కూతురి ఇల్లు(కథ )
రచన :జీడిగుంట నరసింహ మూర్తి
(లహరి సాహితీ వేదిక 21/8/2026 లో ప్రచురితం )
“అమ్మా... నాన్నా... ఇక మీరు మా దగ్గరే ఉండాలి.”
కూతురు వసుధ మాటలకు రాధిక , రఘురాం ఒకరినొకరు చూసుకున్నారు.
కొడుకు విదేశంలో ఉద్యోగం. అతని కుటుంబం అక్కడే స్థిరపడింది. వసుధ మాత్రం అదే నగరంలో భర్తతో ఉంటోంది. వయసు మీద పడుతున్న తల్లిదండ్రులు ఒంటరిగా ఉండటం కష్టమవుతోందని గ్రహించిన ఆమె, భర్తతో మాట్లాడి వాళ్లను తమ దగ్గరకు తీసుకురావాలని నిర్ణయించుకుంది.
“కానీ... తల్లిదండ్రులు కూతురి ఇంట్లో ఉండకూడదని మన పెద్దలు చెప్పలేదా?”రఘురాం సందేహంగా అడిగాడు.
“పెద్దలు చెప్పిన మాటల వెనుక ఉన్న ఉద్దేశాన్ని మనం అర్థం చేసుకోవాలి నాన్నా. పరిస్థితులు మారినప్పుడు ఆచరణలో కూడా మార్పు రావాలి. మిమ్మల్ని చూసుకోవడానికి మేమున్నప్పుడు, మీరు ఒంటరిగా ఎందుకు ఉండాలి?”
రఘురాం మౌనం వహించాడు.
కొన్ని రోజులకు తల్లిదండ్రులు వసుధ ఇంటికి వచ్చేశారు. మొదట్లో వాళ్లిద్దరికీ కొంత ఇబ్బందిగానే అనిపించింది. తమ వల్ల కూతురికి అదనపు భారం పడకూడదని జాగ్రత్తపడేవారు. తమ పనులు తామే చేసుకునేవారు. వసుధ వాళ్ళ చేత అనవసర ఖర్చు పెట్టించే వారు కారు. కూరలు, పాలు వద్దన్నా కూడా వాటికి ఆయనే ఖర్చు పెట్టేవాడు.
ఒకరోజు రఘురాంకు వైద్య పరీక్షలు చేయించుకోవాల్సి వచ్చింది. మందుల ఖర్చు తన పెన్షన్‌తో సరిపోలేదు.కొడుకు తన మాట కాదనకుండా విదేశాలు వెళ్ళిపోయి సెటిల్ అయిపోవడంతో అతను పంపించే డబ్బును కూడా తీసుకోవడానికి ఆయన అయిష్టతతో ఉండేవాడు.
తండ్రి వైద్యం కోసం డబ్బుకు ఇబ్బంది పడుతున్న విషయం గ్రహించి వసుధ వెంటనే డబ్బులు తీసుకొచ్చి తండ్రి చేతిలో పెట్టింది.
“ఇదిగో నాన్నా... మందులకు ఉపయోగించుకోమని మీ అల్లుడు గారే చెప్పారు . తీసుకోండి ” అంది.
రఘురాం ఆ డబ్బులు తీసుకోకుండా ఆమె వైపు చూశాడు.
“వద్దమ్మా. ఇప్పుడు మందులు జెనరిక్ షాపులలో తక్కువ రేట్లలో దొరుకుతున్నాయి. అవి కొనుకకుంటాను ”అన్నాడు సాధ్యమైనంతవరకు కూతురి కుటుంబం మీద భారం మోపడం ఇష్టం లేక.
వసుధ తండ్రి చేతిని పట్టుకుంది.
“నాన్నా... మీరు మమ్మల్ని పెంచినప్పుడు ‘ఇది నా డబ్బు, ఇది మీ డబ్బు’ అని లెక్క పెట్టారా?”
రఘురాం మౌనంగా ఉండిపోయాడు.
“మమ్మల్ని చదివించారు. మా అవసరాలు తీర్చారు. మా భవిష్యత్తు కోసం మీ సంతోషాలను వదులుకున్నారు. ఇప్పుడు మీకు అవసరమైనప్పుడు మేము చేయగలిగినది చేస్తే దాన్ని భారం అనుకోవడం ఎందుకు?”
తండ్రి కళ్లలో నీళ్లు తిరిగాయి.
ఆ రాత్రి రఘురాం చాలాసేపు నిద్రపోలేదు.
తన చిన్ననాటి నుంచి వింటూ వచ్చిన మాటలు, ఇప్పటి పరిస్థితులు... అన్నీ మనసులో తిరిగాయి.
ఉదయం భార్యతో అన్నాడు—
“మన కాలంలో కొడుకే వృద్ధాప్యానికి ఆధారం అనే భావన బలంగా ఉండేది. కానీ ఇప్పుడు పిల్లల్లో ఎవరు మనకు తోడుగా నిలబడుతున్నారన్నదే ముఖ్యం. కొడుకు అయినా, కూతురు అయినా... ప్రేమతో చూసే మనసుంటే చాలు.అలా అని మొత్తం మన బరువంతా వాళ్ళ మీద మోపడం మంచిది కాదు ”
రాధిక చిరునవ్వు నవ్వింది.
“అదే కదా నేను కూడా అనుకుంటున్నది.”
ఆ మాటలు వసుధ చెవిన కూడా పడ్డాయి.
“అయితే ఒక విషయం మాత్రం గుర్తుంచుకోమ్మా,” అన్నాడు రఘురాం .
“మేము మీ దగ్గర ఉంటున్నామనే కారణంతో మా బాధ్యతలన్నీ మీ మీద వేయం. చేతనైనంతవరకు మా ఖర్చులు మేమే చూసుకుంటాం. కానీ అవసరమైనప్పుడు నీ సహాయం తీసుకోవడానికి మాత్రం ఇక సంకోచించం.”
వసుధ తండ్రి వైపు చూసి నవ్వింది.
“నాక్కావలసింది అదే నాన్నా... మీకు మేము తోడుగా ఉండాలి. మీరు మాకు భారంగా కాకుండా, మా వాళ్లుగా ఉండాలి.”
ఆ రోజు నుంచి ఆ ఇంట్లో ఒక కొత్త అనుబంధం ఏర్పడింది.
అక్కడ ఎవరి ఇల్లు అనే ప్రశ్నకు సమాధానం అవసరం లేకుండా పోయింది.
“కూతురి ఇంట్లో తల్లితండ్రులు ఉండటం, కూతురు దగ్గర డబ్బు తీసుకోవడం హిందూ సంప్రదాయంలో సరైనదా?” కాదా అని ఇప్పటికీ సంశయంగా ఉన్న ఈ రోజుల్లో పరిస్థితులను బట్టి పద్దతులు కూడా మార్చుకోవాలి అని ఒక బలమైన నినాదం అందరి ముందుకు వచ్చింది. తల్లితండ్రులను ప్రేమతో ఆదరించే చోటు కూతురి ఇల్లయినా, కొడుకు ఇల్లయినా... చివరికి అది వారి ఇల్లు గానే పరిగణిస్తూ పిల్లల కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటూ జీవితాన్ని కొనసాగించడమే న్యాయం” అని అనిపించడంతో వాళ్ళ జీవితం ప్రశాంతంగా సాగిపోయింది****
సమాప్తం