ఊర్మిళ నిద్ర అసలు రహస్యం

ఈనాడు దినపత్రిక • 15 Oct 2026 • 👁 2 views
ఊర్మిళ నిద్ర అసలు రహస్యం
ఊర్మిళ నిద్ర. అసలు రహస్యం

(ఈనాడు దినపత్రిక మకరందం 15/10/2026 లో ప్రచురితం )



రామాయణం అనగానే మనకు శ్రీరాముడు, సీతాదేవి , లక్ష్మణుడు, హనుమంతుడు వెంటనే గుర్తుకొస్తారు. అయితే ఆ మహాకావ్యంలో పెద్దగా ప్రస్తావన రాకపోయినా, త్యాగంలో వారికి ఏమాత్రం తీసిపోని ఒక మహోన్నత పాత్ర లక్ష్మణుడి భార్య ఊర్మిళ.

వాల్మీకి రామాయణంలో ఊర్మిళ గురించి పెద్దగా వర్ణనలు లేకున్నా, ఇతర గ్రంధాలు, జానపద కథల్లో ఆమె త్యాగాన్ని చిత్రించిన ఆసక్తికరమైన కథలున్నాయి.

శ్రీరాముడు అరణ్యవాసానికి వెళ్లాలని బయలుదేరినప్పుడు లక్ష్మణుడు సోదరుడిని అనుసరించాడు. ఆ సమయంలో ఊర్మిళ కూడా లక్ష్మణుడితో పాటు వస్తానని కోరింది . అప్పుడు లక్ష్మణుడు, "అన్న,వదినలకు సేవ చేయడమే నా ధర్మం. అయోధ్యలో అత్తమామలకు ధైర్యం చెప్పడం , రాజభవనాన్ని సంరక్షించడం నీ ధర్మం" అన్నాడు. భర్త ధర్మానికి అడ్డురాకూడదని భావించిన ఊర్మిళ, తన మనసులోని కోరికను మౌనంగా త్యజించింది. ఇదొక జానపద కథనం.

ఊర్మిళకు సంబంధించిన మరో ప్రసిద్ధ గాథ ప్రకారం అరణ్యవాసంలో లక్ష్మణుడు సీతారాములను కాపాడేందుకు రాత్రింబవళ్ళు మెలకువగా ఉండాల్సి వచ్చింది. అప్పుడు నిద్రాదేవి ప్రత్యక్షమై, "ప్రకృతి నియమాన్ని ఎవరూ అతిక్రమించలేరు. నీవు నిద్రించాలి" అని చెప్పింది. . దానికి లక్ష్మణుడు, "సోదరుడి సేవ పూర్తయ్యే వరకు నాకు నిద్ర అవసరం లేదు. నా బదులుగా నా అర్ధాంగి ఊర్మిళకు ఆ నిద్రను ప్రాప్తింపచెయ్యి తల్లీ !" అని ప్రార్థించాడు.

భర్త సంకల్పమే తన సంకల్పమని భావించిన ఊర్మిళ, ఎలాంటి అభ్యంతరం లేకుండా నిద్రను స్వీకరించింది. ఫలితంగా లక్ష్మణుడు పదునాలుగు సంవత్సరాల పాటు నిద్రించకుండా రామసేవలో అప్రమత్తంగా నిలవగలిగాడు. అతడి బదులుగా కూడా ఊర్మిళ నిద్రించింది.

ఊర్మిళ మౌనత్యాగాన్ని ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలబెట్టే ఇటువంటి కథలనేకం ప్రచారంలో ఉన్నాయి. రామాయణ భారతాల్లో అనేక త్యాగాలు వెలుగులోకి వచ్చాయి. కానీ గుర్తింపు ఆశించకుండా , కీర్తి కోరకుండా చేసిన త్యాగం .. ఊర్మిళది .

_ జీడిగుంట నరసింహమూర్తి