. అమ్మ లేకుండా అవతరించారు
( ఈనాడు దినపత్రిక మకరందం శీర్షికలో 22/10/2026 న ప్రచురితం )
మన పురాణాలు, ఇతిహాసాలలో కొన్ని జన్మలు సామాన్య జన్మలకు భిన్నంగా కనిపిస్తాయి. తల్లి గర్భం ద్వారా జన్మించకుండా, దైవ సంకల్పంతో లేదా యజ్ఞాగ్ని, భూమి వంటి వాటి నుంచి అవతరించిన మహనీయులను ‘అయోనిజులు’ అంటారు.
ద్రౌపది అయోనిజగా ప్రసిద్ధి చెందింది. పాంచాల రాజు ద్రుపదుడు తనకు జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకునే శక్తిమంతుడైన కుమారుడు కావాలని యజ్ఞం చేశాడు. ఆ యజ్ఞాగ్ని నుంచి ధృష్టద్యుమ్నుడు, ద్రౌపది అవతరించినట్లు మహాభారతం పేర్కొంది . యజ్ఞం నుంచి అవతరించిన ద్రౌపదికి ‘యాజ్ఞసేని’ అనే పేరు వచ్చింది. యోని నుంచి జనించలేదు కాబట్టి ‘అయోనిజ’ గా ప్రసిద్ధి చెందింది.
జనక మహారాజు పొలాన్ని దున్నుతుండగా భూమిలో లభించింది. ఆమెకు సీత అని నామకరణం చేసి పెంచి పెద్దచేశాడాయన. అందుకే సీతమ్మను భూపుత్రి, అయోనిజ పేరుతో ఆరాధిస్తారు.
పృథు మహారాజు జన్మ కూడా అసాధారణమైనది. పౌరాణిక కథలను అనుసరించి వేనుని శరీరం నుంచి పృథువు అవతరించాడు. అంటే ఆయన జన్మ సాధారణ గర్భజన్మకు భిన్నమైనది.
గంగాడేవిని నదీదేవతగా, స్వర్గం నుంచి భూమికి అవతరించిన దివ్యమూర్తిగా పురాణాలు చిత్రించాయి. పురాణ కథలలో ప్రస్తావనకు వచ్చే దేవసేన, శచీదేవి వంటి దివ్య స్త్రీల అవతరణలు కూడా విశేషమైనవి. శచీదేవి ఇంద్రాణిగా దేవలోకంలో గౌరవం అందుకుంటుంది. సాధారణ జన్మకు అతీతమైనదిగా , మహిమ కలిగిన దైవశక్తి స్వరూపిణిగా శచీదేవిని వర్ణిస్తారు. దేవసేనను కుమారస్వామి సహచరిగా, దేవతల సంకల్పంతో అవతరించిన శక్తిగా భావిస్తారు. ఈ కథనాల్లో చారిత్రక వివరాల కంటే ఆధ్యాత్మిక భావన, ప్రతీకాత్మకత ప్రధానంగా కనిపిస్తాయి. స్త్రీశక్తి ప్రకృతి, జ్ఞానం, ధైర్యం, కరుణ వంటి రూపాల్లో అవతరిస్తుందని ఇవి సూచిస్తాయి.
అయోనిజుల కథలు అద్భుతాన్ని సూచించడమే కాదు. దైవ సంకల్పం ఏ రూపంలోనైనా వ్యక్తమవుతుందని తెలియజేసే ఆధ్యాత్మిక ప్రతీకలుగా నిలుస్తాయి. జన్మించినంతలో గొప్పదనం రాదు. జీవన విధానం, ధర్మబద్దమైన ఆచరణ, లోకశ్రేయస్సు కోసం కృషి విలువను పెంచుతాయి. ధన్యత చేకూరుస్తాయి. అందువల్లే అయోనిజుల కథలు భక్తి భావాన్ని, ధర్మచింతనను కలిగిస్తాయి***
- జె. ఉషారాణి