గౌతమి మహర్షి

ఈనాడు దినపత్రిక • 07 Aug 2026 • 👁 15 views
గౌతమి మహర్షి
( ఈనాడు దినపత్రిక 7/8/2026 అంతర్యామిలో ప్రచురించిన నా వ్యాసం " గౌతమి మహర్షి)

భారతీయ ఋషి పరంపరలో గౌతమ మహర్షిది విశిష్ట స్థానం. ఆయన జీవితం పురాణాలకే పరిమితమైన కథ కాదు. నేటికీ మార్గదర్శనం చేసే విలువల సమాహారం. వేగం, పోటీ ,స్వార్థం అహంకారం పెరిగిన ఈ కాలంలో గౌతమ మహర్షి జీవన దృక్పథం మనకు అవసరమైన ఆత్మ పరిశీలనను, సంయమనాన్ని నేర్పుతుంది .గౌతమ మహర్షి ఆశ్రమ జీవితం సరళతకు, నియమానికి ప్రతీక. అవసరానికి మించిన సంపద, ఆడంబర జీవనం ఆయన జీవితంలో లేవు. ఆశ్రమంలో నివసించే వారందరికీ సమాన గౌరవం, సమాన బాధ్యత ఉండేవి .విద్య ,ఆహారం ఆశ్రయం అన్ని సమానంగా అందేవి. ఈ సమానత్వ భావన నేటి సమాజంలో క్రమంగా కనుమరుగవుతున్న మానవీయ విలువలను గుర్తుచేస్తుంది. "నాది" అనే భావన తగ్గినప్పుడే "మనది" అనే భావన బలపడుతుందని గౌతమ మహర్షి జీవితం స్పష్టం చేస్తుంది .
గౌతమ మహర్షి జీవితంలో అహల్య ఘట్టం అత్యంత ప్రధానమైనది .దీన్ని కేవలం శాపం విమోచన కోణంలో చూడటం సరికాదు. అది మానవ బలహీనతలు ,ఆవేశము, ఆపై కలిగే పశ్చాత్తాపము, చివరికి క్షమ అనే గొప్ప విలువల సమన్వయం. ఆవేశంలో ఇచ్చిన శాపం సహజ మానవ ప్రవృత్తిని చూపిస్తే ,తర్వాత కలిగిన మార్పు ఆయన ఆత్మ పరిశీలనను తెలియజేస్తుంది. తప్పు చేసిన వారిని శాశ్వతంగా తిరస్కరించకుండా ,మార్పునకు అవకాశం ఇవ్వటమే నిజమైన ధర్మమని బలమైన సందేశం ఇస్తుంది .సహనం కరుణ లోపించటం వల్ల నేటి సమాజంలో చిన్న చిన్న వివాదాలే పెద్ద నష్టాలకు కారణమవుతున్నాయి. న్యాయం అంటే కరుణతో కూడిన వివేచన. తప్పును ఎత్తి చూపించటం అవసరం .కానీ దాన్ని సరిదిద్దుకునే మార్గాన్ని చూపటం అత్యావశ్యకం.
గౌతమ మహర్షి తపస్సు అంతర్ముఖ సాధన .కోరికలపై నియంత్రణ కోపం పై జ్ఞానం ,అహంకారం పై వినయం పైచేయి సాధించటం ఆయన జీవితంలోని ప్రధాన లక్షణాలు .నేటి మనిషి బయట ప్రపంచాన్ని గెలవడంలో తీరిక లేకుండా ఉండి తనలోనే అస్థిరతను జయించలేకపోతున్నాడు. బయట శాంతి కావాలంటే ముందుగా లోపల శాంతి ఉండాలనే సత్యాన్ని గౌతమ మహర్షి జీవితం స్పష్టం చేస్తుంది ప్రకృతితో సహజీవనం కూడా ఆయన ఆశ్రమ జీవన సారాంశమే. అడివిని సొంతం చేసుకోలేదు దాంట్లో మమేకమయ్యాడు. అభివృద్ధి దిశగా పరుగులో నేడు ప్రకృతిని ధ్వంసం చేస్తున్న మనిషికి ఇది తీవ్ర హెచ్చరిక.
మొత్తముగా గౌతమ మహర్షి జీవితం ఒక స్పష్టమైన పాఠాన్ని బోధిస్తుంది. జీవితం గెలుపోటముల పోటీ కాదు. విలువలతో కూడిన ప్రయాణం. క్షమ, కరుణ, సహనం నియమం జ్ఞానం వంటి గుణాలను మన దైనందిన జీవితంలో ఆచరణలో పెట్టినప్పుడే వ్యక్తిగత శాంతి, సామాజిక సంతులన సాధ్యమవుతాయి ఈ విలువలే కలతలతో నిండిన సమాజాన్ని సరైన దారిలో నడిపించే దీపాలు అవుతాయి.
_ జీడిగుంట నరసింహమూర్తి