***పశ్చాత్తాపం***
“వద్దు! అంత పెద్దాయన కిడ్నీ దానం చేస్తే ఆయన ఆరోగ్యానికి ప్రమాదం” గద్గద స్వరంతో అంది సహజ.
“పరవాలేదు అమ్మ! ఈరోజు కాకపోతే రేపు చనిపోయే వాడిని, నా కిడ్నీ ఆ చిన్న వాడికి నూరేళ్లు ఆయుష్ ఇస్తుంది అంటే సంతోషమే కదా! ఒక తాతయ్యగా ఇంతకంటే ఏం కావాలి” చిన్నగా ఏడుస్తూ అన్నాడు సాంబయ్య.
“కానీ మీరు చూపిస్తున్న త్యాగం ఆనందమే మామయ్య! కానీ అది మీ ప్రాణాల మీదకు వస్తుంది “ మరోసారి వారిస్తూ అంది సహజ.ఆమె మాటలలో దుఃఖం తెలుస్తూనే ఉంది.
“ఈ వయసులో నాకు బి పి, షుగర్, ఇతర ఎటువంటి సమస్యలు లేవని డాక్టర్ చెప్పారు. నా కిడ్నీ ఆ చిన్నవాడిని రక్షిస్తుంది అన్నారు. ఇంతకంటే ఏమి కావాలి ఈ తాతయ్యకు “ మాటలు దుఃఖంతో వస్తున్నాయి.
“అది కాదు నాన్న! నువ్వు ఇవ్వడం మా ఇద్దరికి ఇష్టం లేదు నా కిడ్నీ ఇద్దామంటే నాకు దీర్ఘ సమస్య. సహజ ఆరోగ్యం నీకు తెలిసిందే. దేవుడు ఎలా చేస్తే అలా జరగని” దీనంగా అన్నాడు ఆచారి.
“ఇప్పటికీ నీ ఉద్దేశంలో కానీ కోడలు ఉద్దేశ్యంలో కానీ నా కిడ్నీ దానం చేయటం వలన నాలాగే వాడు నీచుడిగా తయారవుతాడు అనుకుంటే మీ ఇష్టం. కానీ సమస్య అది కాదు అనుకుంటే నా కిడ్నీ దానం చేయటానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు “ సాంబయ్య తనకు జరిగిన పాత గాయం దెప్పి పొడుస్తూ అన్నాడు.
“ పెద్ద పెద్ద మాటలు ఎందుకు మామయ్య ! ఇప్పటికే ఇద్దరం కుమిలి కుమిలి ఏడుస్తున్నాము.నేను చేసిన తప్పుకు నన్ను, నాతోపాటు మీ కొడుకును పెద్ద మనసు చేసుకొని క్షమించండి” తను చేసిన పెద్ద తప్పుకు క్షమించమని ప్రాధేయ పడింది సహజ.
“నిన్ను క్షమించడానికి ఏముంది! నేను ఒక నీచుడును అని అందరి దృష్టిలో పడిపోయింది. మీరు ఇరువురు ఇంటి నుండి హైదరాబాద్ వెళ్లినపుడు మనవడు నాతో “తాతయ్య! తాతయ్య! నువ్వు నాతోనే ఉంటావా? అని అడిగాడు. ఇప్పుడు మీరు అవకాశం ఇచ్చి నా కిడ్నీ వాడి వంటిలో ఉంటే, `నీతో ఉండటమేంటి ఇకనుండి నీ గుండెల్లో ఉంటాను` అని సంతోషంగా చెప్పుకుంటాను అది మీకు అభ్యంతరం లేకపోతే” అంటూ దుఖంతో ఏడ్చాడు సాంబయ్య.
**
సరిగ్గా ఐదు సంవత్సరాల క్రితం .
“ఎంత సేపు నా ఊరు!, నా ఊరు! లేకపోతే మా నాన్న!, మా నాన్న! అంటారు. ఇలా అయితే జీవితాంతం రాగి కూడు తిని బతకాల్సిందే! . నా తమ్ముడు హైదరాబాద్ వెళ్ళి అయిదు సంవత్సరాలు కాలేదు కారు కొనుక్కున్నాడు “ భర్త ఆచారి మీద అరుస్తూ అంది సహజ.
“ఊర్లోనే ఉండి నలుగురుతో పాటు పాలో, నీలో కలిసి తిందాం, కలిసి త్రాగుదాం, అయిన అమ్మ చనిపోయి సంవత్సరం కాలేదు ఒంటరగా నాన్నను వదిలి వెళ్లటం నాకు ఇష్టం లేదు”. జవాబుగా అన్నాడు ఆచారి.
ప్రతి రోజూ ఈ గొడవ జరగటం, సహజ మాటలకు ఆచారి జవాబు ఇవ్వటం జరిగేదే. కానీ ఆ రోజు ఆవేశం ఆపుకోలేక సహజను గట్టిగా కొట్టాడు ఆచారి. పదే పదే ఆమె మాటలు గుర్తు చేసుకుంటూ ఏడ్చాడు ఆచారి.
“ ఇదిగో నాన్న! నాన్న! అంటావు కదా.కూతురు లాంటి నన్ను అదోలా చూస్తున్నాడు.” మామయ్య మీద భర్తకు ఫిర్యాదు చేసింది సహజ.
“హైదరాబాద్ వెళ్లేందుకు నీకు అడ్డు చెప్తున్నాని ,నాన్న మీద నిందలు వేయకు. తండ్రి లాంటి పవిత్రమైన వ్యక్తికి , అపవిత్రము చేయకు” గద్దిస్తూ అన్నాడు ఆచారి.
“అయితే నేనే నా పుట్టింటికి వెళ్తాను. నీకు నేను కావాలో, మీ నాన్న కావాలో తేల్చుకో.మీ నాన్న, నేను ఒక దగ్గర ఉండలేము . నువ్వు లేనపుడు నా మంచం వైపు వస్తున్నాడు.” తండ్రి లాంటి మామయ్య మీద నిందలు మోపుతూ అంది సహజ.
ఆ నిముషమే చేయి చేసుకున్నాడు ఆచారి.అతనికి అది అబద్ధమని తెలుసు. హైదరాబాద్ వెళ్లేందుకు నాటకం అని కూడా తెలుసు. ఇది మరింత పెద్దదైతే ఆయన పరువు ఇంటిలోనూ, ఊర్లోను పోతుంది. అందుకే భార్యతో హైదరాబాద్ వచ్చేశాడు.
హైదరాబాద్ వచ్చిన తరువాత ఆచారి బిడ్డ అనారోగ్యం పాలయ్యాడు. మొదట్లో తాతయ్య మీద బెంగ అని సర్ది చెప్పుకున్నారు . కానీ మూడు సంవత్సరములు దాటిన తర్వాత వాడి ఆరోగ్యం బాగా దెబ్బతింది.
పరీక్షించిన డాక్టర్లు బిడ్డ రెండు కిడ్నీలు సరిగా లేవని అయితే ఒక్క కిడ్నీ ఎవరైనా దానం చేస్తే తిరిగి ఆరోగ్యంగా ఉంటాడని చెప్పారు.అంతేకాకుండా ఆపరేషన్ కోసం ఐదు లక్షలు అవసరమని కూడా తెలియజేశారు.
ఇదిలా ఉండగా ఊర్లో ఉన్న సాంబయ్యకు ఆచారి స్నేహితుల ద్వారా విషయం తెలిసి తను దాచిన ఐదు లక్షల రూపాయలు, తన కిడ్నీ ఇస్తానని ఊరు నుండి హైదరాబాద్ వచ్చాడు సాంబయ్య.
తప్పనిసరి పరిస్తితిలో సాంబయ్య కిడ్నీ దానం చేయటం మనవడు మాములు ఆరోగ్యవంతుడుగా మారటం జరిగిపోయింది.
“నన్ను క్షమించండి మామయ్య!” అంటూ మామయ్య కాళ్ళకు పాదాభివందనం చేసింది సహజ.
కుటుంబ సమేతంగా తిరిగి తన ఊరు చేరుకున్నాడు ఆచారి. ఇంట్లో మామయ్య కాళ్ళకు రోజు నమస్కరించటం దిన చర్యగా మారింది కోడలు సహజకు.
&&&&&