ఆరాధన

రచన • 01 Jan 2014 • 👁 1 views
ఆరాధన
ఆరాధన
గడియారం ఎనిమిది గంటలు కొట్టింది. దిలీప్ తలెత్తి చూసాడు .అప్పటికి తన సహోద్యోగులంతా వచ్చి ఉన్నారు. ప్రతి రోజూ ఇలాగే వస్తారు. కానీ ఇక్కడ అందరూ తన కార్యాలయం లోనే పని చేయాలని నియమం లేదు. అసలు రోజూ హాజరు ఇవ్వవలసిన పని లేనే లేదు. సాంకేతికంగా అనుకూలించటం వలన వారు ఈ పనులు ఎక్కడినుంచయినా చేసుకోవచ్చు. అంతా నమ్మకం మీద నడుస్తుంది. పని ఎంత జరిగింది అన్నది ముఖ్యం. ఎన్ని గంటలు పని లో కూర్చున్నారు అని కాదు. అతను అతని సహధ్యాయులూ అందరూ ఒకే పెద్ద గది లో కూర్చుంటారు. కేవలం పొద్దున్న ఒక రెండు గంటలు దిలీప్ తన కోసం కేటాయించిన చిన్న గది లో ఏమైయినా సున్నితమైన విషయాలు నిర్వహించటానికి కూర్చుంటాడు. ఎనిమిది గంటల తర్వాత నుండి ఆ గది తలుపు మీద "walk in" అని రాసి ఉంటుంది. అంటే ఎవరైనా ముందస్తు గా అనుమతి తీసుకోక పోయినా రావచ్చు. ఆ తర్వాత దిలీప్ పెద్ద గది లో కూర్చుని సహాధ్యాయులతో పాటే పని చేసుకుంటాడు.

"స్నేహమంటే రోజు సరదా గా కలిసి కాఫీ తాగటం కాదు. అవసరమైనప్పుడు పక్కన ఉండాలి"

ఆ మాటలలో ఏదో ప్రత్యేకత ధ్వనించి చటుక్కున తలఎత్తాడు దిలీప్. బోధిసత్వ కార్యాలయం లో ఉద్యోగస్తులు టీవీ చూస్తున్నారు.(పని చేస్తూ టీవీ చూడటం ఇక్కడ తప్పు కాదు. అందువల్ల ఫలితాల్లో ఒక్క రవ్వ కూడా తేడా రాలేదు. ఆ మాటకొస్తే ఫలితాలు మెరుగ్గా ఉన్నాయి. ). టీవీ లో ఏదో ధారావాహిక లో కథ నాయిక కాబోలు అంటోంది. కాని ఈ మాటలు తను ఎప్పుడో విన్నాడు. ఇప్పటికీ మరిచిపోలేదు కూడా. మాధవి తన జీవితం లో ఎప్పటికీ ఉపయోగపడే ఇటువంటి ఎన్నో మాటలు చెప్పింది. ఆమె చెప్పినప్పుడు తను ఒక మామూలు మనిషి (తన స్నేహితుల భాష లో మబ్బు గాడు, శత్రువుల మాటల్లో ఒక వాజమ్మ). వ్యావహారికం గా చెప్పాలంటే ఈరోజు ఎంతో మంది దృష్టి లో తను నిజం గానే చాల ముందుకు వెళ్ళాడు. ఒక పెద్ద సంస్థ కి అత్యుత్తమమైన అధికారి. కేవలం అదే కాకుండా తను ప్రారంభించి నడిపిస్తున్న ఎన్నో స్వచ్చంద సంస్థలు తనకిష్టం లేకున్నా తన పేరు రోజూ తలుచుకుంటూ ఉంటారు. అయినా ఈ రోజు ఇంతకు ముందు ఎప్పుడూ ఇలా లేని దిలీప్ ని చూసి మాధవి ఏమంటుందో అన్నది తనకి ముఖ్యం. ఎక్కడుందో మరి.

మొదటి సారి మాధవి ని చూచినప్పుడు ఏమీ అనిపించలేదు. తను ముగ్గురు అన్నదమ్ములలో ఒకడు. చెల్లెళ్లు లేకపోవటం వలన అడ వాళ్లతో ఎలా మాట్లాడాలో తెలియదు. మాట్లాడాలని కూడా అనిపించేది కాదు. మధ్య తరగతి కి చెందటం వల్ల బైటకి వచ్చినప్పుడల్లా ఒక రకమైన బెరుకు ఉండేది. చదువు తప్ప మరొక ధ్యాస లేదు. ఆ చదువు ధ్యాస లోనే మాధవి ని ఆరాధించాడు.

ఆ రోజులలో కంప్యూటర్ అంటే సినిమాలలో చూసే మర బొమ్మలని అనుకుంటూ ఉండే వారు. అదేదో మనకు సంబంధించినది కాదు చేయగలిగినది కాదు అనుకుంటూ ఉండే వాళ్లు. అటువంటి సమయం లో మాధవి కంప్యూటర్ లో అద్భుతాలు చేస్తుంటే మొదటి సారి గా ఆ అమ్మాయిని కలిసి అభినందించాడు. నిజం గా నిజాయితీ గా ఆలోచిస్తే తనను తాను అడిగితే అప్పుడు ఏదో ఆకర్షణ లోనే ఆ అమ్మాయిని కలిసాడెమో తెలియదు. ఆ రోజులలో తెలియని అమ్మాయిలతో మాట్లాడటం చాల అరుదైన విషయం. అంతే కాదు చాల ప్రమాదం కూడా ఉండేది. అయినా వెళ్లి పలకరించాడు. ఆడవారితో ఎలా మాట్లాడాలో తెలియక తన మగ స్నేహితులని సంబోధించినట్టే ఆమె ని ఏక వచనం లో సంబోధించాడు. తను ఏమీ అనుకో లేదనుకుంటా కాని ఒక రకం గా నవ్వింది. ఈ రోజు ఆ నవ్వు ఏమిటని ఆలోచిస్తే "ఎవరీ పద్దతీ పాడూ తెలియని చవట?" అని నవ్వుకుందేమో మరి. కాని ఎంతోకొంత నిజాయితీ గానే తన నుండి నేర్చుకోవాలనుకున్నాడు. ఆమె ఇంగ్లీష్ మీడియం లో చదువుకోవటం వల్ల కొంచెం ఎక్కువ ఇంగ్లీష్ మాట్లాడుతుంది. తనకి అది కొంచెం కష్టం గా ఉండేది. అలాగే ఆమె పద్దతులు ఆ రోజులలో కొంచెం మాడరన్ గా ఉండేవి. ఇడ్లీ, కారప్పొడీ తప్ప మరొక టిఫిన్ తెలియని కుటుంబం నుండి తను వచ్చాడు. మిగిలిన స్నేహితులు (?) ఆ విషయంలో తనని ఎప్పుడూ వేళాకోళం చేస్తూ ఉండే వారు. అందుకని వారితో హోటల్ కి కానీ మరెక్కడికైనా వెళ్ళాలంటే భయం. అటువంటి వాడినిమామూలు మనిషి గా చూస్తూ ఆమె మాట్లాడుతుంటే చాలా బాగుంటూ ఉండేది.

ఆ రోజులు ప్రేమించలేదనో లేక తనతో సినిమాకి రాలేదనో అమ్మాయిలపై ఆసిడ్ పోసే రోజులు కాదు. అమ్మాయిలని ఆరాధించేవాళ్ళు తప్ప వాళ్ళ అనాటమీ మీద చర్చలు చేస్తూ కూర్చోలేదు. "ఓపెన్ మైండ్" పేరు తో చెత్త కబుర్లు మాట్లాడుకోవటం, గుప్తం గా ఉన్న భావాలని సరదా కబుర్ల పేరుతో వ్యక్త పరచటం వంటి ఆత్మవంచనలూ కపట నాటకాలూ లేవు . కాని ఇప్పుడు కుర్రవాళ్ల కున్నట్టు మనసు విప్పి మాట్లాడే ధైర్యం కూడా చాల మందికి అప్పుడు లేదు. అనుకోని పరిస్థితుల్లో ఆమె పరిచయం జరిగింది.

తను కొత్తగా ఇంజనీరింగ్ లో చేరాడు. రాంక్ బాగానే వచ్చింది గాని మిగిలిన వారికున్న స్పీడ్ తనలో లేదు. కారణాలు ఎన్నొ. అందులో కొన్ని తనకి ఇంగ్లీష్ సరిగా రాకపోవటం, ఒక మధ్య తరగతి కుటుంబం నుంచి రావటం సనాతమైన కుటుంబం కావటం వంటి కారణాలు ఉన్నాయి. తన కాలనీ లోనే రాజేష్ అనే ఒక అందగాడు, తన క్లాస్మేట్ ఉండే వాడు. వాడిది హీరో పర్సనాలిటీ. డబ్బు కూడా ఉంది. తల్లి తండ్రులు చాల పెద్ద ఉద్యోగాల్లో ఉండే వారు. ముప్పై ఏళ్ల క్రితం రోజుల్లోనే వాడు కార్లో కాలేజీ కి వచ్చే వాడు. వాడి వెనక ఎప్పుడూ ఒక పెద్ద మంద ఉండేది. తను అదే కాలనీ లో ఉండే వాడు. కాలేజ్ పది కిలోమీటర్ల దూరంలో ఉండేది. ఇంట్లో ఒక సైకిల్ ఉంది గాని అది అన్నయ్య వాడే వాడు. రాజేష్ ఎలాగా వెళ్తున్నాడు కదా తను కూడా వాడితో వెళ్ళవచ్చు అనుకునే వాడు గాని అలా జరిగే ది కాదు. మిగతా ఫ్రెండ్స్ మోపెడ్ లలో (ఆరోజులలో ఆ వాహనం సైకిల్ కి ఎక్కువగానూ, బైక్ కి తక్కువగానూ ఉండేది) వచ్చి రాజేష్ ఇంట్లో పెట్టి వాడి కార్ లో కాలేజీ కి వెళ్ళే వారు. రాజేష్ కి తనతో ఏ బాధా లేకపోయినా మిగతా వారు తనని ఎందుకు రానిచ్చే వారు కాదో మొదట్లో తెలియలేదు. మెల్లిగా తెలిసిందేమిటంటే తన తొ వెళ్ళటం వాళ్ళ కి అవమానమని. తను దిట్టంగా తలకి నూనె రాసుకుని వదులైన చొక్కా, పాత ఫాంటు (నాన్న ఫాంటు సైజు చేయించుకుని) వేసుకుని వాళ్ళ తో తిరిగితే వారికి బాగుండదట. సాయి శ్రీనివాస్ అనే వాడు అందులో కొంచెం ఎక్కువ అవమానం చేసేవాడు. ఎవరో పిలుస్తున్నారనో, తనని పుస్తకాలు తీసుకుని రమ్మనో చెప్పే వాడు. తను ఆ పని చేసుకుని తిరిగి వచ్చేటప్పటికి వాళ్ళు కాలేజీ కి వెళ్ళిపోతూ ఉండే వారు. అంతవరకూ వాళ్లతో వెళ్లిపోతాననుకున్నాక అప్పుడు పది కిలో మీటర్లు నడవాలని తెలిసే సరికి ప్రాణం ఉసూరుమంటూ ఉండేది. ఇక వాళ్ళ తొ పెట్టుకోకుండా తన మానాన నడుచుకుంటూ కాలేజీ కి వెళ్ళటం అలవాటు చేసుకున్నాడు. నడక ఎంత అలవాటయ్యిందంటే టే ఎప్పుడో సైకిల్ మీద వెళ్ళే అవకాశం వచ్చినా కాలేజ్ నుంచి వెనక్కి వచ్చేటప్పుడు సైకిల్ విషయం మర్చిపోయి నడుచుకుంటూ వచ్చేసి అన్నయ్య దగ్గర తిట్టు తినే వాడు.

మొదటి సంవత్సరం ఇంజనీరింగ్ డ్రాయింగ్ అని ఒక సబ్జెక్టు ఉండేది. తన దగ్గర అన్నయ్య వాడిన ఎల్ స్క్వేర్ ఉండేది. మిగిలిన వారు అంతా మినీ డ్రాఫ్తెర్ తో వచ్చి ఎల్ స్క్వేర్ తో పని చేస్తున్న తనని చూసి నవ్వే వారు. తనకు తేడా ఏమిటో తెలిసే ది కాదు . ఎల్ స్క్వేర్ తొ కూడా డ్రాయింగ్ కి కావలసిన పనులు అన్నీ చెయ్యచ్చు కాని దాని ఖరీదు తక్కువ కనుక నవ్వాలా?

మొదట్లో తనకి డ్రాయింగ్ సరిగ్గా రాలేదు. మొదట్లో ఇచ్చిన పని ఒక వృత్తాన్ని 36 భాగాలు చెయ్యాలి.మిగతా అందరూ అరగంటలో చేసి వెళ్ళిపోయే వారు. తన కి మూడు గంటలు సరిపోయేవి కాదు. వాళ్ళు అంత త్వరగా ఎలా చేయ్యగలుగుతున్నారో తెలిసేది కాదు. తను పది డిగ్రీలు కొలిచి డివైడర్ తో సర్కిల్ మీద మార్క్ చేస్తూ పోతుంటే ఆఖరి భాగం మిగిలిన భాగాల కన్నా చిన్న దై పోతోందని మళ్ళీ మొదలెట్టే వాడు. ఎన్ని సార్లు తన తోటివారిని అడిగినా వాళ్ళు "నువ్వు నేర్చుకోవాలి బాసూ, నీకు రావటం లేదు ..." అంటూ వెళ్ళిపోతూ ఉండే వారు.

ఇక తప్పని సరి పరిస్థితి లో మాధవి ని సహాయం అడిగాడు. వెంటనే తన టేబుల్ దగ్గరి కి వచ్చి తను చేసిన పని చూచింది. మాధవి నవ్వలేదు.

"మీరు ప్రతిపనీ చాలా ఖచ్చితంగా చేయాలనుకుంటున్నట్టున్నారు. అంత ఖచ్చితం గా చేయవలసిన అవసరం ప్రతిసారీ ఉండదు. వృత్తం ఆఖరి భాగం కొంచెం చిన్నదయితే ఏమవుతుంది? ఒకట్రెండు మార్కులు తగ్గుతాయి.మీరు డివైడర్ తో మార్క్ చేసినప్పుడల్లా ప్రతి భాగం లోనూ కొంచెం ఎర్రర్ వస్తూ ఉంటుంది. ఆఖరుకోచ్చే సరికి ఆ తేడా పెద్దదై పోతుంది. ఇది అందరికీ జరిగేదే! మీరు ఇలాగే సబ్‌మిట్ చెయ్యండి" అంది.

ఏదో అద్భుతమైన పరిష్కారం చెప్తుందేమో అనుకుంటే నేను చేసిందే సరిపోయిందంటుందేమిటి?, అని తను అయోమయం గా చూస్తుంటే "నేను చేసిన వర్క్ చూడండి" అంది. వెళ్లి చూస్తే ఆమె చేసిన డ్రాయింగ్ కూడా అంత "గొప్ప" గానే ఉంది. అంటే అందరూ ఇలాగే సబ్‌మిట్ చేసి వెళ్ళిపోతున్నారన్న మాట.

"మెనీ టైమ్స్ క్విక్ అండ్ డర్టీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ పెర్ ఫెక్ట్ బట్ లేట్" అంది మాధవి. నా వెర్రి ముఖం చూసి మళ్ళీ తెలుగులో"చాలా సార్లు నూరు పాళ్ళు ఖచ్చితం గా చెయ్యటం కన్నా తొంభై పాళ్ళు ఖచ్చితం గా అయినా తొందరగా చెయ్యటం కూడా ముఖ్యం" అంది.

అది తను నేర్చుకున్న మొదటి పాఠం. తర్వాత ఉద్యోగం లో చేరినప్పుడు ఆ విషయం చాల త్వరగా అర్ధం అయ్యింది.

"మాధవీ ఈరోజు నాకు చాల ముఖ్యమైన విషయం తెలిసింది. చాలా థాంక్స్" అన్నాడు. తను నవ్వ్వేసి వెళ్ళిపోయింది. ఆ నవ్వు ఎంతో నచ్చింది. ఎందుకంటే అది మిగిలిన స్నేహితులు తనని చూసి రోజూ వేళాకోళంగా నవ్వే నవ్వులా లేదు.

తర్వాత డ్రాయింగ్ లోనే "ఆలోచించి" చేయవలసిన పాఠాలు ప్రారంభమయ్యాయి. "పర్స్పెక్టివ్ వ్యూస్" (perspective views), "ఫ్రొజెక్షన్స్" (Projections) లాంటివి అందరికీ అర్ధం కాలేదు. ఎందుకంటే చాలా ఊహ కావాలి. ఒక కారు పైనుంచి చూస్తే ఎలా కనిపిస్తుందో , పక్కనుంచి చూస్తే ఎలా కనిపిస్తుందో ఇవన్నీ ఊహించి బొమ్మలెయ్యాలి. అక్కడ కొచ్చే సరికి తన సోదరులు చతికిలబడ్డారు. తను ఈ పనులన్నీ గంటలో చేసి కూర్చొనే వాడు.

ఒక రోజు తననుఎప్పుడూ వీలైనంత అవమానం చేస్తుండె సాయి శ్రీనివాస్ ఇక తట్టుకోలేక "ఈ మబ్బు గాడు ఇంత సులువుగా ఎలా చేస్తున్నాడు ?" అనేసాడు. తనువెంటనే "నువ్వు నేర్చుకోవాల్రా, నీకు అర్ధం కావటం లేదు" అందామనుకున్న్నాడు. కాని ఎందుకో ఆ పని తన వల్ల కాలేదు. అందరూ వాడి అంత నికృష్టం గా ప్రవర్తించలేరేమో?

"పద. నీకర్థమయ్యేలా నేను చెప్తాను" అన్నాడు.

అతను చేసిన అవమానాలు మర్చిపోయి తను సహాయం చేస్తానన్న తర్వాత కూడా వాడు అవమానమే ఫీలయ్యాడు. ఎందుకోవాడికే తెలియాలి.

కాని కొంత మంది తనని మనిషి లా చూస్తున్నారని గమనించాడు. చాలా మంది మంచి స్నేహితులు దొరికారు. ఇన్నాళ్ల తన పరిస్థితికి తప్పంతా తనలోనే లేదని గ్రహించాడు. మొత్తానికి తన మీద తనకు నమ్మకం పెరిగింది

మాధవి తన కాలేజ్ లో ఉన్న NSS (నేషనల్ సర్వీస్ స్కీం) టీం లో చేరింది. ఆమె కి సమాజ సేవ చాలా ఇష్టం. తను కూడా చెరాడు . ఆమె చేరిందనే తను కూడా చేరాడా? ఏమో! నిజానికి తను ముందే చేరాడు గానీ మొదట్లో క్రమం తప్పకుండా వెళ్ళేవాడు కాదు. చాల మంది లా మానేయకుండా ముందుకు వెళ్ళటానికి మాధవి కారణం కావచ్చు. తమ కాలేజ్ ఆడిటోరియం కి తామే పునాది తవ్వారు. పిచ్చా సు పత్రి కి వెళ్లి అక్కడి రోగులతో కొన్ని రోజులు గడిపాడు. కొన్ని వందల చెట్లు నాటారు. చాలా పనులు మామూలు గా తమ రోజు వారీ పనులలో చెయ్యని పనులు (ఇంట్లో కూడా చేయ్యనివీ) అందరితో కలిసి ఆడుతూ పాడుతూ చేసారు. అక్కడ కూడా మాధవి చాల నిష్ట తో పని చేసే ది. అందరితో కలుపు గోలు గా ఉంటూనే చాలా హుందా గా ఉండేది.

ఒక సారి తమ కార్యక్రమాలు పూర్తి అయ్యాక అయిపోయిన తర్వాత గురువు గారు అప్సర హోటల్ లో పార్టీ ఇచ్చారు (ఈరోజుల్లో లాంటి గాజు గ్లాసుల పార్టీ కాదు. అందరూ పొద్దున్నే పది గంటలకి వెళ్లి టిఫిన్ చేసారన్నమాట). అప్సర అప్పట్లో విశాఖపట్నంలో ఒక పెద్ద హోటల్. అక్కడ ఎలా తినాలో తెలియదు కనుక తనకు భయ మేసి తప్పిన్చుకున్దామనుకున్నాడు. కాని క్యాంపు లో అందరూ ఒక చోటే ఉండటం వలన తానొక్కడే తప్పించుకోవటం కుదరలేదు. అది కాక తన అంతట తను వెళ్లి పోవాలంటే డబ్బులు కూడా లేవు.

తప్పనిసరిగా అక్కడికి వెళ్ళగానే హోటల్ గేటు దగ్గరే తనకు సమస్యలు ప్రారంభమయ్యాయి. ఎటునుంచి హోటల్ లోపలికి వెళ్ళాలా తెలియక తికమక పడుతూ ఉంటే, సోదరుల వేళాకోళాలు ప్రారంభమయ్యాయి. తనకు భయ మేసి కొత్త ప్రదేశంలో తెలిసిన వాళ్ళ దగ్గరికి పరుగెత్తే కుర్రాడిలా మాధవి పక్కన ఉన్న కుర్చీ దగ్గరకు గబ గబా వెళ్లి కూర్చొన్నాడు. నినాద్ గాడు కూడా మాధవి పక్కనే కూర్చో బోయి అప్పటికే ఆలస్యం కావటంతో తనకేసి వికృతంగా చూసి చేసేదిలేక ఎదురు గా కూర్చొన్నాడు. మిగిలిన వారు కుడా ఆ టేబుల్ దగ్గరే సర్దుకున్నారు.

అందరూ తనకు తెలియని వీ అర్ధం కానివీ పదార్ధాలు ఆర్డర్ చేసారు. తన వంతు వచ్చేసరికి ఇడ్లీ చెప్పాడు.

వెంటనే నవ్వులు.

ఆ హోటల్ ఎటువంటి దో గాని ఇడ్లీ కూడా తను సరిగా తినలేడేమో అనిపించింది. రెండు ఇడ్లీలున్న పళ్లెంతో పాటు ఒక శస్త్ర చికిత్సకి కావలసిన సరంజామా లాంటి రెండు కత్తులూ, ఫోర్క్లూ ఇంకా ఏమిటో వచ్చాయి. కొంచెం సేపు వాటి కేసి చూసి ఎలా వాడాలో అర్ధం కాక చివరికి తెగించి చేతితో తినటం ప్రారంభించాడు. వెంటనే స్టాలిన్ గాడు నవ్వు ప్రారంభించాడు "నువ్వు మారవు రా. ఎదగవు కూడా" అంటూ.

"మీ ఇంట్లో ఎన్ని నూనె సీసాలు కొంటార్రా ?" అన్నాడు రాకేశ్ నున్నగా దువ్విన తన జుట్టు వైపు చూస్తూ.

"వీడికి ఆ విషయం కూడా తెలియదేమో రా! ఎందుకంటే ఖర్చంతా వాళ్ళ అమ్మ గారిదే. వీడికి బస్సు డబ్బులు కూడా అవసరం లేదు కదా! నడిచొస్తాడు." అని నినాద్ గాడు.

వాడి కోపానికి కారణం అర్ధం చేసుకొవచ్చు.కానీ మిగతా వారెందుకు?

"ఇడ్లీ కాకుండా ఏదయినా నీకు తెలిసిన ఇంకో ఐటెం పేరు చెప్పు. నీకు పది రూపాయలిస్తా"

"నీ జేబులో డబ్బులు ఎంతున్తాయిరా! ఒక రూపాయినా ఉంటుందా?"

తన పక్కన మాధవి ఉండటం వలనా, ఆమె పక్కన కూర్చొనే అవకాశం నేను ఇవ్వకపోవటం వల్లనా కాబోలు తనని అవమానించటానికి వాళ్ళు చాలా రెచ్చిపోయారు. ఎంతో కష్టం తో భరించాడు. కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయేమో అని భయ మేసింది. ఎందుకు తన మీద వీళ్లకి ఇంత చులకన? తనెప్పుడూ వీళ్ళని శత్రువులు గా చూడలేదే?

అతి కష్టం మీద టిఫిన్ తింటున్నాడు. అందరూ టిఫిన్ తినేసి కాఫీలు చెప్పారు. తను కూడా చెప్ప బోయే లోపల "వీడు మబ్బు గాడు. వీడికి హార్లిక్స్ గాని బోర్నువీటా గానీ ఇవ్వండి" అన్నాడు నినాద్ గాడు. మళ్ళీ నవ్వులు.

అంత వరకూ నిశ్శబ్దంగా ఉన్న మాధవి "తనకి కావలసిన ది తనని చెప్పనివ్వండి" అంది నెమ్మదిగా. అందరూ ఒక్క సారి నిశ్శబ్దమైపొయారు. నిజానికి ఆ మాటలు మాధవి కోపంగా కూడా అనలేదు. చాలా మామూలుగా కానీ స్పష్టం గా అంది. ఆమె కూడా వాళ్లతో ఓ రెండు మాటలు కలుపుతుందని శాయశక్తులా జోకులేస్తున్న వారు ఆమె ఇలా మాట్లాడుతుందని అనుకోలేదు.

అంతా అయ్యాక తను ఇంకా తింటుంటే వాళ్ళు చేతులు కడుక్కోవటానికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతూ "మీరు రండి. వాడు ఇప్పట్లో రాడు" అన్నాడు స్టాలిన్ మాధవి తో.

"ఒక్కరినీ ఎలా వదిలేస్తాం? నేనుంటాన్లెండి" అంది మాధవి. వాడు మళ్ళీ నావైపు వికారం గా చూసి వెళ్ళిపోయాడు.

"చాలా థేంక్స్ అండి. కాని మీరు వెళ్లి చేతులు కడుక్కోండి " అన్నాడు తను.

"ఎందుకండీ? ఒకరిని వదిలి ఎలా వెళ్ళిపోతాం? పది నిముషాల్లో ఇద్దరం వెళ్ళవచ్చు "

"లేదండీ. మీకు బోరే మో. నాకు చాలా విషయాలు తెలియదు. ఇంగ్లీష్ సరిగా రాదు. టేబుల్ మానర్స్ తెలియవు. నేనంటే నా స్నేహితులకి అందుకే చిరాకు...."

"మీరు తెలిసిన ప్రతివాళ్ళనీ స్నెహితులంటుంటారా? స్నేహమంటే రోజు సరదా గా కలిసి కాఫీ తాగటం మాత్రమే కాదు. అవసరమైనప్పుడు పక్కన ఉండాలి" అంది మాధవి.

హఠాత్తుగా ఫోన్ మోగింది. మూర్తి అటునుంచి.

"దిలీప్! మాధవి ఎక్కడుందో తెలిసింది" గట్టిగా అన్నాడు. వాడి గొంతులో ఉద్వేగం తెలుస్తోంది

ఒక్క క్షణం దిలీప్ గుండె ఆగి మళ్ళీ కొట్టుకోవటం ప్రారంభించింది.

"నిజమా?" అన్నాడు.

ఎప్పటికైనా ఆమె ని కలుస్తానని అనుకోలేదు. కాని మూర్తి కి తెలుసు తన మనసులో ఏముందీ. ఇంత అద్భుతమైన జీవితం అని అందరూ అనుకుంటున్నా తన మనసు లో ఉన్న ఒక్క వెలితి అతనికి తెలుసు. మరి వాడు ఎంతో మంది పరిచయస్తులలో తనకున్న ఏకైక స్నేహితుడు.

"తను అమెరికా లో ఉంది . అడ్రస్ కూడా తెలుసుకున్నాను ...."

"టికెట్స్ బుక్ చేశావా?" అడిగాడు దిలీప్.

ఇంత ముఖ్యమైన వార్త చెప్పాక ఇంకేదో ఆశిస్తుండటం వలన కాబోలు. ఒక్క క్షణం అటునుంచి నిశ్శబ్దం. "చేశాను.ఎల్లొండికి చేసాను "

"అంత కన్న ముందు కుదరదా?"

"కనుక్కుంటాను" మూర్తి మళ్ళీ ట్రావెల్ ఏజెంట్ కి ఫొన్ చెసాడు.

మరొక పది నిముషాల్లో దిలీప్ ఫొన్ చెసాడు.

"మూర్తీ. చాలా థేంక్స్ రా. నన్ను క్షమించు. మాధవి గురించి తెలిసింది అనగానే నాకు కాసేపు ఏమీ తెలియలేదు. ఎంత తొందరగా వెళ్దామా అన్న ధ్యాస లో సరిగా మాట్లాడ లేదు. నా వెనక తోడు గా ఉంటూ నా కోసం ఎంత చేసావు రా!" అన్నాడు.

'ఏడిసావ్లే. సినిమా డైలుగులు వద్దు" అంటూ ఫొన్ పెట్టెసాడు మూర్తి.

ఇంత ముఖ్యమైన విషయం చెప్పిన తర్వాత వాడు వెంటనే టికెట్స్ గురించి మాట్లాడితే మూర్తి కూడా కొంచెం నొచ్చుకున్నాడు. కానీ దిలీప్ అంత త్వరగా మారిపోడు. వాడికి హృదయం ఉంది. అందుకే వెంటనే మళ్ళీ కాల్ చేసి క్షమాపణ చెప్పుకున్నాడు. అందుకే మూర్తికి దిలీప్ అంటే ఇష్టం.

మూర్తి వాడి దగ్గర ఉద్యోగం చేస్తున్నా బైట ఇద్దరూ ఇప్పటికీ స్నేహితులే.

***

నాలుగేళ్ల చదువులో దిలీప్, మాధవి తో చాలా స్నేహం పెంచుకున్నాడు. కాని ఆ స్నేహం ఆ ఎప్పుడూ ఒక దేవత ని అరాదిస్తున్నట్లుండేది.

నాలుగేళ్ల చదువు అయ్యాక దిలీప్ ఖరగ్ పూర్ లో చేరాడు. ఆ రోజు ఒక్క డే రైలు ఎక్కాడు. విశాఖపట్నం దాటి ఒంటరిగా వేరే ఊరు వెళ్ళటం అదే మొదటి సారి. అంతే కాదు, ఖరగ్ పూర్ బెంగాల్ లో ఉంది. తనకి ఇప్పటికీ ఇంగ్లీష్ అంత బాగా రాలేదు. ఇక పరభాషా ప్రాంతంలో ఎలా ఉంటుందో? చాలా ఒంటరితనం గా దిగులు గా కూర్చొన్నాడు. అన్నయ్య ఐ ఐ టీ లో చేరినప్పుడు దాదాపుగా పాతిక మంది వచ్చి సాగనంపారు. అప్పుడు నాన్న ఉన్నారు. ఈరోజు ఎవరూ రాలేదు. అమ్మ ఇంట్లో దిగులు గా ఉంది. అందరూ ఇంటి దగ్గరే ఉండి పోయారు. రైలు కదల గానే దిగులు ఇంకా పెరిగింది.

ఒక్క డూ కూర్చొంటే ఒక కుర్రాడు వచ్చి "నువ్వు కూడా ఖరగ్ పుర్ కే కదా!" అన్నాడు.

"అవును" అన్నాడు తను.

"పద! అక్కడ మన గ్యాంగ్ ఉంది. నువ్వు కూడా చేరిపో" అన్నాడు. ఇంకా అయోమయం గా చూస్తుంటే "నా పేరు మూర్తి. పద మరి" అన్నాడు తన సామానులలో రెండు తీసుకుని.

అక్కడికి వెళ్ళే సరికి పది మంది కూర్చొని పేక ఆడుతున్నారు.

"మరొక మెంబర్ గురూ !" అన్నాడు మూర్తి. ఆ గ్యాంగ్ మధ్యలో దీనం గా కూర్చొన్న ఒక పెద్దాయనని "సార్. మిమ్మల్ని 11 వ బెర్త్ కి తీసుకెళ్లాం" అన్నాడు మూర్తి.

అతను మాట్లాడటంలో ఒక అందం ఉంది. వేరే బెర్త్ కి తీసుకెళ్తామని చెప్పేటప్పుడు ఆయన అభిప్రాయం అడగ లేదు మూర్తి. తన నిర్ణయం చెప్పాడంతే.

అయినా ఆయన అందుకోసమే ఎదురుచూస్తున్నట్టు ఎంతో ఆనందం గా లేచాడు.

"ఈ ఆట ఎప్పుడూ ఆడలేదండీ" అన్నాడు దిలీప్ పేక ఎప్పుడూ ఆడ లేదని అనకుండా.

"నో ప్రాబ్లం. నేను చెప్తాను" అన్నాడు ఒకడు. షారుఖ్ ఖాన్ లా ఉన్నాడు. పేరు కన్నబాబని తర్వాత తెలిసింది.

తనకి పేక రాదు. కాని ఆ విషయం వాళ్ళకి చెప్ప లేదు.

"మీ బలహీనతలు తెలిసే వాళ్ళకు ఎలాగూ తెలుస్తాయి. మీ అంతట మీరు చెప్పవలసిన అవసరం లేదు." అని చెప్పింది మాధవి.

ఎన్నో విషయాల్లాగే అది కూడా బాగా గుర్తు పెట్టుకున్నాడు. ఆమె తనని మీరు అనేది. తను మొదటి నుంచి నువ్వు అనే వాడు. అయినా మిగిలిన వారితో గౌరవం గా మాట్లాడాలని ఆమె నుంచి నేర్చుకున్నాడు. తను పని మనిషి తో సహా అందరినీ "మీరు" అని సంబోధిస్తుంటే కొంతమంది నవ్వే వారు. కొంత మంది చిరాకు పడే వారు. కాని తను పట్టించుకోలేదు. ఆ పట్టించుకోక పోవటం కూడా మాధవి నుంచే నేర్చుకున్నాడు.

నెమ్మదిగా ఆటలో పడ్డాడు. రైలు ఖరగ్ పుర్ చేరే సరికి చాల మంది ఫ్రెండ్స్ అయ్యారు. వారిలో ఎవరూ తనని గేలి చెయ్యడం లేదు. ప్రతి వాడికి మిగిలిన వారి మీద గౌరవం ఉంది. ఆ అనుభవం చాలా బాగుంది. తన బెంగ పోగొట్టుకోవటానికి అందరితో స్నేహం చేసుకున్నాడు. రీసెర్చ్ స్కాలర్స్ , టీచర్స్ ,స్టూడెంట్స్ , హాస్టల్ స్టాఫ్ , అందరితో స్నేహం పెంచుకున్నాడు. మాధవి గుర్తుకొస్తూ ఉంటుంది. ఇక తనతో మళ్ళీ మాట్లాడే అవకాశం లేదు .

తండ్రి పరీక్షల టైం లో చనిపోవటం, పరీక్షలు అలాగే బెంగతో వ్రాయటం , తర్వాత ఇక్కడ అడ్మిషన్ రావటం వరసగా జరిగిపోయాయి. ఒక సారి మాధవి కనిపించింది. కాని అప్పుడు ఏవో నో అబ్జక్సన్ లెటర్స్ తీసుకుంటున్నాడు. తండ్రి పోయిన తర్వాత అందరూ పరామర్శలు చేస్తుంటే ఎవరినీ కలవాలనిపించేది కాదు. ఆమె కనిపించినప్పుడు కూడా ఏదో బెరుకు గా అనిపించింది. ఆమె బహు శా తనని పలకరించాలని అనుకుని ఉందని అనిపించింది. కానీ తను ఆగిన తర్వాత ఆమె తన తో మాట్లాడకపోతే? అందుకని తనే ఏదో పని ఉన్నట్టు వెళ్ళిపోయాడు. అలా ఎందుకు చేశాడో ఇప్పటికీ అర్ధం కాలేదు. ఆమె జ్ఞాపకం వస్తూనే ఉండేది.

నిజానికి తను ఆఖరి పరీక్ష వ్రాసినప్పుడు భయ పడుతూ ఆమె ని ఫోటో అడిగాడు. ఆమె అదోలా చూస్తే "మనం మళ్ళీ కలుస్తామో లేదో తెలియదు. ఒక ఫోటో ఇస్తే అది జ్ఞాపకం గా ఉంటుంది" అన్నాడు. ఒక రకం గా మనం ఇక కలవం అని చెప్పేశాడు. ఆమె మర్నాడు మౌనం గా ఫోటో ఇచ్చింది. బహుశా అందుకే ఆ తర్వాత ఆమె కనిపించినా, మళ్ళీ ఆమెతో మాట్లాడటం ఇబ్బందిగా అనిపించిందేమో! ఆరోజుల్లో అమ్మాయిలూ ఎవరికీ ఫోటోలు ఇచ్చేవారు కాదు. ఇచ్చారంటే ఎంతో నమ్మకం ఉన్నట్టే.

ఇప్పుడు ఎంత మంది తో స్నేహం చేసుకున్నా ఎన్ని కబుర్లు , జోకులేసుకున్నా రూం లో వచ్చాక ఒంటరితనం భయంకరం గా ఉండేది. మాధవి ఫోటో చూసుకుంటూ గడిపే వాడు. తను ఎదురుగా ఉన్నట్టే ఉండేది. ఆమె దగ్గర ఎందుకో ఒక రకమైన ధైర్యం, నిశ్చింత అన్నింటినీ మించి హద్దుల్లేని అభిమానం ఉండేది. మూర్తి లాంటి స్నేహితుడు అప్పటికింకా దగ్గర కాలేదు.

తనకి డిగ్రీ లో కూడా స్నేహితులు అని చెప్పుకునే వారు ఉన్నారు. ఏమైనా అసైన్‌మెంట్ చెయ్యాలంటే తన సహాయం కోసం వచ్చే వారు. ఏదేనా స్ట్రైక్ చేసేటప్పుడు తన లాంటి "మబ్బు గాడు" ఎక్కడ సపోర్ట్ చెయ్యడో అని బతిమాలడానికి వచ్చే వారు. కానీ వాళ్ళేదైనా పిక్నిక్ కి పోయినా మరేం చేసినా తను గుర్తొచ్చేవాడు కాదు. వారి సంతోషం లో తను ఉండడు. వాళ్ళ కష్టాల్లో తను కావాలి.

మాధవి దగ్గర మాత్రమే తనకి అటువంటి అనుభవాలు కలగలేదు. అంతే కాదు,తన వల్ల కానిదేమైనా ఉంటే సహాయం అడగటానికి మాధవి మాత్రమే ఉండేది. మిగతా అందరూ తన దగ్గరి కి రావాలి తప్ప వారు తనకి చేసే ది ఏమీ లేదు.

ఖరగ్పూర్ లో దౌర్భాగ్యం అని ఒక స్నేహితుడుండే వాడు. అసలు పేరు నాగేష్ అని అందరూ మర్చిపోయారు.

వాడు ఒక సారి నా పాత యూనివర్సిటీ కి వెళ్ళానన్నప్పుడు ఎంత సిల్లీ గా అనిపించినా "మాధవి అని ఎవరైనా కనిపించారా?" అని అడిగాడు.

తను ఆశ్చర్యంతో కిందపడేలా "కలిసానండీ" అన్నాడు వాడు.

"ఎలా?" అన్నాడు ఆశ్చర్యంగా.

"ఆ అమ్మాయి అక్కడే రీసెర్చ్ చేస్తోంది" అన్నాడు .

వాడు కలిసినదీ తనకు తెలిసిన మాధవీ ఒకరేనా అని అపనమ్మకం తో చూస్తుంటే "లూనా మీద వస్తుంది ఆమే కదా!" అన్నాడు. నిజమే. మాధవి లూనా నడిపేది.

"ఎప్పుడూ నవ్వు ముఖం తో ఉంటుంది" అని కూడా అన్నాడు. ఇది ఖచ్చితం గా నిజం.

భయపడుతూ భయపడుతూ ఒక ఉత్తరం యూనివర్సిటీ అడ్రస్ కి వ్రాశాడు. తన ఇంగ్లీష్ కొంత మెరుగయ్యింది గాని అయినా భయమే. అసలు ఉత్తరం వ్రాస్తే ఏమనుకుంటుందో కూడా భయమే! ఉత్తరం పోస్ట్ చేశాడు కాని ఏమవుతుందో అని భయపడుతూనే ఉన్నాడు. జవాబు రాదని ఖచ్చితం గా నమ్మాడు.

ఒక రోజు మెస్ లో భోజనం చేస్తుంటే నగేష్ వచ్చి ఒక లెటర్ చూపించాడు. ఫ్రం అడ్రస్ లో మాధవి పేరుంది!!!

వాడు నవ్వుతూ వెళ్ళిపోయాడు. తను చాలా బాధ పడిపోయాడు. మాధవి తనకెందుకు జవాబు వ్రాయలేదు? మధ్యలో ఈ దౌర్భాగ్యం గాడికి ఎందుకు వ్రాసింది? వాడు ఆనందం గా నవ్వుకుంటూ తిరగటమేమిటి? తనకు జవాబు కూడా రాకపోవటమేమిటి? తను అలా భాధ తో రగిలిపోతుంటే ఉంటే దౌర్భాగ్యం మళ్ళీ వచ్చి 'ఏమి వ్రాసింది గురూ?' అన్నాడు.

"నాకేం తెలుసు?" అన్నాడు .

"నీకు వ్రాసిన ఉత్తరం లో ఏముందీ నీకు తెలియాలి కదా?"

ఆశ్చర్యం తో మళ్ళీ కవర్ చూచాడు. ఉత్తరం తనకే! తనకే వచ్చింది. తనే చూసుకోలేదు. వాడు ఉత్తరం చూపిస్తే వాడికి వచ్చిందని గొప్ప గా చూపించాడని అనుకున్నాడు. తను సంతోషిస్తాడని తెచ్చి చూపించాడని అనుకోలేదు.

వెంటనే రూం కి వెళ్లి ఉత్తరం చదివాడు. మూడుపేజీలు ఉన్న ఆ ఉత్తరం ఎన్ని సార్లు చదువుకున్నాడో తెలియదు. తర్వాత ఎన్నో రోజులు ఎంతో గర్వం గా తిరిగాడు. అందరూ తననే గొప్పగా చూస్తున్నట్టు ఊహించుకునే వాడు. ఉద్యోగం లో చేరాక కూడా ఉత్తరాలు ఆగ లేదు. తన ఉద్యోగం లో జరిగే విషయాలు అన్నీ చెప్పే వాడు. తన సలహాలు చెప్పే ది. తన రీసెర్చ్ గురించి వ్రాసేది. ఆమె ఉత్తరాలు తన ఒంటరితనాన్ని మరిచిపోయేలా తన ఉత్సాహానికి జీవం పోశాయి.

***

"గురూ! ఇంకో గంటలో బయలుదేరు. ఫ్లైట్ దొరికింది"అని మూర్తి చెప్పటం తో ఉలిక్కిపడ్డాడు దిలీప్ . మరొక రెండు గంటల్లో ఫ్లైట్ లో ఉన్నారు ఇద్దరూ.

మూర్తి న్యూయార్క్ లో తమ మేనేజర్ కి ఫోన్ చేసి కరెక్ట్ అడ్రస్, దారి కనుక్కొంటున్నాడు. దిలీప్ కి చాలా ఉద్వేగం గా ఉంది. ఇరవై ఏళ్ల తర్వాత మాధవి ని చూడబోతున్నాడు. తను ఎలా చూస్తుంది. తన ఎదుగుదల చూసి ఆశ్చర్య పోతుందా? గర్వ పడుతుందా! అభినందిస్తుందా ?

ఉద్యోగం లో చేరిన కొత్త లో తనకి విద్యుత్ కర్మాగారంలో మైంటెనన్స్ లో పోస్టింగ్ ఇచ్చారు. ఏం పనులు పెండింగ్ లో ఉన్నాయా అనుకుంటూ లాగ్ బుక్ చదివాడు. బాయిలర్ లో ఆయిల్ గన్ ఒకటి పని చెయ్యటం లేదు. బొగ్గు తో పని చేసే బాయిలర్ కి ఆయిల్ గన్ పని చేయటం చాల ముఖ్యము. ఎప్పుడైనా బొగ్గు తక్కువైతే మంట స్థిరం గా ఉండటానికి ఆయిల్ వాడతారు. ఏ కారణం వల్లనైన ఆయిల్ గన్ స్థిరమైన మంట లేనప్పుడు పని చేయక పోతే బాయిలర్ విస్పోటనం కూడా జరగచ్చు.

తను జాయిన్ అయ్యిన మూడు రోజుల క్రితం అప్పాజీ అను సీనియర్ ఇంజనీర్ ఆ పని తీసుకున్నాడు.కానీ ఈరోజుకి కూడా ఆ పని పూర్తి కాలేదు. అప్పాజీ ఎక్కడున్నాడో తెలియదు. అతని కింద పని చేసే వారు కూడా అతను మూడు రోజుల నుంచి కనపడటం లేదని చెప్పారు. అతను ఇప్పటి వరకూ ఏం చేశాడో కూడా లాగ్ బుక్ లో రాసి లేదు. ఇక లాభం లేదని తను బాయిలర్ దగ్గరి కి వెళ్ళాడు. గన్ తాలూకు స్పార్క్ ప్లగ్ పని చెయ్యటం లేదు. వెంటనే కొత్త ప్లగ్ స్టోర్ నుండి తెచ్చుకుని మార్చేశాడు. గన్ పని చేస్తుందని నిర్ధారించుకుని వర్క్ ఆర్డర్ క్లోజ్ చేశాడు . ఈ లోపు తన మేనేజర్ వచ్చాడు.

"అప్పాజీ ఏడి ?"

"తెలియదు సర్!"

"వాడు రాగానే ఇద్దరూ రండి" అని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు.

మర్నాడు అప్పాజీ వచ్చాడు. అతను డిగ్రీ లో గోల్డ్ మెడలిస్ట్. చాలా పుస్తకాలు కూడా రాశాడు.

అతను లోపలికి రాగానే దిలీప్ చెప్పాడు "బాస్ నీ కోసం వెతుకుతున్నారు"

"అలాగా. నేను దాదాపు పని పూర్తి చేసానండి. ఆయనకీ చెప్తాన్లెండి"

"ఏం పని?"

"అదే ఆయిల్ గన్ ఒకటి పని చెయ్యటం లేదు.స్పార్క్ ప్లగ్ పాడయ్యింది"

తను ఆశ్చర్య పోయాడు. ఈ పని మీదనే ఇన్నాళ్ళు పని చేస్తున్నాడా?

"ఏం చేసారు ఇంత వరకూ?"

"మొట్ట మొదట లైబ్రరీ కి వెళ్లాను (???). స్పార్క్ ప్లగ్ ఎలా తయారు చేస్తామో తెలుసుకున్నాను. తర్వాత పాడయ్యిన స్పార్క్ ప్లగ్ చూచాను. ఎలా రిపేర్ చెయ్యా లో తెలిసిపోయింది. ఇక రెండు రోజులలో బాగు చేసేస్తాను" వెలిగి పోతున్న ముఖం తో చెప్పాడు అప్పాజీ.

"ఆ పని అయిపోయింది. నేను కొత్త స్పార్క్ ప్లగ్ పెట్టేసాను"

"అరె! రిపేర్ చెయ్యకుండానా. అందులో (రీప్లేస్ చెయ్యటం) లో గొప్పేముంది?" నిస్పృహతో అన్నాడు అప్పాజీ.

"గన్ పని చేస్తోంది కదా!"

"మరి పాడయిపోయిన దాని సంగతి?"

"అంత కన్నా ముఖ్యం గన్ పని చెయ్యటం కదండీ? ఈ లోపల ఎప్పుడయినా గన్ అవసరమొస్తే ?"

"..."

"గన్ పని చెయ్యకపోతే ఏ క్షణమైనా ప్రమాదమే కదండీ?" మళ్ళీ అన్నాడు దిలీప్.

"నిజమేననుకోండి. కాని మన చదివిన చదువు కి సరిపోయేలా పని చెయ్యాలి కదా! స్పార్క్ ప్లగ్ మార్చటమే పనైతే మనటెక్నీషియన్ కూడా ఆ పని చెయ్యగలడు కదా!"

"నిజమే. కాని చదివిన జ్ఞానం ఉపయోగించటం తో పాటు ఇక్కడ ఏది ముఖ్యం అన్నది కూడా చూడాలి కదా! ఈ మూడు రోజులలో ఏ కారణం వల్లనయినా ఆయిల్ గన్ లేకపోవటం వలన ప్రమాదం ఏదేనా జరిగి ఉంటే మనందరికీ నష్టం అయ్యుండేది కదా?"

"నిజమేనండీ" మనస్పూర్తి గా అన్నాడు అప్పాజీ.

ఇతనికి చదువుతో పాటు తప్పు ఒప్పుకునే సంస్కారం కూడా ఉంది. వ్యావహారికం గా పని చెయ్యటం రాదు కాని ఆ విషయం వప్పుకుంటే అతి త్వరలో నేర్చుకోగలడు.

"చాలా సార్లు నూరు పాళ్ళు ఖచ్చితం గా చెయ్యటం కన్నా తొంభై పాళ్ళు ఖచ్చితం గా అయినా తొందరగా చెయ్యటం కూడా ముఖ్యం "

నవ్వుతూనే అన్నాడు తను. అతను కూడా నవ్వాడు కానీ అందులో తను చెప్పిన దానికి అంగీకారం ఉంది.

తర్వాత తనలో తనే ఆశ్చర్య పోయాడు. తను మరొక మనిషికి, అది కూడా ఒక గొప్ప చదువు తో వచ్చిన పై స్థాయి ఉద్యోగి కి ఏది సరైన పద్ధతో చెప్తున్నాడా? ఇది తనలో ఊహించని మార్పు. గొప్ప మార్పు.

థేంక్స్ మాధవి!

తర్వాత దిలీప్ కంపెనీ మారాడు. అక్కడ మూర్తి ని కూడా తెచ్చుకున్నాడు. మూర్తి కి తన గురించి, మాధవి గురించి తన ఫీలింగ్స్ అంతా తెలుసు. తను అతనికి ఎప్పుడూ సూటిగా చెప్పలేదు కాని నిజమైన స్నేహితులకి విషయం చెప్పవలసిన అవసరం లేదు.

అతి త్వరలోనే దిలీప్ సొంత కంపెనీ ప్రారంభించాడు. కంపెనీ లో కేవలం పనిలో ప్రావీణ్యం మాత్రమే కాకుండా ఫలితం కోసం పని చెయ్యటం, ఫలితం ఏమి కావాలీ ముందే తెలుసుకొని పని చెయ్యటం నేర్పించాడు. పని తో పాటు స్వంత బాగోగులు కుడా చూసుకోవటానికి అవకాశాలు కల్పించాడు. అందరూ స్వచందం గా సమాజ సేవ కొంతైనా చెయ్యాలి. సమాజ సేవ అంటే ఒక చెక్ ఇచ్చి చేతులు దులుపు కోవటం కాదు. ఆ పనిలో పాలు పంచుకోవాలి. చివరివరకూ నిలబడాలి. ఇది కూడా మాధవి దగ్గర తెలుసుకున్నదే.

కాలేజీ రోజులలో ఒక సారి తమ కార్యక్రమాలలో భాగం గా బడుగు వర్గాల వారికి కడుతున్న ఇళ్లు సరిగ్గా కడుతున్నారా లేదో తనిఖీ చేసే బాధ్యత తీసుకున్నారు. మాధవి తనూ ఒక బృందం లోనే ఉన్నారు. సిమెంట్, ఇసుక సరిగా కలుపుతున్నారా లేదా చూసి నిర్ధారించటం తమ పని. అక్కడ ఉన్న బడుగు వర్గాల వారి నాయకుడి లాంటి ఒకతను తమ దగ్గరి కి వచ్చి గౌరవం గా టీ ఇచ్చాడు.

"మీరు చాలా సహాయం చేస్తున్నారు బాబూ! మీ ఋణం తీర్చుకోలేము" అన్నాడు

"అదేమిటండీ! ఇది ప్రభుత్వం చేస్తోంది. మేము కూడా మా వంతు చేస్తున్నాం" అన్నాడు తను.

"అయినా ఇది మాకు చాలా సహాయం బాబూ! మాకు ఏమి తెలుస్తుంది ఇంజనీర్ బాబు మోసం చేస్తే?"

"వాళ్ళు మోసం చెయ్యరు. ఇది ఒక రకం గా చెప్పాలంటే పద్ధతి ప్రకారం మేము పర్యవేక్షణ చెయ్యాలి కనుక చేస్తున్నా మంతే"

"మీరు మరీనండీ. మీరు తనిఖీ చేస్తేనే అంతా సరిగ్గా ఉంటుంది. లేకపోతే ఏమయినా అవ్వచ్చు"

తర్వాత అతనుతన పిల్లలనీ మిగిలిన కుటుంబాలనీ తీసుకుని వచ్చి పరిచయం చేశాడు .

వాళ్ళు వెళ్ళిపోయా క మాధవి తో అన్నాడు "ఇంత మంచి పని లో మనం కూడా ఉండటం అదృష్టమే కదా!".

ఎప్పటి లాగానే మాధవి మనోహరం గా నవ్వింది.దిలీప్ కి ఆ నవ్వు బాగుంది కానీ ఎందుకో అర్ధం కాలేదు. "అంటే ఏమిటర్ధం?"

"దిలీప్ గారూ! మనం చేస్తున్నది మంచి పనే. క