భాగింపబడిన జీవితం

విశాలాంధ్ర ఆదివారం అనుబంధం • 02 Aug 2026 • 👁 5 views
"భాగింపబడిన జీవితం!" (కథ)

“నాకు ఈవయసులో పెళ్ళేమిటి నాన్న? ఎవరైనావింటే నవ్విపోతారు.మళ్ళీనెలే నా రిటైర్మెంట్. మర్చిపోయారా?”

తండ్రికి టిఫిన్ పెడుతూ అన్నాడు మధుకర్.

ఆయన మాట్లాడలేదు. టిఫిన్ చేసేటప్పుడు ఆయన ఒక్కమాట మాట్లాడరు. టిఫిన్ అయ్యాక సింక్ దగ్గర చెయ్యి కడిగేసుకుని వచ్చి కుర్చీలోకూర్చుంటూ అన్నారు.”ఒక్క పదినిముషాలు కూర్చో. నేనుచెప్పేది ఆఖరిసారివిను. ఇదివరకు చాలాసార్లు చెప్పాగానీ నువ్ పట్టించుకోలేదు. ప్లీజ్ “ రిక్వెస్ట్ గా అడిగేసరికి కాదనలేకపోయాడు మధుకర్. తండ్రితిన్న టిఫిన్ ప్లేట్ మోరీలో పడేసివచ్చి తండ్రికెదురుగ కూర్చుని అన్నాడు “ చెప్పండి “

“నీభార్యపోయి 8 సంవత్సరాలు అయింది. కోడలని చెప్పుకోకూడదుగాని కవిత బతికిఉన్నంతకాలం తనకుటుంబంకోసం, ముఖ్యంగా నీ పిల్లలకోసం బ్రతికింది.దురదృష్టం. నిండునూరేళ్ళు సుఖంగా బ్రతకాల్సిన ఆమె హటాత్తుగా గుండెపోటుతో మరణించడం నిజంగా మనదురదృష్టం.అప్పటికే తండ్రిగా నీబాధ్యతలు చక్కగానెరవేరుస్తూ పిల్లలిదరినీ చక్కగా చదివించావు. అమ్మాయికి చక్కనిభర్తనిచూసి పెళ్లిచేసావ్. మనవరాలిని ఎత్తుకున్నావు. వాళ్ళు అన్యోన్యంగా ఉన్నారు. తర్వాత స్వయంకృషితో నీకొడుకు సాఫ్ట్ వేర్ ఉద్యోగం సంపాదించుకున్నాడు. నీఅనుమతితో ప్రేమించిన అమ్మాయిని పెళ్లిచేసుకుని ఇద్దరు మగపిల్లల తండ్రయి చక్కగా సంసారం చేసుకుంటున్నాడు. అనారోగ్యంతో బాధపడుతున్న మీ అమ్మను, నన్ను నీదగ్గర ఉంచుకుని కొడుకుగా నీబాధ్యత చక్కగా నెరవేర్చుతున్నావు.నా దురదృష్టం. మీఅమ్మ ఎక్కువకాలం తీసుకోకుండానే పోయింది.

కానీ నాబాధ్యత నీకు తప్పలేదు.పోనీ వృద్ధాశ్రమంలో చేరిపోతానురా అంటే వినవ్.

మనిషి కుటుంబంకోసం బ్రతికేరోజులు పోతున్నాయి నాన్న...కేవలం తనకోసం తాను బతికేరోజులు వచ్చేసాయి. బాధ్యతలు నెరవేర్చేవరకే కుటుంబం. అవినెరవేర్చాకా భర్తకుభార్య, భార్యకుభర్త. ఈఇద్దరిలో ఎవరో ఒకరు ముందు పోకతప్పదు. భర్తపోయిన భార్య అతనిజ్ఞాపకాలతో ఎవరో ఒకరిపంచనచేరి తనబ్రతుకు వెళ్ళదీసుకోగలదు. కానీ మగవాడు అలా బ్రతకలేడయ్యా.
కొడుకు నీవాడుగానీ, కోడలు పరాయి ఇంటిబిడ్డేకదా..ఒక నెలబాగా చూస్తుంది..మహాఅయితే రెండునెలలు మర్యాదగా చూస్తుంది. ఆ తరువాత? ఉద్యోగవిరమణ అయ్యాక మనిషి మనశాంతిగా, ఆరోగ్యంగా బతకాలి. అలా బతకాలంటే నీకూ ఒకతోడు కావాలి. నువ్వుకూడా సుఖంగాబ్రతకాలని నా ప్రగాఢకోరిక. నామీద నీకు ఏమాత్రం అభిమానమున్నా రెండోపెళ్లి చేసుకో. ప్లీజ్.”

“సరే నాన్న.మీరు చెప్పినట్టే చేసుకుంటాను.నేను పెళ్లిచేసుకోవాలంటే ఆవిడకి కనీసం 50 ఏళ్ళుండాలి. ఆవయసుకు కూడా వివాహంకాని ఆడవాళ్ళు ఎక్కడోగాని దొరకరు. ఉన్నా నాకుతెలిసి వయసులో కనీసకోరికలు తీరక,ఎదుటివారిని ఏడిపించి తృప్తిపడే మనస్తత్వం ఎక్కువగా ఉన్నవారుగా ఉంటారు.

ఇక రెండోవర్గానికి వస్తే భర్తపోయి పిల్లలున్నవాళ్ళు. ఉన్న ఆపిల్లలూ చిన్నవాళ్లైతే విశ్రాంతి తీసుకోవాల్సినసమయంలో మళ్ళీ వాళ్ళ బాధ్యతలు మనం నెత్తికెత్తుకోవడం అవసరమా?...50 ఏళ్లవయసు వచ్చినావిడకి ఏదోఒక అనారోగ్యసమస్య వుండితీరుతుంది. మళ్ళీ నాపని పెనంమీదనుంచి పొయ్యిలోకే.

అదృష్టవంతుడిని పాడుచేయ్యలేరు. దురదృష్టవంతుడిని బాగుచేయ్యలేరు అంటారు. పెదమామయ్య విషయమే తీసుకోండి. పిల్లలుపుట్టక పెద్దఅత్తయ్య పదిమందిచేత గొడ్రాలు అనిపించుకుని ఆ మానసికవేదనతోనే పోయింది, మామయ్యకి బోలెడు భవిష్యత్తుఉందని మీ పెద్దలందరూ రెండోపెళ్లి చేసారు. భగవంతుని దయవల్ల ఈమెకు నలుగుపిల్లలు పుట్టారు. అమ్మాయిలకు పెళ్ళిళ్ళు అయ్యాక ఈ అత్తయ్యకూడా పోయింది. ఆడదక్షతలేని ఆకుటుంబంలో మగపిల్లలిద్దరూ వెధవల్లా తయారయ్యి మావయ్యని ఏడిపించుకుతింటున్నారు. పెళ్ళిళ్ళుకాని ఆకొడుకులకు వండిపెడుతూ మావయ్య బతుకీడుస్తున్నాడు.

ఏంవచ్చినా రాకపోయినా మేనమామ పోలికలు వస్తాయంటారు. నేనసలే నష్టజాతకుడిని.రేపలా జరిగిందనుకోండి. నన్ను పట్టించుకునే పిల్లలుకూడా ఉండరు.

'మేము చూడమన్నామా...ఆయనే కొవ్వెక్కి బలుపుతీరక పెళ్లిచేసుకున్నాడంటారు. అవన్నీ అవసరమా చెప్పండి. బ్రతుకును వెళ్ళదీసుకోదలుచుకున్నవాడు రాజీపడక తప్పదండి. “ అన్నాడు లేవబోతూ.

“ నెగటివ్ గా ఎందుకు ఆలోచిస్తావ్? నీకు పాజిటివ్ జరగచ్చేమో?” అన్నారాయన సాఫీగా.

“ అదైనా ఫిఫ్టీ – ఫిఫ్టీ చాన్సేస్సే .మీరు నామంచికోరి చెప్పారు. తప్పనిసరిగా మీరు చెప్పిందీ ఆలోచిస్తాను.భోజనానికి అన్నీ టేబుల్ మీద రెడీచేసి పెట్టాను. కడుపునిండా తినండి.నేవెళ్ళొస్తాను మరి..” అన్నాడు మధుకర్ ఆఫీసుకు బయల్దేరబోతూ..

కొడుకు వెళ్ళిపోయాక వీధితలుపువేసి ఆయన తనగదిలోకి నిష్క్రమించారు.

* * *

ఆ సాయంత్రమే ఆఫీసునుంచివచ్చాక తండ్రితో అన్నాడు మధుకర్ ...

“మీరు విషయం కదిపిన శుభముహూర్తం సంగతేమోగానీ ఈవేళ ఆఫీసుకి లంచ్ అవర్లో ఎవరో వచ్చారు నాన్న. ఆయన రాజమండ్రి టెలికాం డిపార్టుమెంటులో ఎ.ఈ.గా చేస్తున్నారట.పెళ్ళయి భర్తపోయిన చెల్లెలు ఉందట.పిల్లలు లేరట.మనిషి ఆరోగ్యంగానే ఉందట.ఎపుడూ దైవధ్యానంలోనేఉంటూ దైవసంబంధ సామాజిక సేవల్లో కార్యకర్తగా చేస్తోందట. ఈ వూరి హౌసింగ్ బోర్డు కాలనీలో వాళ్ళ పెద్దన్నయ్యదగ్గర ఉంటోందట. ఆయనవచ్చి మీతోమాట్లాడి అప్పుడు వాళ్ళఇంటికి తీసుకువెల్తాడట. మీరు వెళ్తే అన్నివిషయాలు కూలంకషంగా మాట్లాడండి.”

“ అమ్మయ్య. కొంత ఆలోచించాడన్నమాట.” అనుకున్నారాయన.

* * *

మధుకర్ కూతురు ఆమనికి ఫోన్ చేసి “నా రెండోపెళ్లివిషయంలో నీఅభిప్రాయం ఏంటమ్మా? తాతగారుకూడా ఒత్తిడిచేస్తున్నారు.” అనిఅడిగాడు.

“మీరు పెళ్లి చేసుకోదలుచుకుంటే మాకిద్దామనుకున్న ఆస్తులు మాకిచ్చేసి పెళ్లి చేసుకోండి. మీ పెళ్ళైపోయి అవన్నీ ఆవిడకి చెందితే , ‘మీనాన్న మీకేమిచ్చాడు?’ అని మా అత్తగారు దెప్పిపోస్తుంది జీవితాంతం. మా తరపు బంధువులంతా సూటిపోటీ మాటలతో అవకాశం వచ్చినప్పుడల్లా పొడుస్తూనే ఉంటారు.ఇక నాకు పుట్టిల్లు ఆశకూడా పూర్తిగా చచ్చిపోయినట్టే.మీరు రిటైరయ్యాక మేము చూడకపోతే మాది తప్పు. మా అమ్మ ఎలాగూలేదు.మీరుకూడా ఈ వయసులో పెళ్లి చేసుకుని దూరంఅయిపోతే మాకు దిక్కెవరు చెప్పండి?” అంది మధుకర్ కూతురు ఆమని తండ్రితో.

“ నేను ముసలివయసులో మీకు భారంకాకూడదని. “ అన్నాడతను.

“మీరు మాకేంభారం? మీరు రిటైర్ అయ్యాక వచ్చే బెనిఫిట్స్ అన్ని తమ్ముడికి, నాకు చెరో సగం ఇచ్చేయండి. మీ ఆరునెలలు వాడితో ఆరునెలలు మాతో ఉండండి. ఎవరింట్లో ఉంటే వాళ్ళకి మీపింఛనులో సగం ఇవ్వండి.మిగతావి మీ మందుఖర్చుల నిమిత్తం ఉంచుకోండి.ఇలా చేసుకునేదానికి ఈవయసులో మీకు పెళ్లి అవసరమా? ఆవిడ ఎంత మమ్మల్ని ఆప్యాయంగా చూసినా “ మా అమ్మ “ కాలేదుగా...ముఖ్యంగా ఈవయసులో...” తన భవిష్యత్తుని అయిదువాక్యాల తీర్పుతో నిర్నయించేసిన కూతురికి ఏమని సమాధానం చెప్పాలో తెలియలేదు మధుకర్ కి ఒక్క క్షణం. ‘మొత్తానికి లాయరుగారి భార్యవి అనిపించుకున్నావ్’ అనుకున్నాడు మనసులో..

“రేపు నాకువచ్చే భరణంలో సగం ఆవిడకువస్తే ఒక జీవి సుఖంగా జీవిస్తుంది కదమ్మా..”

“ ఓహో...అంటే మీరుబయటవాళ్ళని ఉద్దరించడానికి నిర్ణయించుకున్నారన్నమాట. మీరానిర్ణయం తీసుకున్నాక ఇక మాఅభిప్రాయంతో పని ఏముంది? ” అని ఫోన్ పెట్టేసింది మరోమాటకుతావివ్వకుండా..

కొడుక్కి ఫోన్ చేసి పెళ్లివిషయంచెప్పి ‘అక్కని అడిగితే అలా అందిరా....ఈవిషయంలో నీఅభిప్రాయంకూడా చెప్పు ‘అన్నాడు మధుకర్.

“పనిలోఉన్నాను నాన్న. సరిగ్గా పదినిముషాలలో ఫోన్ చేస్తాను.” అని ఫోన్ కట్ చేసాడు కొడుకు శ్రావణ్.

పనిఉండి కాదని, ఈవిషయం భార్యతో చర్చించే సమయమని నవ్వుకున్నాడు మధుకర్.

సరిగ్గా పదకొండవనిముషంలో “ అక్క చెప్పినట్టు చేసెయ్యండి నాన్నా. దాని అభిప్రాయమే నా అభిప్రాయం. తాతగారు ఒప్పుకున్నారా? “ అడిగాడు

“ ఇదంతా ఆయన ప్రయత్నమే...నాకు ఇష్టమోకాదో మీకుతెలుసుగా...” అన్నాడు మధుకర్.

“ ఓహో...ఇదంతా ఆయననిర్వాకమా? సరే...అలాగేకానివ్వండి అక్కచెప్పినట్టు.” అని ఫోన్ పెట్టేసాడు శ్రావణ్.

* * *

పిల్లలు కోరినట్టుగానే తను వాళ్ళకిఇవ్వాల్సిన ఆస్తిని పెళ్ళికి ముందే రిజిస్ట్రేషన్ చేసేసాడు మధుకర్.

పదిహేనురోజుల్లోనే అరుంధతితో మధుకర్ వివాహం రిజిస్ట్రార్ ఆఫీస్ లో ముఖ్యుల సమక్షంలో జరిగిపోయింది. ఆమని, శ్రావణ్ కుటుంబాలతో రావడం మధుకర్ కి , తాతగారికి చాలా ఆనందమనిపించింది. వాళ్ళు నవ్వుతూ సంతోషంగా ఉండటంచూసి మరీ సంతోషపడ్డారాయన.

అయితే వాళ్ళ సంతోషానికి కారణం తానేనని, మరేనాడు తండ్రిని తమదగ్గర ఉంచుకోనవసరం లేకుండాచేసి తమబాధ్యతను తగ్గించినతాలూకు సంతోషమని పెద్దాయనకు తెలీలేదు . పైగా తనకొడుకు తనకష్టార్జితాన్ని తన మనవలకు రిజిస్ట్రేషన్ చేసిన విషయంకూడా తనకుతెలియకుండా జాగ్రత్తపడ్డారన్న విషయం కూడా ముసలాయనకు తెలీదు పాపం.

అరుంధతి సాహచర్యంలో మధుకర్ జీవితం ఆనందంగానే సాగుతోంది. ఉద్యోగవిరమణ అనంతరం బెజవాడ కనకదుర్గమ్మ, భద్రాచలం సీతారాములు, తిరుపతి వెంకన్న, అన్నవరం సత్యదేవుని దర్శించుకున్నారు.

పిల్లలు ఎపుడో ఒకసారి రావడం రెండురోజులు ఉండి వెళ్ళడం. వచ్చినప్పుడల్లా వాళ్ళ కష్టసుఖాలు ఏకరువు పెట్టడం, ‘నానా ఇబ్బందుల్లోను ఉన్నాం ‘ తోచిన సాయం చేయమని అడగడం అలవాటుగా చేసుకున్నారు. ముఖ్యంగా కూతురైతే మరీను. ‘’నాలుగు రోజులు వచ్చివెళ్ళమ్మా ‘ అంటే ‘పిల్లలకి స్కూలు పోతుందనో, మాఆయనకీ భోజనంకుదరదు అనో వంకపెట్టేస్తుంది.

‘’మేమురావడం కుదరదుగానీ పిల్లలకుఫీజు ఇన్స్టాల్మెంట్ కట్టాలి పదివేలు సాయంచెయ్యండి’’ అని నిర్మొహమాటంగా అడిగేస్తోంది.

మధుకర్ ఆవిషయంలో చాలాబాధపడ్డాడు.

‘‘నాన్నా. ఆవిడతో మీజీవితం సుఖంగా సాగించండి. వేళపట్టుకుతిని ఓపికఉన్నంతవరకు ఇదివరకుచూడని పుణ్యక్షేత్రాలు దర్శించిరండి.’’ అంటారేమోనని చాలా ఆశపడ్డాడు. తప్పదని కాబోలు కొడుకు,కోడలు మాత్రం” మీకు బోర్ కొట్టినప్పుడు మాఇంట్లో పదిరోజులుండి వెళ్ళండి.’’ అనిచెప్పారు.

‘’ఇద్దరుజంటలూ పిల్లలతోసహావచ్చి ఉండండర్రా. మనవలు మాకఅలవాటవుతారు.’’అన్నాడు మధుకర్.

‘’మాకెక్కడ కుదురుతుంది నాన్నగారు. దసరాకి, సంక్రాంతికి ఇచ్చేసెలవులు ఆ కాన్వెంట్ వాళ్ళు ఏడుస్తూ వారంరోజులిస్తే గొప్ప.మాఅత్తవారింటికి వెళ్ళాలా? వాళ్ళు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే నాలుగు విజిటింగ్ ప్లేసెస్ కి వెళ్ళాలా?వేసవిసెలవులొస్తే రాబోయేతరగతిలో బాగా చదవడానికి బ్రిడ్జికోర్సెస్ లో చేర్చాలా? లేదా వాళ్ళ కిష్టమైన హాబీకిచెందిన కోచింగ్లో చేర్పించాలా? వీటన్నింటికి బోలెడంతడబ్బు కావాలి. మళ్ళీ ఒకరినిచేర్చి ఇంకొకళ్ళని చేర్పించకపోతే కోపాలు..తాపాలు.మాకు రావడంకుదరదుగానీ మీరే చుట్టంచూపుగా వచ్చి వెళ్తుండాలి. మనవలతో మమ్మల్ని కలవనివ్వలేదు అంటే కుదరదుమరి.’’అన్నాడు శ్రావణ్.

ఇక మనవల్ని ఏ పదిహేనురోజులకో ఓసారి వీడియొచాట్ లో చూపించడం..వాళ్ళకి తాతగారు, మామ్మగారు అలవాటులేనందువల్ల ఇలాకనిపించి అలాఆటలకి పారిపోవడం చేసేవారు.

ఒళ్ళుమండి ‘’మేమువస్తానంటే రావద్డంటారు. మీరురండర్రా అంటే కుదరదంటారు. ఎలా?’’ అని అడిగేసాడు పిల్లల్ని.

అరుంధతి ఎదురుగానే ‘’ మీరు అమ్మపోయిన వెంటనే పెళ్లిచేసుకుంటే అప్పటికి మేమూ చిన్నపిల్లలం కాబట్టి పిన్నిగారితో అలవాటైపోయేది. మీరిద్దరూ జంటగా మాపెళ్ళిళ్ళుచేస్తే మాకూ ఎంతోఆనందం అనిపించేది .కానీ ఈవయసులో మీరీపెళ్లిచేసుకుని మమ్మల్ని వదిలించుకుందామని నిర్ణయించుకున్నారు. మేముమాత్రం ఏంచెయ్యం?మీరు ఒక్కరే ఉంటే మేమెక్కడికి వెళ్ళినా మిమ్మల్నీ మాతోపాటే తీసుకుపోయేవాళ్ళం. ఇప్పుడు మీఇబ్బందులు మీవి, మాఇబ్బందులు మావి.’’ అంది ఆమని.

‘’పోనీలెండి. వాళ్ళు సుఖంగా తమపిల్లలతో ఉన్నారు. మనం ఎందుకండీ వాళ్ళని ఇబ్బంది పెట్టడం?వాళ్ళకి వీలైనప్పుడే రానివ్వండి.’’ అంది బాధపడుతూ అరుంధతి.

మధుకర్ కి అర్ధమైపోయింది .

ఎట్టిపరిస్తితుల్లోనూ పిల్లలు రాజీపడరు. ఇకవాళ్ళు కలవరు.మనవల్ని కలవనివ్వరు.
తోడుకోసం రెండోపెళ్లిచేసుకుని తప్పుచేశాడా? శారీరకసుఖంకోసం కానేకాదు. మానసికశాంతి కూడాఉండదాఇక? ఉండదన్న జవాబు మూడోకోణంనుంచి వస్తుందని వూహించలేదు మధుకర్.

******

‘’నాకు మనవల్ని చూడాలని వాళ్ళతో ఆడుకోవాలని ఉంది అరుంధతి.’’ ఒక రాత్రి పక్కమీదపడుకుని వుండగా అన్నాడు భార్యతో.

‘’దానిదేముంది? వెళ్ళిచూసి రెండురోజులుండి మీరుఇవ్వాలనుకున్నది ముట్టచెప్పి వచ్చేయండి.’’

‘’ అదేంటి నువురావా?’’

‘’మీకూతురు ఏంచెప్పిందో గుర్తుందా? వాళ్ళకు నేను తల్లినికాలేనట. అవును.ఎట్టి పరిస్తితుల్లోనూ కాలేను. ఈయింటికి ఆ ఇల్లు ఎంతదూరమో ఆ ఇంటికి ఈఇల్లు అంతే దూరం. మిమ్మల్ని ఒక్క మాట అడుగుతాను. సమాధానం చెబుతారా?’’

‘’నన్ను మనస్ఫూర్తిగా పెళ్లిచేసుకున్నారా?’’

‘’ ఇష్టపడి తోడుకోసం చేసుకున్నాను. ఎందుకు అడిగావ్? ‘’

‘’ ఈవయసులో మనం శారీరకవాంఛలు తీరక వ్యామోహంతోనే పెళ్లిచేసుకున్నామని ఖచ్చితంగా అనుకుంటారు. ఆరోజు మీమీద నమ్మకంతో నేను ఏమీఅడగలేదు.కానీ ఈరోజు మీ పిల్లలతీరుచూసి అడగకుండా వుండలేకపోతున్నాను.’’

‘’మనలో ఎవరుముందో ఎవరువెనుకో తెలీదు. కాబట్టి నాజీవితం ప్రశాంతంగా వెళ్ళడంకోసం ఒక గూడు యేర్పాటుచేయండి. ఇదొక్కటే నాకోరిక. పిల్లలు నాతోకలిసిపోతే ఇన్నాళ్లకు పెళ్లి అయినందుకు కనకపోయినా ఆలోటు తీరుతుందనుకున్నాను. కానీ కలిసేతత్వం లేనపుడు నేనుకూడా వాళ్ళనుకలుపుకోలేను కదా.’’

‘’చిన్నపిల్లలు. వాళ్ళే తెలుసుకుంటారని భావించి క్షమించలేవా..’’

‘’ చూడండి. జీవితంలో ఏసుఖాలు నోచుకోకుండా కష్టపడి పనిచేస్తేనే రోజువెళ్తుంది అన్న పద్దతిలో బతికిన ఒంటరిదాన్ని. కాస్తంత సుఖం శాంతి మీవల్ల లభించాయి. వాళ్ళు పిన్నీ అంటూ నన్ను ఆదరించిననాడు నేనూ అంతే ఆప్యాయంగా వాళ్లని ఆదరిస్తాను. నన్ను తేలికభావంతో చూస్తేమాత్రం భరించలేను.’’రుద్ధకంఠంతో అని అటుతిరిగిపోయింది అరుంధతి.

మధుకర్ కి ఒక విషయం అర్ధమైంది. ఎవరి జీవిత భాగస్వాములతో వాళ్ళు కష్టమో నష్టమో తను, పిల్లలు సుఖంగా ఉన్నారు. అటువంటప్పుడు సుఖంగా రోజు వెళ్ళబుచ్చుకోవడంకన్నా చేసేది ఏమీలేదు. మాటలనుకుని మనసులు గాయపరుచుకోవడంకన్నా చిరునవ్వుతో వాటిని తోసేస్తూ బతికేస్తే ఈ చివరి పదేళ్ళజీవితం వెళ్లిపోతుంది.

అరుంధతి నిద్రపోయాకా మధుకర్ అనుకున్నాడు.

తమకే సమస్య వచ్చినా ‘’మీకేం మీరు పెళ్లిచేసుకుని సుఖంగా ఉన్నారు. మాకేకష్టంవచ్చినా చెప్పుకోవడానికి మాకే అమ్మ లేదు. ‘’ అని పిల్లలు -

‘’మీరుకూడా నన్ను హీనంగాచూస్తే భరించేశక్తి నాకులేదు.’’ అని అరుంధతి –

‘’ ఏవీ మనసులో పెట్టుకోకుండా కాలక్షేపం చెయ్యి నాన్న. చూడు! నేను ఎంతసుఖంగా బతుకుతున్నానో.నువు చూడబట్టే అనుకో..’’ అని నాన్నగారు.

ఇవన్నీ తలుచుకోగానే మధుకర్ కళ్ళల్లో ఒక్కసారి నీళ్ళు తిరిగాయి...
తండ్రి చేత భాగింపబడిన తన జీవితంలో పిల్లలు గుణిజాలు...అరుంధతి జీవితాంతపు శేషం! భగవంతుడా నేను తప్పు చేశానా? రైటు చేసానా? అతని అంతరంగం ఘోషస్తూనే ఉంది!

సమాప్తం