ఈనాడు ఆదివారం అనుబంధంలో 18.8.24 న వచ్చిన కథ.
నా కొద్దీ మంచితనం బాబూ!
"మా వైదేహి బంగారు తల్లి, పెద్దవాళ్ళంటే గౌరవం, చెప్పిన మాట వింటుంది" అత్తగారు పక్కింటి అమ్మమ్మగారితో అంటుంటే విని నిట్టూర్చింది వైదేహి.
ఈ 'మంచిది' అనిపించుకునే బలహీనత చిన్నప్పటి నుంచి మొదలైంది వైదేహికి.
అప్పటివరకు ఇంటి దగ్గర స్కూల్ లో చదివిన వైదేహిని, కొంచెం దూరంగా ఉన్నా పెద్ద స్కూల్ లో చేర్పించారు.
మొదటిరోజు టీచర్ ఇచ్చిన హోంవర్క్ మొత్తం చేసి, చెప్పిన పాఠం చదివి వెళ్లిన వైదేహిని క్లాసులో మెచ్చుకుంది టీచర్.
"అందరూ చూడండి, ఎంత చక్కగా మొత్తం హోంవర్క్ చేసింది, చెప్పిన పాఠం నేర్చుకుంది. క్లాప్స్ కొట్టండి అందరూ! వైదేహి, మంచి అమ్మాయి" అంటూ అందరిచేత చప్పట్లు కొట్టించింది టీచర్, ఆ చప్పట్లు, మెప్పులు వైదేహి బలహీనతగా మారాయి.
స్కూల్లో, ఆ తరవాత కాలేజీలో, వైదేహి ఉత్తమ విద్యార్ధిగా ఉండడానికే తాపత్రయపడింది.
తనతో చదివిన పిల్లలు, స్నేహితులు ఎప్పుడైనా క్లాస్ ఎగ్గొట్టి సినిమాకి వెళితే వైదేహి మాత్రం క్లాస్ అస్సలు మిస్ చెయ్యలేదు.
అలాగే ఉద్యోగంలో చేరాక కూడా, ఎప్పుడూ ఉత్తమ ఉద్యోస్తురాలిగానే పేరుపొందింది. అదే అదనుగా వేరేవాళ్లు, పనులు వైదేహి మీద వదిలేసి షాపింగ్ కి వెళ్లడం, ఏదో ఒక సాకుతో త్వరగా ఇంటికి వెళ్లడం గమనించినా, ఏమీ చెయ్యలేక కోపం దిగమింగుకునేది వైదేహి,
మంచివాళ్ళకి కోపం రాకూడదు కదా! అనుకుంటూ.
అలా, వైదేహి మంచితనము ఈ నోటా, ఆ నోటా పాకి, సాకేత్ కుటుంబానికి చేరింది.
అమ్మాయి బావుంది, ఉద్యోగం చేస్తోంది,అన్నిటికీ మించి, 'మంచిది' అని, అడిగి మరీ కోడలిగా తెచ్చుకున్నారు.
పెళ్ళైన వారానికే, వంటిల్లు అప్పచెప్పింది అత్తగారు తన మంచి కోడలికి,
ఆనందంగా స్వీకరించింది ఉత్తమ కోడలు వైదేహి.
పొద్దున్న లేచి అత్తగారికి, మామగారికి కాఫీ కలిపి, స్నానము చేసి, ఆవిడ పూజ కోసం అంతా రెడీచేస్తే, వైదేహి టిఫిన్, వంటా చేసే లోగా, ఆవిడ ఆరుకోట్ల దేవుళ్ళకి పూజ కానిచ్చేది.
కాలేజ్ కి వెళ్లే మరిదికి, ఆడపడుచుకి డబ్బాలు అందిస్తే అదేదో వైదేహికి ఉద్ధరింపు అన్నట్టే తీసుకుని వెళ్లేవారు.
తనకి, భర్తకి అన్నీ సర్ది బయలుదేరుతుంటే అత్తగారు "ఓ చుక్క కాఫీ ఇస్తావా!" అనేది.
"ఇప్పటికే లేటు అయ్యింది, నువ్వు ఆటోలో వెళ్ళిపో " అంటూ సాకేత్ వెళ్ళేవాడు కానీ,
"రోజూ ఇలా ఆఫీస్ కి వెళ్ళేటప్పుడు చివరి నిమిషం లో చెప్పడం ఏమిటి?" అని మాత్రం తల్లితో అనేవాడు కాదు.
సాకేత్ తల్లి మాత్రం కోడలు వచ్చాక హాయిగా ఎదురింటి వదినతో , పక్కింటి చెల్లెమ్మతో సినిమాలకు, గుళ్లకు, షాపింగ్ లకు బిజీగా తిరుగుతూనే ఉండేది.
ఆఫీస్ లో పని అయ్యి ఇంటికి వచ్చేసరికి, ఇల్లు అడ్డదిడ్డంగా ఉండేది. అది సర్దడం వంట చెయ్యడం అంతా వైదేహి బాధ్యతే అన్నట్టు, లేటుగా వస్తే ఇంటిల్లిపాదీ సణుగుతూనే ఉండేవారు.
ఇంట్లో పని తెమలడంలేదు అంటే, ఆఫీసులో వైదేహి మంచితనాన్ని ఆసరాగా తీసుకొని 'ప్లీజ్' అనే ఒక్క మాటతో పని మీద పడేసి పోయే గ్యాంగ్, వైదేహి మీద అదనపు భారం పెడుతూనే ఉన్నారు.
ఇంట్లో, బయటా పని ఎక్కువై, ఎవరినీ ఏమీ అనలేక ఒక రకమైన డిప్రెషన్ లోకి వెళ్ళిపోతోంది వైదేహి, అయినా పట్టించుకునేవారు లేరు.
ఆఫీసులో, వైదేహికి ముందునుంచి ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడకుండా, అప్పగించిన పని చెయ్యడం అలవాటు. ఇప్పుడు పని ఇదివరకటిలాగా గబగబా అవడంలేదు, దానితో పై అధికారులు ఏదో ఒకటి అంటున్నారు. అది తన పని కాదు, అని చెప్పలేక, ఎవరినీ ఏమీ అనలేక నిశ్శబ్దంగా బాధపడుతోంది.
అదుగో అప్పుడే, వైదేహి పాలిట దేవతలా వచ్చింది 'గీత' ఆఫీస్ మేనేజర్ గా.
వయసులో, అనుభవంలో, సీనియర్ అవడంతో, వచ్చిన వారంలోనే అన్నీ గమనించింది.
ఉన్న నలుగురు ఆడవాళ్ళలో, వైదేహి తప్ప, మిగిలిన వాళ్ళు పని ఎగ్గొట్టి తిరగడం, అదంతా ఆ అమ్మాయి నోరెత్తకుండా పూర్తి చెయ్యడం, అందరూ, అయిదు అవగానే వెళ్లిపోతుంటే, వైదేహి మాత్రం ఆరున్నర దాకా కదలకుండా చెయ్యడం,
" థాంక్స్ వైదేహీ! నువ్వెంత మంచిదానివి" అని వాళ్ళు
అనగానే ఆ అమ్మాయి మొహాల్లో మెరుపు, గీత కళ్ళు దాటివెళ్ళలేదు.
ఒక నెల అవగానే, గీత మొదటగా అందరి సీట్లు మార్చింది.
ప్రతివాళ్లూ ఫైల్ అవగానే వచ్చి దాని వివరణ ఇవ్వాలి అని చెప్పింది,
దానితో, అందరూ ఎవరి పని వాళ్లే చెయ్యడం మొదలు పెట్టారు.
వైదేహి మంచి పనిమంతురాలు, ఇలాంటి వాళ్ళు మేనేజర్ గా ఉండాలి అనుకుంది గీత.
ఒకరోజు వైదేహి లంచ్ కి కూర్చుంటే, గీత కూడా డబ్బా తీసుకుని వైదేహి దగ్గర కూర్చుంది.
"అందరితో కూర్చుని తినకుండా ఇలా ఒంటరిగా కూర్చున్నావేమిటి వైదేహి?" అంటూ డబ్బా తీసింది.
ఒక నవ్వు నవ్వింది వైదేహి. "నీకు నవ్వు తప్ప మాటలు రావా?"
అన్న గీతతో "అనవసరమైన మాటలు మాట్లాడే కంటే ఇదే మంచిది కదా గీతగారూ!"
అంది. "నువ్వు మంచి పనిమంతురాలివి, ప్రమోషన్ ఎందుకు తీసుకోలేదు?" అడిగింది గీత. ఈ ప్రశ్నని ఏమాత్రం ఊహించని వైదేహి ఆశ్చర్య పోయింది.
"ఉద్యోగంలో చేరాక అదే స్థాయిలో ఉండిపోకూడదు, మనకి జీవితంలో ఎదుగుదల అనేది చాలా ముఖ్యం, అది ఉద్యోగంలోకానీ, జీవితంలో కానీ.
కూతురి నుంచి భార్యగా, కోడలిగా తరవాత అమ్మగా ఎదగాలి. అలానే ఉద్యోగంలో కూడా, అప్పుడే నీకు తృప్తి ఉంటుంది. నీ తరవాత చేరిన వాళ్ళు, నిన్ను దాటి పోతుంటే నీకు ఆత్మవిశ్వాసం పోతుంది" అన్న గీత వేపు ప్రశంస గాచూసింది.
"మీరు మాట్లాడుతుంటే నా పై అధికారిలా లేదు, మా అక్క మాట్లాడినట్టు ఉంది, మీరు అన్నదాన్ని నేను ఆలోచిస్తాను" అంటున్న వైదేహితో,
"వచ్చే నెలలో ప్రమోషన్ పరీక్షకి ప్రకటన వస్తుంది తప్పక ప్రయత్నించు" అని వెళ్ళింది గీత.
ఇంటికెళ్ళగానే సాకేత్ తో ప్రమోషన్ పరీక్ష గురించి సంతోషంగా చెప్పింది.
అతను వెంటనే "ట్రాన్స్ఫర్ ఉండదుగా" అన్నాడు.
"ఉహు!" అంది.
"అయితే చదువు" అన్నాడు కానీ, అసలు వైదేహికి టైం ఎక్కడ అనే గ్రహింపు లేదు.
పని అంతా మీద వేసుకుని చేస్తుంటే చదివే టైమే ఉండడంలేదు.
అత్తగారు పక్క వాళ్లతో "మా కోడలు మంచిపిల్ల, నన్ను అసలు పని ముట్టుకోనివ్వదు"
అనడం, ఆడపడుచు పల్లవి
"మా వదిన ఎంత మంచిదో తెలుసా! నేను ఏమి అడిగితే అది చేస్తుంది"
అని గర్వంగా చెప్పడం ఇప్పుడు అంత సంతోషం ఇవ్వడంలేదు వైదేహికి.
"నాకొద్దీ మంచితనం కితాబు, నేను పరీక్ష కి చదవాలి" అనుకుని నీరసంగా వెళ్ళింది ఆఫీసుకి.
ఈసారి వైదేహి వచ్చి గీతతో "మీతో లంచ్ టైములో కొంచెం మాట్లాడాలి" అంది.
"సరే" అని గీత లంచ్ టైంలో వచ్చి కూర్చుంది, సంగతి చెప్పింది వైదేహి.
విని నవ్వింది గీత. "నేను నీ బలహీనత గమనించాను వైదేహి! నీకు మంచిదానివి అనిపించుకోవాలని తాపత్రయం. నువ్వు ఒకటి గ్రహించు, ప్రపంచం మొత్తానికి ఎప్పటికీ నువ్వు మంచిదానివి కాలేవు, నిన్ను మంచి అని పొగిడేవాళ్లు ఎప్పుడైనా నీకు ఉపయోగపడ్డారా? లేక నిన్ను ఉపయోగించుకున్నారా? ఆలోచించు.
ముందు నీ మంచి చూసుకో, తరవాత నీ కుటుంబం మంచి చూడు, తరవాతే ఎవరైనా.
నువ్వు ప్రమోషన్ తెచ్చుకుంటే, నీ కుటుంబం అందరికీ ఆర్ధికంగా ఉపయోగం. అలాంటపుడు వాళ్ళందరూ నీకు సహకరించాలి, కాదంటే నువ్వు నెమ్మదిగా చెప్పి ఒప్పించు.
వాళ్ళు సహాయం చెయ్యకపోతే నువ్వు ఎలా వాళ్ళని ఒప్పించాలో నువ్వే ఆలోచించు" చెప్పింది గీత.
ఇంటికెళ్ళాక భోజానాలయ్యాక అందరూ ఉన్నప్పుడు నెమ్మదిగా ఆ ప్రస్తావన తెచ్చింది.
"అత్తయ్యగారూ! నాకు వచ్చేనెలలో ఆఫీస్ పరీక్షలు ఉన్నాయి, పొద్దున్న మాములుగా అన్నిపనులూ చేస్తాను, సాయంత్రం ఆఫీసులో చదువుకుని రావాలి. రాత్రి వంట ఈ నెల రోజులు మీరు పల్లవి సాయంతో కొంచెం చూసుకోండి " అంది.
"చూడమ్మాయి, గుళ్లో రేపటినుంచి ప్రవచనాలు, నేను వెళ్ళాలి, నాకు కుదరదు" అని అత్తగారు అంటుండగానే "నాకు రెండు నెలల్లో ఫైనల్ పరీక్షలు, నాకు ఇవన్నీ పెట్టకు వదినా!" అని లేచి వెళ్ళిపోయింది పల్లవి.
నిస్సహాయంగా భర్త వేపు చూస్తే, పేపర్ చాటున తల దాచుకున్నాడు అతను.
"నువ్వు మంచిదానివి అనిపించుకోవడం వల్ల నీకేమన్నా ఉపయోగమా?" అన్న గీత మాటలు గుర్తొచ్చాయి.
రాత్రంతా ఏడ్చి కళ్లన్నీ ఎర్రగా, మొహమంతా ఉబ్బి ఉన్న వైదేహిని ఆఫీసులో విచిత్రంగా చూసారు అందరూ.
"నాకీ మంచితనం వద్దు గీతగారు!" అని కళ్లనీళ్లు పెట్టుకున్న వైదేహిని నవ్వుతూ చూసి ఒక లెటర్ చేతికిచ్చింది గీత.
"మంచితనం నీ బలం కావాలి వైదేహీ! బలహీనత కాదు, దాన్ని ఎలా వాడుకోవాలో తెలుసుకో, మంచిగా ఉండద్దని ఎప్పుడూ,ఎవ్వరూ చెప్పరు. అది అవతలివాళ్ళు అస్త్రంగా వాడి,నిన్ను ఉపయోగించుకోకుండా చూసుకోవడం నీ చేతుల్లోనే ఉంది.
నీకు ఒక నెలరోజులు ట్రైనింగ్, ముంబై హెడ్డుఆఫీసులో వేశారు. ఒకవేళ వెళ్లకపోతే డిస్సిప్లినరీ యాక్షన్ తీసుకుంటారు" అంటున్న గీతని
ఆశ్చర్యంగా చూస్తున్న వైదేహితో "ఇది మంచి అవకాశం, నా స్నేహితుడు అక్కడ ఫాకల్టీ, అతనికి చెప్తే నీకు ట్రైనింగ్ వచ్చింది. ఈ టైములో అక్కడ ప్రమోషన్ పరీక్షకి తగ్గ ట్రైనింగ్ ఉంటుంది. ఇది నీకు సువర్ణావకాశం, మాములుగా అంటే మీ ఇంట్లో ఒప్పుకోరు కానీ, వెళ్లకపోతే చర్య తీసుకుంటారు అంటే, చచ్చినట్టు ఒప్పుకుంటారు" అంది గీత.
ఇంటికెళ్ళాక ఏమి మాట్లాడకుండా ఆ కాగితం సాకేత్ చేతికి ఇచ్చింది వైదేహి.
"ఇది ఏమిటి పరీక్ష అన్నావు? ఇప్పుడు ఈ ట్రైనింగ్" సందేహంగా అన్నాడు సాకేత్.
"నాకేమితెలుసు? ఇది తప్పదు, పరీక్ష ఎలానో తెలీదు, ఆ టైం కి ముంబైలోనే ఉంటాను, మరి రాయనిస్తారో లేదో, వెళ్లకపోతే డిసిప్లినరీ యాక్షన్ అంటున్నారు మా మేనేజర్.
ఏదైనా తేడా వచ్చి, ఈ ఉద్యోగానికి ముప్పు వస్తే, మనం పల్లవి పెళ్లికోసం, మేడ మీద కట్టడం కోసం చేస్తున్న పొదుపు ఆగిపోతుంది. నెల రోజులు నేను లేకుండా మీకు అందరికీ కష్టం. పాపం అత్తయ్యగారు ఇంట్లో పని చెయ్యలేరు, పల్లవి చదువుకోవాలి, ఏమి చెయ్యాలో నాకు పాలుపోవడంలేదు, పోనీ ఉద్యోగం మానెయ్యనా?" మంచితనము ముసుగు వేసుకుని బాధగా అంటున్న వైదేహిని,
అప్పటికే బయట తచ్చట్లాడుతున్న అత్తగారు గభాలున రూమ్ లోకి వచ్చి ఆపారు.
"నువ్వు లేకపోతే ఇల్లు నడవదా ఏమిటి? నెలేగా! అందరం తలా ఒక చెయ్యి వేస్తాం, నువ్వు అదేదో ట్రైనింగ్ కి వెళ్ళు" అని ఆర్డర్ లాంటి సలహా ఇచ్చింది.
"మీరందరూ ధైర్యం చెప్తే అలాగే అత్తయ్యా" వినయంగా అంది వైదేహి.
"మంచితనానికి, మంచి అనిపించుకోవాలనే తాపత్రయానికి తేడా తెలుసుకో, ఎక్కడ ఎలా పనులు చేయించాలో తెలీకపోతే నువ్వు ఆఫీసులో మేనేజర్ పోస్ట్ కి, ఇంట్లో కోడలి పోస్టుకి పనికిరావు" అన్న గీత మాట గుర్తుతెచ్చుకుని
"నాకొద్దీ మంచితనం కితాబు బాబూ! నేను కొంచెం గడుసుతనం నేర్చుకుంటా!" అనుకుంది వైదేహి.
రచన: శ్రీపతి లలిత,