నిరీక్షణ ఫలించిన వేళ

ఈనాడు • 24 Sep 2026 • 👁 6 views
నిరీక్షణ ఫలించిన వేళ
నిరీక్షణ ఫలించిన వేళ !
(24/9/2026 ఈనాడు దినపత్రికలోని మకరందం శీర్షికలో ప్రచురణ )

కంచి గరుడ సేవలా అయిపోయింది మా పని అనే మాట వింటుంటాం .ఇలా ఎవరైనా అన్నారంటే వాళ్ళు తలపెట్టిన పని గురించి ఎంత శ్రమించినా ఓ కొలిక్కి రావడంలేదని అకంచిర్థం. అంతులేని ఆలస్యం, విపరీతమైన శ్రమ ఎదురుచూపులను ప్రతిఫలిస్తుందిది .
ఇంతకీ నానుడి ఎలా పుట్టిందో చూద్దాం. కాంచీపురంలో. వరదరాజ స్వామి బ్రహ్మోత్సవాల్లో గరుడ సేవకు ఎంతో విశిష్టత ఉంది .ఈ సేవలో ఉపయోగించే ఇత్తడి గరుడ వాహనం చాలా పెద్దదిగా, బరువుగా ఉంటుంది .ఉత్సవానికి కొన్ని రోజులు ముందే అర్చకులు, ఆలయ సిబ్బంది దాన్ని ఎంతో శ్రమించి శుభ్రపరిచి మెరిసేలా సిద్ధం చేస్తారు. ఇక్కడితో పని పూర్తికాదు. గరుడ వాహనాన్ని స్వామివారి సేవ కోసం ఆలయం వెలుపలకు తీసుకువచ్చి సిద్ధంగా ఉంచుతారు. ఆ తర్వాత స్వామివారికి అలంకరణ పూర్తి అయ్యేవరకు నిరీక్షణ. భారీ వాహనాన్ని ముందుగానే సిద్ధం చేసి ఉంచిన వారికి, దాన్ని మోసే వారికి దర్శనం కోసం ఎదురుచూసే భక్తులకు, ఆ సమయం సుదీర్ఘమైనదిగా అనిపిస్తుంది. ప్రధానమైన స్వామి వారి అలంకరణ పూర్తయ్య లోగా గరుడ వాహనాన్ని సిద్ధం చేయటానికి ఇంత శ్రమ , ఇంత సమయం ఎందుకనే భావన నుంచి కంచిగరుడ సేవ అనే నానుడి పుట్టిందని చెప్తారు. అందుకే ఏదైనా పనికి చాలా ఎక్కువ సమయం పట్టినా, శ్రమకు తగిన ఫలితం కనిపించకపోయినా " కంచి గరుడ సేవ అయిపోయింది" అనడం ఆనవాయితీ అయింది .ఎంతసేపు ఈ నిరీక్షణ ? అని ఎదురుచూసిన భక్తులు గరుడునిపై విహరించే వరదరాజస్వామిని దర్శించుకోగానే తమ ఎదురు చూపులు ఫలించాయని ఆనంద పరవశులవుతారు
_ జీడిగుంట నరసింహమూర్తి