తల్లి మనసు

రవళి • 01 Sep 2026 • 👁 2 views
తల్లి మనసు
“తల్లి మనసు ?” (కథ )

రచన : జీడిగుంట నరసింహ మూర్తి
(రవళి మాస పత్రిక సెప్టెంబర్ 2026 లో ప్రచురణ )


“ఏమిటే అమ్మా ! ఇంత పొద్దునే లేచి కూర్చున్నావ్ నిద్ర రావడం లేదా ? అడిగాడు చక్రపాణి తల్లి పార్వతమ్మను అనుమానంగా చూస్తూ.

“చెపుతా చెపుతా వాడిని రానీ ! ఈ రోజు వాడి అంతు తెల్చేస్తా “ అంది పార్వతమ్మ అసలు విషయమేమిటో చెప్పకుండా.

సమయం ఉదయం ఆరున్నర అయ్యింది. తలుపు చప్పుడయ్యింది . రివ్వున లేచి తలుపు తీసింది పార్వతమ్మ .

“ఎన్నాళ్ళు తప్పించుకుంటావు ఓబులేసు ? నెలొచ్చేసరికి బిళ్లకుడుం లాగా డబ్బులు పట్టుకుని పోతావు కదా . నీకు మనస్సాక్షి ఉందా అసలు ? ..” అంది కోపంగా ఊగిపోతూ పార్వతమ్మ.

“ ఏంటమ్మా పొద్దున్నే ఈ నస . విషయం చెప్పకుండా తగుదునమ్మా అంటూ నా మీద పడిపోతున్నావు ?” అని అంతెత్తున ఎగిరిపడ్డాడు ఓబులేసు.

“చెపుతానురా .. నా కొడుకూ, కోడల్ని అమాయకులుగా చేసి రోజూ నీళ్ళ పాలు పోస్తావా ?వాళ్ళు ఆడగరు . నీ నోట్లో నోరెట్టడానికి వాళ్ళ కిష్టం లేదు. ఇంట్లో పెద్ద ముండాని. నేను ఊరుకుంటానా ? రేపటినుంచి నీ గేదెను మా సందులోకి తెచ్చి కట్టేసి పాలు పితికి ఇయ్యి. ఇంతకు ముందు పోసిన వాడు చిక్కగా మర్రూడలు లాంటి పాలు పోసే వాడు. వాడి గేదె చచ్చిపోయిందని మానేశాడు కానీ నీలాంటి ఏబ్రాసి దగ్గర పాలు కొనాల్సిన పరిస్తితి వస్తుందని మాకేమి తెలుసు ?” అంది పార్వతమ్మ గట్టిగా అరుస్తూ చుట్టు పక్కల వాళ్ళు వింటున్నారన్న స్పృహ కూడా లేకుండా .

“ ఏమిటమ్మా మంచీ మర్యాద లేకుండా నన్ను “రా “ అంటావా ? నాకున్న గేదెలు, ఆవులు అన్నీ కలిపితే నా ఆస్తి ఎంతో తెలిస్తే నీ కళ్ళు తిరిగిపోతాయి. . ఎప్పుడూ లేనిది ఈ రోజు నీళ్ళు కలిపి పోస్తున్నాను అంటావ్ నీ కోడల్ని అడుగు. నీకు కాఫీలో నీళ్ళు కలిపి ఇస్తోందేమో ?” అన్నాడు సీరియస్గా మొహం పెట్టి అక్కడి నుండి వెళ్ళిపోతూ.

వాళ్ళ సంభాషణ నంతా ముసుగులోంచి వింటున్నాడు చక్రపాణి.

అతనికి ఓబులేసు అన్న చివరి వాక్యం బాగా స్పష్టంగా వినపడింది.

లోపలికొస్తున్న తల్లిని “అమ్మా నీకు నీ కోడలి మీద అనుమానం ఉందా ? ఈ ఇంట్లో నీ తర్వాతే కదే మేమంతా ? నువ్వెన్ని సార్లు నాతో అన్నావు నీ పెళ్ళాం నన్ను తల్లిలాగా చూసుకుంటోందని ? పొరపాటున కూడా ఓబులేసు అన్న మాటలు అమ్మ దగ్గర అనకు. దాని మనసు విరిగిపోయిందంటే మళ్ళీ అతుక్కోవడం కష్టం .. “ అన్నాడు వివర్ణమైన మొహంతో చక్రపాణి.

“అదేమిటిరా అలా అంటావు . ఆ వెధవ ఏదో వాగాడని కోడల్ని అనుమానిస్తానా? ఈ ఇంట్లో తింటూ మీకే ద్రోహం తలపెడతానని ఎలా అనుకుంటున్నావు ? వాడు ఉక్రోషంతో పైకి అలా అన్నాడు కానీ రేపటి నుండి చూడు పాలు చిక్కగా పోయక పోతే అడుగు. మేము ఇలాంటివి ఎన్ని చూడక పోతే నా వయసు డబ్బయికి చేరుకుంది అనుకుంటున్నావ్ ? .. “ అంటూ పాల గిన్నె పట్టుకుని వంటింట్లోకి వెళ్ళింది పార్వతమ్మ .

తల్లి మాటలతో చక్రపాణి మొత్తబడ్డాడు .

ఏ మాటకామాట చెప్పుకోవాలి. ఓబులేసు రోజూ నీళ్ళ పాలు గుమ్మరిస్తున్నా తను, తన భార్య రామేశ్వరి ఒక్క రోజు కూడా అడగలేదు. దానితో వాడికి లక్ష్యం లేకుండా పోయింది. ఇంట్లో పెద్ద వాళ్ళు ఉంటే ఉపయోగాలు ఎన్నో . ఏం జరిగినా మనకెందుకు అని ఊరుకోవచ్చు కదా . రాత్రంతా నిద్ర పోకుండా పాల వాడి కోసం ఎందుకు కాపలా కాస్తుంది ? బాధ్యత తీసుకోవడం వల్లే కదా ?” అని మనసులో అనుకున్నాడు చక్రపాణి తల్లి వైపు అనురాగంగా చూస్తూ.

పార్వతమ్మ భర్త పోయాక ఇద్దరి కొడుకుల దగ్గర తలో ఆరు నెలలు ఉంటోంది. కొడుకులిద్దరూ మంచి వాళ్ళే. ఇక కోడళ్ళ విషయం చెప్పనక్కర లేదు. తనని ఎవ్వరూ కూడా పల్లెత్తు మాట అని ఎరుగరు . తను పూర్వకాలం నాటి అత్తగారిలా ఎప్పుడూ ఉండదు . కోడళ్లను బాగా దగ్గర చేసుకోగలిగే తెలివి తేటలు పుష్కలంగా ఉన్నాయి. తనకు నెలా నెలా వచ్చే పెన్షన్లో కోడళ్లకు, పిల్లలకు ఏదో ఒకటి కొనిచ్చేది.

“ఒరే అబ్బాయి నిన్న నువ్వు చెప్పులు విడుస్తూంటే చూశాను. ఏం ఖర్మ వచ్చి పడిందిరా నాయనా ? శుభ్రంగా సంపాదించుకుంటున్నావు . కొత్త చెప్పులు కొనుక్కోవచ్చు కదా ? ..” అంది పార్వతమ్మ కొడుకు పక్కన కూర్చుని దగ్గరకు తీసుకుంటూ ఒక రోజు.

“ ఏమిటో కొనుక్కోలేక పోతున్నాను అమ్మా ! పోనీ నువ్వు నాకు కొని పెట్టి ఇయ్యరాదూ ?” అన్నాడు చిలిపిగా.

“నా నాయనే... నా నాయనే . నాకెంత అదృష్టం రా బాబూ ! నీకు సాయంత్రానికల్లా కొత్త చెప్పులు కొని తీసుకొస్తాను. కాస్త చీపురు పుల్లతో ఆది చూసి ఇవ్వు. రేపటినుంచి ఆ పాత చెప్పులు నా కళ్ళకు కనపడటానికి వీల్లేదు ఏమనుకుంటున్నావో ?” అంటూంటే ఆమె మొహం విప్పారింది.

“ఛ ! ఊరికే అన్నానమ్మా ! నీ చేత కొనిపించుకుంటానా ? అసలు నేను ఎప్పుడైనా నీ చెప్పుల విషయం పట్టించుకున్నానా ? అసలు ఈ కొడుకులకు దయా, కరుణ కరువయ్యాయి. స్వార్ధం పెరిగిపోయింది. తల్లి తండ్రులను పట్టించుకోవడం మానేశారు. నేను కూడా అంతే కదా అమ్మా ! “ అంటూ తల్లి ఒడిలో తల పెట్టుకుంటూ అన్నాడు.

“నీ మొహం అలా అని ఎవరన్నారురా ? నీకు ఈ మధ్య మతి మరుపు పెరిగిపోతోంది. నేను ఈ ఊరు వచ్చినప్పుడు నాకూ, నా మనవళ్లకు షాపుకు తీసుకెళ్ళి జోళ్లు కొనివ్వడం గుర్తు లేదా ? అయినా నీకు ఇంత మంచితనం ఎలా వచ్చిందిరా ? నీ తమ్ముడికి కూడా అంతే. ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ ఇటువంటి సంతానం కలగదు .. ఉండు పాపం కోడలు ఒక్కతె వంటగదిలో కష్ట పడిపోతోంది. కాస్త కూరలు తరిగి ఇస్తాను ..” అంటూ కొడుక్కి ఇచ్చిన కాఫీ గ్లాసు తీసుకుని అక్కడ నుండి లేచి వెళ్ళి పోయింది పార్వతమ్మ .

“అమ్మా పెద్దమ్మ గారు ఇంకా ఎన్ని రోజులుంటారు ఇక్కడ ?” అని అడిగింది పనిమనిషి రాజమ్మ.

“ ఏ ఎందుకట ? ఆవిడ ఇప్పుడు నీకు ఏం అడ్డం వచ్చింది ?” అనుమానంగా అడిగింది రామేశ్వరి.

“ఏం చెప్పమంటావమ్మా ? అన్ని విషయాలు ఆవిడకే కావాలి . నేను శుభ్రంగా కడిగిన గిన్నెలన్నీ మళ్ళీ మళ్ళీ కడిగి పెడుతూ ఉంటుంది. జిడ్డు వదల్లేదు అంటూ సతాయిస్తుంది . రావడం కొద్దిగా ఆలస్యం అయితే చిరాకు పడిపోతూ ఉంటుంది. నువ్వు ఎప్పుడైనా నన్ను ఒక్క మాట అన్నావా తల్లీ ? ఆ ముసలావిడ చేత నేనెందుకు మాటలు పడాలి ? నువ్వు కూడా ఆవిడతో మరీ అంత ప్రేమగా ఉండకమ్మా. ఎక్కడా లేనిది ఆవిడతో పాటు కూరలు తేవడానికి వెళతావు. రెండు మూడు సార్లు ఇద్దరూ కలిసి సినిమాలు కూడా చూసొచ్చారు. ఇలా చేస్తే నీకు ఏం గౌరవం ఉంటుంది ? నువ్వు ఈ ఇంటి యజమానివి . ఆ ముసలావిడను ఎక్కడుంచాలో అక్కడ ఉంచాలి. నెత్తిమీద ఎక్కించుకోవద్దు. ఏదో గొడవ పెట్టుకుని త్వరగా ఇక్కడనుండి పంపించేయమ్మా . మొన్న పాల వాడు వీధిలో కనపడి చెపుతున్నాడు.” ఆ ముసలావిడ పరమ గయ్యాళి. లాభాలతో ఉన్న నా వ్యాపారం పాడు చేయడమే కాకుండా చుట్టుపక్కల వాళ్ళకు చెప్పింది పాలు పోయించుకోద్దని ..” అంటూంటే రామేశ్వరి మొహం సీరియస్గా మారింది.

“ తప్పు రాజమ్మా ! అలా అనుకోకూడదు. ఆవిడకేమి పట్టింది ? పాల వాడితో దెబ్బలాడటానికి ? గిన్నెలు తోమించుకునే విషయంలో నీతో తగువు వేసుకోవడానికి ? అందరిలాగానే ఆవిడ కూడా ఒక మూల కూర్చోవచ్చు కదా . నేను ఆవిడలో ఎటువంటి దోషం చూడలేను. ఆవిడ ఇక్కడ ఎన్నాళ్ళు ఉన్నా మాకు ఏమీ ఇబ్బంది లేదు. ఆవిడ నా భర్తకు తల్లి. అంటే ఈ ఇంట్లో ఒక ముఖ్యమైన మనిషి. నీకు ఇబ్బందిగా ఉంటే ఇంకో ఇల్లు చూసుకో. లేకపోతే జీతం పెంచమని అడుగు. ప్రతి ఇంట్లో పనిమనుషులు అడిగే ప్రశ్నే ఇది. “ మీ అత్తగారు ఎన్ని రోజులుంటుంది ఇక్కడ ? “అని . ఇది మంచి పద్దతి కాదు. నేను అందరి ఆడవాళ్ళు లాగా కాను. ఇక దయవుంచి మా కుటుంబ విషయాలలో కలిపించుకోకు రాజమ్మా ! మొదటి సారి, చివరి సారి చెపుతున్నాను. ..” అంటూ రామేశ్వరి పనిమనిషి రాజమ్మ మొహమ్మీద నిష్కర్షగా అనే సరికి “ నువ్వెక్కడ వెర్రిబాగుల దాని వమ్మా . లోకం పోకడ అసలు తెలియదు. ముందు ముందు నీకే తెలుస్తుందిలే నేను చెప్పిన దాంట్లో నిజం ఎంతో ? అయినా నాకెందుకమ్మా మీరెలా ఉంటే ? అన్నట్టు నేను మా అక్క కూతురి పెళ్ళికి వెళ్ళాలి. రేపటినుంచి నాలుగు రోజులు రాను. నీ అత్తగారితో అంట్లు తోమించుకో ..”అంటూ అంత సీరియస్ గానూ అని వీధి తలుపు గట్టిగా వేసేసి వెళ్ళి పోయింది రాజమ్మ.

రాజమ్మ చివరి మాటలు వినపడ్డాయి అనుకుంటా పార్వతమ్మకు.

“ఏమిటి రామేశ్వరి ! రాజమ్మ నాలుగు రోజులు రాను ఎక్కడికో వెళ్ళాలి అంటోంది ? నువ్వేమీ దిగులు పడకు. అది వచ్చినా ఇంట్లో అన్నీ జిడ్డు గిన్నెలేగా. శుభ్రంగా అవి నాకు వదిలేయి. తళ తళ మెరిసిపోయేటట్టు తోమి పెడతాను ..” అని అత్తగారు అంటూంటే రామేశ్వరి కళ్ళల్లో అప్రయత్నంగా కన్నీళ్ళు ఉబికి వచ్చాయి.

“ అమ్మా ! ఆ పనిమనిషి వెళ్తూ వెళ్తూ శపించి వెళ్ళింది కదా నువ్వూ, నీ కోడలూ గొడవ పడి జుట్టూ , జుట్టూ పట్టుకుని రోడ్డుమీద పడే రోజు తను కళ్ళారా చూస్తానని . చాలా ఇళ్ళల్లో లాగా నిజంగా అటువంటి పరిస్థితి వస్తే నువ్వు తట్టుకోగలవా? “ అన్నాడు చక్రపాణి తల్లి కళ్ళల్లోకి భావోద్వేగంగా చూస్తూ.

ఆ మాటకు పార్వతమ్మ ఒక్కసారిగా అదిరిపడింది.

“ఏం మాట్లాడుతున్నావురా నువ్వు ? ఇన్నాళ్ళు నువ్వు నన్ను అర్ధం చేసుకున్నది అంతేనా ? ఈ కట్టె కాలిపోయే అంతవరకు నాకూ, కోడలి మధ్య ఎవరెన్ని విద్వేషాలు రగిలించినా చలించే మనస్థత్వం కాదు నాది.ఇప్పుడన్నావు కానీ ఇంకా ఈ ప్రసక్తి నాదగ్గర ఎప్పుడూ తీసుకురాకు. నేను భరించలేను. కూతురితో ఏ తల్లి అయినా తగాదా పడుతుందా ? అలాగే ఏ కూతురైనా తల్లితో కర్కశంగా ప్రవర్తిస్తుందా ? అదే మా మధ్య ఉన్న బంధం. దీన్ని ఆ భగవంతుడు కూడా విడగొట్టలేడు..” అంటూ ఉంటే ఆమె కళ్ళల్లో ఉబికివస్తున్నకన్నీరు చూసి చక్రపాణి ఒక్కసారిగా చలించిపోయాడు.

“ లేదు లేమ్మా ! అటువంటి చెడు అనుమానాలను రెకెత్తిచ్చినందుకు నేను చెంపలేసుకుంటున్నాను. నీది సముద్రమంత పెద్ద మనసు. నీకు ఈ లోకంలో ఎవరూ సాటిరారు. నువ్వు నా బంగారు తల్లివి. నేనూ, నీ కోడలూ నిన్ను కడుపులో పెట్టుకుని చూసుకుంటాము ..” అంటూ ఉంటే పార్వతమ్మలో ఎక్కడలేని బలం, ఉత్సాహం ముంచుకొచ్చింది.

పక్కనే ఉండి వీళ్ళ సంభాషణ అంతా వింటున్న రామేశ్వరి సజలనేత్రాలతో అత్తగారి పక్కనే కూర్చుండి ఆమె ఒడిలో తల పెట్టుకుని తనకు తల్లి లేని లోటును తీర్చుకుంది *****

సమాప్తం