వస్తా వట్టిదే

ఈనాడు దినపత్రిక • 21 May 2026 • 👁 2 views
వస్తా వట్టిదే
. వస్తా వట్టిదే .. పోతా వట్టిదే ..ఆశ ఎందుకంట ?
(ఈనాడు దినపత్రిక అంతర్యామి శీర్షికలో 21/5/2026 ప్రచురితం )

మనిషి జీవిత ప్రయాణం ఒక విచిత్రమైన వైరుధ్యాల సమాహారం. ఖాళీ చేతులతో పుడతాడు. ఖాళీ చేతులతోనే వెళ్ళిపోతాడు. కానీ మధ్యలో మాత్రం “ఇది నాది”, “అది నాది” అనే మమకారాల వలలో చిక్కుకొని తనను తాను మరచిపోతాడు. ఈ సత్యాన్ని మనకు బలంగా గుర్తు చేసే ఒక ఘట్టం మహాభారతంలో కనిపిస్తుంది.
గాంధారి శాపానంతరం యాదవ వంశం నాశనమైపోయింది. ఆ తరువాత పాండవులు తమ జీవిత ధర్మాన్ని పూర్తి రాజ్యాన్ని, సంపదలను, బంధుమిత్రులను విడిచిపెట్టి మహాప్రస్థానం వైపు బయలుదేరారు.
ఈ సందర్భంగా అర్జునుడు తన గాండీవాన్ని వెంట తీసుకెళ్లాలని అనుకున్నాడు. అది అతనికి కేవలం ఒక ఆయుధం కాదు—తన గర్వం, తన గుర్తింపు, తన విజయాల ప్రతీక. అప్పుడు ఒక దివ్య పురుషుడు ప్రత్యక్షమై, “శరీరాన్నే వదిలిపెట్టి వెళ్లేటప్పుడు ఆయుధాలు ఎందుకు?” అని ప్రశ్నించాడు. ఆ దివ్య పురుషుడే అగ్నిదేవుడు. ఖాండవ దహనం సమయంలో ఆయన కృష్ణార్జునుల సహాయాన్ని ఆశించి వరుణ దేవుని నుండి దివ్యమైన గాండీవాన్ని అక్షయ తూణీరాలను పొందుతాడు. వాటిని అర్జునునిడికి ప్రసాదించిన విషయాన్ని గుర్తు చేసి ఆ ఆయుధాన్ని తిరిగి వెనక్కి తీసుకుంటాడు.
ఈ సంఘటనలో లోతైన సందేశం ఉంది. మనిషి జీవితంలో సంపాదించింది సంపాదించేది ఎంతైనా—అది ధనం, శక్తి ,కీర్తి ఏదైనా కావచ్చు—అన్నీ ఇక్కడికే పరిమితం. పుట్టేటప్పుడు ఏమీ తీసుకురానట్లే, వెళ్లేటప్పుడు కూడా ఏమీ తీసుకెళ్లలేం. కానీ మనిషి వస్తువులపై మాత్రమే కాకుండా శరీరం పైన కూడా వ్యామోహం పెంచుకుంటాడు. తన శక్తి సామర్ధ్యం ,సాధన ఇవన్నీ అతడి అహంకారాన్ని పెంచుతాయి. అర్జునుడి గాండీవం కూడా అదే అహంకారానికి ప్రతీక. అయితే దివ్యబోధన ద్వారా తనదంటూ ఏదీ లేదని పాండవ మధ్యముడు తెలుసుకుంటాడు.కృష్ణుడు వంటి మహాయోగి కూడా సమయం వచ్చినప్పుడు తన అవతారాన్ని చాలించాడు. అటువంటి మహాత్ముడే అన్నిటిని వదిలిపెట్టినప్పుడు, సాధారణ మనిషి తనకు ఉన్నదేదైనా శాశ్వతమని భావించడం ఎంత తప్పు ?
వస్తా వట్టిదే .. పోతా వట్టిదే .. ఆశ ఎందుకంట .. అనే ఎరుక అందరికీ అవసరం. దాన్ని పట్టించుకోకుండా సంపాదన కోసం, ప్రతిష్ట కోసం, హోదా కోసం పోటీ పడుతూనే ఉంటారు. చాలామంది. ఆ పోటీలో అంతర్యామిని, తమ అసలు స్వరూపాన్ని కోల్పోతుంటారు. జీవితానికి విలువ వస్తువుల వల్ల కాదు—దయ, ప్రేమ, వినయం, త్యాగం అనే అమూల్య భావాల వల్ల వస్తుంది. చివరికి మిగిలేది మనం పంచిన పంచిన మానవత్వమే.. తీసుకెళ్లేది ఏమీ లేదని తెలుసుకున్నప్పుడు మాత్రమే జీవితం సార్ధకమవుతుంది. అహంకారాన్ని విడిచిపెట్టి, మమకారాలను తగ్గించుకుని జీవన యాత్రను సార్థకం చేసుకోవడం మన చేతుల్లోనే ఉంది.ఒంటరిగా వచ్చి ఒంటరిగా వెళ్ళిపోయే మనిషి మధ్యలో తన పర భేధాలకు అతీతంగా అందరికీ ప్రేమను పంచి పెడితేనే జీవితం పరిపూర్ణమవుతుంది .
-జీడిగుంట నరసింహ మూర్తి