెప్తే, సురేష్ అభికి చెప్పాడు. పిల్లలు, ముందు ‘వద్దు!’ అన్నా, కలిసుండి, గొడవలు వచ్చేకన్నా, దూరంగా ఉండి, ప్రేమగా ఉండడం, మంచిదన్న సంగతి అర్థమై ‘సరే!’ అన్నారు. ఇంకా కొంత కాలం పోతే, కుటుంబాల మధ్య సామరస్యం పెరిగి, అప్పుడు ‘సర్దుబాటు’ తేలిక. దానికోసం, ఇప్పుడు చేసిన ‘దిద్దుబాటు’ అవసరం అనుకున్నారు అందరూ.
రచన : శ్రీపతి లలిత.
ఇది నా స్వీయ రచన.