స్నేహానికి చిరునామా కుచేలుడు

ఈనాడు • 03 Sep 2026 • 👁 3 views
స్నేహానికి చిరునామా కుచేలుడు
( ఈనాడు దినపత్రిక 3/9/2026 మకరందం శీర్షికన ప్రచురించిన నా వ్యాసం )
సంపదలో తులతూగే వారితో స్నేహం సాధారణమే. కానీ పేదరికాన్ని లక్యపెట్టక చేలిమి నిలిస్తే అది అత్యుత్తమం. అలాంటి అపూర్వ స్నేహం కృష్ణ_ కుచేలులది .బాల్యంలో శ్రీకృష్ణుడితో కలిసి గురుకులంలో విద్యాభ్యాసం చేసిన కుచేలుడు కాల గమనంలో పేదరికంలో జీవించాడు .పిల్లలకు అన్నం కూడా పెట్టలేని దుస్థితి వచ్చినా, తన స్నేహాన్ని సంపద కోసం ఉపయోగించుకోవాలనే ఆలోచన అతనికి రాలేదు .ఒక రోజు భార్య ప్రోత్సాహంతో ద్వారకకు వెళ్ళాడు. చేతిలో ఉన్న అటుకుల మూటకంటే హృదయము లోని ఆప్యాయతను కానుకగా తీసుకెళ్లాడు
కుచేలుడ్ని చూసిన కృష్ణుడు రాజ మర్యాదలన్నీ పక్కనపెట్టి పరుగున వెళ్లి ఆలింగనం చేసుకున్నాడు. సింహాసనం పై కూర్చోబెట్టి స్వయంగా అతని పాదాలు కడిగాడు .స్నేహితుడు తెచ్చిన సాధారణ అటుకులను అమృతంలా స్వీకరించాడు. కుచేలుడు తన కష్టాలను నోటితో చెప్పకపోయినా కృష్ణుని మనసు వాటిని చదివింది. వీడ్కోలు సమయంలో ఏమీ ఇవ్వనట్టే కనిపించినా ఇల్లు చేరే సరికి దారిద్ర్యం తొలగిపోయింది. నేటి సమాజంలో పరిచయాలు పెరిగినా, ఆప్యాయతలు తగ్గుతున్నాయి. అవసరము ఉన్నంతవరకే అనుబంధాలు కొనసాగుతున్నాయి సామాజిక మాధ్యమాలలో అసంఖ్యాకంగా స్నేహితులు ఉన్నా కష్టకాలంలో భుజం తట్టేవారు అరుదవుతున్నారు. కుచేలుడు మనకు నేర్పేది ఒక్కటే .నిజమైన స్నేహం లాభనష్టాల పై నిలవదు. విశ్వాసం, ప్రేమ, ఆత్మీయతలపై నిలుస్తుంది. స్నేహితుడి హోదా కాదు. హృదయం ముఖ్యం. బహుమతి ధరను బట్టి కాదు .అందులోనే ప్రేమను బట్టి విలువైనది .అందుకే యుగాలు మారినా, స్నేహప్రస్తావన వస్తే మొదట గుర్తుకు వచ్చేది కుచేలుడే. కృష్ణ_కుచేలుల స్నేహం తరతరాలకు ఆదర్శం
_ జీడిగుంట నరసింహమూర్తి