ఈనాడు ఆదివారం అనుబంధంలో 27-4-25 న ప్రచురించిన కథ.
'స్నేహ జీవనం’
"మాధవీ!" హడావిడిగా అరిచినట్లే పిలుస్తూ లోపలికి వచ్చాడు శ్రీనాథ్.
ఫోన్లో మాట్లాడుతున్న మాధవి ఆగమన్నట్లుగా చెయ్యి చూపించి "సరే నాన్నా, రాజా! జాగ్రత్త! ఏమి అవసరమున్నా ఫోన్ చెయ్యి, ఏమి కావాలన్నా కొరియర్ చేస్తాము. మరీ ఇబ్బందిగా ఉంటే రష్మి దగ్గరకి వెళ్ళండి.
రమ్య జాగ్రత్త, సహించకపోయినా ఏదో ఒకటి తింటూ ఉండమను. ఇక్కడ మీ నాన్న కాళ్ళు నేలమీద లేవు. ఒకటే గంతులు. ఒకే బై" అని ఫోన్ పెట్టింది.
"రాజా నాకూ ఫోన్ చేసాడు. నువ్వు తాతవు కాబోతున్నావు శ్రీనూ!. కంగ్రాట్స్, నా శ్రీ వచ్చేస్తోంది." కళ్ల నిండా నీళ్లతో అంది మాధవి.
"అవును మధూ! లత ఉంటేనా.. ఎంత సంతోషించేదో , ఇప్పటికిప్పుడు అమెరికా వెళ్దాం అనేది" గుక్క తిప్పుకోకుండా చెప్తున్నా శ్రీనాధ్ ని చూసి "నువ్వు ముందు స్థిమితంగా కూర్చో. కాఫీ ఇస్తా తాగుతూ కబుర్లు చెప్పు నేను వంట చేసేస్తా" అంటూ వంటింట్లోకి వెళ్ళింది మాధవి.
తన వెనకే వెళ్లి కుర్చీ లాక్కుని కూర్చున్నాడు శ్రీనాధ్. కంట్లోంచి వస్తున్న నీళ్లు తుడుచుకోకుండా కబుర్లు చెప్తున్న శ్రీనాథ్ ని చూస్తూ పక్కకి తిరిగి కళ్ళు తుడుచుకుంది మాధవి.
మాధవి, ఆమె భర్త రాధాకృష్ణ, శ్రీనాథ్, అతని భార్య లత అందరూ ఒకే బ్యాంక్లో ఉద్యోగులు.
అందరూ ఒకేసారి చేరేసరికి నలుగురికి బాగా స్నేహం ఏర్పడింది.
పెళ్లి అయ్యాక పక్క , పక్కనే ఇళ్ళు కొనుక్కుని స్నేహం ఇంకా బలపర్చుకున్నారు.
పేరుకు రెండు ఇళ్ళు అయినా అందరూ ఎక్కడో ఒక చోటే ఉండేవారు. మాధవి కూతురు రష్మి, శ్రీనాథ్ కొడుకు రాజీవ్ కూడా మంచి ఫ్రెండ్స్. ఇద్దరూ కలిసి పెరిగారు.
రాజీవ్, రష్మి స్నేహితురాలు రమ్యని పెళ్ళిచేసుకుంటే, రష్మీ కి రాజీవ్, తనతో పనిచేసే విశ్వా గురించి చెప్పి పెళ్లి కుదిర్చాడు. వాళ్ళు నలుగురు కూడా బాగా కలిసి పోయారు.
ఉద్యోగరీత్యా అమెరికా వెళ్లిన పిల్లలు నలుగురూ, అక్కడే ఉండిపోయారు. అందరూ
శాన్ ఫ్రాన్సికో లోనే ఉండటంతో, నెలకు రెండుసార్లు కలుస్తూనే ఉంటారు.
పిల్లలు అమెరికా రమ్మని గొడవ చేస్తే, పెద్దవాళ్ళు నలుగురూ కలిసి అమెరికా వెళ్లి అక్కడ పిల్లలతో అన్నీ చూసి, సరదాగా నాలుగు నెలలు ఉండి వచ్చారు.
పిల్లల సంసారాలు చూసి సంతోషంగా వెనక్కి వచ్చిన వీళ్ళకి కరోనా స్వాగతం పలికింది.
వీళ్ళ ఫ్లాట్స్ లో చాలామటుకు కరోనా బారిన పడ్డారు.
ఇంట్లోనే ఉంటూ ఎంత జాగ్రత్తగా ఉన్నా నలుగురికి కరోనా వచ్చింది.
పిల్లలు అమెరికా నుంచి రోజూ ఫోన్లు చేసి, ఆన్లైన్ లో డాక్టర్స్ తో మాట్లాడి, మందులు పంపినా, అందరూ ఆసుపత్రి పాలు కాక తప్పలేదు. కలిసి వెళ్లిన నలుగురిలో ఇద్దరు మాత్రమే తిరిగి వచ్చారు. ఇంటికి ఒక్కళ్ళు అన్నట్టు శ్రీలత, రాధాకృష్ణ దక్కకుండా పోయారు.
కరోనాలో జీవిత భాగస్వాముల్ని పోగొట్టుకోవడం ఒక ఎత్తు అయితే, వాళ్లకి అంతిమసంస్కారాలు జరపడం ఇంకో ఎత్తు అయింది. దిక్కులేని వాళ్ళలా మున్సిపల్ వాళ్లతో జరిపించడం, శ్మశానం వరకు కూడా వెళ్లలేక పోవడం, అటువంటి సమయంలో పిల్లలు దగ్గర లేకపోవడం పెద్ద శాపాలుగా తోచాయి మాధవికి, శ్రీనాధ్ కి.
ఆ సమయంలో మాధవి, శ్రీనాథ్ లకి ఒకరికి,ఒకరు అన్నివిధాలుగా తోడు అయ్యారు.
మాధవి వంట చేస్తుంటే, శ్రీనాథ్ బయట పనులు అన్ని జాగ్రత్తలు పాటిస్తూ చేసేవాడు.
పగలంతా ఇద్దరూ ఒక చోట గడిపినా, రాత్రికి ఎవరి ఇంట్లో వాళ్లు పడుకునేవారు.
ఫ్లాట్స్ లో అందరికీ, ఈ రెండు కుటుంబాల స్నేహం గురించి తెలుసు కనక, ఎవరూ ఏమీ మాట్లాడేవారు కాదు. ఎవరన్నా ఏమన్నా, పట్టించుకునే స్థితిలో మాధవి కానీ శ్రీనాథ్ కానీ లేరు.
ఇప్పుడు రమ్య తల్లి కాబోతోందని తెలిసి శ్రీనాథ్ ఆనందానికి హద్దులు లేవు. పుట్టబోయేది పాప అని తెలియడంతో అందరూ శ్రీలతే మళ్ళీ వస్తోందని సంతోష పడ్డారు.
సరిగ్గా, రమ్య డెలివరీ కోసం బయలుదేరే టైంకి, వాళ్ల అమ్మ కి కాలు ఫ్రాక్చర్ అయ్యి కదలలేని పరిస్థితి వచ్చింది. ఆవిడ మాధవికి ఫోన్ చేసి ఒకటే ఏడుపు.
అది భరించలేని మాధవి "మీరు ఖంగారు పడద్దు. నేను వెళతాను. రమ్య నాకు కొత్త కాదు. రష్మి ఎంతో రమ్య అంతే. నేను కానుపు అయ్యాక, మీరు వచ్చేవరకు ఉంటాను సరేనా!" అని ఓదార్చింది.
అనుకోని ప్రయాణం, అందులో ఎక్కువ టైంకూడా లేకపోవడంతో, శ్రీనాథ్ వెంటనే ఇద్దరికీ టికెట్లు బుక్ చేసాడు. రమ్య వాళ్ళ అమ్మ ఇచ్చిన చీరలు, స్వీట్స్ కాక, మాధవి తనవైపు నుంచి, శ్రీనాథ్ తరఫు నుంచి రమ్య, రాజీవ్ కి మాత్రమే కాక రష్మీ, విశ్వకి మంచి డ్రెస్సులు తీసుకుంది.
అమెరికాలో అంతా సవ్యంగా అయ్యి, పండంటి పాపాయిని చూసిన అందరికీ శ్రీలత గుర్తుకొచ్చింది. ఆరోజంతా శ్రీనాథ్ అన్యమనస్కంగానే ఉన్నాడు. రాజీవ్ కూడా తల్లిని తల్చుకుని బాధపడ్డాడు కానీ, పాపాయిని చూసి మర్చిపోయాడు.
నాలుగు నెలలు ఇట్టే గడిచిపోయాయి. రమ్య వాళ్ళ అమ్మగారు, ఒక పదిరోజుల్లో వస్తాను అని ఫోన్ చేసారు. ఇంక వీళ్ళు తిరుగు ప్రయాణానికి సిద్ధమయి సామానులు సర్దుకుంటున్నారు.
రష్మి , రాజీవ్ సాయం చేస్తామని వచ్చి ఒకరిని చూసి ఒకరు సౌంజ్ఞలు చేసుకుంటున్నారు. అది చూసిన మాధవి "ఏమిటర్రా ఆ మూగ సైగలు, ఏమి చెప్దామనుకున్నారో చెప్పండి" అంది.
చివరికి రష్మి నోరు విప్పింది. "అమ్మా ! నేను చెప్పేది విని తిట్టద్దు, నెమ్మదిగా ఆలోచించు. ఇది నా ఒక్కదాని ఆలోచన కాదు మా నలుగురిదీ. మేము ఉద్యోగాలలో ఇక్కడే స్థిరపడ్డాము. మన ఇద్దరి కుటుంబాలలో జరిగిన నష్టం తలుచుకుంటే మాకు ఎప్పుడూ బాధగానే ఉంటుంది, ఇంకా, మీరిద్దరూ ఎలా ఉన్నారని ఖంగారుగానే ఉంటుంది.
మీరిద్దరూ పక్క పక్క ఇళ్లలో బదులు, ఒకే ఇంట్లో జీవితభాగస్వాములుగా ఉంటే బాగుంటుంది అని మా ఆలోచన." తల్లి ముఖంలో మారుతున్న రంగులు చూస్తూ అంది రష్మి. శ్రీనాథ్ కూడా తెల్లబోయాడు. మాధవి ఏమి మాట్లాకుండా రూంలోకి వెళ్ళిపోయింది. శ్రీనాథ్ కూడా తన రూంలోకి వెళ్ళాడు.
ఆరోజు రాత్రి ఎవరికీ నిద్రపట్టలేదు. తెల్లారి లేచాక మాధవి, శ్రీనాథ్ రోజులానే అందరినీ పలకరించేసరికి "హమ్మయ్య" కోపం పోయింది అనుకున్నారు పిల్లలు.
ముందు మాధవి నెమ్మదిగా మాట్లాడింది. “చూడండి పిల్లలూ! మీరు ఇలా ఎందుకు అన్నారో నేను ఊహించగలను. మీ తల్లితండ్రుల గురించి, నలుగురూ నాలుగు రకాలుగా మాట్లాడడం మీకు నచ్చట్లేదు. మీ ఉద్దేశంలో ఇదే మంచి పరిష్కారం. కానీ మా పెంపకములో పెరిగిన మీరు ఇలా మాట్లాడడం నాకు, శ్రీనాథ్ కి కూడా బాధ కలిగించింది.
నేను, రాధాకృష్ణ, లత, శ్రీనాథ్ మా స్నేహం వయస్సు సుమారు నలభయ్ సంవత్సరాలు.
మేము ఎప్పుడూ స్నేహితులమే, అన్న, అక్క అంటూ వరుసలు కలపలేదు.
మిమ్మల్ని కూడా మేము అలానే పెంచాం. మీకు కూడా వరసలు నేర్పలేదు.
ఆడపిల్లలు లేని లోటు శ్రీలత, శ్రీనాథ్ రష్మి ద్వారా తీర్చుకుంటే మగపిల్లాడి సరదాలు రాజీవ్ ద్వారా మేము తీర్చుకున్నాం.
మన ఇరువేపు బంధువులు, స్నేహితులు మీరిద్దరూ పెళ్లి చేసుకుంటారు అనుకున్నారు.
వాళ్ళ ఆలోచన తప్పు అని నిరూపిస్తూ మీరు మీకు నచ్చిన వాళ్ళని చేసుకున్నారు. నలుగురూ ఈ రోజుకీ స్నేహంగా ఉన్నారు.
ఏ వయసు వారైనా సరే, ఒక ఆడ, మగ మధ్య పరిచయం ఉంటే అది తప్పనిసరిగా లైంగికమైన ప్రేమే అనే ఆలోచనలు ఇప్పుడిప్పుడే కొద్దిగా మారుతున్నాయి. వయసులో ఉన్న మీరే ఆడ, మగ అనే తేడా లేకుండా స్నేహంగా ఉన్నారు.
వయసు మళ్లిన మేము స్నేహంగా ఉండకూడదా?
నా భర్త స్థానం నేను ఎవ్వరికీ ఎలా ఇవ్వలేనో,తన భార్య స్థానము శ్రీనాథ్ ఎవరికీ ఇవ్వలేడు.
మేమిద్దరం మంచి స్నేహితులం, చివరి దాకా అలానే ఉంటాము. లోకం కోసం అన్నయ్య అనో చెల్లెమ్మ అనో అనడం మాకు ఇష్టం లేదు. మా స్నేహంకి ఎవరు ఏ పేరు పెట్టినా మాకు పరవాలేదు. మీరు మాత్రం అది అర్థం చేసుకుంటే చాలు.
నేను రష్మికి అమ్మని…. రాజీవ్ కి అత్త, పిన్ని ఏమైనా అవచ్చు కానీ అమ్మని కాను. అలానే శ్రీనాథ్ కూడా రష్మి కి తండ్రి కాలేడు. మాకు ఈ వయసులో కావాల్సింది స్నేహ బంధం, మా కష్ట సుఖాలు చెప్పుకునేందుకు తోడు. అంతే… దానికి ఒక పేరు, వరసా కాదు." స్పష్టంగా స్థిరంగా చెప్పిన మాధవిని చూస్తూ శ్రీనాథ్ అన్నాడు "మాధవి చెప్పిందే నా మాట కూడా, మాది స్వచ్ఛమైన స్నేహం, దానికి వేరే పేరు, రూపం ఇవ్వం. మీరు మమ్మల్ని 'సహజీవనం' చెయ్యమన్నారు కానీ మేము 'స్నేహ జీవనం' చేస్తాము” అన్నాడు.
రష్మీ, రాజీవ్ ఇద్దరూ ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు.
రష్మి, మాధవిని పట్టుకుని "సారీ అమ్మా! మమ్మల్ని క్షమించు. మాకు మీ సంగతి తెలుసు కానీ, నువ్వు అన్నట్టు కొంతమంది అనే మాటలు విని మీకు వేరే బంధం ఏర్పడితే ఎవరూ అనవసరంగా మీ గురించి మాట్లాడరు కదా అనుకున్నాం.
మాకు మీరు, మీ సంతోషమే ముఖ్యం” అంది.
రాజీవ్ కూడా శ్రీనాథ్ తో "నాన్నా! నీకు అమ్మ అంటే ఎంతిష్టమో తనని ఎంతగా ప్రేమించావో తెలుసు, ఒక వేళ మీ మనసులో ఈ అభిప్రాయం ఉన్నా మా కోసం మీరు వెనక్కి తగ్గుతున్నారా అనిపించింది.
నన్ను క్షమించు. మీరు సహజీవనం చేస్తారా స్నేహజీవనం చేస్తారా మాకు అనవసరం. మీ ఇద్దరి అభిమానం, ఆప్యాయత మా నలుగురికీ కావాలి" అన్నాడు కళ్ళు చెమరిస్తుండగా.
"ఇదుగో, మేము ఉండేది ఇంక నాలుగు రోజులే, మా జీవనాలు మేము జీవిస్తాము కానీ, మమ్మల్ని మా శ్రీతో ఆడుకోనివ్వండి" అంటూ మాధవి పాపాయిని ఎత్తుకుని "రాజా! నువ్వు ఏ పేరు పెట్టిన సరే నాకు మాత్రం ఇది నా శ్రీ నే" అంటుంటే, పాపాయి మాధవిని చూసి 'ఔను'అన్నట్టుగా గలగలా నవ్వింది.
రచన: శ్రీపతి లలిత.