అంతరంగంలో అశాంతి

ఈనాడు దినపత్రిక • 29 Oct 2026 • 👁 1 views
అంతరంగంలో అశాంతి
అంతరంగంలో అశాంతి
అంతరంగంలో అశాంతి
(ఈనాడు దినపత్రికలో 29/10/2026 మకరందం శీర్షికలో ప్రచురితం )
కురుక్షేత్ర యుద్ధం ముగిసింది. పాండవులు విజయం సాధించారు. హస్తినాపుర సింహాసనం ధర్మరాజును ఆహ్వానిస్తోంది. కానీ ఆయన మనసులో మాత్రం ఆనందం లేదు. రాజ్యాన్ని గెలిచినప్పటికీ, ఆ రాజ్యం కోసం తనవారినే కోల్పోయాననే బాధ ఆయన హృదయాన్ని దహిస్తోంది.
యుద్ధభూమిలో పడిపోయిన భీష్ముడు అంపశయ్యపై ఉన్నాడు. ధర్మానికి ప్రతిరూపమైన ఆ మహనీయుడి వద్దకు ధర్మరాజు వెళ్లాడు. చేతులు జోడించి నిలబడి, “తాతా! ఈ రాజ్యం నాకు ఎందుకు? నా కోసం ఇంతమంది ప్రాణాలు కోల్పోయారు. అన్నదమ్ములు, గురువులు, బంధువులు లేని ఈ విజయాన్ని ఎలా ఆస్వాదించగలను?” అని అడిగాడు.
భీష్ముడు అతని వైపు ప్రశాంతంగా చూసి “ధర్మరాజా ! యుద్ధం ముగిసింది. కానీ నీ అంతరంగంలో యుద్ధం ఇంకా ముగియలేదు. బయట శత్రువులను జయించడం సులభం. మనసులోని పశ్చాత్తాపాన్ని జయించడం కష్టం. ఇప్పుడు నీ ముందున్న అసలైన కర్తవ్యం రాజ్యపాలన చేయడం. ” అన్నాడు.
“కానీ తాతా... ఇంత రక్తపాతం తర్వాత నేను ఎలా ప్రశాంతంగా ఉండగలను?” అని యుధిష్ఠిరుడు అడిగాడు.
భీష్ముడు చిరునవ్వు నవ్వాడు.
“ధర్మం అంటే మనకు నచ్చినదాన్ని చేయడం కాదు. పరిస్థితికి తగిన కర్తవ్యాన్ని నిష్పక్షపాతంగా నిర్వర్తించడం. నీకు వ్యక్తిగతంగా ఎంత బాధ ఉన్నా, ప్రజల బాధ్యత నీ మీద ఉంది. రాజు తన సుఖదుఃఖాలకంటే ప్రజల క్షేమాన్ని ముందుగా చూడాలి. బలహీనులను రక్షించాలి. న్యాయాన్ని కాపాడాలి. సంపదను ప్రజల అభివృద్ధికి వినియోగించాలి. కోపం, లోభం, అహంకారం వంటి భావాలేవీ నిర్ణయాలను ప్రభావితం చేయకుండా చూసుకోవాలి
మరో ముఖ్యమైన విషయం. “రాజధర్మం అంటే శిక్షించడం మాత్రమే కాదు తప్పు చేసినవారిని సరిదిద్దడం కూడా ధర్మమే. ప్రజలపై అధికారం చూపడమే కాదు, వారి బాధ్యతను స్వీకరించడం రాజధర్మం. రాజు ముందుగా తనను తాను జయించాలి. తన మనసును జయించలేని వ్యక్తి రాజ్యపాలన ఎలా చేయగలడు ?”అన్నాడు.
ఆ మాటలు ధర్మరాజు హృదయంలో నాటుకున్నాయి. మనసులోని అంతులేని దుఃఖాన్ని ప్రజాసేవగా మార్చుకోవాలని నిర్ణయించుకున్నాడు.
అందుకే శాంతి పర్వం యుద్ధం తర్వాత చోటుచేసుకున్న నిశ్శబదాన్ని గురించి మాత్రమే చెప్పదు. ఆ నిశ్శబ్దంలో మనిషి తనను తాను ప్రశ్నించుకోవడం గురించి వివరిస్తుంది. యుద్దంలో చేకూరిన విజయం వల్ల రాజ్యం ప్రాప్తించడం జరిగింది. కానీ అంతరంగంలో శాంతి మాత్రం మన కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వర్తించినప్పుడే లభిస్తుంది.కురుక్షేత్రం యుద్ధభూమిగా ముగిసినా, భీష్ముడి అంపశయ్య ధర్మభూమిగా మారింది. అక్కడి నుంచి వెలువడిన బోధ ధర్మరాజుకు మాత్రమే కాదు. అధికారంలో ఉన్న ప్రతి ఒక్కరికీ వర్తిస్తుంది. పదవి వల్ల వచ్చే కీర్తి కంటే .. ఆ పదవిని చేపట్టిన బాధ్యత మరింత గొప్పది. మనసును జయించడమే విజయం. ధర్మాచరణే శాంతి అని స్పష్టమవుతుంది. ***"
- జె. అనిల్ కుమార్