రెండు వేళ్ళ రహస్యం

ఈనాడు దినపత్రిక • 12 Oct 2026 • 👁 6 views
రెండు వేళ్ళ రహస్యం
ఈనాడు దినపత్రిక 12/10/2026 అంతర్యామిలో నా ఆధ్యాత్మిక వ్యాసం “రెండు వేళ్ల రహస్యం”

కృష్ణుడంటే గోపికలకు ఎంత ప్రేమో చెప్పడానికి ఎన్నో కథలు ఉన్నాయి. అయితే యశోదమ్మ ప్రేమకు బంధితుడైన బాలకృష్ణుడి ఘట్టం ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక సందేశాన్ని దాచుకుంది.
ఒకరోజు చిలిపి కృష్ణుడు ఇంట్లో వెన్న కుండ పగులగొట్టి, వెన్న తింటూ చుట్టుపక్కల ఉన్న కోతులకు కూడా పంచాడు. అది చూసిన యశోదమ్మకు కోపం వచ్చింది. చేతిలో చిన్న కర్రతో కృష్ణుడిని పట్టుకోవడానికి పరుగెత్తింది. బాలకృష్ణుడు భయపడినట్లు నటిస్తూ పరుగులు తీశాడు. చివరకు అమ్మ చేతికి చిక్కాడు.
అల్లరి చేయకుండా పిల్లాడిని ఇంట్లో ఉన్న రోలుకు కట్టేయాలని అనుకుంది యశోద . ఒక తాడు తెచ్చి బాల కృష్ణుడి నడుము చుట్టూ వేయబోతే అది రెండు వేళ్లంత తక్కువగా ఉంది. మరొక తాడు తెచ్చి మొదటిదానికి కలిపింది. అయినా మళ్లీ రెండు వేళ్లంత తక్కువే!
ఇంట్లో ఉన్న తాళ్లన్నింటినీ తీసుకొచ్చి ఒకదానికొకటి కలిపినా అదే పరిస్థితి. గోపికలు కూడా తాళ్లు తెచ్చి ఇచ్చారు. తాళ్లు పెరుగుతున్నాయి కానీ కొరత మాత్రం తీరడం లేదు. యశోదమ్మ తన ప్రయత్నాన్ని ఆపలేదు. తల్లి శ్రమను చూసిన కృష్ణుడు కరుణించాడు. అప్పుడు ఆ తాడు సరిపోయింది. అనంతమైన పరమాత్మ ఒక తల్లిప్రేమకు తలవంచాడు. బంధింపబడ్డాడు. ఈ కారణంగానే కృష్ణుడికి ‘దామోదరుడు’ అనే పేరు వచ్చింది.
ఇక్కడే ఆ రెండు వేళ్లలో ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక రహస్యం కనిపిస్తుంది. భగవంతుడిని మన బుద్ధితో కొలవలేం. శక్తితో పూర్తిగా అందుకోలేం. కానీ ప్రేమతో పిలిస్తే, భక్తితో ప్రయత్నిస్తే ఆయన తనను తాను భక్తుడికి అందుబాటులోకి తెచ్చుకుంటాడు. ఆ రెండు వేళ్లను భక్తుని ప్రయత్నం, భగవంతుని కృపకు సంకేతంగా భావించే ఆధ్యాత్మిక వ్యాఖ్యానం కూడా ఉంది.
ఇదే భావాన్ని మరో కోణంలో చూస్తే ‘అహం’, ‘మమ’ అనే రెండు బంధాలు గుర్తుకొస్తాయి. ‘నేనే చేస్తున్నాను’ అనే అహంకారం ఒకటి; ‘ఇది నాది’ అనే మమకారం మరొకటి. ఈ రెండు మనిషిని సంసారానికి కట్టిపడేసే అదృశ్య తాళ్లు. వాటిని వదిలిపెట్టకుండా భగవంతుడిని పొందాలని ప్రయత్నించడం అంటే రెండు వేళ్ల కొరత ఉన్న తాడుతో కృష్ణుడిని కట్టాలనుకోవడమే.
యశోదమ్మ దగ్గర మాత్రం బిడ్డపై స్వచ్ఛమైన ప్రేమ తప్ప మరే స్వార్థమూ లేదు. ఆమె పట్టుదల, ప్రేమ, శ్రమను చూసిన కృష్ణుడు స్వయంగా బందీ అయ్యాడు. ఆ తరువాత అదే బంధిత కృష్ణుడు రోలును ఈడ్చుకుంటూ వెళ్లి రెండు అర్జున వృక్షాలను కూల్చి, శాపవశాత్తు చెట్లుగా ఉన్న కుబేరుడి కుమారులకు విముక్తిని ప్రసాదించాడు.
భగవంతుడిని బంధించడగలిగిన తాడు అంటూ ఏదీ లేదు. మనలోని అహంకారాన్ని వదులుకుని బాహ్య సుఖాలపై మమకారాన్ని తగ్గించుకుని , ప్రేమతో ఆయనను హృదయంలో నిలుపుకోవడమే నిజమైన బంధం. ఆశ్చర్యమేమిటంటే భగవంతుడిని బంధించిన ఆ భక్తి, చివరికి మనిషినే బంధాల నుంచి విముక్తుణ్ని చేస్తుంది. యశోదమ్మ కట్టిన తాడు కృష్ణుడి నడుమునే బంధించింది.ఆమె ప్రేమ మాత్రం అనంతుడినే బంధించింది. అదే ఈ రెండు వేళ్ల రహస్యం***
_జీడిగుంట నరసింహమూర్తి