చిదంబర రహస్యం

ఈనాడు దినపత్రిక • 08 Oct 2026 • 👁 5 views
చిదంబర రహస్యం
చిదంబర రహస్యం
(ఈనాడు దినపత్రిక 8/10/2026 మకరందం శీర్షికలో ప్రచురణ )

మనం అనేక సందర్భాలలో “నీకూ చిదంబర రహస్యం చెప్పనా ?” అంటూ ఉంటాం. ఇంతకీ ఈ నానుడి ఎలా వచ్చిందో తెలుసుకుందామా .
శైవక్షేత్రాలలో చిదంబరంలోని నటరాజ స్వామి ఆలయం ప్రత్యేకమైనది. పంచభూతాలైన గాలి, నీరు, నిప్పు, నేల ఆకాశాల్లో .. ఆకాశ తత్వానికి ప్రతీకగా భావించే ఈ క్షేత్రంలో పరమశివుడు నటరాజ రూపంలో దర్శనమిస్తూనే, అరూపంగా కూడా కొలువై ఉన్నాడనే విశ్వాసం ఉంది. నటరాజుని సన్నిధికి సమీపంలో ఒక తెర ఉంటుంది. ఆ తెర తొలగించినప్పుడు అక్కడ మన కంటికి కనిపించేది విగ్రహం కాదు... శూన్యప్రదేశం. దానినే ‘చిదంబర రహస్యం’ అంటారు. ఆకాశం వలెనే అరూపమైన శివతత్త్వాన్ని అలా శూన్యరూపంలో దర్శింపజేస్తారని పండిత వచనం. తెర ముందు బంగారు బిల్వదళాల అలంకరణ కనిపిస్తుంది.
ఒకసారి ఒక రాజు చిదంబర క్షేత్రానికి వెళ్లాడు. నటరాజ స్వామిని దర్శించిన తరువాత పూజారి అతడిని రహస్య సన్నిధి వద్దకు తీసుకెళ్లాడు. తెర తొలగింది. రాజు అటూ ఇటూ పరిశీలనగా చూసి “స్వామీ! దేవుడి విగ్రహం ఎక్కడ ?ఏమీ కనిపించడం లేదే!” అని అడిగాడు.పూజారి చిరునవ్వుతో, “మహారాజా! మీరు దర్శించాలనుకున్నది దేవుడి రూపం. కానీ ఇక్కడ తెలుసుకోవలసింది దేవుడి ఉనికి. కనిపించనంత మాత్రాన లేనట్టు కాదు “ అన్నాడు.
రాజు ఆశ్చర్యంగా చూడగా ..” మహారాజా !గాలి కనిపించదు. కానీ అది లేకుండా మనం జీవించలేం. ఆకాశానికి రూపం లేదు. కానీ ఉన్నది కదా. అలాగే దైవం విగ్రహరూపంలోనే ఉండాలని లేదు. మన చుట్టూ, మనలోనూ వ్యాపించి ఉంటుంది. ..” అన్నాడు.
ఆ మాటలు విన్న రాజు “ఇంతకాలం దేవుడిని ఆలయాలలో, విగ్రహాలలోనే వెతుకుతున్నాను . దైవం లేని ప్రదేశమే లేదు కదా! మనసులో రాగద్వేషాలు తొలగితే అంతటా, అందరిలో దైవాన్ని దర్శించవచ్చు. బయట కనిపించనిది శూన్యం కాదు. అది అనంతమైన దైవ ఉనికికి సూచన “ అనుకున్నాడు.
‘చిదంబరం’ అనే పేరులోనే చిత్తానికి, ఆకాశానికి సంబంధించిన ఆధ్యాత్మిక భావం దాగి ఉందని చెబుతారు. చిదంబర రహస్యం మనకు చెప్పే అంతరార్థం కూడా ఇదే. మనిషి బయట ప్రపంచాన్ని జయించినంతలో సరిపోదు. మనలోని అజ్ఞానం అనే తెర తొలగినప్పుడే నిజమైన ప్రశాంతత లభిస్తుంది.
మనలో విషయజ్ఞానం ఉన్నంతలో సరిపోదు. అంతరంగంలో శూన్యం, లేదా ఖాళీ ఏర్పడకూడదు.. సంపద, హోదా, పేరు ప్రతిష్ఠల వెనుక పరుగులు తీస్తూ అంతరంగ పరిశీలన దైవ చింతనా విస్మరిస్తున్నాం. మనసులోని మాయాతెర తొలగినప్పుడు శివతత్వం గోచరమవుతుంది . అదే చిదంబర రహస్యం.
- జె. ఉషారాణి