ఓ నాన్న కథ

ఈనాడు ఆదివారం అనుబంధం • 11 Jan 2026 • 👁 2 views
11-1-26 ఈనాడు ఆదివారం అనుబంధంలో వచ్చిన కథ.
ఓ నాన్న కథ.


“చదివేటప్పుడు సరిగ్గా చదవమంటే, అయ్యగారికి కోపాలు. ఇప్పుడు ఈయన గారి ఇంజినీరింగ్ సీట్‌కి అయిదు లక్షలు డొనేషన్ ఎవడు కడతాడు? నా దగ్గర డబ్బులు లేవు. తల్లీ, కొడుకు ఏం చేస్తారో చేసుకోండి” కోపంగా అని రూమ్‌లోకి వెళ్లాడు శ్రీనివాస్.

“నాకేం డొనేషన్ కట్టక్కర్లేదు, నేనూ ఏదో డిగ్రీలో చేరి ఈయనలాగానే బ్యాంకు క్లర్క్ కింద చేరతాను. అప్పుడు ఆయన కళ్లు చల్లబడతాయి” అంతకంటే కోపంగా బయటికి వెళ్లాడు ప్రవీణ్.

ఇద్దరి మధ్యా, ఎవరికి ఏం చెప్పాలో తెలీక, మౌనంగా ఉండిపోయింది సునీత.
శ్రీనివాస్, సునీతల ఏకైక కుమారుడు ప్రవీణ్.

శ్రీనివాస్ ఒక బ్యాంక్‌లో క్లర్క్. ప్రవీణ్ తెలివిగలవాడే, మంచి మార్కులతో ఇంటర్ పాస్ అయ్యాడు. ఇంజనీరింగ్ ఎంట్రన్స్‌లో మంచి ర్యాంక్ వచ్చింది. కానీ, ఏ రిజర్వేషన్ లేని కారణాన, ప్రవీణ్ అనుకున్న సబ్జెక్ట్‌లో, అనుకున్న కాలేజీలో, సీట్ రావడం కష్టం. అందుకే డొనేషన్ కట్టి చేర్చమని తండ్రిని అడిగాడు. పైగా “నువ్వు కట్టలేకపోతే, అప్పు తీసుకో! నేను ఉద్యోగం చేసి అప్పు తీర్చుకుంటా!” అని కూడా చెప్పాడు.

అసలే ప్రవీణ్‌కి ఇంకా మంచి ర్యాంక్ రాలేదని కోపంగా ఉన్న శ్రీనివాస్, ఈ మాటలకి మండిపడ్డాడు. రెండుమూడు రోజులుగా, ఇంట్లో తండ్రీ, కొడుకు, మధ్య పెద్ద వాగ్యుద్ధాలు జరిగాయి.

ఊరుకోమంటే కొడుక్కి కోపం, వదిలేయమంటే భర్తకి కోపం. మధ్యలో సునీత నలిగిపోయింది.
ఏదైతేనేం, మొత్తం మీద డొనేషన్ కట్టి తనకు కావాల్సిన కాలేజీలో, కావాల్సిన గ్రూప్‌లో చేరాడు ప్రవీణ్.

“ఇప్పుడన్నా సరిగ్గా చదివేడవమను, లేకపోతే ఉద్యోగం రాదు. ఏదో క్యాంపస్ రిక్రూట్మెంట్ ఉంటుందని, తలతాకట్టు పెట్టి డబ్బులు తెచ్చాను! చెప్పు నీ సుపుత్రుడికి!” కోపంగా అన్నాడు శ్రీనివాస్.
“దిగులు పడద్దను! ఆ తలని తాకట్టు నుంచి నేనే విడిపిస్తాను! చెప్పు మీ ఆయనకి!”
రోషంగా అన్నాడు ప్రవీణ్.

“భగవంతుడా! ఈ తండ్రీకొడుకులకు ఎప్పుడు సామరస్యం కుదురుస్తావు తండ్రీ!” ప్రార్థించింది సునీత. దేవుడు సునీత ప్రార్థన వినలేదు. ప్రవీణ్‌కి తండ్రి మీద, ఒకటికాదు, చాలా ఫిర్యాదులు ఉన్నాయి.

అతని స్నేహితుడి తండ్రి కూడా బ్యాంకు క్లర్కే. వాళ్ళకి రెండంతస్తుల ఇల్లు, కారు ఉన్నాయి.
అతని తండ్రి, వాళ్ల అబ్బాయికి ఇంజనీరింగ్ లో చేరగానే మోటార్ సైకిల్ కొన్నాడు.
అదే తనకి, తండ్రి కాలేజ్ బస్ పాస్ కొన్నాడు.

అందరూ వీకెండ్ వస్తే పార్టీలకు వెళ్తారు, తనకి డబ్బులు ఇవ్వరు… ఇలా అన్నీ అసంతృప్తులతోనే చదువు పూర్తి చేసాడు.
ప్రవీణ్ టార్గెట్ ఒక్కటే. బాగా చదివి మంచి ఉద్యోగం తెచ్చుకుని ఇంటినుంచి, నాన్న నుంచి దూరంగా వెళ్ళాలి.

ప్రతీదానికీ విసుగు, కోపం ఉన్న నాన్న కోసం, ఇష్టమైన అమ్మని కూడా వదలడానికి సిద్ధపడ్డాడు ప్రవీణ్.
క్యాంపస్ రిక్రూట్మెంట్‌లో మంచి కంపెనీకి సెలెక్ట్ అయ్యాడు, వాళ్ళు ముంబై పోస్టింగ్ ఇచ్చారు.

ప్రవీణ్ వెళ్ళేటప్పుడు, సునీత అతని కోసం చిరుతిళ్ళు చేసి, “జాగ్రత్తగా ఉండు నాన్నా! అక్కడ వంటకి, పనికి మంచి మనుషులు దొరుకుతారట, పెట్టుకో, ఇబ్బంది పడకు!” చెప్తుంటే మధ్యలో శ్రీనివాస్ అడ్డుకుని,

“ఇదిగో! డబ్బులు బాగా ఆడుతున్నాయని, వెధవ్వేషాలు వేయొద్దని చెప్పు.
తాగుళ్లు, సిగరెట్లు అలవాటు చేసుకోవద్దని చెప్పు, అడ్డమైన గడ్డీ తిని, కుడితి లాగా మందుకొడితే, ఎందుకూ పనికి రాకుండా పోతాడు. పెళ్ళి, పెటాకులు లేకుండా అఘోరించాలి!” వినేవాళ్ళకి అవి తిట్లో, జాగ్రత్తలో అర్థం కావు.

“అవును! అదే పని! ఉద్యోగం చెయ్యకుండా తాగి, అడ్డమైనవి తిని, రోడ్డు మీద పడి చస్తాను! మీరొచ్చి ఈడ్చేద్దురుగాని!” కోపంగా అన్నాడు ప్రవీణ్.

“ఛీ!ఛీ! ఏం మాటలురా అవి? శుభమా అని ఉద్యోగానికి వెళ్తూ!” అన్న తల్లితో “ఆ సంగతి నీ మొగుడికి చెప్పు!” అన్న కొడుకుని ఏమనలేక, “ఎందుకండీ వాడు వెళ్ళేటప్పుడు ఇలాంటి అశుభం మాటలు!” మొగుడిమీద అరిచింది సునీత.

“నేను నోరెత్తితే తప్పు!” రుసరుసలాడుతూ లోపలికి వెళ్లాడు శ్రీనివాస్.
మొహం మటమటలాడిస్తూ ప్రవీణ్ బయటికి వెళ్లాడు.
కళ్ళనీళ్లతో సునీత కూర్చుండి పోయింది.

ప్రవీణ్ ఉద్యోగంలో చేరి ఇల్లు తీసుకున్నాక, తల్లికి మెసేజ్ పెట్టాడు. సునీత ఫోన్ చేసినప్పుడు మాట్లాడేవాడు, తండ్రి గురించి కూడా అడిగేవాడు కాదు. శ్రీనివాస్‌ని మాట్లాడమంటే, అతనూ మాట్లాడేవాడు కాదు.
కరవమంటే కప్పకి కోపం, వదలమంటే పాముకి కోపం అన్నట్లు, భర్తకి, కొడుకుతో ప్రేమగా మాట్లాడమంటే,”గారాబం చేసి నెత్తిమీద పెట్టుకుంటే ఎందుకూ పనికిరాడు!” అంటాడు.

“నాన్నతో నెమ్మదిగా మాట్లాడరా!” అని కొడుక్కి చెప్తే, “నేను అసలు మీ కొడుకునేనా? రోడ్డు మీద దొరికితే తీసుకొచ్చారా? నాన్న ప్రవర్తన చూస్తే, నాకెప్పుడూ అనుమానమే!” అంటాడు ప్రవీణ్.
ఈ తండ్రీ కొడుకులని, ఎలా కలపడం అనేది, ఒక పెద్ద ప్రశ్నగా మారింది సునీతకి.

సునీత తమ్ముడు “బెంగుళూరులో విల్లా కొనుక్కున్నాను, గృహప్రవేశానికి రండి” అని ఆహ్వానం పంపాడు.
శ్రీనివాస్,” సెలవ ఎక్కువ దొరకదు, ఆరోజుకి నేను వస్తాను, నువ్వు ముందు వెళ్ళు” అన్నాడు సునీతని.
తల్లితో గడిపినట్లు ఉంటుందని, సునీత నాలుగురోజుల ముందు బెంగళూరు వెళ్ళింది.

ఎన్నాళ్ళ తరవాతో ఒక్కత్తి రావడంతో సునీత, తల్లి పక్కనే పడుకుని కబుర్లు చెప్పింది. ఆ మాటల్లో శ్రీనివాస్, ప్రవీణ్ కబుర్లు వచ్చాయి.
“ప్రవీణ్, అసలు వాళ్ల నాన్నని లెక్కచెయ్యడమ్మా! ఆయన కూడా అంతే! పుల్ల విరుపుగా మాట్లాడతారు, ఇద్దరూ ఉప్పు, నిప్పులా ఉన్నారు. ఏం చెయ్యాలో తోచడం లేదు” తల్లితో గోడు వెళ్ళబోసుకుంది.
సునీత తల్లి విశాల, శ్రీనివాస్‌కి మేనమామ భార్య. ఆమెకి అల్లుడంటే ప్రేమ, అభిమానం.

ప్రవీణ్ కూడా అమ్మమ్మ, మామయ్య కుటుంబంతో గడిపినట్లు ఉంటుందని ముందుగా వచ్చాడు. ఉద్యోగస్తుడైన మనవడిని చూసి మురిసిపోయింది విశాల. మేనమామ కుటుంబం అందరూ ఆప్యాయంగా పలకరించారు. కొడుకుని చూడగానే ప్రేమ ముంచుకొచ్చింది సునీతకి.

“ఎలా ఉన్నావురా! ఫోన్ చేస్తే ఎత్తవు, భోజనం బావుందా? ఆఫీసులో అంతా బావుందా? ఆరునెల్లు అయింది వెళ్లి, అలవాటుపడ్డావా?” ప్రశ్నలు గుప్పిస్తున్న సునీతని, “ఆగవే! వాడిని ఊపిరి తీసుకోనివ్వు!” “ఇంతే అమ్మమ్మా! నీ కూతురికి హడావిడి, అల్లుడికి కోపం!” అన్నాడు ప్రవీణ్.

“అబ్బో! నా కూతురికీ, అల్లుడికీ వంకలు పెట్టేంత పెద్దవాడివి అయ్యావురా!” నవ్వుతూ మనవడి బుగ్గలు నొక్కి, “పద! భోంచేద్దువుగాని!” అంటూ లోపలికి తీసుకెళ్లింది.
అమ్మమ్మ, పక్కనే కూచుని, కబుర్లు చెప్తుంటే, సుష్టుగా తిన్న ప్రవీణ్‌తో, “ఇవాళ నా దగ్గర పడుకోరా! మళ్లీ ఎప్పడు వస్తావో” అంది విశాల.

చిన్నప్పుడు, అమ్మమ్మ పక్కన పడుకుని, కథలు విన్న రోజులు గుర్తొచ్చి “అలాగే” అన్నాడు ప్రవీణ్.
పక్కన పడుకున్న మనవడిని, ఉద్యోగం విశేషాలు అడిగి తెలుసుకుని, “నీకు ఒక కథలాంటి నిజం చెప్తాను, ఇది నాకు బాగా తెలిసిన వాళ్ళది” అంది విశాల.
“ఊ!”
“మాకు తెలిసిన కుటుంబంలో ఒకాయన, పేరు రామం అనుకో, ఆయన భార్య సీత, తల్లి,తండ్రి , ముగ్గురు పిల్లలతో ఉండేవాడు. ఆయనకి ప్రభుత్వ ఉద్యోగం ఉంది.

ఆయన పెద్ద కొడుకు… పేరు వెంకటేష్ అనుకుందాం, చాలా తెలివిగలవాడు, లెక్కలు బ్రహ్మాండంగా చేసేవాడు. అప్పట్లోనే, మేము అతనికి ఐఐటీలో సీటు వస్తుందని అనుకున్నాం. సరిగ్గా వెంకటేష్ ఇంటర్ రెండో సంవత్సరంలో ఉండగా, రామం అకస్మాత్తుగా చనిపోయాడు.

ఇంటికి ఆధారం పోయేసరికి అందరూ షాక్ తిన్నారు. రామం తల్లితండ్రులు ముసలివారు, సీత
పెద్దగా చదువుకోలేదు. ఇల్లు గడవాలంటే తప్పదని, అప్పుడే పద్దెనిమిది నిండిన వెంకటేష్, చదువు మానేసి, తండ్రి ఆఫీస్ వాళ్ళు ఇచ్చిన గుమస్తా ఉద్యోగంలో చేరాడు. రామం పెద్ద స్థాయిలో ఉండి చనిపోయినా, వెంకటేష్ ఇంటర్ మాత్రమే పూర్తి చేశాడు కనక, అతనికి గుమస్తా ఉద్యోగం ఇచ్చారు. ఐఐటీలో చేరి, పెద్ద ఇంజినీర్ అవ్వాలన్న కల, మొగ్గలోనే తునిగిపోయింది.

తల్లికి వచ్చే పెన్షన్, వెంకటేష్ జీతంతో అరడజను మంది పొట్ట నిండాలి.
తను ఎలాగో చదవలేకపోయానని, తమ్ముడు సురేష్‌ని ఇంజినీరింగ్ చదివించాడు.
చెల్లి రాధ పెళ్లి కూడా, మంచి సంబంధమని, అప్పు చేసి పెళ్ళి చేశారు. వెంకటేష్‌కీ పెళ్లయింది. అతని భార్య బాగా నెమ్మదస్తురాలు. రామం తల్లితండ్రులు ఇద్దరూ కాలంలో కలిసిపోయారు.

సురేష్ ఉద్యోగంలో చేరినా,అన్నకి ఏమాత్రం సాయం చేయకపోగా, అన్నతో గొడవ పెట్టుకుని, వెంకటేష్ కుటుంబానికి ఏమీ చెయ్యలేదని, తల్లి పెన్షన్ అంతా తినేశాడని నానా గోల చేశాడు. సీత కూడా సురేష్ మాటలు నమ్మి, అతనితో వెళ్లింది.

వెంకటేష్ చేసిన సాయం, త్యాగం మర్చిపోయి సురేష్ , రాధ కూడా “ఏం చేశావు? నీ పినాసితనంతో మా కోరికలు ఏమీ తీర్చలేదు!” అన్నారు.
తన కల నెరవేరకుండా తండ్రి చనిపోవడం, బాధ్యతలు నెత్తిమీద పడడం, ఆర్థికంగా ఇబ్బంది, ఇంత చేసినా, తల్లి,తమ్ముడు,చెల్లి ఏమీ చెయ్యలేదని అనడం… వెంకటేష్ తన బాధ,ఉక్రోషం ఎక్కడ తీర్చాలో తెలియక, భార్య మీద కోప్పడేవాడు. ఆ భార్యకి అన్నీ తెలుసు కనక, ఏమీ అనేది కాదు.

అందరి దృష్టిలో అతను పీనాసివాడు, కోపిష్టి వాడయ్యాడు. బాధ్యతలు తీర్చడంతోనే, ఉన్న డబ్బులు ఖర్చయ్యి, ఆర్ధికంగా చితికిపోయాడు.

ఆ సమయంలో పుట్టిన కొడుకుని, విపరీతమైన క్రమశిక్షణలో పెంచాడు.
గారాబం చేస్తే చదవడని భయం. చదవకపోతే తనలాగా మిగిలిపోతాడని భయం. డబ్బు ఎక్కువ ఇస్తే చెడిపోతాడని భయం. ప్రేమ, అభిమానం, ఎలా వ్యక్తం చెయ్యాలో తెలీని అతను,కొడుకుని కూడా ఎప్పుడూ కోప్పడడమే! తండ్రికి తనంటే ఇష్టంలేదనుకున్న కొడుకు కూడా, వెంకటేష్ అంటే ద్వేషం పెంచుకున్నాడు.

తండ్రీ, కొడుకూ, ఇద్దరూ మంచివాళ్లే, ఇద్దరికీ ఒకరిమీద ఇంకొరికి ప్రేమ ఉంది, అది చెప్పడం చేతకాక ఒకరి మీద ఒకరు కోపంతో ఉంటూ మధ్యలో, ఆ పిచ్చితల్లిని ఏడిపిస్తున్నారు…” కన్నీళ్లతో చెప్తున్న విశాలని ఆపాడు ప్రవీణ్, “అమ్మమ్మా! నువ్వు
ఎవరి గురించి చెప్తున్నావు?” సగం అర్ధమయ్యి అడిగాడు.
“ఇంకెవరు? ఆ వెంకటేషే మీ నాన్న శ్రీనివాస్!” అంది విశాల.

“నువ్వు చెప్పింది నాన్న గురించా? మరి నాకు ఎందుకు ఇదంతా తెలియకుండా పెంచారు?”.

“ఏమని చెప్తారు? ఇవన్నీ చెప్తే, నీకు, మీ నానమ్మ మీద, బాబాయి, అత్తల మీద కోపం వచ్చి, అసలే తెగిపోతున్న బంధాలు ఇంకా తెగుతాయని భయం.

ఎన్నో కష్టాలు అనుభవించిన మీ నాన్నని, కన్నతల్లే అర్థం చేసుకోలేదు.
తియ్యగా మాట్లాడుతూ మోసం చేసేవారిని నమ్ముతారు కానీ, న్యాయం చెప్పినా, కోపంగా చెప్పేవారిని ఎవరూ నమ్మరు!” నిట్టూర్చింది విశాల.

“మీ నాన్న, నాకు అల్లుడు మాత్రమే కాదు, మేనల్లుడు కూడా. నాకు తెలుసు వాడి సంగతి. ఇతరుల సొమ్ము ఒక్క రూపాయి కూడా ఆశించనివాడు… భగవంతుడు కొంత అన్యాయం చేస్తే, రక్తసంబంధం ఉన్నవాళ్లు ఇంకొంత అన్యాయం చేశారు” బాధగా అంది విశాల.

ప్రవీణ్ మౌనంగా ఉండిపోయాడు.
గృహప్రవేశానికి ఇంకో రెండురోజులుంది. అందరూ ఎవరి పనుల్లో వాళ్లు బిజీగా ఉన్నారు, తను చేసే సాయం ఏమీ లేకపోవడంతో, సునీత కూడా, హాయిగా కూర్చుని తల్లితో కబుర్లు చెప్తోంది. ప్రవీణ్ వచ్చి,
“అమ్మా! నాకు చిన్న పనుంది బజార్లో, నువ్వు కూడా రా!” తల్లితో చెప్పి, “అమ్మమ్మా! మేము వచ్చేసరికి లేట్ అవచ్చు, బయట తినేస్తాం!” అన్నాడు.

అక్కడంతా మంచి షాపింగ్ సెంటర్. ప్రవీణ్ పెద్ద బట్టల షాప్ లోకి తీసుకెళ్లాడు.
“అమ్మా! మీరు మామయ్య వాళ్ళకి బట్టలు పెట్టాలి కదా? కొన్నారా?” కొడుకు అడిగిన ప్రశ్నకి ఖంగుతింది.
“నాన్న అయిదువేలు చదివిద్దాము అన్నారు. ప్రయాణం ఖర్చులు ఇంకో అయిదు వేలు అవుతాయి. అంతకంటే పెట్టడం కష్టం” సునీత మాటలకి, “ఇంతకుముందు వేరు, ఇప్పుడు వేరు… నేను సంపాదిస్తున్నాను, మీరు లెక్కలు చూడక్కర్లేదు, అమ్మమ్మకి, అత్తయ్యకి మంచి చీరలు తీసుకో, నాయనమ్మకి కూడా ఒక చీర తీసుకో!” ఆశ్చర్యంగా చూసింది కొడుకుని.

అయిదేసి వేలు పెట్టి మూడు చీరలు కొన్నాక, “ఇంకా ఖరీదైన చీరలు చూపించండి” సేల్స్ గర్ల్ తో అన్నాడు. “ఇంకెవరికి?” అంది సునీత. “అందరికీ కొని, నీకు కొనద్దా?” అన్న కొడుకుని చూసి కన్నీళ్ళు వచ్చాయి సునీతకి. “పెద్దవాడివయ్యావురా!” అంది ప్రేమగా.

“ఆ! మరి… ఎప్పుడూ చిన్నగా ఉండిపోతారా ఏంటి?” నవ్వుతూ, తెచ్చిన చీరల్లో రెండు, మూడు పక్కనపెట్టి “ఇందులో నచ్చినవి తీసుకొమ్మా!” వాటి ధర చూసిన సునీత “అమ్మో! పదివేలా! వద్దమ్మా! ఇందాకటి రేంజ్ లోనే చూపించు!” “నువ్వు నీకు నచ్చింది తీసుకో! లేదంటే నాకు నచ్చింది తీసుకుంటా!” ప్రవీణ్ మాటలకు తనకి నచ్చిన పట్టు చీర తీసుకుంది.
“ రేపు ఇదే కట్టుకో!” అంటే తల ఊపింది.

అక్కడనుంచి మాల్‌కి వెళ్లి శ్రీనివాస్‌కి, సునీత తమ్ముడికి బట్టలు తీసుకున్నారు.
అన్ని చోట్ల క్రెడిట్ కార్డ్ ఇచ్చాడు ప్రవీణ్. సునీత భయపడుతూ అడిగింది, “నీ అకౌంట్‌లో డబ్బులు ఉన్నాయిగా?” అని. “మీ పెంపకంలో పెరిగానమ్మా! డబ్బు జాగ్రత్త లేకుండా ఎలా ఉంటుంది?”

ఇద్దరూ బయట హోటల్‌కి వెళ్లి లంచ్ చేశారు. చాలా రోజుల తర్వాత, సునీతకి, కొడుకుతో అంతసేపు గడపడం చాలా సంతోషంగా అనిపించింది. అదీ కాక ప్రవీణ్ మాటల్లో తండ్రి ప్రస్తావన వచ్చినప్పుడు ఇదివరకటిలాగా కోపం బదులు, ప్రేమ కనిపించింది.

వీళ్లు బజార్‌కి బయలుదేరిన కాసేపటికి, శ్రీనివాస్ అత్తగారింటికి చేరాడు.
చాలా రోజుల తరవాత వచ్చిన మేనల్లుడిని, ఆప్యాయంగా పలకరించింది విశాల.
“అల్లుడుగా కాకుండా, మేనల్లుడిగా రావచ్చు కదా శ్రీనూ! ఎన్నిరోజుల తర్వాత వచ్చావు?” పలకరించిన అత్తయ్యకి ఒక నవ్వు సమాధానంగా ఇచ్చి “సునీత ఏదీ?” అన్నాడు.

“ఏమో! తల్లి, కొడుకు, బజార్‌కి వెళ్లారు. భోజనం బయట చేస్తామన్నారు, నీకు పెడతాను, తిని కాస్త రెస్ట్ తీసుకో!” అన్నది. ‘తను ఎప్పడు వచ్చేది కూడా సునీతకి చెప్పలేదు, అందుకే వెళ్లి ఉంటుందని’ ”సరే!” అని భోజనానికి కూర్చున్నాడు.

అల్లుడితో పిచ్చాపాటి మాట్లాడి, “శ్రీనూ! నేను నీకు అత్తగారిగా చెప్పడంలేదు, అత్తయ్యగా చెప్తున్నాను. కోపం తెచ్చుకోకు, నింపాదిగా ఆలోచించు. భగవంతుడు నీకు న్యాయం చెయ్యలేదు, నీ స్వంత వాళ్లు అన్యాయం చేశారు. ఆ ఉక్రోషం, కోపం, నీ భార్య మీద, కొడుకు మీద, ఎందుకు చూపించాలి? ఇప్పుడు, ఈప్రపంచంలో నీకంటూ ఉన్నది వాళ్ళిద్దరే! సునీత నిన్ను అర్థం చేసుకుని మెలుగుతోంది.

ప్రవీణ్‌ది ఉడుకు రక్తం. పురాతన కాలంలోనే, భారవి, తండ్రి తనని మెచ్చుకోలేదని ఆయన మీద కోపం పెంచుకున్నాడు.
నీ కొడుకుని మరో భారవి కానియ్యకు! రోజులు మారాయి, మనమూ మారాలి, నేను, నా పిల్లలతో “మీరంటే నాకిష్టం!” అనలేదు, నా ప్రవర్తనతో అర్థం అయ్యేట్లు చెప్పాను.

ఇప్పుడు పిల్లలకి, అన్నీ మాటల్లో చెప్పాలి. నువ్వు నీ అసంతృప్తి, భయాల నుంచి బయటపడు. నీ కొడుకంటే ప్రేమని బాహాటంగా చూపించకపోయినా, వాడిని, సునీతని, అందరిముందూ కోప్పడటం మానేయి. మొగుడు, ఇల్లాలిని తిడితే, ముష్టివాడు కూడా తిడతాడని ఒక మోట సామెత!” అల్లుడిని మెత్తగా కోప్పడింది విశాల.

ఒక్క మాట కూడా మాట్లాడకుండా, భోజనం చేసి లేచాడు శ్రీనివాస్.
కొడుకు దూరం వెళ్ళాక, ఆ లోటు బాగా తెలిసింది శ్రీనివాస్‌కి. ఎదురుగా ఉన్నప్పుడు విసుక్కుని,తిట్టానని కూడా బాధ పడ్డాడు. అదే మాట అత్తయ్య చెప్తే ‘నిజమే!’ అనిపించింది.

పడుకుని లేచేసరికి ప్రవీణ్, సునీత వచ్చారు.
“ఎంతసేపైంది నాన్నా వచ్చి? ఎలా ఉన్నారు?” తనని చూడగానే, చిన్న పిల్లాడిలా పరిగెత్తుకొచ్చిన ప్రవీణ్‌ని చూసి కళ్ళు చెమ్మగిల్లాయి.

“మధ్యాహ్నం వచ్చాను, నువ్వు ఎలా ఉన్నావు? నీ జాబ్ ఎలా ఉంది?” ప్రేమగా, ఒకరిని ఒకరు పలకరించుకుంటే, ఆశ్చర్యంగా చూసి తల్లి వంక చూసిన సునీతకి, నవ్వుతూ కళ్ళతో సమాధానం చెప్పింది విశాల.
తెచ్చిన బట్టలు అందరికీ చూపించేసరికి, అందరూ సంతోషపడ్డారు.

“చాలా బావున్నాయి బట్టలు, మంచి ఖరీదైనవి తెచ్చాడు మా మేనల్లుడు” సంతోషపడ్డారు సునీత తమ్ముడు, మరదలు. “ నా మనవడు నాకు మంచి చీర కొన్నాడే సునీతా!” గృహప్రవేశానికి ఇదే కట్టుకుంటా! అంది విశాల చీర చూసి మురిసిపోతూ.

“నాకెందుకురా ఇప్పుడు కొత్త బట్టలు!” అన్న తండ్రితో, అదేంటి నాన్నా! మీకు లేకుండా ఎలా? మీకు ఈ నీలం ఇష్టం కదా! అందుకే ఈ షర్ట్ తెచ్చాను” అన్న ప్రవీణ్‌ని చూస్తూ, “నీకేంటి బావా! ఎదిగొచ్చిన కొడుకున్నాడు. నిశ్చింతగా ఉండచ్చు” అన్నాడు సునీత తమ్ముడు.

“చాలా బావుంది నాన్నా! రేపు వేసుకుంటాను” కోప్పడకుండా చెప్తున్న తండ్రిని ప్రేమగా హత్తుకున్నాడు ప్రవీణ్.
అది చూసి సునీత కళ్లు ఒత్తుకుంటే, విశాల తృప్తిగా నవ్వింది.

ఇదీ నా స్వీయ రచన.
శ్రీపతి లలిత .