ఎవరి లెక్కలు వారిది (కథ )
రచన : జీడిగుంట నరసింహ మూర్తి
(30/8/2026 విశాలాంధ్ర దినపత్రిక ఆదివారం అనుబంధంలో నా కథ )
“మిమ్మల్ని బయటకు పంపాలంటే భయంగా ఉంది. బజార్లో షాపుల వాళ్ళందరినీ పోషించాలని కనపడిన చెత్తనంతా ఇంట్లోకి చేరుస్తున్నారు.అందులో ఒక్కటి కూడా పనికి వచ్చేది అంటూ ఉండదు. పైగా ఎవరికి ఎంత డబ్బులు ఇస్తున్నారో కూడా చూసుకోరు.వెళ్లేటప్పుడు కళ్ళ జోడు పెట్టుకోమంటే నామోషీ...." అంటూ భర్త వీరభద్రం మీద విసుక్కుంది అతని భార్య అలివేలు.
" నీకే ఇంట్లో కూర్చుని కబుర్లు చెపుతావు.నేను ఇవ్వన్నీ మోసుకుని రాకపోతే ఇల్లెలా నడుస్తోందనుకుంటున్నావ్ ? ఏదో ఒకటి సతాయించాలి. అసలు ఈ బీపీలు, షుగర్లు ఎందుకొస్తాయి అనుకుంటున్నావ్ ? నీలాంటి వాళ్ళ వల్ల కాదూ? సరేలే.రేపటినుంచి కాళ్ళు ముడుచుకుని కూర్చుంటాను. ఇంట్లో అదైపోయింది, ఇది అయిపోయింది అని చెప్పావో కొన్నాళ్ళ పాటు చెవిటి వాడిని అయి పోతాను" అంటూ అలివేలు మీద అంతెత్తున ఎగిరిపడి " సరేలే.నీ గోల ఎప్పుడూ ఉండేదే కానీ కాస్త నా మోహన కాఫీ నీళ్ళు ఏమైనా పోసేది ఉందా లేదా ? " అన్నాడు పక్కనే ఉన్న కుర్చీలో ఉసూరుమంటూ కూలబడ్డాడు వీరభద్రం .
" అయ్యో నా మతి మండిపోను. మీరు కాఫీ అంటే గుర్తొచ్చింది.కాఫీ పొడీ నిండుకుందని మీరు బయటకు వెళ్లేటప్పుడు చెపుదామనుకున్నాను.అసలు ఒక్క నిమిషం నిలబడితేగా. అవసరం అయినవన్నీ వదిలేసి ఇదిగో ఈ చెత్తంతా వేసుకొస్తారు ..రేపు వెళ్లేటప్పుడు అన్నీ కాయితం మీద రాసుకుని వెళ్ళండి. సరేకానీ ఇందాక నేను తాగుదాము అని ఉంచుకున్న కాఫీ ఈ హడావిడిలో మర్చిపోయాను.వేడి చేసి తెస్తాను కూర్చోండి.మీ మొగుళ్ళు పెళ్లాలని ఎంత చులకనగా మాట్లాడినా మా త్యాగాలు మేము చెయ్యక తప్పడం లేదు.." అంటూ కాఫీ గ్లాస్ చేతిలో పెట్టింది అలివేలు ముసిముసి నవ్వులు నవ్వుతూ.
తర్వాత రోజు యథాప్రకారం ఒక సంచీ పుచ్చుకుని బజారుకి బయలు దేరాడు వీరభద్రం.వెళ్లేటప్పుడు కాఫీ పొడి గుర్తు చెయ్యాలన్న విషయం మర్చిపోయింది అలివేలు.
వీరభద్రం అసలే మతిమరపు ప్రొఫెసర్.
" ఏమోయి ! ఎవరో ఫోన్ చేస్తే హడావిడిగా బయటకు వెళ్ళాను కాఫీ కూడా తాగకుండా.పొద్దున్న డోసు, బయటకు వెళ్లొచ్చాక నువ్విచ్చే డోసు కలిపి ఒక పెద్ద గ్లాసుడు కాఫీ బాగా స్ట్రాంగ్ గా చేసి ఇవ్వు.నాలిక ఒకటే పీకేస్తోంది ..." అంటూ భార్యకు పురమాయించాడు.
" నాకూ అలాగే ఉంది పొద్దున్నే కాఫీ గొంతులో పడక పోయేసరికి. ..ముందా కాఫీ పొడి బయటకు తీయండి.." అంది అలివేలు కళ్ళు పెద్దవి చేసి చూస్తూ.
“కాఫీ పొడేమిటి నాకెప్పుడు చెప్పావు ? “ అన్నాడు వీరభద్రం వెర్రి చూపులు చూస్తూ.
“రోజుకు రెండు సార్లు కాఫీ తాగకపోతే నాలికను బలవంతంగా పీకేసుకునే మీరు నిన్న చిలక్కి చెప్పినట్టు చెప్పినా కూడా మర్చిపోయారా ? అసలు మీరు ప్రొఫెసర్ ఎలా అయ్యారో అర్ధం కావడం లేదు. ప్రతీదీ అరటి పండులో పెట్టి ఇచ్చినట్టు చెప్పడం నా వల్ల కాదు . అసలు మీ వంటి ఏకాగ్రత లేని మనుషులకు చెప్పడం ఆ బ్రహ్మ తరం కూడా కాదు . ఈ రోజు మీకు కాఫీ లేదు గీఫీ లేదు. మీ వల్ల నేను కూడా నోరు కట్టుకోవాల్సి వచ్చింది. ఛీ ఛీ ఏం మనిషో అర్ధం కావడం లేదు ..” అంటూ అంతెత్తున ఎగిరిపడింది అలివేలు .
ఇంతలో ఊహించని ఉరుములాగా ఊడిపడ్డాడు అలివేలు తమ్ముడు సుబ్రమణ్యం.
“ ఏం బావగారూ !ఏం అక్కయ్యా ? ఈ వూళ్ళో ఏదో పని ఉంటే ఎలాగూ మిమ్మల్ని చూసినట్టు ఉంటుంది అని వచ్చాను. బాగున్నారా అంతా ?” అన్నాడు కుర్చీలో కూలబడి పక్కనే ఉన్న తెల్ల టవల్ తో చెమట పట్టిన మొహాన్ని పరపరా తుడుచుకుంటూ.
“అవునులే అనుకున్నానులే . పొద్దున్నుండి కాకి కావు కావు మని కాకి అరుస్తూ ఉంటే అప్పుడే అనుకున్నాను ఏదో ఉపద్రవం వచ్చి పడుతోందని . .. “ అన్నాడు వీరభద్రం గుర్రుమని చూస్తూ.
అతనికి మొదటినుండి బావమరిది అంటే అయిష్టం. ఏ సహాయం అడిగినా మొహం చాటేస్తాడని .
“ అలా వెర్రి మొహం వేసుకుని చూస్తారేమిటండీ . ముందు వెళ్ళి కాఫీ పొడి తీసుకురండి. పాపం మా తమ్ముడు ఎండన పడి వచ్చాడు. వాడికి మన ఇంట్లో కాఫీ అంటే ప్రాణం . దానితో పాటు ఒక రెండు మంచి కూరలు కూడా తెచ్చి పడేయండి. రెండు రోజులు ఇక్కడే ఉండమని తమ్ముడికి చెపుతాను ..” అంటూ తమ్ముడిని ఉద్దేశించి “ రారా మీ బావగారిని పట్టించుకోకు. ఆయన తలతిక్క మనిషి. ఎంత మాట పడితే అంత అనేస్తారు. . ..” అంటూ మరోసారి మొగుడిని అవమానించి పారేసింది.
“పాపం బావగారిని శ్రమపెట్టకు అక్కాయ్ . మీ ఇంట్లో నాకు మొహమాటం ఏమిటి ? ఆ కాఫీ పొడి , కూరకాయలు నిమిషంలో బయటకెళ్ళి తెచ్చి పడేస్తాను. మావి వెధవ కాఫీగత ప్రాణులు. అన్నం లేకపోయినా బ్రతికేస్తాము కానీ ఆరారా ఆ ధార గొంతులో పడుతూనే ఉండాలి...” అంటూ చేతి సంచీ చంకన పెట్టుకుని నిమిషాల్లో మాయం అయ్యాడు సుబ్రమణ్యం.
“అన్నం మెల్లగా వండుదువు గాని ముందు మీ తమ్ముడు కాఫీ పొడి తేగానే నా మొహాన వేడి వేడి కాఫీ ఏదో పొయ్యి.అన్నట్టు మీ తమ్ముడు బయటకు వెళ్లేటప్పుడు సరుకులకు డబ్బులేమేనా ఇచ్ఛావా ? లేకపోతే కోపంగా ఆ రెండు కూరలేవో తెచ్చి కాఫీ పొడి తేకుండా వస్తాడేమో?. అయినా ఇంట్లో రెండు రోజులుండేటప్పుడు ఆ మాత్రం ఖర్చు భరించలేడా? అదేదో రిజిస్ట్రేషన్ ఆఫీసులో కూర్చుని లెక్కలు రాసి బాగానే సంపాదిస్తున్నాడు కదా ” అన్నాడు ముక్కుపోడి ఎగపీలుస్తూ.
“ఖర్మ ఖర్మ. అంత పెద్ద చదువు చదువుకున్నా ఒక్క విషయంలోనూ మీ బుద్ధి తిన్నగా లేదు. ఎక్కడికైనా మిమ్మల్ని కూడా తీసుకుని వెళ్తే నాకు ఆత్మహత్య తప్ప వేరే గత్యంతరం ఉండదు అని ఇంట్లోనే కాపలా పెట్టి పోతున్నాను. పొద్దున్నే కాఫీ మంచం దగ్గరకు రావాలి. ఆఖరికి ఆ ఖర్చు కూడా తప్పించుకుని అమాయకుడైన నా తమ్ముడి నెత్తిమీద మోపారు. ఆ రుణం తీర్చుకోవడానికి మనం వచ్చే జన్మలో వాళ్ళింట్లో పని మనుషులుగా పుట్టడం ఖాయం ..” అంటూ భర్త చేసే పనులకు అలివేలు గట్టిగా శపించి అక్కడనుండి కోపంగా వెళ్ళిపోయింది *******
సమాప్తం