క్రతువు

సహరి మాస పత్రిక • 01 Oct 2026 • 👁 4 views
క్రతువు
క్రతువు (కథ )

(అక్టోబర్ 2026 సహరి మాస పత్రికలో నా కథ )

“ఇదిగో మీరిద్దరూ ఇటొచ్చి కూర్చోండి… కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడాలి” అని కొడుకు రమణను పిలిచాడు విశ్వేశ్వరరావు.

ఆ స్వరంలో మామూలుదనం లేదు. ఏదో అసాధారణ పరిస్థితితో కూడిన గంభీరత కనిపిస్తోంది. రమణ ఒక్కసారిగా కంగారు పడ్డాడు.

“రాధిక… నువ్వూ రా!’అని భార్యను పిలిచాడు.

ఇద్దరూ కుర్చీలను దగ్గరకు లాగుకుని ఎదురెదురుగా కూర్చున్నారు.

విశ్వేశ్వరరావు కాసేపు వాళ్లిద్దరినీ నిశ్శబ్దంగా చూశాడు. ఆ చూపుల్లో లోతైన అనుభవం ఉంది… అలసట ఉంది… ఇంకా చెప్పలేని ఒంటరితనం కూడా ఉంది. గోడపై వేలాడుతున్న తన భార్య ఫోటో వైపు క్షణం చూసి నెమ్మదిగా మాట్లాడడం ప్రారంభించాడు.

“నాకు డబ్బై ఐదేళ్లు దాటాయి. మన వంశంలో అంతకంటే ఎక్కువ కాలం బ్రతికిన వాళ్లు చాలా అరుదు. అలా చూస్తూంటే నేనూ వాళ్ల దారిలోనే ఉన్నానేమో అనిపిస్తోంది. మీ అమ్మ ఉంటే ఆమె గురించి ఆలోచించేవాడిని. కానీ తను చాలా ఏళ్ల క్రితమే వెళ్లిపోయింది. ఇప్పుడు నేను ప్రత్యేకంగా చూసుకోవాల్సిన బాధ్యతలు కూడా ఏమీ లేవు.”

రమణ వెంటనే మధ్యలో కలగజేసుకున్నాడు.

“ఏమిటి నాన్నా ఇవన్నీ? మీ ఆరోగ్యం బాగానే ఉంది కదా…”

విశ్వేశ్వరరావు స్వల్పంగా నవ్వాడు.

“శరీరం బాగుండొచ్చు రా… కానీ మనిషికి తన సమయం దగ్గరపడుతుంటే మనసే ముందుగా చెప్పేస్తుంది. అందుకే ఇప్పుడే కొన్ని విషయాలు చెప్పుకోవాలని అనిపించింది.”

గదిలో నిశ్శబ్దం మరింత గాఢంగా అలుముకుంది.

“ఈ రోజుల్లో మా లాంటి వాళ్లు బ్రతికున్నప్పుడు అయ్యే ఖర్చుల కంటే… పోయాక అయ్యే ఖర్చులే ఎక్కువ. ముఖ్యంగా క్రతువుల విషయంలో ఎవరైనా అలక్ష్యం చేస్తే కుటుంబానికి ఏదో అశుభం జరుగుతుందన్న భయం అందరిలో ఉంటుంది. ఇంట్లో వాళ్ళూ, బంధువులు తలో మాట విసురుతారు. ‘తండ్రికి కనీస సంస్కారాలు కూడా చేయలేదట’ అంటూ దెప్పి పొడుస్తారు. ”

అతను కాసేపు ఆగి లోపలికి ఊపిరి పీల్చుకున్నాడు.

“నేను పోయిన తర్వాత నీ మీద పడే ఖర్చు లక్షలకు మించి ఉంటుంది. నీ సాధారణ జీతంతో ఆ భారాన్ని మోయడం సులువైన విషయం కాదు. అప్పుల పాలై మనశ్శాంతి కోల్పోకూడదు అని నాకనిపించింది. అందుకే… నా దగ్గర దాచుకున్న పది లక్షలను నా క్రతువుల కోసం ఉపయోగించమని నీ పేరుమీద ట్రాన్స్‌ఫర్ చేస్తున్నాను.”

ఆ మాట విన్న రమణ ఒక్కసారిగా తలెత్తి తండ్రివైపు చూశాడు.

“నాన్నా…!”

“ఆగు… ఇంకా పూర్తిగా చెప్పలేదు,” అని విశ్వేశ్వరరావు చేతితో ఆపాడు.

“ఆ డబ్బు నాకోసమే ఖర్చు పెట్టాలని నేను చెప్పడం లేదు. పరిస్థితులను బట్టి నీ అవసరాలకు కూడా వాడుకో. పిల్లల చదువులకు కావచ్చు… ఇంటి అప్పులకు కావచ్చు… ఏదైనా అవసరానికి ఉపయోగపడితే నాకు చాలు. నేను పోయాక కూడా నా వల్ల మీకు కొంత ఉపశమనం దొరికిందనిపిస్తే అదే నాకు శాంతి.”

అతని గొంతు కంపించింది.

“అవును .. నా వల్ల మీరు మానసిక సంఘర్షణకు గురికావడం నాకు ఇష్టం లేదు రా…”

అని గుండెను బిగబెట్టి మాట్లాడుతుండగా రమణకు ఒక్క మాట కూడా రావడం లేదు. గొంతులో ఏదో ఇరుక్కున్నట్టైంది. చిన్నప్పటి జ్ఞాపకాలు ఒక్కొక్కటిగా కళ్లముందు తిరిగాయి. తన చదువు కోసం తండ్రి అమ్ముకున్న పొలం… తన ఉద్యోగం కోసం తిరిగిన రోజులు… తాను కోరుకున్న ప్రతిదాన్ని తనకు అందించడానికి చేసిన కష్టాలు…

ఇప్పుడు అదే తండ్రి… తన చావు ఖర్చులకు తానే డబ్బు పెట్టి వెళ్తున్నాడు.

ఆ ఆలోచన రమణ గుండెల్లో గునపాలతో గుచ్చినట్టుగా ఉంది .

అప్పటివరకు మౌనంగా ఉన్న రాధిక నెమ్మదిగా మాట్లాడింది.

“ఎప్పుడో జరిగే విషయం గురించి ఎందుకంతగా ఆలోచిస్తున్నారు మామయ్యా? ఎదుట పిల్లల స్కూల్ ఫీజులు ఉన్నాయి. ఇంటి ఖర్చులు పెరుగుతున్నాయి. ఇప్పుడు ఒక సమస్య తీరింది అని ఆనందిద్దాం. అప్పటి విషయం అప్పుడే చూసుకుందాం.”

ఆమె మాటల్లో అమాయకమైన ప్రాక్టికాలిటీ ఉంది. కానీ ఆ మాటలు రమణ చెవుల్లో మాత్రం బరువుగా మోగాయి.

విశ్వేశ్వరరావు చిన్నగా నవ్వాడు. ఆ నవ్వులో బాధ ఉంది… అంగీకారం ఉంది… తన పరిస్థితిని తానే అర్థం చేసుకున్న వృద్ధుడి నిస్సహాయత ఉంది.

ఆ రాత్రి రమణకు నిద్ర పట్టలేదు. హాల్లో మంచంపై ఒంటరిగా పడుకున్న తండ్రి దగ్గు ప్రతి సారి వినిపించినప్పుడు అతని మనసు కలవరపడ్డది. “నాన్నతో చివరిసారి మనస్ఫూర్తిగా ఎప్పుడు మాట్లాడాను? ఆయనతో కూర్చుని ప్రశాంతంగా కాఫీ తాగింది ఎప్పుడూ?” అని తనను తానే ప్రశ్నించుకున్నాడు.

అతనికి ఒక చేదు నిజం అర్థమైంది.

ఈ కాలంలో చాలా ఇళ్లలో వృద్ధులు బ్రతికేది కేవలం శరీరంతో మాత్రమే. వాళ్ల మాట వినడానికి ఎవరికీ సమయం ఉండదు. ఉదయం ఒక కప్పు కాఫీ… మధ్యాహ్నం నాలుగు మెతుకులు… రాత్రి మందుల సమయం — అంతే. వాళ్ల ఒంటరితనం గురించి, భయాల గురించి, మనసులోని బాధ గురించి అడిగే వారు చాలా అరుదు.

భార్యను కోల్పోయిన వృద్ధ తండ్రులు ఇంట్లో ఒక మూలన మౌనంగా రోజులు నెట్టేస్తుంటారు. భర్తను కోల్పోయిన వృద్ధ స్త్రీలు కోడలికి తోడ్పడుతూ, మనవళ్లతో కాలక్షేపం చేస్తూ తమ ఒంటరితనాన్ని దాచిపెడుతుంటారు.

వాళ్లు బ్రతికున్నప్పుడు మాత్రం “సమయం లేదు” అని చెప్పే మనుషులు… వాళ్లు చనిపోయాక మాత్రం అప్పులు చేసైనా క్రతువుల్లో ఎలాంటి లోటు ఉండకూడదని లక్షలు ఖర్చు పెడతారు. తద్దినాలు, సంస్కారాలు, విందులు అన్నీ ఘనంగా నిర్వహిస్తారు.

అది నిజంగా ప్రేమ వల్లనా?

లేక… “ఏదైనా కీడు జరుగుతుందేమో” అన్న భయమా?

బ్రతికున్నప్పుడు తమవారిలా ప్రేమగా పలకరించడానికి వెనుకాడే మనుషులు చనిపోయాక మాత్రం ఆత్మశాంతి పేరుతో ఆర్భాటాలు ఎందుకు చేస్తారు ?

ఈ ప్రశ్నకు సమాధానం చెప్పగల సమాజం ఇంకా పుట్టలేదు.

మరుసటి ఉదయం రమణ నిద్రలేచేసరికి విశ్వేశ్వరరావు ఇంటి ముందు కూర్చుని ఉదయసూర్యుణ్ని చూస్తూ ఉన్నాడు. ఎన్నాళ్లుగానో మొదటిసారి రమణ నెమ్మదిగా వెళ్లి తండ్రి పక్కన కూర్చున్నాడు.

“నాన్నా… ఈ రోజు బయటికి వెళ్దామా? మీకు ఇష్టమైన ఆలయానికి తీసుకెళ్తాను,” అన్నాడు.

విశ్వేశ్వరరావు ఆశ్చర్యంగా కొడుకువైపు చూశాడు. ఆ కళ్లలో మెరిసింది ఆనందమా… లేక తనను ఇంకా ఎవరో కావాలనుకుంటున్నారనే తృప్తియా… అతనికే తెలియలేదు.

కానీ ఆ క్షణంలో రమణకు మాత్రం ఒక నిజం స్పష్టంగా అర్థమైంది.

చనిపోయిన తర్వాత చేసే సంస్కారాల కంటే…

బ్రతికున్నప్పుడు పంచే ప్రేమే గొప్ప క్రతువు.

లేకపోతే…

మనుషులు ఖర్చు పెట్టేది ప్రేమ కోసం కాదు —

భయంతో కొనుకున్న నిశ్చింత కోసమే.

బ్రతికున్నప్పుడు తల్లిదండ్రులకు పంచని ప్రేమను… చనిపోయాక చేసే క్రతువులు ఎప్పటికీ భర్తీ చేయలేవు.

మనిషికి చివరికి కావలసింది సంస్కారాల ఆర్భాటం కాదు — తనవాళ్ల మనసులో ఒక చిన్న స్థానం మాత్రమే******

సమాప్తం