గాలి kaburlu

ఈనాడు, ఆదివారం • 03 May 2026 • 👁 8 views
Sent from my iPhone

Begin forwarded message:

From: lalitha sripathi <sripathi.lalitha@gmail.com>
Date: 3 May 2026 ఈనాడు ఆదివారం అనుబంధంలో వచ్చిన కథ.





గాలి కబుర్లు.



“ఇందిరా!” ఫోన్‌లో ఆందోళన ధ్వనిస్తున్న అక్క గొంతు విని, “ఏంటక్కా!” ఆదుర్దాగా సావిత్రిని అడిగింది.

“మీరంతా ఎలా ఉన్నారు? అమ్మాయి,అల్లుడు బావున్నారా? నీ ఆరోగ్యం, శేఖర్ ఆరోగ్యం అంతా బావుంది కదా?” కంగారుగా ప్రశ్నలు సంధిస్తున్న అక్కతో, “ఏంటీ! మళ్లీ తెల్లవారుజామున కలేమన్నా వచ్చిందా?” అక్క భయాలు, అనుమానాలు తెలుసు కనక, నవ్వుతూ అడిగింది.
“అయినా! వారం క్రితమేగా స్రవంతి ఇక్కడికి వచ్చి వెళ్ళింది. తను చెప్పలేదా మేము ఎలా ఉన్నామో?”

“నీకు అన్నీ నవ్వులాటలే! ఇక్కడ కొంపలు మునిగే విషయాలు వింటుంటే, నాకు నిద్రపట్టడం లేదు, సరేలే! అంతా బావున్నారుకదా!” ఫోన్ పెట్టేసింది.

సావిత్రి, ఇందిర అక్కాచెల్లెళ్లు. వాళ్ళకి ఇద్దరు అన్నదమ్ములు, అందరి కన్నా పెద్దది సావిత్రి, నలుగురిలోనూ చిన్నది ఇందిర. ఇద్దరికీ వయసులో పది ఏళ్ళు తేడా. అందుకని ఇందిరని, ఇప్పటికీ చిన్న పిల్లలాగా చూస్తుంది ఆమె.

సావిత్రి విజయవాడలో ఉంటుంది. ఆవిడ భర్త, అక్కడ మంచి పేరూ, సంపాదనా ఉన్న అడ్వకేట్.

ఇందిర, హైదరాబాద్‌లో లెక్చరర్‌గా చేసేది. ఆమె భర్త శేఖర్, బ్యాంకు ఆఫీసర్‌గా చేసి రిటైర్ అయ్యాడు. ఒక్కతే కూతురు స్నేహ పెళ్లి అయ్యాక, ఇందిర కూడా ఉద్యోగం మానేసింది.

“ఎందుకు ఇంకా సర్వీస్ ఉండగా ఉద్యోగం మానేశావు?” అని ఎవరైనా అడిగితే, “ఇన్నిరోజులూ ఎవరి ఉద్యోగాలలో వాళ్ళు మునిగిపోయి, నేనూ, శేఖర్, కబుర్లు చెప్పుకునే సమయం లేకుండా గడిపాం. బాధ్యతలు తీరిపోయాయి, డబ్బు ఇబ్బంది లేదు, ఇప్పుడైనా హాయిగా కబుర్లు చెప్పుకుంటాం” చెప్పేది.

“శేఖర్ భలే మంచివాడే ఇందిరా! నీ అదృష్టం కొద్దీ అలాంటివాడు దొరికాడు. ఒక్కసారి కూడా ముఖంలో విసుగు చూడలేదు!” అని అక్క అంటే, “బ్యాంక్లో ఖాతాదారులతో ఓపిగ్గా మాట్లాడి అలవాటయిందిలే ఆ శాంతం. పెళ్ళాం దగ్గరకొస్తే, కోపాలు,చిరాకులు అన్నీ బయటికి వస్తాయి. మీ మరిదిని ఓ పొగిడెయ్యకు” అనేది నవ్వుతూ.

వీళ్లు మంచి అన్యోన్య దంపతులని, బంధువులందరూ అంటారు, అనుకుంటారు.
అలాంటి వారి గురించి, ఇప్పుడు వింటున్న వార్తలు, చెల్లెలికి ఎలా చెప్పాలో తెలియడంలేదు సావిత్రికి.

ఇందిరది సర్దుకుపోయే స్వభావం, శేఖర్ సరేసరి. అలాంటివాళ్ల కాపురంలో గొడవలేంటి? నమ్మశక్యం కాకపోయినా, చెప్పింది ఎవరో తెలీని మనిషి కాదు, ఆమె తోడికోడలు కూతురు స్రవంతి.

కూతురు పుట్టాక ఉద్యోగం మానేసిన స్రవంతి, ఇప్పుడు మళ్లీ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తోంది.
“పెద్దమ్మా! నాకు హైదరాబాద్‌లో ఇంటర్వ్యూ ఉంది, ఒకదాన్ని వెళ్తాను. రెండురోజులు ఉండాల్సి వస్తుందేమో,
హోటల్‌లో ఉండాలంటే భయంగా ఉంది” అన్న ఆమెతో , “హోటల్ ఎందుకూ? ఇందిర పిన్ని ఉందిగా! నువ్వు హోటల్‌లో ఉన్నావంటే కోప్పడుతుంది కూడా, ఫోన్ చేసి చెప్తాలే! “ అంది సావిత్రి.

స్రవంతి వస్తోందంటే సంబరపడింది ఇందిర. “ఇంటర్వ్యూకి వస్తూ హోటల్‌లో ఉండడం ఏమిటి అక్కా! ఏ రైల్‌కి వస్తోందో చెప్పమను. ఈయన స్టేషన్‌కి వెళ్తారు” అంది.
అలానే, స్రవంతి రైలు దిగేసరికి శేఖర్ ఎదురుచూస్తున్నాడు.

“ఇంత పొద్దున్నే ఎందుకు ఇబ్బంది పడ్డారు బాబాయ్! నేను వచ్చేసేదాన్ని!” అన్న స్రవంతితో “అదేంటమ్మా! వేరే పని ఏముంది? ఉదయం వాకింగ్ బదులు, ఇక్కడికి వచ్చి ప్లాట్ఫాం మీద వాక్ చేశాను!”.

ఇంటికి వచ్చేసరికి ఇందిర ఎదురుచూస్తోంది. “ప్రయాణం బాగా జరిగిందా? ముందు మీవారికి చెప్పు ఇక్కడికి చేరినట్లు, లేపోతే ఖంగారు పడతారు!”, “సందు చివరే చెప్పించా! మళ్లీ నీ కబుర్లలో మర్చిపోతుందని” అన్నాడు శేఖర్.

స్నానం చేసి, ఫ్రెష్ అయి వచ్చిన స్రవంతికి, వేడి వేడి దోసలు వేసి, తను కూడా తింది ఇందిర.
“బాబాయ్ తినరా!” అంటే, “ఆయన గారు మనతో తినరు, ఆయన ఫలహారం వేరే!” మూతి విరిచింది.
శేఖర్ మొహమాటంగా నవ్వి వెళ్ళిపోయాడు.

స్రవంతి ఇంటర్వ్యూకి వెళ్ళడానికి, తమ కారుని, తెలిసిన డ్రైవర్ని ఇచ్చి పంపింది ఇందిర. “క్యాబ్ దొరకకపోతే టెన్షన్, కారులోనే వెళ్ళు, డ్రైవర్ అక్కడే ఉంటాడు, ఎంత టైం అయినా పర్వాలేదు, ఇంటర్వ్యూ అవగానే, మళ్లీ అందులో వచ్చేయి” చెప్పారు.

మొహమాటానికి వద్దన్నా, డ్రైవర్ ఉండడం ఎంత మంచిదో తెలిసి వచ్చింది స్రవంతికి. గచ్చిబౌలి అంతా ఒక పద్మవ్యూహంలా ఉంది. డ్రైవర్ సరిగ్గా ఆఫీస్ ముందు దింపి, “ అమ్మా! నేను ఈ పక్కన ఎక్కడో పార్కింగ్ చూసి ఉంటాను. మీరు అయిపోయాక ఫోన్ చెయ్యండి. లేట్ అయినా పర్వాలేదు, నేను బాక్స్ తెచ్చుకున్నాను” అన్నాడు.

“సరే!” అని వెళ్లిన స్రవంతికి, మూడు రౌండ్ల ఇంటర్వ్యూ అయ్యేసరికి, టైం కూడా మూడయ్యింది. మధ్యలో, వాళ్ళు చిన్న స్నాక్స్ ఇచ్చారు, దానితో పెద్ద ఆకలి వేయలేదు.

“మెయిల్ పంపుతాము” అన్నారు కానీ, స్రవంతికి తాను సెలెక్ట్ అయినట్లు అర్ధమయింది.
“జీతం ఎంత కావాలి? హైదరాబాద్‌లో చేస్తావా, బెంగళూరు వెళ్తావా? మీ ఆయన ఎక్కడ చేస్తారు, పాపని ఎవరు చూస్తారు?” ఇలా అన్ని ప్రశ్నలు వేశారు.

ఇంటికి రాగానే ఇందిర ఇంటర్వూ విశేషాలు అడిగి తెలుసుకుంది. శేఖర్ కూడా అక్కడే కూర్చుని విన్నాడు. “నీకు ఉద్యోగం వచ్చినట్లే!” అన్నారు ఇద్దరూ. పగలు భోజనం సరిగ్గా చెయ్యలేదని, రాత్రి త్వరగా భోజనం పెట్టింది ఇందిర.

స్రవంతితో పాటు తనుకూడా తినేసింది, శేఖర్ భోజనానికి కూర్చోలేదు. “అదేంటి పిన్నీ బాబాయి తినరా!” అంటే “ఆయనకి నా వంట సొక్కడంలేదు, ఏదో గడ్డీ, గాదం తింటారు!” విసుగ్గా అన్న ఇందిర మాటలు, స్రవంతికి అర్థం కాలేదు.

‘పొద్దున్న కూడా బాబాయి టిఫిన్ తినలేదు, ఇప్పుడు డిన్నర్ చేయడం లేదు! ఎందుకూ? పైగా పిన్ని మామూలుగా విసుక్కోదు, అలాంటిది ఆయన్ని విసుక్కుంటోంది అనుకుంది’.
“పగలంతా అలసిపోయి వచ్చావు, త్వరగా పడుకుందాం, పద!” అని గెస్ట్ బెడ్ రూమ్‌లోకి తీసుకెళ్లింది ఇందిర.

అక్కడ చూస్తే రోజూ వాడుతున్నట్టు ఉంది. ఇందిర అక్కడి వార్డ్రోబ్ లోనుంచి నైటీ తీసి మార్చుకుంటూ, “నీకు ఇవ్వనా?” అని అడిగింది. “వద్దు పిన్నీ! నేను తెచ్చుకున్నాను” అని స్రవంతి కూడా మార్చుకుంది.

“బాగా వేడిగా ఉంది, కాసేపు ఏసీ వేస్తాను” అని తలుపులు దగ్గరికి వేసింది. కొంచెంసేపు ఏసీ వేసి, రూమ్ చల్లపడ్డాక, ఫ్యాన్ వేసి పడుకుంది. “నాకు మధ్యాహ్నం నిద్ర పట్టదు అందుకే త్వరగా పడుకుంటా! “
అన్న ఇందిరని, “మీ బెడ్ రూమ్‌లో పడుకోవా?” అని అడగలేక పోయింది స్రవంతి.

కొత్త చోటు కావడం, ఇందిర ప్రవర్తన చిత్రంగా ఉండడంతో స్రవంతికి నిద్ర పట్టలేదు.
ఇంకో గంట తర్వాత శేఖర్ వచ్చి, “ఇందిర నిద్రపోయిందా?” అని అడిగి, “గుడ్ నైట్!”అని వెళ్ళాడు.

కొంచెంసేపు, హాలు నుంచి టీవీ శబ్దం నెమ్మదిగా వినిపించి, తర్వాత అదికూడా ఆగిపోయింది. కాసేపటికి స్రవంతికి కూడా నిద్ర పట్టింది. పొద్దున్న లేచిన స్రవంతికి, ఇందిర అప్పటికే లేచి టిఫిన్ చేస్తోంది.
“బాబాయి వాకింగ్‌కి వెళ్ళారు. వచ్చేస్తారు” అంటూ కాఫీ ఇచ్చి, తను కూడా తాగింది.
ఈ లోగా శేఖర్ వచ్చి, అతనే నిమ్మకాయ, తేనె కలుపుకుని తాగాడు.

రైలెక్కిన స్రవంతికి, ఇందిరా,శేఖర్‌ల ప్రవర్తన కొద్దిగా విడ్డూరంగా అనిపించింది. ‘ఒకే ఇంట్లో ఉంటూ, ఇద్దరూ కలిసి కాఫీ తాగరు, కలిసి భోజనం చెయ్యరు, ఒక రూమ్‌లో పడుకోరు ఏమైంది వీళ్ళ మధ్య?’

వచ్చీరాగానే, సావిత్రికి ఫోన్ చేసి,ఇంటర్వూ సంగతి చెప్పి, చూచాయగా ఇందిర గురించి అన్నది స్రవంతి.
“ఏమంటున్నావే! ఇందిరకి, శేఖర్‌కి గొడవలా? ఇద్దరూ వేరువేరు రూముల్లో ఉన్నారా? నాకు నమ్మబుద్ధి కావడంలేదు” అయోమయంగా అంది సావిత్రి.

సావిత్రి, చెల్లెలిని సంగతి ఏమిటని అడిగేలోగా, స్రవంతి, ఈ సంగతి దాచుకోలేక, తల్లితో చెప్పింది. స్రవంతి తల్లి అనసూయ, ఒక పెద్ద టీవీ ఛానల్ కి తక్కువా, యూట్యూబుకి ఎక్కువా!
ఆవిడకి వచ్చిన వార్తని, రంగులు అద్ది, తళుకులు దిద్ది, బయటికి వదులుతుంది.

మరో పది రోజులకి, సావిత్రి, తెలిసిన వారింటికి పెళ్లికి వెళ్ళింది.
అక్కడ ఇద్దరు,ముగ్గురు ఆడవాళ్లు, “ సావిత్రీ! మీ ఇందిరా వాళ్ళు విడాకులు తీసుకుంటున్నారట, నిజమేనా! ఈ వయసులో విడాకులేంటమ్మా!” అని అడిగేసరికి తట్టుకోలేక పోయింది సావిత్రి.

ఇంక లాభం లేదని, అప్పటికప్పుడు, హైదరాబాద్‌కి, కారులో ప్రయాణం కట్టింది.

చెప్పాపెట్టకుండా, గుమ్మం ముందు కారు దిగుతున్న అక్కని చూసి, ఆశ్చర్యపోయింది ఇందిర.
“అదేంటక్కా ఫోన్ అయినా చెయ్యకుండా వచ్చావు? “ అన్న చెల్లితో “ మీ ఇంటికి రావడానికి నాకు పర్మిషన్ కావాలేమిటే!” పరిశీలనగా ఇందిరని చూసింది సావిత్రి. ఆమె మామూలుగానే ఉంది. ‘ఇంట్లో అంత గొడవలు అయితే, మొహంలో కాస్త తేడా తెలుస్తుందిగా! బానే ఉంది’ అనుకుంది.

ఈ లోగా, శేఖర్ కూడా లోపలినుంచి వచ్చి, నవ్వుతూ పలకరించాడు.

సరిగ్గా భోజనాల టైంకి వచ్చింది సావిత్రి.
“రా అక్కా భోంచేద్దాం!” పిలిచింది ఇందిర. బల్లమీద రెండు కంచాలే ఉన్నాయి.
ఇందిర, ఒక కుర్చీలో కూర్చుని, సావిత్రికి, ఇంకో కుర్చీ చూపింది. “శేఖర్ తినడా?”
అన్న సావిత్రితో “ఏం చెప్పమంటావు? నువ్వు వచ్చావుగా! నీతో చెప్పుకుంటా నా బాధలు” అని శేఖర్ వంక కోపంగా చూస్తే, అతను నవ్వుతూ, అక్కడనుంచి వెళ్ళిపోయాడు.

ఇందిర కబుర్లు చెప్తూ, బానే తిన్నా, సావిత్రికి మాత్రం తిండి ఎక్కలేదు.
ప్రయాణం చేసి అలిసిపోయి ఉన్నావని, అక్కని రూంలోకి తీసుకు వచ్చింది ఇందిర.
తలుపు దగ్గరికి వేసి, తక్కువలో ఏసీ వేసి, “ నేనే వద్దామనుకున్నా! నువ్వే వచ్చావు, సంగతులు చెప్పు!” అంది ఇందిర నడుం వాలుస్తూ.

“కొంపలు మునిగే సంగతులే వింటున్నాం. అందుకే పరుగెత్తుకుని వచ్చాను” అంది సావిత్రి.
“అంత కొంపలు మునిగిపోయేవి ఏంటక్కా!” ఆశ్చర్యంగా అంది.
“నువ్వూ, శేఖర్ విడాకులు తీసుకుంటున్నారట, నిజమేనా?” సూటిగా అడిగింది సావిత్రి.
పిడుగు పడ్డట్టు చూసింది ఇందిర.
“ఏమంటున్నావక్కా! నేనూ, శేఖర్ విడాకులు తీసుకోవడమేంటి? జోకా!” అంది అయోమయంగా.

“జోకా! ఇంకేమన్నానా? టెన్షన్‌తో నా తల పగుల్తుంటే!
మీరిద్దరూ కలిసి తినడం లేదట, వేరువేరు గదుల్లో పడుకుంటారట! మొన్న మా బంధువుల పెళ్ళికి వెళ్తే, అక్కడ, మా తోటికోడలు, మీ పెదమామగారి అమ్మాయి, అందరికీ ఇదే సంగతి చెప్తున్నారు. పెళ్లయ్యి ముప్పై ఏళ్ల తర్వాత, ఇప్పుడు విడాకులేంటి!
అంత సమస్యలు ఏమున్నాయి. కూతురు పెళ్లి కూడా చేసారు.
ఏదన్నా భేదాలుంటే సర్ది చెప్పడానికి మేము లేమా?” ఆవేశపడుతూ, ఆయాసపడుతూ, మాట్లాడుతున్న అక్కని చూసి ఇందిర ముఖంలో రంగులు మారాయి.

‘తనకి, శేఖర్ కి విడాకులా? ఎలా ఈ వార్త పుట్టింది? అక్క ఏమంది? ఇద్దరూ కలిసి తినడం లేదు,కలిసి ఒక గదిలో పడుకోవట్లేదు…”
విషయం,వివరంగా ఆలోచించిన ఇందిరకి, ముందు ఆశ్చర్యం,తరవాత నవ్వు వచ్చింది. ఆపకుండా, తెరలు తెరలుగా నవ్వుతున్న చెల్లిని చూసి,

“నేను అడిగినదానికి సమాధానం చెప్పకుండా ఆ పిచ్చి నవ్వేంటి! మతి చలించిందా?” కోపంగా అంది సావిత్రి.

“ఇవన్నీ గాలి కబుర్లు అక్కా! దీని కోసమా పడిపడి, అంత దూరం నుంచి వచ్చావు?”
“గాలి కబుర్లా! అంటే అన్నీ అబద్ధాలా?” “ అబద్ధాలని ఎక్కడ అన్నాను అక్కా! గాలి కబుర్లు అన్నాను!” నవ్వు ఆపుకుంటూ అంది ఇందిర.

“ఏమోనమ్మా! నాకు అర్ధం కాలేదు!”

“అసలు సంగతి చెప్తాను విను. మెనోపాస్ తర్వాత , నాకు ఆరోగ్యం కొద్దిగా తేడా వచ్చింది.
ప్రతీ దానికీ కోపం,విసుగు,గట్టిగా ఎవరైనా అంటే ఏడుపు.

ఏమాత్రం ఒత్తిడి భరించలేకపోయేదాన్ని. ఇదంతా, ఉద్యోగంలోని ఒత్తిడివల్లే అనుకుని, ఉద్యోగం మానేసాను. శేఖర్ కూడా రిటైర్ అయ్యేక, ఎక్కడికైనా వెళ్దామంటే, నాకు ఓపిక, ఇష్టం, రెండూ ఉండేవి కావు. ఏం మాట్లాడినా గొడవ పెట్టుకునేదాన్ని.

ఒక రాత్రిపూట, ఉన్నట్టుండి గుండెలు దడ, దడలాడడం , చెమటలు పట్టేసరికి, గుండె జబ్బని భయపడి డాక్టర్ దగ్గరికి పరిగెత్తాం. ఆవిడ అన్ని పరీక్షలు చేసి, మెనోపాస్ వల్ల హార్మోన్ల అసమతుల్యత ఏర్పడిందని, ఇవన్నీ దాని లక్షణాలని చెప్పారు.

దాని కోసం యోగా, ధ్యానం చేస్తున్నా. ఏదో ఒక కాలక్షేపం ఉండాలని చెట్లపని చేస్తాను, ఇక్కడ ఆడవాళ్ళ గ్రూపుల్లో చేరి, సంగీతాలు, పారాయణలులాంటి టైంపాస్ చేస్తున్నా కూడా, ఒకో రోజు, నాకు ఒంట్లో నుంచి విపరీతమైన వేడి వస్తుంది. ఫ్యాన్ పెట్టుకున్నా సరిపోదు, ఏసీ వేసుకోవాలనిపిస్తుంది.

శేఖర్‌కి సైనస్. ఏసీ వేయగానే తనకి తుమ్ములు, ముక్కు బిగుసుకుపోవడం. ఏసీ వేస్తే తనకి నిద్రపట్టదు, వెయ్యకపోతే నాకు నిద్ర రాదు. ఈ గోలతో ఇద్దరికీ సరయిన నిద్ర ఉండడంలేదు. అందుకని వేరు,వేరు, రూముల్లో పడుకుంటున్నాం”.

“మరి ఇద్దరూ కలిసి భోజనం ఎందుకు చేయరూ?”
“శేఖర్ అసలు భోజనమే చెయ్యట్లేదు!” దిగులుగా అంది ఇందిర.
“అదేమిటీ?ఏదైనా జబ్బా?”

“ఛీ!ఛీ! జబ్బు కాదు డైటింగ్!”
“డైటింగా! ఈ వయసులో ఎందుకు?”
“అదేమరి! నేను ఇదేమాటంటే, తండ్రీకూతురు నా మీదికి ఎగబడ్డారు.
ఇప్పుడు శేఖర్‌కి అరవై. బీపీ, షుగర్ అన్నీ వచ్చాయి. బాగా బరువు పెరిగాడు నిజమే! ఇప్పుడు తగ్గాలని రోజూ అన్నం మానేసి అదేదో డైట్… నిమ్మకాయ నీళ్లు,మజ్జిగ,మొలకలు, కీన్వాలు! ఇలా అన్నీ లెక్క ప్రకారం తింటాడు.
తనకి కావాల్సినవి తనే చేసుకుని తింటాడు, నన్నూ అవే తినమంటే, నాకు ఎక్కవు.

నా ఒక్కదానికి వంట చేసుకోలేక విసుగు వస్తోంది.

వాళ్ల నాన్న, బరువు తగ్గి స్మార్ట్ గా అవ్వాలని నా కూతురి ఆజ్ఞ.
స్నేహ, ఇక్కడ ఇల్లు కొన్నది. దాని గృహప్రవేశానికి, ఈయన ఫొటోల్లో స్లిమ్ గా ఉండాలంటే, కనీసం పది కిలోల బరువు తగ్గాలని, వాళ్ళ నాన్నకి అల్టిమేటం ఇచ్చింది. అంత డైటింగ్ చేస్తే నీరసం వస్తుందని నా భయం. బరువు సంగతి దేవుడెరుగు, కళ్లు తిరిగి పడిపోతే!

నా మాట తండ్రి,కూతురూ ఇద్దరూ లెక్క చేయట్లేదు” అలకగా అంది అక్కతో.

‘ఇదా అసలు సంగతి’ అనుకుంది సావిత్రి.
“అసలు ఇంటికి వచ్చిన వాళ్ళు, వాళ్ల పని చూసుకుని వెళ్లక, మేము ఒక రూమ్‌లో పడుకుంటున్నామా? వేరే రూముల్లో పడుకుంటున్నామా? ఇద్దరూ కలిసి తింటున్నామా, ఇవన్నీ ఎందుకు వీళ్లకి.

పాతరోజుల్లో మూడు గదుల ఇంట్లో, అరడజను మంది ఉండేవారు. ఇబ్బంది ఉన్నా, అక్కడే సర్దుకోవాలి. ఇప్పుడు మనుషులు నలుగురు, మూడు బెడ్‌రూమ్‌లు.
మొగుడూ, పెళ్ళాం నాలుగు రోజులు వేరే, వేరే, గదుల్లో పడుకుంటే తప్పా!
మేమేమన్నా కొత్తగా పెళ్లైన వాళ్లమా!” విసుక్కుంది ఇందిర.

“ఏదో బంధువులు వచ్చి వెళ్తుంటే, ఇల్లు సందడిగా ఉంటుందని మేమనుకుంటే, వీళ్లు ఇలాంటి ప్రచారాలు చేస్తారా! ఈసారి ఎవర్నీ రానీయం!” కోపంగా అంది.
“ఇప్పుడిలాగే అంటావు! ఎవరైనా ఫోన్ చేస్తే…”
‘సత్యం!’ అన్నట్లు ఫోన్ మోగింది.
“వదినా! బావున్నారా? అన్నయ్య ఎలా ఉన్నారు?” ‘మా పెద్దాడపడుచు’ అక్కకి చెప్తూ, “ఆ సావిత్రక్క వచ్చింది. అబ్బే ఉండదు! మా బావని వదిలిపెట్టి ఎక్కడుంటుంది?

ఓ వెరీ గుడ్! ఎప్పుడొస్తున్నారు? మీ తమ్ముడు స్టేషన్‌కి వస్తారు. ఆ పెళ్లి అయ్యాక, తప్పకుండా మా ఇంట్లో, నాలుగు రోజులుండి వెళ్ళాలి. ఓకే! అలానే!”
ఫోన్ పెట్టేసి “మా పెద్దాడపడుచు మరిది కూతురు పెళ్లిట. రేపు వస్తున్నారు, నాలుగు రోజులుంటారు!”

“మళ్లీ ఏ గాలి కబుర్లు పుడతాయో!” భయంగా అన్న అక్కతో, “ఎవరైనా వచ్చినప్పుడు ఒకే రూమ్‌లో పడుకుంటాంలే అక్కా! ఆయన్ని కూడా, ఆ నాలుగు రోజులు, డైటింగ్ మానమని చెప్తాలే!” నవ్వుతూ అనేసింది ఇందిర. “గాలితో జాగ్రత్త పడ్తాంలే!”

రచన: శ్రీపతి లలిత.
ఇది నా స్వీయ రచన.













Sent from my iPad