అనుబంధం

కదంబం • 25 Oct 2026 • 👁 1 views
అనుబంధం
అనుబంధం (కథ )
రచన : జీడిగుంట నరసింహ మూర్తి
( 25/10/2026 కదంబం వాట్స్ యాప్ పత్రికలో ప్రచురితం )
“వీరు మీ అన్నయ్యగారా సార్?” అని అడిగాడు కృష్ణారావు చేత మరో డిపాజిట్ చేయించడానికి వచ్చిన ఏజెంటు.
“భలేవాడివయ్యా! ఇతను మా తమ్ముడు. నా కన్నా పదేళ్లు చిన్నవాడు” అన్నాడు కృష్ణారావు.
“అవునా సార్! చూస్తుంటే మీకన్నా పదేళ్లు పెద్దవాడిలా కనిపిస్తున్నారు. అందుకే అలా అడిగాను. ఏమీ అనుకోకండి” అన్నాడు ఏజెంటు నవ్వుతూ.
కృష్ణారావు కూడా నవ్వేశాడు. పక్కనే కూర్చున్న పరమేశం మాత్రం చిన్నగా నవ్వి ఊరుకున్నాడు.
పరమేశం కృష్ణారావుకు తమ్ముడు. కృష్ణారావు పట్టణంలో స్థిరపడి వ్యాపారాలు చేస్తూ ఆస్తులు కూడబెట్టుకున్నాడు. పరమేశం మాత్రం ఉద్యోగాల కోసం పట్టణాల వెంట తిరగకుండా, తండ్రి ఇచ్చిన రెండెకరాల పొలాన్నే నమ్ముకుని పల్లెలోనే ఉండిపోయాడు. వ్యవసాయమే అతని జీవనాధారం. పొలంలో ఎండనకా, వాననకా కష్టపడటమే తప్ప తన ఒంటిమీద శ్రద్ధ పెట్టడం అతనికి అలవాటు లేదు. మాసిన దుస్తులు, అస్తవ్యస్తంగా ఉన్న జుట్టు, ఎండకు నల్లబడిన చర్మంతో అతను తన వయసు కంటే పదేళ్లు పెద్దవాడిలా కనిపించేవాడు. అందంగా తయారవ్వాలనే ఆలోచన గానీ, ఇతరులు తన రూపాన్ని చూసి ఏమనుకుంటారనే పట్టింపు గానీ అతనికి ఉండేవి కావు. తండ్రి ఇచ్చిన పొలాన్ని సాగుచేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకోవడమే అతని ధ్యేయం. అందుకే పట్టణానికి వచ్చినప్పుడు కూడా అతని వేషధారణ చూసి చాలామంది అతన్ని సాధారణ వ్యక్తిగా భావించేవారు. కానీ అతని మనసులోని ఆప్యాయతను, ఆత్మీయతను మాత్రం పైకి కనిపించే రూపంతో ఎవరూ అంచనా వేయలేరు.
అయితే అన్నదమ్ముల మధ్య అనుబంధం మాత్రం బాగానే ఉండేది. నెలకొకసారైనా అన్న దగ్గరకు వచ్చి రెండు రోజులు గడిపేవాడు పరమేశం. కృష్ణారావు కూడా తన వ్యాపార విషయాలు, బ్యాంకు నిల్వలు, స్థలాల వివరాలు తమ్ముడితో పంచుకునేవాడు. తనకు ఉన్న డిపాజిట్లు ఎక్కడెక్కడ ఉన్నాయో, ఏయే ప్రాంతాల్లో స్థలాలు కొన్నాడో అన్నీ దాచకుండా చెప్పేవాడు.
“ప్రతివారూ ఉద్యోగాల కోసం పరుగులెత్తకుండా తమకున్న ఆర్థిక వనరులతో చిన్న వ్యాపారాన్ని ప్రారంభించి, దాన్ని అంచెలంచెలుగా అభివృద్ధి చేసుకుంటూ పోతే ఈ దేశంలో పనిలేకుండా ఎవరూ ఖాళీగా ఉండరు” అని చెబుతూ ఉంటే పరమేశం ఆసక్తిగా వినేవాడు.
కొంతకాలంగా పరమేశం పరిస్థితి మాత్రం అంతంతమాత్రంగానే ఉండేది. వర్షాలు సరిగా పడక, ఎరువులు కొనడానికి డబ్బులు లేక వ్యవసాయం భారంగా మారింది.
“అన్నయ్యా! ఈ వ్యవసాయం నన్ను ఎంతకాలం ఆదుకుంటుందో తెలియడం లేదు. ఏదైనా చిన్న వ్యాపారం చేసుకుంటే బాగుంటుందేమో అనిపిస్తోంది” అనేవాడు.
“నేను ఈ రోజుల్లో ఏ వ్యాపారం అయితే నష్టం లేకుండా, పరిమిత పెట్టుబడితో చేసే అవకాశం ఉంటుందో ఆలోచించి చెబుతానులే. తొందరపడకు” అని కృష్ణారావు ధైర్యం చెప్పేవాడు.
ఒకరోజు కృష్ణారావుకు అనారోగ్యం చేసింది. వైద్య పరీక్షల్లో రక్తంలోని ప్లేట్‌లెట్లు బాగా తగ్గిపోయాయని తెలిసింది. పరిస్థితిని బట్టి రక్తం ఎక్కించాల్సి రావచ్చని వైద్యులు చెప్పారు. అవసరమైన రక్తదాతల కోసం కుటుంబ సభ్యులు ప్రయత్నించాలని సూచించారు.
కృష్ణారావు భార్యకు కాళ్లూచేతులూ ఆడలేదు. భర్తకు ఆపద వచ్చిందని తెలిసి దగ్గరి బంధువులందరికీ ఫోన్లు చేసింది. కుటుంబంలో ఆర్థికంగా బాగా ఉన్నవాళ్లూ ఉన్నారు. కృష్ణారావు సహాయంతో ఎదిగినవాళ్లూ ఉన్నారు. గతంలో తమ అవసరాలకు అతని దగ్గరికి వచ్చి సాయం పొందినవాళ్లూ ఉన్నారు.
కానీ ఇప్పుడు పరిస్థితి వేరు.
“ఈ మధ్యే నాకు జ్వరం వచ్చి తగ్గింది. ఇప్పుడెలా రక్తం ఇస్తాను?” అన్నారు ఒకరు.
“మా ఆయనకు హిమోగ్లోబిన్ తగ్గిపోయి ఆరు నెలల నుంచి మందులు వాడుతున్నారు. ఎక్కడ పడితే అక్కడ పడిపోతున్నారు” అంటూ మరొకరు తప్పించుకున్నారు.
“ఒకసారి మా అమ్మకు రక్తం ఇవ్వాల్సి వచ్చినప్పుడు నేను కళ్లు తిరిగి పడిపోతే డాక్టర్లు అప్పటినుంచి జాగ్రత్తగా ఉండాలని సలహా ఇచ్చారు” అంటూ ఇంకొకరు ఫోన్ పెట్టేశారు.
ఒక్కొక్కరి మాట వింటుంటే కృష్ణారావు భార్యకు ఏడుపొచ్చింది. డబ్బు అవసరమైనప్పుడు, ఏదైనా పని చేయించుకోవాల్సినప్పుడు తన భర్త చుట్టూ తిరిగినవాళ్లే ఇప్పుడు ముఖం చాటేస్తున్నారని ఆమెకు బాధ కలిగింది.
కృష్ణారావు మాత్రం ఆమెను ఓదార్చడానికి ప్రయత్నించాడు.
“ఎవరినీ బలవంతం చేయలేం. వాళ్లకూ ఏవో ఇబ్బందులుండవచ్చు. నువ్వు బాధపడకు. వైద్యులు ఏం చెబితే అది చేద్దాం” అన్నాడు.
అదే సమయంలో పరమేశం తన ఊళ్లో ఉన్నాడు. కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలకు పొలంలో కాస్త పంట వచ్చే ఆశ కలిగింది. కనీసం పది బస్తాల ధాన్యమైనా పండితే కుటుంబాన్ని కొంతకాలం నెట్టుకురావచ్చని అనుకున్నాడు. ఎండిపోయిన భూమిని మళ్లీ సాగులోకి తెచ్చేందుకు కష్టపడుతున్నాడు.
అప్పుడే అన్నకు అత్యవసరంగా రక్తం కావాల్సి వచ్చిందని, బంధువులెవరూ ముందుకు రావడం లేదని తెలిసింది.
మరో ఆలోచన చేయలేదు. పొలంలో మిగిలిన పనిని చూసుకోమని అక్కడున్నవారికి చెప్పి, ఉన్నదాంట్లోనే కొంత డబ్బు తీసుకుని పట్టణానికి బయలుదేరాడు. తన పొలంలో పంట నిలదొక్కుకుంటుందో లేదో తెలియని పరిస్థితి. అయినా అన్నకు ఆపద వచ్చిందన్న వార్త విన్న తరువాత పొలంలో ఉండబుద్ధి కాలేదు.
ఆసుపత్రికి చేరేసరికి కృష్ణారావు భార్య ఆందోళనగా బయట నిలబడి ఉంది.
“వదినా! అన్నయ్య ఎలా ఉన్నాడు?” అని అడిగాడు పరమేశం.
ఆమె కన్నీళ్లు పెట్టుకుంది.
“ఏమని చెప్పమంటావ్ పరమేశం! రక్తం కోసం అందరినీ అడిగాము. ఎవరికివారు ఏవేవో కారణాలు చెబుతున్నారు.”
“నువ్వేం బాధపడకు వదినా. నేనున్నాను కదా!” అన్నాడు పరమేశం.
వైద్యులు అతన్ని పరీక్షించి, రక్తదానానికి అర్హుడని నిర్ధారించిన తరువాత అవసరమైన రక్తదాన ప్రక్రియను నిర్వహించారు. పరమేశం ఎలాంటి సంకోచం లేకుండా ముందుకొచ్చాడు.
ఆ రోజు పరమేశం దేవుడిలా వచ్చాడని అందరూ అనుకున్నారు.
“పాపం! నువ్వు ఊళ్లో పొలం పనులు వదిలేసి మా కోసం వచ్చావ్!” అంటూ తన సంతోషాన్ని వ్యక్తం చేసింది వదిన.
“అన్నయ్య ప్రాణం కన్నా పొలం ఎక్కువా వదినా? పంట మళ్లీ పండించుకోవచ్చు. కానీ అన్నయ్యకు ఏదైనా అయితే తిరిగి తెచ్చుకోగలమా?” అన్నాడు పరమేశం.
ఆ మాటలు విన్న కృష్ణారావు కళ్లలో నీళ్లు తిరిగాయి.
తనకున్న ఆస్తిపాస్తులు, బ్యాంకు నిల్వలు, స్థలాల గురించి తమ్ముడితో ఎన్నోసార్లు చెప్పుకున్నాడు. కానీ తనకు అవసరమైన సమయంలో తమ్ముడు తనకోసం పొలాన్ని వదిలి వస్తాడని మాత్రం ఊహించలేదు. తనకంటే చిన్నవాడైనా, రూపంలో పెద్దవాడిలా కనిపించే తమ్ముడి మనసులో ఇంతటి ఆప్యాయత ఉందని ఆ రోజు మరింత స్పష్టంగా తెలుసుకున్నాడు.
చికిత్సతో కృష్ణారావు క్రమంగా కోలుకున్నాడు. ఇంటికి వచ్చిన తరువాత ఒకరోజు తమ్ముడిని పిలిచి పక్కన కూర్చోబెట్టుకున్నాడు.
“పరమేశం! నీ పొలంలో పంట చేతికి వచ్చే సమయంలో నా కోసం పరుగెత్తుకొచ్చావు. నీ పరిస్థితి ఏమిటో నాకు తెలుసు. అయినా ఇంతకాలం నీ కష్టాలను పూర్తిగా అర్థం చేసుకోలేకపోయాను. నీకు ఏదైనా చిన్న వ్యాపారం చేసుకోవాలనే కోరిక ఉందని చెప్పావు కదా! మనం కలిసి ఆలోచించి ఏదైనా మంచి వ్యాపారం మొదలుపెడదాం” అన్నాడు.
పరమేశం కొద్దిసేపు మౌనంగా ఉండిపోయాడు.
“అన్నయ్యా! నువ్వు కోలుకున్నావు. నాకు అంతకంటే ఇంకేం కావాలి? నా సంగతి తర్వాత చూసుకోవచ్చు” అన్నాడు.
“నీ సంగతి తర్వాత కాదు, ఇప్పుడే చూసుకోవాలి. నువ్వు నీ కాళ్ల మీద నువ్వు నిలబడితే నాకు అంతకంటే సంతోషం ఏముంటుంది?” అన్నాడు కృష్ణారావు.
తమ్ముడికి ఏ వ్యాపారం సరిపోతుందో ఇద్దరూ చర్చించుకున్నారు. చివరికి పరమేశం ఉండే పల్లెకు సమీపంలోని పట్టణంలో వ్యవసాయ పనిముట్లు, విత్తనాలు, ఎరువులకు సంబంధించిన చిన్న దుకాణం పెట్టాలని నిర్ణయించారు. వ్యవసాయం గురించి పరమేశానికి ఉన్న అనుభవం ఆ వ్యాపారానికి ఉపయోగపడుతుందని కృష్ణారావు భావించాడు. అవసరమైన పెట్టుబడిని సమకూర్చి, దుకాణం ఏర్పాటుకు కావలసిన సహాయం చేశాడు.
పరమేశం తన రెండెకరాల పొలాన్ని నమ్మకమైన రైతుకు కౌలుకు ఇచ్చాడు. దానివల్ల వచ్చే ఆదాయాన్ని పక్కన పెడుతూ, దుకాణంపై పూర్తి శ్రద్ధ పెట్టాడు. వ్యవసాయం గురించి తనకున్న అనుభవంతో రైతులకు తగిన సలహాలు ఇచ్చేవాడు. అందరితో ఆప్యాయంగా మాట్లాడేవాడు. లాభం కోసం నాణ్యతలో రాజీ పడకుండా, రైతులకు అవసరమైనప్పుడు అండగా నిలబడేవాడు.
మొదట్లో వ్యాపారం నెమ్మదిగా సాగినా, కొద్దికాలానికే పరమేశంపై రైతులకు నమ్మకం ఏర్పడింది. క్రమంగా వ్యాపారం పుంజుకుంది. కొన్నేళ్లలోనే దుకాణాన్ని విస్తరించి ఆర్థికంగా స్థిరపడ్డాడు. గతంలో తన వేషధారణ చూసి పెద్దవాడిలా భావించినవాళ్లే ఇప్పుడు అతని కష్టాన్ని, నిజాయతీని మెచ్చుకోవడం మొదలుపెట్టారు.
ఒకరోజు కృష్ణారావు పరమేశం దుకాణానికి వచ్చాడు. రైతులతో మాట్లాడుతూ, ప్రతి ఒక్కరి అవసరాన్ని శ్రద్ధగా తెలుసుకుంటున్న తమ్ముడిని చూసి సంతోషించాడు.
“ఎలా ఉంది పరమేశం? వ్యాపారం బాగానే సాగుతోందా?” అని అడిగాడు.
“నీ దయవల్ల బాగానే సాగుతోంది అన్నయ్యా! ఇప్పుడు పొలం మీద వచ్చే ఆదాయంతోపాటు నా కాళ్ల మీద నేను నిలబడగలిగాను” అన్నాడు పరమేశం.
కృష్ణారావు నవ్వుతూ, “ఇదంతా నీ కష్టమే తమ్ముడూ! నేను పెట్టుబడి ఇచ్చాను. దాన్ని నిలబెట్టింది మాత్రం నీ నిజాయతీ, నీ శ్రమ” అన్నాడు.
పరమేశం అన్నగారి చేతిని ఆప్యాయంగా పట్టుకున్నాడు.
కొన్నాళ్ల క్రితం తన ఆపదలో తమ్ముడు చూపిన ఆప్యాయత కృష్ణారావుకు గుర్తొచ్చింది. తమ్ముడికి సహాయం చేయడం ద్వారా అతను తన జీవితంలో స్థిరపడటమే కాకుండా, తన అన్నగా తనకూ ఎంతో తృప్తిని కలిగించాడు.
ఆ రోజు ఇద్దరూ ఒకరి కళ్లలోకి మరొకరు చూసుకున్నారు. చెప్పడానికి మాటలు అవసరం లేని అనుబంధం వారిది. ఒకప్పుడు తన ఆస్తిపాస్తుల గురించి తమ్ముడికి చెప్పుకుంటూ, జీవితంలో సంపాదించుకున్నదే గొప్ప సంపద అనుకున్న కృష్ణారావుకు ఇప్పుడు ఒక విషయం స్పష్టంగా అర్థమైంది. డబ్బుతో ఎన్నో అవసరాలు తీర్చవచ్చు. ఆస్తులతో జీవితానికి భరోసా కల్పించుకోవచ్చు. కానీ ఆపదలో ఆదుకునే ఆత్మీయతను మాత్రం డబ్బుతో కొనలేం.
తనకంటే పదేళ్లు చిన్నవాడైనా, రూపంలో తనకంటే పెద్దవాడిలా కనిపించే పరమేశం, ఆప్యాయతలో మాత్రం తనకంటే ఎంతో ఉన్నతుడని కృష్ణారావు మనసు చెప్పింది.
ఆ క్షణంలో అతనికి తన బ్యాంకు నిల్వలూ, స్థలాలూ గుర్తుకు రాలేదు. ఆపదలో తన కోసం అన్నింటినీ వదిలి పరుగెత్తుకొచ్చిన తమ్ముడే గుర్తుకొచ్చాడు.
ఆస్తులు మనిషికి అండగా నిలుస్తాయని ఇంతకాలం అనుకున్నాడు కృష్ణారావు. కానీ ఆపద వచ్చినప్పుడు ఆస్తులు కాదు, ఆప్యాయతతో నిండిన మనుషులే అండగా నిలుస్తారని ఇప్పుడు తెలుసుకున్నాడు.
తన జీవితంలో సంపాదించిన సంపదలన్నీ ఒకవైపు, తన కోసం ప్రాణానికి ప్రాణంగా నిలిచిన తమ్ముడి ప్రేమ మరోవైపు అనిపించాయి. భావోద్వేగాన్ని ఆపుకోలేక కృష్ణారావు తమ్ముడిని గుండెలకు హత్తుకున్నాడు. ఆ అన్నదమ్ముల ఆలింగనంలో మాటలకు అందని ప్రేమ, ఎన్నటికీ విడదీయలేని బంధం సజీవంగా కనిపించాయి***
సమాప్తం