అర్హత

సహరి • 01 Aug 2026 • 👁 5 views
అర్హత
అర్హత(కథ )
రచన : జీడిగుంట నరసింహ మూర్తి

(ఆగస్టు 2026 సహరి మాస పత్రికలో ప్రచురణ )

“ఏరా… ఈరోజు ఫోన్ చేయలేదేంటి? అంత బిజీగా ఉన్నావా?” అడిగాడు శేషగిరి .
అతని స్వరం కొంచెం కటువుగా అనిపించినా, లోపల మాత్రం తమ్ముడి మీద ఆప్యాయత తొంగిచూస్తూనే ఉంది.
“పిల్ల పెళ్లి చేయాలి కదా అన్నయ్యా !ఊరు చివరలో అప్పుడెప్పుడో కొన్న స్థలాన్ని అమ్మేయాలని వాళ్ల చుట్టూ, వీళ్ల చుట్టూ తిరగడంతోనే సరిపోతోంది. నెల రోజులుగా ఎవరికీ ఫోన్ చేయడం కుదర లేదు...” అన్నాడు వాసు మృదువుగా.
“నువ్వు ఫోన్ చేయకపోతే నాకు ఏదో లోటు అనిపిస్తుందిరా . ఆ స్థలం విషయం నాకు కూడా చెబితే తెలిసిన వాళ్లతో మాట్లాడి బేరం కుదురుస్తాను కదా. ఇంట్లో పెళ్లి వ్యవహారం అంత రహస్యంగా చేయాల్సిన అవసరం ఏముంది? మన రెండవ వాడు కూడా అంతే. ఈరోజుల్లో ఇంటికొచ్చి వెడ్డింగ్ కార్డు ఇచ్చేంతవరకు వాళ్ల పిల్లల పెళ్లిళ్లు కుదిరినట్టు తెలుసుకోలేక పోతున్నాం. రోజూ మాట్లాడుకుంటూ ఉంటాం కానీ ఆ ప్రస్తావన రాదు. వాడి దారిలోనే నువ్వు కూడా వెళ్తున్నట్టుగా ఉంది...” అన్నాడు శేషగిరి కొద్దిగా నిష్టూరంగానే.
“అయ్యో అలాంటిది ఏమీ లేదు. ఈ మధ్య ఏ సంబంధమూ కలిసిరాక పోవడంతో ముందే అందరికీ చెప్పుకుని నగుబాటు కావడం ఎందుకు అనిపించి మౌనం వహించాల్సి వస్తోంది. ఎన్నో సంబంధాలు వచ్చి చివరి నిమిషంలో వెనక్కి వెళ్లిపోయేవి . ప్రతి సారి ఆశలు పెంచుకోవడం, మళ్లీ నిరాశతో కుంగిపోవడం మాకు అలవాటైపోయింది. ఒకసారి ఖరారయ్యేంతవరకు ఎవరికీ చెప్పకూడదని అనుకున్నాము. అంతే కానీ మాకు నీకన్నా చెప్పుకోవడానికి ఎవరున్నారు చెప్పు ?” అన్నాడు వాసు ఇబ్బందిగా చూస్తూ.
కానీ వాసు మాటలు శేషగిరిని సంతృప్తి పరచలేకపోయాయి. పైపెచ్చు అది మరింత అపార్ధం పాలు చేసింది.
అన్నగారు తన గురించి మనసులో ఏమనుకున్నాడో కానీ, క్రమంగా మాట్లాడటం తగ్గించేశాడు. ఫోన్ చేసినా మాటలు రెండు నిమిషాల్లో ముగిసేవి. ఆ మార్పు గమనించిన వాసు కూడా ధైర్యం చేసి ముందడుగు వేయలేకపోయాడు. దాంతో ఒకప్పుడు రోజుకు రెండు సార్లయినా మాట్లాడుకోకపోతే తోచని వాళ్ల మధ్య నెలలు నెలలు గడిచిపోయాయి.
అదృష్టవశాత్తూ వాసు కూతురు సుభాషిణికి మంచి సంబంధం కుదిరింది. అబ్బాయి మంచి ఉద్యోగం చేస్తున్నాడు. ఎన్నో నిరాశల తర్వాత వచ్చిన ఈ శుభవార్త ఇంట్లో ఆనందాన్ని నింపింది.
సంబంధం కుదిరినట్టు అన్నగారికి చెప్పాడు వాసు. అవతలవైపు నుండి “మంచిది “ అంటూ ముక్తసరిగా సమాధానం వచ్చింది అంతే.
ఒక రోజు పెళ్లి ఏర్పాట్ల గురించి మాట్లాడుతుండగా వాసు భార్య చెప్పింది.
“ఏమండీ !అన్నదమ్ముల మధ్య చిన్నచిన్న అపార్థాలు రావచ్చు. కానీ పెళ్లి అనేది కుటుంబ పండుగ. శుభలేఖల్లో అన్నయ్యగారు, వదినగారి పేర్లు వేయించండి. వాళ్లు మన పెద్దలు. తండ్రి స్థానంలో ఉన్నారు. మనం ఇచ్చే గౌరవం తగ్గకూడదు”అంది.
మొదట వాసు కొంత సందిగ్ధంలో పడ్డాడు. కానీ భార్య మాటల్లోని సంస్కారం అతన్ని ఆలోచింపజేసింది. చివరకు ఎవరికీ చెప్పకుండా ఆ విషయాన్ని రహస్యంగా ఉంచి శుభలేఖలను శేషగిరి దంపతుల పేర్లతో అచ్చు వేయించాడు.
శుభలేఖలు చేతికి వచ్చిన రోజు మొదటి కార్డును గుడిలో స్వామివారికి సమర్పించి పూజ చేయించాడు. రెండో కార్డును జాగ్రత్తగా కవర్లో పెట్టుకుని అన్నగారింటికి బయలుదేరాడు.
కిటికీలోంచి చేతిలో కార్డులతో వస్తున్న తమ్ముడిని చూసిన శేషగిరి మనసులో ఎన్నో ఆలోచనలు మెదిలాయి.
“అవును... చేస్తున్నది ఆడపిల్ల పెళ్లి. సొంత అన్నదమ్ములను ఈ సమయంలో దూరం చేసుకుంటే రేపు ఏదైనా ఊహించని కష్టం వస్తే అండగా నిలబడే వాళ్లు ఎవరుంటారు? అందుకే ఇష్టం లేకపోయినా వచ్చి ఉంటాడు...” అని అనుకున్నాడు.
వాళ్ల మధ్య జన్మజన్మల శత్రుత్వం లేదు. ఆస్తి తగాదాలు లేవు. కేవలం మాటల లోపం మాత్రమే.
వదినగారు లోపలికి వెళ్లి మంచినీళ్లు తీసుకొచ్చి ఇచ్చింది.
“ఏరా... బాగున్నావా?” అంటూక్లుప్తంగా పలకరించాడు శేషగిరి .
“అదే అన్నయ్యా. మన సుభాషిణికి సంబంధాలు కుదరడం చాలా కష్టమైపోయింది. కుదిరినట్టే కుదిరి వెనక్కి వెళ్లిపోయేవి. ఆ బాధల్లో ఎవరితోనూ మనసు విప్పి మాట్లాడలేని పరిస్థితి. అంతే కానీ నీతో కావాలని మాట్లాడకపోవడం కాదు. ఇంటికి నువ్వే కదా పెద్ద. రెండవ అన్నయ్య ఉద్యోగ రీత్యా వేరే స్టేట్లో ఉంటున్నాడు.వాడు పెళ్ళికి వస్తే చాలనుకునే పరిస్థితి. ఎన్నో పూజలు, వ్రతాలు చేసిన ఫలితమో ఏమో మొత్తానికి ఈ సంబంధం కుదిరింది. తనని కూడా తీసుకొద్దామనుకున్నాను. కానీ ముందుగా నేను వచ్చి మీ ఆశీర్వాదం తీసుకోవాలని అనిపించింది...” అంటూ కార్డు అందించాడు వాసు.
శేషగిరి కార్డు తెరిచి చూశాడు.
ఒక్క క్షణం అతని కళ్లకు నమ్మశక్యం కాలేదు.
పెళ్లి ఆహ్వాన పత్రికపై పెద్ద అక్షరాలతో తన పేరు, భార్య పేరు కనిపించాయి.
ఆ క్షణంలో అతని గొంతు పూడుకుపోయింది.
కార్డు చేతిలో పట్టుకుని అలాగే కూర్చున్నాడు.
మనసు ఒక్కసారిగా చాలా ఏళ్ల వెనక్కి వెళ్లిపోయింది.
తండ్రి చనిపోయిన తర్వాత తమ్ముళ్ళు ఇద్దరికీ తానే అండగా నిలిచిన రోజులు గుర్తొచ్చాయి. వాళ్ల చదువులు, ఉద్యోగాలు, పెళ్లిళ్లు—అన్నింటిలోనూ తన వంతు బాధ్యత నిర్వర్తించిన సందర్భాలు కళ్లముందు మెదిలాయి. చిన్నప్పుడు ఏ చిన్న పని వచ్చినా “అన్నయ్యా” అంటూ తన వెంట తిరిగే వాడు వాసు.
అలాంటి తమ్ముడితో కొన్ని నెలలు మాట్లాడకుండా ఉండిపోయిన తన మొండితనం మీద అతనికే సిగ్గేసింది.
“మనుషులు దూరమవడానికి పెద్ద కారణాలు అవసరం లేదు. చిన్న చిన్న మౌనాలే పెద్ద గోడలుగా మారిపోతాయి...” అనుకున్నాడు మనసులో.
“మా పేర్లు ఎందుకురా బాబూ మొత్తం కష్టం పడింది మీరే. ఇందులో మా పాత్ర ఈశన్మాతరం లేదు . ఆ బాధలేవో వాడే పడతాడులే అని తెలిసే నిర్లక్ష్యం చేశాం. ఇంటి పెద్దగా మీకు మాట సాయం కూడా చేయలేకపోయాం. చిన్నప్పుడు ఏదో ఆదుకున్నాం అంటే అది వేరు. అందరమూ ఒకే ఇంట్లో ఉండేవాళ్లం కాబట్టి ఒకరి మీద ఒకరికి అనుబంధం ఉంటుంది. సంసార బంధాల్లో ఇరుక్కున్నవాళ్ళకు ఎదురయ్యే సమస్యలకు కుటుంబ పెద్ద వెన్నుదన్ను ఉంటేనే వాళ్ళ బంధాలు కలకాలం నిలుస్తాయి. కానీ నీ విషయంలో మేము చేసిన పనికి చూపిన అలసత్వానికి సిగ్గుపడాల్సి వస్తోంది. ఈ పురస్కారం అందుకోవడానికి మాకు ఏ మాత్రం అర్హత లేదు. పైగా నా కన్నా ఎనిమిదేళ్లు చిన్నవాడివి. ఈ పెళ్ళికి పెద్దగా నువ్వు మాకు కలిపిస్తున్న అర్హతకు మేము ఎంతమాత్రమూ తగం అని నా భావన. ఇలా ఏ ఇంట్లోనూ పెద్ద అన్నగారు చేయకూడని తప్పు మేము చేశాం. మనసులో పెట్టుకోకుండా మమ్మల్ని క్షమించరా?” అంటూ శేషగిరి తమ్ముడి చేతులు పట్టుకున్నాడు శేషగిరి ఆర్ద్రత నిండిన కళ్ళతో .
వదినగారి కళ్లూ చెమ్మగిల్లాయి.
“చూశారా... మనం అతన్ని నిర్లక్ష్యం చేసినా మన గురించి ఎంత గొప్పగా ఆలోచించాడు?
ఈరోజుల్లో ఇటువంటి వారు ఎక్కడైనా ఉంటారా ? ఉపయోగపడాల్సిన సమయంలో మనం పొరపాటు చేశాం...” అంటూ వదినగారు పశ్చాత్తాప మనసుతో తలవంచుకుంది.
“అన్నయ్యా, జీవితంలో కొన్నిసార్లు మన బాధలతో మనమే అంతగా నిండిపోతాం. మనల్ని ప్రేమించే వాళ్లకు కూడా మనసు విప్పి చెప్పలేని పరిస్థితి వస్తుంది. అంతే కానీ ప్రేమ తగ్గిపోదు. ఇందులో మీ లోపం ఏమీ లేదు. నేనే మీకు సరైన పద్దతిలో తెలియపరచలేదని అనుకుంటున్నాను. పైగా నీకు బీపీ, సుగర్లు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో నిన్ను నా వెంట తిప్పుకుని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. పెళ్లి సమయంలో నువ్వు నా పక్కన నిలబడితే చాలు. అంతకంటే నాకు కావాల్సింది ఏమీ లేదు.”అంటూ అన్నగారిని సముదాయించి లేవబోతూ ఉంటే “లేదురా !ఈ పెళ్లి నీ కూతురిది మాత్రమే కాదు. మన ఇంటి పండగ. ఇక నుంచి అన్ని పనులూ మనం కలిసి చూసుకుందాం “అని ఆనందంగా చెపుతూ తమ్ముడిని కౌగిలించుకున్నాడు శేషగిరి.
ఆ కౌగిలిలో నెలల తరబడి పేరుకుపోయిన మౌనం కరిగిపోయింది. అపార్థాలు చెదిరిపోయాయి.
ఇద్దరి కళ్లలోనూ ఆనందబాష్పాలు మెరిశాయి.
వాసు వీడ్కోలు చెప్పి బయలుదేరాడు. అతను వీధి మలుపు తిరిగేంతవరకు శేషగిరి దంపతులు గుమ్మం దగ్గరే నిలబడి చూస్తూ ఉన్నారు .
అప్పుడు అతనికి ఒక విషయం స్పష్టంగా అర్థమైంది.
బంధాలను నిలబెట్టేది రక్తసంబంధం మాత్రమే కాదు. పరస్పరం ఒక అడుగు ముందుకు వేసే మనసు. క్షమాపణ కోరడానికి అర్హత అవసరం లేదు. క్షమించడానికి కూడా అర్హత అవసరం లేదు. ప్రేమ ఉన్న చోట అర్హత అనే ప్రశ్నే ఉండదు.
అందుకే కుటుంబాలను నిలబెట్టేవి ధనం, హోదా, అహంకారం కావు. సమయం వచ్చినప్పుడు “నువ్వు మా వాడివి” అని చెప్పగల విశాల హృదయం మాత్రమే.
– సమాప్తం –