ఈనాడు ఆదివారం అనుబంధం 1-3-26
‘చిన్న మాట… ఒక చిన్నమాట.’
“గుడ్మార్నింగ్ అత్తయ్యా!” కొత్త కోడలు చెప్తుంటే, ఆశ్చర్యంగా చూసింది సునీత.
“అప్పుడే లేచి స్నానం చేసి రెడీ అయ్యావా శృతీ!” విరిసిన పువ్వులాగా ఉన్న కోడలిని చూస్తూ.
“అత్తయ్యా! నేను పిల్లల డాక్టర్‌ని, ఎనిమిదికల్లా పేషెంట్లను చూడడం మొదలుపెట్టాలి!” అంది.
“అయ్యో! నువ్వు ఇవాళే చేరిపోతావనుకోలేదమ్మా!
రెండు దోసలు వేస్తాను తినేసి వెళ్ళు” అంది సునీత నొచ్చుకుంటూ.
“అత్తయ్యా! మీరు టెన్షన్ పడకండి, నేను కాఫీ తాగి వెళ్తాను.
వారం నుంచి పిల్లలని చూడలేదుగా, చూసి, లంచ్‌కి వస్తాను.
కళ్యాణ్ కూడా ఆసుపత్రికి వెళ్లి వస్తాడు” నవ్వుతూ అంది శృతి.
కోడలి వేపు మురిపెంగా చూసింది సునీత. తెల్లగా సన్నగా, సన్నజాజి మొగ్గలా ఉంటుంది శృతి. కొత్తగా పెళ్లైందేమో, మెడలో మెరుస్తున్న పసుపుతాడు, మంగళసూత్రం, నల్లపూసలు, పాపిట్లో సింధూరం, అన్నిటి కంటే, చక్కటి నవ్వు ఆ అమ్మాయికి అలంకారం.
బయటికి వెళ్తుంటే, సునీత అత్తగారు, కామాక్షి, “ఏంటే పిల్లా! పదహారు రోజులు కాకుండానే వెళ్తున్నావ్?” అంది కొత్త మనవరాలిని చూస్తూ.
“తప్పదు అమ్మమ్మగారూ!” అంటూ వెళ్ళిపోయింది.
లంచ్ టైంకి అందరూ కూర్చున్నారు.
పేరుకి అందరూ అన్నమాటేగానీ, సునీతకి, అత్తగారికి, భర్తకి వడ్డించడమే సరిపోయింది.
“సునీతా! వంకాయ కూరలో ఉప్పు ఎక్కువైంది, అల్లం ఇంకొంచెం పడాలి, టమాటో పప్పులో తిరగమాత వేగలేదు” అత్తగారు అంటుంటే, “అవును! అమ్మ చెప్పింది కరెక్ట్!ఎన్నేళ్లయినా వంట రాదమ్మా, ఎంత చెప్పినా అంతే! మొద్దుమొహం” సునీత భర్త ప్రకాష్ అందుకున్నాడు.
కళ్యాణ్ వంచిన తల ఎత్తకుండా తింటున్నాడు.
ఇన్ని వంకలు పెడుతూ కూడా, టెన్నిస్ బాల్ అంత ముద్దలు, గుటుకు,గుటుకుమని కామాక్షి తింటుంటే, వేళ్ళు నాక్కుంటూ తింటున్నాడు ప్రకాష్.
అసలు ఏమీ పట్టనట్టు సునీత, “ఇంకొంచెం కూర వెయ్యనా శృతీ! నా వంటలు నీకు కొంచెం అలవాటు అవ్వాలి, మీ అమ్మ వంటలా ఉండదు!” అంది. “అవును అత్తయ్యా! మా అమ్మ వంటలా లేదు, మా అమ్మకి వంట రాదు, చాలామటుకు నాన్నే చేస్తారు!” నవ్వుతూ అంది.
“హేమిటీ? ఆడంగిలాగా మీ నాన్న చేస్తాడా వంట? మీ అమ్మ ఏం చేస్తుందీ?” అంది కామాక్షి అన్నంతో నిండిన బుగ్గలు నొక్కుకుంటూ.
“మా అమ్మ టీచర్ కదా అమ్మమ్మగారూ! స్కూల్ బస్ ఏడు గంటలకి వస్తుంది, తనకి భోజనం స్కూల్లోనే. అందుకని నాకూ,నాన్నకీ నాన్నే వంట చేసేవారు, నాకూ కొంచెం వంట వచ్చనుకోండి!” అంది.
ఆ తర్వాత శృతి గమనిస్తే, కామాక్షి, ప్రకాష్, సునీత చేసిన ప్రతీ వంటనీ
విమర్శిస్తూనే ఉండేవారు. “కాఫీలో పాలు తక్కువయ్యాయి, ఇడ్లీ గట్టిగా ఉంది, పచ్చడి మెదగలేదు!” ఇలా అన్నింటికీ వంకలే.
కళ్యాణ్, ఏమాత్రం పట్టించుకోకుండా, ఒక ఋషిలాగా ఉంటే, సునీత మొహంలో, విసుగు, చిరాకు లేకుండా, ఎప్పుడూ నవ్వుతూ ప్రశాంతంగా ఉండేది. అత్తగారిని అలా చూస్తే చిత్రంగా ఉండేది శృతికి.
తట్టుకోలేక ఒకసారి సునీతని అడిగేసింది, “మీరు చేసిన ప్రతీ పనినీ ఇద్దరూ తెగ విమర్శిస్తారు, మళ్లీ ఒక్క పని కూడా చెయ్యరు. వాళ్ళమీద మీకు కోపం రాదా అత్తయ్యా!”
“మా అత్తగారు పాతకాలం ఆవిడ శృతీ! కొడుకు, కోడల్ని పొగిడితే, తట్టుకోలేదు. కొడుకు తన చెయ్యి దాటిపోతాడని ఆవిడ భయం.
మా పెళ్ళైన కొత్తల్లో ఒక రోజు, ఆవిడ, “పెళ్ళాన్ని నెత్తికి ఎక్కించుకుంటే దింపలేవురా! పొరపాటున ఏదైనా బావుందని, వంట బాగా చేసావని పొగిడితే, మర్నాటి నుంచి నీకు గడ్డి పెడుతుంది. అందుకని ఏవో వంకలు పెడుతూ ఉంటే ఇంకా బాగా చేస్తుంది” అని మీ మామయ్యకి చెప్తుంటే విన్నాను. తల్లి మాట జవదాటని కొడుకు మీ మామగారు.
అప్పటికీ, “బావుందంటే, ఇంకా బాగా చేసి పెట్టాలనిపిస్తుంది. వంకలు పెడితే, అది కూడా చెయ్యాలనిపించదు!” అని నేను చెప్పాను. వాళ్ల పద్ధతిలో మార్పులేదు. మొదట్లో కోపం వచ్చి, ఏమీ చెయ్యాలనిపించేది కాదు. తర్వాత, అలా వాళ్ల మెప్పు కోసం ఎందుకు చెయ్యాలి? నేను, నా కొడుకు రుచిగా తినాలి, అదే వాళ్లకి పెడతాను, మెచ్చుకోకపోయినా లెక్కచెయ్యను అనుకున్నాను.
మా అత్తగారు చెడ్డది కాదు. ఉన్న ఒక్క కొడుకూ, తన గుప్పెట నుంచి జారిపోతాడని భయం!” అంది సునీత నవ్వుతూ.
శృతికి అది నచ్చలేదు. తమ ఇంట్లో ఎవరు ఏ చిన్న పని చేసినా మెచ్చుకోవడం, ప్రోత్సహించడం అలవాటు, ఆఖరికి, అది ఇంట్లో పనిచేసే అమ్మాయైనా సరే! తను ఒక్కతే కూతురు. తల్లి టీచర్, తండ్రి లెక్చరర్. ముగ్గురూ సరదాగా ఉండేవారు. నానమ్మ కూడా, అమ్మనే సపోర్ట్ చేసేది, “పొద్దున్నే స్కూల్‌కి వెళ్లి ఆ పిల్లలతో వాగి వస్తుంది పాపం. వంటదేముంది ఎవరైనా చెయ్యచ్చు” అనేది.
“అవతల మనిషి ఎంత వయసు వాళ్ళైనా, ఎలాంటి హోదాలో ఉన్నా, ‘నువ్వు చేసిన పని బావుంది అని ఒక చిన్న మాట’ అంటే చాలు, అది ఎంతో ఉత్సాహాన్నిస్తుంది!” తల్లి చెప్పిన మాట పూర్తిగా పాటిస్తుంది శృతి. అందుకే ఆసుపత్రిలో కూడా, ఆయాల దగ్గర్నుంచి, డాక్టర్ల దాకా శృతిని అందరూ గౌరవిస్తారు.
కళ్యాణ్‌తో ఈ విషయం మాట్లాడితే, “ఏమో శృతీ! మా ఇంట్లో ఎప్పుడూ ఇంతే. మా నాన్న, బామ్మ ఎవర్నీ మెచ్చుకోరు. నన్నూ అంతే! మెరిట్‌లో మెడిసిన్ చదివి, కార్డియాలజీలో ఎమ్మెస్ చేస్తే, ఇంకా సరిగ్గా చదవలేదని, సంపాదన సరిపోదని నొక్కులు నొక్కుతారు. పాపం అమ్మే, నన్ను ముందు నుంచి ప్రోత్సహించింది!” అన్నాడు కళ్యాణ్.
“అబ్బే ఇలా ఊరుకుంటే కాదు, చిన్న క్లాస్ తీసుకోవాలి వీళ్లకి” అంది శృతి.
“వద్దులే శృతీ! మా నానమ్మ నోరు పెద్దది, మా నాన్న కూడా నిన్నేమన్నా అంటే బావుండదు” నసిగాడు కళ్యాణ్.
అనుకోకుండా ఆదివారం రోజే దానికి నాంది పడింది.
సునీత ఉదయమే లేచి, తలుపు తీసి పాల పాకెట్లు తీస్తుండగా, కాలు జారి పడిపోయింది.
“అమ్మా!” అన్న కేకకి, అప్పుడే నిద్ర లేచిన శృతి పరిగెత్తుకుని వచ్చింది.
కాలు మెలిక పడడంతో, అక్కడ వాపు వచ్చింది. నెమ్మదిగా సునీతని పట్టుకుని ఇంట్లోకి తీసుకుని వచ్చిన శృతిని చూసి కామాక్షమ్మ, “అయ్యో! ఏమైందే! చూసుకుని నడవద్దు, గుడ్డిదానిలాగా కళ్లు మూసుకుని నడిచావా? ఎక్కడి నిద్రా చాలదు నీకు!” కోడలికి దెబ్బ తగిలిందన్న బాధ లేకపోగా, సునీత ఏదో కావాలని పడినట్లుగా ఉంది కామాక్షమ్మకి.
“ఆసుపత్రికి తీసుకెళ్దాం కళ్యాణ్! వాపు వచ్చింది, ఫ్రాక్చర్ ఏదైనా ఉండచ్చేమో!” అన్న శృతి మాటలకి, “ అవును, నాకూ అలానే అనిపిస్తోంది” అన్నాడు.
“అమ్మో! ఇప్పుడు దీనికి కాలు విరిగితే, నాకు భోజనం ఎలా? ఒరేయ్ ప్రకాశం! నన్ను నీ చెల్లెలి ఇంట్లో దింపరా! దీనికి తగ్గాక వస్తాను” లోపలికి వెళ్లి చిన్న సంచిలో నాలుగు జతల బట్టలు పెట్టుకొచ్చింది ఆవిడ. సునీత ఎలా ఉంది అని కూడా పట్టించుకోకుండా, “సరే!” అని తలాడించి, కారు తాళాలు తెస్తున్న మామగారిని విచిత్రంగా చూసింది శృతి. ‘ఇది నాకు అలవాటే!’ అన్నట్లు నవ్వాడు కళ్యాణ్.
“నాన్నా! మేము వచ్చేసరికి లేట్ అవుతుంది, మీరు కూడా అత్తయ్యా వాళ్ళింట్లో భోంచేసి రండి. మేము ఎక్కడో అక్కడ తినేస్తాం” వెళ్తూ అన్న కళ్యాణ్ మాటలకి ప్రకాష్ ఆశ్చర్యపోయాడు. “నీ కోడలు మహా గడుసురోయ్. జాగ్రత్త గా ఉండు. లేదంటే నిన్నూ, నీ కొడుకునీ ఉతికి, దణ్ణం మీద ఆరేస్తుంది!” సందు దొరికింది అని కామాక్షి కొడుకుకి నీతులు చెప్పింది. తల్లిమాటలకి గంగిరెద్దులా తలాడించాడు పుత్రరత్నం.
అదృష్టవశాత్తు, సునీతకి ఫ్రాక్చర్ అవలేదని, బాగా బెణికిందని చిన్న బ్యాండేజ్ వేసి, కనీసం పదిరోజులు కాలి మీద బరువు వెయ్యద్దన్నారు.
ఎముకలు బాగా బలహీనంగా ఉన్నాయని, అక్కడ బలం పెడితే విరిగే అవకాశం ఉందని చెప్పారు డాక్టర్. కాల్షియమ్ తక్కువగా ఉంది కనుక, మందులతో పాటు, పాలు,పెరుగు బాగా తీసుకోవాలని, కాలు వాపు తగ్గాక, రోజూ కనీసం అరగంట వాకింగ్ చెయ్యమని సూచించారు.
“నువ్వు డాక్టర్ అయ్యి ఏం లాభం కళ్యాణ్! కనీసం మీ అమ్మని కూడా పట్టించుకోలేదు” మెత్తగా చీవాట్లు పెట్టింది శృతి.
ఇంటికి వచ్చాక, సునీతని నెమ్మదిగా బెడ్ రూమ్ లో పడుకోబెట్టి, కిచిడీ చేసింది శృతి. వేడివేడిగా పెడితే సునీత, “కూతురు లేదనే లోటు ఈ రోజు తీరిపోయిందమ్మా!” సంతోషంగా అంది సునీత.
సాయంత్రానికి వచ్చాడు ప్రకాష్. వచ్చాక కనీసం, “ఎలా ఉంది? ఏమయింది?” అని కూడా అడగలేదు. కాసేపు చూసి శృతి చెప్పింది. “ఆవిడకి రెండు వారాలు పూర్తి రెస్ట్ కావాలి, మీరు సాయం చేస్తాను అంటే సరే! లేదంటే నేను మనిషిని మాట్లాడతాను” తలూపాడు ప్రకాష్. అది దేనికో అర్థం కాలేదు.
సాయంత్రంలోగా, రెండు మూడు సార్లు శృతి అత్తగారి దగ్గరకి వెళ్లి, వాకర్ సాయంతో అత్తగారిని బాత్రూమ్‌కి తీసుకెళ్లింది. చీర మార్చి , నైటీ వేసింది. అన్నింటినీ బెల్లం కొట్టిన రాయిలా చూస్తున్నాడు కానీ, ఏమీ సాయం చెయ్యలేదు ప్రకాష్. పైగా శృతి రూంలోకి వచ్చినప్పుడల్లా, ముఖం చిట్లించి చూస్తున్నాడు.
“నేను మనిషిని మాట్లాడాను. రేపు వస్తుంది, రెండు వారాల పాటు ఇక్కడే ఉంటుంది. అత్తయ్యగారు, ఆ అమ్మాయి, అమ్మమ్మ గారి రూంలో ఉంటారు!” అంటే తలూపాడు ప్రకాష్.
సాయంత్రం అన్నం వండి, అరటికాయ వేయించి, పప్పు చేసింది శృతి.
సునీతకి ముందే పెట్టి, అందరికీ వడ్డించి, తను కూడా తినడం మొదలు పెట్టింది శృతి.
“కూర ఇంకా వేగాలి, నూనె తక్కువగా వేసావు, పప్పులో ఇంగువ ఘాటు లేదు!” అలవాటుగా అన్నాడు ప్రకాష్.
సునీత గురించి ఏమీ అడగడం కానీ, పట్టించుకోవడం కానీ, చెయ్యడంలేదని, అసలే తిక్కగా ఉన్న శృతికి ఇంకా ఒళ్లుమండింది.
“కళ్యాణ్! నాకు వంట ఇలానే వచ్చు! నచ్చిన వాళ్ళు తినచ్చు ,లేని వాళ్ళు వండుకోవచ్చు, లేదా బయట తినచ్చు!” కోపంగా అంది శృతి.
కళ్యాణ్ ఏమీ మాట్లాడలేదు. ప్రకాష్‌కి అవమానంగా అనిపించి, భోజనం వదిలేసి వెళ్ళాడు.
రాత్రి వెయ్యాల్సిన మందులు వేసి, ఆ రోజుకి అత్తగారి దగ్గరే పడుకుంది శృతి.
శృతి వెళ్ళాక ప్రకాష్ కొడుకుతో, “మీ ఆవిడ అలా మాట్లాడితే ఉలుకు పలుకూ లేకుండా చూస్తావేంటీ?” కోపంగా అన్నాడు.
“అంత బాగా వంట చేసే అమ్మని, వంట సరిగ్గా చెయ్యలేదని నువ్వు తిట్టినప్పుడు ఏమన్నా అన్నానా! ఇప్పుడు అనడానికి?” అంటూ రూమ్‌లోకి వెళ్లి తలుపు వేసుకున్నాడు కళ్యాణ్.
షాక్ తిన్నాడు ప్రకాష్.
మర్నాడు పొద్దున్నే, హెల్పర్ వచ్చింది. ఆమెకి సునీతని ఎలా చూసుకోవాలో, మందులు ఎలా వెయ్యాలో, అన్నీ చెప్పి, తమ ఫోన్ నంబర్లు కూడా ఇచ్చి వెళ్లింది.
ప్రకాష్ కోసం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, అన్నీ బల్లమీద పెట్టింది. సునీత,”పాపం ఆ అమ్మాయి ఉద్యోగంకి వెళ్తూ అన్నీ చేసిందండి. నా వంటకి వంకలు పెట్టినట్లు పెట్టకండి!” అంది.
హెల్పర్ సాయంతో, వంట మొత్తం పొద్దున్నే చేసేది శృతి. మళ్లీ ఇంక రాత్రికి వేరే ఏమీ ఉండేది కాదు.
పొద్దున్నవే రాత్రికి కూడా తినడానికి ప్రకాష్‌కి కష్టంగా ఉండేది. సునీతలాగా టిఫిన్లు రకరకాలు చేసేది కాదు. ఇడ్లి లేదా ఉప్మా, అంతే!
ఒక రోజు ప్రకాష్ , ఈ వంటలు తినలేక చస్తున్నా!” అని విసుక్కున్నాడు.
“రేపటినుంచి, వంటమనిషిని పిలవమని చెప్పు కళ్యాణ్ మీ నాన్నగారికి. డ్యూటీ చేస్తూ నేను ఇంత కంటే చెయ్యలేను. అయినా అత్తయ్యగారు రకరకాలుగా చేసినప్పుడు కూడా ఇలానే విసుక్కున్నారు కదా! అప్పటికి,ఇప్పటికీ తేడా ఏమిటో!” వ్యంగ్యంగా అంది శృతి.
మర్నాటి నుంచి ప్రకాష్‌కి విసుర్లు మొదలయ్యాయి.
“ఏంటి కళ్యాణ్! నువ్వు కూడా మీ నాన్నలాగా ఎక్కడి వస్తువులు అక్కడ పడేస్తావు. సర్ది పెట్టు!” అని ఒకసారి…
“నేను చేసిన వంట బావుంటే, మెచ్చుకోవాలి! అప్పుడే చేయబుద్ది అవుతుంది, మీ అమ్మగారికి ఉన్నంత ఓర్పు లేదు నాకు, వంకలు పెట్టినా, పట్టించుకోక పోవడానికి” అని ఒకసారి విసుర్లు వినిపిస్తున్నాయి.
శృతికి వంట అలవాటులేక, టైం లేక, సాదాసీదాగా చేస్తుంది. సునీత చేతి వంట రుచే వేరు. ఆ సంగతి ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది ప్రకాష్‌కి.
కళ్యాణ్, “శృతీ! ఇవాళ పప్పు బావుంది, కూర అదిరింది!” అంటుంటే ప్రకాష్‌కి ఒళ్లు మండిపోయేది.
పెళ్ళయిననుంచి, తల్లి మాటలు విని, ఒక్క రోజు అంటే ఒక్క రోజు కూడా, సునీతని మెచ్చుకోలేదు, ప్రతీదానికి తిట్టడం, వంకలు పెట్టడం. అయినా, సునీత ఏ రోజూ తనని విసుక్కోలేదు, కోపం తెచ్చుకోలేదు. ప్రకాష్‌కి భార్య విలువ బాగా తెలిసి వస్తోంది.
ప్రతీ దానికీ, తాను ఆమె మీద ఎంతగా ఆధారపడ్డాడో అర్థమయింది.
సునీత, చిన్నవాటికి కూడా, కోడలిని మెచ్చుకుంటూ, ఆప్యాయంగా మాట్లాడుతుంటే, శృతి కూడా సునీతని ఎంతో ప్రేమగా చూసుకుంటోంది.
ప్రకాష్‌లో మార్పు నెమ్మదిగా మొదలైంది. రోజూ కాసేపు సునీత దగ్గర కూర్చుని మాట్లాడుతున్నాడు. “ఏమైనా కావాలా? మందులు వేసుకున్నావా?” అని అడుగుతున్నాడు. మామగారిలో ఆ చిన్న మార్పుకి అత్తగారు పొంగిపోతుంటే , “ఇంకా మారాలి!” అని ఆ పొంగు మీద నీళ్లు జల్లుతోంది శృతి.
వారం తర్వాత, కామాక్షి ఫోన్ చేసింది, ”ఇక్కడ అల్లుడు తెగ విసుక్కుంటున్నాడు. ముసలి వాళ్ళు అయ్యాక తిండి తగ్గించాలి. పెట్టింది నోరుమూసుకుని తినక, వంకలు పెడితే వెళ్లిపో అన్నాడు. నేను ఇక్కడ ఉండను!” అంది కొడుకుతో.
అడకత్తెరలో పోక చెక్క లాగా, ఇక్కడ కోడలి విసుర్లు చెప్పలేక, తల్లిని తీసుకుని రాలేక నెమ్మదిగా, “సునీత నీ రూములో ఉంది. శృతి తనకోసం హెల్పర్ని పెట్టింది. నువ్వు వస్తే ఉండడానికి ఇబ్బంది” అన్నాడు.
“అయ్యో! పనిమనిషికి నా రూమ్ ఎలా ఇచ్చారు. నీ పెళ్ళాన్ని, ఆ పనిమనిషిని, మీ రూంలో ఉండమని, నువ్వే నా గదిలో ఉండచ్చు కదా! ఇప్పుడు నేను వచ్చి ఆ గది అంతా శుభ్రం చేసుకోవాలి. అయినా బోలెడు డబ్బులు తగలేసి, ఆ పనిమనిషి ఎందుకు? నువ్వు ఎలాగో రిటైర్ అయ్యావు! ఇంట్లోనే ఉన్నావుగా ఆ మాత్రం సాయం చెయ్యలేవా?” తల్లి తిడుతుంటే కోపం వచ్చింది ప్రకాష్‌కి.
“నువ్వు నోరు మూసుకుని నీ కూతురు ఇంట్లో ఉండు.లేదంటే వచ్చి ఇక్కడ అందరికీ వంట చెయ్యి!” కోపంగా పెట్టేసాడు ఫోన్.
పది రోజుల తర్వాత, సునీతకి కొద్దిగా తగ్గిందని, పని మనిషిని తీసేసారు. తనంతట తనే నెమ్మదిగా ఇంట్లో తిరుగుతోంది సునీత.
కామాక్షమ్మ వెనక్కి వచ్చింది. సునీతకి పెట్టిన హెల్పర్ రూమంతా పాడు చేసిందని ఒకటే సణుగుడు. ఇంట్లో చేసే అమ్మాయి చేత రూమంతా కడిగించి, శుభ్రం చేయించింది.
శృతి ఆ రోజు ఇంట్లోనే ఉంది. వంట చేసి బల్ల మీద అన్నీ సర్ది అందర్నీ భోజనానికి పిలిచింది.
బెండకాయ కూర, ముద్ద పప్పు, సాంబారు, పెరుగు.
అందరికీ కంచాల్లో కూర, పప్పు వేసి అన్నం వడ్డించింది.
కామాక్షమ్మ కంచంలో పదార్ధాలు చూస్తూనే,
“ఇదేమి వంటే నా తల్లీ! ఈ కూరేంటి, పప్పేంటి? బెండకాయ కూరలో నూనె,ఉప్పూ, కారం, ఏమీ లేవు, ముద్ద కట్టుకుని, సాగుతోంది. సాంబారు పలచగా, ఘాటు లేకుండా ఉంది. నీకు వంటొచ్చని గొప్పలు చెప్పావు. ఇదేనా నీకు వంట రావడం. కనీసం నాలుగు రోజులు మీ అత్తగారి దగ్గర నేర్చుకోవచ్చుగా?” అంది కామాక్షి.
ఏమీ మాట్లాడకుండా ఉండిపోయాడు ప్రకాష్. అటు తల్లిని సమర్ధించలేదు, కోడలిని ఏమీ అనలేదు. ఏమీ మాట్లాడకుండా అన్నం కలిపి తింటోంది సునీత.
“అవును శృతీ! ఏంటి ఈ వంట, మా అమ్మ అంత బాగా వంట చేసినా, మా నాన్నకి, బామ్మకి నచ్చదు. నువ్వు చేసిన ఈ వంట ఎలా తింటారు? ఎవరు తింటారు?“ కొంచెం కోపం గొంతులోకి తెచ్చుకుని అన్నాడు కళ్యాణ్.
ఎప్పుడూ మాట్లాడని కళ్యాణ్ అలా అంటుంటే, నోట్లో పెట్టుకునే ముద్ద కింద పెట్టి, ఆశ్చర్యంగా చూసింది సునీత.
“అలా అడగరా మనవడా! ఈ గడ్డి తినడం నా వల్ల కాదు!” అంటూ లేవబోయింది కామాక్షి.
“కూర్చోండి!” గట్టిగా గదిమింది శృతి. “ఏంటి కళ్యాణ్ వంట బాగాలేదా? మీ బామ్మకి బీపీ ఎక్కువగా ఉంది, షుగర్ కంట్రోల్‌లో లేదు. ఆవిడ పాదాలు చూసావా నీరు పట్టి వాచి ఉన్నాయి. మీ నాన్నగారికి షుగర్ పెరిగింది. మొన్ననే నేను చెక్ చేసాను. నువ్వేమన్నా గమనించావా? వాళ్ళిద్దరికీ పూర్తి పత్యం భోజనం పెట్టాలి.
ఎనభై ఏళ్ల ఆవిడకి ఈ తిండి ఏమిటి? ముప్పొద్దులా అన్ని పచ్చళ్ళు వేసుకుని, స్వీట్స్ తింటూ! ఆవిడ తొందరగా పోవాలనుకుంటున్నావా?
మామయ్యగారు కూడా రాత్రిళ్ళు తేలికగా భోజనం చెయ్యాలి, వాకింగ్ చెయ్యాలి.
ఉప్పులు,కారాలు,నూనె వేసి వైనంగా, మీ అమ్మగారు వంట చేస్తే, అందరూ వంకలు పెడుతున్నారు! ఆవిడని, ముప్పై ఏళ్ల నుంచి చేస్తున్నా నీకు వంట రాదు అన్నారు.
నా వంట ఎవరికి నచ్చకపోతే, వాళ్ళు, రెండు రోజులు చెయ్యండి. నేనూ కూర్చుని వంకలు పెడతాను.
నిన్నటి వరకు, అన్ని పనులూ అత్తయ్యే చేసారు. సరుకులు, కూరలు అత్తయ్య తెచ్చుకోవాలి, ఇల్లంతా ఆవిడే సర్దాలి, వంట ఆవిడే చెయ్యాలి. అన్ని ఒక్కత్తే చేసుకున్నా, సాయం చెయ్యకపోగా, అన్ని పనులకీ వంకలు పెట్టారు.
ఇప్పుడు ఆవిడ కాలి నొప్పి తో మంచంమీద ఉంది.
ఇంట్లో పనంతా నేను ఒక్కదాన్ని ఎలా చేసుకున్నాను? ఏమన్నా ఆలోచించారా? ఇంట్లో పని వాళ్ళని అయినా ఊర్కే అజమాయిషీ చేస్తే, చేసే వాళ్ళు ఎలా చేస్తారు. అందరూ తలా చెయ్యి వెయ్యాలి, ఎక్కువ పని ఉంటే, పనిమనిషిని ఎక్కువ జీతం ఇచ్చి చేయమనాలి.
పని చెయ్యకుండా ఇలా వంకలు పెట్టడం నచ్చదు” గయ్యిమంది శృతి.
“ఏంటి అమ్మమ్మగారు! నేను అత్తయ్యగారి దగ్గర వంట నేర్చుకోవాలా? ఆవిడ వంటకి రోజూ వంకలు పెడతారుగా? మరి ఆవిడ దగ్గర ఎందుకు నేర్చుకోవాలి?
మూడురోజులు మీరు చెయ్యండి! నేను, కళ్యాణ్, మీ దగ్గర వంట నేర్చుకుంటాము!” ఆవేశంగా అని, ఊపిరి పీల్చుకుంది.
ఎర్రపడ్డ శృతి మొహం చూసి, ఆమె చూడకుండా ముసి ముసిగా నవ్వాడు కళ్యాణ్.
ప్రకాష్ బిత్తరపోయి చూస్తున్నాడు.
కొంచెం ముందుగా తేరుకున్న సునీత,
“ఊరుకొమ్మా శృతీ! పెద్దావిడ అమ్మమ్మగారితో నువ్వు అలా మాట్లాడ కూడదు.
రేపటినుంచి వంట నేను చేస్తానుగా! నీకెందుకు ఈ గోల?”
“ఎన్ని రోజులు అత్తయ్యా మీకు ఇంత చాకిరీ! ఒక మెప్పూ లేదు, మెహర్బానీ లేదు.
కనీసం ఇవాళ వంట బావుందని కానీ, మా కోడలు మంచిది నన్ను బాగా చూసుకుంటుంది అని కానీ, ఒక చిన్న మాట లేదు, మీకు కోపం రాదా!” ఉక్రోషంగా అంది శృతి.
ఫక్కున నవ్వింది సునీత. “నేను నిజంగా కోపం తెచ్చుకుంటే, ఈ ఇంట్లో ఉండను శృతీ!
వీళ్లకి ఒకరిని విమర్శించడం తప్ప మెచ్చుకోవడం రాదు.
అందుకే నేను ఈ ఇంట్లో చేసే పని ఒక బాధ్యతగా చేస్తాను, ప్రేమగా చెయ్యలేను”
ఇంకా ఏదో అనబోతుంటే, కామాక్షి, “అంటే! మేము నిన్ను ఏదో రాచి రంపాన పెడుతున్నామా!” గట్టిగా పెద్ద గొంతు పెట్టి అంది.
“అది మీకే తెలియాలి. మీరు అన్నిటికీ వంకలు పెట్టడం, అవి పట్టుకుని ఆయన నన్ను తిట్టడం… కొన్ని రోజులు ఏడ్చాను, కొంతకాలం బాధపడ్డాను, తర్వాత అలవాటు పడిపోయాను.
ఎలానో, నేను ఏమి చేసినా, ఎలా చేసినా మీరు వంకలు పెడుతూనే ఉంటారు. అందుకే నాకు నచ్చినట్లు చెయ్యడం మొదలు పెట్టాను. మీ మాటలు ఏనాడో పట్టించుకోవడం మానేసాను.
ఏదో కోడలిని కంట్రోల్‌లో పెట్టానని సంతోషపడుతున్నారు కానీ, మీరు ఏం పోగొట్టుకున్నారో మీకు తెలీదు అత్తయ్యా! నా కొడుకు, నా కోడలు నన్నింత ప్రేమగా చూస్తుంటే, నాకు ఇప్పుడు అర్థమైంది మీరేం కోల్పోయారో! అందుకే, మీరంటే జాలి తప్ప మరేమీ లేదు” అంది సునీత.
సునీత ఇలా మాట్లాడుతుందని ఏ మాత్రం ఊహించని కామాక్షమ్మ కోపంతో ఊగి పోయింది.
“ఒరేయ్ ప్రకాశం! నీ పెళ్ళాం చూడరా, నన్ను అంతలేసి మాటలు అంటుంటే, దాన్ని నాలుగు వాయించకుండా, శిలావిగ్రహంలా చూస్తూ నిల్చున్నావు!” అన్న తల్లితో, “నా పెళ్ళాం కదమ్మా! నీకేం కాదుగా!
నా పెళ్ళాం, నా కొడుకు, నా కోడలు, నా ఇల్లు. వాళ్ళు ఎలా చెప్తే నేను అలా వింటాను. నువ్వు ఇక్కడ ఉండాలంటే, వాళ్ళు చెప్పినట్లు విను. లేదంటావా నీ ఇష్టం. ఏనాడూ నీ మాట కాదనలేదు నేను. ఇప్పుడైనా అంతే!” కొడుకు మాటలకి నిశ్చేష్టురాలయింది కామాక్షి.
“లే! సునీతా! ఎక్కువ సేపు కాలు కిందపడితే, వాపు వచ్చి, నొప్పి ఎక్కువ అవుతుంది, రెస్ట్ తీసుకో!” దగ్గరకి వచ్చి చెయ్యి అందిస్తున్న భర్తని ఆశ్చర్యంగా, ఆనందంగా చూసింది సునీత.
కళ్యాణ్, శృతి వంక మెప్పుగా చూస్తే, శృతి నవ్వుతూ “చిన్నమాట, ఒక చిన్నమాట…” అని కూనిరాగాలు తీస్తుంటే, సునీతా, కళ్యాణ్ ముసిముసిగా నవ్వుకున్నారు.
ఈ కథ నా స్వీయ రచన.
శ్రీపతి లలిత.