***జీవన `ప్రయాణం`***
లెక్కకడితే ` ప్రతి మనిషికి సగటున పది లక్షలు చీమలు` ఈ భూమి మీద ఉంటాయి అట. సరిగ్గా విశాఖ పట్టణం రైల్వే స్టేషనులో అదే పరిస్తితి . ఒక్కో ట్రైను కోసం వందలలో జనంతో రైల్వే స్టేషన్ కిట కిట లాడుతుంది.
‘దయచేసి వినండి… బండి నంబరు … ఒకటి… రెండు… ఎనిమిది.. సున్నా… అయిదు… విశాఖపట్టణం నుండి లింగంపల్లి వెల్లు జన్మభూమి సూపరు ఫాస్టు ఎక్స ప్రస్సు ఒకటవ నంబరు ప్లాటు ఫాము నుండి బయలు దేరుటకు సిద్ధంగా ఉన్నది.’
విశాఖపట్టణం రైల్వే స్టేషన్లో అనౌన్సు మెంటు అది .సమయం ఉదయం 6.20 నిముషాలు . ఒక ప్రక్క అనౌన్సు మెంటు వస్తుండగానే ట్రెయిను చిన్నగా కదిలింది. అందరి దృష్టి ఆ వృద్ధుని మీద పడింది . చిన్నగా కదులుతున్న ట్రైను ఎక్కేందుకు అతని ప్రయత్నం. ఆ వయసులో పరుగెడుతూ ట్రైను అందుకోబోయాడు. అతని పేరు నారాయణ రావు.
నారాయణ రావు నీళ్ల బాటిల్ కొనేందుకు వెళ్ళి వచ్చే లోగా ట్రైను కదిలింది.దూరం నుండి పరుగెత్తుకుంటు వస్తున్న నారాయణ రావు చేయికి తన చేయి అందించింది కోకిలమ్మ.
అంతకు అయిదు నిముషాల ముందే ట్రైను ఎక్కి లగేజీ సరి చూసుకుంటూ డోరు దగ్గరే వుండటంతో అటుగా పరుగెత్తుతూ వున్న నారాయణ రావుకు చేయి అందించి ట్రైను ఎక్కేందుకు సహాయ పడగలిగింది కోకిలమ్మ.
“ధన్యవాదములు,మీరు గాని చేయి అందించకపోతే ట్రైను మిస్సు అయ్యేవాడిని” అన్నాడు నారాయణరావు.
“ట్రైను సంగతి తరువాత, జీవితమే మిస్సు అయ్యేవారు, ఆ సమయంలో చిన్న బ్యాలెన్సు తప్పిన ఘోర ప్రమాదం జరుగుతుంది” అంది కోకిలమ్మ.
“నిజమేనండి, ఒకరకంగా చెప్పాలంటే మీరు నా ప్రాణాలను కాపాడారు. రోజూ ఈ ట్రైను అయిదు పది నిముషాలు ఆలస్యంగా బయలుదేరుతుంది. ఈ రోజు నా దురదృష్టం సరియైన సమయంకు బయల్దేరింది” అన్నాడు నారాయణ రావు .
చిన్నగా నవ్వి తన ట్రైను లగేజీ తీసుకొని సీటు వెతుకుతూ ...Ac కోచ్…C1…సీటు నంబరు ఎనిమిదిలో కూర్చుని లగేజీ సర్దుకుంది కోకిలమ్మ.
తన ట్రైను లగేజీతో మరో అయిదు నిమిషాలలో వచ్చి నంబరు సరి చూసుకున్నాడు నారాయణ రావు . C1…సీటు నంబరు తొమ్మిది.
ఆమెది,తనది సైడు విండో సీట్లు. తన వయసే సుమారుగా ఉంటుంది .
సాధారణంగా మనిషి యవ్వనంలో ప్రేమ మీద ఎంత ఆసక్తి గా ఉంటాడో తిరిగి వృద్దాప్యంలో ప్రేమ కోసం అదే విధంగా పరి తపిస్తూ వుంటాడు.
ఒక ఆడది…కాదు ఒక అందమైన ఆవిడతో పన్నెండు గంటల ప్రయాణం, అదీ కూడ పగలు రోజంతా కబుర్లు చెప్పుకుంటూ..ఈ రోజు తను లక్కీ ఫెలో అనుకున్నాడు నారాయణ రావు .
“మీరు ఏమి అనుకోను అంటే ఒక్కమాట, ఈ వృద్దాప్యంలో ఒంటరి ప్రయాణం అది కూడా ఇంత ట్రైను లగేజీ తో ఇబ్బందిగా లేదా ?” అడిగాడు నారాయణరావు.
“ తప్పలేదండీ అబ్బాయి, కోడలు అమెరికాలో ఉంటారు. నేను అప్పుడప్పుడు ఇలా ప్రయాణిస్తూ ఉంటాను “ చెప్పింది కోకిలమ్మ.
“మీ అబ్బాయి సాఫ్టు వేరు జాబు చేస్తున్నాడా ఏమిటి ?” కుతూహలంగా అడిగాడు నారాయణరావు.
“కాదండి! మా అబ్బాయి డాక్టరు . ‘తల్లి తండ్రులు కోసం , దారి తప్పిన పిల్లలకు ఫ్యామిలీ కౌన్సెలింగ్ ఇస్తుంటాడు. అభిమానం ప్రేమ ఉండాలి వారిని జాగ్రత్తగా చూసుకోవాలి.వారు వృద్దాప్యంలో చిన్న పిల్లలుతో సమానం’ అని చెప్తుంటాడు వాడు సైకాలజీ డాక్టరు” వివరించింది కోకిలమ్మ.
“మీరు భలే అదృష్టవంతులు. అటువంటి అబ్బాయి దొరకటం మీ పూర్వ జన్మ సుకృతం, మరి మీరు అమెరికాలో ఉండకుండా ఇలా ఒంటరిగా ప్రయాణము ! మీ అబ్బాయి, కోడలు?” ప్రశ్నించాడు నారాయణ రావు.
“ చీకట్లో ఎన్నో కీటకాలను తినే బల్లి తెల్లారగానే మహానుభావులు ఫోటో వెనుక దాగుంటుంది” చెప్తూ కన్నీళ్లు తుడుచుకుంది కోకిలమ్మ. ఆమె కన్నీరు చూసి తట్టుకోలేక తన కళ్ళ వెంట కూడా నీళ్ళు వచ్చాయి నారాయణ రావుకు.
“నా కోసం మీరు ఎందుకు విచారిస్తారు? మీ కోసం చెప్పండి” ఎదురు సీట్లో కూర్చుని కళ్ళు తుడుచుకుంటున్న నారాయణ రావును అడిగింది కోకిలమ్మ.
“ప్రతి కొడుకుకి అతను తండ్రి అయ్యే వరకు తండ్రి చేసిన ,తండ్రి చెప్పిన ప్రతి నిర్ణయం తప్పుగానే అనిపిస్తుంది. నేను లాయర్ అవ్వమన్నాను, వాడు డాక్టర్ అయ్యాడు.నేను తెలుగు అమ్మాయిని పెండ్లి చేసుకో అన్నాను. వాడు అమెరికా అమ్మాయిని చేసుకున్నాడు.నువ్వు , కోడలు మాతో ఉండండి అన్నాను,మీరు, అమ్మ అమెరికా వచ్చేయండి అన్నాడు. “ దగ్గుతూ చెప్పాడు నారాయణ రావు. ఈ సారి ఆయన కళ్ళలో నీళ్ళు చూసి కోకిలమ్మ కూడా ఏడ్చేసింది.
“అందరి ఇంట్లో ఇవే సమస్యలు అనుకుంటాను .అమ్మాయి కులం,మతం, ఆస్తులు, అంతస్తులు , కట్నాలు, కానుకలు, గోత్రం, నక్షత్రం, జాతకాలు అన్నీ సరి చూసుకుని సంతృప్తి చెందిన తరువాత పెద్ద వాళ్ళం పెళ్ళి కోసం మాట్లాడతాం.ఈ లోగా వాడు ప్రేమ వివాహం చేసుకుంటాను అంటాడు .వీటన్నింటిలో ఏముంది అంతా పై వాడి లీల అని సరిపెట్టుకుంటాము” అంది కోకిలమ్మ.
ఓ అర్థ గంట దాటింది. ఆరు అడుగులు ఎత్తు, ఉంగరాల జుట్టు , ఎర్రని శరీర ఛాయ చాలా సేపు అతని వైపు చూసింది కోకిలమ్మ బాగా పెద్ద కుటుంబం వ్యక్తి అనుకుంది మనసులో.
కోకిలమ్మ ఈ వయసులో కూడా అందగత్తె . తన అంత కాదు గాని పొడవు అయిదున్నర అడుగులు. అందమైన బంగారు రంగు మొఖం, ఎర్రటి నున్నని బుగ్గలు, విశాలమైన నేత్రాలు,తీర్చిదిద్దిన కనుబొమలు, సన్నటి పొడగాటి ముక్కు, చిరునవ్వు నవ్వుతూ మాట్లాడటం . ఇలా ఎటు చూసిన అందంగా ఉంది. చాలా పెద్దింటి ఆవిడ మనసులోనే అనుకున్నాడు నారాయణ రావు.
ప్రక్క వారు దిష్టి పెడతారేమో అన్నట్టు బుగ్గకు ఈ వయసులో కూడా దిష్టిచుక్క . అది దిష్టి చుక్క కాదు అలాగే కనిపించే డింపుల్. మాట్లాడుతున్నప్పుడు లోనకి బయటకి వస్తూ డింపుల్ భలే అందాన్ని ఇస్తుంది. ఈవిడ వయసులో అందాల బొమ్మ నవ్వుకున్నాడు నారాయణరావు.
వయసుతో నిమిత్తం లేకుండా అందమైన కుందనపు బొమ్మలా అని పించే ఆమెను చూసి “మీ పేరు ? ” చొరవ తీసుకుని అడిగాడు నారాయణరావు.
” నా పేరు కోకిలమ్మ . మీ లాగే జర్నీలో అందరితో సరదాగా వుండటం నా హాబీ. “ అంటూ తన వివరాలు కూడా చెప్పింది కోకిలమ్మ . ఆమె గొంతు శ్రావ్యంగా ఉంది.
“మీ అందానికి పేరు అస్సలు సరిపోలేదు . బహుశా ఆ పేరు మీ గొంతును విని పెట్టీ వుంటారు” అన్నాడు నారాయణ రావు.తను ఎప్పుడూ అంతే ఎవరు ఏమి అనుకుంటారో అనే భయం లేదు.ఉన్నది ఉన్నట్టు మాట్లాడే స్వభావం.
“ పేరు అనేది మాటలు రాక ముందే నిర్ణయిస్తారు. బహుశా నేను పుట్టినప్పుడు కోకిలలా నల్లగా వున్నాను ఏమో” నవ్వుతూ అంది కోకిలమ్మ.
కోకిలమ్మది పొడవాటి నల్లని జడ. .కాళ్ళకు గజ్జెలుతో సంప్రదాయంగా ఉంది. సన్నగా పొడవుగా అందంగా వుంది.మెడలో చిన్న సన్నని బంగారం గొలుసు మెరుస్తుంది.ఆమె అటు ఇటు మోహం తిప్పుతూ మాట్లాడుతుంటే చెవిలో లోలక్కలు ఊగుతు అందంగా వున్నాయి.ఎరుపు ఛాయ , గుండ్రటి మొహం అందంగా చలాకీగా ఉంది.
“ఏమండీ! ఇది పద్దతేనా?” ముఖం వైపు అదే విధంగా చూస్తున్న నారాయణ రావును కోప్పడింది కోకిలమ్మ. సిగ్గుతో తల దించుకున్నాడు నారాయణ రావు.
“టీ…కాఫీ…టీ.. టీ.. కాఫీ “ అంటూ అటు ఇటు తిరుగుతున్న ఆ కుర్రాడ్ని పిలిచి “రెండు కాఫీ ఇవ్వు అబ్బాయి! ” అని అడిగి ఆమెకు ఒక కప్పు ఆఫర్ చేశాడు నారాయణరావు. “తల నొప్పి గా ఉంది అనుకుంటుండగా సరియైన సమయానికి కాఫీ ఇప్పించారు” అంటూ ఆ కాఫీ కప్పు తీసుకొని మరో మారు నవ్వింది కోకిలమ్మ.
“మీరు ప్రక్కగా జరిగితే నేను రిలాక్స్ కోసం చేరబడతాను, అది కూడా మీకు అభ్యంతరం లేకపోతేనే” అభ్యర్థించింది కోకిలమ్మ .“అయ్యో! తప్పకుండా” అంటూ సీటు చివరి వరకు జరిగాడు. తను కూర్చున్న ప్రక్కగా తల పెట్టుకుని చేరబడింది.
ప్రక్క సీటు లో వున్న ప్యాసింజర్ లు తమ ఇద్దరిని చూస్తారేమో అని భావించి ఏసి కోచ్ , విండో సీటు ప్రత్యేకంగా తమ ఇద్దరి సీటు వుండటంతో సీటు కు ముందు వున్న కర్టెన్ దగ్గరకి జరిపాడు.
కోకిలమ్మ ఆకర్షనీయంగ వుంది. అందమైన ఆమె చెక్కిళ్ళు చూస్తుంటేనే గిలిగింతలు పెడుతున్నాయి. సన్నగా దిద్దిన కనుబొమలు, గుండ్రటి కన్నులు , కోమలమైన ముఖం అందానికే అసూయలా అనిపించే అందం .
నిద్రలో ఆమె ఇంకొద్ది గా దగ్గరకి జరిగింది. అలా జరపటంలో ఆమె బుగ్గలను తన చేత్తో చిన్నగా నిమిరే ప్రయత్నం చేయబోయి ఆమె నిద్రకు భంగము అని ఆ ప్రయత్నం ఆపుకున్నాడు నారాయణ రావు.
ఉదయము ఫలహారం , మధ్యాహ్నం భోజనం, మద్య మద్య మజ్జిగ , సపోటాలు ఇలా తను కొనటం, ఆమె అభ్యంతరం చెప్పకుండా టక టక తినేయటం జరిగి పోయాయి.
మధ్యాహ్నం భోజనం రెండు గంటలకు చేసిన తర్వాత “ నాది పై బెర్త్, నాకు మధ్యాహ్నం నిద్ర అలవాటు మీరు కొద్దిగా తప్పుకుంటే పై బెర్త్ కు వెళతాను’ అడిగింది కోకిలమ్మ.
“మీరు కూడా నా వయసు వారే , మీరు పై బెర్త్ లో ఎక్కలేరు అలా అని నేను కూడా పైకి వెళ్ళలేని స్తితి. మీకు అభ్యంతరం లేకపోతె మీరు క్రిందనే పడుకోండి,నేను మీ తల వైపు కూర్చుంటాను” అన్నాడు నారాయణ రావు.
సరే అంటూ మధ్యాహ్నం నిద్ర కోసం చేరబడింది కోకిలమ్మ. నిద్రలో దగ్గరగా వస్తుంది. ఇలా తన ప్రక్కగా కాకుండ అద్భుతం జరిగి తన ఒడిలో ఆమె పడుకుంటే, మరీ తను అతిగా ఆలోచిస్తున్నాడు అని నవ్వుకున్నాడు.
నిజంగానే అద్భుతం జరిగింది . నిద్రలో అతని ఒడిలోకి వచ్చి చేరింది. ఆమె ముఖం క్రింద తన రెండు చేతులు వుంచాడు. “ఇప్పటివరకు మీ ఒడిలో నేను పడుకున్నాను. ఇప్పుడు నా ఒడిలో పడుకోండి” అంది కోకిలమ్మ .
&&
రైలు వేగంగా కదులుతుంది.కాని నారాయణ రావు గుండె భారం ముందు రైలు వేగం వెనుకబడింది. కన్నీళ్లు అప్రయత్నంగా కారాయి. అవే కన్నీళ్లు కోకిలమ్మ కళ్ళలో కూడా ట్రైను వేగం కంటే వేగంగా ఉబుకుతూ బయటకు వస్తున్నాయి.
రైలు దిగి ఇంటికి చేరారు వృద్ధ దంపతులు. `నిజానికి జర్నీ ఇంకో ఆరు ఏడు గంటలు వుంటే బావుణ్ణు. ఇంటికి చేరి తమను దిక్కు లేకుండా వదిలేసిన కొడుకును గుర్తు చేసుకుని ఏడుస్తున్న భర్త నారాయణ రావు కన్నీళ్లు తుడుస్తూ తను కన్నీళ్లు పెట్టుకుంది కోకిలమ్మ.
“ఇదుగో ఈ కర్ర అందుకో” అంటూ బోతద్దాం కళ్లద్దాలు సర్దుకుంటూ. తన చేతిలో వున్న బంగారం రంగు చేతి కర్ర అందించాడు నారాయణ రావు. భర్త ఇచ్చిన బంగరం రంగు చేతి కర్రను తలుపు మూల పెట్టింది కోకిలమ్మ.
నలభై అయిదు సంవత్సరాల క్రితము నారాయణ రావు, కోకిలమ్మ మొదట కలయిక రైలులో . వారికి పుట్టిన బిడ్డ డాక్టరు .కొడుకును రెక్కలు ముక్కలు చేసుకొని డాక్టర్ చదివిస్తే వాడు పై దేశంలో ఎక్కువ డబ్బులు వస్తాయని అమెరికాలో డాక్టర్ అయ్యాడు. అక్కడ అమ్మాయిని వివాహం ఆడాడు.
కొడుకు ఇద్దరి వృద్ధులను వదిలి దూరంగా వెళ్ళిపోయాడు. వాడికి తాము అవసరం లేదు .కానీ వీరికి ఒకరుకి ఒకరు తోడు కావాలి.అందుకే ఆరు నెలలకు ఒకసారి అపరిచితులుగా వైజాగ్ నుండి హైదరాబాద్ ప్రయాణం. తిరిగి అటునుండి ఇటు.
అదే వీరికి ఆట విడుపు.అదే రైలు ప్రయాణం వీరి ప్రతి ఆరు నెలలకు జీవిత ప్రయాణం.
***