వ్రతం

లహరి • 25 Sep 2026 • 👁 8 views
వ్రతం
వ్రతం (కథ )
రచన : జీడిగుంట నరసింహ మూర్తి
(25/9/2026 లహరి సాహితీవేదికలో ప్రచురితం )
సుబ్బారావు, రమణమ్మ్మలకు పెళ్లయి పాతికేళ్లు అయ్యింది. . ఇన్నేళ్లలో వాళ్లు ప్రేమగా మాట్లాడుకున్న రోజులు తక్కువే కానీ, దెబ్బలాడుకున్న రోజులు మాత్రం లెక్కపెట్టడం కష్టం.
సుబ్బారావు ఏం చేసినా రమణమ్మకు తప్పే. బయటికి వెళ్లి ఆలస్యంగా వస్తే తప్పు. త్వరగా వస్తే “ ఇంట్లో పనిమనిషి వచ్చే సమయానికి ఆ అమ్మాయికి కాళ్లా వేళ్ళ అడ్డం పడకపోతే వెళ్లిపోయాక రావచ్చుగా?” అంటూ సాధింపు.
అలాగే రమణమ్మలో కూడా అతనికి ఎన్నో లోపాలు కనిపిస్తూ ఉంటాయి.
ఉదయం కాఫీ ఆలస్యమైతే తప్పు. త్వరగా ఇస్తే వేడిగా ఉందని తప్పు. బయటికి వెళ్లి ఆలస్యంగా వస్తే తప్పు. వస్తూ వస్తూ ఎవరినైనా వెంటపెట్టుకుని వస్తే తప్పు.
ఆమె తిట్లకు అలవాటుపడిపోయిన సుబ్బారావు కూడా అప్పుడప్పుడు కావాలనే ఏదో ఒకటి చేసి ఆమెను రెచ్చగొట్టేవాడు.రోజూ ఏదోవిధంగా ఇద్దరిలోనూ ధుమధుమలు, ముటముటలు .
ఆ రోజు వరలక్ష్మీ వ్రతం .
రమణమ్మ తెల్లవారుజామునే లేచి ఇల్లంతా శుభ్రం చేసి, పూజకు ఏర్పాట్లు చేసింది. కొత్త చీర కట్టుకుని, నగలు పెట్టుకుని, అమ్మవారికి పూజ చేసింది.
పూజంతా అయిపోయాక వాయనాలు ఇచ్చింది.
చివరలో ఆచారం ప్రకారం భర్తకు నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకునే సమయం వచ్చింది.
రోజూ ఏదో ఒకరకంగా మొగుడిని సాధించే ఆవిడకు భర్త కాళ్ళకు నమస్కారం చేయాలంటే చాలా ఇబ్బందిగా అనిపించింది.
ఎదురుగా కుర్చీలో కూర్చున్న సుబ్బారావు మాత్రం అప్పటికే నవ్వును ఆపుకుంటున్నాడు.నవ్వుకుంటున్న అతని మొహాన్ని చూడగానే రమణమ్మకు మొహం మాడిపోయింది.
రమణమ్మ అతని దగ్గరకు వెళ్లి, అయిష్టంగానే వంగబోయింది.
అది చూసి సుబ్బారావు తన కాళ్లు వెనక్కి జరిపాడు.
దాంతో రమణమ్మకు కోపం నషాళానికి ఎక్కింది.
“అఘోరించినట్టుగా ఉంది. ఆ కాళ్ళిలా తగలేయండి. నేను పాద పూజ చేసుకోవాలి. ఇన్ని శాస్త్రాలు చదువుతారు . ఆ మాత్రం తెలియదా ?” అంది రుసరుసలాడుతూ .
అక్కడున్న కొడుకు,కోడలు ఇంకా పక్కింటినుండి వచ్చిన పేరంటాళ్లు ఒక్కసారిగా నవ్వేశారు.
సుబ్బారావు కూడా నవ్వుతూ,
“అదేంటి రమణా ! సంవత్సరం పొడవునా నా కాళ్లు కనపడినా, నేను అడ్డం వచ్చినా నోటికొచ్చినట్టు తిట్టేస్తావు. ఈ రోజు మటుకు నా కాళ్ళు కావాల్సి వచ్చాయా నీకు ?” అంటూ వ్యంగ్యంగా నవ్వాడు.
రమణమ్మ సుబ్బారావు కేసి కొరకొరా చూసింది.
“ చాల్లెండి సంవత్సరం పొడవునా మీరు చేసే పనులకు నేను కాళ్లు పట్టుకుని నమస్కారం చేయాలా అయ్యగారికి ?” అంటూ మళ్ళీ తిట్టబోయింది.
సుబ్బారావు మెల్లగా భార్య దగ్గరకు వచ్చి,
“ రమణా ... ఈరోజు అయినా నన్ను క్షమించండి అని ఉంటే నిన్ను మనస్ఫూర్తిగా దీవించేవాడిని”
ఆమె అతని వైపు చూసి,
“అది నాకు అలవాటైపోయింది లెండి. అయినా నాకు మీ ఆశీస్సులు లేకుండా పోతాయా మీ మీద నాకు ప్రేమ లేకుండా పోతుందా ? తిట్టే నోరు , తిరిగే కాలు ఊరుకోదు అని సామెత ఊరికే రాలేదుగా !” అంది నవ్వుతూ.
“పోనీలేవోయ్. సంవత్సరం అంతా నీ ఇష్టం వచ్చినట్టు తిట్టుకో. ఆ వ్రతం రోజు మాత్రం నా కాళ్ళకు మనసారా నమస్కారం చేసి నా ఆశీస్సులు అందుకో. నాకు అది చాలు ,,” అన్నాడు సుబ్బారావు భార్యవైపు ప్రేమగా చూస్తూ *