ఈ కాలం పిల్లలు.
ఈనాడు ఆదివారం సంచిక లో 24.3.24న వచ్చిన నా కథ.
"ఏమిటీ? మీ అబ్బాయి,కోడలు వేరు వెళ్తున్నారటగా? అంతేలేమ్మా ఈ కాలం పిల్లలు. నాలుగు నెలలు అత్త మామలతో ఉండేటప్పటికి ఓర్పు అయిపోయింది" ఆపకుండా మాట్లాడుతున్న పక్కింటి అన్నపూర్ణ గొంతు విని లోపలి వెళ్ళేది గుమ్మం దగ్గర ఆగింది లహరి, అత్తగారి రియాక్షన్ వినడానికి.
"మా పిల్లలు అలాంటి వాళ్ళు కాదు. కొత్త ఇల్లు అద్దెకి ఇవ్వడం ఇష్టం లేక వెళ్తున్నారు, రేపు ఏ పిల్లో పుడితే ఇక్కడికే వస్తారు, నేనే కదా వాళ్ళని చూడాలి".
అత్తగారి మాటలు విని ఆశ్చర్యంతో తూలిపడపోయింది లహరి.
ఇంట్లో ఏమాత్రం ఛాన్స్ దొరికినా, ఏదో ఒకటి అనే అత్తగారు పక్కింటి ఆవిడతో తన గురించి చెడ్డగా చెప్పలేదు అంటే, అమ్మ అన్నట్టు ఆవిడ చెడ్డది కాదు.
కోడలి ఎంపిక కొడుకే చేసుకోవడం తట్టుకోలేక, నేను చూస్తే ఇంకా మంచి కోడల్ని తెచ్చేదాన్ని అన్నట్టు ప్రవర్తిస్తోంది కానీ, తనని చెడ్డ చేయడంలేదు మంచిదే అనుకుంటూ, లోపలికి అడుగుపెట్టింది. పక్కన ఆంటీని "బావున్నారా" అని పలకరించేసరికి ఆవిడ ఒక నవ్వు నవ్వి "మళ్లీ వస్తాను ఉమగారు" అంటూ వెళ్ళిపోయింది.
ఉమ, భాస్కర్ లకు ఒక్కడే కొడుకు విక్రమ్.
ప్రస్తుతం పిల్లలందరిలాగానే, అతను కూడా హైదరాబాద్ లో ఒక పెద్ద కంపనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్. పెళ్లి విషయానికి వచ్చేసరికి, తనతో పని చేస్తున్న లహరిని చేసుకుంటాను
అని చెప్పాడు. ఎక్కడా అడ్డం చెప్పేందుకు కారణాలు లేకపోవడం వల్ల, ఇరువైపుల వాళ్ళు ఒప్పుకున్నారు కానీ, తనకి సరిగ్గా పెళ్ళికి ముందు చెప్పాడని కొడుకు మీద, తన ప్రమేయం లేకుండా కోడలుగా వచ్చిందని లహరి మీద చిన్న అలక ఉంది ఉమకి.
అది అప్పుడప్పుడూ, కొడుకు లేనప్పుడు బయట పెట్టేది. లహరి ఎంత కలుద్దామని ప్రయత్నించినా చిన్న అడ్డుగోడ పెట్టింది ఇద్దరి మధ్య.
ఉమ ఒక ఫక్తు మధ్యతరగతి గృహిణి, భర్త, కొడుకు తన గుప్పిట్లో ఉండాలనే రకం, అలాగని చెడ్డది కాదు. అందరికీ, మా అబ్బాయి నా మాట జవదాటడు అని గొప్పగా చెప్పుకుందామనుకునే మహిళ.
లహరికి, అత్తగారు అలా ముభావంగా ఉండడం, కల్పించుకుని పని చేద్దామన్నా చెయ్యనియ్యకపోవడం, మళ్ళీ ఇంట్లో పని అంతా తాను ఒక్కతే చేస్తున్నానడం, కొంచెం చికాకు తెప్పించాయి.
ఉమ తత్త్వం వేరు, ముందునుంచీ, తనని కాకుండా వేరే ఎవరినైనా వంట బాగా చేస్తారని, ఇల్లు చక్కగా పెట్టుకుంటారని ఇంట్లోవాళ్ళు పొగిడితే తట్టుకోలేకపోయేది ఉమ.
అందుకే లహరిని ఏమి చెయ్యనిచ్చేది కాదు.
మళ్ళీ అందరిముందు "ఆఫీసులో అలసిపోయి వస్తుంది, ఇంట్లో ఏమి
పని చెప్తాము పాపం" అనేది, చూసేవాళ్ళకి ఎంత మంచిదో ఈవిడ అనిపించేటట్లు.
ఈ సంగతి లహరి తల్లి విజయ కి బాగా అర్థమైంది, ఎంతైనా ఆవిడా ఒక తల్లేగా.
లహరి కోసం వాళ్ళు కొన్న ఫ్లాట్ ఎలానో రెడీ అవడం,అది వీళ్ళకి ఆఫీస్ కి దగ్గరగా ఉండడం ఇంకా కలిసి వచ్చింది. కొంతకాలం వీళ్ళిద్దరూ ఆ ఫ్లాట్లో ఉండి, అప్పుడప్పుడు వచ్చి కలుస్తూ ఉంటే మంచిది అని సలహా చెప్పింది.
ఒక రకంగా అందరికి ఆ ప్రతిపాదన నచ్చి లహరి, విక్రమ్ కొత్త ఫ్లాట్ గృహ ప్రవేశం చేసుకున్నారు. ఆ రోజు కొడుకు, కోడలు కొన్న పదివేల పట్టుచీర కట్టుకుని మురిసిపోతూ, అందరికీ ఒకటికి రెండుసార్లు చెప్పుకుని తిరిగింది ఉమ.
ఉమా, భాస్కర్ ల ఇంటికి, విక్రమ్ ఉండే ఫ్లాట్ కి ఒక గంట దూరం.
అందుకని ఫ్లాట్ కి మారినా, పిల్లలు శని ఆదివారాలు, పండగ రోజుల్లో ఎవరో ఒకళ్ల దగ్గరకి వెళ్లడం తమకు కావాల్సినవి చేయించుకుని తినడం, వాళ్లతో గడపడం తో పెద్ద దూరంగా ఉంటున్న భావం ఎవరికీ రాలేదు.
ఉమ చదువుకున్నది కానీ, కొన్ని విషయాలు తెలుసుకోవడం లో అలసత్వం ఉండేది.
ముఖ్యంగా బ్యాంకుకి వెళ్లడం, గూగుల్ పే లు చెయ్యడం, ఎటిఎం వాడడం నేర్చుకోలేదు.
క్రెడిట్ కార్డు తనకి ఇప్పించినా ఎప్పుడు వాడేది కాదు. పిన్ మర్చిపోతే ఎలా? ఎవరైనా చూసి వాడేస్తే ఎలా? లాంటి అనుమానాలు చాలా ఎక్కువ ఉమకి.
విక్రమ్ వచ్చినప్పుడల్లా చెప్పేవాడు, "మీరు పెద్దవాళ్ళు అయ్యారు కనక, మీ హెల్త్ కార్డ్స్ గురించి, ఎమర్జెన్సీ నంబర్ల గురించి తెలుసుకో" అని. "నాకెందుకురా ఇవన్నీ, మీరు ఉన్నారు కదా" అని పట్టించుకునేది కాదు.
గృహప్రవేశము తరవాత విక్రమ్ ఇంటికి వెళ్లి కొన్ని రోజులు ఉందామని భాస్కర్ సరదా పడ్డా, అక్కడ పనికి,వంటకి మనిషిని పెట్టాము మీరు వస్తే రెస్ట్ అని లహరి, విక్రమ్ చెప్పినా ఒక్కసారి మాత్రం వెళ్లారు.
"అక్కడ నాకు తోచదు, వాళ్లు ఆఫీస్ కి వెళ్తే మనం ఏమి చెయ్యాలి, అక్కడ ఆ వంట మనిషి చేసింది నాకు నచ్చదు" అంటూ వెళ్ళేది కాదు ఉమ.
ఇద్దరు మనుషులకి వంటమనిషేమిటి? పాలు లేని కాఫీలు, ఉప్పు,కారం, నూనె లేకుండా వంటలు, రొట్టెలు, సలాడ్లు, మొలకలు వీటితో కడుపు నిండుతుందా?
లహరి హాయిగా ఏ పంజాబీ డ్రెస్, చీర కట్టకుండా ఏమిటా ప్యాంట్లు, షర్టు ఇంట్లో మగవాళ్లలా పైజామాలు ఏమిటి అని భాస్కర్ దగ్గర సణుగుతూనే ఉండేది.
ఫ్లాట్ కి వెళ్లిన నాలుగు నెలల్లో లహరి కార్ కొనుక్కుని ఆఫీస్ కి కార్ లో వెళ్ళేది.
చక్కగా బంగారం, వజ్రాలు కొనకుండా డబ్బులన్నీ వృధా చేస్తున్నారని ఉమ బాధ.
అప్పటికీ ఊరుకోక లహరి తల్లితో అంటే ఆవిడ కూడా "ఏమి చెప్పమంటారు వదినగారు? ఈ కాలం పిల్లలు మనం చెప్పేది వినరు, వాళ్ళు అనుకున్నది చెయ్యడమే" అనేసరికి ఊరుకుంది.
భాస్కర్ మాత్రం "వాళ్ళు చిన్న పిల్లలు కారు, మనకంటే లోకం బాగా తెలుసు వాళ్ళ సంపాదన వాళ్ళిష్టం, నువ్వు అనవసరంగా కల్పించుకుని ఏదైనా అంటే నువ్వు చెడ్డ అవడం తప్ప వేరే ఉండదు" అని అంటుండేవాడు.
రోజులు బానే గడుస్తున్నాయి అందరూ ఎవరి పనులలో వాళ్ళు మునిగిపోయారు.
సంక్రాంతి దగ్గరకొస్తోంది. ఆ రోజు కొడుకు, కోడలు పండక్కి వస్తారని ఉమ ఏవో పిండివంటలు చెయ్యడంలో మునిగిపోయింది. హాల్ లో టీవీ చూస్తున్నాడు భాస్కర్. ఉన్నట్టుండి దభాలున శబ్దం వినిపించి ఉమ హాల్లోకి చూసింది "ఏమైందండీ!" అంటూ.
భాస్కర్ గుడ్లు తేలేసి, నోరు తెరుచుకుని క్రింద పడిపోయి ఉన్నాడు.
అతన్ని అలా చూసిన ఉమ కి గుండె ఆగినంత పని అయ్యింది.
"ఏమండీ !" అంటూ కుదిపినా కదలిక లేదు. అతను రెండు రోజుల నుంచి తలనొప్పిగా ఉందని, అన్నం తినబుద్ధి కావడంలేదు అనడం గుర్తు వచ్చింది. పక్కవాళ్ళు ఎదురువాళ్ళు పండక్కి ఊరు వెళ్లారు. గబగబా విక్రంకి ఫోన్ చేసింది, అది అవుట్ అఫ్ కవరేజ్ అని వచ్చింది.
వెంటనే లహరి కి చేసింది. లహరి ఫోన్ ఎత్తి "హలో" అనగానే "ఆయన పడిపోయారు" అంటూ ఏడ్చేసింది. ఒక నిమిషం లహరి కూడా అర్థం కాలేదు. వెంటనే తేరుకుని
"ఖంగారు పడకండి అత్తయ్యా! కదిపి చూడండి" అన్న లహరి తో " లేదమ్మా! కదలటంలేదు, నాకు భయంగా ఉంది, ఏమిచెయ్యను విక్రమ్ ఫోన్ రావట్లేదు" ఏడుస్తూనే అంది.
"అత్తయ్యా! విక్రమ్ ఆఫీస్ పని మీద నిన్న బెంగుళూరు వెళ్ళాడు. ఇప్పుడు వెనక్కి వస్తున్నాడు. నేను అంబులెన్సు కి ఫోన్ చేస్తాను మీరు దగ్గరగా ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్లండి" అంటూ ఆసుపత్రి పేరు చెప్పింది.
"నేను ఒక్కదాన్నే వెళ్ళలేను" అంటున్న ఉమ తో "నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. ఈ లోగా మీకు మెడికల్ కార్డ్స్ ఎక్కడున్నాయో తెలిస్తే పెట్టుకోండి" అని ఫోన్ పెట్టింది.
అవసరం వస్తుంది అనుకున్నాడో ఏమో, ముందురోజే భాస్కర్ కార్డ్స్ తీసి చూపించాడు. అవి తీసుకుని, పొయ్యి ఆపి,బాగ్, కొంత డబ్బులు పట్టుకుని వచ్చేలోగా ఎవరో పిలిచారు.
చూస్తే తన ఇంట్లో పనిచేసే లక్ష్మి భర్త రాజు. అతను ఆటో నడుపుతాడు. "చిన్నమ్మ ఫోన్ చేసారు సారు కి బాలేదట కదా!" అనేలోగా అంబులెన్సు రావడం రాజు ఫోన్ మోగడం " అమ్మా! సరేనమ్మా!" అంటుంటే లహరి ఫోన్ అనుకుంది ఉమ.
యాంత్రికంగా భాస్కర్ ని అంబులెన్సు లో ఎక్కించాక తను కూడా ఎక్కింది.
రాజు ఇంటికి తాళం వేసి వెనక ఆటోలో వచ్చాడు.
అంబులెన్సులోనే వాళ్ళు వైద్యం మొదలుపెట్టారు. బీపీ చూడడం, ఆక్సిజన్ పెట్టడం లాంటివి చేస్తూ ఫోన్లో చెప్తున్నారు.
ఆసుపత్రిలోకి వెళ్లి అతన్ని దించడానికి మనుషులు రాగానే రాజు వాళ్ళకి ఏదో చెప్పాడు, వెంటనే ఒక డాక్టర్ పరిగెత్తుకు వచ్చి పరుగు, పరుగున లోపలి తీసుకెళ్లి వైద్యం మొదలుపెట్టారు. ఉమని బయట ఉండమన్నారు.
సమయం ఎంత గడిచిందో తెలీదు కానీ, లహరి రావడం చూసి తనూ లేచి లహరిని పట్టుకుని "అమ్మా! మామయ్య!" అంటూ లహరి చెయ్యి గట్టిగా పట్టుకుంది.
"ఏమి కాదు అత్తయ్యా! భయపడకండి, విక్రం కూడా వస్తున్నాడు. ఇక్కడ చూస్తున్న పెద్ద డాక్టరుగారి అబ్బాయి, నా స్నేహితుడు. తను ఇప్పటికే ఫోన్ చేసి ఆయనతో మాట్లాడాడు" అంటుండగానే ఆ డాక్టర్ గారు బయటికి వచ్చారు" లహరీ!" అనేసరికి "అంకుల్! ఎలా ఉంది మామయ్యకి?" అడిగింది.
"బీపీ సడన్ గా ఎక్కువై మైల్డ్ స్ట్రోక్ వచ్చింది. అదృష్టం కొద్దీ మీరు వెంటనే వచ్చారు, నువ్వు ఫోన్లో చెప్పినదానికి తగ్గట్టుగా నేను ఇంజక్షన్ కూడా వెంటనే ఇప్పించాను. దానితో ఆయన అవయాలకి ఇబ్బంది ఉండదు. కొంతకాలం మందులు, పూర్తి విశ్రాంతి కావాలి.
ఇక్కడ నాలుగు రోజులు ఉంచి పంపుతాం. ఇప్పుడు ICU కి పంపి రేపు, ఎల్లుండి రూమ్ కి మారుస్తాం" చెప్తుంటే పక్కన ఉమ కూడా వింటోంది.
"మా అత్తయ్య" అని లహరి చెప్తే ఆయన ఉమని చూసి
"ఏమీ పర్వాలేదమ్మా! గండం గడిచింది. మీరు ఖంగారుపడి బీపీ పెంచుకోకండి. ఒకసారి చూసాక ఇంటికి వెళ్లి రెస్ట్ తీసుకుని రేపు రండి." అనునయంగా అంటే ఉమ కళ్ళనీళ్ళతో నమస్కారం చేసింది.
ఇంతలో విక్రమ్ కూడా వచ్చాడు. కొడుకుని చూసేసరికి దుఃఖం ఆపుకోలేక
పోయింది ఉమ. "విక్కీ" అంటూ కొడుకుని పట్టుకుని ఏడ్చేసింది.
"ఏమీ భయం లేదమ్మా!" అంటూ తల్లిని ఓదార్చాడు కానీ అతని కళ్ళలో కూడా నీళ్లు వచ్చాయి. లహరి ఓదార్పుగా అతని భుజం మీద చెయ్యి వేసింది.
ఇంతలో నర్స్ వచ్చి "ఒకొకళ్ళుగా వెళ్లి ఆయనని చూడండి. మళ్ళీ రేపు ఉదయం దాకా మేము రానివ్వం" అని చెప్తే ఉమ లోపలికి వెళ్ళింది.
ముక్కుకి, నోటికి అన్ని పైపులు పెట్టి, బలహీనంగా ఉన్న భర్త ని చూసి ఏడుపు వచ్చినా "నువ్వు నాన్నని చూసి ఏడవద్దు, అంతా బావుంది అని చెప్పు" అన్న కొడుకు మాట గుర్తొచ్చి నెమ్మదిగా అయన చెయ్యి నొక్కి "ఇంకో రెండు రోజులు అంతే, మనం ఇంటికెళ్ళిపోతాం. అంతా బావుందన్నారు డాక్టర్" అని చెప్పింది.
బయటికి వచ్చేసరికి లహరి తల్లి, తండ్రి వచ్చారు. ICU దగ్గర ఎవరినీ ఉండనియ్యడం లేదు,
అయినా విక్రమ్, వాళ్ళ మామగారు కొంచెం సేపు ఉంటామంటే, లహరి,ఉమ, లహరి తల్లి లహరి కార్ లో వాళ్ళ ఇంటికి బయలుదేరారు.
ఇంటికి వెళ్లేసరికి లహరి వాళ్ళ పని అమ్మాయి స్వరూప ఇంట్లో ఉంది. వెళ్ళగానే వీళ్ళకి వేడిగా టీ పెట్టి ఇచ్చింది. గీజెర్ వేసాను అంటే ఉమ, లహరి స్నానం చేసి వచ్చారు. వీళ్ళు వచ్చేసరికి డైనింగ్ టేబుల్ మీద పళ్ళేలు, గ్లాసులు అన్నీ అమర్చింది భోజనానికి.
అన్నం, కూర, పచ్చడి, సాంబార్, పెరుగు పెట్టి వీళ్ళకి వడ్డిస్తాను అంటే లహరి "వెళ్ళిపో స్వరూపా! రేపు త్వరగా వస్తే అత్తయ్య ఆసుపత్రికి వెళ్ళేలోగా టిఫిన్ తిని వెళ్తారు" అంది.
"సరేనమ్మా! పెద్ద సార్ ఎలా ఉన్నారు?" అడిగిన స్వరూపకి
"బావున్నారు, నువ్వు ఆటో లో వెళ్ళు, డబ్బులు ఉన్నాయా ఇవ్వనా?" అని లహరి అడిగితే "వద్దమ్మా, ఉన్నాయి అయినా మా ఆయన ఫోన్ చేస్తే పది నిమిషాల్లో వస్తాడు" అని వెళ్ళిపోయింది.
"మనం ఆసుపత్రిలో ఉన్నాం కదా, ఈ అమ్మాయి వంట ఎలా చేసింది?" అడిగింది ఉమ .
"ఒక తాళంచెవి ఆ అమ్మాయి దగ్గర ఉంటుంది ఎప్పుడైనా ఇలా అవసరం పడితే తను వచ్చి అన్ని పనులూ చేస్తుంది" అన్న లహరితో "ఫర్వాలేదా, ఇంట్లో డబ్బులు అవీ ఉంటాయి" అంది ఉమ.
"లేదు అత్తయ్యా! మేము కాష్ ఎక్కువ పెట్టము, అన్నీ ఫోన్ పేలోనే, ఇంట్లో బంగారం ఉంచను, ఇంకేమి తీసుకుంటుంది, హాల్ లో, మెయిన్ డోర్ దగ్గర కెమెరాలు ఉన్నాయి, వాళ్ళకీ పనులు కావాలంటే నిజాయితీగా ఉండాలి." అంది లహరి.
"విక్రమ్, నాన్న వచ్చి భోంచేస్తారు, మీరు మళ్ళీ పొద్దున్నే ఆసుపత్రికి వెళ్లాలి, ఇప్పుడు పడుకోండి" అని లహరి చెప్తే రూంలోకి వచ్చి పడుకున్న ఉమ మనసులో రకరకాల ఆలోచనలు మెదిలాయి.
తను, వీళ్ళని ఈకాలం పిల్లలు బాధ్యత తెలీదు, డబ్బు జాగ్రత్త లేదు అనుకుంది కానీ, ఇవాళ లహరి ఎంత త్వరగా అన్ని జాగ్రత్తలు తీసుకుని భాస్కర్ ని ఆసుపత్రిలో చేర్చేసరికి అతను బతికి బయటపడ్డాడు.
ఇప్పుడు ఇంటికి వచ్చి వంట చెయ్యాలంటే ఎవరికైనా ఇబ్బందే. అలాంటిది వీళ్ళు జీతం ఎక్కువ ఇయ్యబట్టేకదా, ఆ స్వరూప ఇంట రాత్రి వచ్చి వేడిగా అన్నీ చేసింది.
ఇన్ని రోజులనుంచి చేస్తున్న లక్ష్మి కి తను అలా తాళం ఇవ్వగలదా? ఎందుకంటే తనకి మనుషుల మీద నమ్మకం తక్కువ. లహరి అన్నట్టు ఇంట్లో డబ్బు, బంగారం లేకపోతే పోయేందుకు ఏమి ఉంటాయి? భాస్కర్ ఎన్నిసార్లు చెప్పినా, లక్ష్మితో ఎప్పుడూ విసుగ్గా మాట్లాడడం తప్ప సవ్యంగా మాట్లాడలేదు, పనివాళ్ళకి అలుసు ఇవ్వకూడదు అని.
భాస్కర్ చిన్న చిన్న సాయాలు చెయ్యబట్టి, లహరి వాళ్లతో చక్కగా మాట్లాడబట్టి ఇవాళ ఒక్క ఫోన్ చెయ్యగానే రాజు పరిగెట్టుకువచ్చాడు, లక్ష్మి లహరికి ఫోన్ చేసి భాస్కర్ ఆరోగ్యం ఎలా ఉంది అని కనుక్కుంది.
లహరికి కార్ ఉండబట్టే కదా త్వరగా అన్ని పనులూ అవుతున్నాయి, అదే తను చెప్పినట్టు బంగారం, వజ్రాలు కొంటే ఏం లాభం? లాకర్ లో పెట్టడం తప్ప.
భాస్కర్ అన్నట్టు ఈ కాలం పిల్లలకి తమకంటే ఎక్కువే తెలుసు, వాళ్ళ సంపాదన, ఎలా సుఖంగా ఉంటాము అని చూసుకుని ఖర్చు పెడుతున్నారు, తమ కాలం లో పరిస్థితులు వేరు, ఇప్పుడు వేరు. మేము ఉన్నట్టు మీరు ఉండండి అనడం,
వాళ్ళకి అభిమానాలు లేవు, బాధ్యతలు లేవు అనడం ఎంత తప్పు, ఇవాళ లహరి చేసినంత పద్దతిగా, బాధ్యతగా తను చెయ్యగలదా?
ఊరికే పిల్లలు చేసే ప్రతిపనీ విమర్శించేకన్నా, ఈ వయసులో వాళ్ళు చెప్పినట్టు వినడం మంచిది అంటుకుంటూ నిద్రకి ఉపక్రమించింది.
***
రచన: శ్రీపతి లలిత.